బడి

0
3

[dropcap]మా[/dropcap] రాజన్న యాదికచ్చినప్పుడల్ల నా మనసుల ఆలోసన్లు వానకాలంల ఈగలవారం జొబ్బున ముసురులైతై. తురుకోని జమానల తెలుగోళ్ళని పెండలపురుగుకన్న కటీనంగ జూసిండ్రు. తెలుగోళ్ళ వాసన దలుగులె ముక్కు మూసుకునెటోళ్ళు – ‘అప్పులం’ వాసన దలగినట్టుగ. అప్పులాన్ని కట్టెతోని దీస్కపొయ్యి వాడవుతల పారేసచ్చి తానం జేసినట్టు జేసెటోళ్ళు – ఆళ్ళు తానం జెయ్యకపోయ్యినా, జుమ్మకుజుమ్మే తానంజేసినా తెలుగోళ్ళని ఎకసెక్కం జేసెటోళ్ళు, తెలుగోళ్ళకు సదువురాదు. ఏ గొప్పోలసుంటోళ్ళు సదువుకున్నాగూడ గింతంత గా ఉర్దులనే. తురుకోళ్ళకు గింతంత రాతపూత కస్తెజాలు ఆళ్ళే దొరలు. తెలుగోళ్ళు బాంచెగాళ్ళు. బాంచెగాళ్ళకు పేరుగూడ వినసొంపుగుంటే వాళ్ళు ఎకసెక్కం జేసేటోళ్ళు, కంపిన్ల పనికిదీసుకునెటప్పుడు రిజిస్టర్ల పేరు రాసుకునెటప్పుడు…

“ఆఁ… నీ పేరేంది బే!”

“నా పేరు మల్లోజీ, దొర!”

“ఏంటిది? మల్లోజి మల్లో – ‘జీ’ ఎవ్వనికిరా నువ్వు ‘జీ’? సాలే! మాకేలౌడే! మల్లీతాపె ‘జీ’ అన్నవంటే నీ ‘జీ’ లేకుండజేస్త! బద్మాష్ కే పొట్టే. గింజంత లేడు గని జీ అట జీ, తినుటానికి గటు కూడుండది, తొడుక్కోను అంగి పేగుండదిగని పేరు మట్టుకు ‘జీ’. అక్కడికి మంచిగనే రాసుకుంటున్న. నీ పేరు ‘మల్లిగా’ అని, యిన్నావురా! పో ‘మల్లిగాడు’ అని రాయలేదు – ‘మల్లిగా’ అనేరాసిన మంచిగనే!”

“సరే దొర”

“ఆఁ… నీ పేరేందిబే, సాలే!”

“నా పేరు సెంద్రయ్య దొర”

“సెంద్రయ్య! అయ్య! ఎవ్వనికిరా నువ్వు అయ్యవు! నాకా బే అయ్యవు? సాలె! మెడ సుంపులిరిత్తెగప్పుడు ఎరికైతది ‘అయ్య’ గాని సంగతి. అయ్యట అయ్య! ఏదీ మల్ల జెప్పురా నీ పేరు!”

“…………………”

“నువ్వు జెప్పుడేంది బే నీ పేరు నేను నిన్ను ‘సెంద్రిగా’ అని పిలుత్త. గట్లనే గీ రిజిస్టర్ల రాస్త. యిన్నవుగద! ఆఁ… యిగగిప్పుడు జెప్పుబే నీ పేరు”

“నా పేరు ‘సెంద్రింగాడు’ దొర!”

“ఆఁ ఇగపో”

అరేయ్ బాడుకావుల్లారా! గిప్పుడు సమజైందారా బే మీ పేరు ఎట్ల రాయించుకోవాల్నో! అందరికి నేనే పేర్లు పెట్టాల్నారా! ఎవనిపేరు ఆడు సరింగ జెప్పుండ్రిగ!”

