సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…3

0
4

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

ఛాంగి ఎయిర్ పోర్టు – సింగపూర్

[dropcap]అ[/dropcap]ది 2019 ఆగస్టు 3వ తేదీ.

సిడ్నీలో బయలుదేరి అర్ధరాత్రి 2.30కి (4వ తేదీ తెల్లవారుఝామున) సింగపూర్ ఛాంగి ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2 లో దిగాను మా అమ్మాయి కుటుంబంతో కలిసి.

అప్పటికే చాలా సార్లు ఆ ఎయిర్పోర్ట్ గురించి మా అమ్మాయి సాధన నోట విని ఉన్నాను. నిద్ర మధ్యలో లేచినప్పటికీ కొత్త ప్రదేశంలోకి వచ్చిన ఉత్సాహంతో ఫ్లైట్ దిగి లాంజ్‌ల వైపు నడుస్తూ…

మా వాళ్లతో పాటు. మెత్తటి తివాచీపై నడుస్తూనే చుట్టూ జాగ్రత్తగా పరికిస్తూన్నా. ఎయిర్ పోర్ట్ మొత్తం మెత్తటి తివాచీ పరిచి ఉంది.

ఎక్కడికక్కడ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాష్ రూమ్స్, లాంజీలు, ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి, వంటి నొప్పులు తీర్చుకోవడానికి మస్సాజ్ చేసే కుర్చీలు.

ముందుకు సాగుతున్నాం కానీ ఎక్కడా ఖాళీలు కనిపించడం లేదు. చాలా రద్దీగా ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్లాం. అలా ఓ పది నిముషాల నడక తర్వాత క్లోక్ రూమ్ కోసం వెతికాడు మా అల్లుడు రాజేష్.

నిద్రలోంచి లేచిన సౌరవి దేదీప్యమానంగా వెలిగిపోతున్న విద్యుత్ దీపాల కాంతిలో నిద్రలో జోగుతున్న జనాన్ని, హడావిడిగా వెళుతున్న జనాన్ని, ఎక్కడికక్కడ కనిపించే ఉద్యానవనాలను కళ్లప్పగించి చూస్తున్నది. ఆఫ్ కోర్స్ , నేను కూడా అలాగే చూస్తున్నాననుకోండి. ఎయిర్ పోర్టు లోపల ఏర్పాటు చేసిన చిన్న చిన్న జలపాతాలు, కొలనులు, రంగురంగుల్లో అలరించే రకరకాల ఆర్చిడ్స్. ప్రపంచ నలుమూలల నుంచి తెప్పించిన వెరైటీలన్నీ కొలువుదీరి కనువిందు చేస్తుంటే.. ఆ రమణీయ ప్రపంచంలోంచి కదలాలనిపించలేదు.

ఒకవైపు అభివృద్ధి కోసం, ఆధునిక జీవనం కోసం, స్వార్థం కోసం ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్న మనిషి, మరో వైపు ప్రకృతిలోని అందాలను కనువిందు చేసే విధంగా ప్రతిసృష్టి చేస్తున్నాడు. విచిత్రంగా లేదూ..!

మనిషి ద్వంద్వ ప్రవృత్తి గురించి ఆలోచిస్తూ ఆహ్లాదం పంచుతున్న అద్భుత సౌందర్య రాశులను నా మొబైల్‌లో బంధించే ప్రయత్నంలో ఉన్నాను. నాతో పాటే నా ముద్దుల మనవరాలు సౌరవి ఆర్కిడ్స్ పూలను, మొక్కలను పలుకరిస్తూ.

సాధన సుచిర్‌ను ఎత్తుకుని చుట్టూ పరికిస్తూ కూర్చున్నది. మొత్తానికి క్లోక్ రూమ్ ఎక్కడుందో వెతికి పట్టుకున్నాడు రాజేష్.

నేను మన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – న్యూ ఢిల్లీ, హీత్రూ విమానాశ్రయం -లండన్, లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం – బోస్టన్, ఫ్రాంక్‌ఫర్ట్ హాన్ ఎయిర్పోర్ట్, ఆర్లాండో విమానాశ్రయం స్టాక్ హోం – స్వీడెన్, కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం – మలేసియా, కింగ్స్ఫోర్డ్ స్మిత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ – సిడ్నీ ఆస్ట్రేలియా చూసి ఉన్నాను. అక్కడెక్కడ చూడని విధంగా అద్భుతమైన సదుపాయాలతో పాటు పర్యాటకులను, ప్రయాణికులను ఆహ్లాదపరుస్తూ, సేదతీర్చే విధంగా అధునాతనంగా తీర్చిదిద్దిన విమానాశ్రయం సింగపూర్ లోని ఛాంగి విమానాశ్రయం.

పిల్లలకు అవసరమైనవన్నీ తేలికగా ఉండే ఒక బాగ్‌లో పెట్టి మిగిలిన హ్యాండ్ లగేజీని క్లోక్ రూమ్‌లో వేసేయాలనుకున్నాం. మా పాస్పోర్ట్ చూపి క్లోక్ రూంలో పెట్టాం. ఒక్కో హ్యాండ్ లగేజీకి ఎనిమిది డాలర్లు కట్టాం.

మాకు ఇండియా ఫ్లైట్ రాత్రి తొమ్మిది గంటలకు ఉంది. అంతవరకూ అంటే ఆ రోజు పగలంతా మాకు ఖాళీయే. అందుకే క్లోక్ రూంలో పెట్టేశాం. ఎటువంటి వీసా లేకుండా సింగపూర్ నగరంలో తిరగొచ్చని.

ట్రాన్సిట్ సమయంలో సింగపూర్ సిటీ లోకి వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్‌లో పర్మిషన్ ఇస్తారని మా పిల్లలు ముందే చెప్పారు. ఎంక్వయిరీలో ఉదయం తొమ్మిది తర్వాత ఆ కౌంటర్ ఓపెన్ చేస్తారని తెలుసుకున్నాం.

తెల్లవారడానికి చాలా సమయం ఉంది. పిల్లలతో కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత సిటీ టూర్ గురించి ఆలోచిద్దాం అనుకున్నాం. రౌండ్ ది క్లాక్ తెరిచి ఉండే ఫుడ్ కోర్ట్స్ లోంచి ఏదో మ్యూజిక్ వస్తున్నది. ఒక దగ్గర మెలోడియస్ గాను మరో దగ్గర రణగొణగా ధన్ ధన్ అంటూ ఫాస్ట్ బీట్‌తో వస్తున్నాయి. రాజేష్ కాఫీ తీసుకున్నాడు

అక్కడి నుండి పైకి వెళ్లాం. అక్కడ లాంజ్‌లతో పాటు సోఫా, కుర్చీలు, టేబుల్ , ఛార్జింగ్ పాయింట్స్‌తో ఉన్న కేబిన్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా ఖాళీగా లేదు. ఇంకా కాస్త అవతల ఉన్న స్థలంలో మా దగ్గరున్న బేడీషీట్ పరిచి పిల్లల్ని పడుకోబెట్టాలని ప్రయత్నంలో ఉన్నాం. మా ఫోన్ లు ఛార్జింగ్ పెట్టాం. అంతలో ఒక కేబిన్ వాళ్ళు వెళ్ళడానికి సిద్దమవడం చూసి అడిగాం. వాళ్ళు వెళ్ళగానే మేం ఆ కేబిన్ లో చేరాం.

చిన్న శబ్దమైనా నాకు నిద్ర పట్టదు. ఇక ఆ ఎయిర్ పోర్ట్ లో ఎక్కడ పడుతుంది..?

