[dropcap]స[/dropcap]ముద్రపు ఒడ్డున కూర్చొన్న నాకు, సముద్రానికీ నాకూ అవినాభావ సంబంధం ఉంది అనిపిస్తుంది. ఎంతో ఆరాటంతో బీభత్సం చేసేస్తానన్నట్టు ఎగిసిపడే అలలు తీరాన్ని చేరగానే చప్పగా చల్లబడిపోతాయి. నేనూ అంతే తనని చూడగానే ఏదో చెయ్యాలి, ఎదురు తిరగాలి, ఏదో చెప్పాలని అనిపించే తపన కాస్తా అణుకువగా, ఒద్దికగా మారి ‘మంచి’ అనే ముసుగులో మథన పడుతుంటాను. ఒక్కోసారి నా అసహాయతకు నాకు నా మీదే అసహ్యం వేస్తుంది. నాలోని మనిషిని ఇంతగా మార్చగలిగిన ఆ మనిషిని మెచ్చుకోకుండా ఉండలేను నేను. ఇన్ని మార్పులు నా జీవితంలో ఆ ఒక్క మనిషి వల్ల జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదు. అందరూ ఇంతేనా లేక నేనే ఈ అవస్థకి కారణమా?
ఒక్క క్షణం అమ్మా, నాన్నల మీద విపరీతమైన కోపం వచ్చింది. వీళ్ల వల్లే కదూ నేను నా అస్తిత్వాన్ని కోల్పోయింది? వాళ్ల ముందే దోషిగా నిలబడవలసిన పరిస్థితి వీళ్ళే కదా కల్పించింది? ఎంత అందమైన కుటుంబం అమ్మా, నాన్నా, అక్కా, చెల్లీ, తమ్ముడూ. అన్ని బంధాలు క్షణాల్లో చెల్లా చెదురవ్వలేదూ?
ఇంకా కొంతలో కొంత అదృష్టం – వాళ్ల మంచితనమో, నా మెతకతనమో నన్ను కాదనుకోక దూరం అయ్యీ అవనట్టుగా, దగ్గర ఉండీ ఉండనట్టుగా ప్రవర్తిస్తున్నారు.
అందరిలాగే తన పెళ్లి అమ్మా నాన్నల ఇష్టంమీద తను మెచ్చిన, వాళ్లకి వచ్చిన పిల్లనే పెళ్ళాడాడు.
తనకి మాత్రం ఏంకావాలి? పెంచి పెద్ద చేసిన వాళ్ల సంతోషం కంటే ఏం ఆశిస్తాడు తను?
ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె మొహం చూసి చాలా సరదా పడ్డాడు. అందరూ అదే అన్నారు, మీ ఆవిడది నవ్వు మొహంరా అని. ఆ నవ్వు ఎంత నర్మగర్భం అయినదో ఆ తర్వాత కానీ నాకు తెలియలేదు.
పెళ్ళిరోజు బిందెల్లో ఉంగరం వెతికేటప్పుడు ఆ నవ్వే ఉంగరాన్ని ఆమె చేతికి అందేలా చేసింది. ఎంతో మరపురాని మధురమైన ఆ రాత్రి ఒక్క చిరునవ్వుతో నన్ను ఆమడదూరాన్న అట్టే బెట్టింది. అదేమంటే అప్పుడైతే అందరూ ఉంటారుట. ఆ మూడు రాత్రులూ అవ్వ ముందు పిల్లిలా ముడుచుకు పడుకొన్నా.
మూడు రోజులు ముచ్చట అయ్యాక (అవ్వక) నేను ఉద్యోగం చేసే చోటుకి ఆమెను తీసుకెళ్ళా. విచిత్రం. ఏవో తెలియదు కానీ ప్రతీ మాటా ఆమెదే చెల్లుతుంది. నా నోరుని ఎవరో బొంత కుట్టు సూదితో కుట్టేసిన ఫీలింగ్. ఇదే వరుస ప్రతీసారీ.
