[box type=’note’ fontsize=’16’] గురుదత్ నిర్మించి, నటించి, దర్శకత్వం వహించిన ‘ప్యాసా’ సినిమాని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]
‘ప్యాసా’ రెండవ భాగం తరువాత…..
[dropcap]జు[/dropcap]హీ సత్తార్ పార్కులో ఉండగా ఈ సీన్ మొదలవుతుంది. వారిద్దరూ ఒకరితో ఒకరు దగ్గరగా ఉన్న విధం చూస్తే సత్తార్‌కి జుహి అంటే ఇష్టం అని, జుహి మాత్రం సత్తార్‌పై పెద్దగా ఆసక్తి చూపదని అర్థం అవుతుంది. సత్తార్ పట్ల ఆసక్తి చూపని జుహిని చూస్తూ అతను అంటాడు “ఇప్పుడు నాపై ఎంతైనా కోపం చూపించు కాని నువ్వు ముసలిదాని వయ్యాక నిన్ను చూసుకునే వారెవ్వరు అన్నది ఆలోచించావా” జుహి “పైవాడు” అని జవాబిస్తుంది. మళ్ళీ తానే “నీ మాట ఒప్పుకుంటే నేను ఆకలితో చావాలి. అతి కష్టం మీద రెండు రొట్టెలు సంపాదించుకుంటున్నావు. నన్నెట్లా పోషిస్తావు” అని అడిగినప్పుడు సత్తార్ ఆమె వైపు ఆశగా చూస్తూ “నువ్వా రెండు రొట్టెలు తినేసేయ్. నిన్ను నా ఇంట్లో చూస్తే చాలు నా కడుపు నిండిపోతుంది” అని జవాబిస్తాడు. ఈ సంభాషణతో సత్తార్ లోని నిజాయితీ, నిరాడంబరతా స్పష్టపరుస్తారు గురుదత్. వారిద్దరూ పేదవారు. రోడ్ల మీద మాలిష్ చేసుకునే వ్యక్తి సత్తార్. పెద్దగా తానెమీ సంపాదించలేనని అతనికీ తెలుసు కాని అంతటి పేదరికంలోకూడా ఒక స్త్రీకి రక్షణ ఇవ్వగలనని ఆమెకు అండగా నిలబడగలనని అతను చెప్పుకునే విధానం బావుంటుంది. ఆకాశానికి నిచ్చెన వేయకుండా నేల మీడ స్థిరంగా నిలబడి ఉండే వ్యక్తి సత్తార్ అని చూపుతూ ఒక వేశ్యపై అతనికున్న ప్రేమలోని గొప్పతనాన్ని, నిజాయితీని ఇలా చూపిస్తారు దర్శకులు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారిలో ఉండే సాధారణతను ఈ సీన్ పర్పెక్ట్‌గా చూపిస్తుంది. సత్తార్ వ్యక్తిత్వాన్ని చూపుతూనే సమాజంలో అతని స్థానాన్నికూడా సూచించిన సన్నివేశం ఇది. ఈ సన్నివేశం ద్వారా మరో విషయాన్ని సున్నితంగా సూచిస్తారు స్క్రిప్ట్ రచయిత, దర్శకులు. పేరుకు పేదవాళ్ళే అయినా మాలిష్ చేసే స్తార్ , వేశ్య అయినా గులాబోల భావనల్లో నిజాయితీ వుంది. ఎలాగో అలాగ కలసిబ్రతుకుదామన్న తపనవుంది. కానీ, మధ్య తరగతి పాత్ర అయినా మాలా మాత్రం జీవితంలో భద్రత కోసం ప్రేమను త్యాగం చేస్తుంది. ప్రేమానురాగాలు పేదరికంలో వున్నంత తీవ్రంగా లౌక్యం తెలిసిన చదువుకున్న వారిలో, ధనవంతుల్లో వుండవని ఎంతో సున్నితంగా సూచిస్తాయీ దృశ్యాలు.
ఇక ఇప్పుడు ఘోష్ ఇంట్లో పార్టీ దగ్గరికి వస్తాం. ఈ పార్టీ సన్నివేశాన్ని ఒక గదిలో చిత్రించారు గురుదత్. ఆ పార్టీలో కొందరు వ్యక్తులు కనిపిస్తారు. అందరూ ధనవంతులు అని అర్థం అవుతుంది. అయితే ఆ వ్యక్తుల వ్యక్తిత్వాలను మనస్తత్వాలను గురుదత్ చూపించే పద్ధతి బావుంటుంది. దీనితో ఆ హై సొసైటీ మనుష్యులు, ఘోష్ చుట్టూ ఉన్న నాగరిక సమాజాన్ని పరిచయం చేస్తారు గురుదత్. పార్టీకి వచ్చిన ఒక స్త్రీని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఘోష్ “మీ వారు రాలేదా” అని అడుగుతాడు దానికామె “ఆయనకి ఒంట్లో బావోలేదు. హాస్పిటల్ తీసుకెళ్ళమని అడుగుతున్నారు. కాని నేను రేపు తీసుకెళతాను అని చెప్పాను. ఇంత పెద్ద పార్టీ ఎలా ఒదులుకుంటాను చెప్పండి” అని బదులిస్తుంది. ఈ వాక్యంతో ఆమె జీవితంలో ప్రాధాన్యతలను స్పష్టపరుస్తారు గురుదత్. దీని వలన అక్కడి పార్టికి వచ్చే వ్యక్తులపై ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటాడు ప్రేక్షకుడు. అప్పుడే విజయ్ అక్కడికి వస్తాడు. అతన్ని అక్కడ చూసి మీనా కలవరపడుతుంది. అతని దగ్గరకు హడావిడిగా వచ్చి “నా అడ్రస్సు నీకెలా దొరికింది” అని అడుగుతుంది. ఆశ్చర్యపోతాడు విజయ్. అతనికి అది మీనా ఇల్లని అప్పటి దాకా తెలియదు. “మిస్టర్ ఘోష్ నన్ను ఇక్కడకు పిలిచారు” అని బదులిస్తాడు. “నీకు ఆయన తెలుసా” అని అడుగుతుండి మీనా. ఆమె ముఖం వైపుకు చూస్తూ ఏదో అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తూ “ఆయన దగ్గర నేను పని చేస్తున్నాను” అని చెబుతాడు విజయ్. ఇంతలో ఘోష్ వీరిద్దరూ మాట్లాడుకోవడం చూస్తాడు. మీనా వెంటనే విజయ్‌ని “మనిద్దరి సంగతి ఆయనకు చెప్పవద్దు” అని హెచ్చరిస్తుంది.
ఆ పార్టీలో ప్రఖ్యాతి గాంచిన కొందరు కవులు ఉంటారు. గురుదత్ ఈ సీన్ కోసం నిజంగా కొందరు ఉర్దూ కవులను ఆహ్వానించారు. తన్వీర్ ఫారూఖీ అనే ఒక కవి ఈ సీన్‌లో కనిపిస్తారు. వీరి దగ్గరకు గ్లాసులో మద్యంతో వస్తాడు విజయ్. టేబిల్ పై ట్రే పెట్టగానే మీనా అతనికి సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. వెంటనే ఘోష్ నౌకర్లుండగా నీవెందుకు పని చేస్తున్నావు అని ఆమెను ప్రేమగా మందలిస్తాడు. విజయ్‌ని అందరికీ గ్లాసులు అందజేయమని చెబుతాడు.
