ఏడడుగుల బంధం

0
4

[dropcap]సుం[/dropcap]దరం నాకున్న మఖ్యమైన స్నేహితుల్లో ఒకడు. సుందరం భౌతికంగా దూరమయినా మానసికంగా మా హృదయాల్లో వాడి స్థానం సుస్థిరం. వాడి కొడుకు సురేశ్‌కి కూడా నేనంటే ఎంతో భక్తి, గౌరవం. అతని ఏకైక పుత్రిక సుగుణకి పెళ్లి చేయబోతున్న సమయంలో ఇంటికి వచ్చి శుభలేఖ నా చేతిలో ఉంచి పెళ్ళికి మా కుటుంబ సభ్యులందరినీ మరీ మరీ ఆహ్వానించాడు.

శుభలేఖ అందుకున్న నాకు సుందరం జ్ఞాపకానికి వచ్చి ఒక్కక్షణం భావోద్వేగానికి గురయ్యాను. శుభలేఖ చేతిలోకి తీసుకున్న నాకు ఆహ్వాన పత్రికలో వాక్యాలు నన్ను ఎంతో ఆకర్షించాయి. ఇప్పటి వాళ్ళు వీటిని వెరైటీగా ముద్రిస్తున్నారు. అందులోని వాక్యాల వేపు నా దృష్టి పరుగులు తీస్తోంది.

“ఒకరి వెంట మరొకరు ఏడడుగులు నడిచి ఆరవ ప్రాణంగా ఐదవతనాన్ని మూటకట్టుకుని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో రెండు జీవితాలు ఒకటవ్వాలని మీ అందరూ దీవించాలని మా దంపతులం కోరుతున్నాం” అని ఉన్నాయి ఆ వాక్యాలు.

ముఖ్యంగా – ఆహ్వాన పత్రికలో మా దంపతులం అందర్నీ అభ్యర్థిస్తున్నాం – అన్న వాక్యాలు నాకు బాగా నచ్చాయి. అదే మాట అన్నాను సురేశ్‌తో. చిన్నగా నవ్వేసాడు అతను నా మాట విని. పెళ్ళికి రమ్మనమని మరీ మరీ చేప్పి సురేశ్, అతని భార్యా వెళ్ళిపోయారు.

సుమతికి కొద్దిగా నలతగా ఉన్న కారణం చేత నేను ఒక్కడినే పెళ్ళికి వెళ్ళాను. కళ్యాణ మండపం చాలా బాగుంది. విశాలంగా, చాలా సందడిగా ఉంది జనాలతో. ఎ.సి.రూమ్‌లు విశాలమైన ఖాళీస్థలం, వాహనాలు నిలుపుకోడానికి అనువుగా ఉంది. దాని బాడుగ కూడా అంత పెద్ద మొత్తంలోనే ఉంటుంది అని అనుకున్నాను నేను. ముఖ్యంగా కళ్యాణ మండపం చాలా చల్లగా ఉంది ఏ.సి.ల అవసరం అంతగా లేనట్టు.

వివిధ రకాల విద్యుత్ కాంతుల్తో, కళ్ల్ళు మిరిమిట్లు గొలిపే అలంకరణతో కళ్యాణ వేదిక అతి శోభాయమానంగా ఉంది. కాలం మారుతోంది. దాని ప్రభావం మనిషి మనుగడ మీద పడుతోంది. ఆ కాలాన్ని బట్టే మనిషి వేలకి వేలు ఖర్చు పెట్టడానికి కూడా వెనకంజ వేయటం లేదు. మరి తిండి విషయంలోనో, దానిలో కూడా మార్పే.

పూర్వం ఇప్పుడు పెళ్ళి పందిర్లో పెళ్ళివారికి వడ్డిస్తున్నన్ని ఆహార పదార్థాలు వడ్డించేవారా? అప్పుడున్న ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నా ఉన్న వాటినే తృప్తిగా భుజించేవారు. ఇప్పుడయితే ఇన్ని ఆహార పదార్థాలను చూస్తే ఏమి తినాలో తెలియటం లేదు. వాటిని చూడగానే తినకుండానే కడుపు నిండిపోతోంది.