చాలా రోజులు (నెలలు?) తర్వాత నోరు పెగలించుకొని నా మనసులో మాట బయటపెట్టా. “చూడు రమా, అమ్మా, నాన్నలని మన దగ్గరకి తెచ్చుకొందాం. ఎలాగూ తమ్ముడు హాస్టల్‌లో ఉంటున్నాడు. చెల్లికా ఒకటి రెండేళ్ళల్లో పెళ్ళి చేసేస్తాం. అక్క కాపురానికెళ్ళి చాలా ఏళ్ళు అయ్యింది. మనకంటూ పెద్దగా ఏమీ బాధ్యతలుండవు. అమ్మ, నాన్నలని మాత్రం ఎవరు చూస్తారు? తమ్ముడికి పెళ్ళైయ్యాక వాడు కూడా కొన్ని నెలలు షేర్ చేసుకొంటాడు. ఇంక అరవయ్యిల్లో కూడా వాళ్లు కష్టపడటం అవసరమా చెప్పు?” అని గబగబా చెప్పదలచుకొన్నదంతా చెప్పేశాను.
ఏ పర్వతంమీద విరిగిపడుతుందో, ఎంత రచ్చ అవుతుందో అనుకొన్న నన్ను అంతే ఆశ్చర్యంలో ముంచేలా ఒక నవ్వు నవ్వింది. “ఎంత మంచివారండీ మీరు, ఎంత మంచి మనసుతో ఆలోచిస్తున్నారు? ఇలాంటి పిల్లలు ఉండటం నిజంగా మీ అమ్మ, నాన్నల అదృష్టం. మీరన్నది నిజమే. పెద్దవాళ్లని చూడటం మన బాధ్యత. మనం మాత్రం పెద్దవాళ్ళం అవమా? కానీ మీరు కూడా ఆలోచించుకోండి ఈ జీతంతో ఈ టౌన్‌లో మనం వాళ్లని సరిగ్గా చూడగలమా? పల్లెటూళ్లో కనుక మామయ్యగారికి అంత ఇబ్బంది ఉండదు. తెలుసున్నవాళ్లు పండో, ఫలమో కూరో, నారో తెచ్చి ఇస్తుంటారు. డబ్బు ఇబ్బంది అయినా ఎవరో ఒకరు సమకూరుస్తారు. మనకి అలా కాదుగా. ప్రతీదీ జీతంలో నుంచే సమకూర్చాలి. మామయ్యగారికి వచ్చేది కాస్తా, మీ అక్క పెట్టిపోతలకి, చెల్లెలినీ చూడ్డానికి సరిపోతుంది. మనకీ రేప్పొద్దున్న పిల్లో, పిల్లాడో బయలుదేరితే మనం వాళ్ళని సాకద్దూ. మీ నాన్నగారు పెంచినట్టు మనం పెంచలేం కదా? ఆ రోజుల్లో మీరు ఏదో ఒకటి కట్టుకొని, ఏదో ఒకటి తిని ఎలాగో ఒకలా చదివారు. ఈ రోజులు అలా కాదుగా, అన్నింటికీ డబ్బు కావాలి. కొంచెం మనం ఆర్థికంగా స్థిరపడ్డాక తప్పకుండా వాళ్ళని తెచ్చుకొందాం. అంతవరకూ ఏదైన అవసరమై అడిగితే మనకి తోచినంత సహాయం చేద్దాం, సరేనా” అనీ నా తల తీసి ఆమె ఒడిలో పెట్టుకొని మురిపెంగా లాలనగా, ప్రేమగా నా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తను చెప్పదలచినది చెప్పింది. ఆమె కూడా ఆ నిముషంలో పెంపుడు కుక్కలా సరే అని తల అనే తోకని ఆడించాను.