‘ప్యాసా’ సినిమలో ఈ ఘోష్ పాత్రలోని అహం అర్థం చేసుకోవడం అవసరం. గురుదత్ చాలా ఆలోచించి, మనిషి స్వభావాన్ని లోతుగా గమనించి ఈ పాత్రను మలిచారు. డబ్బు దర్బం ఉన్న చాలా మందిలో పైకి వారు ప్రదర్శించే ఆత్మవిశ్వాసం కేవలం నటన. వారున్న స్థానానికి చేరుకోవడానికి చాలా విలువలను కుదువ పెడుతారు వాళ్ళు. దీని వలన ఒక అభద్రతా భావం వారిలో ఎప్పుడూ ఉంటుంది. తమ అంతరాత్మ తమను ఇబ్బంది పెట్టకుండా దాని గొంతు నొక్కడం వారికి అలవాటవుతుంది. క్రమంగా ధీటైన వ్యక్తిత్వం ఉన్నవారిని, అసమాన్యమైన ధైర్యాన్ని చూపేవారిని, ఏ బలహీనతలకు లొంగని వారిని చూసి సహించే తత్వం వీరిలో నశిస్తుంది. అలాంటి వారు తమ ముందు ఉంటే తమ బలహీనతలు, తమ తప్పులు తమకే కనిపిస్తూ ఇబ్బందికి గురి చేస్తాయి. వాటిని కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిత్వం ఉన్న వారి పట్ల అకారణ వైరం పెంచుకుని, తమ పరపతితో వారిని క్రిందకు తోసి, ఆనందించి, వారి నాశనంతో తమ అహాన్ని తృప్తి పరుచుకునే తత్వం వారిలో ఏర్పడుతుంది. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా తమవైపు కళ్ళెత్తి నిర్బయంగా చూసే బానిసను ఏ రాజయినా సహించగలడా. తమ ముందు తమకన్నా తక్కువ స్థాయి వారు తలెత్తుకుని నడుస్తుంటే ఎంత మంది సహించగలరు? ఘోష్‌లో ఇదే మనస్తత్వం ఉంటుంది. డబ్బు కోసం, పరపతి కోసం, సౌఖ్యం కోసం పెళ్ళి చేసుకున్న మీనా అ భర్తను సంపూర్ణంగా ప్రేమించలేదు. వారి బంధంలో ఒక లోటు తెలుస్తూనే ఉంటుంది. అది ఘోష్ లాంటి భర్తలకు నిత్యం అర్థం అవుతూ ఉంటుంది. ఆ భార్య అందగత్తె అయితే ఆ అందమైన భార్యను ఒక ట్రోఫీగా చూపించుకోవడం వారికి ఇష్టం. అంత అందం తమ పక్కన అణుకువగా నిలబడి ఉండడం వారికి ఓ విజయ చిహ్నం. ఆ విజయ చిహ్నం సంపూర్ణంగా తమది కాదని, ఆమె మనను వేరొకరిపై ఉందని తెలుసుకుంటే ఆ భర్త అహం దెబ్బ తింటుంది. కాలేజీ ఫంక్షన్‌లో విజయ్‌ని మీనా చూసిన విధానంలో ఘోష్‌కు తన భార్య విజయ్‌ని ఒకప్పుడు ప్రేమించిందని అర్థం అవుతుంది. అతని అహం దెబ్బతింటుంది. ఆ విజయ్ పట్ల ఆమెలో కొంత ప్రేమ ఇంకా ఉందని కూడా అతను అర్థం చేసుకోగలడు. తమ బంధంలో తాననుభవిస్తున్న లోటుకు విజయ్‌పై భార్యకున్న ప్రేమ ఒక కారణం అని అర్థం చేసుకున్నాక విజయ్ అతనికి ప్రత్యర్ధిగానే కనిపిస్తాడు. ఇప్పుడు తన కన్నా విజయ్ ఎన్నిరెట్లు తక్కువవాడో మీనాకి స్పష్టపరచడం ఘోష్‌కి అవసరం అవుతుంది. అదే అతని జీవితంలో ప్రముఖమైన విషయంగా మారుతుంది. అందుకే విజయ్‌ని పార్టీకి రమ్మంటాడు. భార్య విజయ్ లోని కవిని ప్రేమిస్తుందని అనిపించినప్పుడు, తన చుట్టూ ఎంత మంది కవులు తిరుగుతుంటారో, వారి మధ్య తానో మహరాజుగా ఎలా జీవిస్తున్నాడో అటు విజయ్‌కి ఇటు మీనాకి తెలియజేసి తన అహాన్ని చల్లార్చుకోవడం అతని ప్రాథమిక అవసరంగా మారుతుంది. అందుకే ఆ కవుల మధ్య విజయ్‌ని పనివాడిగా మార్చి తానెంత ఎత్తున ఉన్నాడో భార్యకు తెలియపర్చాలని, విజయ్ స్థానాన్ని అతనికి తెలియజేసి అతని ముందు ఒక మానసిక విజయం పొందాలని తహతహలాడతాడు ఘోష్. ఇదంతా మర్యాద ముసుగులో, స్టేటస్ ముసుగులో జరగిపోతుంది. ఘోష్ ప్రవర్తన హుందాగా ఉంటూ ఆ హుందాతనంలో నించి అతని బలహీత బైటపడుతూ ఉంటుంది. ఎక్కువ సంభాషణలు లేకుండా ఈ షేడ్స్ అన్నిటిని రెహ్మాన్ అభినయంతో రాబట్టుకుంటారు గురుదత్. ప్రపంచంలో విలువలకు, నైతికతకు, భౌతికవాద సిద్ధాంతాలకు నడుమ జరిగే నిరంతర యుద్ధం, ఈ సీన్‌లో రెహ్మాన్ పాత్రలో అత్యద్భుతంగా కనిపిస్తుంది.
ఆ గదిలో ఉన్న కవులలో అన్ని భావాల వారు ఉన్నారు అని చెప్పడానికి ఒక మహ కవి పక్కన కూర్చుని ఉన్న ఓ యువ కవితో ఈ సన్నివేశంలో గురుదత్ ఇలా చెప్పిస్తారు. “దేశాన్ని ముందుకు నడిపించే కవిత్వం ఈ ప్రేమ కవిత్వం కన్నా ఎంతో నయం”. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఆధునిక భావజాలంతో ఉన్న కవులు సాంప్రదాయ కవులకు తమ గొంతుకను వినిపిస్తున్న సందర్భం ఇది. వెంటనే నవ్వుతూ ఘోష్ వారిద్దరితో “ఈ వాదాన్నిఇక్కడితో ఆపేద్దాం. మధ్యం వచ్చింది తీసుకోండి” అంటాడు. ఘోష్ కేవలం ఒక వ్యాపారస్తుడు. అతనికి సమాజం పట్ల బాధ్యత లేదు, గంభీరమైన చర్చలు, సమాజంలో మార్పు, దేశం ఇలాంటి విషయాలపై ఆసక్తి లేదు. అతని దృష్టి అంతా ధనార్జన పట్లే ఉంటుంది. ఏ భావజాలానికి కట్టుపడడు. ఏ భావజాలం తనకు ఆర్థికంగా ఉపయోగపడుతుందో, దాన్ని అప్పటికి తన ఆలోచనగా ప్రకటించుకుంటాడు. అందుకని అందరినీ కలుపుకుంటాడు. వారి మధ్య సహేతుకమైన చర్చలు రావివ్వడు. అలాంటి సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ కవుల దృష్టిని మరలిస్తూ ఉంటాడు. అతనికి కావలసింది మేధో మధనం కాదు, మేధస్సును వ్యాపారంగా మార్చుకోవడం. ఈ సీన్లో ఒక పార్టీలో జరిగే సాధారణ సంభాషణను చూపిస్తూనే, ఆధునికత్వం, సాంప్రదాయం చర్చకు రావలసిన ప్రతి సారి సమాజంలోని బూర్జువా ధోరణి కొన్ని ఆకర్షణలతో వారిని ఎలా దారి మళ్ళించి జరగవలసిన చర్చ జరగకుండా అపగలదో వివరించే సీన్‌గా ఇది అర్థం అవుతుంది.
ముషాయరా మొదలవుతుంది. ఆ యువ కవి ప్రేమలోని బాధను తాను పెదవి విప్పి చెప్పలేకపోతున్న తనలోని వేదనను రెండు షేర్లలో వినిపిస్తాడు. అందరూ వాహ్ వాహ్ అంటూ ఉంటారు. వారిని వింతగా చూస్తాడు విజయ్. వారిలో కవిత్వాన్ని ఆస్వాదించి గలిగిన వారు ఎందరు? అవి పేరు ప్రతిష్ఠలున్న ఒక గొప్ప వాని నోటి నుండి వచ్చిన వాక్యాలు కాబట్టి వారిని మెచ్చుకోవాలి అని పొగుడుతున్న వారెంత మంది అన్న ప్రశ్న కనిపిస్తుంది అతని కళ్ళల్లో. ఆ యువకవి వెనుక ఉన్న మహాకవి
“కామ్ ఆఖిర్ జజ్బాయె-బె-ఇఖ్తియార్ ఆ హీ గయా, దిల్ కుచ్ ఇస్ సూరత్ సే తడపా ఉన్కొ ప్యార్ ఆ హీ గయా”
అని ఒక షేర్ వినిపిస్తారు. దీని అర్థం… “నా మనసులో విషయాన్ని నిర్బయంగా బైటపెట్టుకోవాలనే ఓ పని సులువుగా జరిగిపోయింది. ఈ మనసు ఏన్ని విధాలుగా బాధపడిందంటే, ఆమెకు నాపై ప్రేమ పుట్టుకొచ్చేసింది”
ఇది విన్న విజయ్ నోటిలోనుండి అతని ప్రమేయం లేకుండా ఈ వాక్యం వస్తుంది .. “జానె వొ కైసే లోగ్ థె జిన్కే ప్యార్ కొ ప్యార్ మిలా” (ప్రేమకు ప్రతిగా ప్రేమ అందుకున్న వాళ్ళు ఎంతమంది). విజయ్ లోనుంచి ఆశువుగా కవితం ఎలా పుట్టుకొస్తుందో చూపిస్తూ అతని మనసులోని ఆలోచనలు కవిత్వంగా ఎలా రూపాంతరం చెందుతాయో ప్రత్యక్ష్యంగా చూపిస్తారు గురుదత్. ఒక కవి చెబుతున్న కవితలో ఆయన వాడిన “ప్యార్” అన్న మాటను విన్న వెంటనే విజయ్ లోని కవి హృదయం ఆ వాక్యానికి ప్రతిగా తన ఆలోచనను అనుకోకుండా బైట పెట్టేస్తుంది. కవిత్వాన్ని నర నరాలలో జీర్ణించుకున్న వ్యక్తిలో ఉండవలసిన ఈ సహజత్వం, స్పాంటేనిటీని ఇక్కడ అత్యంత అద్భుతంగా చూపిస్తారు గురుదత్. ఆ కవి పంక్తులకు బదులుగా “జానె వొ కైసే లోగ్ థె జిన్కే ప్యార్ కొ ప్యార్ మిలా” అంటూ తన కవితను జోడిస్తాడు విజయ్. ఇక్కడ విజయ్ వాడిన ‘ప్యార్’ అన్న పదం చూడండి. ఆ మహాకవి కవితకు జవాబుగా సహజమైన కొనసాగింపుగా కనిపిస్తుంది. గురుదత్ దర్శకత్వం చేసిన ప్రతి సినిమాలో మాట, పాట, సీన్లు ఒక అద్భుతమైన కంటిన్యుటీని కలిగి ఉంటాయి. ఇది వారి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. అందుకే ఒక్క మాట, ఒక్క సీన్ కూడా అనవసరం అన్న ఆలోచన ప్రేక్షకులకు ఎక్కడా రానివ్వవు వారి సినిమాలు.