తినిన వాళ్ళు తినగా చాలా పదార్థాలు మిగిలిపోయి, వ్యర్థమయిపోతున్నాయి. దానికి తోడు తమ సమయంలో ఫోటోలకే పరిమతమయిన పెళ్ళితంతు ఇప్పుడు వీడియోల సందడిలో పెళ్ళి సరిగా చూడలేని పరిస్థితి.

తరానికి తరానికి పెళ్ళి తంతులో ఎన్ని మార్పులు? తన అమ్మమ్మ కాలం నాటి పెళ్ళిళ్ళ గురించి తను విన్నాడు. ఆ రోజుల్లో ఏడేసి రోజుల పెళ్ళిళ్ళట. ముక్క పచ్చలారని చిన్నారి పెళ్ళికూతురు. తల్లి వడిలో కూర్చుంటే పెళ్ళికొడుకుగా ఉన్న అబ్బాయి పెళ్ళికూతురు మెడలో మూడు ముళ్ళు వేసేవాడట. అప్పటి పెళ్ళిళ్ళు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవట. పెళ్ళిపాటలు, వియ్యాల వారిని ఆటపట్టిస్తూ ఒకరి మీద మరొకరు ఛలోక్తులు విసురుతూ పాటలు. హాస్యాలు, జోకులు ఇలా ఎంతో ఆనందకరంగా పెళ్ళిళ్ళు జరిగేవిట. మరో ముఖ్య విషయం. ఇప్పటిలా కాపీలు, టిఫిన్లు లేవు. చల్ది అన్నాలు, ఊరగాయ నంజుకుని తినడమే ఉదయం పూట. నేల మీద మఠం వేసుకుని భోజనాలు ముగించేవారట.

ఆ తరువాత తన తల్లి కాలం పెళ్ళి తంతులో కొద్దిగా మార్పు వచ్చింది. అంత ముక్కు పచ్చలారని పిల్లలకి పెళ్ళి బదులు పిల్లలకి పెళ్ళి బదులు ఆడపిలకి పన్నెండు సంవత్సరాలు దాటిన తరువాత పెళ్ళిళ్లు, అదీ ఇళ్లలోనే జరిపేవారు. ఆరు బయట పెద్ద పందిర్లు వేసి పచ్చి మామిడాకుల తోరణాలతో పెళ్ళి పందిరిని అలంకరించేవారు. పచ్చి మామిడాకుల సువాసన చాలా గమ్మత్తుగా ఉండేదిట. తన తల్లి కాలానికి ఏడురోజుల పెళ్ళి మూడు రోజులగా మారింది. అప్పుడే కాఫీలు, టిఫిన్లు కాలం వచ్చింది. కరెంటు వాడకం అంతగా లేని కారణం చేత పెట్రమాక్సు లైట్లు వెలుతురులో పెళ్ళి తంతు జరిగేది. అప్పుడు కూడా నేల మీద కూర్చుని భోజనాలే. ఇప్పటి వాళ్ళు మాడు పదుల వయస్సులోనే నేల మీద కూర్చోలేకపోతున్నారు. అప్పటి వాళ్ళకి ఏ కీళ్ళ నొప్పులూ లేవు కాబోలు, నేల మీద కూర్చునే భోజనాలు చేసేవారు.

ఇక తన కాలం వచ్చేప్పటికి సత్రవులు, మందిరాల్ని కళ్యాణమండపాలగా మార్చి పెళ్ళి తంతు జరిపించేవారు. అయితే ఇపుడంత పెద్ద మొత్తంలో వాటికి డబ్బులు వసూలు చేయక నామ మాత్రము చెల్లించే వెసులుబాటు ఉండేవి. అంత అలంకరణ కూడా ఆ రోజుల్లో లేదు. ఎ.సి. సదుపాయం లేకపోయినా విద్యుత్తు దీపాలు, ఫేన్లు ఉన్నాయి. పెళ్ళి కూడా రోజున్నర, రెండు రోజులకి కుదింపబడింది. వంట వాళ్ళ చేత వండించి, కుర్చీల్లో కూర్చోబెట్టి భోజన ఏర్పాట్లు చేసేవారు.

ఇప్పటి తరం వచ్చేప్పటికి ఖరీదయిన మనష్యులకే కాదు, మధ్య తరగతి మనుష్యుల కూడా తమ స్తోమత బట్టి ఖరీదయిన కళ్యాణ మండపాలు, ఆడంబరమైన అలంకరణ మధ్య ఖరీదైన భోజనాల్తో పెళ్ళి తంతు జరిపిస్తున్నారు. కళ్యాణ మండపాల ప్రక్కనే ఏ.సి. రూమ్‌లు పెళ్ళి వారికి విడిది ఏర్పాట్లు. ఇక భోజనాల విషయానికి వస్తే బఫే సిస్టమ్ అంటారు కాని పూర్తిగా బఫే కాదు. బఫే అంటే ఆహార పదార్థాలన్నింటిని ఒక దగ్గర పెడ్తే ఎవరికి కావాల్సిన పదార్థాలు వాళ్ళు ఎంచుకుని తినడం. ఇప్పటి బఫే అంటే జైళ్ళలో ఖైదీలు ప్లేట్లు పట్టుకుని క్యూలో నిలబడితే వాళ్ళకి భోజనాలు వడ్డించినట్లు ఈ బఫేలో కూడా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ప్లేట్లు పట్టుకుని వెళ్తే ప్లేట్లలో ఆహార పదార్ధాలు వడ్డించడం. వాళ్ళూ, వీళ్ళూ అన్నది కాదు – మగపెళ్ళి వారు తరువువాళ్ళు, ఆడపెళ్ళి వారి తరుపువాళ్ళు ఇలా భోజనం ప్లేట్లు పట్టుకుని నిలబడవల్సిందే. ఇది ఒక విధంగా మంచిదే అని నాకు అనిపిస్తుంది.

ఎందుకంటే తన పెళ్ళి సమయంలోనే కొంత మంది చాదస్తపు మగపెళ్ళివారు తాము భోజనం చేసిన తరువాతే ఆడపెళ్ళి వారు భోజనాలు చేయాలి అని షరతు పెట్టేవారు. ఇదేఁ చాదస్తం అని తనకి అనిపించేది. మగ పెళ్ళివారేంటి, ఆడ పెళ్ళివారేంటి ఇద్దరిలోనూ ముసలివాళ్ళు, బి.పి, షుగరుతో బాధపడే పేషంట్లు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఆంక్షలు నరకప్రాయమే. అటువంటి వాళ్ళకి వేళకి తిండి లేకపోతే ప్రమాదమే అని అనుకునే వాడిని.

“అంకుల్! ఒక్కళ్ళు అలా కూర్చుని ఆలోచిస్తున్నారు. మీకు కంపెనీ ఇయ్యడానికి నాకు తీరిక లేదు. మీకు ఇక్కడ పరిచయస్థులు కూడా లేరు. ఎవరినైనా పరిచయం చేసేదా?” అక్కడికి వచ్చిన సురేశ్ అన్నాడు.

“పరవాలేదు. నీ పనులు నీవు చూసుకో!” అన్నాను. “భోజనాలకి అందరూ సిద్ధంగా ఉన్నారు. భోజనం చేసి రిలాక్సు అవండి” తిరిగి అన్నాడు సురేశ్.

“రద్దీ కొద్దిగా తగ్గనీ!” అన్నాను.

ఇంతలో ఎవరో పిలుస్తూ ఉంటే సురేశ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిగా రద్దీ తగ్గిన తరువాత నేను ప్లేటు పట్టుకుని భోజనాల దగ్గరికి నడిచాను. అక్కడ మొగపెళ్ళివారు ఎవరూ అగుపించలేదు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే ఇప్పటి మగపెళ్ళివారు కొందరు ఇలా బఫెలో తినకుండా వాళ్ళకి సపరేటుగా టేబులు మీల్సు ఏర్పాటు చేయమని పురమాయిస్తున్నారు. సురేశ్ వియ్యాలవారు కూడా అలా పురమాయించి ఉంటారు అని అనుకున్నాను.