ఒకసారి అక్క నన్ను చూడ్డానికి వచ్చింది. అక్కని వట్టి చేతుల్తో పంపలేం కదా. చీర కొనడానికి వెళ్ళాం. చీరకొంటూ “ఇప్పుడు మంచిది పెట్టాలనే నాకు ఉందనుకోండి, కానీ ఇప్పుడు పెడితే ప్రతీసారీ పెట్టగలగాలి కదా. పిల్లలు పెద్దవాళ్ళైతే పెట్టగలుగుతాం. పెట్టలేకపోతాం. ఎప్పుడూ ఒకలాగే చూస్తే వాళ్లకీ బాధ ఉండదు. మనకీ బాధ ఉండదు.” అంది. ఈసారీ నా పరిస్థితి మామూలే. లోపలి మాటే లోపలే ఉండిపోయింది. ఈవిడ నాకు ఆ సమయంలో చిరునవ్వు నవ్వుతూ తన వాళ్లందరినీ తన చేతే సంహరింపచేసిన (భగవద్గీతను బోధించిన) శ్రీకృష్ణునిలా కనిపించింది.
మీకు ఈ పాటికి నా పరిస్థితి అర్థమయ్యే ఉంటుంది. తర్వాతి ఘట్టం చెల్లెలు పెళ్లి, ఏదో కుదిరినంతలో మంచిదే అనుకొనే సంబంధమే చెల్లికి కుదిరింది. కానీ డబ్బు? నాన్న నోరు తెరచి నన్ను ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడూ అడగడు. నేను ధైర్యంగా అడిగి ఇవ్వలేను. అయినా ధైర్యం చేసి ఈ ప్రస్తావన ఆవిడ దగ్గర తీసుకువచ్చాను. ఈసారైనా నేను గెలవాలనేది ఆకాంక్ష. ఆవిడ ఏమైనా నవ్వకుండా మాట్లాడితే ఎలా బదులివ్వాలో, ఏఏ సందర్భాలలో నేను ఎలా నోరుమూసుకొన్నానో ఇవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి కడిగేయాలని నిర్ణయించుకొన్నా.
అనుకొన్న రోజు రానే వచ్చింది. నాన్న ఫోన్ చేశారు. చెల్లి పెళ్ళి ఫలానా నెలలో, ఫలానా రోజు, ఫలానా సమయానికి మూహూర్తం పెట్టించడమైంది. మిగిలిన పనులు నెమ్మదిగా చేసుకోవాలి అని. అందులోని అంతరార్థం అర్థం చేసుకోలేనంత వెర్రివాణ్ణి కాదు. పనులు – అవును డబ్బుంటే పనులు జరుగుతాయి. పనులు జరగలేదంటే డబ్బు సమకూరలేదనేగా అర్థం. ఆయన వంతు పని ఆయన చేశాడు. మరి నా వంతు? రాత్రి పనంతా పూర్తి చేసుకొని వచ్చిన నా భార్యతో విషయాలన్నీ కూలంకషంగా మాట్లాడాలని నా ప్రయత్నం. నోట్లో నాలుక కదిలితేగా ఎవరో నా పెదవుల్ని డబ్బనంతో కుట్టేసిన బాధ. అయినా గొంతు పెగల్చుకోడానికి, మాటని బయటకు రాబట్టడానికి దగ్గుని ఆసరాగా చేసుకొన్నా, అన్నట్లు చెప్పడం మరిచా మా ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. అన్నీ తానే అయి నా ఇష్టాయిష్టాలు – అవసరాలు తెలుసుకొని మసలడం అలవాటు. దగ్గగానే గ్లాసుతో మంచినీరు తెచ్చి “ఏం పొలమారిందా ఇప్పుడేనా దగ్గుతున్నారు. ప్రొద్దుటి నుండీ ఉందా? రేపటికీ తగ్గకపోతే డాక్టర్‌కి చూపించుకోండి. చిన్నవైనా ఈ రోజుల్లో అశ్రద్ధ చెయ్యకూడదు” అని గొంతుక్కీ ఛాతికి విక్స్ రాసింది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆమే మా చెల్లి ప్రస్తావన తెచ్చింది.
