[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
సుస్వరాల కర్త నౌషాద్:
ఓ సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో లక్నీలోని కాంధారి బజార్‍లో 25 డిసెంబర్ 1919 నాడు జన్మించారు నౌషాద్. హిందీ సినీరంగంలోకి క్రిస్‍మస్ బహుమతిగా అరుదెంచారు. చిన్నతనం నుంచే సంగీతం పట్ల ఆకర్షణ పెంచుకున్నారు. ఆయన తండ్రి ఓ సాధారణ గుమాస్తా కావడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. వారి కుటుంబానికి అసలు సంగీత నేపథ్యం లేదు. తండ్రికి సంగీతం అంటే అయిష్టం, అసహ్యం ఉండడంతో నౌషాద్ ఆయన కోపానికి కూడా గురయ్యారు. ఏ రకమైన సంగీతంతోనైనా సంబంధం కలిగి ఉండడం ఓ అంధ విశ్వాసమని ఆయన భావించేవారు. అందుకే కుమారుడిలోని నైపుణ్యాన్ని, అభిరుచిని గుర్తించక ప్రోత్సహించలేదు.
నౌషాద్‌కి సుమారు మూడు-నాలుగేళ్ళు వయసులో, తన బంధువుతో కలిసి లక్నోలో ఉన్న సూఫీ గురువు హజీ వారిస్ ఆలీ షా మందిరం ‘దేవా షరీఫ్’కి వెళ్ళేవారు. ఈ సందర్శనలో భాగంగా అక్కడో వ్యక్తి ఫ్లూట్ వాయించడం గమనించి, సంగీతం పట్ల ఆకర్షితులయ్యారు నౌషాద్. ఆయనని అనుకరించడం కోసం తాను కూడా ఓ ఫ్లూటు కొనుక్కున్నారు. కాస్త పెద్దయ్యాకా, తానొక్కరే ఆ మందిరానికి వెళ్ళి వేణునాదం వినడం కొనసాగించారు.
బడికి వెళ్ళే దారిలో మూకీ సినిమాలను ప్రదర్శించే ‘రాయల్ టాకీస్’ అనే థియేటర్ ఉండేది. మూకీ యుగంలో ఆ సినిమాకి సంబంధించిన సంగీతకారులు సినిమా విరామ సమయంలోని కాని, కొన్ని ప్రత్యేక సన్నివేశాలలో గాని వాయిద్యాలను వాయించేవారు. సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూసేందుకు డబ్బు లేకపోవడంతో, బయటే నిలబడి ఆ సంగీతం విని మనసులో గుర్తు పెట్టుకునేవారు. తను నేర్చుకున్న బాణీని వాయించాలంటే ఏ వాద్యపరికరం కొనడానికి ఆయన వద్ద డబ్బు లేవు.
దాంతో వాయిద్య పరికరాలను అమ్మే, మరమత్తు చేసే ఒక దుకాణంలో పార్ట్ టైం ఉద్యోగంలో చేరారు. యజమాని బయటికెళ్ళినప్పుడల్లా నౌషాద్ వాయిద్యాలను వాయించేవారు. ముఖ్యంగా హార్మోనియం ను తీసుకుని దుకాణం వెనక్కి వెళ్ళి తాను నేర్చుకున్న పాటలను సాధన చేసేవారు. ఇది కొన్ని నెలల పాటు సాగింది. ఒకరోజు యజమాని గుర్బల్ ఆలీ – నౌషాద్‌ని సాధన చేస్తుండగా పట్టుకున్నారు. సిగ్గు పడిన నౌషాద్ యజమని విధించే ఏ శిక్షకయినా సిద్ధమయ్యారు. కానీ ఆశ్చర్యకరంగా గుర్బత్ ఆలీ నౌషాద్‌ని దండించలేదు. ఆయన ప్రతిభకి మెచ్చుకుని ఆ హార్మోనియంను కానుకగా ఇచ్చి సాధన కొనసాగించమన్నారు. నౌషాద్ దీన్ని నమ్మలేకపోయారు!
