సాఫల్యం-26

5
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సిం[/dropcap]గిల్‌ రోడ్డు. గోతులతో నిండి భయంకరంగా ఉంది. క్రమంగా బస్సు క్రిక్కిరిసిపోయింది. కండక్టరే స్వయంగా టాపు మీదికి ఎక్కమని చెబుతున్నాడు. దొర్నిపాడు, కంపమళ్ల, హరివరం, భీముని పాడు, ఇలా పల్లెల్ను దాటుకుంటూ కోవెల కుంట్ల చేరాడానికి గంట పైగా పట్టింది.

కోవెల కుంట్ల తాలూకా కేంద్రమయినా పల్లెటూరులాగే ఉంది. డోన్‌తో పోల్చుకున్నాడు. ఎంతయినా జాతీయ రహదారి మీద ఉన్న ఊర్లు, రైలు మార్గంలో ఉన్న ఊర్ల తీరే వేరనుకున్నాడు. దాదాపు ఒంటిగంట కావస్తుంది. సరైన హోటలు ఏదీ లేదు. ఒక పాక హోటల్లో ఉగ్గాని, బజ్జీ తిని, నిమ్మకాయ సోడా తాగాడు.

సంజామల బస్సు రెండు గంటలకుందని చెప్పారు. అది రెండున్నర వరకు రాలేదు. ఒక పాన్‌ షాపు ముందున్న బెంచీ మీద కూర్చుని ఎదురు చూశాడు. సంజామల ప్రయాణం ఇంకా ఘోరంగా ఉంది. దాదాపు నాలుగు దాటుతూ ఉండగా ‘సంజామల’ లో దిగాడు. ఆ వూరు మరీ చిన్నది. బస్సు అతన్ని దింపి వెళ్లిపోయింది.

“ఎవరింటికి బోవాల?” అనడిగాడొకాయన ఇంటి అరుగు మీద నుంచి.

“హైస్కూల్లో టీచరుగా పనిచేస్తారు మహమ్మదాజం సారు వాళ్లింటికి” అన్నాడు.

“కూసింత నిలబడు. పొట్టెగాన్ని పంపిచ్చా. ఇల్లు సూపిచ్చాడు” అని

“సాదేవా! ఓ సాదేవా” అని పిలిచాడు. లోపల్నుంచి పన్నెండేళ్ల పిల్లవాడొకడు బయటకొచ్చాడు.

“ఏంది నాయనా, ఎందుకట్టా అరుచ్చాండావు?” అన్నాడు

“ఇగో ఈ సారుకంట ఈ మజ్జన సాలోల్ల గేరిలో బాడెక్కు దిగినాడు సూడు తురకాయన. మీ బల్లోనే గదా పన్జేచ్చాడు. ఆయన ఇల్లు సూపిచ్చిరాపో”

పిల్లవాడు పతంజలి దగ్గరకొచ్చి “పోదాం పా సార్‌” అన్నాడు. వద్దన్నా వినకుండా బ్యాగు భుజానికెత్తుకున్నాడు.

“యాన్నించొచ్చాండావుసార్‌. తురకసారు నీకేంగావల్ల” అని అడిగాడు.

“నేను ఆయన స్టూడెంట్‌ను. వెల్దుర్తి నుండి వస్తున్నా”

“మరి గుండు చేపిచ్చుకుండావే. యాగంటికి బోయింటివా, ఓలం బోయింటివా?”

“అహోబలానికే”

“సారు శానామంచోడు. నేను ఎనిమిది జదువుతాండా. మాకు సోషలు చెప్పేది ఆయప్పే. ఇప్పుడే బడి నుండి వస్తి. ఈ లోపల నీవొస్తివి”

సాలెవారి వీధి వచ్చింది. వీధంతా మురికిగా ఉంది. ఒక యిల్లు మాత్రం కొంచెం బాగుంది. మట్టి మిద్దె. ఇంటి ముందు రెండు అరుగులు, తలుపుల కిరువైపులా ఉన్నాయి. వాటి మీద దూలాలపై ‘వారపాగు’ దించారు. ఇంటిలోకి ఎండ, వాన పడకుండా పైకప్పు నుండి ఏటవాలుగా బొంగులు వేసి, వాటిమీద వెదురు తడకలు బిగించి, దానిమీద బోదె గడ్డి కప్పుతారు. అదే ‘వారపాగు’.

“ఇదే సారోళ్లయిల్లు” అని చెప్పి బ్యాగు అరుగు మీద పెట్టి వెళ్లిపోయినాడు సహదేవుడు. మెయిన్‌ తలుపు దగ్గర నిలబడి “సార్‌, సార్‌,” అని పిల్చాడు పతంజలి. లోపల్నించి సారు భార్య వచ్చింది. ఒకలంగా లాంటి దానిమీద షర్టు లాంటిది వేసుకుందామె. పైన దుపట్టా కప్పుకుంది. పతంజలిని చూసి గుర్తుపట్టింది.

