మానవ జీవితంలోని ఎత్తు పల్లాలను చూపే ప్రపంచ కథలు

0
4

[dropcap]ప్ర[/dropcap]పంచ కథలను తెలుగులో చదవటమో గొప్ప అనుభూతి. స్థల కాలాలను పరిచయం చేస్తూ ఒక చారిత్రక అనుభవాన్ని పంచిన ఆ కథా సౌరభాలను తెలుగులో అందించారు రచయిత అయోధ్యారెడ్డి. ఈ కథలు చదివినప్పుడు అవెందుకు గొప్ప కథలయ్యాయో తెలుస్తుంది. సాహిత్య ప్రక్రియగా కథ ఔన్నత్యాన్ని చూపుతాయి ఈ కథలు. ఈ అనువాద కథల మూల రచయితలందరూ లబ్దప్రతిష్ఠులు.

వస్తుపరంగా, శిల్పపరంగా వైవిధ్యాన్ని సంతరించుకున్న కథలివి.

జీవితం తాలూకు చీకటి కోణాలను పరిచయం చేసినా, కల్లోల సమయాలలో జీవితాల్లోని నీలినీడలు కనిపిస్తాయి ఈ కథలలో. అయితే ఇలాంటి కథలను అనువదించినప్పుడు ఆ ఫీల్ సరైన రీతిలో పాఠకుడికి అందుతోందా లేదా అన్న సంశయం కలుగుతుంది. మూలకథే సంక్లిష్టంగా ఉన్నప్పుడు అది అనువాదంలోనూ ప్రతిఫలిస్తుంది. అలాంటి కొన్ని కథలున్నాయి ఈ సంకలనంలో.

అందుకే ఈ సంకలనంలోని చాలా కథలతో మనం కనెక్ట్ అవుతాం. ఒక కొత్త ప్రపంచంలో మనం అడుగు పెడతాం. ఈ సంకలనపు రచయిత/రచయిత్రులందరూ తాము పెరిగిన సమాజంలోని విభిన్న వ్యక్తులతో,సమూహాలతో మమేకమయినవారే. కొన్ని కాలాలకు మైలురాళ్ళుగా నిలిచిపోయే కథలు ఈ సంకలనంలో ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేకమైనవి.

ప్రపంచ సాహిత్యంతో పోలిస్తే మన కథలే స్థాయిలో ఉన్నాయో అన్న ప్రశ్నవేసుకోకుండా ఉండలేము ఈ కథలు చదివాక.

మొత్తం పందొమ్మిది కథలుంటే వాటిలో రెండు భారతీయ కథలు. ఒకటి ముల్క్‌ రాజ్ ఆనంద్ దయితే మరొకటి ఫెహ్మిదా జాగీర్‌ది.

మిగిలినవారిలో మార్క్వెజ్, మొపాసా, టోనీ మారిసన్, కాఫ్కా, మహఫుజ్, అచెబె, మురకామి, బెన్ ఓక్రి, ఆక్టేవియా పాజ్, స్వేత్లానా అలెక్సివిచ్ మొదలైనవారున్నారు. అందరూ లబ్దప్రతిష్ఠులే. అన్ని కథలకు ఒక బలమైన నేపథ్యం ఉండటంతో అవి మనలనూ ఆలోచింప చేస్తాయి.

ఈ కథలను మన తెలుగు కథలతో పోల్చగలమా అన్నది మరోప్రశ్న.. తెలుగులో అరవై, డెబ్భై దశకాల్లో వచ్చిన పాలగుమ్మి, రావిశాస్త్రి, బీనాదేవి, కారామాస్టారు, సదానంద్, శారద, ఎనభైలలో వచ్చిన అల్లం రాజయ్య, రంగనాయకమ్మ, జగన్నాథశర్మ, భమిడిపాటి జగన్నాధరావు వంటి కథకుల కథలు ఈ కథలకేమీ తీసిపోవనిపించక మానదు.. కానీ యుద్ధం నేపథ్యంలో వచ్చిన కథలు మనకు అంతగా లేవు. ఈ సంకలనం కథలు ఆ నేపథ్యాన్ని కలిగుంటాయి. యుద్థం మానవజీవితాన్ని ఎలా శుష్కింప చేసిందో చెప్పిన రెండు కథలు ఇంకిపోని కంటిచెమ్మను మనకొదిలిపెడతాయి. బెలారస్ రచయిత్రి స్వేత్లానా అలెక్సివిచ్ కథ ‘సంచారజీవులు’ (King of Clubs, Kings of Diamonds) చాలా బాధపెడుతుంది. జిప్సీల జీవనవిధానాన్ని వివరించే కథ. రెండవ ప్రపంచయుద్ధం కరకుదనానికి ఈ జిప్సీల జీవితాలు ఎలా బలయిపోయాయో చెప్పే కథ.

