[box type=’note’ fontsize=’16’] “అడవులను తెగనరకటం, నష్టపరిహారంగా అడవులను పెంచడం అన్న సిద్ధాంతాన్ని పక్కన బెట్టి ఉన్న అరణ్యాలను అతి జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం” అంటున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]
అడవితల్లి స్వయంసిద్ధ – పరిహారం ఇవ్వడానికి మనిషి సరిపోడు:
[dropcap]అ[/dropcap]డవులను దాటి బయటి ప్రాంతాలలో పెంచబడుతున్న మొక్కలు, వృక్షాలు సహజారణ్యాలలోని వృక్షజాతులు, మొక్కల వలె కార్బన్‌ను శోషించుకోగల సామర్థ్యాన్ని, జీవ వైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని పూరించగల శక్తిని సమకూర్చుకోలేవని కొన్ని అధ్యయనాలలో తేలింది. సహజారణ్యాలపై ఆధారపడి కీటకాలు వంటి చిన్న జీవరాశులతో సహా అనేక జీవరాశులు తమ సహజ ఆవాసాలలో పరస్పరాధారితమైన ప్రకృతి వ్యవస్థలో భాగంగా మనుగడ సాగిస్తూ ఉంటాయి. అరణ్యాలకు బదులుగా అభివృద్ధి చేయబడుతున్న వనాలలో నాటబడుతున్న మొక్కలు సాధారణంగా ఒకే జాతికి చెందినవి అయిన కారణంగా సుసంపన్నమైన జీవ వైవిధ్యానికి ఆలవాలం కాగల శక్తిని కలిగి ఉండవు.
సహజారణ్యాలలో ఉండే టేకు, యూకలిప్టస్ వంటి చెట్లనే వేరే చోట పెంచినప్పుడు అంటే ప్రాంతం మారినప్పుడు వాటి కర్బన శోషణ సామర్థ్యం 30 నుండి 40% వరకు తక్కువగా ఉంటోంది. ఆయా చెట్ల దారుఢ్యం కూడా సహజారణ్యాలలో ఉండే చెట్ల కన్నా తక్కువగా ఉంటోంది. అదీ కాక అడవుల వెలుపల పెంచబడుతున్న చెట్లు సహజారణ్యాలలోని వాటి సహజాతాల కంటే వేగంగా పెరుగుతున్నాయి. అయితే నేల స్వభావం, వాతావరణంలో వేడి కారణంగా అవి విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు వేరుగా ఉంటున్నాయి.
జీవ క్రియలో భాగంగా చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సీజన్‌ని విడుదల చేస్తాయి. చెట్లకు సంబంధించిన ఆకులు, కొమ్మలు వంటి వివిధ భాగాలు పడిపోయినప్పుడు నేల లోని సూక్ష్మజీవులు వాటిని కుళ్ళిపోయేలా చేస్తాయి. అవి ఆ దశలో తమలో నిక్షిప్తమై ఉన్న కార్బన్ డై ఆక్సైడ్‌ను విడిచిపెడతాయి. అర్బన్ ప్రాంతాలలోని మట్టికి (చెట్ల ఆకులు వంటి భాగాలు కుళ్ళినప్పుడు విడుచల చేసే) కార్బన్ డై ఆక్సైడ్‌ను అధికంగా పీల్చుకునే సామర్థ్యం ఉంటున్నట్లు తేలింది.
బోస్టన్ యూనివర్సిటీకి చెందిన బయో, జియోకెమిస్ట్ LUCY R. HUTYRA పర్యావరణవేత్త కూడా ‘టెర్రస్ట్రియల్ కార్బన్ సింక్’పై ఆమె విస్తృతంగా పరిశోధనలు చేశారు. ఉత్తర అమెరికాలోని చిన్న, పెద్ద అడవులు అనేకం ఆమె అధ్యయనానికి వేదికలు. సంవత్సరాల తరబడి వేల సంఖ్యలో అరణ్యాలలో పర్యటించి క్షుణ్ణంగా పరిశీలీంచి తాను సాగించిన అధ్యయానలు/పరిశోధనలు తాలూకూ ఫలితాలను ఆమె వెల్లడించారు.
మన దేశంలో కూడా శాస్త్రవేత్తలు పడమటి కనుమలల్ని హరితారణ్యాల కంటే, టేకు, యూకలిప్టస్ వంటి కృత్రిమ వనాలలోని కర్బన నిల్వలు 30 నుండి 50% వరకు తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అదీ కాక అరణ్యాలపై ఆధారపడి కొండ, కోనలలోని అనేక జాతుల తెగల ప్రజలు జీవనం సాగిస్తూంటారు. సహజారణ్యాలలోని ప్రకృతి సిద్ధమైన సహజ వనరులే వారికి జీవనాధారం. వారికి తమ తమ జాతి, తెగలను అనుసరించి వారి ఆచారాలు, సంస్కృతులు, భాషలు వంటి అంశాలతో ముడిపడిన వారి అస్తిత్వం ఉంటుంది. అది ప్రమాదంలో పడుతుంది. కృత్రిమ వనాల పెంపకంలో ఈ అంశాలన్నింటినీ పునరుద్ధరించగలవటం సాధ్యమయ్యే పని కానే కాదు. తరిగిపోయిన/పోతున్న అటవీప్రాంతాల నుంది నిర్వాసితులైన వారెందరో. వీటితో బాటుగా –
ప్రకృతి ప్రకోపాలు, పంటల దిగుబడులు తగ్గిపోవడం వంటి ప్రమాదాలు ఉండనే ఉన్నాయి. అడవులను తెగనరకటం, నష్టపరిహారంగా అడవులను పెంచడం అన్న సిద్ధాంతాన్ని పక్కన బెట్టి ఉన్న అరణ్యాలను అతి జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక్కటే మన ముందున్న కర్తవ్యం. భూతాపాన్ని కట్టడి చేసే దిశగా చేపట్టవలసిన చర్యలతో అన్నిటికంటే ముందు ఉండవలసింది అదే.