మద్యం గ్లాసులను అందరినీ అందుస్తున్న ఒక పనివాడి నోట ఈ వాక్యం విన్న ఒక అతిథి ఘోష్‌తో ఇలా అంటాడు “అధ్బుతం ఘోష్ గారు, మీ ఇంటి వాతావరణం ఎంత గొప్పగా ఉంది. పనివాళ్లు కూడా కవిత్వం చెబుతారే”. ఇది విన్న మీనా వెంటనే నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అని లేచి వెళ్ళిపోతుంది. విజయ్ నోటి నుండి వచ్చిన అ వాక్యంలోని విషాదం మీనాకు తప్ప మరెవ్వరికి అర్థం అవుతుంది. ప్రేమకు బదులుగా తాను ప్రేమను ఇవ్వలేదని ఆమె మనసుకు తెలుసు. అక్కడ అందరి ముందు విజయ్‌ని ఎదుర్కునే శక్తి ఆమెకు లేదు. మీనా ప్రతిచర్య ద్వారా గురుదత్ తప్పు చేసిన వ్యక్తిలో నిరంతరం మనసుతో జరిగే ద్వంద్వ యుద్ధాన్ని చూపించడం మరిచిపోలేదు.
ఆ అతిథి అన్న మాటకు బదులుగా ఆ మహా కవి “కవిత్వం కేవలం ధనికుల సంపత్తి కాదు” అని ఆ అతిథిని మందలించి విజయ్‌తో “నువ్వేదో చెప్పాలనుకుంటున్నావుగా నాయనా చెప్పు” అని ప్రోత్సహిస్తాడు. ఆ మహా కవి ప్రోత్సాహంతో విజయ్ తన కవిత్వాన్ని పొడిగిస్తాడు. హిందీ సినిమా మనకిచ్చిన విషాద గీతాలలో ఒక గొప్ప గీతం ఆ సన్నివేశంలో ఇలా వస్తుంది.
“జానే వో కైసే లోగ్ థె జిన్కె ప్యార్ కొ ప్యార్ మిలా.. హమ్ నె తొ జబ్ కలియా మాంగీ కాంటో కా హార్ మిలా IIజాII
ఖుషియో కీ మంజిల్ డూండీ థో గమ్ కీ గర్ద్ మిలీ,,, చాహత్ కే నగమే చాహే తో ఆహే సర్ద్ మిలీ
దిల్ కే బొఝ్ కొ దూనా కర్ గయా జొ గం ఖార్ మిలా IIహమ్ నెII
బిఛడ్ గయా.. బిఛడ్ గయా.. బిఛడ్ గయా హర్ సాథీ దేకర్ పల్ దో పల్ కా సాథ్
కిస్కొ ఫుర్సత్ హై జొ థామే దీవానో కా హాథ్, హమ్కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా IIహమ్ నెII
ఇస్కొ హి జీనా కహ్తే హై తో యూ హీ జీ లేంగే , ఉఫ్ న కరెంగే లబ్ సీ లేంగే ఆంసూ పీ లేంగే
గమ్ సే అబ్ ఘబ్రానా కైసా గమ్ సౌ బార్ మిలా IIహమ్ నెII
ఈ పాట చిత్రీకరణ గమనించండి. ప్రతి ఒక్కరి ముఖాన్ని క్లోజ్ అప్ షాట్లలో చూపిస్తూ ఆ పాత్రల వ్యక్తిత్వాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు గురుదత్. విజయ్ లోని బాధ, మీనా లోని అపరాధ భావం, ఘోష్ లోని అహంకారం, అనుమానం, తిరస్కారం కేవలం వారి ముఖకవళికలతో గమనించవచ్చు. గురుదత్ ప్రతి సీన్‌లో ఫోకస్‌లో చూపించే వస్తువులు కూడా సీన్‌కి సంబంధించిన విషయాన్ని వివరిస్తాయి. ఉదాహరణకు ఈ పాటలో లోపలికి వెళ్ళిన మీనా ఓ గుమ్మం దగ్గర నిలబడి విజయ్ కవిత్వాన్ని వింటూ ఉంటుంది. ఆమెను ఘోష్ గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ విజయ్ అత్యంత విషాద భరిత గీతం వినిపిస్తూ ఉంటాడు. మీనా వెనుక డైనింగ్ టేబిల్ దగ్గర ఒక పనివాడు ప్లేట్లు సర్దుతూ కనిపిస్తాడు. అసలు ఆ పనివాడిని ప్రేక్షకులు గమనించే అవకాశంలేదు. కాని గురుదత్ లోని పర్పెక్షనిజాన్ని చూడండి. భోజనం ఏర్పాట్లు చూస్తానని డైనింగ్ రూమ్ లోకి వెళ్ళిన మీనా అ పని చాటున కన్నీళ్ళు కారుస్తూ అపరాధ బావంతో కృంగి పోతూ ఉంటుంది. ఈ పాటకు కావలసిన షాట్ అది. కాని ఆమె వెనుక ఆ ఒక్క క్షణం ప్లేట్లు సర్దుతున్న యూనిఫాంలో ఉన్న బట్లర్ గురుదత్ లోని పర్ఫెక్షనిజానికి గుర్తు. మరి డైనింగ్ హాల్‌లో వాతావరణాన్నియథాతథంగా చూపించడాని అంతటి ట్రాజిక్ సీన్‌లో ఫోకస్ అంతా మీనా, ఘోష్ , విజయ్ పాత్రలపై ఉంటుందని, ప్రేక్షకులు ఆ గదిలో పనివారిని గమనించరని తెలిసినా ఆ సీన్‌లో పని వాని పాత్రను ఆ ఒక్క క్షణం కోసం రప్పిస్తారు గురుదత్. హాలు పక్కన గదిలోకి వెళ్ళిన మీనా వెనుక ఆ పనివాని కదలిక నిడివి స్క్రీన్‌పై కేవలం ఆరు సెకండ్లు ఉంటుంది. కాని మీనా పాత్ర అక్కడ నుండి లేచి వెళ్ళిన కారణాన్ని ఆ విషాద గీతంలో కూడా కంటిన్యుటీగా తీసుకుని, దాన్ని స్క్రీన్‌పై చూపించిన గురుదత్‌లో ఎక్కడా సినిమాతో, షాట్‌తో రాజీ పడని తత్వం కనిపిస్తుంది. ఎవరు చూస్తారులే, ఎవరు గమనిస్తారులే, మనం ఏం చూపిస్తే అది చూస్తారు, అంటూ ప్రేక్షకులను దద్దమ్మలుగా ఎంచరు గురుదత్. ఒక షాట్‌లో ఏం ఉండాలో అది ఉండి తీరాలి అన్నది ఆయన మనస్తత్వం. దీన్ని ఎవరికో చూపించడం కోసం తీస్తున్నాను అన్న భావనతో కాకుండా ఒక జీవితాన్ని సృష్టిస్తున్నాను అన్నంత జాగ్రత్తగా సినిమాని మలచుకుంటారు ఆయన.
ఇక ఈ పాటలో మీనా ఒక ఈజీ చెయిర్‌లో ఒక క్షణం కూర్చుంటుంది. తరువాత అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోతుంది. కెమెరా ఫోకస్ ఆ కుర్చీ మీద ఒక్క క్షణం ఉంటుంది. క్రిందకి పైకీ ఊగుతున్న ఆ కుర్చీ మీనాలోని ఆలోచనలకు ప్రతిరూపం, ఆమెలో ద్వైదీభావాన్ని కొత్తగా ఆ కవిత ఆమెలో రేపిన కలవరానికి సూచన. ఆ ఖాళీ కుర్చీని చూపిస్తూ, ఇదే జీవితం అయితే, ఇలా గే బ్రతుకువెళ్ళదీస్తానన్న భావం వున్న చరణం వస్తుంది. ఒక్క క్షణం వరకూ నిండుగా వుంది కుర్చీ..మర్క్షణం ఖాళీ. జీవితమూ అంతే..ఒక్క క్షణం అన్నీ వున్నట్టుంటుంది. మరుక్షణం ఖాళీ కుర్చీ అవుతుంది జీవితం. అనేకానేక ఆలోచనలను రేకెత్తిక్చే చిత్రీకరణ ఇది. ఈ ఊగుతున్న కుర్చీ మీనా మనసును ఎలా ప్రతిబింబిస్తుందో, ఈ పాట తరువాత వచ్చే సీన్‌లో కంటున్యుటీకి ఆ మూడ్‌ని వాడుకుంటారు గురుదత్.
మీనాను గమనిస్తున్న ఘోష్ ఆమె ముఖంపై కన్నీటి చారకలను చూసి నప్పుడు ఆయన కళ్ళల్లో ఓడిపోయిన భావం కనిపిస్తుంది. ఈ పేదవాడు, జీవితంలో అట్టడుగు స్థాయిలో ఉన్నవాడు, ఎవరికీ పనికి రానివాడు అయిన విజయ్ కోసం మీనా చిందించిన ఆ కన్నీటి బోట్టు ఘోష్ ఓటమిని సూచిస్తుంది. తన డబ్బు, అధికారం, పేరు, ప్రతిష్ఠ, ఇవేవి మీనాని పూర్తిగా తనదానిగా చేయలేకపోయాయి. కాని ఒక పాత ప్రేమికుడి కవిత ఆమె కళ్లల్లో నీరు తెప్పించింది. అందులో పశ్చాత్తాపం, బాధని చూసి తట్టుకోగల శక్తి ఆ అహంకార భర్తకు లేదు. అందుకే అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోతాడు.
పాట ప్రారంభంలో ఒక బుక్ షెల్ప్ దగ్గర చేతులు చాచి నిలబడ్డ విజయ్‌ని చూస్తాం అచ్చం శిలువ వేయబడిన జీసస్‌లా కనిపిస్తాడు. మేధావి ప్రపంచం నలిపివేసిన ఒక మానవుడిగా అత్యద్భుతమైన సింబాలిక్ షాట్ ఇది. ఈ ఒక్క షాట్ విజయ్ ఈ సమాజంలో పొందిన అవమానాలను, అతని అసహాయతను చూపిస్తుంది. ఈ పాటలో అక్కడి వ్యక్తుల హావభావాలతోనూ గురుదత్ తాను చెప్పాలనుకున్న భావాన్ని చెప్పుకొస్తారు. “దిల్ కే భోజ్ కో దూనా కర్ గయా జో గం ఖార్ మిలా” (నా వాళ్ళంతా ఈ హృదయ భారాన్ని రెండింతలు చేసినవాళ్ళే, ఖార్ అంటే వాడి అయిన, సూదిలాంటి..గం ఖార్ అంటే అత్యంత తీవ్రమయిన వేదనను, బాధను కలిగించే అని అర్ధం..హృదయ భారాన్ని రెండింతలు చేసే తీవ్రమయిన బాధ లభించింది.) అన్న వాక్యం దగ్గర ఆ గదిలో అతిథులు రెండు అడుగులు ముందుకు వేసి విజయ్ వైపుకు వస్తారు. వారి వైపు నిర్వికారంగా చూసే విజయ్ చూపు గమనించండి. అంటే లోకం తన దగ్గరకు వచ్చినా తనలోని బాధను రెండింతలు చేసింది తప్ప తనకు ఒరిగిందేమి లేదని విజయ్ అంటున్నప్పుడు ఆ లోకానికి ప్రతినిధులుగా అతనివైపుకి రెండు అడుగులు వేసే ఆ అపరిచితులను గమనించండి. గురుదత్ ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రేక్షకుల మనసుకు చేరుతుంది. గురుదత్ దర్శకత్వం వహించిన పాటలను గమనిస్తే ఎక్కడ పాటను షూట్ చేయదలిచారో ఆ ఫ్రేమ్లో ప్రతి వస్తువునూ తన పాటకు ఉపయోగించుకునే నేర్పు కనిపిస్తుంది. అందుకే అతనిలా పాటలను ఎవరూ షూట్ చెయలేదు, చేయలేరు కూడా.
ఇక ఈ పాటకు సాహిర్ రాసిన వాక్యాలు, ఎస్.డీ బర్మన్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాటను స్క్రీన్‌పై చూసిన తరువాత హేమంత్ కుమార్ గానాన్ని ఈ పాట కోసం ఎందుకు ఎస్.డీ బర్మన్ కోరుకున్నారో అర్థం చేసుకోవచ్చు. “చాహత్ కే నగమే” అన్న వాక్యం దగ్గరా, “కిస్కో ఫుర్సత్ హై జో థామే” అనే మరో వాక్యం దగ్గర, “ఉఫ్ న కరేంగే లబ్ సీ లేంగే” అనే మరో వాక్యం దగ్గర, పదాలను గుండె లోతులనుండి పలికిస్తూ హేమంత్ కుమార్ ఆ ప్రత్యేకమైన వాక్యాల దగ్గర పలికించిన విషాదాన్ని అనుభవించిన తరువాత ఆ పదాల దగ్గర గురుదత్ తన ముఖంతో పలికించిన భావాలను మనసుతో ఆస్వాదించాక ఇదెంత అద్భుతమైన గీతమో, స్వయంగా అర్థం చేసుకుంటారు ప్రేక్షకులు. గురుదత్ ముఖంలో విషాదం, కళ్ళల్లో బాధ, పెదవులపై తిరస్కార పూరితమైన నవ్వు..అధ్భుతమయిన నటన అది.
సరే ఇంతటి విషాద గీతాన్ని స్క్రీన్ పై ఇలా చూస్తూ ప్రేక్షకులు ఒక నిశబ్దపు విషాదపు స్థితికి చేరుకున్నాక, పాట చివర్లో ఓ రెండు సెకెండ్ల నిశబ్దం తరువాత భావావేశంతో ఒక అతిథి వాహ్ వాహ్ అని ఆ పాట తనలో రేపిన కలవరాన్ని ప్రకటిస్తాడు. కాని అతని చుట్టూ ఉన్న వారు మౌనంగా నడుచుకుంటూ తమ పనుల్లోకి వెళ్ళిపొతారు. ఆఖరికి ఆక్కడకు వచ్చిన యువకవి, మహాకవి కూడా వెంటనే తమ మాటలలో పడిపోతారు. విజయ్‌ని పట్టించుకునే కళాభిమానులెవ్వరూ అక్కడ ఉండరు. అందరినీ చూస్తూ తాను విజయ్ పాటకు చూపిన ప్రతిచర్య పట్ల తనకే తెలియని అయోమయంలో పడిపోతాడు ఆ అతిథి. అందరూ తన నుండి దూరం వెళ్ళిపోతుంటే చూస్తూ మౌనంగా నిల్చుంటాడు విజయ్. కళాభిమానులం అని చెప్పుకునే వారిలో ఎందరు నిజంగా కవి హృదయాన్ని చూడగలరు? ఒకడెంత గొప్ప కవిత చదివినా, ఆ కవితకు గుర్తింపు పొగడ్త అతని సామాజిక స్థాయిపై, అతని స్నేహాల పై ఆధారపడివుంటుందన్న చేదు నిజాన్ని చెప్పకనే చెప్తుందీ దృశ్యం. అక్కడ గురుదత్ నౌకరు. గొప్ప కవులముందు ఒక నౌకరు ఎంత గొప్ప కవిత్వం చెప్పినా,అది ఎంత మనసుకు తాకేదిగా వున్నా దాన్ని ఆమోదించటం మర్యాద కాదు. ఒక కవి గొప్పతనానికి ఇవీ కొలబద్దలు ఆధునిక సమాజంలో. ఈ పాట తరువాత ఆ గదిలోని వారి స్పందన సినిమా కథకు, విజయ్ పాత్రకు కూడా ఒక కంటిన్యుటీని కలిగిస్తాయి.
గురుదత్ పాటల దర్శకత్వానికి హిందీ సినిమాలో అంత ప్రత్యేకత ఎందుకుందీ? పాటలు తెలియని హాలీవుడ్ వారిని కూడా ఈ పాటలు ఎందుకు ఆకర్షించాయి? భాష, భారతీయ కవిత్వం, అర్థం కాని వారిని కూడా కదిలించిన విషయాలు ఈ సినిమా పాటలలో ఎందుకున్నాయి. ఎందుకు పాశ్చాత్య సినీ విమర్శకులు ‘ప్యాసా’ ను ఒక కవి ఆత్మఘోషగా గుర్తుంచారో అర్థం చేసుకోవడానికి ఈ పాటను ఇలా విశ్లేషించవలసి వచ్చింది.
ఈ పాట తరువాత వచ్చే సీన్ ఘోష్ ఆఫీసులో మొదలవుతుంది. ఈ సీన్‌ను గురుదత్ చాలా గొప్పగా చిత్రించారు. ప్రేమను కాదని డబ్బులో సుఖం ఉందని వెళ్ళిపోయిన మీనా గొప్ప సుఖంగా లేదని ఆమెను ఆ ఇంట్లో కొన్ని క్షణాలు గమనించిన విజయ్‌కి అర్థం అవుతుంది. ఆమెలోని ఒక ద్వంద్వాన్ని గమనిస్తాడు విజయ్. దీన్నే ఊగుతున్న ఒక కుర్చీ నేపథ్యంలో పై పాటలో చూపిస్తారు గురుదత్. దాని తరువాత సీన్‌ను ఆయన ఎంత గొప్పగా నడిపించారో చూడండి.
