[dropcap]మే[/dropcap] 23వ తేదీ డాక్టర్ ఇడా సోఫియా స్కడర్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఈ రోజుల్లో మన దేశంలోని ప్రతి పట్టణంలోను, గ్రామాలు, పట్టణాలు నగరాలలోను ప్రసూతి వైద్యనిపుణులయిన మహిళా డాక్టర్లు వైద్య సేవలను అందిస్తున్నారు. మహిళా శిశు మరణాల రేటు తగ్గడం కోసం ప్రభుత్వం వైద్యులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్రత్యేక ప్రసూతి వైద్యశాలలు పనిచేస్తున్నాయి.
కాని సుమారు 160 ఏళ్ళ క్రితం కూడా మన దేశంలో వైద్యుల కొరత ఎక్కువ. పైగా మహిళా వైద్యులుండేవారు కాదు. పురుష ప్రసూతి వైద్యుల దగ్గరకి వెళ్ళడానికి సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేవు. సరైన వైద్యం అందక శిశు మరణాలు, కొన్ని సార్లు తల్లితో సహా శిశు మరణాలు సంభవించేవి. గర్భశోకం తల్లులను మానసికంగా కృంగదీసేవి.
స్వయంగా గర్భశోకాన్ని అనుభవించిన శ్రీమతి ఆనందీబాయి జోషి అమెరికా వెళ్ళి పట్టుదలతో వైద్యురాలయ్యారు. అయితే ఆమె క్షయ వ్యాధి, మనోవేదనతో మరణించడం వేరే విషయం.
కానీ ఒక విదేశీ కుటుంబపు యువతి, మిషనరీ మహిళ భారతీయ మహిళల కడగండ్లను చూసి, కన్నీటి పర్యంతమై, గృహిణిగా స్థిరపడదామనుకున్న ఆలోచనను మానుకుని, అవివాహితగా నిలిచి, వైద్య పట్టా పుచ్చుకుని దేశంలోనే గొప్ప పేరు పొందిన క్రిస్టియన్ మెడికల్ కళాశాలను స్థాపించారు. ఈమే డాక్టర్ ఇడా. యస్.స్కడర్.
ఈమె 1870 డిసెంబర్ 9వ తేదీన నాటి మద్రాసు ప్రెసిడెన్సీ నేటి తమిళనాడులోని రాణిపేటలో జన్మించారు. ఈమె తల్లి సోఫియా వెల్డ్. తండ్రి జాన్ స్కడర్ గొప్ప వైద్యులు. వీరి కుటుంబం అమెరికన్ మిషనరీ రెండవ తరానికి చెందింది. అమెరికన్ చర్చిలో పని చేసేవారు. మిషనరీ తరపున భారతదేశానికి వచ్చారు.
భార్యతో కలిసి మిషనరీ వైద్యశాలను ‘వెల్లూరు’లో ప్రారంభించారు. స్కడర్ ఒక్కరే కుమార్తె, మిగిలినవారు మగ పిల్లలు. వెల్లూరు ప్రాంతంలో వైద్యసేవలను అందించేవారు.
1878లో కరువు సంభవించినప్పుడు తిరిగి అమెరికా వెళ్ళారు. కొంతకాలం తరువాత మళ్ళీ భారతదేశానికి తిరిగివచ్చారు. కుమార్తెను బంధువుల సంరక్షణలో అమెరికాలోనే ఉంచారు. ఆమె నార్త్ ఫీల్డ్‌లో విద్యాభ్యాసం చేశారు. ఆమెకి గృహిణిగా జీవించాలని కోరిక. వైద్యవృత్తిని స్వీకరించడం కూడా ఆమె ఇష్టం లేదు. అయితే విధివ్రాత వేరుగా ఉంది.
1890లో సోఫియా అనారోగ్యానికి గురయింది. తల్లిని చూసుకోవడానికి స్కడర్ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో జరిగిన విషాదకర సన్నివేశం ఆమె జీవనగతినే మార్చింది.
అంతేకాదు మన దేశ వైద్య విధానంలో విప్లవాన్ని సృష్టించింది. దక్షిణ భారతదేశానికి తలమానికంగా నిలిచిన ‘వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల’ స్థాపనకు శ్రీకారం చుట్టింది.
ఇంతకీ ఆ సంఘటన పూర్వాపరాలేమిటి ఒకరోజు రాత్రి జాన్ వైద్యశాలకు ముగ్గురు భర్తలు ప్రసవం నిమిత్తం గర్భవతులైన తమ భార్యలను తీసుకొచ్చారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కాని పురుష వైద్యులు వారికి చికిత్స చేయడానికి ఆ భర్తలు ఒప్పుకోలేదు. తత్ఫలితంగా ముగ్గురు గర్భవతులు శిశువులతో సహా మరణించారు. ఈ సంఘటన స్కడర్ మనసుని తీవ్రంగా కలచివేసింది. తను ఇటువంటి అభాగినుల కోసం ఏమి చేయగలను అని ఆలోచించారు. చివరకు మనసుని అవివాహితగా ఉండడం, వైద్యవృత్తిని స్వీకరించడం వైపు మరల్చారు.
అమెరికా తిరిగి వెళ్ళారు. 1895లో పెన్సిల్వేనియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజిలోను, కార్నెల్ యూనివర్సిటీ వెయిల్ మెడికల్ కాలేజిలో చేరి 1899 నాటికి వైద్యురాలు అయ్యారు.
ఆమెకు బ్యాంకర్ మిస్టర్ ఫోన్ నుండి 10,000 డాలర్లు సహాయంగా లభించింది. తన స్నేహితులు హానికాతో కలిసి భారతదేశానికి వచ్చారు. తండ్రి తనకి అండదండగా ఉంటారని హాస్పిటల్ నిర్వహణలో సహాయపడతారని ఆమె ఆశించారు. కాని కొద్ది కాలంలోనే ఆయన మరణించారు.
తనకి సహాయంగా లబించిన డబ్బుతో 1902లో చిన్న మేరీ టాబర్‌షెల్ హాస్పటల్‌నే ప్రారంభించారు. హాస్పటల్‌లో శస్త్రచికిత్సా నిపుణురాలు ఆమె ఒక్కరే! రోగులందరూ హాస్పటల్‌కి వచ్చే పరిస్థితులు లేవు. కుటుంబాలలో మూఢాచారాలతోపాటు రవాణా సౌకర్యాల కొరతకూడా దీనికి కారణం. ఆమె అక్కడక్కడ చిన్నచిన్న డిస్పెన్సరీలని, క్షయ రోగులకు శానిటోరియంలను, వివిధ రోగగ్రస్థుల కోసం ప్రత్యేక హాస్పిటల్స్‌ను స్థాపించారు. తను సంచరిస్తూ వైద్య సేవలను అందించేవారు.
1909 నాటికి నర్సింగ్ స్కూలను స్థాపించారు. 1918లో ‘యూనియన్ మిషన్ మెడికల్ స్కూల్ ఫర్ ఉమెన్’ను స్థాపించారు. వీటి నిర్వహణకు, హాస్పిటల్‌లో సేవలను అందించడానికి నిధులు అవసరమయ్యాయి. బ్రిటన్, అమెరికా తదితర దేశాలను పర్యటించారు. వివిధ మిషనరీల నుండి హాస్పిటల్, కాలేజి నిర్వహణకు నిధులను సమకూర్చుకోగలిగారు.
ఆమె స్నేహితురాలు గెర్ట్రూడ్ డాడ్ ఈమెకి ఎనలేని సాయాన్ని అందించారు. ఈ కాలేజి దక్షిణ భారతదేశంలోనే మహిళా వైద్యులకు శిక్షణ ఇచ్చిన తొలి మెడికల్ కాలేజిగా, తొలి క్రైస్తవ వైద్యకళాశాలగా పేరు పొందింది. దీనికి ఇడా సోఫియా స్కడర్ సంస్థాపకురాలిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 1946లో ఈమె పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఈ కాలేజి పర్యవేక్షకురాలిగా దాని ఎదుగుదలకి కృషి చేశారు. ఈ మెడికల్ కాలేజి ఈనాడు భారతదేశంలోని గొప్ప మెడికల్ కాలేజిలలో ఒకటి. సోఫియా స్కడర్ నాటిన విత్తనం తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మహావృక్షంగా ఎదిగి ఈ స్థానాన్ని సంపాదించుకుంది.
అనేక రంగాలలో పరిశోధనలు జరుపుతున్న హాస్పటల్‌గా పేరు పొందింది. ఈ హాస్పటల్‌కి WHO, ICMR, DST, DBT వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నిధులు సమకూరుతున్నాయి.
2000 ఆగష్టు 12వ తేదీన ఈ కళాశాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక స్టాంపును విడుదల చేసింది భారత తపాలా శాఖ. స్టాంపు మీద కాలేజి భవనం కనిసిస్తుంది. సింహద్వారం ఎదుట చక్కటి ఆకుపచ్చని వృక్షాలు మనని ఆకుపచ్చలోకంలోకి తీసుకుని వెళతాయి.
ఫస్ట్ డే కవర్ మీద ఎడమవైపున ఇడా సోఫియా స్కడర్ చిత్రాన్ని ముద్రించి వ్యవస్థాపకురాలిని గౌరవించారు.
ఈమె వర్ధంతి మే 23వ తేదీ సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet