ఫీల్ గుడ్ చిత్రం హ్రిదయం (మలయాళం)

6
3

[dropcap]ఈ[/dropcap] చిత్రం డిస్నీ హాట్ స్టార్ OTT లో లభ్యం

ఈ చిత్రాన్ని ‘హ్రిదయం’ అని వ్రాశారు, ఈ సినిమా పేరుని ఇలాగే ఉచ్చరించాలిట మలయాళంలో. సరే అలాగే అందాం, తప్పేముంది?

***

చాలా బాగుంది. అలాగని చెప్పి కళాఖండం ఏమీ కాదు. చెప్పదలచుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పిన చిత్రం.

కుటుంబ సమేతంగా చూడొచ్చు. టీనేజి పిల్లల తలితండ్రులు చూడాల్సిన చిత్రం. ఆ వయసులో పిల్లల భావావేశాలు, కోపతాపాలు, క్షణికోద్రేకంతో తీసుకునే నిర్ణయాలు, పశ్చాత్తాపాలు, నిరాశలు తదితర అంశాలు చక్కగా చూపారు. ఎక్కడా నేల విడిచి సాము చేయదు ఈ సినిమా.

ఏ ఆస్కార్ అవార్డో, జాతీయ అవార్డో రాదగ్గ చిత్రం కాకున్నా, ఖచ్చితంగా ఒక చక్కటి చిత్రం. నిరాశ కల్గించదు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలని ఒక ఊపు ఊపిన మణిరత్నం తీసిన ‘గీతాంజలి’ గుర్తుందిగా. గీతాంజలికి ఈ ‘హ్రిదయం’కు కథలో ఏ మాత్రం పోలికలేకున్నా, అదే స్థాయి ఫోటోగ్రఫీ, చక్కటి నేపథ్య దృశ్యాలు, భావుకత్వం తదితర అంశాలతో కూడుకుని ఉంటూ, దానికి తోడుగా, నిజాయితీగా, ఇంకా క్లాస్‍గా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అని చెప్పచ్చు.

చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చలన చిత్రానికి.

ప్రముఖ మలయాళ కథానాయకుడు మోహన్‍లాల్ పుత్రుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన ‍చిత్రం ఇది. కథా నాయికలలో ఒకరిగా కళ్యాణి ప్రియదర్శన్ నటించింది (ఈ అమ్మాయి అలనాటి హీరోయిన్ లిజీ మరియు బహుభాషా దర్శకుడు ప్రియదర్శన్ ‍ల పుత్రిక).

యూత్ ఫిల్మ్ కద అని చెప్పి పిచ్చి పిచ్చి పాటలు, కుప్పి గంతులు, ఫైట్లు లేవు. చౌకబారు సంభాషణలు లేవు. అద్యంతం బాధ్యతాయుతంగా తీయబడ్డ చిత్రం ఇది.

ఈ చిత్ర దర్శకుడు వినీత్ శ్రీనివాస్ ప్రమోషన్ మీట్స్‌లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, “ప్రతి ఒక్కరూ తమ కాలేజి లైఫ్‍ని గుర్తు చేసుకుని ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతారు, ఈ చిత్రాన్ని చూసి”.

అంటే, ఒక విషయం సుస్పష్టం, ఈ చలన చిత్రం యూత్ ఫిల్మే అయినప్పటికీ టార్గెట్ ఆడియెన్స్, యూత్ మాత్రమే కాదు. అందరూ చూసి ఆనందించదగ్గ సినిమాగా దీన్ని రూపుదిద్దారు. అందువల్ల చౌకబారుగా లేదు.

***

మెర్రీలాండ్ స్టూడియోస్ కేరళలో ఒక పాత తరపు నిర్మాణ సంస్థ. 1950 ప్రాంతాలలో ఇది తన ప్రయాణం ప్రారంభించిది. మన విజయా సంస్థతో సరిపోల్చవచ్చు దీన్ని. మెర్రీలాండ్ సినిమా అని పేరు మార్చుకుని, మళ్ళీ ఈ హ్రిదయం చిత్రంతో తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడం ఒక మంచి పరిణామం.

బహుముఖ ప్రజ్ఞాశాలి వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రానికి దర్శకుడు.

***

నేను సినిమాలు చూసేదే తక్కువ. అందులోనూ ప్రేమకథాచిత్రాలు ఇంకా తక్కువ. నేను సినిమా చూడబోయే ముందు దర్శకుడు ఎవరా అని చూస్తాను.

స్వతహాగా ప్రేమ కథా చిత్రాలంటే బోర్ నాకు. ఒకటే రకం కథ, నాలుగు పాటలు, జోకులు, అపార్థాలు, విడిపోవడాలు, విరహాలు, అయితే విషాదాంతం, లేదా సుఖాంతం. మంచి దర్శకుడు తీసిన చిత్రమైతే తప్ప ప్రేమ కథా చిత్రాన్ని చూడటానికి మొగ్గు చూపను. గుల్జార్, కుందన్ షా, కె. బాలచందర్, సుకుమార్ లాంటి దర్శకుల చిత్రాలైతేనే ప్రేమ కథలు చూడటానికి ఇష్టపడతాను.

నాకు వ్యక్తిగతంగా సస్పెన్స్, థ్రిల్లర్స్, హారర్, అడ్వెంచర్ చిత్రాలు ఇష్టం.

నేను చూసిన ప్రేమ కథా చిత్రాలలో నాకు బాగా గుర్తుండిపోయినవి కొన్నే.

  • గోరింటాకు (శోభన్ బాబు, సుజాత, వక్కలంక పద్మ, తెలుగు)
  • హృదయం (మురళీ, హీరా. ‘ఇదయం’ తమిళ్-తెలుగు శబ్దానువాదం)
  • జానూ (సమంతా, శర్వానంద్ – ‘96’ తమిళ్- తెలుగు పునర్నిర్మాణం)
  • కలర్ ఫోటో (చాందినీ చౌదరీ, సుహాస్. తెలుగు చిత్రం)
  • సితార (భానుప్రియ, సుమన్ తెలుగు చిత్రం)
  • సాగరసంగమం (కమలహాసన్, జయప్రద. తెలుగు చిత్రం)
  • కోకిలమ్మ (సరిత, రాజీవ్. తెలుగు బాలచందర్ దర్శకత్వం)
  • నిఖా (సల్మా ఆఘా, రాజ్ బబ్బర్ హిందీ చిత్రం)

ఈ చిత్రాలన్నింటి ప్రత్యేకత ఏమిటి అంటే, సినిమా విజయం సాధిస్తుందా, అపజయం పాలవుతుందా అన్న ఆలోచన లేకుండా దర్శకుడు తనకు నచ్చిన కథని మనసుపెట్టి ఇష్టంగా తీస్తే, సినిమాలు ఎలా రూపుదిద్దుకుంటాయో , అలా తయారైన చిత్రాలు ఇవన్నీ.

ఈ హ్రిదయంలో కూడా సరిగ్గా అదే అంశం నన్ను ఆకట్టుకుంది. దర్శకుడు వినీత్ శ్రీనివాస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక యువకుడి జీవితంలో అతని పదిహేడో ఏట నుండి ముపై అయిదవ ఏట వరకు జరిగిన పరిణామాలని వీలయినంత సహజంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా.

అనవసరమైన పాటలు, ఫైట్లు, మెరుపుపాటలు, సినిమాటిక్ అపార్థాలు గట్రాలు లేవు. ఈ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలి అనే ఉద్దేశంతో పెట్టే ఏ ఫార్ములా అంశాలు లేకపోవటం వల్ల, ఒక జీవితాన్ని దగ్గరనుంచి చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ సినిమా చూసినంత సేపు. ఆద్యంతం ఫ్రెష్‌గా ఉంది. మనసుకు ఏదో హాయి కలుగుతూ ఉంటుంది ఈ సినిమా చూసినంత సేపు. మధ్య మధ్యలో కథానుగుణంగా బాధ, వేదన, దుఃఖం, కోపం, ఉత్సాహం తదితర భావాలు కలుగుతూ ఉంటాయి.

***

ఇంతకూ కథేంటి?

ప్రారంభ దృశ్యంలో అరుణ్ నీలకండన్ (ప్రణవ్ లాల్) మంగళూరు రైల్వే స్టేషన్‍లో చెన్నయ్ వెళ్ళే రైలు ఎక్కుతాడు.

