చిట్టి పొట్టి పేర్లు..!!
[dropcap]ఒ[/dropcap]క దేశానికి పేరు, ఒక రాష్టానికి పేరు, ఒక జిల్లాకు పేరు, ఒక తాలూకాకు లేదా మండలానికి పేరు, ఒక గ్రామానికి పేరు, ఒక చెట్టుకు పేరు, ఒక జంతువుకు పేరు, ఒక మనిషికి పేరు, ఒక సముద్రానికి పేరు, ఒక నదికి పేరు, ఇలా చెప్పుకుంటూ పోతే పేరు లేకుండా ఏమీ ఉండదు. ఆ పేర్లతోనే వివిధ రూపాలు మనం గుర్తు పట్టగలం. ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి కొన్ని పేర్లు ఉంటాయి.
అవి తప్పనిసరిగా సజీవ నామాలుగానే నిలుపుకోవాలి. వాటిని ఇష్టం వచ్చినట్లు మార్చడానికి ఏమాత్రం వీలుకాదు. ఎప్పటికీ స్థిరమైన పేర్లుగానే అవి నిలిచిపోతాయి. గంగానదికి మరో పేరు పెడితే దానిని ఎవరూ హర్షించరు.
వాడుక పేర్లే చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే ఇప్పుడు కాలంతో పాటు పరిస్థితులు మారాయి. ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు తమకు రాజకీయంగా అనుకూలమైన పేర్లు పెట్టుకుంటున్నారు. అది యెంత చారిత్రాత్మకమైనా, త్రోసిరాజని పేర్లు మర్చి తమ పంతం నెగ్గించుకుంటున్నారు. రాష్ట్రాలు, జిల్లాలు, విశ్వవిద్యాలయాలూ, విమానాశ్రయాలూ, రోడ్లు మొదలైనవి పేరు మార్పుల్లో చితికి పోతున్నాయి. వీటి విషయంలో అర్థం -పర్థం లేని కక్షలూ కార్పణ్యాలు మొదలై, వాటిని కులాలకు సైతం ఆపాదించడం, తద్వారా అల్లర్లకు ఆజ్యం పోయడం నడుస్తున్న చరిత్రలో మనం ఎరగని విషయం కాదు. సామాన్యులని ఉసిగొల్పితే ముందుకి ఉరకడమే తప్ప తాము, ఉద్యమాలు ఎందుకు చేస్తున్నామో, విధ్వంసాలకు ఎందుకు పూనుకుంటున్నామో తెలియదు.
ఇక మనుష్యుల నామధేయాలు లేదా పేర్లు విషయానికి వస్తే కొన్ని వింత.. వింత.. విశేషాలు మనకు గోచరిస్తాయి. కొందరు తమ పూర్వీకుల పేర్లు కలిసివచ్చేటట్టు అందులో దేవుడి పేరుకూడా కలిసి వచ్చేట్లు తమ పిల్లల పేర్లు ఖాయం చేస్తుంటారు. ఉదా: తమ పిల్లాడికి ప్రసాద్.. అని పేరు పెట్టాలనుకోండి. వీర వెంకట సత్య ప్రసాద్ అని పెట్టుకుంటారు. ఇందులో కుర్రాడి వీరత్వం, దేవుడు వెంకటేశ్వర స్వామి, తాత పేరు – సత్యం అన్నమాట! ఇలా పేరు పెట్టుకోవడం ఆక్షేపణీయం ఎంతమాత్రమూ కాదు. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత అంత పెద్ద పేరు స్వేచ్ఛగా ఉచ్చరించడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ తల్లిదండ్రుల ఆలోచన భిన్నంగా ఉంటుంది.
కొంతమంది దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. యేసు, వెంకన్న, నరసింహం, ఆదిలక్ష్మి, కనకదుర్గ వగైరా. మంచిదే, ఇందులో అభ్యంతరం ఏమీలేదు. కానీ ఆ పేర్లు యెంత భక్తితో పెట్టుకున్నారో,ఆ పిలుపులు కూడా అంతే మృదువుగా ఉండాలి. కానీ.. ఒరే యేసుగా, ఒసే కనక దుర్గా అంటే యెట్లా ఉంటుంది. సున్నిత మనస్కులకు బాధగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మనపిల్లలైనా, ఇతరులైనా పిలుపులో ఆ పేర్లకు విలువ ఇవ్వాలి. లేకుంటే అలంటి పేర్లు పెట్టుకోకూడదు.
మరికొందరు మన పుణ్యనదుల పేర్లు పెట్టుకుంటారు. మంచిదే తప్పులేదు. ఆయా నదుల మీద వారికున్న అభిమానం, భక్తి వల్ల అలా పిల్లలకు పేర్లు పెట్టుకుని తృప్తి పడతారు, ఉదా : గంగన్న, గంగమ్మ, గంగాదేవి, నర్మద, గోదావరమ్మ, కృష్ణ, కృష్ణ కుమారి, కావేరి, ఇలా అనేకమైన పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటారు.
పిల్లలకు పేర్లు పెట్టడంలో, గోపరాజు రామచంద్రరావు (‘గోరా’గా ప్రసిద్ధులు) గారిది ప్రత్యేక ప్రత్యేక ముద్ర. ఆయన పిల్లల పేర్లు గురించి ఒక పుస్తకమే రాసారు. ఆయన నేటి తరానికి అంతగా తెలియని గొప్ప ప్రపంచ నాస్తిక ప్రచార నాయకులు. స్వయంగా ఆయన నాస్తిక జీవితాన్ని ఆచరించి దానిని ప్రజలలోనికి తీసుకు వెళ్లిన మహోన్నత వ్యక్తి. ఉప్పుసత్యాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని లవణం (గుర్రం జాషువా గారి అల్లుడు) అని, రెండవ ప్రపంచ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని మరో కుమారుడికి సమరం (డా. సమరం, విజయవాడ) అనీ, అలా దేశంలో జరిగిన గొప్ప సంఘటనల ఆధారంగా, విజయం అనీ, విద్య అనీ, మైత్రి అనీ.. అలా వాళ్ళ పేర్లు చదువుతుంటే కొంత దేశ చరిత్ర మనముందు సాక్షాత్కరిస్తుంది. గోరా గారి మనుమరాలు (జొన్నలగడ్డ మైత్రి గారి అమ్మాయి, డా. సమరం గారి మేనకోడలు) డా క్రాంతి, నాకు సహాధ్యాయిని, మంచి స్నేహితురాలు కూడాను.
ఇకపోతే కొంతమంది సాహితీమూర్తుల అసలు పేర్లు చాలామందికి తెలియవు. వారి పొట్టి పేర్లు (కలం పేర్లు, లేదా ముద్దు పేర్లు) మాత్రమే ప్రచారంలో ఉంటాయి. వాటితోనే వారిని గుర్తుపడతారు. ఉదా: శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకర శాస్త్రి), కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి), ఆత్రేయ (కిలాంబి వెంకట నరసింహాచార్యులు), ఉషశ్రీ (పురాణపండ సూర్య ప్రకాశదీక్షితులు) మొదలైనవి. ఇటువంటి కలం పేర్ల తోనే వీరు ప్రసిద్ధులు. ఆ పేర్లు పిలుచుకోవడానికి సులభంగా ఉండడమే కాదు, గౌరవించి ఫలకాలనుకునే పేర్లు అవి.
ఇప్పుడు పిల్లలకు పేర్లు పెట్టాలంటే పొట్టి లేదా అతి పొట్టి పేర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు తల్లిదండ్రులు. అలాంటి పేర్ల కోసం పరిశోధన చేసినంత పని చేస్తున్నారు. పిల్లలు పుట్టకముందే ఈ పేర్ల మీద శ్రద్ధ చూపిస్తున్నారు. నేను నా మనవరాలి కోసం చాలా పేర్లు సేకరించి డైరీలో రాసుకున్నాను. కానీ అవేమీ మా అమ్మాయికీ అల్లుడికీ నచ్చలేదు. చివరికి వాళ్ళే ఒక పేరు సేకరించి నాచేత ఆమోద ముద్ర వేయించుకున్నారు. అదే మనవరాలి పేరు ‘ఆన్షి’గా ఖరారు అయింది. దాని అర్థం ‘దేవుడిచ్చిన వరం’ అట!
నా ఇద్దరి పిల్లల నామధేయాల విషయంలో నేనే ముందు జాగ్రత్తలు తీసుకున్నాను. వాళ్లకు నేనే పేర్లు పెడతానని చెప్పేసాను. అదే జరిగింది కూడా! అప్పట్లో ‘నీహార’ (నిహారిక కాదు) పేరు అతి తక్కువ మందికి ఉండేది. మా గురువుగారి క్లినిక్‌లో వైద్యరీత్యా నాకు తారసపడ్డ అందమైన అమ్మాయి పేరు అది. నాకు కూతురు పుడితే (అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు సుమండీ) నీహార.. అని పేరు పెట్టాలని నిర్ణయం చేసేసుకున్నాను, అదే అమలు పరిచాను. లేదంటే కొంతమంది తికమక పడి నిహారిక.. అని పిలుస్తుంటారు. అలాగే.. మా అబాయికి మహా పండితుడు రాహుల్ సాంకృత్యాయన్ లోని ‘రాహుల్’ పేరు పెట్టాను.
ఇక అసలు విషయానికి వస్తే, నేను నా పిల్లలకు పొట్టి పేర్లు పెట్టినట్టే నా బంధువుల పిల్లలకు ముగ్గురికి కూడా నేనే పేర్లు పెట్టాను. అవి నాకు బాగా తృప్తి నిచ్చిన పేర్లు. నాకు మాత్రమే కాదు ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని అందించిన పేర్లు అవి.
నా చిన్న మేన కోడలికి (నా పిల్లలకంటే ముందు నేను పెట్టిన పేరు) పేరు పెట్టే అవకాశం నాకు కలిగింది. ఇలా అనేకంటే ఆ.. అవకాశాన్ని నేనే తీసుకున్నానని చెబితే న్యాయంగా ఉంటుందేమో! ఇక్కడ మా బావ గారి పేరు స్వామీ రావు. ఆయన పేరులోని మొదటి అక్షరం ‘స్వా’ తీసుకున్నాను. అలాగే మా చిన్నక్క పేరు భారతి. ఆమె పేరులోని చివరి అక్షరం ‘తి’ తీసుకున్నాను. ఆ రెండు అక్షరాలను కలిపితే ‘స్వాతి’ అయింది. ఈ పేరు వాళ్లకి బాగా నచ్చింది. అదే పేరు స్థిరం చేసేసారు. ఆమె ఇప్పుడు నన్ను ‘మామాజీ’ అని పిలుస్తుంటే పులకించి పోతుంటాను. ఈమె గృహిణిగా ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.
రెండవ పేరు మా పెద్ద బావమరిది రెండవ సంతానం – అమ్మాయికి సూచించాను. అసలు వాళ్ళు నేను చెప్పిన పేరు ఇష్టపడతారని నేను ఊహించనే లేదు. ఆ భార్యాభర్తల పేర్లు, రాజబాబు, హెప్సిబా. ఇందులో రాజబాబు పేరులో ‘ర’ మొదటి అక్షరం తీసుకుని, తల్లి పేరులోని ‘స’ ఆధారంగా ‘రశ్మిని’ అని పేరు సూచించాను. అది అప్పటికి మా కుటుంబాలలో కొత్త పేరు. ఆధునికంగా, అనిపించి వాళ్లకు నచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు మెడిసిన్ పూర్తి చేసి పై చదువుల కోసం ప్రయత్నం చేస్తున్నది.
నేను పెట్టిన మూడవ పేరు, మా మేనమామ మనవడిది. మా మేనమామ కొడుకు రాజబాబు, ఇంటర్ నుండి నా దగ్గరే వుండి చదువుకుని, ఉద్యోగస్థుడయ్యాడు. అతను అక్క కూతురినే వివాహమాడడం వల్ల ఇద్దరూ నాకు దగ్గరయ్యారు. కొడుకుకు పేరు పెట్టే బాధ్యత నా మీదనే పెట్టారు. ఇది నాకు తప్పనిసరి అయింది. నేను ఏమి పేరు పెట్టినా ఆమోదించే పరిస్థితి. అందుచేత, ఆ స్వేచ్ఛ ఉండడం మూలాన ఒక రోజులోనే పేరు రాసి ఇచ్చేసాను. ఇక్కడ తండ్రి రాజబాబులో రెండవ అక్షరం ‘జ’ తీసుకున్నాను. తల్లి పేరులోని (సుమవి) మొదటి అక్షరం ‘సు’ ప్రధాన అక్షరంగా తీసుకుని, వాళ్ళ అబ్బాయికి ‘సుజన్’ అని పేరు పెట్టాను (‘విన్నూ’ ముద్దు పేరు వాళ్ళు పెట్టుకున్నది). అది వాళ్లకు బాగా నచ్చింది. నాకు కూడా నచ్చింది. వాడు ఇప్పుడు తూర్పు గోదావరి (అంబేద్కర్ కోనసీమ జిల్లా) లో ఎలిమెంటరీ విద్య అభ్యసిస్తున్నాడు.
ఎంత ఆధునిక కాలంలో బ్రతుకుతున్నా ఇంకా చాలామంది, మతపరంగా కొన్ని పేర్లు, ఫ్యాషన్‌గా నోరు తిరగని పేర్లు, వారి వారి ఇష్టాలను బట్టి రకరకాల పేర్లు తమ పిల్లలకు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతమాత్రమూ ఆక్షేపణీయం కాదు. కానీ పేరు అనేది సరళంగా, పిలుచుకోవడానికి, రాసుకోవడానికి వీలుగా, అర్థవంతమైన అందమైన పొట్టి పేర్లు బాగుంటాయని నా నమ్మకం.
బహుశః ఇలాంటి ఆలోచన రావడానికి కారణం నా పేరు పొడవుగా ఉండడమే కారణం కావచ్చు. అదే కానేటి లక్ష్మి వరప్రసాద్. నా మిత్రులు చాలామంది నన్ను ‘కెఎల్వీ’ అని పొట్టిగానే పిలుస్తారు, అది వేరే విషయం!
(మళ్ళీ కలుద్దాం)