[dropcap]శ్రీ [/dropcap]గొర్రెపాటి శ్రీను రచించిన 26 కథల సంపుటి ‘ప్రియసమీరాలు’.
పుస్తకానికి ముందుమాట వ్రాసిన సుప్రసిద్ధ సినీ రచయిత శ్రీ తోటపల్లి సాయినాథ్ – తను పొందిన అనుభూతిని పాఠకులందరూ పొందుతారని వ్యాఖ్యానించారు. మరో ముందుమాట వ్రాసిన శ్రీ ఏలూరు అశోక్ కుమార్ రావు – ఈ సంపుటి లోని ప్రతీ కథ సూక్తిసుధ అని, కథలన్నీ సందేశాత్మకమైనవని అన్నారు. “నేటి సమాజాన్ని ప్రతిబింబించే కథల సంపుటి ఇది” అని ప్రసిద్ధ రచయిత్రి బి. కళాగోపాల్ అభిప్రాయపడ్డారు.
***
ఈ సంపుటి లోని కొన్ని కథలను పరామర్శిద్దాం.
‘నవరాగాలు’ అనే కథలో నవ్య, ఆనంద్‌లు ప్రేమించుకుంటారు. ఆనంద్ ఉద్యోగ ప్రయత్నాలలో ఉంటూ, ఎప్పుడూ పెద్ద ఉద్యోగాల కోసమే చూస్తుంటాడు. అప్పుడు నవ్య “చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగంలో చేరండి. ఆ తరువాత పెద్ద వాటికి ప్రయత్నించవచ్చు. మనం మన నెగిటివ్ ఆలోచనా విధానాన్ని మార్చుకొని పాజిటివ్‌గా అలోచించటం మొదలు పెడితే విజయమే, మన వెనుక ఎప్పుడూ వుంటుంది” అని చెప్పి అతన్ని ప్రోత్సహిస్తుంది. వారి పెళ్ళి విషయంలో ఆటంకాలు ఎదురయినా, నవ్య అందించిన స్ఫూర్తితో వాటిని అధిగమిస్తాడు ఆనంద్. సానుకూల భావాల ప్రాధాన్యతని చాటుతుందీ కథ.
చదువు గురించి ‘ఆదర్శమూర్తి’ కథలో ఎంతో చక్కగా చెబుతారు రచయిత. చదువుకునే రోజుల్లో చేసే చిన్న చిన్న తప్పులు, పొరపాట్లే భవిష్యత్తును నాశనం చేస్తాయని అంటారు. కష్టపడి పట్టుదలతో చదివితే బాగా వృద్ధిలోకి వస్తారని చెబుతారు. స్ఫూర్తిదాయకమైన కథ ఇది.
‘అనుబంధాలు’ కథ చాలా బాగుంది. ఇళ్ళల్లో ఎన్ని సౌకర్యాలు వున్నా, ‘మన’ అన్న వాళ్లు ముఖ్యమని చెబుతారు. తల్లిదండ్రులు తమతోపాటు వుంటూ తమ ఎదుగుదలని చూసి సంతోషిస్తే ఎంత బాగుంటుందో చెప్పారు రచయిత.
ఇప్పటి చదువులకు అద్దం పట్టే కథ ‘దూరపుకొండలు నునుపు’. తల్లిదండ్రులు తమ పిల్లలని ఇంటర్‌నేషనల్ స్కూల్‍లో చదివిస్తేనే బాగా చదువుతారు అనే అపోహలో ఉండి, పాపం వాళ్లు చిన్న పిల్లలు అన్న విషయాన్ని కూడా మరచి ఎన్నో కిలోమీటర్లు దూరంలో వుండే స్కూల్లో చేర్పిస్తుంటారు. అయితే మనకు దగ్గరగా వుండే స్కూల్స్‌లో కూడా మంచి చదువు దొరుకుతుంది అని ఈ కథ చెబుతుంది.