నాకు నిద్ర పట్టలేదు. మా వాళ్ళు మంచి నిద్రలోకి వెళ్లిపోయారు. అంతలో సుచిర్ నిద్ర లేచాడు. వాడిని తీసుకుని మేము ఉన్నచోటు పక్కనే టెర్రస్ పై ఉన్న సన్ ఫ్లవర్ గార్డెన్ లోకి వెళ్ళాను. ఆ సమయంలో గాలి వెచ్చగా తగిలింది. సిడ్నీలో ఎముకలు కొరికే చలి. తెల్లవారుఝామున మన దగ్గర వేసవిలో కూడా అలా వేడిగా ఉండదు. చల్లగానే ఉంటుంది. సింగపూర్‌లో చాలా వెచ్చగా అనిపించింది. బహుశా ఎయిర్ కండిషన్డ్ లోంచి బయటికి రావడం వల్ల మరింతగా అనిపించిందేమో..!

పై నుండి ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్, టేక్ ఆఫ్ తీసుకునే ఫ్లైట్స్ చూస్తూ తూరుపు కాన్వాసుపై మారుతున్న రంగులు చూసి మురిసిపోతూ కొంతసేపు గడిచింది. వెలుగు రేఖలు పరుచుకుంటూ ఉండడంతో పొద్దుతిరుగుడు పూల ముందు మా వాడిని ఫోటోలు తీసుకున్నా. పొద్దు తిరుగుడులో రకరకాలు ఉన్నాయి ఆ గార్డెన్‌లో.

అంతలో మా సాధన, రాజేష్ లేచారు. సౌరవిని తీసుకుని కాసేపు మళ్ళీ గార్డెన్లో తిరిగాను.

ఆ గార్డెన్ 2002లో ఏర్పాటు చేశారు. 45 మిలియన్ ఏళ్ల క్రితం సన్‌ఫ్లవర్ ఈ భూమి మీదకు వచ్చింది. 500 రకాల సన్‌ఫ్లవర్స్ ఉన్నాయి. ఇలా పొద్దు తిరుగుడు గురించి చాలా విషయాలు అక్కడి గ్రానైట్ పలకల మీద రాసి ఉన్నాయి.

పడుకుందామంటే నిద్ర రావడం లేదు. మేమున్న ఫ్లోర్‌లో మాకు యాభై అడుగుల దూరంలో థియేటర్‌లో ఏదో సినిమా వస్తోంది. అక్కడ కాసేపు కూర్చున్నా. మేమున్న కేబిన్స్‌కి కుడి వైపు గేమింగ్ లాంజ్ ఉంది. అక్కడ టీనేజ్ పిల్లలు, పెద్దలు, ఒక తొమ్మిదేళ్ల అమ్మాయి ఆడుకుంటున్నారు. ఆ అమ్మాయికి దగ్గరలోనే వాళ్ళమ్మ అనుకుంటా బాగ్ పెట్టుకొని కూర్చొని ఉన్నది.

రోజంతా తిరగడమే కదా చేయాల్సింది. కావాల్సినంత సమయం ఉంది అని కాసేపు వెళ్లి సోఫాలో నడుం వాల్చాను.

ఎనిమిది గంటలయ్యే సరికి అందరం ఫ్రెష్ అయి నెమ్మదిగా ఫుడ్ కోర్ట్స్ వైపు నడిచాం. ఒక స్ట్రోలర్ తీసుకొచ్చింది సాధన. ఇక మా మూడేళ్లైనా లేని సౌరవిని అందులో కూర్చోబెట్టి స్ట్రోలర్ కింద బాగ్ పెట్టేశాం. ఆ సదుపాయం ఏర్పాటు చేయడమంటే చిన్న పిల్లలతో ప్రయాణం చేసే వాళ్ళకి చాలా పెద్ద సహాయం చేసినట్లు కదా!

ఇండియన్ రెస్టారెంట్ కావేరిలోకి వెళ్లాం. అక్కడ దోశ, ఊతప్పం తిన్నాం. ఫుడ్ బాగుంది. సౌత్ ఇండియన్స్ కనిపించారు అక్కడ.

సిటీ టూర్ కి వెళ్లాలనుకుంటున్నాం కాబట్టి చేతిలో కొంత కాష్ ఉంచుకోవడం మంచిదని అనుకున్నాం. ఆ తర్వాత ఎటిఎం వెతికి కొంత కాష్ తీసుకున్నాడు రాజేష్.