“ఆవ్‌ బేటా, కైసే ఆనా హువా అందర్‌ ఆవ్‌” అంటూ లోపలికి తీసుకొని వెళ్లింది.

“మాసారు లేరా అమ్మా” అని అడిగాడామెను.

“ఇస్కూల్‌ సే నహీ ఆయా. అభీ ఆతాహై” అని గాద్రెజ్‌ ఛెయిర్‌ వాల్చి కూర్చోమని చెప్పింది.

“బానో, బానో పానీ లావ్‌ బేటీ మహిమాన్‌ ఆయే హై” అని కేకవేసింది. పన్నెండేళ్ల అమ్మాయి సల్వార్‌ కమీజ్‌ వేసుకొని స్టీలు గ్లాసుతో నీళ్లు తెచ్చింది. పతంజలిని చూసి నవ్వింది. వెల్దుర్తిలో తరుచుగా సారు యింటికి వెళ్లేవాడు గాబట్టి గుర్తుందా పిల్లకు. ఆ అమ్మాయి వెనుకనే ఐదేళ్ల పిల్లవాడొచ్చాడు. పిల్లలిద్దరూ కడిగిన ముత్యాల్లా ఉన్నారు.

పతంజలి నీళ్లు తాగి, ఆ పిల్లవాడిని దగ్గరకు పిలిచాడు.

“నామ్‌ క్యాహై తుమ్హారా?” అనడిగాడు.

“సయ్యద్‌ ఇనాయతుల్లా బాషా” అన్నాడు వాడు.

“మేరా నామ్‌ పజిలత్‌ బానో” అని చెప్పిందా అమ్మాయి అడక్కుండానే.

‘వీళ్లకు కనీసం బిస్కెట్‌ పాకెట్టయినా తేకపోతినే’ అనుకున్నాడు పతంజలి. కనీసం ఒక కిరణాషాపయినా కపడలేదా ఊళ్లో.

“నజ్‌దీక్‌ మే కోయీ దుకాన్‌ హై ఇదర్‌?” అని అడిగాడు.

“మై దిఖా ఊంగా” అన్నాడు భాషా.

ఇద్దరూ బయటకు వెళ్లారు. పెద్ద వీధిలో ఒక షాపు ఉంది. అందులో గ్లూకోజ్‌ బిస్కెట్‌ పాకెట్లు రెండు తీసుకున్నాడు. సీసాల్లో ‘ప్యారీస్‌’ చాక్లెట్లున్నాయి. అవి ఒక రూపాయవి కట్టిమ్మన్నాడు.

తీసుకొని యింటికొచ్చారు. సారు భార్యకిచ్చాడవి. “ఏ సబ్‌ క్యోం లాయా బేటా!” అంటూ నొచ్చుకుందామె.

“బచ్చోంకేలియే మా” అన్నాడు వినయంగా.

ఇల్లంతా పరిశీలించాడు. హాలు మధ్యలో కర్ర స్తంభాలు పై కప్పుకు దన్నుగా ఉన్నాయి. సగం హాలంతా ఒక అరుగు ఆక్రమించుకొని ఉంది. మెయిన్‌ తలుపులకు ప్రక్కన, బైట అరుగుమీదికి తెరుచుకొని ఒక చిన్న కిటికీ ఉంది. ద్వారానికి పాత చీరను కర్టెన్‌గా మార్చి కట్టారు. కిటికీకి సారు లుంగీని చింపి తెరగా చేశారు.

వెనక పెరడు కనపడుతూంది. హిండాలియం తీగ మీద బట్టలు ఆరేసి ఉన్నాయి. హాలు చివర ఒక గది మధ్యలో ఒక గది ఉన్నాయి. బహుశా ఒకటి బెడ్‌రూం, ఒకటి వంటిల్లు అయి ఉంటుందనుకున్నాడు.

పదినిమిషాల్లో సారు స్కూలు నుంచి వచ్చాడు. పతంజలిని చూసి, “వాటె ప్లెజంట్‌ సర్‌ప్రైజ్‌! పతంజలీ! ఎంత సేపయింది వచ్చి?” అని దగ్గరకు వచ్చాడు.

పతంజలి ముందుగా సారుకు పాదాభివందనం చేశాడు. అతన్ని పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడాయన.

“జీతే రహో బేటా” అని ఆశీర్వదించాడు. ఆయన పరిష్వంగం వెచ్చగా, ఆప్యాయతనంతా రంగరించినట్లుగా ఉంది.

సారు ఒక కుర్చీలో కూర్చుంటే పతంజలి దగ్గరగా క్రింద కూర్చున్నాడు. “ఫరవాలేదు పైన కూర్చో”మని ఎంత చెప్పినా వినలేదు.

‘విద్యా దదాతువినయమ్‌’ అని జ్ఞానం ఎంత సంపాదించినా గురువును గౌరవించడం ఆర్ష ధర్మం.

“ఏమిటి స్వామీ! కనీసం జాబైనా రాయలేదు. ఏదైనా పుణ్యక్షేత్రం నుండి వస్తున్నావా?”

“అవునుసార్‌. అహోబిలం వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, మీరు దగ్గరలో ఉన్నారు కదా చూసి పోదామని వచ్చాను”

“గుడ్‌ మంచిపని చేశావు. ఉండు కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని వస్తా” అని సారు రూంలోకి వెళ్లాడు.

లుంగీ, బనియన్‌ వేసుకొని భుజాన టవలుతో పెరట్లోకి వెళ్లాడు.

వచ్చి పతంజలి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. “ఈ ఊర్లో నీటికి కటకటగా ఉంది స్వామీ. ఈ వీధి కంతా కలిపి ఒక్క బోరింగే ఆధారం. ఆమె, పాప బిందెలతో బోరింగ్‌ దగ్గర నింపుకొని వచ్చి ‘అవుత్‌ ఖానా’ (నీళ్లు తొట్టి) లో పోస్తారు. రోజుకు మూడుసార్లు తాగే నీరు మాత్రం రెండు కి.మీ. దూరంలో పారే కుందు (కుముద్వతి) ఏటినుండి పీపా తోలుకొని ఒకాయన తెస్తాడు. అవి వంటకు తాగడానికి రెండు బిందెలు పట్టుకుంటాము. కూరగాయలు కూడ బాగా దొరకవు. గోంగూర, వంకాయలు, బుడంకాయులు, రామ్ములగ (టమోట) కాయలు ఒక చెట్టు క్రింద అమ్ముతారు. వారానికొకసారి మంగళవారం సంత జరుగుతుంది. ఆరోజు మాత్రం పచ్చిమిరప, క్యాబేజి, ఉర్లగడ్డ ఉల్లిపాయలాంటివి దొరుకుతాయి. మా అదృష్టం బాగుండి ఈమాత్రం యిల్లు దొరికింది” అన్నాడు.

“ఇక్కడి చాలామంది టీచర్లు ఇతర ఉద్యోగులు కోవెల కుంట్లలోనో తాడిపత్రిలోనో కాపురముండి రోజూ తిరుగుతారు. అది నా సిద్ధాంతానికి వ్యతిరేకం. పని చేసే ఊర్లోనే ఉండాలనేది నా నియమం. ప్రభుత్వం నియమం కూడ అదే అయినా, చాలామంది పాటించరు. సిద్ధాంతం మాట ప్రక్కన బెడితే బస్సులు తక్కువ. సమయానికి రావు, విపరీతమైన రద్దీ. చాలా శ్రమతో కూడిన వ్యవహారం. అంత శ్రమపడి పిల్లలకు పాఠాలేం చెపుతాం?”

స్వచ్ఛమయిన తెలుగులో మాట్లాడతాడాయన. సారు భార్య రెండు ప్లేట్లలో బొరుగులు మిక్చర్‌ తెచ్చి యిద్దరికీ ఇచ్చింది. కొంచెం పోపు పెట్టి, పసుపు కలిపి, పుట్నాల పప్పు బొరుగులు (మరమరాలు) వేసి కొద్దిగా కారం కలిపి, నిమ్మకాయపిండి చేసింది.

“తీసుకో స్వామీ!” అన్నాడాయన.

తిన్న తర్వాత, మంచి నీళ్లు తెచ్చిచ్చాడు తన చిట్టి చేతులతో బాషా. తర్వాత ‘టీ’ వచ్చింది. అల్లం దంచి వేసి మరిగించినట్లుంది. చాలా రుచిగా ఉంది.

అప్పటికి ఆరు కావస్తూంది. సారు భార్య, కూతురు బిందెలు చంకన పెట్టుకుని నీళ్లకు బయలు దేరారు.

“అమ్మా, మీరుండండి. నేను తెస్తాను” అంటూ ఆమె దగ్గరి బిందె తీసుకొని అమ్మాయితో పాటు వెళ్లాడు బోరింగ్‌ దగ్గరకు.

కొందరాడవాళ్లు అప్పటికే ఉన్నారు. కాసేపు వేచి ఉండి తమ వంతు వచ్చిన తర్వాత పతంజలి బోరింగ్‌ కొడుతూంటే బానో మూడు బిందెలు పట్టింది. మూడో బిందె నిండే లోపల భాషా ఖాళీ ప్లాస్టిక్‌ బకెట్లు రెండు తెచ్చాడు. అవి కూడ నింపుకున్నారు.

బిందెలు పెద్దవే అయినా ప్లాస్టిక్‌వి కావడం వల్ల బరువు తక్కువగా ఉన్నాయి. ఒక బిందె భుజానికెత్తుకుని, మరొక చేత్తో బకెట్‌ పట్టుకొని పతంజలి మోసుకుంటూ వెళ్లి నీళ్లతొట్టిలో పోసి వచ్చాడు. మళ్లీ వచ్చి ఒక బిందె బక్కెట్‌ మోసుకెళ్లాడు. బానో మిగిలిన బిందె మోసుకొచ్చింది. అంతకుముందే మూడవ వంతు నీరుండటం వల్ల తొట్టి నిండిపోయి. ఒక బక్కెట్‌ బిందె నీరు ప్రక్కన పెట్టారు.

“నీకి అల్వాటు లేని పని. ఎందుకు బేటా కష్టం పడినావు?” అన్నదామె.

“వో ఖేత్‌ మే కామ్‌ కర్తాహే. యే కామ్‌ ఆసన్‌ సే కర్‌ సకతాహై” అన్నాడు సారు నవ్వుతూ ఆమెతో

“బమ్మెర పోతన లాగా కర్షక పండితుడివి కావాలని నా ఆశీస్సు” అన్నాడు.

“క్యా బోలే?” అన్నదామె.

“హమారా తెలుగూ మే పోతన బోల్‌ కే ఏక్‌ మహాన్‌ కవీ హై. వే ఖేతీ కరకే జీవన్‌ కర్తథా. పతంజలీ భీ ఐసా బన్‌నా ఐసా ఆశీర్వాద్‌ దే రహాహు”

“మాలూమ్‌ హువా” అన్నదామె సంతోషంగా.

“ఏమిటంటున్నారు?” అని భార్య అడిగితే సగటు భర్తలాగా “నీకు తెలియదులే” అని తీసిపారేయకుండా ఆమెకు చక్కగా వివరించిన సారు సంస్కారానికి మనస్సులోనే ప్రశంసలర్పించాడు పతంజలి. ఆయన ‘హమారా తెలుగు’ అనడం మనస్సుకు హత్తుకుంది. తాను బోరింగ్‌ నుండి నీళ్లు కొట్టి తెస్తూంటే వారించకపోవడం, దాన్ని అతి సహజంగా స్వీకరించడం అతనికి ఎంతో తృప్తినిచ్చింది.

“పద స్వామీ, అట్లా బయటకు పోయివద్దాం” అంటూ ఒక చేతి సంచీ తీసుకొని, షర్టు వేసుకొని వచ్చాడు సారు. లుంగీతోనే ఉన్నాడు. ఇద్దరూ నడుచుకుంటూ పెద్ద వీధిలో ఒక పెద్ద చెట్టు క్రిందికి వచ్చారు. ఒక రావి చెట్టు ఒక వేప చెట్టు కలిపి ఎప్పుడో దశాబ్దాల క్రిందట నాటినట్లున్నారు. మహా వృక్షాలుగా పెరిగాయి. వాటి మొదట్లో నాగ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. చెట్టు చుట్టూ చాలా పెద్ద చప్టా కట్టారు. ఒక మూల కూరగాయలు అమ్ముతుందొకామె. కొందరు కట్టమీద బారాకట్ట, పులిమేక, ఆటలు ఆడుకుంటున్నారు. ఆ ఆటలలో కావలసిన ‘డయాగ్రమ్స్‌’ కట్టమీద నాప బండలమీద చెక్కి వున్నాయి.

సారును చూసి అక్కడున్న వారంతా లేచి నిలబడి నమస్కరించారు. వారిని కూర్చోమని చెప్పి కూరగాయల దగ్గరకు వెళ్లాడాయన. “రాండి చార్‌” అంటూ ఆహ్వానించిందామె. ఆమె దగ్గర కొంచెం పండిపోయి ముదిరిన వంకాయలున్నాయి. పుండు కూర కట్టలున్నాయి. గోంగూరను కర్నూలు జిల్లాలో ‘పుండుకూర’ అంటారు. గోగు విత్తనాలు వేస్తే, “పుండ్లు జల్లినాం” అంటారు. కొంచెం వాడిన మటిక్కాయలు, బుడంకాయలు (పుల్ల దోసకాయలు)న్నాయి.

పావుకేజీ వంకాయలు, నాలుగు కట్టలు గోంగూర, అరకేజీ మటిక్కాయలు తీసుకొని రెండు రూపాయల నోటిచ్చాడామెకు.

“చిల్లర యాడుండాది చార్‌ మల్లా ఇచ్చువులే. ముప్పావలా ఐనాది. నాకు మతికుంటాదిలే” అన్నదామె.

అక్కడున్న ఒక పిల్లవాడు వచ్చి అటెన్షన్‌లో నిలబడి సెల్యూట్‌ లాగా చేస్తూ “గుడ్‌ మార్నింగ్‌ సార్‌! అన్నాడు. వెంటనే నాలుక కర్చుకొని, “తప్పయినాది. గుడీవినింగ్‌ సార్‌” అన్నాడు. సారు చేతిలో కూరగాయల సంచి చూచి, “ఇంటికాడ నేనిచ్చొచ్చా యీ సార్‌” అని తీసుకున్నాడు.

“మనం ఏటివరకూ నడుద్దాం. బాగుంటుంది.” అన్నాడాయన. పున్నమికి ముందు రోజులేమో వెన్నెల వెలుగులో పరిసరాలన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇద్దరూ నడవటం ప్రారంభించారు.

“బి.ఎ. పరీక్షలన్నీ బాగా వ్రాశాను సార్‌. ఈ నెలలోనే రిజల్టు రావొచ్చు. మీకు చూపిద్దామని క్వశ్చన్‌ పేపర్లు కూడ తెచ్చాను” అన్నాడు శిష్యుడు.

“నీవు బాగా రాసి ఉంటావని నాకు తెలుసు. ఇంటికి పోయి చూద్దాం. మరి భవిష్యత్‌ కార్యక్రమ్రం?”

“కాంపిటీటివ్‌ పరీక్షలకు కడదామని”

“గుడ్‌. ‘కాంపిటీషన్‌ సక్సెస్‌’ అనే మంత్లీ ఉంది. చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానికి చందా కట్టు. లేదా కర్నూలుకు వెళ్లినపుడు ‘లక్ష్మీనారాయణ బుక్‌ సెల్లర్స్‌’ లో దొరుకుతుంది. బస్టాండు దగ్గరే. అజంతా హోటలు ప్రక్క సందులో ఉంటుంది.”

“తెలుసు సార్‌”

“వాళ్ల దగ్గరే టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ పుస్తకాలు దొరుకుతాయి చూడు. ఇంగ్లీషు కోసం హరిమోహన్‌ ప్రసాద్‌ వ్రాసిన ‘ఆబ్జెక్టివ్‌ ఇంగ్లీష్‌’ అనే బుక్కు కొనుక్కో. జి.కె.కు కాంపిటేషన్‌ సక్సెస్‌ సరిపోదు. హిందూ రోజూ చదివి, నీవై ముఖ్యమైన ఈవెంట్స్‌, జాతీయ అంతర్జాతీయ స్థాయి డిగ్నిటరీస్‌, డౌట్స్‌, ఒక డైరీ మెయిన్‌టెయిన్‌ చెయ్యి. ముందు రిటన్‌ టెస్ట్‌లో సెలెక్టయితే ఇంటర్వూ సంగతి తర్వాత చూడవచ్చు.”

‘కాంపిటీషన్‌ సక్సెస్‌’ చదవమని రామ్మూర్తి బావ చెప్పింది గుర్తుకు వచ్చింది.

“అలాగే సార్‌ తప్పకుండా మీరు చెప్పివన్నీ తీసుకుంటాను”

“నీకు ఒక ‘న్యూమరికల్‌’ మాత్రమే కష్టం అవుతుందనుకుంటా కాంపిటేటివ్‌ పరీక్షలలో ప్రశ్నలు క్లిష్టంగా ఉండవు గాని ‘టైం అండ్‌ అక్యురసీ’ అనే సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుంటే, విజయం తథ్యం. ఇంగ్లీషు సరే నీకు కేక్‌ వాకే”

కాంపిటీటివ్‌ పరీక్షల పట్ల సారుకున్న అవగాహనకు అచ్చెరువొందాడు పతంజలి.

“దాదాపు ఇరవై ఏళ్ల పై మాట. డిగ్రీ చేశాను. ఇంకా బి.ఎడ్‌ అవలేదు. యూపియస్‌సి పరీక్ష ‘అసిస్టెంట్‌ గ్రేడ్‌’ పాసయ్యాను. ఇంటర్వ్యూలో కూడ నెగ్గాను. పోస్టింగ్‌ ఎక్కడో ఒరిస్సాలో యిచ్చారు. మా బాబా వద్దన్నారు. అప్పటికింకా ఇంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. నాకు కూడ టీచింగ్‌ ప్రొఫెషన్‌ అంటే ఇష్టం. అందుకే బి.ఎడ్‌ చేసి. జెడ్‌.పి.లో స్కూల్‌ అసిస్టెంటుగా చేరాను. ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ఆ రోజు అందులో చేరి ఉంటే ఇప్పుడు ఏ డిప్యూటీ సెక్రెటరీ క్యాడర్‌లో ఉండేవాడినేమో”