“అవునండీ, మీ చెల్లెలు పెళ్లి కదా. ముందు నుండే ఆఫీస్‌లో చెప్పి ఉంచండి. అప్పటి కప్పుడు సెలవు అంటే ఆఫీసర్ ఏమంటారో? ఎందుకైనా మంచిది. ముందు ఒక రెండు రోజులు వెనుక ఒక రెండు రోజులు ఉండేలా చూడండి. పరాయి ఇంటికి వెళ్ళి వచ్చినట్లు వెళ్ళి రాలేం కదా. మన పరిస్థితి ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకొన్నా ఊళ్ళోవాళ్ళ దగ్గర బాగుండదు కదా. ఇంక మనవంతు బాధ్యత మనం చెయ్యాలి కనుక మీ చెల్లికో, కాబోయే బావగారికో ఒక ఉంగరం చేయిద్దాం. పెళ్ళికూతుర్ని చేసే రోజుకి ఒక చీరకొందాం. అన్నీ మామయ్యగారు చెయ్యడం కూడా కష్టం కదా.”
ఇంత తియ్యగా సూక్ష్మంలో మోక్షం చూపించగలగడం ఈవిడ ఒక్కర్తి సొత్తేమో ఏదో పెళ్ళి బాధ్యత అంతా మేమే తీసుకొన్నంత ఫోజ్ పెట్టి ఆరిందాలా మాట్లాడుతున్న ఆవిడ్ని, ఆవిడ మేధాశక్తిని అంచనా వేయడంలో నేను ములిగి ఉండగానే ఆవిడ ఇంకొక ఆయుధం వదిలింది. “మీ తాతగారి ఆర్జితం సెంటో అరసెంటో ఉంది కదా అది అమ్మేయమనండి. మనకి అది అవసరం లేదని చెప్పేయండి. ఆ డబ్బు కూడా వాళ్ళు పెళ్ళికి వాడుకోవచ్చు.” ఆవిడ వాక్చాత్యుర్యానికి ఆశ్చర్యపోవడం ఎప్పుడూ నావంతే అవుతుంది. తలచుకొంటే సగం, లేదా మూడు వంతులు ఖర్చుని నేనే భరించగల స్తోమత భగవంతుడు నాకిచ్చాడు. ఎప్పుడూ ఈ సత్తా చాటుకొనే అవకాశం నాకు కల్గించలేదు. (మా ఆవిడ) ఎందుకూ? కొరగాని సెంటు భూమి అమ్మి తమ్ముడూ, నేనూ సగం, సగం తీసుకొంటే వచ్చేదెంత? దానిమీద వచ్చేదెంత?
అంటే నేను నావైపు నుండి చేసే ఆర్థిక సహాయం ఇంతే అని గియ్యకనే గిరిగీసి మరీ చెప్తోందన్న మాట. బ్రహ్మదేవుడు మగవాడైయ్యుండి ఆడవాళ్లని ఇంత గొప్పగా సృష్టించగలిగితే అదే సరస్వతీదేవి సృష్టిస్తే ఇంకెలా ఉండేదో! ఆ తలపుకే నా ఒళ్ళు గగుర్పొడిచి వెన్నులోంచి చలి పుట్టింది. ఆ వణుకు పైకి కూడా వచ్చినట్లుంది. దుప్పటి కప్పి తను అటువైపుకి తిరిగి పడుక్కొంది. మరో మాటకి తావులేకుండా.
పెళ్లికి రెండు రోజుల ముందు ఇంట్లో దిగాం. “ఏరా అన్నయ్యా వదిన ఫోన్లో చెప్పింది, మీరు మూహూర్తం పెట్టినప్పటి నుండి ప్రయత్నం చేస్తే ఇప్పటికి శెలవు దొరికిందని” చెల్లి.
“ఏంటోరా! శెలవుల్లేని ఉద్యోగాలూ అవీను! హాయిగా ఇంతకన్నా రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకొన్నా, అందరికీ దగ్గర్లో ఉన్నట్టు ఉంటుంది. ఏం ఉద్యోగాలో ఏంటో” నాన్న స్వగతం.
“అలసిపోయి వచ్చినవాళ్లని అక్కడే గుమ్మంలో నుంచోబెట్టి మాట్లాడేస్తున్నారా? రావడం వాడి చేతుల్లో ఉందా? శెలవు దొరకద్దు. వాడి చేతులో ఉంటే పనులన్నీ వాడే చేసేవాడు” అమ్మ ఉవాచ.