ఆర్కిడ్ గార్డెన్స్‌లో కూర్చున్నాం. చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్, పాండ్స్, వాటిలో తిరిగే రంగు రంగుల చేపలు చూసి మా సౌరవి చాలా ఆనందపడింది. వందల రకాల ఆర్కిడ్స్ ఒకే దగ్గర, రకరకాలుగా అమర్చి కనువిందు చేస్తుంటే నాకు అక్కడి నుండి కదలాలనిపించలేదు. చిన్న చిన్న చెక్క వంతెనలు దాటుతూ కొద్దిసేపు తిరిగాం.

ఆ తర్వాత తొమ్మిది అవుతున్నదని నిదానంగా సిటీ టూర్ ఏర్పాటు చేసే కౌంటర్ దగ్గరకి వెళ్ళాం. అప్పటికే మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యూ లో నుంచొన్నాం. వాళ్ళు మా ట్రావెల్ డీటెయిల్స్ తీసుకొని మాకు ఫార్మ్స్ ఇచ్చారు. మేం అవన్నీ నింపి ఇచ్చేప్పటికి కొంత సమయం పట్టింది. మనకున్న ట్రాన్సిట్ టైం ని బట్టి మనం మనకు కావాల్సిన టూర్ ఎంచుకోవచ్చు. ఒకటి రెండున్నర గంటల సమయం ఉన్నదయితే రెండోది ఐదున్నర గంటలు. మేం రెండున్నర గంటల సమయం టూర్ పాస్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్‌లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మళ్ళీ మనని ఎయిర్ పోర్ట్‌లో దింపేవరకు వాళ్లదే బాధ్యత. మనకి పైసా ఖర్చు ఉండదు. బాగుంది కదా..

మొదటి బాచ్ అప్పటికే సిద్ధం అయింది. మాది ఆ తర్వాతి బాచ్. మా టూర్ మొదలవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎయిర్పోర్ట్ అంతా చూడడానికి బయలుదేరాం. దారిలో స్ట్రోలర్ ఇంకోటి కనిపిస్తే అందులో నెలల పిల్లవాడు సుచిర్‌ని కూర్చోపెట్టాం. ఎయిర్ పోర్ట్ టెర్మినల్స్ U ఆకారంలో ఉన్న భవనాల్లో ఉన్నాయి. ఒక టెర్మినల్ నుండి మరో టెర్మినల్‌కి వెళ్ళడానికి స్కై ట్రైన్స్ షటిల్ చేస్తుంటాయి. ఒక టెర్మినల్ నుండి మరో టెర్మినల్ చేరడానికి ఐదు నిముషాల కంటే పట్టదు. స్కై ట్రైన్ స్టేషన్ దాక వెళ్లడం , ట్రైన్ కోసం వేచి ఉండడం అంతా కలిపినా 15 నిముషాల్లోపే టెర్మినల్ నుండి మరో టెర్మినల్‌కి చేరుకోవచ్చు.

