[dropcap]అ[/dropcap]ది మోరల్ సైన్స్ క్లాసు. ఇంకా టీచర్ రాలేదు. అదను చూసి తేజ, కిరణ్ నిన్న వాళ్ళ మధ్య జరిగిన తగాదాను కొనసాగించారు. నోటికి వచ్చినట్లు తిట్టుకుంటున్నారు. అన్ని భాషల్లో తిట్టు.
క్లాసు లోకి వస్తున్న టీచర్, తిట్ల ప్రవాహం విని ఆశ్చర్యం, బాధతో నోట మాట రాక నిలబడి పోయింది.
టీచర్‌ను చూసిన క్లాసు మానిటర్ శ్రీనిధి “టీచర్ వచ్చారు!” అని గట్టిగా అరిచాడు. తిట్టుకుంటున్న, వింటున్న స్టూడెంట్స్ అందరు నిశబ్దంగా కూర్చున్నారు. తేజ, కిరణ్ వాడి వేడి చూపులతో చూసుకుంటున్నారు.
అది గమనించిన టీచర్, “పిల్లలూ! మీకు ఇన్ని తిట్లు వచ్చని బహుశా మీ పేరెంట్స్‌కి తెలిసి ఉండదు. తేజ, కిరణ్ మీరెందుకు తిట్టుకున్నారో అనవసరం. కానీ…” అంటూండగా…
“వాళ్ళిద్దరూ శత్రువులు టీచర్!” అని వెనక నుండి అరిచారు ఎవరో.
“అవునా? నాకు తెలీదు సుమా!” అని ఆశ్చర్యం నటించింది టీచర్.
“సరే నా ఈ మోరల్ క్లాసులో మనం ‘మాట తీరు’ గురించి మాట్లాడుకుందామా?”
అందరు సరే నన్నట్లు తలలు ఊపారు.
“మీరు ఎప్పుడైనా ‘నోరు మంచిది ఐతే ఊరు మంచిది అవుతుంది’ అన్న సామెత విన్నారా?”
“విన్నాం”, “లేదు”.
“సరే. ఎంత మందికి రామాయణం కథ తెలుసు?”
చేతులు ఎత్తారు కొందరు.
“గుడ్. అందులో హనుమంతుని గురించి తెలుసా?”
“తెలుసు టీచర్.”
“సీతని వెదికి రాముని దగ్గరకు తీసుకు వెళ్ళాడు.”
“కాదు రా! సీత ఉన్న ప్లేస్ చెప్పాడు.”
“సరే. రాముడికి హనుమంతుడు ఎలా తెలుసు?” అంది టీచర్.
“మంకీ గాడ్ ఫారెస్ట్‌లో ఉంటాడు కదా! రామ్ వచ్చినప్పుడు మీట్ అయ్యారు.”
“కరెక్ట్! మంకీ గాడ్ అనవద్దు. అన్ని మతాలను సమంగా చూడాలి. దేవుడు ఒక్కడే. పేర్లు వేరు. మీకు మల్లె.”
“టీచర్! మన క్లాసుకి హనుమంతుడికి కనెక్షన్ ఏంటి?”
“ఉంది. మీకు తెలిసిన హనుమంతుడు మనకు నిజ జీవితంలో అవసరమైన నీతిని చేసి చూపించాడు. మంచి మాట మంచి హితులను అదే ఫ్రెండ్స్‍ని ఇస్తుంది. అంతే కాదు సందర్భానికి తగిన విధంగా మాటలాడితే మంచి ఫలితం ఉంటుంది.”
“అంటే ఏంటి టీచర్?”
“అంటే, నీ ఫ్రెండ్‌కి దెబ్బ తగిలితే ఓదార్పు మాట బదులుగా నవ్వితే లేదా మరింత బాధపడేలా వెటకారంగా మాటలాడితే, స్నేహం దెబ్బ తింటుంది. సరే మీకో సంఘటన రామాయణం లోనిది, చెబుతాను. వినండి. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్ళిన తరువాత…”
“Oh! You mean after Sita was kidnapped”
“ఎస్ ముందు విను. రామ లక్ష్మణులు సీతను వెదుకుతూ దండకారణ్యంలో తిరుగుతూ సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి వచ్చారు.
విల్లంబులు అస్త్రాలు ఉండి బలంగా అందంగా ఉన్న వారిని చూసి భయపడిన సుగ్రీవుడు హనుమంతునితో “హనుమా! వారిద్దరిని చూసావా? వీరుల్లా ఉన్నారు. వారిని నా అన్న వాలి నన్ను చంపమని పంపి ఉంటాడా? వారు నా శత్రువులు కావచ్చు జాగ్రత్త పడటం అవసరం.” అన్నాడు.
“హనుమా! వారు ఎవరో, ఎక్కడి నుండి, ఎందుకు వచ్చారో కనుక్కో.” అన్నాడు.
