[dropcap]ఇ[/dropcap]ప్పుడైనా బతకడమెలాగో నేర్చుకోవాలి
అప్రస్తుత ప్రపంచంలో కలలలాటి మాటలల్లడం
నేర్చుకోవాలి
నువ్వో శాపం తీరిన ఇంద్రుడివనీ
అమావాస్య లేని జాబిలివనీ అనడం నేర్చుకోవాలి
ఒకోసారి నువ్వొక బుద్ధ భగవానుడి తమ్ముడివనీ
నీవు తలుచుకుంటే లేపాక్షి బసవన్నను లేపి నుంచోబెడతావనీ అనాలి
ఇవి విని మెలికలు తిరుగుతుంటే నవ్వకుండా వుండటమూ నేర్చుకోవాలి
ఆత్మసాక్షిని లోపలికి తొక్కేసి
అమాయకత్వం నటించడమూ నేర్చుకోవాలి
నీవొక జ్ఞానివైనా అజ్ఞానిలా విని తలూపడం నేర్చుకోవాలి
మనసు గాయమైనా కన్నీటిని చిందించకపోవడం నేర్చుకోవాలి
స్థితప్రజ్ఞత కు కొత్త అర్థాలు వెతుక్కోవాలి
చిన్నప్పటి సుమతి శతకాన్ని సరికొత్తగా అన్వయించుకోవాలి
తెల్లని కాకులు ఉంటాయనీ
దెయ్యాలే సూక్తులు వల్లిస్తాయనీ తెలుసుకోవాలి
నవ్వినవన్నీ మంచి మనసులు కాదనీ
వాటివెనుకనే తళతళలాడే కత్తులు ఉంటాయనీ గ్రహించు కోవాలి
పుస్తకాలతో జీవితపు పరీక్షలు నెగ్గలేమనీ
ప్రతి పరీక్షకూ సమాధానం నీతోనే వుంటుందనీ తెలుసుకోవాలి
అవును ఇప్పుడైనా బతకడమెలాగో నేర్చుకోవాలి