టెర్మినల్ 2 లోనే ఉన్న కాక్టస్ గార్డెన్ చూసాం. కాక్టస్ లలో ఎన్ని రకాలో. ఛాంగి ఎయిర్పోర్ట్‌లో ఆరు థీమ్స్‌లో ఆరు గార్డెన్స్ ఉన్నాయి. ఆర్చిడ్ గార్డెన్, సన్ ఫ్లవర్ గార్డెన్స్, ముందే చూసేసాం. వెయ్యి రకాల పైన ఉన్న బట్టర్ ఫ్లై గార్డెన్ చూడాలనుకున్నాం. వాటర్ లిల్లీ గార్డెన్ ఆ తర్వాత టెర్మినల్ 2 నుండి టెర్మినల్ 1 కి స్కై ట్రైన్‌లో బయలుదేరాం. అది సీ త్రు ట్రైన్. అలా ట్రైన్ లోంచి సింగపూర్ ఫైనాన్సియల్ & కమర్షియల్ డిస్ట్రిక్ట్ చాలా అధునాతనంగా కనిపిస్తూ.. స్కై వాక్ వే, స్కై స్క్రాపర్స్ , మెరీనా బే సాండ్స్ లోని ఎత్తైన రూఫ్ టాప్ హోటల్, సింగపూర్ ప్లయెర్ వగైరా వగైరా కనిపిస్తున్నాయి. అక్కడికి త్వరలో వెళ్ళబోతున్నాం అనుకుంటూ టెర్మినల్ 1 లో దిగాం. షాపింగ్ స్పేస్ చాలా ఎక్కువగా కనిపించింది. విండో షాపింగ్ చేస్తూ ఎయిర్పోర్ట్ కలియతిరిగాం. టెర్మినల్ 1 లో ఉన్న డిస్కవరీ గార్డెన్ మాత్రం చూడలేకపోయాం. మా టూర్‌కి సమయం దగ్గర పడుతున్నది. స్కై ట్రైన్‌లో ప్రయాణం జువెల్ గుండా.. చాలా ఎక్సయిట్ అయిపోయా.. అక్కడికి ఎలా వెళ్లాలో అప్పటికి తెలియలేదు. ఎట్లాగయినా జువెల్ చూడాలని కోరిక లోలోన పెరిగిపోతున్నది.

కొద్దిసేపు ఎన్‌చాంటెడ్ గార్డెన్ దగ్గర గడిపాం. ఎల్ ఇ డి లైట్ల కాంతుల్లో వెలిగిపోతున్న గార్డెన్స్. కాళ్ళకింద మెత్తటి కార్పెట్ ఎయిర్ పోర్ట్ అంతటా ఒకే డిజైన్ తో.. ఎక్కడికక్కడ కూర్చోవడానికి ఏర్పాట్లు. అక్కడక్కడా రిక్లైనర్స్ , మసాజర్స్.. అన్నీ చూస్తూ ట్రాన్సిట్ హెల్ప్ డెస్క్ కేసి నడిచాం.

ట్రాన్సిట్ హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్న వాళ్లు మమ్మల్ని మా పాస్పోర్ట్ , వీసా కాపీ లతో సహా ఎయిర్ పోర్టులో మరో టెర్మినల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ వాళ్ళు మా డాకుమెంట్స్ పరిశీలించి , మమ్మల్ని చెక్ చేసి పంపించారు. ఈ తతంగమంతా జరగడానికి ఒక గంట పట్టింది. తర్వాత వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సులో ఎక్కించారు. మాలాగే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రయాణికులతో ఆ ఏసీ బస్సు నిండిపోయింది. దాదాపు నలభై మంది ఉండి ఉంటాం. బయట ఎండ వేడి మండిపోతున్నది. స్ట్రోలర్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. వాటర్ బాటిల్స్, పిల్లల కోసం ఉంచుకున్న ఫుడ్ మాత్రం బాగ్‌లో ఉన్నాయి.

బస్సు గైడ్ మాకు హుషారెక్కిస్తూ ఆయా ప్రదేశాలను మైక్‌లో వివరించింది.

హెరిటేజ్ టూర్..

165 మీటర్ల ఎత్తుండే పెద్ద చక్రం, అచ్చం మన ఎగ్జిబిషన్‌లో ఉండే జయింట్ వీల్ లాగా.. అయితే చాలా ఎత్తున. దాన్ని సింగపూర్ ఫ్లయర్ అని చెప్పారు. ఇది ప్రపంచంలోనే పెద్ద చక్రం అట. మేం ఆగకుండా బస్సులోంచే చూసాం. అట్లాగే మెర్లిన్ పార్క్, వాటర్ ఫ్రంట్ గార్డెన్స్, మోడరన్ స్కై స్క్రాపర్స్ ఆకాశాన్నంటిన భవనాలతో, గాజు అద్దాలతో మిలమిలలాడే సింగపూర్ ఫైనాన్సియల్ అండ్ కమర్షియల్ డిస్టిక్ట్, మౌత్ ఆఫ్ సింగపూర్ రివర్, చైనా టౌన్, బంగారు వర్ణంతో మెరిసిపోయే సుల్తాన్ మసీదు చూసాం. ఒక అరగంట ఆగి మరీనా బే లో గడిపే సమయం దొరికింది. అక్కడ చెరుకు రసం తాగేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎత్తైన రూఫ్ టాప్ హోటల్ భలే ఉంది. అన్నీ మదిలో ముద్రించుకుంటూ, కెమెరాలో బంధిస్తూ ముందుకు సాగాం.

సింగపూర్ కొత్త పాతల మేలు కలయిక, ఇండియన్ టెంపుల్స్.. చిలక జోస్యం, పూలదండలు, కొబ్బరికాయలు అచ్చం మన పాతకాలపు గుడులముందున్నట్లే అక్కడనుండి మళ్ళీ బస్సులో తిరుగు ప్రయాణం. రెండున్నర గంటలు రెండు నిముషాల్లా గడిచిపోయాయి. ఎయిర్ పోర్ట్‌ని ఆనుకుని ఉన్న జువెల్‌కి వెళ్లాలని అనుకునాం. మమ్మల్ని టెర్మినల్ వన్ దగ్గర దింపేశారు. కానీ నెమ్మదిగా రోడ్డు దాటుకొని జువెల్ చేరుకున్నాం. జనంతో నిండిపోయి ఉంది.

ఆ జువెల్ అంతా తిరగాలంటే కనీసం మూడు గంటలు పడుతుంది.. అద్భుతంగా ఉంది. లోపలికి వెళుతుంటే సన్నని తుంపరలు లోపలికి ఆహ్వానిస్తున్నాయి. బయటి వెచ్చదనాన్నుంచి లోపలి చల్లదనం సేదతీర్చింది. ఆహ్లాద పరిచింది.

మా ఆకలి మర్చిపోయి కాసేపు 40 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న కృత్రిమ జలపాతం కేసి చూస్తూ నుంచున్నాం. ఫోటోలు తీసుకున్నాం.

మాకు బాగా ఆకలిగా ఉంది. అందుకే ముందు ఫుడ్ కోర్ట్స్ ఎక్కడున్నాయో చూసుకున్నాం. ప్రపంచ లోని వైవిధ్యమంతా అక్కడ ఆహారంలోనూ కనిపిస్తున్నది.

ఫుడ్ తీసుకున్నాం కానీ కూర్చోవడానికి స్థలం లేదు. నించుని తినేస్తున్నారు జనం. కానీ మేం చిన్న చిన్న పిల్లలతో ఉన్నాం. తిరిగి తిరిగి ఉన్నాం. కాసేపు కూర్చుంటేనే జువెల్ వింతలు చూసే ఓపిక వచ్చేది. అందుకే కొద్దిగా వేచి చూస్తుంటే ఓ బృందంలో వాళ్ళు కొద్దిగా స్థలం ఇచ్చారు. సౌరవిని కూర్చో బెట్టాం. తర్వాత మాకు కూడా ప్లేస్ దొరికింది.

ప్రపంచం నలుమూలల నుంచి తెప్పించిన అరవై వేల రకాల మొక్కలు, 900 వందల రకాల చెట్లతో నిర్మించిన కృత్రిమ అరణ్యం, జలపాతం.. ఓ వైపుగా టెర్మినల్ ఒకటి రెండు మధ్య నడిచే ఎయిర్ బస్సు. స్కై ట్రైన్..

జువెల్ అద్భుతమైన నిర్మాణమే. ఎక్కడెక్కడినుండో కొలువు దీరిన మొక్కల్ని, చెట్లని చూడడం గొప్ప అనుభవమే. ముఖ్యంగా కృత్రిమ జలపాతం ఒక అద్భుతమే. మనిషి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని గొప్ప ప్రయత్నంగా చూడాలో , అభివృద్ధి ముసుగులో జరుగుతున్న విధ్వంసాన్ని చూసి బాధపడాలో అర్ధంకాని స్థితిలో.. అలా చూస్తూ పైకి మా టెర్మినల్ 2 కి చేరుకున్నాం.