“అంకుల్ భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా?” అని అడిగాడు సురేశ్. “చాలా బాగుంది. మన ఇంటి భోజనం లాగే రుచిగా ఉంది. ఇలాంటి రుచికరమైన భోజనం నేను ఏ కేటరింగులోనూ తినలేదు.” అన్నాను సురేశ్‌తో.

“అందుకే సీతమ్మ కేటరింగుకి అందరూ ప్రాముఖ్యత ఇస్తారు. నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనం సరఫరా చేయడమే ఆ కేటరింగు ప్రాముఖ్యత. నిబద్ధతతో, నిజాయితీగా ఆ కేటరింగు వాళ్ళు మసలుకుంటారు. కాబట్టే అందరూ ఆ కేటరింగునే అందరూ కోరుకుంటారు. అదుగో అక్కడ నిలబడి పర్యవేక్షిస్తోందే ఆవిడే సీతమ్మ. పరిచయం చేస్తాను రండి.” అంటూ నన్ను ఆవిడ దగ్గరకి తీసుకెళ్ళి ఆమెకి నన్ను పరిచయం చేస్తున్నాడు సురేశ్.

ఆమె కళ్ళు విప్పారాయి… “మాష్టారూ! మీరా? నేనండి మీ స్కూల్లో పని చేసిన శంకరం మాష్టారి కూతురు సీతను. నేను మీ దగ్గర చదువుకున్నాను కూడా” అంది ఆవిడ.

నేను “వెంటనే పోల్చుకోలేకపోయానమ్మా! సీతా బాగున్నావా?” అన్నాను. “నిజమే! మీ దగ్గర ఎందరో చదువుకుంటారు. మేము మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నంతగా మీరు గుర్తు పెట్టుకోవడం కష్టమే. అంతే కాదు చిన్నప్పుడిలా మా ఆకారాలు ఇప్పుడు ఉండవు కదా!” నవ్వుతూ అంది సీత. “నిన్ను ఇలా ఇక్కడ చూసినందుకు చాలా సంతోషం, నీకు అంతా మంచే జరుగుతుంది” అన్నాను.

“మీ దీవెనలే నాకు కావాలి మాష్టారు!” అంది సీత. భోజనం అయిన తరువాత నాకు కేటాయించిన రూమ్‌లో రిలాక్సు అవుతున్నాను. నా మనస్సు మాత్రం గతం తాలూకా ఆలోచన్ల వేపు పరుగులు తీస్తోంది.

ఒక విధంగా చూస్తే శంకరం మాష్టారు చాలా దురదృష్టవంతులే అని నేను అనుకుంటాను. అదృష్టం, దురదృష్టం అనేవి ఏవీ మన చేతుల్లో లేవు. విధి ఆడించిన వింత నాటకంలో పావులుగా మారిపోవడమే మన విధి. అది ఆడించిన వింత నాటకంలో పాత్రధారులం, సూత్రదారులం మనం.

శంకరం మాష్టారుగారికి వరసగా ముగ్గురు కూతుళ్ళు. మగ సంతానం ఉంటే బాగుంటుంది అని అతని తల్లి పోరు పడలేక నాలుగవ ఛాన్సు చూడవల్సి వచ్చింది అతనికి. నాలుగో సారి మగపిల్ల వాడు పుట్టగానే ఎంతో పొంగిపోయింది ఆ కుటుంబం. అయితే భవిష్యత్ మనల్ని మట్టికరిపిస్తుందని మనం ఊహించలేం. మనం అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అయితే మనం తట్టుకోలేము. అదే జరిగింది శంకరం మాష్టారి విషయంలో. అతని జీవితంలో కష్టాల మీద కష్టాలు వచ్చి పడ్డాయి.

రెండో కూతురు ఎర్రగా బుర్రగా ఉందని ఆ అమ్మయిని కాని కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకున్నారు అత్తవారు. అందుకే మాష్టారు పెద్ద అమ్మాయి సీతను వదిలి పెట్టి రెండో కూతురు వైదేహికి పెళ్ళి జరిపించారు.

ఆ పెళ్ళిలో కూడా అతను ఎన్ని నిందలు, నిష్ఠూరాలు అనుభవించవల్సి వచ్చింది. ఆయనని – పెళ్ళికి వచ్చిన వాళ్ళకి తగిన మర్యాదలు జరగలేదని నిందించిన వాళ్ళు కొందరయితే మద్నాహ్నం మిగిలిపోయిన అహర పదార్థాలే రాత్రి వడ్డించారు అని మరి కొందరు పరోక్షంగా నిందించారు. ఆలా అన్న వాళ్ళలో స్టాఫ్ మెంబర్సు కూడా ఉన్నారు. ఆ సమయంలో అతను ఎంతో మనస్తాపానికి గురయ్యారు.

నిందలు, నిష్ఠూరాలతో జరిగిన ఆ పెళ్ళి సవ్యంగా సాగిందా అంటే అదీ లేదు. సంవత్సరం అవగానే వైదేహి ఒక బిడ్డతో సహా విధవగా పుట్టింటికి చేరింది. ఈ సంఘటనకి మాష్టారు ఎంత కృంగిపోయారు? అంతటితో ఆగిందా? మూడో కూతురు జానకి అనుకోకుండా కన్ను మూసింది. కొడుక్కి ముద్దు ఎక్కవయి చదువు అబ్బలేదు.

అటువంటి పరిస్థితిలో సీతకు ఓ సంబంధం వచ్చింది. అందరూ మంచి సంబంధం, వాళ్ళు మంచివాళ్ళు అన్నారు. మంచి వాళ్ళు, చెడ్డ వాళ్ళు అన్నది ఎవరి ముఖం మీదా వ్రాసి ఉండదు కదా! సీతయినా సుఖపడుతుందనుకుంటే ఆ కోరికా నెరవేరలేదు. పెళ్ళయిన రెండు సంవత్సరాలకే శంకరం మాష్టారి అల్లుడు సీతకి విడాలిచ్చాడు. ఈ సంఘటన మాష్టారి నెత్తి మీద పిడుగు పడినంత చేసింది. అతనికి ఆపదల మీద ఆపదలు. వాటినన్నిటిని తట్టుకోలేక మాష్టారు దిగాలుగా కూర్చునేవారు. అది చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఇలా అతని స్థితి ఉంటే డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని అనుకున్నాను. అతనికి సాంత్వన చేకూర్చాలి అని అనుకున్నాను కూడా.

“మాష్టారు! మీరు ఒంటరిగా కూర్చుని ఎవ్వరితోనూ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటే తప్పకుండా డిప్రెషన్‌కి గురవుతారు. అందుకే మన కష్టనష్టాల్ని మనవాళ్లు అనుకున్న వాళ్ళతో పంచుకోవాలి. ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు ఏర్పరుచుకోకపోతే మనిషిలో ఒంటరితనం మొదలయి అభద్రతా భావం, నిరుత్సాహం, నిరాశ, నిశ్పృహకి లోనయ్యే అవకాశం వుంది. కష్టాల్లో ఉన్న మనిషికి అత్యవసరాల్లో ఆదుకునేది నా అన్నవాళ్లే” అన్నాను.

“నాకు అలాంటి వాళ్ళు కనబడలేదు మాష్టారు!” అలా అంటున్న సమయంలో అతనిలోని బాధంతా సుడులు సుడులుగా బయటకు వస్తోంది.

“తప్పకుండా అగుపడ్తారు. మరో విషయం. మన పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఎందరో మనకి సలహాలు ఇయ్యడానికి ప్రయత్నిస్తారు. ఒకొక్కప్పుడు వాళ్ళిచ్చిన సలహాలు మన మనస్సును బాధ పెట్టేవిగా ఉంటాయి. అటువంటి సమయంలో మనం కృంగిపోకూడదు. నిరుత్సాహ పడకూడదు. రుచించని సలహాలను మదింపు చేసుకుని మనకి అనుకూలంగా మలుచుకోగలిగితే మనం ముందుకు అడుగువేయగలం.

మనం మన జీవితాన్ని ఆనందంగా సుఖసంతోషాలతో గడపాలనుకుంటాం. దానికి చుక్కాని మన ఆలోచనలే. వాటిలో శాంతి, ఆరోగ్యం, ధైర్యం, ఆశలతో మనం మనస్సును సంపన్నం చేసుకోవాలి. మనకి సంతోషకరమైన ఆలోచన్లు ఉంటే ఆనందంగా ఉంటాం, బాధను గురించి ఆలోచిస్తూ ఉంటే బాధే మిగులుతుంది. భయంతో కూడిన ఆలోచన్లు వస్తే భయపడ్తూనే ఉంటాం. అనారోగ్యం గురించి ఆలోచన్లు వస్తే మనల్ని అనారోగ్యం ముట్టడిస్తుంది. ఓటమి గురించి ఆలోచిస్తే ఓటమి పాలవుతాము.”

“కొంత మంది మన మీద జాలి చూపే వారిని ఇష్టపడరు. అయితే నాకు మీమీద ఉన్నది జాలికాదు. మీలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని, మనలోని వ్యతిరేక దృక్పథానికి బదులు అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. మీ సమస్యను గురించి మీరు పట్టించుకోవాలే కాని మథన పడకూడదు. సమస్యల పరిష్కార మార్గాన్ని వెతకాలి. నిన్న అనేది చరిత్ర. రేపు అనేది రహస్యం. నేడు అనేది వాస్తవం. దాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే విజేతగా నిలుస్తాడు.”

“మాష్టారూ! మీ మాటలు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ఊరటనిచ్చాయి. ఆత్మవిశ్వాసం కలిగించాయి. ఆత్మస్థైర్యాన్ని నింపాయి. మీ మాటలు ఎప్పటికీ మరచిపోలేను. మన సమాజంలో మనిషి నైజం ఎలా ఉందంటే పైకి ఎదుగుతున్న వాడి కాలు పట్టుకుని క్రిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. మీరయితే నాలో గూడు కట్టుకున్న విషాదాన్ని పోగొట్టడానికి ప్రయత్నించారు. మీ మాటలు వినగానే దూదిపింజలా నా మనస్సు తేలికపేడింది.” అన్నారు శంకరం మాష్టారు.

“మాష్టారూ! మా కుటుంబం గురించే కదా మీ ఆలోచన్లు అన్నీ” ఈ మాటలు వినగానే ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్ట నేను చివ్వున తల పైకేత్తి చూశాను. ఎదురుగా సీత. నేను అవును అని అనలేదు. కాదు అని అనలేదు. మౌనంగా సీత వేపు చూస్తున్నాను.

“మీరు మా కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు. నాకు తెలుసు. ఎందుకంటే అనాడు నాన్నగారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యాన్ని కలిగించి, ఆయనలో నిరాశను తొలగించారు మీ మాటల్తో. నాన్నగారు మీ మాటల్ని ఎప్పుడూ మరచిపోలేదు. మీ ఆ మాటల్ని ఓ కాగితం మీద వ్రాసుకుని మాటి మాటికీ గుర్తు చేసుకునేవారు.”

“మీ ఆ మాటలే నాకు స్ఫూర్తినిచ్చాయి. నిబ్బరాన్ని ఇచ్చాయి. ఆత్మవిశ్వాసం కలిగించాయి. నాన్నగారు పోయిన తరువాత ఉన్న డబ్బు తమ్ముడు దుబారాగా ఖర్చుపెట్టాడు. కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. అమ్మకి వచ్చే ఆ పెన్షన్ ఇంతమందికీ ఆధారం. అప్పుడు నేను కొంత మంది ఇళ్ళల్లో వంటలు వండుతూ వంటలక్క అవతారం ఎత్తాను. నా పనిని పొగిడే వాళ్ళకంటే విమర్శించిన వాళ్ళే ఎక్కువ. నేను వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు.

కొద్దికొద్దిగా పొదుపు చేసిన దానితో వంట పాత్రలు కొని ఇంటిలోనే వంటలు చేసి వయస్సు మళ్ళిపోయి ఒంటరిగా జీవిస్తూ ఓపికలేని ముసలి దంపతులకి, మరికొందరికి భోజనం, టిఫిను ఇంటికి అందచేసేదాన్ని. ఈ పనికి నాలాంటి అభాగ్యురాళ్ళ సహకారం కూడా తీసుకునేదాన్ని. మేమందరం ఓ గ్రూపుగా ఏర్పడి ఈ పని చేసే వాళ్ళమి. అలా ఎదిగి ఎదిగి కేటరింగు స్థాయికి ఎదిగాను” అంది సీత.

“చాలా సంతోషమ్మా. నేను ఏం చేయలేను అని అలాగే కూర్చుంటే నీవు ఎప్పటికీ ఎదగలేవు. నీవు నీ బలాన్ని నీ శక్తి సామర్థ్యాన్ని తెలుసుకుని ముందుకు అడుగు వేసావు కాబట్టే ఇలా ఎదగగలిగావు.” అన్నాను.
“అదంతా మీ మాటల స్ఫూర్తే!” అంది సీత.

ఇంతలో బజంత్రీల మోత ముహుర్తానికి టైము అయిన సంకేతమిస్తూ. “అంకుల్ టైము అయింది. రండి పెళ్ళి చూడ్డానికి” అన్నాడు సురేశ్. పెళ్ళి చూడ్డానికి కళ్యాణమండపం వేపు అడుగులేసాను. స్టేజ్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. పురోహితుడు చదువుతున్న మంత్రాలు వినిపిస్తున్నాయి. కాని పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు పురోహితుడు వాళ్ళెవరూ అగుపించలేదు. నేటి పెళ్ళిళ్ళ తీరే అలా ఉంది. స్టేజ్ మీద వీడియో తీసిన వాళ్ళ అడ్డంగా ఉంటే, మగపెళ్ళి వారి తాలుకా వాళ్ళు, ఆడ పెళ్ళి వారి తాలూకా వాళ్ళు ఆ స్థలాన్ని ఆక్రమించేస్తారు. పెళ్ళి చూడ్డానికి వచ్చిన వాళ్ళకి నిరాశే మిగులుతుంది. ముహుర్తం అయిన తరువాత అక్షింతలు వేసినప్పుడు మాత్రమే వధూవరులు కనిపించేది అని అనుకుంటున్నాను. ఇక్కడ పద్ధతి కూడా అలాగే ఉంది.

పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్య తెర. ఆ పాటి కొద్దిక్షణాలకే వధూవరుల ముఖాల్లో అసహనం. జీలకర్రాబెల్లం ఒకరి తలపై మరొకరు పెట్టుకని ముహుర్తం పూర్తవగానే తెర తొలగిస్తారు. అపుడు వధూవరులు హాయిగా ఊరిపి పీల్చుకుంటారు. వారి ముఖాల్లో ఆనంద వీచికలు, ముసిముసి నవ్వులు.

ఒక్కక్క తంతూ జరుగుతోంది. మంగళసూత్రధారణ, తలంబ్రాలు ఇలా ఒక్కొక్కొ తంతూ జరుగుతోంది. వచ్చిన వాళ్ళందరూ వధూవరుల మీద అక్షింతలు వేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్తున్నారు.

“పెళ్ళికి వచ్చిన వారందరూ దయ చేసి ఎవ్వరూ వెళ్ళవద్దు. పెళ్ళనగానే వచ్చాం, అక్షింతలు వేసాం, భోజనం చేశాం, వెళ్ళిపోదాం అన్న ఆలోచన విడిచి పెట్టి పెళ్ళిలో అసలు ముఖ్య ఘట్టం సప్తపది అయ్యే వరకూ ఉండండి. నేను సప్తపది గురించి మీకు వివరిస్తాను. ఈనాడు ఈ సప్తపది పరమార్థం గ్రహించగలిగే స్థాయిలో, ఆలోచనలల్లో లేరు నేటి యువతీయువకులు. అందుకే పెళ్ళి అయి సంవత్సరం అవకుండానే విడాకులు” పురోహితుడు అన్నాడు. అతని మాటలు వినగానే వెళ్ళడానికి సిద్ధపడ్తున్న వాళ్ళందరూ ఠక్కున ఆగిపోయారు. అందరూ తిరిగి కుర్చీల్లో ఆసీనులయ్యారు.

