చిరుజల్లు 21

0
3

కలలు – సంకెలలు

[dropcap]T[/dropcap]he world loves lovers.

రామనాధం స్కూలు టీచరు. సుబ్రమణ్యం మున్సిపల్ ఆఫీసులో గుమస్తా. ఇద్దరికీ ఒకే ఇంట్లో వేరు వేరు పోర్షన్లు. ఎప్పుడూ ఒకే కుటుంబుంలా కల్సి మెల్సి ఉంటుండేవారు.

స్కూలు టీచరు కొడుకు సత్యమూర్తి. మున్సిపల్ గుమస్తా కూతురు అరవింద. పిల్లలిద్దరూ ఒకే వయసు వాళ్లు. వెన్నెల రాత్రిళ్లు ఆరుబయట నవారు మంచం మీద పడుకుని కబుర్లు చెప్పుకునేటప్పుడు, సత్యమూర్తి కాలు మీద కాలు వేసుకునేవాడు. అరవింద సత్యమూర్తి గుండెల మీద చెయ్యి వేసి పడుకునేది. పిల్లలు నిద్రపోయాక వదినగార్లు ఇద్దరూ వచ్చి కూర్చునేవారు.

“మా అమ్మాయిని మీ వాడికి చేసుకోండి వదినా?”

“అలాగే, కట్నం ఏ మాత్రం ఇస్తారు?”

“కట్నం ఏమీ ఇవ్వలేం గానీ, మీ వాడ్ని చదువుకోటానికి లండన్ పంపిస్తాం…”

“మీరేం పంపిచఖ్ఖర్లా…. నిద్దర లేవగానే వాడే వెళ్తాడు లండన్…”

స్కూలు టీచరు, మున్సిపల్ గుమస్తాను అడిగేవాడు.

“మీ అమ్మాయి ఫీజు కట్టలేదు ఇంకా?…”

“మీరు కట్టండి… మీ కోడలేగా…”

“సరే, నాకు తప్పుతుందా?”

రామనాధం దంపతులు ఏదో పండగనో, వ్రతమనో, నోము అనో ఏడాదికోసారి పక్కింటి దంపతులకు కొత్త బట్టలు పెట్టేవారు.

“మీ అల్లుడికి బట్టలు పెట్టరా?” అని అడిగేది వదినగారు.

“అయ్యో, అల్లుడి తరువాతే మీరంతా…” అనేది వదినగారు.

ఏదో ఒక వంకతో వీళ్లూ వాళ్ల రుణం ఉంచుకునే వారుగారు.

“మీ కోడలికి మీరు పెట్టిన పరికిణీ నచ్చలేదుట…” అనేది వదినగారు.

“అమ్మో, మా ఇంటికి మహాలక్ష్మి, దానికి తక్కువ చేస్తామా?” వదినగారి సముదాయింపు.

సత్యమూర్తి, అరవింద హైస్కూలు చదువుకునే రోజుల్లోనూ అరవిందను తన సొంత ఆస్తిలాగానే చూసుకున్నాడు. ఆ పిల్లను అడుగుడుగునా కంట్రోలు చేయటానికే ప్రయత్నించేవాడు.

పగలంతా శివాలయంలోని పొగడ పూల, పున్నాగ పూల చెట్ల పాదాల చెంత ఇద్దరూ ఒద్దికగా కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు.

రాత్రి ఒక చోట కూర్చుని పాఠాలు చదువుకునేవారు. సత్యమూర్తి నిద్రకు ఆగలేక కునికిపాట్లు పడుతుంటే, అరవింద – నెత్తిన ఒక మొట్టికాయ వేసి, అటు తిరిగి పెద్దగా పాఠం చదువుకునేది.

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మార్పు అనివార్యం. కళ్ల ముందు కాలం వింత వింత గారడీలు చేస్తుంది.