జిప్సీలు కార్డులు పరిచి జాతకాలు చెబుతుంటారు.అది వారి వృత్తి. రేపటి చింతలేని వారు. రష్యాలో ఉన్న అలాంటివారిని రెండవ ప్రపంచ యుద్ధం నాశనం చేసేసిందని రచయిత్రి చెబుతారు. జర్మన్ సైనికులు దురాగతాలు జిప్సీల సమూహాన్ని చిందరవందర చేసిన క్రమం మనలను బాధపెడుతుంది.

కళావర్ రాజు, ఆఠీన్ రాణి, స్పేట్ జాకీ కార్డులతో రాబోయే భవిష్యత్తుని చెప్పే జిప్సీలు తమ భవిష్యత్తు అడిగినవారికి వాస్తవం చెప్పటం కన్నా వారిని ఆనందంగా ఉంచటం ముఖ్యమన్న ఎరుక గలిగినవారంటారు రచయిత్రి. ఎందరి భవిష్యత్తో చెప్పే జిప్సీల గురించి తెలుసుకోవాలని రచయిత్రి ఆరాటపడటం విశేషం.

చైనా కథ “పొద్దు తిరుగుడు పొలం”(Abandoned Child), తొంభయ్యవ దశకంలో ప్రవేశపెట్టిన ఒక కుటుంబం ఒక బిడ్డ రూల్ వలన ఆడపిల్లలను అవాంఛిత శిశువుగా భావించే చైనా సమాజాన్ని చర్చిస్తుంది. పొద్దు తిరుగుడు తోటలోని పూలన్నీ ఎండిపోయి తలలు వాలుతున్నయి అంటాడు రచయిత ఒకచోట. ఆడపిల్లలను పెంచలేని అశక్తతకు ప్రతీకనిపిస్తుంది. అనేకచోట్ల ఆడపిల్లలను పొద్దు తిరుగుడు పొలాల్లో వదిలేసిన సందర్భాలలోని దుఃఖాన్ని రచయిత పట్టుకుంటాడు. ఈ దుఃఖానికి మందేదని జాలిగా ప్రశ్నించటంతో కథ ముగుస్తుంది. పొలంలో ఆడపిల్ల దొరికితే, అది కుటుంబంలో తీవ్ర వాదోపవాదాలకు ఎలా దారితీస్తుంది, సమాజం ఈ సమస్యను ఎలా చూస్తుందో రచయిత ఈ కథలో చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంత నిస్సంకోచంగా ప్రస్తుత భారతీయ సమాజం ఇలాంటి సమస్యాత్మక సంఘటనలను కథను చెప్పనిస్తుందా అని అనుమానం కలగకమానదు.

భారత దేశంలో కులవివక్ష, పాశ్చాత్య సమాజంలో వర్ణవివక్ష సమాంతరంగా సాగే సమస్యలు. ఒక నల్లజాతి స్త్రీ తనకన్నా నల్లగా పుట్టిన ఆడపిల్లను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తుందా అన్న వాదన లోంచి పుట్టిన కథ “నల్లకలువ”(sweetness). అలా ఉండటం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానమీ కథ. భయం, వేదన, క్షోభ, జుగుప్స వంటి అనేక అంశాలను మేళవిస్తారు రచయిత్రి టోనీ మారిసన్ ఈ కథలో.

