[dropcap]ఓ[/dropcap] అప్సరస కన్యక గంధర్వ కాంత
గలగలపారే అలకనంద
ప్రేమ సామ్రాజ్యానికి పట్టమహిషి
పారిజాత పరిమళాలు వెదజల్లే సౌగంధి..
ప్రబంధ నాయిక శృంగార దేవత
ప్రకృతి మాత… కనిపెంచే మాతృమూర్తి
కవ్వించి నవ్వించే కలలరాణి… అయినా
ఒంతరితనంతో వడలి వసంతకాలపు
ఉష్ణంలో సలసలా మరుగుతోంది
కాలం కత్తుల బోనులో నలిగి
మనసుకు తగిలిన గాయాలకు
మౌన లేపనాలు రాయలేక…
కన్నీటి కాలువలకు అడ్డుకట్టు
వేసేవాళ్లు లేక…
చుట్టూ వున్న అనుబంధాలతో
లేని ధైర్యం చూపుతూ…
తన చుట్టూ తానే ఓ రక్షణ వలయంగా మారుతూ…
ఒంటరితనంతో ఎడతగని
మౌన పోరాటం చేస్తూ అస్తిత్వాన్నీ
నిలుపుకుంటోంది
ఎన్నెన్ని కట్టుబాట్లు, ఎన్నెన్ని
సౌభాగ్యాలు దౌర్భాగ్యాల నడుమ
వయసు ఊయలలో ఊగూతూ
వయ్యారాల రాగాలను ఆలపిస్తూ
ఉలిపిరి పొరలను విచ్చుకుంటూ
బోడిగుండులు… మాడినన్నాలు
మానభంగాలు వెట్టి చాకిరిలతో
చితిమంటలలో సజీవ దహనాలతో తల్లడిల్లి
మట్టి దిబ్బల మధ్య… ఎందరెందరి
మనో వేదనలతో రగిలి… కుప్పలు కుప్పలుగా
పెరిగ బూడిదలు ఘనీభవించి… కాలంలో
కథలై కళ్ల ముందు కదిలి…
సంస్కరణ పేరిట అడుగు అడుగు ముందు కొచ్చిన ఆమె…
నేటికి మనో భారాన్నీ పంచుకోలేక
గుండె బరువును పంచుకునే
ఓ మనసు లేక… వేచి చూస్తోంది… స్పందించి
చేయి అందించే మనిషి కోసం…
అర్థం చేసుకొని స్పందించే
హృదయం కోసం… ఎదురు చూస్తోంది.