సారు వైపు ప్రశంసంగా చూశాడు పతంజలి. మట్టి రోడ్డు వెంబడి నడుస్తున్నారు. జొన్న చేలు ఇరువైపులా కనబడుతున్నాయి. పొలాల మధ్యలో కొంత చదును చేసి వృషభరాజాలను కట్టేసి ఉన్నారు. బండ్ల మీద ఎరువు తోలుకొనే వెదురు గూడును తలకిందులుగా వేసుకొని దాని మీద వరిగడ్డి కప్పుకొని రాత్రి తలదారుకునేందుకు ఆవాసంగా చేసుకున్నారు. మంట మీద పచ్చి పూర్తిగా ఆరని చొప్ప ముక్కలు వేసి సన్నగా పొగ వచ్చేలా చేశారు. ఎద్దులకు దోమలు, చీటీగల బెడద లేకుండా.

ఏ పొలంలో చూసినా చెయ్మెత్తు ఎద్దులు. కొమ్ములు పొట్టిగా, మూపురాలు ఉన్నతంగా ఉన్నాయి. ఎదురుగా వస్తున్న రైతులు సారుకు నమస్కరిస్తున్నారు. ఒక పెద్దాయన సారును ఆపి అడిగాడు.

“ఏం సార్‌, ఏటి కాడికా? ఈనెవరు?”

“అవును శేషశయనా రెడ్డిగారూ! ఈయన నా శిష్యుడు. వెల్దుర్తి నుండి మమ్మల్ని చూడటానికి వచ్చాడు.”

“అదీ గురుబక్తంటే” అన్నాడాయన.

“ఇంటికి వెళుతున్నారా”

“ఔ ఎద్దుల్ను ‘జాడు’ కిడిసినాం. సుస్కొని వచ్చాండా. పోయొచ్చా” అని ఆయన వెళ్లిపోయినాడు.

“ఆయన ఈ ఊర్లో పెద్ద భూస్వామి. భారతం భాగవతం బాగా చదివి అర్థం చేసుకుంటాడు. అన్నట్లు మరిచే పోయాను. నీకు చెప్పనే లేదు కదూ! మన ‘సయ్యదయ్య శతకం’ ప్రచురణ అయింది.”

పతంజలి సంతోషంతో, “నిజమా సార్‌ నాకూ ఒక కాపీ ఇవ్వండి” అన్నాడు.

“తప్పకుండా. నీకివ్వకపోతే ఇంకెవరికిస్తాను. తాడిపత్రిలో ఆయన మేనల్లుడికే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది. అందులోనే ఆయన ప్రింటింగ్‌ చేయించాడు. ఊర్లో ఇంకా కొందరు పెద్ద రైతులకు చెప్పి తానూ కొంత యిచ్చి, నాకు ఆర్థికంగా కూడ సమస్య లేకుండా చేశాడు. మహానుభావుడు. కూతురు అల్లుడు హైదరాబాదులో ఉంటారు. అల్లుడు సెక్రటేరియట్‌లో ఉన్నత పదవిలో ఉన్నాడు. కొడుకు నంద్యాలలో డాక్టరు. శ్యాం ప్రసాద్‌ రెడ్డి అని ఇ.యన్‌.టి సర్జన్‌. ఈయన ఎక్కడకీ వెళ్లడు. వ్యవసాయమంటే ప్రాణం. డెభై ఏళ్లు పైనే ఉంటాయి. ఎలాంటి సమస్యలూ లేవు. జొన్న సంకటి, రొట్టెలు తిని అరిగించుకుంటాడు. ఆయన భార్య కూడ దొడ్డ యిల్లాలే”

పతంజలి గర్వంగా ఫీలయ్యాడు. మా సారు ప్రతిభను గుర్తించి సహకరించిన శేషశయనా రెడ్డికి మనసులోనే కృతజ్ఞతలు. తెలిపాడు.

“సరేగాని, ఎద్దులను జాడుకు విడవడమంటే నీకు తెలుసా?”

తెలుసన్నాడు పతంజలి

“ఏమిటో చెప్పు?”

“సంక్రాంతి తర్వాత ఎద్దులకు రెండు నెలలు పని ఉండదు. జొన్న చేలు పొట్టకు (కంకి బయటకు వచ్చే ముందు దశ) వస్తాయి. పొలంలో కొంత చదును చేసి ఎద్దులను గుంజలకు కట్టేస్తారు. జొన్న దంట్లు (గడలు) అన్నీ కంకులుగా రూపొందవు. దాదాపు పదిశాతం పంట గిడజబారి పెద్దగా ఎత్తుగా పెరగదు దానికి కంకులు రావు.