టీచరుగారికి, మున్సిపల్ గుమాస్తాగారికీ, అరు నెలలు అటూ ఇటూగా బదిలీలు అయినయి. నగరంలోనే విసిరేసినట్లు చెరో మూలకు మకాం మార్చారు.

ఇళ్లూ వాకిళ్లూ మారినయి. మనుషులూ గుర్తుపట్టలేనంతగా మారారు. మనసులు సంగతి సరేసరి.

అప్పుడప్పుడు కలుస్తూ విడిపోతూ ఉండగానే, ఈ సంయోగం వియోగాల మధ్యనే, పిల్లవాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. పెద్దవాళ్లు మరీ పెద్దవాళ్లు అయ్యారు.

ఎక్కడో తప్ప స్కూలు టీచర్లు న్యాయంగా, ధర్మంగా, నలుగురిలో గౌరవానికి లోటు లేని విధంగా జీవించటానికి అలవాటుపడతారు. ఎందుకంటే భవిష్యత్ తరానికి విద్యాబుద్ధులు నేర్పి, ఆదర్శప్రాయమైన యువతను తీర్చిదిద్దాల్సిన గురుతరమైన బాధ్యత వాళ్ల వృత్తిలోనే ఉంది.

అందుచేత రామనాధం జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే ఆగిపోయింది.

సుబ్రహ్మణ్యంకు దశ తిరిగింది. టౌను ప్లానింగ్ సెక్షన్లో, అందులోనూ నగరంలోని లేఅవుట్స్, బిల్డింగ్ ప్లాన్‍లు ఆమోదించే సెక్షన్లో కీలకమైన పోస్టులోకి చేరిపోయాడు.

రోజూ రాత్రి పదకొండు గంటల దాకా బిల్డింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలతోనే సరిపోయేది. సిరిదా వచ్చిన వచ్చును అన్నట్లుగా ఉంది సుబ్రమణ్యం పరిస్థితి.

ఒకసారి డబ్బు సంపాదనకి అలవాటు పడితే, అదొక పెద్ద మత్తు. ఒక పెద్ద వ్యసనం.

ఇది వరకటి సుబ్రమణ్యాన్ని చూసిన వాళ్లు, ఇప్పటి సుబ్రమణ్యాన్ని చూసి గుర్తు పట్టలేరు.

మనిషి బాగా లావు అయినాడు. మూడు కార్లు కొన్నాడు. నాలుగు ఇంద్రభవనాలు లాంటి ఇళ్లు సంపాదించాడు. పలుకుబడి కూడా పెరిగింది. భారీ కాంట్రాక్టర్లు, మినిస్టర్లు, బిజినెస్ పీపుల్ అంతా సుబ్రమణ్యానికి అతి సన్నిహితమైన మిత్రులు. వాళ్ల లావాదేవీల్లో సుబ్రమణ్యానికి వాటాలున్నయి. సినిమా వాళ్లకు లక్షలు లక్షలు వడ్డీలకు ఇస్తున్నాడు. అతని సంపద ఎంత ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే, అజ్ఞాతంగా ఎన్ని కంపెనీలలో పెట్టుబడి పెట్టాడో ఎవరికీ తెలియదు.

ఎప్పుడో ఒకసారి పాపం పండుతుందంటారు. సుబ్రమణ్యం విషయంలో పండేదాక పాపం పెరుగుతూనే ఉంది.

రేపు రిటైర్ కాబోతున్నాడనగా, ఏ.సి.బి వాళ్లు అతన్ని పట్టుకున్నారు. అతనూ వాళ్లను పట్టుకున్నాడు – పట్టుకొమ్మను పట్టుకున్నట్లు.

పెద్దగా నష్టపోయిందేమీ లేదు.

భాగ్యాన్ని అపారంగా సంపాదించినా, మహాభాగ్యాన్ని, అదే ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. డబ్బుతో పాటే జబ్బులూ వస్తాయి.