భారతీయ రచయితల కథలలో ముల్క్‌ రాజ్ ఆనంద్ కథ “అమ్మా నాకోసం పాటపాడవూ” (Lullaby), ఫెహ్మిదా జాకీర్ కథ “బిందెడు నీళ్లు” (Pot of Water), రెండూ పేదప్రజల కష్టాలను, వాటిని తమ పబ్బాని కుపయోగించుకునే దుర్మార్గపు మనుషులను ఎత్తి చూపుతాయి. మన నేటివిటీకి దగ్గరుండటం వలన మరింతగా కనెక్టవుతాం ఈ కథలతో మనం.

మొత్తం పందొమ్మిది కథలున్న ఈ సంకలనాన్ని పరిశీలిస్తే ప్రతి కథా ఆ సమాజంలోని సంఘర్షణలను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి కథా పరిష్కారాన్ని సూచించదు. సమస్య గురించి పాఠకుడు ఆలోచించేలా చేస్తుంది. ఫీల్ గుడ్ ఫాక్టర్‌కు ప్రాధాన్యమివ్వవు ఈ కథలు. ఈ కథలన్నీ ఏకకాలానికి చెందినవు కావు. శిల్పపరంగా, వస్తుపరంగా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

అనుసృజన చేసిన అయోధ్యారెడ్డిగారు మూలరచయితల నేపథ్యాన్ని, వారి సాహిత్య ప్రస్థానాన్ని సవిస్తరంగా మనకు తెలియచేస్తారు. అది ఆయా రచయితల దృక్పథాన్ని, మార్గాన్ని సూచిస్తుంది. ఆ క్రమంలో కథానేపథ్యం మనకు అర్థమవుతుంది. అయితే ఏ కథ ఏ సంవత్సరంలో వచ్చిందో చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది.

అనువాదమెప్పుడూ రెండంచుల కత్తి. ఆత్మను మిస్సయాడనో, భాష సరిగ్గాలేదనో, అనువాదంలో వాక్యాలను పక్కదారి పట్టించేలా చేశాడనో అనేక విమర్శలుంటాయి అనువాద రచయితల మీద.

కథలో మనకు నేటివిటీకి తగ్గ మార్పులుండవు కాబట్టి ఒక్కోసారి ఆ అనువాద కథ మన గుండె తలుపులు తట్టకపోవచ్చు. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కథలను ఎంపికచేసినట్టున్నారు రచయిత అయోధ్యారెడ్డి. తన ప్రయత్నంలో విజయాన్ని సాధించారు.

అయినప్పటికి రెండు మూడు కథలు చదవటానికి కష్టంగా అనిపిస్తాయి. కానీ ఒక సమాజాన్ని ఆయా స్థలకాలాల ఆధారంగా అర్థం చేసుకోవటానికి ఉపకరించే కథలివి. కథా శీర్షికలను కూడా రచయిత యథాతథ అనువాదంగా కాకుండా పాఠకుడి కోణంతో పెట్టారనిపిస్తుంది.ఏ శీర్షిక అనువాద శీర్షికలా ఉండదు.

ఎక్కడయితే కథావస్తువు మనసుకు హత్తుకుంటుందో అక్కడ అనువాదం కూడా అంతే స్థాయిలో ఉన్నప్పుడు ఆ కథ హత్తుకునేలా ఉంటుంది. అలా ఈ అనువాద కథలన్నీ చాలావరకు చదివించేవే.

ఇటీవలి కాలంలో ఎంతో శ్రద్ధతో అనేక పుస్తకాలను తెలుగు పాఠకలోకానికి అందించిన అన్వీక్షికి బుక్స్ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

వారికీ, అయోధ్యారెడ్డిగారికి అభినందనలు.

***

కథా సంగమం (అనువాద కథలు)
రచన: ఎ. యం. అయోధ్యారెడ్డి
ప్రచురణ: అన్వీక్షికి బుక్స్
పేజీలు: 240
వెల: ₹250.00
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‌లైన్‌లో:
https://www.amazon.in/Katha-Sangamam-M-Ayodhya-Reddy/dp/B09VBHZHKG

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here