అలాంటి జొన్న దంట్లను ఎద్దులకు మేపుతారు. వాటినే ‘జాడు’ అంటారు. అవి పచ్చి మేత కాబట్టి మంచి పోషకాలుంటాయి. ఎద్దులు ప్రీతిగా తింటాయి. అక్కడే గోలెంలో వేరుశనగ చెక్క నీళ్లలో నానబెట్టి నీళ్లలో కలుపుతారు. వేరుశనగ నూనె ఆడిన తర్వాత మిగిలిన పిప్పి అంతా కేకులు కేకులుగా తయారవుతుంది. అది చాలా రుచిగా ఉంటుంది ఎద్దులకు. దాదాపు నెలన్నర తినడం తాగడం తప్ప వేరే పనేమీ ఉండదు వాటికి పొలంలో ఉన్న ‘జాడు దంట్లు’ అయిపోయేంతవరకు మేపుతారు. ఎద్దులు కండపట్టి నునుపుదేలి బలంగా తయారవుతాయి. ఎండిన సొరకాయను గాని బీరకాయనుగాని నిలువుగా సగానికి కోసి, దాన్ని ఒక బ్రష్‌గా ఉపయోగించి వాటి శరీరమంతా రుద్ది అనవసర రోమాలను తొలగిస్తారు. వారానికొకసారి వేడినీళ్లు కాగబెట్టి వాటికి స్నానం చేయించి, మెత్తని గోనెపట్టాలతో తుడుస్తారు. జాడు మేయడం పూర్తయ్యేసరికి వాటిని అదుపు చేయడం కూడ కష్టమవుతుంది. ఇనుమడించిన బలం, ఉత్సాహం వాటి స్వంతమవుతాయి. ఎండకాలం జరిగే తిరునాళ్లలో టన్నులకొద్దీ బురువున్న బండలు లాగి బహుమతులు గెల్చుకుంటాయి” అన్నాడు పతంజలి.

“నీ అసాధ్యం కూల. ఎంత అవగాహనుంది స్వామీ నీకు సేద్యం మీద?” అన్నాడు సారు

“మన వైపు కూడ లద్దగిరి, గోరంట్ల కోడుమూరు, చెరుకులపాడు, కృష్ణగిరి, పుట్లూరు మొదలైన ప్రాంతాల్లో జొన్న ఎక్కువగా పండించే చోట ఎద్దులను ‘జాడు’కు విడవటం ఉంది సార్‌. నాకు మా జీతగాడు తోకోడు అని నా  మిత్రుడులెండి. వాడు ఇదంతా చెప్పాడు”

రోడ్డుకు రెండు వైపులా ధనియాల పంట వేశారు. కమ్మని కొత్తిమిర వాసన గాలిలో తేలిరాసాగింది. ధనియాలు పంట కూడ వర్షాకాలం చివర్లో వేస్తారు. సెనగ కూడ (వేరుశనగ కాదు) ఒకటి రెండు చివరి వానలు చాలు వాటికి. తర్వాత వచ్చే చలి మంచుతోనే ఎదుగుతాయి.

ఏటి ఒడ్డు చేరుకున్నారు. గట్టు దిగి ఇసుకలో నడుస్తూ నీటి ప్రవాహం దగ్గరకు చేరుకున్నారు. నదిలో దాదాపు సగం వరకు నీళ్లున్నాయి. ప్రవాహం వెన్నెల్లో మెరుస్తూంది. ఒడ్డున రెల్లుగడ్డి. దాని మృదువైన కంకులు తళతళ లాడుతున్నాయి. గడ్డి దట్టంగా పెరిగి ఉంది. రెండు మూడు బళ్లు నీళ్లలో నిలిపి, దాని మీద ఉన్న చెక్క పీపా పై నున్న రంద్రంలో పెద్ద గరాటు పెట్టి ప్లాస్టిక్‌ బిందెలతో తోడి పాసుకుంటున్నారు. ఎద్దులతో కూడ మనుషులతో మాట్లాడినట్లు బూతులు తిడుతూ, బుజ్జగిస్తూ సంభాషిస్తున్నారు.

సారు దిగలేదు. పతంజలి నీటిలో దిగాడు. మోకాళ్ల వరకు ప్యాంటు పైకి మడిచాడు. నీళ్లు చల్లగా ఉన్నాయి. దోసిటితో తీసుకుని తాగాడు చాలా రుచిగా ఉన్నాయి.

ఇద్దరూ ఇసుకలో కూర్చున్నారు. ఆకాశంలో చందమామ ప్రకాశిస్తున్నాడు.

“ఈ ఏరు చంద్రుడు, ఒడ్డున మెరుస్తూన్న రెల్లుగడ్డి, ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది. ఏదైనా గుర్తొస్తుందా పతంజలీ?” అనడిగాడు గురువుగారు శిష్యుడిని.

పతంజలికేం తోచలేదు. అప్పుడాయన అన్నాడు.

“మాయాబజార్‌ సినిమాలో ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అన్న పాట చిత్రీకరించిన లోకేషన్‌ గుర్తుకు రావడం లేదూ?”

పతంజలికి చప్పున గుర్తొచ్చింది. “నిజమే సార్‌! అన్నాడు సంభ్రమంగా. “మార్కస్‌ బార్‌ ట్లే ఛాయాగ్రహణం ఒక అద్భుతం. విజయావారి చంద్రుడని అంటూంటారు కదా” అన్నాడు.

కాసేపు కూర్చొని ఇంటికి చేరుకున్నారు. అప్పటికి ఎనిమిది దాటింది. పతంజలి పంచె కట్టుకొని బనియన్‌ మీద టవలు కప్పుకున్నాడు. సారు గదిలోనుండి ‘సయ్యదయ్య శతకం’ రెండుకాపీలు తెచ్చిచ్చాడు. చిన్న పుస్తకం. ఒక్క పేజీలో నాలుగు పద్యాల చొప్పున ఇరవై ఐదు పేజీలు వచ్చింది. కవరు పేజీ మీద ‘సయ్యదయ్య శతకము’ రచన – సయ్యద్‌ మహమ్మద్‌ ఆజం. బి.ఎ. బి.ఇడి, స్కూల్‌ అసిస్టెంటు, జెడ్‌.పి. హైస్కూలు సంజామల. కర్నూలు జిల్లా అని ముద్రించి ఉంది.

బ్యాక్‌ కవరు మీద ముద్రణ – జనార్దన ప్రింటింగ్‌ ప్రెస్‌, గుత్తి రోడ్డు, తాడిపత్రి, వెల: అమూల్యం, వెయ్యి ప్రతులు డిసెంబర్‌ 1977 అని ఉంది.

రెండో పేజీలో

“అంకితం నా తండ్రి మరణానంతరం

నాతోనే ఉండి, నాకు ప్రేమను, స్ఫూర్తిని పంచిన నా

మాతృమూర్తి కీర్తిశేషురాలు మెహరున్నీసా బేగం

పాద పద్మాలకు ఈ శతకం అంకితం” అని ఉంది.

దాని క్రింద రచయిత తన తల్లి పాదాలపై ఉంచిన జంట పద్య పుష్పాలున్నాయి.

~

మాతృ ఋణము దీర్చ మనిషికి శక్యంబె

దేవుడామెను బంపె నవని బ్రోవ

బ్రేమ సామ్రాజ్యమును మిగుల గోము మీర

లాలనము సేయు నా తల్లి లలిత వల్లి.

~

మెహరున్నీసా బేగము

అహరహమును నాదు క్షేమ మరయుచునుండెన్‌

ఇహపర సాధన దనదౌ

సహకారము పరిఢవిల్లె సన్మతి నైతిన్‌

ఆ పద్యాలు చదివిన పతంజలికి కళ్లు చెమ్మగిల్లాయి. తల్లికి ఏ కొడుకైనా ఇంతకంటె నివాళి ఏమివ్వగలడు. లేచి సారు చేతులు పట్టుకొని కళ్లకద్దుకున్నాడు.

“బాగున్నాయా, పతంజలీ” అని అడిగాడు

“పరమాద్భుతంగా ఉన్నాయి సార్‌” అన్నాడు.

ఇంతలో వంటింట్లోంచి బాషా వచ్చాడు.

“అబ్బా, మా బులా రహేహీ” అంటూ

ఇప్పుడే వస్తానంటూ సారు వంటింట్లోకి వెళ్లాడు. మళ్లీ నవ్వుకుంటూ పతంజలి దగ్గరకు వచ్చాడు.

“ఆ పిల్లవాడు బ్రాహ్మడు కదా! మన యింట్లో భోజనం చేస్తాడా?” అని మా శ్రీమతిగారి అనుమానం. మా పతంజలి అలాంటి వన్నీ ఎప్పుడో జయించాడు” అని చెప్పి వచ్చాను.

పతంజలి నవ్వి, “థ్యాంక్యూ సార్‌” అన్నాడు.

హాల్లో గోడవారన ఒక దుప్పటి మడతలు వేసి పరచింది బానో. సారు, బాషా, పతంజలి కూర్చున్నారు. పెద్ద సైజు పింగాణీ ప్లేట్లు పెట్టింది ఆ అమ్మాయి.

“నీవు తినవా అమ్మా” అని పతంజలి అడిగితే

“మై మా కే సాత్‌ ఖావూంగీ” అన్నది.

ప్లాస్టిక్‌ కప్పులతో సేమ్యా పాయసం పెట్టారు. వంకాయ పప్పు, గోంగూర పచ్చడి, మటిక్కాయ కూర.

“మాయింట్లో నెయ్యి వాడము. ఏమనుకోకు” అన్నాడు సారు. “ప్రారంభించు” అన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here