అమ్మ ఎలాగైనా అమ్మే. విషయాల్ని ఇట్టే పసిగట్టినట్లు మాట్లాడుతుంది. అవును రావడం నా చేతుల్లో లేదుగా. తమ్ముడు గ్లాసుతో మంచినీళ్ళు అందిస్తూ “నువ్వేం బాధపడకన్నయ్యా అన్ని పన్లూ, నేను, నా స్నేహితులు, అక్క స్నేహితులు కలసి చేసేశాం” అన్నాడు. స్నానాలుచేసి, అన్నాలు తిన్నాక, ఆవిడ పిల్లల్ని పడుకోబెడుతుండగా అమ్మ, నాన్న అందరం కలసి మాట్లాడుకోసాగాం.
ముందర చిన్నవాడు (?) కదా తమ్ముడు బోళాగా “నా స్నేహితులు కొంత ఆర్థిక సహాయం చేశారన్నయ్యా. నేను పని చేస్తున్న కంపెనీ నుంచి కొంత లోన్ తీసుకొన్నా. అన్ని ఖర్చులు పోను 10-15 వేలు మిగులుతాయనుకొంటున్నాం. అవి పండుగలకీ, పబ్బాలకీ వాడడానికి ఉంటాయని అమ్మ అంటోంది” అన్నాడు.
“అవునురా పెద్దాడా, చిన్న చిన్న సర్దుబాటు చేసుకొంటే, మేం కూడా ఏడాదిలోపు అప్పును తీర్చేయగలుగుతాం. పాలు తగ్గించడం, కేబుల్ కట్ చేయించేయడం. అన్నట్టు ఇంట్లో ఒక రెండు గదులు అద్దెకిచ్చేస్తున్నాం. వేరే కేబుల్, కాలక్షేపం లేదు కాబట్టి ఖాళీ సమయంలో దొడ్లో కూరగాయలు వేసుకొంటే మా ముగ్గురికీ సరిపోతాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, పొదుపుకి పొదుపూను” అమ్మ అంది.
“నేనే ఈ విషయాలు ఏవీ నీకు చెప్పొద్దన్నానురా. పట్టణంలో బ్రతకాలంటే మాటలా? డబ్బు అవసరమైనా సహాయం చేసేవాళ్ళుండరు. మనకి ఎంతో కొంత పలుకుబడి ఉంది. సాయంత్రం వేళల్లో ఎలాగూ ఖాళీ గానే ఉంటాను కదా ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ వ్రాయడానికి ఒప్పుకొన్నా. అన్నీ సవ్యంగా జరిగితే ఒక ఏడాదిలో అప్పులన్నీ తీరిపోతాయి. నేను ఆర్జించి ఇచ్చేది ఏమీ లేదు. అందుకని నాన్న ఇచ్చిన భూమిని అమ్మి మీ అన్నదమ్ముల ఇద్దరి పేర్నా వేద్దామనుకొంటున్నా, బేరం వచ్చిందనుకో నిన్నో మాట అడిగి చేద్దామని ఆగాను. నాకూ, మీకు ఏదో కొంత ఇచ్చావన్న తృప్తి ఉంటుంది. ఏమంటావ్?”
వీళ్ళందర్నీ ముందూ నన్ను చూసుకొంటే హిమాలయాల ముందు రాళ్ళగట్టులా అనిపించాను. ఇంత మంచి ఆలోచనా రీతిని అలవరచుకొని అవసరాల్లో ఒడిదుడుకులు పడగలిగే శక్తి వీళ్ళు ఎలా అలవరచుకోగలిగారు? ఇంత విశాలమైన హృదయంతో సహాయం చెయ్యకపోవడంలో నా తప్పేమీ లేనట్లు, అసలు అది పెద్ద విషయమేమీ కానట్లూ, ఇంత సహజంగా ఆదరంగా, ఆప్యాయంగా, ప్రేమగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఇలాంటి మనుషుల మద్య, మనస్తత్వాల మధ్య ఉంటే మనిషి మనీషి అయిపోడూ? జన్మ చరితార్థమైపోదు. మనిషికీ మనిషికీ మధ్య ఆప్యాయతలు పెంచని డబ్బు ఎందుకు? నా మనస్సు, పదే పదే ఒకటే విషయం మీద ఆలోచించడం మొదలెట్టింది. ఆ రోజు రాత్రి అంతా అసహనంతో మంచం మీద దొర్లాను. మిగిలినవాళ్ళందరూ యుద్ధాన్ని గెలిచిన వీరుల్లా ఆదమరచి కమ్మని నిద్రపోతున్నారు.
మర్నాడే చెల్లెల్ని పెళ్ళి కూతుర్ని చేయడం. అన్ని పద్ధతి ప్రకారం చిన్న విషయం కూడా మిస్సవకుండా జరిపిస్తున్నారు. నేను తెచ్చిన చీరను మురిపంగా కట్టుకొంది. “అన్నయ్యా, వదిన ఎంపిక చాలా బావుందిరా. ఖరీదు కూడా బాగానే ఉండి ఉంటుంది. ఇంత ఖరీదైన చీర ఎందుకురా? ఏది ఏమైనా నాకు చాలా నచ్చింది.” సంతోషంతో చెల్లి మాట్లాడుతోంది.
ఆ రోజు వచ్చిన వారందరికీ అమ్మే వంట చేసి పెట్టింది. వంట మనిషి ఖర్చు ఒక రోజు కలసి వచ్చినా, కలసిరావడమేనని. భోజనాలయ్యాక సాయంత్రం నుంచి ఊర్లోవాళ్ళందరూ పేరంటానికి వచ్చారు. అందరూ పొగడడమే మేం తెచ్చిన చీర బాగుందని. రాత్రి అందరూ నిద్రపోయాక అది (నిద్ర), కరువైన నేను డాబా మీదికి వెళ్ళాను. ఊర్లో ఉన్న కొద్ది డాబాల్లో మాదీ ఒకటి. నాన్నా అమ్మా పొదుపరులు కావడంతో డాబా వేయించగలిగారు. నిండు జాబిలికి కూడా నన్ను చూడాలని లేదేమో మబ్బులో దాగున్నాడు. ఆ మసక వెలుతుర్లో నా చిన్నతనమంతా గుర్తు వచ్చింది. అమ్మా, నాన్నల కష్టమూ గుర్తు వచ్చింది. కొడుకుని కన్నది వయసు మీరాక ఆదుకొంటాడని కదూ, ఎన్నో ఆలోచనలు, సమాధానం లేని ప్రశ్నలు. నా ఆలోచనలు అర్ధరాత్రి నాటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికోకానీ నా ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు. ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాక మెట్లు దిగుతూ జాబిలి కేసి చూశా. నాకు శహబాష్ చెప్పాలని లావుంది, మబ్బుల్లోంచి పూర్తిగా బయటికొచ్చి తన వెన్నెలని ఊరంతా వ్యాపింపచేశాడు. నాకు మాత్రం నాలో గూడుకట్టుకొని ఉన్న చీకటిని పారద్రోలినట్లు అయ్యింది.
తెలతెలవారుతుండగా, అందరికన్నా ముందుగా నేనే లేచా. నా స్నానం ముగించుకొని పొయ్యి వెలిగించి పెద్ద డేగిశాతో వేణీళ్లు పెట్టా అందరి కోసం కాగుతాయని. అమ్మ రాత్రే డికాక్షన్ తీసి ఉంచింది. నెమ్మదిగా కుంపటి వెలిగించి పాలు పెట్టా, కాఫీకి కావాల్సిన గ్లాసులూ, పెద్ద పళ్లెం రెడీ చేశా. చప్పుళ్లకి లావుంది అమ్మ, అమ్మతోబాటు మిగిలినవాళ్ళూ లేచారు. “ఎందుకురా నీ శ్రమ. నేను లేచి చేసేదాన్ని కదా” అని సంబరపడిపోయింది. ఆ రోజు నే చేసిన కాఫీ నాకే చాలా నచ్చింది. నా మనసంతా చాలా తేలికగా అనిపించింది. కాఫీ తాగి అమ్మ చేసిన వేడి వేడి ఇడ్లీలు లాగించి మిగిలిన పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నా. మామిడి ఆకులు తేవడం, డ్రమ్ములు తెప్పించడం, షామియానా, భాజాభజంత్రీలు వంటవాళ్ళూ అందరికీ గుర్తుచేయడం ఒకటేమిటి చిన్నా చితకా ఎన్నో పన్లు చేశాను. ఆ రోజు రాత్రి ఆదమరచి నిద్రపోవడం నా వంతయ్యింది. మెలకువ ఉండటం మిగిలిన వాళ్ల పనైంది. ఆవేదనతో కాదు ఆనందంతో. ఎందుకంటే రేపు సాయంత్రమే పెళ్ళి మరి.
పెళ్ళివారు రావడం ఒక తంతు, తర్వాత ఒక తంతు. ఉన్నంతలో అనుకున్నదాని కన్నా అందంగా, ఆనందంగా జరిగింది. అన్ని తంతులూ ముగిశాక చెల్లెలు మూడు రాత్రులకై అత్తవారింటికి వెళ్లింది.
ఆ రోజు మేము బయలుదరి వెళ్ళే రోజు. నేను ప్రొద్దుటే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చాను. అమ్మా, నాన్నని కుర్చీలో కూర్చోపెట్టి నేను అనుకొన్న పనులన్నీ సక్రమంగా జరిగేలా చూడమని ఆశీర్వదించమని అడిగాను. అంతా సవ్యంగా జరగాలని మనసారా ఆశీర్వదించారు.
సామానంతా సర్దుకొని సాయంత్రం ప్రయాణానికి సన్నద్ధం అవుతున్నాం. ఈ నాల్గురోజుల చేరికకే పిల్లలు అమ్మా, నాన్నల్ని వదల్లేకపోతున్నారు. వాళ్ళని అలా చూడడం నాకెంతో ఆనందాన్నిస్తోంది. ,
సాయంత్రం అందరం బయలుదేరి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాం. హృదయం ఎంతో తేలికగా ఉంది. ప్రయాణం అంతా చాలా హుషారుగా ఉన్నాననిపించింది.
పిల్లల్ని విసుక్కోవడం కానీ, రైలులో బద్దకంగా నిద్రపోవడం కానీ చెయ్యకుండా ప్రయాణం చాలా ఆనందంగా చేయగలిగాను.
అనుకొన్న రోజు రానే వచ్చింది. “ఈ రోజు శెలవు పెడతాను అని నాతో చెప్పలేదే? పిల్లల్ని కూడా స్కూల్ మానిపించేశారా? ఏదైనా విశేషముందా?” అంటున్న శ్రీమతివైపు దరహాసం చెయ్యడం ఈసారి నావంతు అయ్యింది.
బాల్కనీలో ఆరిన బట్టల్ని తీస్తున్న మా ఆవిడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాన్ చూసి లోపలికి వస్తూ “ఎవరో ట్రాన్సఫర్ అయి వెళ్ళిపోతున్నట్టున్నారు, వ్యాన్ వచ్చింది” అంటూ. ఈ లోపల కాలింగ్ బెల్ మ్రోగింది. నేనే తీశాను తలుపు. వాళ్ళు లోపలికి వస్తూ “సర్, సామాను ప్యాకింగ్ మొదలుపెట్టమా” అన్నారు. నా స్తోమతని, నా పరపతిని వినియోగించి మా ఊరికి దగ్గరగా ఉన్న ఊరుకి నేను ట్రాన్స్‌ఫర్ చేయించుకోగలిగాను. సొంత వూరు నుండి అప్ అండ్ డౌను చేసేలా. “సరే” అని ప్యాకింగ్‌తో నేను బిజీగా ఉన్నట్టు నటించా. ఇన్నాళ్ళూ నవ్వుతున్న మా ఆవిడ మొహాన్ని ఇంకోలా చూడలేక.