ఈ టీనేజి కుర్రాడు కేరళ నుంచి వచ్చి చెన్నయి లోని కేసీ టెక్ అనే ఇంజినీరింగ్ కాలేజీలో చేరతాడు. ప్రారంభంలో చిన్న చిన్న కామెడీ దృశ్యాల అనంతరం హీరోని అతని మిత్రులని సీనియర్లు రాగింగ్ చేయటం అనే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా అతనికి దర్శన (దర్శన) అనే అమ్మాయి తారసపడుతుంది. ఆమెతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అతి తక్కువ సమయంలోనే ఇద్దరూ బాగా ఆప్తులవుతారు. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం ఏర్పడుతుంది.

స్నేహితులు ఎంత వారించినా అరుణ్ ఒక విషయం దాచకుండా చెప్తాడు. ఆ అమ్మాయికి ఇతని మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. దాంతో ఆమె అతనికి దూరం అవుతుంది. దర్శనని పైకి ద్వేషిస్తాడే కానీ ఆమెని మరవలేకపోతుంటాడు. ఆమె పరిస్థితి కూడా అంతే.

కానీ ఇద్దరూ సవాల్ విసురుకుంటారు.

‘నిన్ను మించిన జీవిత భాగస్వామిని పొందుతాను, నిన్ను తిరిగి జీవితంలో స్వీకరించే ప్రసక్తే లేద’ని ఉభయులూ ఛాలెంజ్ చేసుకుంటారు. దర్శన స్పీకర్ ఫోన్ పెట్టి గర్ల్స్ హాస్టల్ అమ్మాయిలు అందరూ వింటుండగా ఇది జరుగుతుంది.

ఈ క్రమంలో అతను అందరి ముందు పలచన అవుతాడు, ఆ అవమాన భారంతో అతను త్రాగుడికి అలవాటు పడతాడు.

అతను క్రమంగా చదువులో వెనుకపడతాడు. పరీక్ష తప్పటం అనేది మామూలు విషయం అవుతుంది. అతని చుట్టూ నైతిక విలువలు పెద్దగా లేని స్నేహితులు ఒక్కొక్కరుగా చేరతారు. తనను ఎవ్వరూ పట్టించుకోకూడదు అన్న ఉద్దేశంతో, ఏదో కసితో అతను ఈ అప్రయోజకుల సమూహంలో ఎక్కువ తిరుగుతుంటాడు. ఈ పరిస్థితులలో దర్శనకి కేదార్ (అభిషేక్ జోసెఫ్) అనే ఇంకో కుర్రాడు పరిచయం అవుతాడు. అతను పైకి మంచిగా కనిపించే పయోముఖవిషకుంభం. అరుణ్ అతని నిజ స్వరూపాన్ని గూర్చి చెప్పినా దర్శన నమ్మదు. చివరికి అతని బారి నుంచి ఆమెని కాపాడతాడు. దర్శన స్నేహితురాలు ఉండుకుని, “ఇదంతా దర్శనని ఇంప్రెస్ చేయటానికి చేస్తున్నావు, వెళ్ళు అవతలికి” అంటుంది

అతనిలో ఏదో కసి.

ఈ క్రమంలో హఠాత్తుగా అతనికి తన స్థితి పట్ల తనకే అసహ్యం వేసి, ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే సెల్వ (కాలేష్ రామానంద్) అనే ఒక మంచి కుర్రాడికి దగ్గర అవుతాడు. ఆ తరువాత కఠోర సాధన చేసి , సెల్వ వాళ్ళ స్నేహబృందంతో కలిసి కంబైన్డ్ స్టడీ చేసి ఒక్కసారిగా క్లాస్ టాపర్స్‌లో ఒకడిగా మారిపోతాడు.

మెల్లిగా దర్శన కూడా ఇతనితో స్నేహంగా ఉండటం ప్రారంభిస్తుంది.

ఈలోగా అరుణ్ మాయ (అను) అనే అమ్మాయికి దగ్గర అవుతాడు కానీ, ఆమె సూటిగా అడిగిన ప్రశ్నకి సమాధానంగా, ‘తాను దర్శనని ప్రేమించానని’ చెప్పటంతో మాయ కూడా దూరం అవుతుంది.

ఇక ఇంజినీరింగ్ కోర్స్ ముగుస్తుంది. రైల్వే స్టేషన్‌లో అరుణ్‌కి వీడ్కోలు పలకటానికి దర్శన కూడా వస్తుంది. ‘అన్నీమరచి పోయి మళ్ళీ మనం కలిసి ఉండలేమా’ అని అడగనే అడుగుతుంది. అరుణ్ ఏమీ సమాధానం చెప్పడు.

ప్రేమ కథా చిత్రాలలో ప్రేమికులకు ఎదురయ్యే పెద్ద కష్టాలు:  కులం, మతం వేరే కావడం, ఆర్థిక అంతరాలు, భాషా బేధాలు, ప్రాంతీయ తారతమ్యాలు వంటివి.

కానీ ఈ చిత్రంలో అవేవి సమస్యలుగా వీళ్ళ ప్రేమకి అడ్డురావు. మరి ఏమిటి అడ్డు వస్తుందంటే, ఈగో క్లాషెస్, విపరీతమైన దూకుడుతో కూడిన నిర్ణయాలు. వీటి కారణంగా కథ ఎలా మలుపులు తిరిగింది? ఆ తర్వాత కథ ఎలా నడుస్తుంది, నిత్య (కళ్యాణీ ప్రియదర్శన్) ఎవరు? ఆమె పాత్ర ఏమిటి? ఒక దశలో దర్శన భావోద్వేగంతో ఎలా ప్రవర్తిస్తుంది, చివరికి ఏమయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే చలనచిత్రాన్ని పూర్తిగా చూడాల్సిందే.

ఆ తర్వాత కథ ఎలా మలుపులు తిరిగింది చివరికి ఏమయింది అనేది తెలుసుకోవాలంటే చలనచిత్రాన్ని చూడాల్సిందే.

***

ఓవరాల్‌గా ఈ చిత్రానికి మంచి మార్కులు వేయవచ్చు.

ఓ పది పదిహేను సంవత్సరాల పాటు జరిగే జీవితాన్ని కథగా చెప్పుకొచ్చారు. ఫ్లాష్‌బాక్ టెక్నిక్ వంటివేవీ వాడకుండా స్ట్రెయిట్ నెరేటివ్ టెక్నిక్‌లో చెప్పుకుంటూ వెళతారు కథ.

ఈ కథ 2005 -2010 ల మధ్య ప్రారంభం అయింది అని, మనం కనుక్కోవచ్చు. కథా ప్రారంభ సమయంలో రైలు బోగీల రంగు, రైల్వే స్టేషన్‍లో ఉండే ప్రకటనల బోర్డులు, కార్ల మోడల్స్, పాత్రలు వాడే కీపాడ్ సెల్ ఫోన్స్, ఆర్కుట్ (Orkut) అకౌంట్ ద్వారా సోషియల్ మీడియా చాటింగ్ చేసుకోవటం, ఆధారంగా మనం ఈ విషయాన్ని కనుక్కోవచ్చు

ప్రస్తుత కాలంలో కథ ముగుస్తుంది.

***

ఈ చిత్రంలో నేను గమనించిన కొన్ని అంశాలు.

  • ఆహ్లాదకరమైన సంగీతం ఆద్యంతం వీనుల్ని సోకుతూ ఉంటుంది.
  • ‘నగుమోము కనలేని నా జాలి తెలిసి…’ అనే త్యాగరాజ స్వామి కీర్తన చక్కగా తెలుగులో వినిపిస్తూ ఉంటుంది కీలక సన్నివేశాలలో. ఒక విధమైన తాదాత్య్మ స్థితికి ప్రేక్షకుడిని తీసుకువెళ్ళటంలో త్యాగరాజ కృతుల్ని చక్కగా ఉపయోగించుకున్నారు. యూత్ ఫిల్మ్‌లో ఇలాంటి క్లాసికల్ సంగీతం వాడటం, (అదికూడా సరి అయిన విధంగా), దర్శకుడి అభిరుచిని సూచిస్తుంది.
  • ఇప్పటి యువతరం తాలూకు జీవన శైలిని చూపించటంలో సఫలీకృతుడు అయ్యాడు దర్శకుడు. వారు ఉద్యోగ భద్రత కంటే తమ మనసుకు తృప్తి కలిగించే వృత్తిని ఎన్నుకుని తారాపథంలో దూసుకుపోవటాన్నిఆయన అద్దం పట్టినట్టు చూపించాడు.
  • క్యాంపస్ జీవితం, రాగింగ్, స్నేహాలు, పరీక్షలు, పోటీలు, కాంపస్ సెలెక్షన్‌లో ఉద్యోగాలు రావటం అన్ని అంశాలు చక్కగా సహజంగా చూపించారు.
  • బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ చిత్ర దర్శకుడు వినీత్ శ్రీనివాస్ ఈ చిత్రంలో తన అద్భుత గాత్రంతో మన మనసుల్ని దోచే పాటలు కూడా పాడాడు. చిత్ర సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వహాబ్ కూడా కొన్ని పాటలు పాడాడు.
  • కొసమెరుపు ఏమిటి అంటే, ఏ.ఆర్.రెహమాన్ ఈ పాటల్ని విని పరవశించి పోయి ఇటీవల ప్రతి వేదిక మీద ఈ సినిమా పాటలని తెగ మెచ్చుకుంటున్నాడు
  • ముఖ్యంగా, ఈ చిత్రంలో హీరో తన నైరాశ్యం నుంచి, ఓటమి నుంచి తానే బయటపడి, కఠోర సాధన చేసి, విజేతగా నిలబడిన ఎపిసోడ్, యువతకి ప్రేరణగా నిలబడుతుంది. ఇలా చూపటం సినీ దర్శకుల సామాజిక బాధ్యత. చాలా చక్కగా ఉంది ఈ పాయింట్.

***

తారాగణం

అరుణ్ నీలకండన్ – ప్రణవ్ మోహన్ లాల్

దర్శన-దర్శన

నిత్య-కల్యాణీ ప్రియదర్శన్

కలేష్ రామానంద్ – సెల్వ

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం – వినీత్ శ్రీనివాసన్

నిర్మాత -విశాఖ సుబ్రమణియం

సంగీతం -హేషం అబ్జుల్ వహాబ్

ఫోటోగ్రఫీ – విశ్వజీత్ ఒడుక్కదిల్

కొసమెరుపు ఒకటి చెప్పనా, ఈ చిత్రం బడ్జెట్ కేవలం ఎనిమిది కోట్లు. మీరు సరిగానే చదివారు. కేవలం ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి చిన్న మార్కెట్ కేరళలో ఈ చిత్రం దాదాపు అరవై అయిదు కోట్లు* సంపాయించింది.

కరణ్ జోహార్‌కి చెందిన ధర్మ మూవీస్ మరియు ఫాక్స్ స్టార్ సంస్థలు, ఈ చిత్రం యొక్క హిందీ, తెలుగు, తమిళంకి సంబంధించి రీమేక్ హక్కులు కొనుగోలు చేశారు అని అధికారికంగా తెలియవచ్చింది. అవి ఎన్ని కోట్లు వస్తాయో.

మన బాహుబలులు, ఆరారార్లు ఇలాంటి వార్తలు వినాలి.

మనసుపెట్టి సినిమా తీస్తే తక్కువ బడ్జెట్‌తో చక్కటి సినిమా తీయవచ్చు, కమర్షియల్‌గా కూడా హిట్ కొట్టవచ్చు అని మరొక్కసారి ప్రూవ్ అయింది.

* సోర్స్: వికీ పిడియా. https://en.wikipedia.org/wiki/Hridayam

***

(ఈ చిత్రాన్ని చూడమని పదే పదే నన్ను కోరిన నా టీనేజి పుత్రుడు శశాంక్ శేఖర్‍కి కృతఙ్జతలు.

నువ్వు ఈ సినిమా చూడాలి. తప్పక ఎంజాయ్ చేస్తావు అని భరోసా ఇచ్చి, నువ్వు ఈ సినిమా గూర్చి రివ్యూ వ్రాస్తే చూడాలనుంది అని కోరిన మిత్రుడు ఎస్వీ కృష్ణన్‌కి కృతఙ్జతలు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here