Face is the index of the mind అని నమ్మిన సుగ్రీవుడు రామ లక్ష్మణులతో మాటలాడుతున్నప్పుడు హనుమను తన వైపు తిరిగి ఉండమన్నాడు. మన భయాలు ఆందోళన ఆనందం కోపం వంటి ఫీలింగ్స్ ముఖంలో కనిపిస్తాయి, అందుకని.
సరేనని హనుమ వారి వద్దకు ఒక విప్రుని వేషంలో వెళ్ళాడు.
వారితో వినమ్రంగా “ఓ సుందర మూర్తులారా! మీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? ఈ ప్రాంతానికి కొత్తవారి వలే నున్నారు. చూడటానికి తాపసుల్లా ఉన్నారు. కాని మీరు మహా వీరుల వలె ఉన్నారు. మీ గురించి భయం లేకుండా చెప్పగలరు. ఈ ప్రాంతం సుగ్రీవుడిది. సత్య ధర్మపరుడు, మంచివాడు. కాని అతన్ని అన్న వాలి మోసంతో, బలంతో అధర్మంగా పదవి నుండి తొలగించాడు. నేను సుగ్రీవుని మంత్రిని. మా రాజు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు. నాకు కోరుకున్న రూపం దరించగలిగిన శక్తి ఉన్నందున మానవునిగా మీ ముందుకు వచ్చాను.” అని వినమ్రంగా చేతులు జోడించి నమస్కరించి చెప్పాడు.
ఆ మాటలు విన్న లక్ష్మణుడు సందేహించినా, రాముడు హనుమ వినయ విధేయతలు మాట తీరు లోని నిజాయితీని గ్రహించి తమ్మునితో ‘హనుమ – రాక్షసుడు, విరోధి అంటే enemy కాదు; ఫ్రెండ్’ అని చెప్పి హనుమతో సుగ్రీవునితో స్నేహం చెయ్యటానికి సిద్ధమని చెప్పి హనుమతో వెళ్ళాడు.
ఇక్కడ మనం తెలుసు కోవలసింది ఏమంటే రాముడి గురించి తెలుసుకునే సమయంలో కూడా హనుమ నిజాయితీని మరువలేదు. తానెవరో నిజం చెప్పి నిజం తెలుసుకొని రాముని మనసు గెలిచాడు. నిజాయితీగా ఉంటే అంతిమంగా మంచే జరుగుతుంది అని పెద్దలు అన్నారు. ఒక అబద్ధమే కదా అనుకుంటే దాన్ని దాచటానికి వంద అబద్ధాలు చెప్పాలి. అబద్ధం తెలిసిపోతే? ఫలితం చాలా అవమానంగా ఉంటుంది. అంటే కాదు హనుమ లాగా ఎవరైన అపరిచితులతో మాటలడాల్సి వస్తే?
New student తో అనుకుందాము. ఉన్నవి లేనివి గొప్పలు చెప్పుకుంటే అవి నిజం కాదని ఎదుటి వారికి తెలిస్తే? మీ గురించి ఏమనుకుంటాడు? వదరుబోతు అని అంటే లయ్యర్. మరి మీతో స్నేహం చేస్తాడా?
ఈ విషయంలో స్వామి వివేకానంద ఈ విధంగా యువకులకు చెప్పారు:
‘మీరు ప్రతి వారిని గౌరవించాలి, వారి బాహ్య రూపం ప్రధానం కాదు గుణ గణాలు ముఖ్యం. అవి తెలియనంత వరకు ఎవరి మీద ఏవిధమైన విపరీత భావం లేదా అభిప్రాయం ఏర్పరచుకోవద్దు’ అన్నారు. అలా తొందరపాటు నిర్ణయానికి రావటం వారి వ్యక్తిత్వ ముఖ్య లోపంగా భావించాలన్నారు
సులువుగా చెప్పాలంటే తొందరపడి ఎవ్వరిని తక్కువగా అనుకోని మాటలతో నొప్పించ కూడదు. హనుమ చూడండి, అపరిచితుల బలం తెలీకుండా తమ బలం గురించిన గొప్పలు చెప్పలేదు. నిజాయితీతో తమ రాజు పరిస్థితిని చెప్పాడు. ఎదుటి వారిని గురించి అడిగి స్నేహం చేద్దమన్నాడు.
అదే తొందరపడి అబద్ధం చెప్పి, నోరు జారి నొప్పిస్తే నిజం తెలిసాక, నమ్మకం కలగదు కదా. సారీ చెప్పిన కొన్ని సార్లు బాధ తగ్గదు. అందు కానీ స్టూడెంట్స్, తొందరపడి మాట జారకండి. చెప్పుడు మాటలు అసలే వద్దు. చదువు వినయాన్ని, మంచి మాట తీరుని ఇస్తుంది. చెడు మాటలు అనే ముందు ఒక్క సెకన్ ఆలోచించండి. మీకు జరిగే హాని గురించి, మంచి మిత్రులను పోగొట్టుకోకండి. హనుమను ఆదర్శంగా తీసుకోండి.” చెప్పింది టీచర్.
మంచి మాట, మంచి భవితకు బంగారు బాట!