[dropcap]మ[/dropcap]లుపు మలుపుల జీవితపుదారిలో, మలుపులు క్షణమైన మెరుపులా కాలచక్రగతిలో మెరిసినా, ఒక్కొక్కసారి బలమైన వెలుతురుతో జీవితాన్ని ముందుకు నెడుతూ ఉంటాయి. ప్రతివారి జీవితంలో తాము ఊహించకే, పెను ప్రభావం చూపే మలుపులు తటస్థపడతాయి. “జరిగేనాడే జరుగును అన్నీ, జరిగిన నాడే తెలియును కొన్ని” అని ఆత్రేయ అందుకే అన్నాడేమో!
ఇంజనీరింగ్ చదువు అంటే ఏమిటో, దానికోసం అవలంభించవలసిన ప్రణాళిక ఏమిటో, అసలు ఎక్కడెక్కడ ఇంజనీరింగ్ చదవే అవకాశం ఉందో, ఏమీ తెలియని, పదవ తరగతి చదువులు. తరువాత యాదృచ్ఛికంగా, ఇంటర్ చదువుకు యం.పి.సి. (MPC) ఎన్నుకోవడం, అందు సాధించిన ప్రగతి ఏవిధంగా, ఇంజనీరింగ్ చదువుకు దారి తీసిందో, ఒక రెండు రోజుల కాలవ్యవధిలో, మా పాలకొల్లు నుండి సుదూర ప్రాంతాలకు రవాణా అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో (1979), దైవికమనిపించే ఘటనలు, నా జీవితంలో, ఒక పెనుమార్పుకు దారిచూపిన అనుభవాలు ఒక కవితలో రాయడం జరిగింది, ‘ఒక యాంత్రికుని (Engineer) స్వగతం’ అని. 2008వ సంవత్సరంలో మా NIT (REC) వరంగల్ 1979-83వ జట్టు రజతోత్సవం పురస్కరించుకొని రాసినది ఈ కవిత. కానీ, అది వెలుగు చూడటానికి ఒక 14 సంవత్సరాలు వేచిరావలసి రావడం మరొక అనుభూతి.
మీరందరు చదివి, మీ అమూల్య అనుభవాలు తెలియచేస్తారని, ఈ శీర్షికను ముందుకు తీసుకొని పోతారని ఒక ఆశ.
ఒక యాంత్రికుని (ఇంజనీరు) స్వగతం
రూపులేని ఆశలు
పొద్దు పొడవని గమ్యం
తెలియని దారి…
శక్తికి మించిన ఉత్సుకత-
ఆర్ధర్ కాటన్ ఆనకట్టలు
మోక్షగుండం బృందావనాలు…
నేతాజీ, శాస్త్రీజీ ఆశయాలు-
ఇంజనీరు, కలెక్టర్ కావాలనే పిలువు.
కాంపోజిట్ మాథ్స్ చదవాలని
ఇంటర్ లో మంచి మార్కులు రావాలని
ఎంట్రన్స్ లు రాయాలని –
కాలేజీలేవో మరి తెలియదే?
కాకతాళీయంగా (అర్. ఇ. సి.) కి
పంపినాను అప్లికేషన్
పిలుపు విన్నాను ఒకేసారి –
వైజాగ్, వరంగల్లుల నుంచి.
కెమికల్ లో వాల్తేరులో –
సీటు అందుకున్నా- అక్టోబర్ 10న!
ఏదో తెలియని వెలితి
వరంగల్, అక్టోబర్ 12న వెళ్ళలేనని …
మరునాడు విజయనగరం నుంచి తుని
అటునుండి రాజమండ్రి, పాలకొల్లు
అంచెలంచెలుగా చేరుకొన్నా –
బస్సులకు ఏదో శక్తి గాలం వేయగా!
ఒక ప్రక్క ఆనందం, సీటు వచ్చిందని
పంచుకున్నాను స్నేహితులతో …
మరొక ప్రక్క తెలియని
అలజడి.. అశాంతి నిండగా!
“అక్క! వరంగల్ పంపవేమని”
సి. పి. అర్. తమ్ముని ప్రశ్నకు –
అమ్మ, వెళ్ళి వస్తావా అని
యాదృచ్ఛిక ఆనతి.
సర్టిఫికేట్స్ వాల్తేరులో నుండగా
ప్రతులు తొరతొరగా టైప్ చేయగా
కె. జె.అర్ సంతకం చేసి సలహా ఇచ్చెను –
తాడేపల్లిగూడెం మీదుగా విజయవాడ చేరమని.
అత్తమ్మ వద్ద రెండు వందల అప్పుతో
అందుకున్నాను ఆఖరి బస్సు తాడేపల్లిగూడెనికి
వేచాను రాత్రి 11 గంటలనుండి ఒంటి గంటవరకు –
బస్సులో విజయవాడ చేరాను ఉదయం నాలుగు గంటలకు!
వరంగల్ కు గోల్కొండ ఎక్స్ ప్రెస్
ఏడు గంటలకని స్టేషన్ లో చెప్పగా –
అదనుగా శ్రీనన్నయ్యను తోడ్కొని
సమయానికి చేరగలమా అంటు బయలుదేరాము.
ఆదరణతో ఇంటర్వ్యూకి పిలువగా
ఎలెక్ట్రికల్ లో సీటు ఇవ్వగా …
తెలియని ఆనందం ఎదను నిండే –
జీవితంలో మధరకాలం స్వాగతమివ్వ!
—
కొన్ని గతకాల ఛాయాచిత్రాలు
ప్రధాన భవనం
1983 లో Valedictory ఉపన్యాసం అందిస్తూ:
1979-83 ఆర్. ఈ. సి. సౌవనీరు నుండి
వరంగల్ – హైదరాబాద్ రహదారిపై ఆర్. ఇ. సి. ప్రాంగణ సూచి
2008 లో తీసిని కొన్ని చిత్రాలు