[dropcap]ఒ[/dropcap]ట్టులాంటి మాటొకటి
ఒడ్డులా…….
గంటలుకొద్ది తడుస్తూ
రోజులకొద్ది మునుగుతూ
కలలకొద్ది కొట్టుకుపోయే ఊహ
బతుకులో మౌనతరంగం.
ఆశలెంతగా పెనుగులాడినా
జిత్తులమారుల ఎత్తుపల్లాలకు
పట్టుదొరక్క పల్టీకొట్టిన సమస్య
ఉరికే నదిగా మారి
మలుపుకో రూపంతో గర్జిస్తుంది.
దూరాన పాత రోజొకటి
బిగ్గరగా పెట్టిన కేకను
చూపులందుకునేలోపే
సుడికి ముడిపడి
బంధ ప్రవాహవేగం హోరెత్తిస్తూ
బొట్టు బొట్టుగా పెరిగే బాధను…
ఒకరిలో ఒకరు మునిగి
ఇద్దరూ తేలిగ్గా తేలే
ఒట్టులాంటి మాటొకటి
ఒడ్డులా మారి
బయటేస్తే బాగుండు….