రాజన్న తండ్రుల జమానల రజాకార్లు యిగ అత్తున్నదని తెల్సి – ఆళ్ళకు కోళ్ళు గోసి తినవెట్టి తాము ఆళ్ళసేతుల్ల జచ్చుడెందుకని ఆ కోళ్ళను తామే కోసుకోని కడుపునిండ గదే ఆకిరి తిండిగా వట్టి – తిని ఎట్లైతే గట్లైంది, కొట్లాడుదాం సస్తెజత్తం, బతుకుతె బతుకుతం అని పిల్లగండ్లని, ఆడోళ్ళని, ముసులోల్లని పంకు పల్లెటూర్లకు పంపిచ్చిన వైసుమొగోళ్ళు రజాకార్లకు బొచ్చె నెదురువెట్టి ఎదురుకునుటానికి కూడబలుక్కున్నరు. ఆళ్ళకు బూమ్మిద నూకలు బాకున్నై, బలికి పోయిండ్లు, కమ్యూనిస్టులు రజాకార్లను, రజాకార్లకు సాత్‍దార్ జేసిన వూరి తురుకోల్లను యిగజంపిండ్రు. పీరీలను నిలవెట్టెటోన్ని ఎట్లదన్నిండ్రు! యింకొగడింకోగడైతే బతికెటోడా!

అయ్యవ్వలు తమ పిల్లగండ్లను బళ్ళేస్తే, వాళ్ళింత జదువుకుంటె జీవితాంతం తట్ట మోసుడు దప్పుతది అని బడికి పంపిండ్రు. ఎద్దున్నోనికి యిద్దుండది. మా రాజన్నను సదువుకేసిండ్రు గాని ఆయిన సదువుకోలేదు. సదువురాలేదు. ఏవుసం పనులు జేసుకునేటోళ్ళకు రోజుకు రొండు మలుకల కడుపు సగమెల్తే. సగం నిండుడు కష్టం. బట్టలు దొరుకుడు యింకింత కష్టం. ఏడెనిదేండ్ల మొగపోరగండ్లకు పెయ్యి మీద మొల్దారం తప్ప యింకేం వుండది. పుంజులు గూయంగ లేసి కైకిలికి పోతే సందె మాపుకు యింటికత్తరు. అంబలి, మాడుగడుక సెక్కలు అనుప్పప్పో, ఎల్లిపాయకారమో పీనుగుకాడ ముగ్గేసుటానికి గూడ జొన్నపిండి లేకుండ వున్న యిండ్లు వుండేటియి.

ఎవుసం దార్ల బతుకులు గిట్లున్న జమానల రాజన్నను బడికేస్తే చదువుకోలేదు. రాజన్న సదువుకోలేదు, సదువబ్బలేదు అంటే గదీంట్ల పురాగ మా రాజన్నదే తప్పు అని అనలేం. బరువులేని పని, సుకంగ సదువుకోక బగ్గ బలిసి సదువుకోలేదు అనిపిస్తది సూసెటోల్లకు. గని, సదువంటే కష్టమన్పిచ్చిందంటే గండ్ల ఏం మతులబున్నదో! కానీకు బడులు. గా బళ్ళళ్ళ పంతుల్ల సదువు ఓనమాలు ఒంట్లమందమేనాయె. ఇంత గడగడ చదువుడు, సూడకుంట రాయిమంటె రాస్తరు  రాయిమన్నది. గంతే. గదీంట్లది ఏ ఒక్కమాటకు అర్థం తెలువది. పోరిగంట్లకు ఎండు మిరుపకాయలేసి ముంత పొగవెట్టుడు, కోలదండం ఎక్కిచ్చి కింద దంతెముండ్ల కంపవెట్టుడు, ముంత పొగవెడ్తె ఊరిరాడదాయె. మిరపకాయల పొగ పోల్చాలె. కోలదండంతోటి సేతులల్ల బలంపోతే కింద దంతెముండ్ల కంపల పడుడాయె. సర్కారు బళ్ళె గూడ పంతుళ్ళు, పోరగాండ్లని కొట్టుడే (స్కేలు) పట్రి కొస్సటి అంచుతోటి మట్టల మీద బలంగ! పోరగండ్లయి పొడిపొడి పానాలు పొవా? పోరగండ్లు ఎంత గోసరిళ్ళిండ్లో. పంతుళ్ళు గిట్ల గొడ్తుండ్రు అని యింట్ల జెప్పుతె “మంచిగైంది. మామంచిగైంది. యింకింత గొట్టవల్సిందే” అనేటోళ్ళు. ఇగ పిల్లగాండ్లు సదువుకు పొమ్మంటె ఎట్లపోతరు. గీ బాదలు పడలేక, ఏగలేక తట్టమోసుడే అలుకగ అన్పియ్యదా మరి! బడికిపోతే పంతుళ్ళతోటి గోస పోకపోతే అయ్యవ్వలతోటి గోస. గందుకని, బడికి పోతున్నమని యింట్ల జెప్పి, బడికి పోక బైట బైట తిరిగి కాలం గడిపెటోళ్ళు. సెట్టు ఏర్లకు సెదలు వడె ఎదుగనట్లు, గీళ్ళకు గూడ పంతుళ్ళు సెదలు వట్టిచ్చిండ్రు గదీంతోటి ఆళ్ళ బతుకులే మారిపోయినై.