ఒక్కొక్క తంతూ పూర్తయి సప్తపది వంతు వచ్చింది. పెళ్ళికొడుకు, ఏడు అడుగులు వేస్తూ ఉంటే అతని అడుగుల్లో అడుగు వేస్తూ పెళ్ళికూతురు కూడా అడుగులు వేస్తోంది. పురోహితుడు ఒక్కొక్కొ అడుగు గురించి వివరిస్తూ ఉంటే అందరూ శ్రోతలై వింటున్నారు.

“పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురూ ఒకరికి ఒకరై తోడూ, నీడై సంతోషంతో వేసే మురిపాల ముచ్చట్లు మొదటి అడుగు. తమ హృదయాంతరంగాల్లో ప్రేమ భావతరంగాలతో వేసే అడుగే రెండో అడుగు. పెద్దలపట్ల వినయ విధేయతల్ని చూపిస్తూ సంప్రదాయాల సంరక్షణ కోసం వేసే ముచ్చటైన అడుగు మూడవది. వేదధర్మానికి వన్నెలు దిద్దుతూ భారతీయ సంస్కృతికి నిలువెత్తు సాక్షంగా వేసే నాణ్యమైన అడుగే నాల్గవది. ప్రేమ వాహినిలో విహరిస్తూ ఉభయ కుంటుంబాల ఔన్నత్యాన్ని దశదిశలా వ్యాపింప చేస్తూ వేసే ఆభిజాత్యానికి ఆలవాలమైన అడుగు అయిదవ అడుగు. గృహస్థాశ్రమ స్వీకారానికి శ్రీకారం చుడుతూ వేసే ఆనందదాయకమైన అడుగు ఆరవది. అనంత ప్రేమ వాహినిలో విహరిస్తూ జీవన వసంతాన్ని స్వాగతిస్తూ వేసే సత్యం శివ, సుందరమైన అడుగే సప్తమ అడుగు. ఈ ఏడు అడుగులే సప్తపది” పురోహితుడు అన్నారు.

అక్కడే నిలబడి వింటున్న సీత వేపు చూశాను. ఆనాటి సీతమ్మ కష్టాలు ఈనాటి సీతకి వచ్చాయి. పురోహితుడు చెప్పిన విషయాలు విన్న సీత మనసులో ఏ భావాలు కలిగాయో నాకు తెలియదు కాని నా మనస్సులో మాత్రం ఒక్కటే ఆలోచన. ‘సీత మొగుడికి ఈ సప్తపది అదే ఏడు అడుగుల బంధం విలువ తెలియదు. అందుకే సీతకి విడాకులు ఇచ్చాడు. ఒక్క సీత మొగుడే కాదు, ఇలా విడాకులు ఇస్తూ పోతున్న నేటి యువతీయుకులందరకీ ఈ ఏడడుగుల బంధం గురించి తెలియదు. తెలిసి ఉంటే అలా విడాకులు ఈయరు.’ అనుకుంటూ గాఢంగా నిట్టూర్పు విడిచాను. ‘మగ, ఆడ – పెళ్లి అనే బంధంతో బంధిపబడి వధూవరులు అవుతారు. ఆ తరువాత మూడు మూళ్ళూ పడ్డాక, ఏడడుగులు నడిచాక భార్యాభర్తలుగా వారి బంధం బలపడుతుంది. ఇది చాలా పవిత్రమైనది. కేవలం లైంగిక ఆనందం కోసం కాదు, మానసిక ఆనందం కోసం కూడా ఈ పెళ్ళి తంతు’ తిరిగి అనుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here