‘పంజరం’ కథలో ఇంటర్ స్థాయి విద్యార్థుల పరిస్థితులను వివరిస్తారు రచయిత. నిజంగానే పంజరంలా తయారయ్యాయి నేటి పిల్లల చదువులు. ముఖ్యంగా ఇంటర్ అనగానే పిల్లలను పేరున్న పెద్ద కాలేజీలో చేర్పించి అక్కడే హాస్టల్‌లో పెట్టి చదివిస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ఇష్టం వుందా లేదా అని తెలుసుకోరు. బలవంతంగా చదివించే కన్నా, పిల్లల అభిప్రాయాలకు విలువిస్తే వాళ్లు జీవితాల్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకుంటారని ఈ కథ చెబుతుంది.
భార్యాభర్తల నడుమ ఎక్కువ తక్కువలు ఉండవని; ఇద్దరూ ఎప్పుడూ ఒక్కటే అని ‘శ్రీమతి ఉద్యోగం’ కథలో రచయిత చాలా చక్కగా చెబుతారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే భార్యలు భర్తలను చిన్నచూపు చూడరని, ఈ విషయంలో అపోహలు పెంచుకోకూడదని చెబుతారు.
‘ప్రేమ సంబంధం’ కథలో పిల్లలు ప్రేమించుకుంటే పెద్దలు వాళ్లను అర్థం చేసుకొని ఎట్లా ఒకటి చేస్తారో బాగా చెప్పారు.
చదువుకునే రోజుల్లో ప్రేమించిన అమ్మాయి అంగీకారం తెలపలేదని ఆత్మహత్య చేసుకోబోయిన కుర్రవాడికి ఆ అమ్మాయి తన ఆశయం గురించి చెబుతుంది. అప్పుడు అతను తన తప్పు తెలుసుకుని తాను కూడా ఆమె ఆశయాన్నే తన ఆశయంగా చేసుకొని తనకి తోడు నిలుస్తానంటాడు. స్ఫూర్తిదాయకమైన మరో కథ ‘ఆశయం’.
‘నువ్వే కావాలి’ కథలో ఓ మనిషి ఎదగటం, ఉన్నత శిఖరాలను అదిగమించటం వెనుక మరొకరి సపోర్ట్ తప్పక వుంటుందని రచయిత వెల్లడిస్తారు. ప్రతి మగవాడి వెనకాల ఒక స్త్రీ వుంటుందని పెద్దలు అంటారు. అలా ఈ కథలో కూడా ప్రేమించిన అమ్మాయి స్ఫూర్తితో ప్రేమికుడు ఎన్నో విజయాలను తన సొంతం చేసుకుంటాడు.
‘మ్యారేజెస్ ఆర్…’ అనే కథలో ప్రేమ వివాహం గొప్పదా, పెద్దలు కుదిర్చిన పెళ్ళి గొప్పదా అనేది కథాంశం. ఇందులో రచయిత పెళ్ళి గురించి బాగా రాసారు. ప్రేమ పెళ్ళైనా, పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా – ఏదైనా వివాహం ఉత్తమ బంధమని; పెళ్ళికి ముందు ప్రేమించడమే కాదు పెళ్ళైయాక కూడా ప్రేమించడం, ప్రేమించబడడం గ్రేట్ అని, అది అన్యోన్య దాంపత్యానికి మూలకారణం అని చెప్తారు.
ఈ కాలంలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఎంత మంది ఎన్ని విధాల మోసపోతున్నారో ‘అవకాశం’ కథలో తెలిపారు రచయిత. అలా మోసపోకుండా తన ప్రతిభను నమ్ముకున్ని చక్కని ఉద్యోగం సంపాదించడమే మంచిది అని యువతలో ప్రేరణ నింపుతారు.
తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని, ముఖ్యంగా చదువు విషయంలో తప్పక పిల్లల ఉద్దేశాలను గౌరవించాలని చెప్తారు ‘నెక్స్ట్ ఏంటి?’ కథలో. పిల్లలు వాళ్లు ఇష్టపడుతున్న రంగంలో చేరితే వారి పనిలో రాణిస్తారు అని ఈ కథ చెప్తుంది.
ఈ సంపుటిలోని భిన్నమైన కథ ‘కొత్త పాఠం’. ప్రతి మనిషి వస్తున్న డబ్బును ఖర్చు పెడతున్నాడు. కాని పొదుపు అనేది లేకుండా వుంటున్నాడు. కాని మన భవిష్యత్తుకు కావలసిన వనరులను మనం జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే ఎంతో మంచిది, అది చాలా ముఖ్యమని ఈ కథ గుర్తు చేస్తుంది.
ప్రేమించిన అమ్మాయి మంచి మాటల వలన తనలోని లోపాలను సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు మార్పును తెచ్చుకుంటాడు అబ్బాయి ‘ఓ ప్రేమ కథ’లో. అలాగే ఆమె అమ్మాయి ఆశయం తెలుసుకొని తాను అందుకు తోడుగా నిలుస్తానని చెపుతాడు. ఆసక్తిగా చదివించే కథ ఇది.
తల్లిదండ్రులు తమ పిల్లలే సర్వస్వం అనుకుంటారు. వారి కోసం ఎంతో కష్టపడతారు. అలాంటి పిల్లలు ఉన్నత స్థితికి వచ్చాక తమని పట్టించుకోకపోతే వారికి ఎంతో బాధగా వుంటుంది. మనం ఎంత బిజీగా వున్నా తల్లిదండ్రుల బాగోగులు తెలుకోవాలని సూచించే కథ ‘రెక్కలొచ్చిన పక్షులు’.
‘మొక్కై ఎదగాలి’ అనే కథ చాలా స్ఫూర్తిమంతంగా వుంది. బాగా చదివే పిల్లలు – హఠాత్తుగా వెనుకబడితే టీచర్లు, ఇంట్లోని తల్లిదండ్రులు కూడా కారణాలు తెలుసుకుని వారిని అర్థం చేసుకొని వారి జీవితం ఎదగడానికి నాలుగు మంచి మాటలు చెప్పి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు నిజ జివితంలో ఎన్నో విజయాలను తమ సొంతం చేసుకోగలరని చెప్తుంది.
‘ప్రియసమీరాలు’ కథలో ఓ జంటకి వివాహం నిశ్చయమై, కట్నం దగ్గర రాజీ కుదరక పెద్దలు సతమతమవుతారు. అప్పుడు అబ్బాయి – అమ్మాయితో విడిగా మాట్లాడాలని అడుగుతుతాడు. అనంతరం అబ్బాయి తరఫువారు తమ ఇంటికి వెళ్ళిపోతారు. వివాహ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఉద్యోగం ఉండదు. తల్లిదండ్రులపై ఆధారపడకుండా, స్వంతంగా ఎదగమని ఆ అమ్మాయి చెప్పిన మాటలలో వాస్తవాన్ని గ్రహించి తన జీవితాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తాడా అబ్బాయి. ఈ సంబంధం కుదురిందా లేదా అనేది ఆసక్తిదాయకం.
ఈ సంపుటిలోని ఇతర కథలు – సారీ! కార్తీక్, రాజకీయం, తొలి చూపులోనే, ప్రామిస్, జయం, డియర్ శ్రీకర్, అలా మొదలైంది, విజ్ఞానబీజాలు, ఒకరికొకరు – కూడా పాఠకులలో ఆసక్తిని కలిగిస్తాయి.
***
ప్రియసమీరాలు (కథలు)
రచన: గొర్రెపాటి శ్రీను
ప్రచురణ: మన్విత ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 120
వెల: ₹ 100
ప్రతులకు:
గొర్రెపాటి శ్రీను
ఇంటి నెం: 49-258/2, ఫ్లాట్ నెం. 188,
పద్మానగర్, ఫేజ్ 1
బాలనగర్, హైదరాబాద్ 500037
ఫోన్: 9652832290
అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు.