నియో రిచ్-2

0
3

[శివరాం కొడుకు రవికి చదువుతున్న పాఠాలలో సందేహాలొస్తాయి. తండ్రి శివరాంని అడిగితే, తాను క్లబ్‌కి వెళ్తూ, ఆ బాధ్యతను భార్య పార్వతికి అప్పజెప్తాడు. కాపేపయ్యాకా ఇంటికి ఫోన్ చేసి తమ డ్రైవరుతో మిత్రుడు జయంతి లాల్‌‍ కోసం కారు పంపమని చెప్తాడు. క్లబ్ మీటింగులో జిల్లా వ్యాప్తంగా ‘ఐ క్యాంప్’ నిర్వహించాలని ప్రతిపాదిస్తారు. శివరాం తన గతం గుర్తు చేసుకుంటాడు. తండ్రి చనిపోతే, పల్లె వదిలి పట్నం వచ్చి – పుల్లయ్య, శాంతల సహకారంతో ఎదిగిన వైనాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. శివరాం ఎదిగిపోగా, పుల్లయ్య స్థితి క్షీణిస్తుంది. బలహీన పరిస్థితులలో శాంతని లోబరుచుకుంటాడు శివరాం. ప్రమాదంలో పుల్లయ్యకి కాలు తీసేయగా, పుల్లయ్యని, శాంతని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఓనాడు ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడతారు. దుఃఖంతో వాళ్ళ అంత్యక్రియలు జరిపిస్తాడు శివరాం. ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap]నక రెండు మూడు నెలలు గడిచాక పెండ్లి చేసుకోవాలనే తలంపు వచ్చింది. కుటుంబాన్ని చూసి పార్వతిని పెళ్ళాడాడు. పార్వతి న్యాయంగా శాంతి అంత అందగత్తె కాదు. కళగా ఉంటుంది. అర్థం చేసుకొని మెలగగల నేర్పు కల మనిషి.

పార్వతి ఇల్లాలుగా వచ్చాక శివరాంకు చేస్తున్న వ్యాపారంపై శ్రద్ధ తగ్గింది. దానికి తోడు పోటీ మిషన్లూ వచ్చినయి. వ్యాపారికంగా అంత మంచిగ అనిపించలేదు. దానికి తోడు పుల్లయ్యలా పని ముఖం తెల్సిన పనోళ్లు దొరకడం లేదు. అంచేత దాన్ని మొత్తంగా ఎత్తివేయాలనుకుంటున్న సమయాన – జయంతి లాల్‌తో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులలోనే స్నేహం కుదిరింది. జయంతి లాల్ చేస్తున్న వ్యాపారం dry fruits షాపు. దానికితోడు సుగంధ ద్రవ్యాలు. బాగా సంపన్నుడు. వ్యాపారికంగా దక్షుడు. వారి స్నేహం రాను రాను ఇండ్లలో మకాం వేసేదాక పెరిగి స్థిరపడింది. ఒకనాడు ఇంటికి చేరేసరికి పార్వతి ఉత్తరమొకటి ఇచ్చింది. దాన్ని విప్పి చదివితే అది తను ఉంటున్న చోటు సంగతి. తనకు అమ్మినతని తమ్ముడు పంపిన నోటీసది. పుల్లయ్య గుర్తుకొచ్చి భయమైంది. జయంతిలాల్ దగ్గర వెళ్తాడు వెంటనే. ఇద్దరూ కలసి జయంతి కంపెని వకీల్‍ని కలిసారు. ఆయన సమాధానం వేయించాడు. ఎనిమిదేళ్లు నుంచీ అక్కడే ఉండడమేగాక, అయిదేళ్లు కరంటు బిల్లలు తన పేర ఉండడం, మున్సిపల్ నీరు ఉండడం, కట్టుబడికి డంగుకు వారిచ్చిన పర్మిషన్, కేసుకు పనికివచ్చాయి. అయితే ఎనిమిది నెలలకు ఎవరి పొజిషనులో చోటు ఉంటే వారే హక్కుదారులని కోర్టు చెప్పింది. ఇది గమనంలోకి రాగానే ఎదుటివాళ్లు ఆక్రమణ కోసం దాడులు మొదలనయినయి. జయంతిలాల్ సాయంతోనే నెగ్గుకొచ్చాడు. ఆనక ఒకనాడు దాన్ని అమ్మేయమని జయంతితో చెప్పాడు శివరాం. పార్వతి ఇష్టపడింది.

‘మంచిది’ అని ఓ ప్లాన్ చేసి దాన్ని ప్లాట్లుగా విడగొట్టాడు. దాని అవతల ఉన్న చోటుకు ఆర్టిఫిషియల్‌గా రేట్లు పెరిగేలా చేసాడు.

ఆనక ఈ ప్లాట్లకు బేరం పెట్టాడు. ఆరు వేలకు కొన్న చలక ఆరున్నర లక్షలకు పోయింది. శివరాం జాతక చక్రం దానితో మారింది. లక్షన్నరతో ఓ ఇల్లు కొనుక్కున్నాడు. ముందు 500 గజాల ఖాళీ స్థలం. కాంపౌండు పోర్టికో…

ఆ ఇంట్లోకి చేరిన నాలుగు నెలలకి పార్వతి నెల తప్పింది.

సివిల్ కాంట్రాక్టరుగా జయంతి సపోర్టుతో శివరాం రంగప్రవేశం చేసాడు. ఆఫీసర్స్‌తో మంచిగ మెలుగుతూ పని పట్ల శ్రద్ధ చూపుతూ కొద్ది కాలంలోనే మంచి కాంట్రాక్టరుగా పేరు, పైకం సంపాదించగలిగాడు. ఈ లోపు శివరాంకు సంతానము కల్గింది. వాడే ‘రవి’.

రవితో పాటు డబ్బూ చాలా విరివిగా పోగడింది. రవికిప్పుడు ఏడు సంవత్సరాలు.

శివరాం ఇప్పుడు A కాంట్రాక్టరే గాక ‘Drugs’ కంపెనీకి యజమాని. క్లబ్బులో రెండేళ్ళుగా చాలా ముఖ్యమైన వ్యక్తి. శివరాం చీకుచింతా లేని దిశకు పెరిగాడు. జయంతి తన వ్యాపకాలపై ఎక్కువ శ్రద్ధ కనపరచాడు. దాంతో రాకపోకలు కొంచెం ఎడమయినయి. అంటే ఆత్మీయతలు కొరవడి కాదు. ఒకసారి “ఏమిటిది” అని శివరాం నిలదీసాడు జయంతిని. “నీకు నా అవసరం ప్రస్తుతం లేదు. కాక నా అవసరం ఉన్నవాళ్లు నాకు ఇంకా ఉన్నారు. వాళ్లకు అంతో ఇంతో ఉపయోగపడాలిగదా! నా అక్కర ఉంటే నువ్వు చెప్పాలా, నేనే తెల్సుకొని రెక్కలు గట్టుకొని వచ్చి వాలతా” అన్నాడు నవ్వుతూ.

‘మానసికంగా మనం ఎడం కావడం లేదుగదా!’ అని చాలా సార్లు అనుకున్నాడు శివరాం. ఒక్కో మనిషి కష్టంలోనే కలసి ఆదుకొని వెళ్లిపోతాడు. ఒక్కొకడు సుఖాన మాత్రమే కనిపిస్తాడు. జయంతితో స్నేహం కుదిరిన నాటి నుంచి “మంచి పిల్లను ఇప్పిస్తాను చేసుకోరాదూ” అని పోరుతూనే వచ్చాడు శివరాం. చిరునవ్వు నవ్వి మాట తప్పిస్తుండేవాడు జయంతి. అయితే ఎవరో హిందీ సినీతారతో సంబంధాలున్నాయని అనుకొనగా విన్నాడు. “ఇలా అనుకుంటున్నారెందుకు?” అడిగాడొకనాడు. మళ్లా అదే చిరునవ్వు! ఒకసారి – జయంతి వచ్చి “మా ఊరు వెళ్లి రావాలి” అన్నాడు. వెళ్లాడు. ఇరవై రోజులకు గాని వచ్చేవాడు. ఎక్కడెక్కడ తిరిగే వాడో ఏమో? రాగానే శివరాం ఇంటికే వచ్చేవాడు. తెచ్చిన మోత బరువంతా ఇక్కడే పడేసేవాడు. పార్వతిని చూసి పలకరించి ఆవిడ ఇచ్చిన కాఫీ త్రాగి మరీ వెళ్ళేవాడు. ఒకసారి పార్వతి “నాకు మీవాళ్లను చూపవా అన్నయ్యా” అని అడిగింది. దానికి సమాధానం ఇవ్వకపోగా అచేతనుడయ్యాడు. అతని స్థితిని గమనించి “అక్కరలేదులే” అన్నది.

జయంతి పార్వతి రెండు చేతులూ పట్టుకొని వాటిలో ముఖం దాచుకొని ఏడ్చాడు. అర్థం కాలేదు పార్వతికి. జయంతిని ఎలా ఓదార్చాలో తెలీక తను ఏడ్చింది. శివరాం వచ్చి కంటి తడి పెడుతున్న ఇద్దర్నీ చూసి అయోమయంలో పడ్డాడు. పరిస్థితులు చక్కబడడానికి గంట పట్టింది. ఒకసారి ముగ్గురు మద్రాసు వెళ్తారు. మద్రాసు చేరగానే చికాకు అయ్యాడు జయంతి. శివరాం, పార్వతులకేం అర్థం కాలేదు. “లోకంలోని అందరి బాధలు నీవే అనుకొని వేదన పడుతుంటే – విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది?” అనడిగింది. దగ్గర కూర్చుని అనునయంగా…

“పార్వతీ, శివుడు విషాన్ని కంఠాన ఆపి చేసిన నృత్యం గురించి విన్నావా ఎప్పుడైనా?” అడిగాడు. తెల్లబోయి చూసింది.

“పార్వతీ – మనస్సు వేరు, స్థితి వేరు. దాని నడక వేరు, లోకం వేరు. అందున్న అనుబంధాలు వేరు. ఆటుపోట్లున్నప్పుడు వాటి తీరే మారి – విడ్డూరంగా అనిపిస్తుంది. మనపై మనకు ఎంతటి ఎలాంటి అదుపు ఉన్నా నడుస్తున్న సమాజపు తీరుతో రాజీపడక తప్పదు. ఇంకో మాట, మంచికీ చెడుకూ మధ్య ఉన్న అంతరం ఎంత పెద్దదయినా చిన్నదయినా అనుబంధం మాత్రం చాలా పాతది. దానిపై విచారణ చేయాలంటే మనస్సుకు ప్రశాంతతా విశ్రాంతి చాలా అవసరం. ఎంత విరాగి అయినా లోకపు ప్రభావం ముద్ర తప్పకుండా పడుతంది” అంటుండగా దగ్గరకొచ్చి తలను సున్నింతగా నొక్కింది. కొద్ది సేపు అలా నొక్కతూ కూర్చుని “నాదో చిన్న కోరిక” అంది.

“చెప్పు” అన్నాడు.

“మాట తప్పతే నేను ప్రమాదాన పడతాను.”

“నీకు ప్రమాదమేంటి – ఛ చెప్పు.”

“అసలు నువ్వేమిటో – తెల్సుకోవాలని ఉంది” అంది సూటిగా చూస్తూ.

ఉలిక్కిపడి – లేచి నిల్చున్నాడు. ఆత్మీయంగా కూర్చుండబెట్టింది పార్వతి కుర్చీలో.

కుర్చీలో వెనక్కి వాలాడు. పది నిముషాలయ్యాకా, “పార్వతీ నీకంటే నాకెవరున్నారు చెప్పుకోనడానకైనా. తప్పక చెప్తాను. సాయంత్రం ఇక్కడకే వస్తాను. భోం చేసాక కూర్చుందాం. ఏం?” అని లేచి కారు దగ్గరకొచ్చాడు.

ఆ రాత్రి వచ్చాడు జయంతి. స్వీటూ, చపాతీ, కూరా, పెరుగు పెట్టింది. తిన్నాక వంటిల్లు సర్దింది. హాలులోకి వచ్చి ఎదురుగా కూర్చుంది. కూర్చోగానే చేత్తో తల నిమిరి “పార్వతీ నీకు తోబుట్టువులున్నారా?” అడిగాడు.

“ఉన్నారు కాని లేనట్లే” అంది.

“సరే కాని – మధ్యన ప్రశ్నలు వేయొద్దు. అనుమానాలేమైనా ఉంటే పూర్తయ్యేక చెప్తాను.”

తల ఊపింది.

“అసలు ఈ మనిషి పుట్టుకకు అర్థం ఏమిటో నాకిప్పటికీ చీమ తలంత అర్థం కాలేదు. నాకు అర్థమయ్యేలా చెప్పిన వాళ్లు తటస్థపడలేదు. కాకపోతే ఈ పరిస్థితిలోని వాణ్ణి ‘మనిషి’ అని అన్నారు. ఆ గీతలు దాటినవాణ్ణి కాదన్నారు. అయితే పార్వతీ మనం కొంచెం ఇంగితంతో మెలిగి ఈ ‘గీత’ లకు దొరక్కుండా బ్రతుకొచ్చు”. అని నవ్వి, “నేను నా జీవితపు ‘షాక్’ నుంచి బయటపడ్డాక నా నిర్ణయం అదే. పార్వతీ జీవితంలో నాకు నా కుటుంబానికి పూడ్చలేని అన్యాయం జరిగింది. అదీ అకారణంగా. జరిగిన అన్యాయానికి ప్రతీకారం తప్పక తీర్చుకోవాలి. ఆవేశపడితేనో, ఎదురుగ ఢీకొంటేనో పగ చల్లారకపోగా కొత్త అనర్థం వస్తుందని ఆలోచన మేర అర్థమైంది. అంచేత ఒక్కడినైనా నేను మిగిలిపోయాను. నాకు తోడు గానీ అసరా గానీ లేరు. నాకు నేనే. ఒక్కోసారి ఎటు చూసినా శూన్యం అనిపించి భయమేసేది. నేను నీకు ఇప్పుడు చెపుతున్నది. చాలా రోజుల క్రితం మాట.” అని “మాది చాలా పెద్ద కుటుంబం. పద్ధతయినదీ హోదా గల్గినదీనూ. మా నాన్నగారికున్న ఆరుగురు అన్నదమ్ములను వదిలేస్తే – నాన్నగారు, అమ్మ, అమ్మమ్మా, అక్కా నేను తాతగారు (మా అమ్మ తండ్రి). ఈయన మాకు అండగా ఉండి, దండిగా మాకు వత్తాసునిచ్చేవాడు. చిన్నా పెద్దా పొరపాట్లు దొర్లినా అంతా తానే అయి సరిచేసేవాడు. ఆఁ నాకు ఒక అక్క ఉందని చెప్పానుగదా పార్వతీ. అప్పటికి ఆవిడకు పెళ్లీడు వచ్చింది. జయపూర్ లోని మా బంధువుల అబ్బాయికి అక్కనివ్వాలని మా నాన్నగారి అభిప్రాయం. ఒక మంచి రోజున నాన్నగారు తాతగారితో ప్రస్తావించాడు.

‘నేనుగా ఒకసారి చూసి వచ్చాక మీరో అభిప్రాయానికి వద్దురుగాని’ అన్నాడు.

ఆ మాట అంతటితో ఆగిపోయింది. ఒకనాడు మేం ‘తోట’లో నడుస్తున్నప్పుడు ‘మనం వెళ్లి చూసొద్దామా తాతయ్యా’ అని అన్నాను. నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ‘అలాగే’ అన్నాడు తాతయ్య. ఆ మరునాడు నాన్నగారూ తాతయ్యతో తనుగా ఇదే మాటను చెప్పలేక అమ్మను చెప్పమనడమూ నాకు తెలుసు. ఆ తరువాత కూడా నెలరోజులు గడిచినయి. ఒకనాడు అకస్మాత్తుగా ‘ఇవ్వాళ రాత్రి బండికి నేనూ బాబూ ఊరికి వెళ్తున్నాం. రిజర్వేషను కూడా పూర్తయింది’ అని అమ్మకు తాతయ్య ఫోను చేసి నన్ను దుకాణం దగ్గరికి పంపమని చెప్పాడు. ఆ రాత్రే మేమిద్దరం బయలుదేరి జయపూర్ వెళ్లాం.

అయితే తాతయ్య నన్ను మా బంధువుల ఇంటికి తీసుకెళ్లలేదు. ఆయన చిరకాల స్నేహితుడు ‘హిమ్మత్ లాల్’ ఇంట దిగాం. హిమ్మత్ లాల్ ఇంటి తీరూ, నౌకర్లూ, చాకర్లూ హంగూ చూసాక బాగా ఉన్నవాడనీ అక్కడ వ్యాపార ప్రముఖుడనీ నాకు అర్థమయింది. ఆయన భార్య రుక్మిణి స్వయంగా మా పెట్టిపోతలను చూసింది. చక్కటి ఆతిథ్యాన్నిచ్చింది. తాతయ్యను కలిసేందుకు చాలా మంది పెద్దలు ఆ మర్నాడు వచ్చారు. అంటే తాతయ్యకు ఇక్కడ కూడా మంచి గుర్తింపే ఉందని స్పష్టపడింది. తనుగా కొందరు ముఖ్యుల ఇండ్లకు వెళ్ళాడు. నాల్గుదినాలు మేం కలవాలనుకున్న వాళ్లను కలవకుండానే కాలం గచిపోయింది. అయిదోనాడు పొద్దుపొడిచింది. తాతయ్య అలవాటు ప్రకారం దినపత్రిక చూసాడు. లక్నోలో మతకలహాలు ప్రారంభమైనట్టుగా, అవి ప్రభుత్వబలగాల అదుపులోనే ఉన్నట్టుగా వార్త కనిపించింది. దాన్ని అంతగా లెక్క చేసినట్టు కనపడలేదు తాతయ్య. నన్ను ఓదారుస్తూ రేపు మనం బయలుదేరుదాం అని మాత్రం అన్నాడు. నాకు వెంటనే వెళ్లాలనిపించినా తాతగారి మాటకు తల ఊపాను. ఆ రాత్రి హిమ్మత్ లాల్‌నూ, మరో ఇద్దరు పెద్దమనుషులనూ వెంట ఉంచుకుని మా అక్క పెండ్లి సంబంధం ఖాయపరుచుకునేందుకు మా బంధువుల ఇంటికి బయలుదేరి వెళ్లారు. అంటే తాతగారు ఆక్కడ ఆ కుటుంబంలో ఇవ్వవచ్చును అనే అభిప్రాయానికి వచ్చారన్నమాట. పద్ధతి ప్రకారం మాటామంతీ పూర్తయ్యింది. ఫలానా తేదీ మంచిది. ఆ వేళ మా వాళ్లు (అమ్మనాన్నలు) వస్తారు. మీ ఇంటనే లగ్నపత్రిక వ్రాయించుకొని వెళ్తారు అని చెప్పి సాదరంగా సెలవు తీసుకొని హిమ్మత్ లాల్ ఇంటికి చేరాం. మా అక్కని పెళ్లాడాబోయే కుఱ్ఱాడు కూడా నాకు కనిపించాడు. బావున్నాడు. నాకూ నచ్చాడు. ఆ రాత్రి పంచాంగంలో తేది నక్షత్రాలు చూసుకొని రైలుకు ప్రయాణమయ్యాం. అయితే తెల్లవారి పేపరులో లక్నో అంతా కర్ఫ్యూ పెట్టినట్టూ – దాదాపు నూరు మందికి పైగా మరణించినట్టూ చాలా మంది క్షతగాత్రులైనట్టూ పరిస్థితి అదుపులో ఉన్నట్టూ మళ్లా వార్త. గృహ దహనాలు, లూఠీలు ‘జనక్ బాగ్’ ఏరియాలో జరిగినట్టు కూడా ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందనేది పూర్తిగా అర్థమైంది తాతయ్యకు. త్వరగా ఇంటికి చేరాలని అప్పుడు ప్రయత్నించాడు తాతయ్య. ఫోన్లు చేసాడు. చాలా సేపు కలవలేదు. ఆ సాయంత్రమే స్టేషనుకు వెళ్లాం. రెండు దినాలయినా చూడండి. లక్నో వెళ్లడం మంచిది కాదని అక్కడ ఉన్నవారంతా సలహా ఇచ్చారు. ఈ లోపు మేం ఎక్కాల్సిన రైలూ క్యాన్సిలయిందని ఎనౌన్స్ చేశారు. ఏం చేయాలో తోచక హిమ్మత్ లాల్ గారి ఇంటికే తిరిగి వచ్చాం. కాని ఏదో ఒక పద్ధతిన లక్నో చేరిపోవాలి అన్న పట్టుదల తాతయ్యలో బాగా పెరిగింది. దాన్ని గమనించి హిమ్మత్ లాల్ ఒక ట్యాక్సీని ఏర్పాటు చేసాడు. లక్నోకు పది కిలోమీటర్ల ఇవతల నున్న చిన్న జంక్షను వరకూ నన్నమాట. అలా వెళ్లడం మంచిది కాదన్నారు అంతా. ఆ మర్నాడు రైల్వేస్టేషన్‌కు వెళ్లాం. రైళ్లు నడుస్తాయని చెప్పారు. సాయంత్రం రైలు రాగానే ఎక్కాం. నత్తనడకన ప్రయాణించి లక్నో చేరుకుంది బండి. అంత రద్దీగా హడావుడిగా జనం ఈనినట్టుండే లక్నో స్టేషను దాదాపు నిర్మానుష్యంగా కనిపించింది. దిగి స్టేష్టను బయటకొచ్చి టాక్సీ కోసం ఆగాం. అవీ అరకొరగానే కనిపించాయి. జనక్‌పూర్ అని టాక్సీ ఎక్కాడు తాతగారు. నేనింకా ఎక్కనేలేదు, టాక్సీ అతను మాత్రం “అభీ భీ కర్ఫ్యూ హై సాబ్ హమ్ ఉధర్ నై ఆతే” అన్నాడు. అయితే దానికి ఇవతలి పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తానన్నాడు. తల ఊపి నన్ను టాక్సీ లోకి గుంజాడు. టాక్సీ నడుస్తున్నది. అడుగడుగునా పోలీసులు CRPF వాళ్లు గస్తీ తిరుగుతూ చెక్ చేస్తూ కనిపించారు సాయుధులై. టాక్సీ అతను మమ్మల్ని దించాక దొంగలా తప్పుకుంటూ సందులు గొందులు వెంటపడి మా ఇంటి దాపుకు చేరకునే సరికి గంటకు పైగానే పట్టింది. ఎట్టకేలకు చేరుకున్నాం. వరండా దాటాం. సింహద్వారం బయట మూసి కనిపించింది. బయట ఎవ్వరూ కనిపించలేదు. తాతయ్య నన్ను అక్కడనే ఉండమని తలుపులు తనుగా తీసి లోన కెళ్ళాడు. నాన్నను,అక్కను పిలుస్తూ ఇల్లంతా కలయతిరిగాడు. ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాలు తెరచి ఉన్నయి. పరిస్థితి అర్థమయింది. ఎట్లాగో అయిపోయాడు. ఫోను లేపాడు. తెంపి కనిపించింది. పెద్దగా ఏదో అంటూ బయటకొచ్చాడు. కొద్ది సేపట్లో అటుగా పోలీసు వ్యాను వచ్చింది. తాతయ్య బయటకొచ్చి పెద్దగా అరచి ఆపి మాటాడాడు ఏడుస్తూ. మమ్మలను ఆ వ్యానే పోలీసు స్టేషనుకు చేర్చింది. స్టేషన్ పరిధిని D.S.P. గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. తాతయ్య ఆయన ముందుకు పరుగున వెళ్లి అమ్మానాన్నల వివరాలు అడిగాడు. మొత్తం కుటుంబం ఎక్కడ?

ఆ పోలీసు అధికారి లేచి ‘మీరు నా వెంట రండి’ అని జీపు ఎక్కించాడు. మాతో పాటు నల్గురు సాయుధులు కూడా ఎక్కారు. ఆ జీపు సరాసరి జనరల్ ఆసుపత్రి ముందు ఆగింది. అక్కడ దిగి మమ్ము వెంట రమ్మన్నాడు. వెంట పరుగుత్తాము. అక్కడున్న పెద్ద డాక్టరు గదిలోకి వెళ్ళి రెండు మూడు నిమిషాలలో బయటికొచ్చి జనరల్ వార్డుకు నడిచాడు. అక్కడ సూపరెంటెండెంటుతో మాటాడి బయటకొచ్చాడు. ఎక్కడ చూసినా క్షతగాత్రులే. మూల్గులు, ఏడుపులు. రక్తపు మరకలు. మంచాల క్రింద కూడా వత్తుగా వరసగా కనిపించారు. భయంకరమైన వాతారవణం ఆవరించి ఉంది.

మమ్మల్ని వెనక రమ్మన్నాడు. నడిచాం. అయితే ఎంతో హుషారుగా నడిచే తాతయ్య నడవ లేకపోతున్నాడనేది అప్పుడే నాకు అర్థమైంది. ఓ పెద్ద హాలు లోనకు నడిచాం. దాదాపు రెండు వందల బెడ్లు ఉన్నయక్కడ. నర్సులూ, డాక్టర్లూ చాలా బిజీగా కనిపించారు. అంతా ఉరుకులు పరుగులలా ఉంది. దానిలో కొంత దూరం నడిచాక ఓ నంబరు దగ్గర ఆగారు. ఒళ్లంతా తెల్లటి గుడ్డలో కప్పబడి ఉన్న శాల్తీ ఉందక్కడ. ముఖం వరకూ అరకొరగా రక్తపు మరకలతో కనిపించింది. అక్కడి మనిషి మా నాన్నగారని గుర్తించడానికి కొంచెం టైం పట్టింది. ఒళ్లంతా జంకింది. నాన్న అప్పుడు స్పృహలో లేడు. బ్రతికే ఉన్నాడు అనడానికి ఆకారం శ్వాస ఆడుతుడడమే. నాన్న కంటపడ్డాక తాతయ్య దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు. ఆ ఏడుపులోనే అమ్మ, అక్కల విషయం వాకబు చేసాడు. నాల్గయిదు క్షణాలు హాస్పటల వాండ్లతో మాటడాకా ‘రండి’ అన్నారు. నన్ను చూసి అక్కడే నిలబడమని చెప్పి వెళ్లాడు. నాకు అక్కడ ఉండడానికి భయమైంది. పెద్దగా అరుస్తూ పరుగెత్తాలనిపించింది. కళ్లు మూసుకొని ఏడవాలని అనిపించింది. ఇదేమీ చేయక తాతయ్య వెంట పరుగెత్తాను గజగజ వణుకుతూ. నన్ను గమనించిన తాతయ్య నన్ను కలుపుకొని నా చేయి పట్టుకొని నడిచాడు. అప్పుడు అర్థమైంది నాకు, తాతయ్య కూడా చలి జ్వరం వచ్చిన వాడిలా వణికిపోతున్నడని. అయన ముఖంలోకి చూసాను నడుస్తూనే. కళ్ల నుంచీ నీరు ఆగక నడుస్తున్నది. మొఖాన ఏ భావనా కనిపించలేదు. యాంత్రికంగా నడుస్తున్నాడు. నాకు ఇక తాతయ్యతో నడచే స్థితే పోయింది. మమ్ములను ఆక్కడున్న ఓ పెద్ద హాలులోకి తీసుకెళ్లారు. శవాల గుట్టలున్నాయి అక్కడ. నెంబర్ల వారిగా వెతికి ఓ రెండు శవాలను బయటకు గుంజి తాతయ్యకు చూపారు. వాటిని చూస్తూనే తాతయ్య నాకంటే అన్యాయంగా మోకాళ్ల మీదకు వంగి ఏడ్చాడు. చతికిలపడ్డాడు. నేను బితుకు బితుకుమంటు నడచి వెళ్లి చూసాను. ‘అమ్మ’ ముఖం నిండా కోతలు గీరినట్లు రక్కలు కనిపించనయి. అవి ఎండి రక్తం గడ్డకట్టె. అక్క ప్రక్కనే ఉంది. పెదవి చీలి తల ఎత్తి కనిపించింది. గడ్డంపై ఎంత అందంగానో కనిపించే పుట్టు మచ్చపై కత్తి గాట్లు కనిపించాయి. నేను స్పృహ తప్పాను. నన్ను భుజాన వేసుకున్నాడు తాతయ్య. అరగంట కంటే ఎక్కువ సేపు మమ్మల్ని అక్కడ ఉండనివ్వలేదు.

వాళ్లను దహనం చేసుకునేందుకు అనుమతులు అడిగాడు. శవాలను అప్పగించమన్నాడు. A.C.P.ని ఒప్పించాడు.

కుదరదన్నారు. వెళ్లిపోమన్నారు. తాతయ్య మాత్రం తన పట్టు వదలలేదు. ఆ మర్నాడు పగలు ఖననం చేసుకోనేందుకు అనుమతిచ్చారు. అక్కడ నుంచి మేము తిరిగి నాన్న దగ్గరకొచ్చాము. మేం నాన్నను చేరిన గంట తర్వాత కొంచెం కదిలాడు. నెమ్మది నెమ్మదిగా కళ్లు తెరిచాడు. తాతయ్యను గుర్తు పట్టాడు. శక్తినంతా కూడదీసుకొని మాటడే ప్రయత్నం చేసాడు. చివరకు ఆయన ప్రయత్నం నెగ్గింది. ‘నాన్నా! అంతా అయిపోయంది. కటికి దుకాణపు ఖాసిం, వాని మనుషులు మన కుంటుంబాన్ని పొట్టన పెట్టుకున్నారు బాబు ఆఁ. ఆ’ అంటూ తిరిగి కోమాలోకి వెళ్లిపోయాడు. తెల్లవారుఝామున మళ్లా కళ్లు తెరిచాడు. ఈసారి మాట పెగలలేదు. కళ్ళెంట నీరు జారింది. ఆలా కన్నీరు జారుతూండగానే ప్రాణం వదిలాడు. తాతయ్య అక్కడే చతికిల పడిపోయాడు. ఈయన స్పృహ కోల్పోతాడేమోనని డాక్టరు భయపడ్డాడు. కానీ బాగానే నిలబడ్డాడు.”.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here