ఆఫీసులో ఏవో పుస్తకాలను చూస్తూ ఉంటాడు విజయ్. ఆ గదిలోకి మీనా వస్తుంది. “నిన్ను కలవాలని వచ్చాను” అని విజయ్‌తో అంటుంది. “ఇక్కడా” అంటాడు విజయ్. “మిస్టర్ ఘోష్ బోర్డ్ మీటింగ్‌కి వెళ్ళారు” అని చెబుతుంది మీనా.. “నీవు ఇక్కడకు రాకూడదు” అని మీనాతో అంటాడు విజయ్. “ఆ పార్టీ రోజు నుంచి నేను చాలా అలజడికి లోనయ్యాను, నీకు నాపై చాలా ఫిర్యాదులున్నాయి కదా” అడుగుతుంది మీనా. “లేదు మీనా నాకు ఎవరిపై ఏ ఫిర్యాదులు లేవు” అంటాడు విజయ్. “అలాంటప్పుడు ఆ రోజు నువ్వు ఆ విషాద గీతం ఎందుకు వినిపించావు. నాలో నిద్రిస్తున్న భావాలను ఎందుకు మేల్కొలిపావు” అని అడుగుతుంది మీనా. తన పాత ప్రియుడిని చూసిన మీనాకు డబ్బు కోసం ఈ జీవితాన్ని తాను కోరి వరించినా ఇందులో నిజమైన సుఖం లేదన్న విషయం అర్థం అవుతుంది. మళ్ళీ ఆ ప్రేమ వైపుకు ఆమె మనసు పరుగులు పెడుతుంది. విజయ్‌తో సానిహిత్యాన్ని కావాలనే కోరిక ఆమెలో మళ్ళీ మొదలవుతుంది. విజయ్‌ను అందుకే భర్తకు తెలియకుండా కలవాలని వస్తుంది.
మన సమాజంలో చాలా అక్రమ సంబంధాలకు ముందు స్త్రీ పురుషులలో చెలరేగే మానసిక సంఘర్షణ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కోరి వివాహం చేసుకున్న వారు కూడా తమ జీవితాలలో సుఖం లేదని, తాము తలచినట్లు తమ జీవితాలు లేవని ఎప్పుడో ఒకసారి అనిపించినప్పుడు మరో దారిలో ఆ సుఖాన్ని అందుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. తమ పాత ప్రేమికులు కనిపించినప్పుడు వారి జీవితంలో ఏ మాత్రం అలజడి ఉన్నా పాత ప్రేమను మరోసారి అందుకోవాలన్న తపన వారిలో కలగడం సహజం. అయితే అప్పుడు వారు తీసుకునే నిర్ణయం వారి జీవన గతిని మార్చివేస్తుంది. చాలా ఎక్కువ సార్లు ఈ నిర్ణయం ఎవరికీ సుఖాన్ని ఇవ్వకపోగా కొత్త కష్టాలకు కారణం అవుతుంది. ఇక్కడ మనిషి చూపించవలసిన విజ్ఞత, మానసిక స్థిత ప్రజ్ఞతను ఈ సీన్‌లో గొప్పగా చూపిస్తారు గురుదత్.
మీనా మాటలకు “పాత విషయాలను మరచిపో” అని బదులిస్తాడు విజయ్. “మర్చిపోవాలనే ప్రయత్నిస్తున్నాను. నా జీవితాన్ని కొత్త దారిలో నడిపించుకుంటున్నాను. మనసుకు సర్దిచెప్పుకున్నాను. నా మనసును బాధించడానికి ఎందుకు మరోసారి నా జీవితంలోని వచ్చావు” అని అడుగుతుంది మీనా. విజయ్ జీవితంలో నుండి నిష్క్రమించింది తానే అని, అతను తానుగా ఆమె జీవితం నుండి వెళ్ళలేదని, అతను ఏదో ఉద్దేశంతో తిరిగి రాలేదని మీనాకి తెలుసు అయినా తప్పు మరొకరిపై నెట్టడం ద్వారా మనసులోని అపరాధ భారాన్ని కొంత తగ్గించుకోవాలనుకునే ఒక సగటు స్త్రీ ప్రయత్నం ఆమెలో స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ.
“నేను నీ జీవితం నుండి వెళ్ళిపోయింది ఎప్పుడని. నువ్వే నా జీవితం నుంచి వెళ్ళిపోయావు. అది నీ మొదటి తప్పు. దాన్ని సవరించుకోవడానికి ఇప్పుడు మరో తప్పు చేయకు మీనా”. అంటాడు విజయ్. మీనాలో రేగుతున్న కలవరం ఏ దిశగా ఆమెను నెడుతుందో విజయ్ పూర్తిగా అర్థం చేసుకుంటాడు.
దీనికి బదులిస్తూ మీనా “నేను ఏ తప్పూ చేయలేదు. ప్రతి తెలివైన స్త్రీ జీవితంలో ప్రేమ కాకుండా ఇల్లు సౌకర్యాలను కూడా కోరుకుంటుంది. కొంచెం డబ్బు కూడా కోరుకుంటుంది. అవి పొందాలనే నేను”…..
ఆమె మాటను మధ్యలోనే త్రుంచి విజయ్ “మిస్టర్ ఘోష్‌ని వివాహం చేసుకున్నావు. అంటే డబ్బు కోసం ప్రేమను అమ్ముకున్నావు” అంటాడు.
“నా పై తప్పుడు నేరం మోపకు. నీకు నా ప్రేమ దొరికింది. కాని నీవు పేదవాడివి, నిరుద్యోగివి. జీవితంలో కేవలం కవిత్వమే కాదు ప్రేమే కాదు, ఆకలి కూడా ఉంది. నీ కడుపు నీవే నింపుకోలేని పరిస్థితులలో నన్ను పెళ్ళి చేసుకుని నా భారాన్ని మోయగలిగే వాడివా నీవు” అని అడుగుతుంది మీనా.. ఇక్కడ కూడా గమనించండి.. నా ప్రేమ నీకు దొరికింది అన్న మాటను వాడి తన అహాన్ని బైటపెట్టుకుంటుంది. విజయ్‌ని మళ్ళీ కోరుకుంటూ కూడా అతనిపై తన అధిపత్యాన్ని నిలుపుకోవాలనే ప్రయత్నం ఆమెలో కనిపిస్తుంది.
విజయ్ “ఆ అవకాశం నాకు నీవెప్పుడు ఇచ్చావు. మనిషి పై బరువు బాధ్యతలు పడ్డప్పుడు వాటిని మోయడం కూడా నేర్చుకుంటాడు. నిన్ను నీవు మోసగించుకోకు మీనా, నువ్వు ధనాన్ని కోరుకున్నావు. హై సొసయిటీ కోరుకున్నావు. ఈ సమాజంలో పేరు ప్రతిష్ఠ కోరుకున్నావు. ఇవాళ అవన్నీ నీ దగ్గర ఉన్నా అశాంతిగానే జీవిస్తున్నావు. పశ్చాత్తాప పడుతున్నావు. ఎందుకో తెలుసా. నువ్వెప్పుడూ నీ స్వార్థాన్నే ప్రదర్శించావు. నా జీవితంలోనుండి వెళ్ళిపోతూ నా సంతోషం గురించి ఆలోచించలేదు. ఈ రోజు నీ భర్త ఆనందాన్ని దూరం చేయాలనుకుంటున్నావు. జీవితంలో నిజమైన సుఖం ఇతరులను సుఖపెట్టడంలోనే దొరుకుతుంది. ఇది నీకు ఎప్పుడూ అర్థం కాలేదు. అందుకే అశాంతితో మిగిలిపోయావు.” అంటాడు.