కాన్సర్ వ్యాధితో నరకయాతన అనుభవించి… అప్పుడొక రకంగా అనుభవించి, ఇప్పుడకొ రకంగా అనుభవించి… పోయాడు.

స్కూలు టీచరు ఇంకా ఇంకా పిల్లలకు చెప్పాల్సిన పాఠాలు ఎన్నో మిగిలిపోయాయే, తను పోతే వాళ్లందరికీ ఎవరు చెబుతారు అని  మథన పడుతూ ఆయన గుండెపోటుతో, ఒక రకంగా సుఖమరణం పొందాడు.

***

హైటెక్ సిటిలో అరవింద ఒక ఐ.టి. కంపెనీ పెట్టింది. మినిస్టర్ గారి చేత ప్రారంభోత్సవం చేయించింది.

ఆమె కింద ఇప్పుడు పాతిక మంది పని చేస్తున్నారు.

ఇప్పటి అరవిందకీ, పాత ఫోటోలలోని అరవిందకీ పోలికలే లేవు. మిసమిసలాడే పసి నిమ్మ పండులా ఉంది. నడయాడే నయగారాల నిలువెత్తు బంగారు బొమ్మలా ఉంది.

ఠీవి, హుందాతనం, మాటలో ఒక విధమైన గాంభీర్యం ఉట్టి పడుతున్నాయి.

ఒక రోజు పోస్టులో ఆమె ఆఫీసుకు ఒక కవరు వచ్చింది. సత్యమూర్తి అనే విద్యావంతుడు ఆమె కంపెనీలో ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తు అది.

ఆమె అతన్ని పిలిపించింది.

అతను వచ్చి వినయంగా ఆమె ముందు కూర్చున్నాడు. ఉద్యోగం కోసం వచ్చాడు గనుక కొంత గౌరవంతోనూ, పాత స్నేహం ఉంది గనుక కొంత చనువుతోనూ నమస్కారం చేసీ చేయనట్లు తల వంచీ, వంచనట్లు ఆడించాడు.

“ఎలా ఉన్నావు?” అని అడిగింది.

“చూస్తున్నావుగదా… ఇలా ఉన్నాను…”

“చాలా ఏళ్లు అయింది నిన్ను చూసి… ఏం తీసుకుంటావు?”

“…”

కాఫీ తెప్పించింది. తాగిన తరువాత అన్నది.

“నిన్ను నా కింద ఒక ఉద్యోగిగా ఊహించుకోలేను సత్యా… సారీ…” అన్నది అరవింద.

“నాకూ ఇష్టం లేదు…”

“మరి, ఎందుకు పంపావు అప్లికేషన్?”

“ఈ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు పంపించమని, మీ అమ్మ మా అమ్మతో చెబితే, మా అమ్మ నాతో చెబితే…”

“ముందు మీ అమ్మ మా అమ్మను అడిగిందా, మా అమ్మ మీ అమ్మను అడిగిందా?”

“ఖచ్చితంగా తెలియదు. మా అమ్మే అడిగి ఉంటుంది…”

“మరి…”

“ఉద్యోగం కోసం కాదు… నిన్నొక సారి చూడాలన్న చిన్న ఆశ. చాలా రోజుల నుంచీ… నువ్వే గుర్తొస్తున్నావు…. గతం నీడ లాంటిది గదా. తెంపుకుందామన్నా తెగదు.”

అరవింద నిట్టూర్చింది.

“వస్తాను…” లేచి నిలబడ్డాడు.

“ఎప్పుడన్నా వస్తూండు…” అన్నది అరవింద కూడా లేచి నిలబడుతూ.

***

స్టార్ హోటల్లో అరవింద, సత్యమూర్తి ఎదురెదురుగా కూర్చున్నారు. తినవలసిన వన్నీ తిన్నారు. వినవలసిన వన్నీ విన్నారు.

“నన్ను ఎందుకు రమ్మన్నావు, అరవిందా?”

“నీకు తెలియదా?”