రాయల్ టాకీస్ బయట నిలబడి నేర్చుకున్న బాణీల సాధన పూర్తయింది. గుర్బత్ ఆలీ మరో సాయం చేసారు. రాయల్ టాకీస్ వాయిద్యకారులలో ఒకరైన ఉస్తాద్ లద్దన్ సాబ్‌కి నౌషాద్‌ని పరిచయం చేశారు. నౌషాద్ ప్రతిభని గ్రహించిన లద్దన్ సాబ్ తన సహాయకులతో పాటుగా సాధన చేసుకునే అవకాశం కల్పించారు. గుర్బత్ ఆలీ కూడా యువ నౌషాద్‍కు మెలకువలు నేర్పారు. వీరిద్దరు నౌషాద్ తొలి గురువులు.
ఈ శిక్షణ కాకుండా, నౌషాద్ ఉస్తాద్ బబ్బన్ సాబ్ వద్ద నుంచి, ఇంకా మ్యూజిక్ కాలేజిలో ప్రొఫెసర్ అయిన యూసఫ్ ఆలీ ఖాన్ వద్ద నుంచి శిక్షణ పొంది తన ప్రతిభని సానబెట్టుకున్నారు. వీరంతా నౌషాద్‌కి శాస్త్రీయ సంగీతంపై పట్టు లభించేలా చేశారు. ఈ క్రమంలోనే హార్మోనియం, పియానో మీద గొప్ప పట్టు సంపాదించారు నౌషాద్. ఇవే కాకుండా, తబలా, సితార్, షెహనాయి వాయించడంలో కూడా గొప్ప నైపుణ్యం సాధించారు. ఇప్పుడు నౌషాద్ చిన్న చిన్న రంగస్థల కంపెనీలకి, నాటకాలకి వాయిద్యాలు వాయించే స్థితికి వచ్చారు. తన మిత్రులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి లక్నోకి సమీపంగా ఉండే బరేలీ, కాన్పూర్, గుజరాత్ వంటి ప్రదేశాలకు వెళ్ళి ప్రదర్శనలిచ్చేవారు.
దురదృష్టవశాత్తు, నౌషాద్ చేస్తున్న ఈ సంగీత కార్యక్రమాల గురించి వాళ్ళ నాన్నగారికి తెలియదు. కానీ ఓనాడు ఎలాగో ఆయనకి తెలిసిపోయింది. అందునా రాత్రి పూట ప్రయాణాలు, నౌషాద్ తన అభిరుచిని కొనసాగించడాలు ఆయనకి కోపం తెప్పించాయి. అందుకు శిక్షగా ఆలస్యంగా ఇంటికి వచ్చిన రోజున నౌషాద్‌కి భోజనం ఉండేది కాదు, ఒక్కోసారి తన్నులు కూడా తినాల్సి వచ్చేది. కానీ యువ నౌషాద్‌ని ఇవేవీ ఆపలేకపోయాయి. సంగీతమే తన జీవితం అనుకున్నారు.
కానీ తండ్రితో గొడవలు ముదిరాయి. ఓ రాత్రి తండ్రి హార్మోనియంను వీధిలో పడేసి – ఇల్లా, సంగీతమో తేల్చుకోమన్నారు. ఆ ఇంట్లో ఏ రకమైన సంగీతానికి తావు లేదని గ్రహించిన నౌషాద్‌కి, ఆ ఇంట్లో ఉండాలంటే తాను సంగీతం వదిలేయాలని అర్థమైంది.
అప్పుడు నౌషాద్‌కి 17 ఏళ్ళు. ఇంటి కన్నా సంగీతమే ముఖ్యమనుకున్నారు. సంగీతంపై ప్రేమని, అభిరుచిని ఎన్నటికీ వదులుకోనని చెప్పి, ఇంట్లోంచి బయటకి వచ్చేసారు. అతడి స్నేహితుడొకరు – ప్రస్తుతం సినిమాలు మూకీ నుంచి టాకీకి మారుతున్నందున, బొంబాయి వెళ్ళి తన అదృష్టాన్ని పరీక్షించుకోమని నౌషాద్‌తో అన్నారు. అక్కడ ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని భావించారు.
బొంబాయిలో లక్నోకి చెందిన ఓ రిటైర్డ్ హెడ్ మాస్టర్ తప్ప మరెవరూ తెలియదు. బస కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చాలాసార్లు ఫుట్‌పాత్ మీద నిద్రపోయేవారు. కొన్ని రోజులు ఆ హెడ్ మాస్టర్ గారింట్లో కొలాబాలో ఉన్నారు. కానీ నౌషాద్ వద్ద తనకంటూ డబ్బు లేదు. అందుకని ప్రతీ రోజు కొలాబా నుంచి – రికార్డింగ్ స్టూడియోలు ఉన్న దాదర్ లేదా చెంబూర్ వరకు మైళ్ళ దూరం నడిచి వెళ్ళేవారు. తరచూ సరైన ఆహారం లేక, ఖాళీ కడుపుతో నిద్రపోయేవారు.
నెలల కొద్దీ ఎదురుచూపుల తర్వాత నౌషాద్‌కి మొదటి ఉద్యోగం దొరికింది. 1937లో దర్శకుడు ముస్తాక్ హుస్సేన్ తీస్తున్న ‘సముందర్’ చిత్రానికి పియానిస్ట్‌గా అవకాశం దొరికింది. నెలకి నలభై రూపాయల జీతం. కానీ షూటింగ్ మూడు నెలల్లో ముగిసిపోయింది, ఉద్యోగం పోయింది. నడవడం వల్ల బాగా అలసిపోతుండడంతో దాదర్‌కి మారిపోవాలనుకున్నారు. దయాళువైన ఓ దుకాణం యజమాని తన దుకాణం వెనుక భాగంలో నిద్రించడానికి నౌషాద్‌ని అనుమతించారు. కానీ దుకాణం లోపల విపరీతమైన వేడిగా ఉండడం వల్ల నౌషాద్ అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. ఓ భవనం ముందు ఫుట్‌పాత్ పై నిద్రించేవారు. ఆ భవనంలో అప్పటి ప్రసిద్ధ నటి లీలా చిట్నిస్ నివసించేవారు. ప్రతీ రాత్రి అక్కడ నిద్రిస్తున్న నౌషాద్‌ని చూసేవారుట [కొన్నేళ్ళ తర్వాత ఆమె సినిమాల్లో ఒకటైన కంచన్ (1941)కి నౌషాద్ సహాయ సంగీతదర్శకుడు కావడం విధి వైచిత్రి].
‘సముందర్’ తర్వాత ఒకరోజున దినపత్రికలో – ఒక కొత్త ఫిల్మ్ కంపెనీకి సంగీతకారులు కావాలనే ప్రకటన చూశారు. ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్నారు. ఆడిషన్స్‌ని మ్యూజిక్ మ్యాస్ట్రో ఉస్తాద్ ఝండే ఖాన్ నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఆయన సుప్రసిద్ధులు. నౌషాద్ అక్కడికి వెళ్ళి పియానిస్ట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఝండే ఖాన్ గారిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం పోగొట్టుకోకూడదు అని అనుకున్నారు.
యాదృచ్ఛికంగా గులామ్ మహమ్మద్ (తర్వాతి కాలంలో నౌషాద్‌కి సహాయకుడయ్యారు, పాకీజా సినిమాకి అద్భుతమైన సంగీతం అందించారు) కూడా ‘తబలా’ వాయిద్యకారునిగా ఆడిషన్స్‌కి హాజరయ్యారు. ఝండే ఖాన్ గారికి నౌషాద్ ప్రతిభ నచ్చింది, తన ఆర్కెస్ట్రాలో పియానిస్ట్‌గా చేర్చుకున్నారు. ‘సునెహరీ మక్దీ’ (1937) సినిమాలో అవకాశం కల్పించారు. అప్పుడు నౌషాద్ జీతం నెలకి 40 రూపాయలు. మెల్లగా ఝండే ఖాన్‌కి నౌషాద్ నైపుణ్యం బాగా నచ్చింది. తన సహాయకుడిగా నియమించుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో నౌషాద్ సంగీతపు మెలకువలు తెలుసుకున్నారు. సంగీతం అనేది దైవదత్త కళని గ్రహించారు. తన అభిరుచిని కొనసాగిస్తూనే, నాణ్యతలోగాని డబ్బుకి గాని ఎన్నడూ రాజీ పడలేదు. అందుకే తరువాతి కాలంలో అద్భుతమైన పాటలు – ఒక సినిమా తరువాత మరొకటిగా – అందించారు.