భర్తకు తెలియకుండా పాత ప్రేమను వెతుక్కుంటూ మీనా తన దగ్గరకు రావడం వెనుక ఆమె మనసు లోని అయోమయం విజయ్‌కి అర్థం అవుతుంది. ఆలోచన లేకుండా ఆమె చేస్తున్న పనికి తాను తోడుగా నిల్చి తన స్వార్థాన్ని తీర్చుకోవాలనే వ్యక్తి కాడు విజయ్. ప్రేమను ఓ యుద్ధంగా పరిగణిస్తూ, మీనాను ఏ విధంగా నయినా సరే పొంది తన అహాన్ని తీర్చుకునే వ్యక్తి కూడా కాదు. అందుకే ఆ గది తలుపు తీసుకుని బైటకు వస్తాడు. ఎదురుగా ఘోష్ ఉంటాడు. అతని మొహంపై కోపం కనిపిస్తుంది. విజయ్‌తో మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేస్తాడు. మూసిన తలుపుల వెనుక భార్యాభర్తల మధ్య నడిచే సంభాషణ విజయ్‌కి వినిపిస్తూ ఉంటుంది. ఘోష్ కోపంగా “నా భార్యకు ఓ బజారు దానికి తేడా లేకుండా పోయింది” అంటాడు. దానికి మీనా “ఆలోచించి మాట్లాడండి. మా మధ్య ఉన్నది కాస్త పరిచయం మాత్రమే” అంటుంది. అప్పటి దాకా ప్రేమ కోసం, విజయ్ కోసం తపిస్తున్నట్లుగా, విజయ్ కోసం వచ్చిన ఆమె తన భార్య స్థానానికి చేటు కలుగుతుందని అర్థం కాగానే వారి మధ్య ఉన్నది మామూలు స్నేహం అని భర్తతో చెప్పడానికి వెనుకాడదు. తరువాత ఘోష్ ఆమెపై చేయి చేసుకున్నాడని ఆమె అరుపుతో అర్థం అవుతుంది. “నువ్వు నా మాట వినవా ఇప్పుడే అతన్ని ఉద్యోగం నుండి తీసేస్తాను” అని ఘోష్ తన అధికారి స్థానాన్ని ప్రస్తావిస్తాడు. మొదటి నుండి ఘోష్ ప్రతి ఒక్కరితో కేవలం అధికారిగా మాత్రమే మసలడం గమనించవచ్చు. విజయ్‌కి మళ్ళీ తాను నిరుద్యోగిని అయ్యానని అర్థం అవుతుంది. ఈ దృశ్యం దేవదాసులో పెళ్ళికి ముందురాత్రి పార్వతి దేవదాసు గదికి వచ్చిన దృశ్యాన్ని గుర్తుచేస్తుంది. ప్యాసా దేవదాసు సినిమాకి సమాంతరమయిన సినిమా అన్న భావాన్ని తరువాత వచ్చే దృశ్యం స్థిరపరుస్తుంది. ఇక్కడితో ఇంటర్వెల్ ప్రకటిస్తారు. సినిమా ప్రథమార్థం ముగుస్తుంది.
సినిమా రెండవ భాగంలో స్క్రీన్ పై ఒక కారు కనిపిస్తుంది. ప్రేక్షకులకు అప్పటికే పరిచయం అయిన ఆ పార్కు ముందు ఓ కారు ఆగుతుంది. గులాబోని కారులో నుండి తోసి పడేస్తాడు అందులోని వ్యక్తి. ఆమె మత్తులో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. కారు కిటికీ దగ్గరకు వచ్చి తన డబ్బులు తనకివ్వమని లోపల ఉన్నవారిని ఆమె కోపంగా అడుగుతుంది. లోపల వ్యక్తి ఆమెని నెట్టివేస్తూ ఉంటాడు. అంతే కాకుండా పోలీసును పిలుస్తాడు. గోల విన్న ఒక పోలీసు అక్కడకు వస్తాడు. అతన్ని చూసి గులాబో గబగబా వెళ్లిపోతుంది. పోలీసు ఆమెను వెంబడిస్తాడు. ఆమె పరుగెత్తుతూ ఎదురుపడ్డ ఒక వ్యక్తిని పట్టుకుని కాపాడండి అని అర్థిస్తుంది. విజయ్ ఆమెను గుర్తుపడతాడు. గులాబో కూడ అతన్ని చూస్తుంది. ఆ సందర్భంలో అతన్ని కలవడం ఆమెకు ఇబ్బంది కలిగిస్తుంది. మొహంలో ఒక సిగ్గు, బేలతనం కనపడతాయి. అక్కడకి వచ్చిన పోలీసు విజయ్‌ని ఇక్కడకు ఒక అమ్మాయి వచ్చింది చూసారా అని అడుగుతాడు. విజయ్ లేదని చెప్పగా మరి ఈమె ఎవరు అని అన్న పోలీసుకు “నా భార్య” అని బదులిస్తాడు విజయ్. ఆ మాట గులాబోని చాలా కలవరానికి గురి చేస్తుంది. అత్యంత భక్తిభావంతో ఆమె విజయ్‌ని చూస్తుంది. పోలీసు వెళ్ళిపోగానే విజయ్ ఆమెతో ఇక భయం లేదు వెళ్ళు అని తాను మరో వైపుకి వెళ్ళిపోతాడు. ఒక ఇంటి పై భాగంలోకి మెట్లు ఎక్కుతూ వెళతాడు విజయ్. దేవదాసు లో చంద్రముఖి వేశ్య. దేవదాసు ప్రేమవల్ల ఆమె మారుతుంది. దేవదాసుకోసం సర్వం అర్పించేందుకు సిద్ధంగా వుంటుంది. చంద్రముఖి పాత్రకు సమాంతరమయిన పాత్రగా గులాబో ఎదుగుతుందీ సన్నివేశంతో.
గులాబో ఎంతో అభిమానించే వ్యక్తి విజయ్. కాని ఆమె ఒక వేశ్య. అతనిపై ఎంత ప్రేమ ఉన్నా అతనితో జీవితం ఆమె ఊహించను కూడా ఉహించలేని పరిస్థితులలో ఉంటుంది. కాని అనుకోని పరిస్థితులలో విజయ్ నోటి నుండి భార్య అన్న పదం విన్న గులబో మనసులో ఎన్నో భావాలు ఒక్కసారిగా పైకి లేస్తాయి. విజయ్‌పై అమితమైన ప్రేమ, అతని సాంగత్యంలో ఉండిపోవాలనే కోరిక, తాను ఏ మర్యాదస్థులకీ అక్కరలేని వస్తువుననే భావం. వీటిని అధిగమిస్తూ విజయ్ కవి హృదయం, ఆమెను కలవరానికి గురి చేస్తాయి. గులాబో మనసులో విజయ్ పట్ల ఆ క్షణంలో రేగిన భావాన్ని, అతనికి తన జీవితాన్నిఅర్పించుకోవాలనే బలమైన కోరికను గురుదత్ స్క్రీన్‌పై చిత్రించడానికి ఒక మీరా భజనను ఎన్నుకున్నారు. ఆ సమయంలో వీధిలో భజన చేస్తూ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె భజనకు ముందు ఈ సాకీ వినిపిస్తుంది “విరహా కె దుఖరె సహ్-సహ్ కర్ జబ్ రాధె బెసుధ్ హో లీ…తొ ఏక్ దిన్ అప్నె మన్మోహన్ సె జా కర్ యూ బోలీ” (విరహపు దుఖాన్ని భరించి ఇక తాళలేక రాధ ఒక రోజు ఆ మన్మోహనుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంది), “ఆజ్ సజన్ మోహె అంగ్ లగాలో జనం సఫల్ హో జాయే హృదయ్ కీ పీడా దేహ్ కీ అగ్ని సబ్ శీతల్ హో జాయే” (ఈ రోజు ప్రియతమా నీవు నన్ను దగ్గర తీసుకో, నా జీవితం సఫలం అవుతుంది. మనసులోని బాధ, శరీరపు వేడి అన్నీ చల్ల బడతాయి)
ఈ పాటను గీతా దత్ గానం చేసిన విధానం గమనించాలి. ఈ పాట ఆమె స్వరంలో జీవం పోసుకుంటుంది. స్క్రీన్‌పై హీరోయిన్‌గా మొట్టమొదటిసారి కనిపిస్తున్న వహీదా అప్పుడే నటనలో ఇంకా రాటుదేలలేదు. ఈ సన్నివేశంలో ఆమె అమితమైన వేదనను తన ముఖంలో పలికించాలి. అత్యంత క్లిష్టమైన సీన్ ఇది. వహీదాకి చాలా పేరు తీసుకొచ్చిన సీన్. దీని వెనుక నిస్సందేహంగా గీతా దత్ గానం ముఖ్యంగా పని చేసింది. అలాగే గురుదత్ డైరెక్షన్, వీ. కే మూర్తి ఫోటోగ్రఫీ కూడా. ఈ మూడు లేకుండా వహీదాని ఇక్కడ చూస్తే ఆమె వ్యక్తిగతంగా ఈ సీన్‌కి కాంట్రిబ్యూట్ చేసినది చాలా తక్కువ. గీతా దత్ గొంతును మ్యూట్ చేసి కేవలం మహీదా ముఖాన్నే పరిశీలిస్తే ఈ సీన్‌లో ఆ జీవం ఉండదు. ‘ప్యాసా’ లోని ఈ సీన్ చిత్రీకరణ కోసం పని చేసిన వారందరిపై తన గాత్రంతో గీతా దత్ ఆధిపత్యాన్ని పకటించారని అంగీకరించవలసి వస్తుంది.
బెంగాల్‌లో ఇలా వీధుల్లో పాడేవారిని బాఉల్ ఆర్టిస్టులు అంటారు. సూఫీ తత్వాన్ని వైష్ణవాన్ని కలిపి వీరు గానం చేసే భక్తి పాటలకి బెంగాల్ సాంప్రదాయంలో ఒక ముఖ్య స్థానం ఉంది. అయితే ఈ బాఉల్ కళాకారులు చాలా వరకు మగవారు. రవీంద్రనాధ్ టాగోర్‌ని చాలా ప్రభావితం చేసిన ఈ కళాకారుల భజనలలో తాత్వికత అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ తత్వాన్ని పట్టుకుని ఇక్కడ గులాబో మానసిక స్థితికి జోడించి, గులాబో అనే ఒక వేశ్య మనసులోని ప్రేమ భావానికి ఒక ఉన్నత స్థానాన్ని ఆపాదిస్తూ శారీరకంగా మనిషి చేస్తున్న వృత్తి వారి మానసిక పవృత్తికి ఎంత భిన్నంగా ఉండవచ్చో చూపించారు గురుదత్. ఈ పాట చిత్రీకరణలో వాడిన కెమెరా యాంగిల్స్‌ని గమనిస్తే వీ.కే మూర్తి గొప్పతనం అర్థం అవుతుంది.