బడి, సదువు కన్న ఆళ్ళకు హోటళ్ళల్ల సిప్పలు గడుగుడు మా బాగనిపిచ్చింది. చిప్పలు గడుగుడు అలుకగ, మీదికెళ్ళి, గీ అలుకటిపనికి పకోడి దినవచ్చు, చాయ్ దాగవచ్చు!

బడికిపోక, వేరే మంచి తొవ్వలు లేక, పత్తాలాడుడు, కల్లు దాగుడు – గవీటికి పైసల్ని ముందు యింట్ల దొంగతనం జేసుడు, ఆనెంక సుట్టు పక్కలోల్ల యిండ్లళ్ళ, ఆనెంక వూర్లె, సిన్నసిన్న దొంగతనాల తర్వాత పెద్ద పెద్ద దొంగతనాలు జేసి సెంట్రులు జైళ్ళకు పొయ్యినోళ్ళు గూడవున్నరు.

సదువు బరువనిపించి సదువకున్నా గూడ ఏదన్న పనిల మనసువెట్టి గట్లమంచిగనే బతుకుతున్నోళ్ళుగూడ వున్నరు. మిషిని పని, వడ్లపని, కంపిన్లపని.

ఎంతకైనా గూడ, సదువుకోనోళ్ళకు లేబరు పనేగదా! పనిజేస్తె గూడ, వచ్చే జీతాలు గాపాటే, రొండుపూటలు కడుపుకు దొరుకుతది గంతనే.

నువద్దిగ బళ్ళళ్ళ పంతుళ్ళు, సదువు జెప్పే రేవులు వుండివుంటే మా రాజన్న అసుంటోళ్ళందరికి గూడ సదువబ్బేటిదే. గప్పట్ల పిల్లగండ్లను బడికి పంపేటంతటి ఎలువాను వున్న అయ్యవ్వలే మా తక్కో. గా మా తక్కో బడికి పొయ్యి నోండళ్ళను వద్దిగ సదువుకున్నది యింకా మా తక్కా. గండ్లగూడ పైసదువుల సౌలతు గలిగినోళ్ళు నూట్లె ఒక్కరో, యిద్దరో….

గసుంటి కాలంల మా రాజన్నకు అబ్బవల్సినయన్ని అబ్బినై. జువ్వాడుడు, కల్లు దాగుడు, పనికి పోకటలేదు. గొప్పగ పని నేర్సుకున్నది లేదు, పని అబ్బింది లేదు. సంపాదనంటే పొద్దుంట మాపుండది, మాపుంటే రేపుండది అన్నట్టే. గసుంటి సంసారంల ఆయిన మొగ పిల్లగండ్ల సదువులు, నౌకర్లు గాపాటే – ఆళ్ళకు ఆళ్ళు బతుకుడే ఎక్కో. గదీంట్ల రాజన్నకు పెండ్లికెదిగిన బిడ్డె వున్నది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here