మొదట్లో పియానిస్ట్‌గా నాలుగైదు సినిమాలకి పని చేసినా, ఆయన ప్రతిభ ఆయన్ని సహాయ సంగీత దర్శకుడిగా మార్చింది. అలనాటి గొప్ప సంగీత దర్శకులు – ఖేమ్‌చంద్ ప్రకాశ్, జ్ఞాన్ దత్, ముస్తాక్ హుస్సేన్ వంటి వారికి సహాయకుడిగా పనిచేశారు. తర్వాతి మూడేళ్ళలో నౌషాద్ స్టూడియోలను, ఉద్యోగాలని మార్చారు. ఆయన జీతం కూడా నెలకి 100 రూపాయలకి పెరిగింది. ఆరోజుల్లో స్టూడియో వ్యవస్థ అమల్లో ఉండేది, సంగీతకారులు స్టూడియోలకి అనుబంధంగా ఉండేవారు, నెల జీతానికి పని చేసేవారు.
నలభైవ దశకంలో ప్రఖ్యాతి చెందిన గీత రచయిత డి.ఎన్. మధోక్ గారికి నౌషాద్ అంటే సదభిప్రాయం కలిగి ఆయన ప్రతిభని విశ్వసించారు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా నౌషాద్‌కి అవకాశం రావల్సిన సమయం ఆసన్నమైందని ఆయన భావించారు. రంజిత్ మూవీటోన్‌కి చెందిన చందూలాల్ షాకి నౌషాద్‌ని పరిచయం చేశారు. కానీ అక్కడ పని జరగలేదు. ఆ తరువాత ఆయన భావ్నానీ ప్రొడక్షన్స్‌కి చెందిన మోహన్ భావ్నానీని కలిసారు. అప్పట్లో మధోక్ – భావ్నానీ ప్రొడక్షన్స్ వారు తీస్తున్న ‘ప్రేమ్ నగర్’ సినిమాకి కథ, డైలాగ్స్, పాటలు రాస్తున్నారు. యువ నౌషాద్‌కి స్వతంత్ర స్వరకర్తగా అవకాశం ఇవ్వమని మోహన్ గారిని కోరారు. నౌషాద్ వయసు రీత్యా మోహన్ గారు కొంత సంశయించగా, నౌషాద్ సృజించే సంగీతం ఉన్నత స్థాయిలో లేకపోతే – ఆ సినిమాకి తన పారితోషికం అంతా వదులుకుంటానని మధోక్ చెప్పారు. ‘ప్రేమ్ నగర్’ 1941లో విడుదలై గొప్ప హిట్ అయింది. ఆ సినిమా ప్రీమియర్‍లో తెర మీద తన పేరును ముచ్చటగా చూసుకున్నారు నౌషాద్. ఆ సినిమాలో ఎనిమిది పాటలున్నాయి, వాటిలో చాలా పాటలు హిట్ అయ్యాయి. సంగీతపు సమూహలలో నౌషాద్ పేరు గట్టిగా వినిపించసాగింది. ఈ విధంగా 1941లో విడుదలైన ‘ప్రేమ్ నగర్’ స్వతంత్ర సంగీత దర్శకుడిగా నౌషాద్‌కి తొలి చిత్రం అయింది.