“తెల్సు. కాని నిన్ను నా భార్యగా ఇప్పుడు ఊహించుకోలేను…”

“ఆ సంగతి నాకు తెల్సు…”

“మరి నన్నెందుకు రమ్మన్నావు?”

“మీ అమ్మ మా అమ్మతో చెబితే, మా అమ్మ నాతో చెప్పింది…”

“ముందు ఈ విషయం మీ అమ్మ, మా అమ్మతో ప్రస్తావించిందా, లేక…” అని అడిగాడు.

“మా అమ్మే ఈ విషయం తెచ్చి ఉంటుంది. పాత కాలం మనుషులు కదా…”

“నీ అంతస్తుకు నేను చేరుకోలేను… మనసులో ఏవో కోరికలు ఉండొచ్చు… నీ ముందు నేను పేదవాడిని… చాలా…”

“పేదరికం అనేది ఒక మానసిక స్థితి…”

“కావచ్చు. అదే కదా, అనునిత్యం నిన్ను, నన్నూ నడిపించేది…”

“డబ్బు ఒక్కటేనా కొలమానం…”

“ఇప్పటి కాలం మానం ప్రకారం అదే కొలమానం… ఎన్ని కలలు అయినా కనవచ్చు. కళ్లు తెరిచి చూస్తే సమస్త యాంత్రిక జీవన స్రవంతిని శాసించేది అదే…”

“మన ప్రేమకు విలువే లేదా?”

“అవయవాల అందం వేరు… మనసులోని సునిశిత లావణ్యం వేరు. బ్రతుకు విలాసం వేరు… చివరకు మిగిలే విలాపం వేరు. కన్నులున్నందుకు నిన్ను చూడగలిగాను. ఈ జన్మకీ, యీ జవ్వనానికీ ఇది చాలు…” అన్నాడు సత్యమూర్తి.

అరవింద కనుల వెంట రెండు కన్నీటి ముత్యాలు రాలి పడినయి.

***

జీవితంలో ఎంత ఉన్నతికి చేరామన్నది ఎంత ముఖ్యమో, అక్కడ ఎలా గడిపాం అన్నది అంతకన్నా ముఖ్యం. ఏదో ఒక బాధ. ఒక ఉపశమనం. వెంటనే ఇంకో బాధ. దాని వెంటనే మరో ఉపశమనం… ఇదే బ్రతుకు బండి నడిపించే క్రమం.

చంద్రశేఖర్ అమె జీవితంలో ఒక మెరుపులా వచ్చాడు. సుడిగాలిలా చుట్టుముట్టాడు. దుమ్మూ, ధూళి కమ్ముకున్నప్పుడు ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో కూడా తెలియదు.

“సృష్టిలో నీ అంతటి విలక్షణమైన అందం అసలు లేనే లేదు…” అన్నాడు.

అరవింద చిరునవ్వులే ఆమె చిరునామా,

“పున్నమి రాత్రి, వెన్నెల పైట పరచి, మనకు వలపుల హారతి ఇస్తోంది” అన్నాడు.

ఆమె మనసు సముద్ర కెరటంలా ఉప్పొంగింది.

“చూసే చూపుల్లో, వీచే గాలుల్లో నీకు కనిపించేవి, వినిపించేవి అన్నీ నీకై నేను చేస్తున్న ప్రణయ గీతాలాపనలే….” అన్నాడు.

కలలు ముంచుకొచ్చి ఆమె కనురెప్పలు రెపరెపలాడాయి.

అరవింద ప్రేమ తాకిడికి కరిగి నీరైపోయిన మంచు శిల్పం అయింది.

“శుష్క వేదాంతాలెందుకు? చేరువలో నున్న సుఖాల వేటకు ఇది కదా వేళ…” అన్నాడు బాహువులు చాచి.

మాది జమిందారుల కుటుంబం అన్నాడు. కోనసీమ కోబ్బరి చెట్ల మధ్యనున్న పచ్చని పంట చేలన్నీ మావే అన్నాడు. కేదారాలన్నీ మేము వదిలేసినవేనన్నాడు.

అరవింద, ఆరడుగుల అందమైన నలకూబరుడు వంటి మగవాడి మాటలకు మైమరిచి పోయింది. మిగిలిన వన్నీ మర్చిపోయింది.

సిగ్గుల మొగ్గ అయింది. చుబుకాన్ని పట్టుకొని పైకెత్తి, నుదుటి మీద చుంబించి, గాఢ పరిష్వంగంలో బందీని చేశాడు.

అరవింద వివాహానికి అన్నీ ఏర్పాట్లు జరిగిపోయినయి.

సత్యమూర్తిని పిలిచింది “నువ్వు రావాలి…”

“చూస్తాను…”

“నువ్వు రాకపోతే పెళ్లి ఆగిపోతుంది” అనీ అన్నది.

సత్యమూర్తి వెళ్లాడు. అరవింద వివాహాం అంగరంగ వైభవంగా జరిగిపోయింది.

క్రమంగా వాస్తవాలు తెల్సివచ్చాయి. అసత్యాలకీ, అతిశయోక్తులకీ దగ్గర సంబంధం ఉంది. ఇదీ తెల్సొచ్చింది.

అక్కడ కొబ్బరి చెట్లున్నయి. పచ్చని పొలాలున్నయి. అవన్నీ ఇతనివి ఏవీ కావు.

ఆరు నెలల్లో అల్లుకున్న భ్రమలన్నీ ఒక్కటొక్కటిగా తొలగిపోయినయి.

ఆనందసందోహాన్ని అందించిన ఆనాటి వాక్కులన్నీ, శుష్కప్రియాలే అయినయి.

అతనికి అరడజను మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఉండవల్సిన అవలక్షణాలన్నీ ఉన్నయి.

అరవింద మోసానికి బలయినట్లు గ్రహించే లోపే, అతని దాష్టికం మొదలైంది. కలహాల కాపురం అయింది. క్రమంగా ఆమెకున్న ఆస్తి, అతని అప్పుల కింద చెల్లుబడి అయిపోతూవచ్చింది.

అంతటితో ఆగనూ లేదు. ఒక ప్రియ బాంధవి హత్య కేసులో పీకల దాకా ఇరుక్కున్నాడు. పోలీసులు చంద్రశేఖర్ కోసం వేట మొదలెట్టారు.

అరవింద సత్యమూర్తికి చేతులెత్తి దండం పెట్టింది.

సత్యమూర్తి, చంద్రశేఖర్‌ని తన ఇంట్లో రెండు నెలలు దాచి పెట్టాడు.

ఈ కన్నీటి కథకు స్వస్తి చెప్పాలనుకుంది అరవింద. కోర్టులో విడాకుల కోసం కేసు వేసింది.

***

కొన్ని కథలు సుఖాంతం అవుతయి. మరి కొన్ని  కథలు దుఃఖాంతం అవుతయి. బ్రతుకే ఒక వింత కథ అయినప్పుడు సుఖాంతంమూ కాదు. దఃఖాంతమూ కాదు. ఈ కథ అనంతం.

హాస్పటల్‌లో పడుకుని ఉన్న అరవింద అందమంతా ఏమైందో తెలియదు. ఎముకల గూడులా ఉంది.

పక్కన కూర్చున్న సత్యమూర్తి అతి బలహీనంగా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.

ఆమె చేతిని అందుకోవాలనుకున్నప్పుడు అందలేదు. చాలా ఆలస్యంగా అందింది.

“నడమంత్రపు సిరి వచ్చి మనిద్దరినీ చెరో వైపుకు నెట్టేసింది… వచ్చే జన్మలోనైనా కలుద్దాం… పేదవాళ్లుగానే బ్రతుకుదాం…” అన్నది అరవింద.

చెంపలపై జారుతున్న కన్నీటిని తుడిచాడు సత్యమూర్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here