అక్కడ సెక్యూరిటీలో నాకు చిన్న ఇబ్బంది. మా పిల్లలందర్నీ పంపించేశారు. నన్ను ఆపారు. నేనున్న కౌంటర్ అతనికి సందేహం. నా పాస్‌పోర్టుపై ఆస్ట్రేలియా స్టాంప్ లేకపోవడం. నేను వీసా కాపీ చూపిద్దామంటే నా ఫోన్ అప్పటికే డెడ్ అయిపోయింది. వీసా కాపీ పిల్లల ఫోన్ లో ఉంటే అది తీసుకుని వాళ్ళకి చూపించాక పంపించారు. అప్పటికే ఆరున్నర దాటింది. మా ఫ్లైట్ తొమ్మిది గంటలకి. మేమింకా క్లోక్ రూమ్‌లో ఉన్న మా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మా గేట్ ఎక్కడుందో చూసుకుని అటు వెళ్ళాలి. పిల్లల పనులు చూసుకుని అటువెళ్ళాం.

వెళ్ళేప్పటికి జనంతో నిండిపోయి ఉంది ఆ ప్రాంతమంతా. కూర్చోడానికి ఎక్కడ ప్లేస్ లేదు. తిరిగి తిరిగి అలసిపోయాం. శరీరం కాస్త ఆసరా కోరుతున్నది. కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ రిక్లైనర్లు, మసాజర్లు ఉన్నాయి కానీ ఖాళీలేవు. చివరాఖరుకి ఒక దగ్గర ఖాళీ దొరికింది. మేం తలా కొంచెం సేపు మార్చి మార్చి కూర్చున్నాం.

కొద్దిసేపటికే బోర్డింగ్ అనౌన్స్మెంట్..

సింగపూర్ మోడల్ అభివృద్ధి గురించి రాజకీయ నాయకుల నోట చాలా విన్నాం. సింగపూర్ ఫైనాన్సియల్ అండ్ కమర్షియల్ డిస్ట్రిక్ట్‌కి మిగతా నగరానికి బోలెడంత వ్యత్యాసం. పాత నగరమంతా మన దేశంలో ఉన్నట్లు గానే అనిపించింది. తమిళులు ఎక్కువగా కనిపించారు.

సింగపూర్ మీదుగా ప్రయాణించేవాళ్ళు ఒకటి రెండు రోజులు సింగపూర్‌లో ఆగి చూసి వెళ్ళవచ్చు. సింగపూర్ చాలా చిన్న దేశం. మూడు రోజులు చాలు చూడడానికి.

అమెరికన్, ఆస్ట్రేలియన్, యూరోప్, ఇండియన్ మరి కొన్ని దేశాలకు చెందిన వాళ్ళు 72 గంటల ఆ దేశంలో ఉండొచ్చు. హ్యాపీగా సింగపూర్ చూసేయ్యొచ్చు.

ఇంత సౌకర్యవంతమైన ఎయిర్పోర్ట్ మరెక్కడా లేదేమో.. పిల్లలు పెద్దలు వేసుకోవడానికి కలరింగ్ బుక్, కలర్ పెన్సిల్స్, స్ట్రోలర్స్, పిల్లల ప్లే గ్రౌండ్స్, స్విమ్మింగ్ పూల్, స్పా, సినిమా, గేమింగ్ జోన్,వంటి అనేక సదుపాయాలు సౌకర్యాలు ఉచితంగానే. ఇక ఫుడ్ కోర్ట్స్, బార్లు, షాపింగ్ కావలసినన్ని.

కోవిడ్ తర్వాత ట్రాన్సిట్ ప్రయాణికులకు ఎటువంటి అనుమతులు, సదుపాయాలు ఉన్నాయో మరి!

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తరతెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె( కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి(బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here