ఈ సినిమా విడుదలయ్యాకా, సొంతంగా అద్దెల్లు ఏర్పాటు చేసుకోవలనుకున్నారు. దాదర్‍లో నెలకి పది రూపాయల అద్దెకి ఓ గది తీసుకున్నారు. అంటే బొంబాయికి వచ్చిన నాలుగేళ్ళకి తనదంటూ చెప్పుకోడానికి ఓ బస దొరికింది నౌషాద్ గారికి.
తరువాత ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి – మాలా, నయా దునియా, స్టేషన్ మాస్టర్, దర్శన్, సంజోగ్, కానూన్ – మొదలైనవి. తన మృదువైన స్వభావం కారణంగా వేరే స్టూడియోల సినిమాలకు పని చేసేడప్పుడు తన స్టూడియో ప్రత్యేక అనుమతి తీసుకునేవారు నౌషాద్. ఆయన ఈ స్వభావం అందరికీ నచ్చేది. ‘స్టేషన్ మాస్టర్’ సినిమాకు గాను 13 ఏళ్ళ గాయని, నటి అయిన సురయ్యతో పాటలు పాడించారు. ఆ సినిమాలో ఆమె హీరోయిన్ చెల్లెలిగా నటించి, తన పాటలు తానే పాడుకున్నారు.
కర్దార్ ప్రొడక్షన్స్ సంస్థలో వచ్చిన ‘శారద’ నౌషాద్ గారి ఆరో సినిమా, ఆయనకి తొలి సిల్వర్ జుబ్లీ చిత్రం!
సినిమాలు వరుసగా వస్తున్నా, ఆయనకి మంచి బ్రేక్ మాత్రం ఎం. సాదిక్ దర్శకత్వంలో మధోక్ గీత రచన చేసిన ‘రత్తన్’ సినిమా ద్వారా వచ్చింది. గ్రామీణ నేపథ్యంలోని ప్రేమ కథా చిత్రం అది. నౌషాద్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు సినీ సంగీతంలో రెండు రకాలు ఉండేవి. ఒకటి న్యూ థియేటర్స్, కలకత్తా వారి నెమ్మదయిన సంగీతం; రెండవది – లాహోర్‍కి చెందిన వేగవంతమైన పంజాబీ సంగీతం. తన ప్రతిభని నిరూపించుకోవడానికి ఈ రెండిటికి భిన్నమైన శైలిని ఎంచుకోవాలని నౌషాద్‌కు తెలుసు, అందుకే సరైన అవకాశం కోసం వేచి ఉన్నారు.
‘రత్తన్’ సినిమా ద్వారా లభించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆయన రెండు చేతులా ఒడిసిపట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‍కి చెందిన జానపద బాణీలను ఈ సినిమాలో ఉపయోగించారు. తొలిసరిగా పలు వాయిద్యాల – పియానో, డోలక్, క్లారినెట్, సితార్ వంటి – మేళవింపు వాడారు. ‘రత్తన్’ సినిమా తక్కువ బడ్జెట్‌తో రూపొందించబడింది, కానీ గొప్ప హిట్ అయింది. 40వ దశకంలోకెల్లా భారీ వసూళ్ళను రాబట్టింది. కేవలం పాటల కోసమే జనాలు ఆ సినిమాను చూశారు. పాటల రికార్డులు గొప్పగా అమ్ముడుపోయాయి. ఈ సినిమాతో నౌషాద్ రాత్రికి రాత్రి సెలెబ్రిటీ అయిపోయారు. దీని తరువాత వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదాయనకి.
1945లో ఆయన కుటుంబం ఆయనకి వివాహం నిశ్చయించినప్పుడు, ఆయన వృత్తిపరంగా సంగీత దర్శకుడని ఆడపెళ్ళి వారికి చెప్పలేదట, నౌషాద్ ఓ దర్జీ అని చెప్పారట! తమాషా ఏంటంటే – పెళ్ళి ఊరేగింపులో బ్యాండ్ వాయించిన పాట – సూపర్ హిట్ సినిమా ‘రత్తన్’ లోదే! ఆ సినిమా సంగీత దర్శకుడే ఆ పెళ్ళికొడుకు అని ఎవరికీ తెలియదు!!
‘రత్తన్’తో గొప్ప సంగీత దర్శకుల స్థాయికి ఎదిగారు నౌషాద్. తరువాతి సినిమాకి అయనకి పారితోషికంగా పాతికవేల రూపాయలు అందుకున్నారట! ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. ‘రత్తన్’ తరువాత, మరో ఘన విజయం ‘అన్‌మోల్ ఘడీ’తో లభించింది. మేలా, ఏలాన్, దర్ద్ – వరుస హిట్ లయ్యాయి. సినీ సంగీతంలో నౌషాద్ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. మొఘల్-ఏ-ఆజామ్, అందాజ్, ఉడాన్ ఖటోలా, అమర్, ఆన్, గంగా జమున, కోహినూర్, మదర్ ఇండియా, వంటి చిత్రాల ద్వారా చిరస్మరణీయమైన పాటలను అందించారు నౌషాద్.
వ్యక్తిగతంగా కూడా నౌషాద్‌కి మేలు చేకూరింది. ఆయన జీతం నెలకి 500 రూపాయలకి పెరిగింది. అద్దె గదిని విడిచి, ఒకప్పుడు తాను పడుకున్న ఫుట్‌పాత్‌కి ఎదురుగా ఉన్న భవనంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో – 1937లో తాను దాదర్‌లో ఓ భవనానికి ఎదురుగా ఫుట్‌పాత్‌పై నిద్రపోయేవాడినని, ఆ భవనానికి ఎదురుగా సుప్రసిద్ధ సినిమా హాల్ ‘బ్రాడ్‌వే’ ఉండేదని చెప్పారు. ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు ఆ థియేటర్ మెరిసిపోయేదని, తన సినిమాలు కూడా అక్కడ ఆడితే చూడాలని తాను కలలు కనేవాడినని చెప్పారు. ఆయన కల 1953లో నెరవేరింది. ‘బైజు బావరా’కి అందించిన అద్భుతమైన పాటల వల్ల – ఆ సినిమాని ‘బ్రాడ్‌వే’లో ప్రీమియర్‍గా ప్రదర్శించారు. ఫుట్‌పాత్ ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళడానికి నౌషాద్‌కి పూర్తిగా 16 ఏళ్ళు పట్టింది!!!
అయితే సంగీతానికి ఇంత సేవ చేసిన వ్యక్తికి తన కుటుంబం నుంచి ప్రశంసలు అభించకపోవడం అత్యంత దురదృష్టకరం! వివాహం అయిన తర్వాత ఆయన భార్య – తమ సంతానం ఎవ్వరినీ సినీ ప్రపంచంలోకి రానివ్వనని ముందే చెప్పారు. ఆయన ఏ సంకోచాలు లేకుండా ఆవిడ ఉద్దేశాన్ని మన్నించారు.
తను కష్టాలు పడ్డ కాలాన్ని నౌషాద్ ఎన్నడూ మరిచిపోలేదు. అందుకే ఎందరో గాయనీగాయకులకు [సురయ్య, మహమ్మద్ రఫీ, ఉమాదేవి (టున్ టున్), జొహ్రాబాయి అంబాలేవాలీ, శంషాద్ బేగం, శ్యామ్ కుమార్] అవకాశాలు ఇచ్చారు. అలాగే కొత్త గీత రచయితలకు కూడా (షకీల్ బదాయూనీ, మజ్రూహ్ సుల్తాన్‌పురి) అవకాశాలు కల్పించారు.
జీవితమంతా నిరాడంబరంగా, వినయంగా గడిపారు. తన సంగీతం ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ప్రతిభాశాలి రీమా లాగూ:
మరాఠీ రంగస్థలం నుంచి బాలీవుడ్‌లోని కొన్ని జనరంజకమైన పాత్రల వరకూ – ఆమె ప్రస్థానం అద్భుతంగా సాగింది.
నయన్ భద్‌భదే అనే జన్మనామంతో 1958లో పూణేలో పుట్టిన రీమా – 1990ల నాటి టీవీ సీరియల్ – ‘శ్రీమాన్ శ్రీమతి’ లో కోకిలా కులకర్ణీ పాత్ర ద్వారా; ‘తు తు మై మై’ సీరియల్‍లో దేవకి వర్మ పాత్ర ద్వారా ఇంటింటి మనిషిగా మారారు. ఈ సీరియల్‍లో కోడలి పాత్ర పోషించిన సుప్రియ పిలగావంకర్‌తో పోటీ పడి నటించారు.
వెండి తెర మీద ఒకే తరహా అమ్మ/అత్త పాత్రల పోషించడం కన్నా చాలా ముందరే ఆమె కెరీర్ మొదలయింది. రీమా తొలుత బాలనటి. తన తల్లి మందాకిని భద్‌భదే మరాఠీ రంగస్థల, సినీ నటి. బాల నటిగా రీమా పలు చిత్రాలలో నటించారు. వాటిలో దుర్గా ఖోటే గారి 1964 నాటి ‘మాస్టర్‌జీ’ ముఖ్యమైనది.
“బాలికగా నా అల్లరినంతా భరించినది దర్శకురాలు దుర్గా ఖోటే. నన్నెంతో సౌకర్యవంతంగా ఉంచారు. నేను పరిశ్రమలో రాణిస్తాననే భరోసా ఇచ్చారు. నేను బడికి వెళ్తూ, అప్పుడప్పుడు షూటింగ్‌లో పాల్గొన్నా కూడా నన్నెంతో బాగా చూసుకున్నారు.” చెప్పారు రీమా పాత సంగతులు గుర్తు చేసుకుంటూ.
పి.ఎల్. దేశ్‌పాండే గారి విజయవంతమైన నాటకం ‘తి ఫూల్‌రాణీ’ (మై ఫెయిర్ లేడీ – మూలం) ప్రదర్శన కోసం ఆమె బొంబాయి చేరుకున్నారు. మరాఠీ రంగస్థలంపై కొనసాగుతూనే సైకాలజీ మాస్టర్స్ డిగ్రీ పొందారు, ఒక బ్యాంకులో ఉద్యోగంలో చేరారు.
బొంబాయిలోని పృథ్వీ థియేటర్‍లో ఒక నాటకంలో ఆమెని చూసిన శశి కపూర్, తన నిర్మాణంలోని ‘కలియుగ్’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. శ్యామ్ బెనెగళ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా తనకి కల్చరల్ షాక్ ఇచ్చిందని రీమా చెప్పారు.
“నాకెన్నో అభ్యంతరాలు ఉండేవి! ఆ సినిమాలో కుల్‌బూషణ్ ఖర్బందా గారితో బెడ్ రూమ్ సీన్ చేయమన్నారు, నేను గట్టిగా ఏడ్చేశాను. నన్ను ఓదార్చడానికి శ్యామ్ బెనెగళ్ ఎంతో కష్టపడ్దారు” అన్నారు రీమా.
ఆ తర్వాత అడప దడపా నటిస్తూ, మరో దశాబ్దం పాటు బ్యాంకులో ఉద్యోగం చేసుకొన్నారు.
తన కెరీర్‍లో కాస్త తొందరగానే తల్లి పాత్రలకి మళ్ళాల్సి వచ్చింది. తొలి సినిమా ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ (1988)లో జుహీ చావ్లాకి తల్లిగా నటించారు. కానీ తన పాత్ర నిడివి చాలా తక్కువైపోవడంతో, హిందీ సినిమాలు మానుకుని తిరిగి మరాఠీ రంగస్థలానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో టీవీ సీరియల్స్ చేశారు, న్యూస్ రీడర్‌గా కూడా పని చేశారు. వ్యాపార ప్రకటనలలో నటించారు. అయితే 1989లో ‘మైనే ప్యార్ కియా’ విడుదలయింది. రీమా తన పాత్ర షూటింగ్ ఎప్పుడో ముగించుకుని, దాని గురించి మరిచిపోయారు. కానీ ఆ సినిమా అంత హిట్ అవుతుందని ఆమె ఊహించలేదు. నిరుపా రాయ్, ఫరీదా జలాల్ లాగ తను కూడా హిందీ చిత్రసీమలో తల్లి పాత్రలకి మారు పేరు అవుతానని అప్పుడసలు అనుకోలేదు.