మీనాతో విజయ్ పాడిన డ్రీం సాంగ్ గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. అందులో మీనా ఎక్కడో చందమామ నుండి అన్నిమెట్లు దిగుతూ వచ్చి ఆడి పాడి చివరకు అంత ఎత్తుకు వెళ్ళిపోతుంది. మీనా విజయ్ కన్నా పై స్థాయి నుండి వచ్చిన స్త్రీ అని చెప్పడం ఇక్కడ గురుదత్ ఉద్దేశం. ఈ పాటలో విజయ్ మెట్లు ఎక్కుతూ తన ఆలోచనలలో తానుంటూ పైకి వెళ్ళిపోతాడు. ఆ భజన బాక్‌గ్రౌండ్‌లో వస్తుండగా గులాబో అతన్ని అనుసరించి ఎన్నో సందిగ్ధాలతో సందేహాలతో అతి కష్టం మీద ఆ మెట్లు ఎక్కి అతని దగ్గరకు చేరుకుంటుంది. కాని అతనికి దగ్గరగా వెళ్లలేకపోతుంది. మీనా ఎన్నో మెట్లు దిగి వచ్చి మళ్ళీ అంతపైకి ఎక్కి వెళ్లిపోతుంది. ఇక్కడ గులాబో విజయ్ కోసం ఏదయినా చేయడానికి సిద్దంగా ఉందన్నడానికి సూచనగా ఆమె ఎంతో కష్టంతో విజయ్ కోసం పైకి వస్తుంది. కాని అతనికి చేరువగా రాలేకపోతుంది. తన స్థితి ఆమెను అతనికి దగ్గరగా వెళ్లనివ్వదు. అతని కోసం ఏమైనా చేసే మనసు ఉన్నా వారి మధ్య నిలిచిన సమాజం అనే అడ్డు పొర ఆమెకు గుర్తుకు వచ్చి దుఖంతో తిరిగి వెళ్ళిపోతుంది. ఆమెలో ఎంత కలవరాన్ని తాను కలిగించానో తెలియక అటుపక్క తిరిగి క్రిందకు చూస్తూ ఉంటాడు విజయ్. ఇక్కడ గులాబో మనస్థితిని ఆమెలోని ఆ సందిగ్దతను వీ.కే.మూర్తి కెమెరా, లైటింగులలో అద్భుతంగా చూపిస్తారు. అందుకే ఇది ఈ సినిమాలోనే ఒక గొప్ప షాట్‌గా కనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ఈ షాట్ కలిగించే భావ ప్రకంపనలు అనుభవించి తీరాలి. చెత్తా చెదారంతో నిండి ఉన్న ఆ మేడ మీద అయన కెమెరా నడుస్తూ ఎంతటి ప్రేమను పండిస్తుందంటే గులాబో మనసులోని బాధతో ప్రేక్షకుల కళ్ళు చెమరుస్తాయి. కన్నీళ్ళతో విజయ్ దగ్గరగా వచ్చి అతని వీపు పై ఒంగి తనకా అర్హత లేదని తలచి గులాబో వెను తిరిగి పరుగెత్తుతుంటే ఆమె కోసం బాధపడని హృదయం ఉండదు.
ఈ సీన్ షూట్ చేసినప్పటి రోజులని గుర్తుకు తెచ్చుకుంటూ వహిదా రెహ్మాన్ నస్రీన్ మున్నీ కబీర్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను ఈ సీన్ సరిగ్గా చేయలేక పోతుంటే గురుదత్ తనను పిలిచి నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అడిగారట. అప్పటికే వహీదా తండ్రి మరణించారు. “మా నాన్న” అన్న వహీదాతో గురుదత్ “అయితే మీ నాన్న నీ ముందు ఉన్నారు. కాని నీవు అతని దగ్గరకు ఎప్పటికీ చేరుకోలేవు. ఆ భావాన్ని నీలో పలికించగలగాలి” అని చెప్పి ఆ సీన్‌లో తన ముఖంపై ఎక్స్‌ప్రెషన్లను పట్టుకోగలిగారని చెప్పుకొచ్చారు. ఏమైనా అనుభవం లేని ఒక నటితో ఇంతటి గంభీరమైన సీన్‌ని ఇంత పర్పెక్ట్‌గా రాబట్టుకోవడం వెనుక దర్శకుని ప్రతిభ ఉంటుందన్నది ఒప్పుకోవలసిన విషయం.
గురుదత్ పర్ఫెక్షనిజానికి ఈ పాట ఇంకో ఉదాహరణ. ఇందులో పాడుతున్న ఆ వీధి గాయని పాత్రకు ఎవరైనా సరిపోవచ్చు. కాని ఆ పాట నేపథ్యం, దాని సాంప్రదాయక గొప్పదనం తెలిసిన వారు ఆ పాటకు కావాలని గురుదత్ బెంగాల్ ప్రాంతానికి చెందిన మాయా దాస్ అనే నటీమణిని ఈ ఒక్క పాట కోసం ఎన్నుకున్నారు. నేటివిటీ దెబ్బతినకుండా ఆ పాట రావాలంటే ఆ తరహా సంగీతానికి అలవాటుపడిన బెంగాల్ ప్రాంతపు నటి అయితేనే తాను అనుకున్నట్లుగా ఆ సీన్‌ని షూట్ చేయగలనని ఆయన అనుకోవడం దీనికి కారణం. గురుదత్ రాజీ పడని దర్శకుడని చెప్పుకోవడానికి మరో ఉదాహరణ మాయా దాస్ ఈ గీతానికి నటించడం.
ఆజ్ సజన్ పాట రచన కానీ, చిత్రీకరణ కానీ అత్యుత్తమ స్థాయిలో వుంటాయి. సాహిర్ ఈ పాటను పరమాద్భుతమయిన రీతిలో రచించాడు. ఇది విరహ గీతం. ఈ గీతాన్ని సాహిర్ శృంగార గీతంలా రచించాడు. విరహిణి తన ప్రియుడికోసం తపిస్తూ పాడిన పాట. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వయించుకుంటే రాధా మాధవుడికోసం గానం చేస్తున్న రసమయ విరహ గీతం. అంటే పైకి శృంగారం వున్నా, అంతర్లీనంగా భక్తుడు భగవంతుడికోసం పడే తపన వుండాలి. అంటే పాట ఒక పొర శృంగారం, మరో పొర, ధార్మికం, ఆధ్యాత్మికం అన్నమాట. దీన్ని సాహిర్ అతి గొప్పగా పాటలో పదాలలో చూపించాడు. ఏ కోణంలోంచి చూస్తే ఆ అర్ధం వస్తుంది.
శుద్ధ హిందీ వాడటం పాటలోని భావానికి ఒక పవిత్రతను ఆపాదిస్తుంది. హృదయ్ కి పీడా, దేహ్ కి అగ్ని అనటంలోనే భౌతికతకు, అభౌతిక భావానికి ముడిపడింది. శీతల్ అన్న పదంతో రెండు భావాలూ మిళితమై ఒక పవిత్ర భావన మనసులో మెదులుతుంది. దాంతో అంగ్ లగాలో అన్న పదం భావం మారిపోతుంది. అంగ్ లగాలో అంటే కేవలం కౌగలింత అన్న అర్ధం పోయి ఒక ఆధ్యాత్మిక భావన, భక్తుడు భగవంతుడిని తనను స్వీకరించమని, కనికరించి తనను దగ్గర తీసుకొమ్మని అభ్యర్ధిస్తున్న భావన కలుగుతంది.
కొన్ని యుగాలనుంచి అభాగిని అయిన నా నయనాలు నిద్రరాక మేల్కొని వున్నాయి, ఎక్కడా హృదయానికి శాంతి లభించటంలేదు, కనుచూపుమేరలో సుఖం లేదు, వెనుక దుఖం పరుగెత్తుతూ వస్తోంది, నీవులేక అంతా శూన్యంగా వుంది..ప్రతి భావం రెండువైపులా పదునైన కత్తిలాంటిది. ప్రేయసి ప్రియుడికోసం ఎదురుచూస్తూ పాడుతోంది, భగవద్దర్శనా తత్పరుడయి దాహార్తుడయిన భక్తుడు ఆయన కోసం తపిస్తూ పాడుతున్న భావనా వస్తోంది. ఎంతా ప్రేమ సుధ వర్షించాలంటే ప్రపంచం జలమయమై పోవాలి..జలమయమంటే..ప్రేమ సుధావర్షజలమయం……యుగ యుగాల దాహార్తి తీరాలి…జనం జనం కీ దాసీ, అంతర్ ఘట్ తక్ ప్యాసీ..వంటి పదాలు సంపూర్ణ సమర్పణను ప్రేమ పిపాస తీవ్రతనూ చూపుతాయి. మన్‌హర్, గిరిధర్ అనటంతోటే పాట స్వరూపం మారిపోయి, అంతర్ ఘట్ తక్ ప్యాసీ అన్న పదం భౌతికతను విసర్జించి ఆధ్యాత్మిక శిఖరాలధిరోహింపచేస్తుంది. అక్కడ గాయని ఆధ్యాత్మిక ప్రేమ దాహం గురించి పాడుతోంది. చిత్రీకరణలో గులాబో పాత్ర ప్రేమ తపన కనిపిస్తుంది. భక్తుడి ప్రేమ, ఆర్తితో సంబంధంలేకుండా వుంటాడు భగవంతుడు. అతడిని ఏవీ అంటవు. నిర్మోహి. గురుదత్ పాత్ర అలాగేవుంటుంది. తన వెనుక ఒక జీవి ప్రేమ వేదనను గ్రహించకుండా వుంటాడు.
ఇక్కడే దర్శకుడి గొప్పతనం తెలిసేది. అత్యంత ఆధ్యాత్మిక భావనలను ప్రదర్శించే పాటను, అత్యద్భుతమయిన రొమాంటిక్ పాటగా చిత్రిస్తూ, ఆ రొమాన్స్ కు ఆధ్యాత్మికపు రంగులద్దుతాడు…ఎంత వివరించినా సంతృప్తి కలగనంత అత్యద్భుతమయిన ఇంటెర్ప్రిటేషన్ ఇస్తాడు గురుదత్ ఈ పాటకు. ఈ సినిమాలో మిగతా పాటలన్నీ ఒక ఎత్తు..ఈ పాట ఒక్కటి ఒక ఎత్తు. వహీదా ముఖంలో ప్రతిఫలించే భావాలు పాటకు ఎరోటిక్ రంగు అద్దితే, లైటింగ్, కెమేరా కోణాలు, పాటలోని భక్తి తాదాత్మ్యతలు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతిని మిగులుస్తాయి. ఒకేసారి ఇలాంటి పరస్పర విభిన్నమయిన భావాలను కలిగించే రీతిలో చిత్రీకరించటం ఈ ఒక్క పాటలోనే చూడవచ్చు. ఇలాంటి పాట, ఇలాంటి చిత్రీకరణ నభూతో నభవిష్యతి…
దీని తరువాత సీన్‌లో రెల్వే యార్డ్ దగ్గర, సముద్రం పక్కన బెంచీపై పడుకున్న విజయ్ నిద్ర లేస్తాడు. రోడ్డు పక్కన నీళ్ళ పంపు దగ్గరకు వచ్చి నీళ్లు తాగాలనుకుంటాడు. కాని నీళ్ళు రావు. మీనా తన కారులో వెళుతూ ఆ పక్కన రోడ్డుపై కనిపిస్తుంది. డ్రైవర్ కారు ఆపుతాడు. అటు పక్కన ఉన్న విజయ్‌ని మీనా చూస్తుంది. విజయ్ ఆమె వైపు చూసినా ఆమె దగ్గరకు వెళ్లడు. ఇద్దరి మధ్య ఉన్న రైల్వే లైనుపై ట్రెయిన్ వెళ్ళిపోతుంది. విజయ్ మీనా ల మధ్య ఇక ఎప్పటికీ కలవలేని దూరం ఏర్పడిందని. రైల్వే లైనులా వారెంత ముందుకు సాగినా కలవడం కుదరదనే అర్థం వస్తుంది ఈ సీన్‌లో. నీళ్ళు రాని పంపు దగ్గర దాహం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న విజయ్‌ని ఈ సీన్‌లో చూపిస్తూ అంతకు ముందు ప్రేమను అందివ్వలేని స్త్రీ దగ్గర ప్రేమను కోరి ఎప్పటికీ దాహంతో రగిలిపోయే వ్యక్తిగా విజయ్ మిగిలిపోయాడనే అర్థం కూడా ఈ సీన్లో ఎక్కడా మాటలు లేకుండా చూపించగలిగారు గురుదత్. సినిమా పేరు ‘ప్యాసా’ని విడమర్చి చెప్పిన సీన్ ఇది.
గులాబో ఒక బెంచిపై పార్కులో కూర్చుని ఉంటుంది. ఏదో ఆలోచనలలో ఉన్న ఆమె వద్దకు ఒక బ్రోకరు వచ్చి ఒక కొత్త విటుడు వచ్చాడని ఆమె కోసం అడిగాడని చెబుతాడు. కాని గులాబో అతనితో వెళ్లడానికి ఒప్పుకోదు. ఆమెను బలవంతంగా లాక్కువెళ్ళాలని ప్రయత్నిస్తున్న అతన్ని ఆమె ఎదిరిస్తుంది. అక్కడికి వచ్చిన సత్తార్ ఆ బ్రోకరుపై చేయి చేసుకుని గులాబోని విడిపిస్తాడు. ఆమె పరద్యానాన్ని గమనించిన సత్తార్ ఆమె ఎవరితోనన్నా ప్రేమలో పడిందా అని అడుగుతాడు. గులాబో విజయ్ పేరు చెప్పినప్పుడు తన స్నేహితుడు కూడా విజయ్ అని అతనూ ఒక కవి అని చెప్పిన సత్తర్ కి గులాబోకి ఆ ఇద్దరూ ఒకరే అయి ఉండవచ్చనే ఆలోచన వస్తుంది. “ఈమె నా భార్య” అన్న ఒక్క మాట విజయ్ నోటి వెంట అనుకోకుండా వచ్చినప్పుడు అతని ప్రేమలో అప్పటికే మునిగి ఉన్న గులాబో విజయ్‌కి తన మనసులో పూర్తిగా స్థానం ఇస్తూ అతని మనిషిగా మిగిలిపోవడానికి సిద్ధపడింది అన్న విషయాన్ని వివరించిన సీన్ ఇది.
విజయ్ ఇద్దరు అన్నలు సముద్రపు ఒడ్డున కనిపిస్తారు. అక్కడే మెట్లపై ఉన్న విజయ్ వారిని చూస్తాడు. సముద్ర స్నానం చేసున్న వారిని చూసిన విజయ్ మనసు కీడుని శంకిస్తుంది. వారు పైకి వచ్చాక విజయ్ వాళ్ళ దగ్గ్రరకు వెళ్ళి అందరూ బావున్నారా మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. కాని వాళ్ళు విజయ్‌తో మాట్లాడడానికి ఇష్టపడరు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే తన తల్లి మరణించిందని విజయ్‌కి అర్థం అవుతుంది. నీతో మాకేమీ సంబంధం లేదు మమ్మలను అన్నలని పిలవకు అని చీత్కరిస్తూ వాళ్లు వెళ్ళిపోతారు. తల్లి మరణం గురించి విన్న విజయ్‌కు చివరిసారి తాను తల్లిని కలిసినప్పుడు నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళు బాబు అని బాధగా అడిగిన తల్లి మాట గుర్తుకు వస్తుంది. దుఖంతో తల్లడిల్లిపోతాడు విజయ్.
ఒక గదిలో విజయ్ స్నేహితుడు శ్యాం మరి కొందరు పేకాడుతూ ఉంటారు. వారెవ్వరికి ఒక మూల కూర్చుని కుమిలిపోతున్న విజయ్ గురించి తెలుసుకోవాలని ఉండదు. వారి మధ్య ఉన్న ఓ వేశ్య విజయ్‌కి మందు ఇస్తుంది. విజయ్ పట్టించుకోకపోతే స్నేహితులు గేలి చేస్తారు. సీసా ఎత్తి పెట్టి తాగేస్తాడు విజయ్. నవ్వుతూ వారంతా నువెప్పటినుండి మందు మొదలుపెట్టావు అన్నప్పుడు విజయ్ దుఖం ఇలా కవిత రూపంలో వస్తుంది.
“గమ్ ఇస్ కదర్ బఢే కి మై ఘబరా కె పీ గయా. ఇస్ దిల్ కీ బేబసీ పె తరస్ ఖాకె పీ గయా
ఠుకరా రహా థా ముఝకొ బడీ దెర్ సె జహా.. మై ఆజ్ సబ్ జహాన్ కొ ఠుకరా కె పీ గయా….
(బాధ ఎంతగా పెరిగిందంటే నేను భయపడి తాగేసాను. ఈ మనసు అసహాయతకు జాలి పడి తాగేసాను
చాలా రోజులుగా ఈ ప్రపంచం నన్ను తిరస్కరిస్తుంది, ఈ రోజు ఈ ప్రపంచాన్ని తిరస్కరించి నేను తాగేసాను)
తల్లి మరణంతో విజయ్‌కు తన జీవితం పట్ల విరక్తి కలుగుతుంది. ప్రపంచాన్ని త్యజించాలనే కోరిక ఆ విరక్తిలో కనిపిస్తుంది. ఆత్మహత్య దిశగా అతని మనసు మళ్ళుతుందన్న దానికి సూచనగా ఆ పై కవితను తీసుకోవాలి.
To be continued…