హిందీ చిత్రపరిశ్రమలో తల్లి పాత్రలు ఎలా ఉండాలనే విద్యావంతుల ఆలోచనకి తగ్గట్టుగా రీమాకి అద్భుతమైన, వైవిధ్యమైన తల్లి పాత్రలు లభించాయి. ‘రిహాయీ’ (1988)లో పాత్ర ఒక ఎత్తు అయితే, ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ (1988)లోని పాత్ర మరోక ఎత్తు. కానీ ప్రతీ పాత్ర ఈ పితృస్వామ్య సమాజంలో తల్లి ఎలా ఉంటుందో ప్రతిబింబించింది.
1999లో వచ్చిన ‘వాస్తవ్’ ఆమెకి బలమైన తల్లి పాత్రనిచ్చింది. ఓ నేరస్థుడికి (సంజయ్ దత్) తల్లిగా ఆమె గొప్ప ప్రదర్శన కనబరిచారు. తల్లి ప్రేమకంటే నీతికే కట్టుబడి కన్న కొడుకునే చంపుకునే పాత్ర అది. మహేష్ భట్ ‘ఆషికీ’లో ఆమె ఓ ‘ఒంటరి తల్లి’ పాత్ర పోషిచారు. అలాగే కరణ్ జోహార్ చిత్రం ‘కల్ హో యా నా హో’ (2003)లో – వైద్యం లేని జబ్బుతో బాధపడే కొడుకుకి (షారుక్ ఖాన్) ఒంటరి తల్లిగా అద్భుతంగా నటించారు.
పోషించేవి తల్లి పాత్రలే అయినప్పటికీ అవన్నీ ఒకే తరహాలో ఉండకుండా, ప్రతీ పాత్రకూ జీవం పోస్తూ పాత్రపోషణలో వైవిధ్యం ఉండేలా చూసుకునేవారు రీమా. సినిమాల్లోనూ, టీవీలోనూ అమ్మని చూపించే విధానంలో గొప్ప మార్పు వచ్చిందని 2016లో రీమా చెప్పారు.
“మౌలికమైన భావనలైన ప్రేమ, ఆదరణలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ ఆధునిక అమ్మలు – పిల్లలతో మరింత స్నేహంగా ఉంటున్నారు. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ లో గాని ‘మైనే ప్యార్ కియా’ లో గాని – నా పాత్రతో పిల్లలు తమ సమస్యలు పంచుకోగలిగారు. ‘ఆషికీ’లో ఒంటరి తల్లి పాత్ర పోషించినా, పెళ్ళి గోలలో పడి తన లక్ష్యాన్ని మరిచిపోవద్దని హీరోయిన్‌కి సలహా చెప్తాను. ఇవన్నీ ప్రస్తుతం సమాజంలో మహిళలలో వస్తున్న మార్పులకు అద్దం పడతాయి. ‘నామ్‌కరణ్’ (2016-17 మధ్య ప్రసారమైన టీవీ షో) లో నేను లాప్‌టాప్ లో ఇంటర్‍నెట్ వెతుకుతాను” అన్నారు.
రీమా ‘నామ్‌కరణ్’ సీరియల్ కోసం 17 మే 2017 నాడు రాత్రి 7 గంటల వరకు షూటింగ్ చేశారు. ఆ రాత్రి గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో, రాత్రి ఒంటిగంటకి ముంబయిలోని కోకిలబెన్ ధీరూబాయి హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె గుండెపోటుతో తెల్లవారుజామున 3.15కి మృతి చెందారు. చనిపోయే సమయానికి ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారనీ, అనారోగ్య సమస్యలేవీ లేవని తెలిపారు. ఆమె అంత్యక్రియలని ఆమె కూతురు ముంబయిలోని ఓషివారా క్రెమెటోరియంలో నిర్వహించారు.
***
‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) లోని ఈ సన్నివేశం చూడండి: