సీత-21

0
3

[రెబెకతో తన పెళ్ళి ఎందుకు జరగలేదో బామ్మకి వివరిస్తాడు రాజీవ్. నందినితో మాట్లాడుతూ తనని పెళ్ళి చేసుకునే విషయంలో మరోసారి ఆలోచించమంటాడు రాజీవ్. నందిని తండ్రి రవీందర్‍ని కూడా ఈ వ్యవహారంలో పునరాలోచించమంటాడు. రవీందర్‍కి కోపం వస్తుంది. రాజీవ్‍ని దూషిస్తాడు. ఇక చదవండి.]

[dropcap]“వ[/dropcap]దిలేస్తే నా కూతురికి కొండంత ధైర్యంగా నే నిలబడతాను.

జీవితంలో మళ్లీ గెలవడం నేర్పిస్తాను. తన వెంట సైన్యంగా కాపాడుతాను.”

రవీందర్ మాటలు కోపంతో ఊగి పోతున్నాయి.

నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాను.

“మరి అదే ప్రేమించిన వాడు చేస్తే ఆ దైర్యం మీరు ఎందుకు ఇవ్వరు?”

“అలా ఎలా కుదురుతుంది?”

“నా మాట కాదని నన్ను కాదని వెళ్ళిపోయింది. దానికి రేపు ఏదైనా జరిగితే నేనెందుకు బాధ్యత వహించాలి? నువ్వే చెప్పు న్యాయం ఏంటో?”

నేను నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసాను.

“మీ అమ్మాయి ఒక వ్యక్తిని పట్టుకుని వచ్చి ‘ఇతను నాకు నచ్చాడు’, ‘ఇతనే నా నాన్న, నువ్వు నాకు నాన్నవి కాదు’ అంటే మిమ్మల్ని కాదన్నట్టుగానీ ………

నాన్న ఇతను నాకు నచ్చాడు నేను పెళ్లి చేసుకుంటాను అంటే మిమ్మల్ని కాదన్నట్టు ఎట్లా అవుతుంది? మిమ్మల్ని గౌరవించినట్లు అవుతుంది గాని” అన్నాను.

రవీందర్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.

“అర్థం కాలేదు కదా??

నేను అడిగిందానికి మీకు అంత కన్ఫ్యూజింగ్‌గా ఉంటే మరి అమ్మాయిలకు ఇంకెంత కన్ఫ్యూజన్‍గా ఉంటుంది?

చదివేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు సమానం అంటారు.

కానీ ఉద్యోగం విషయానికి వస్తే భర్త చేయనిస్తాడా లేదా అని భయం ఉంచుతారు.

ప్రగతి సాధించాలి అని అంటారు కాని అబ్బాయిలకు అమ్మాయి ఎక్కువ సంపాదిస్తే ప్రాబ్లం అవుతుంది అని అనుమానం పెడతారు.

ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అయితే భార్య ఉద్యోగం మానేయాలి. పెళ్లి అయితే భార్య ఉద్యోగం కాంప్రమైజ్ అవ్వాలి. అలా చెయ్యకపోతే ఆమెది స్వార్థం.

బాగా చదువుకున్న అమ్మాయిలు భర్త మాట వినరు. ఉద్యగం చేసే అమ్మాయికి బాధ్యత లేదు.

ఎంత పై స్థాయికి ఎదిగినా వంట రాదు వేస్ట్.

చివరికి పిల్లలకు జ్వరం వస్తే, అమ్మాయి ఇల్లు పట్టించుకోదు అనుకుంటారు.

పాపం ఇన్ని కన్ఫ్యూజన్‌ల మధ్య …….

అసలు తనకు ఏం కావాలో?

తనేం చేయాలో?

ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి?

అసలు ఎలా ఉండాలో తెలియక

చివరికి వంట చేసే వాడే మంచి వాడని.……

ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని పిచ్చిపిచ్చిగా తిరగనిచ్చేవాడు ఓపెన్ మైండ్ అని………

కలిసి మందు కొడితే వాడు మహానుభావుడని అనుకుంటున్నారు.

వారిని సరిగ్గా నేను అర్థం చేసుకోలేక నాకు సరిగ్గా వాళ్ల దగ్గర కోపం ఎవరిమీద చూపించాలో తెలీక పిచ్చెక్కి పోయింది.

మరి అరవింద్ సంగతి ఏంటి? ప్రేమించేకదా పెళ్లి చేసుకున్నాడు?ఇప్పుడేం అయ్యింది?” అన్నాను

“ఏం కావాలి?? రచన బ్రహ్మండంగా ఉంది.”

“వీడికే, మళ్ళీ అలాంటి పిల్ల దొరకాలంటే తపస్సు చెయ్యాలి. తప్పు మొత్తం అరవింద్‌దే” అన్నాను

“ఏం నేనేం చేశాను?” అరవింద్ అయోమయంగా అడిగాడు.

“నోరు ముయ్యి రా!” కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పళ్ళకింద నా మాట నేను పెట్టేసాను.

“ఇంకేం చేయాలి? పెద్ద లవ్ చేస్తున్నా అని రచనని పెళ్లి చేసుకున్నావ్.

ఉద్యోగం చేయడం రచన టాలెంట్. రాత్రంతా కూర్చుని ఉద్యోగం చేస్తుంది అంటే అది ఆమెకు ఉన్న శ్రద్ధ. ఆమె లైఫ్ స్టైలే ఆమె ఎంచుకున్న విధానం.

అందులో నువ్వు చేసేది ఏముంది? దానికి మీ ఇంట్లో వాళ్ల సపోర్ట్ ఏది?

ఏం? ప్రేమించిన అమ్మాయి కోసం కొన్ని తిట్లు పడలేవా? వాళ్లని క్షమించలేవా? వాళ్ల నాన్నతో మళ్లీ మాట్లాడలేవా?

అంత తప్పు వాళ్ళు ఏం చేశారు?

పోనీ ఎంత పెద్ద తప్పు చేసిన ఆ మాత్రం రచన కోసం నువ్వు కొంచెం తగ్గలేవా?

నేను నీ స్థానంల్లో ఉంటే రాత్రి పని చేయడానికి ఒప్పుకునే వాడిని కాదు ఎందుకంటే రాత్రి ప్రయాణం సేఫ్ కాదు కాబట్టి.

కానీ ఖచ్చితంగా తన తల్లిదండ్రులతో మాట్లాడేవాణ్ణి. అది నా బాధ్యత.

నేను ప్రేమించినందుకు నిలబెట్టుకునే వాడిని.

అంటే జీవితం అన్నాక సర్దుబాట్లు ఉండవా? ఇక ఇవి కూడా లేకపోతే కలిసి బతకడం ఎందుకు?” అన్నాను.

అరవింద్ తన తప్పును ఒప్పుకోలేదు.

జీవితం అన్నాక కాంప్రమైస్ తప్పదు అది అందరికీ తెలిసిన విషయమే.

కానీ వాళ్ల కాంప్రమైస్ ఏమైనా విలువ ఉందా?

“అవన్నీ సరే రాజీవ్ ఇప్పుడు అవన్నీ మర్చిపో” అంటూ శంకర్రావు కొడుకుకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు

“నందినిని పెళ్లి చేసుకోను అంటావ్ అంతే కదా?” రవీందర్ సూటిగా అడిగాడు.

“చూడు మీ నాన్న లాగా నువ్వు చేద్దాం అనుకుంటున్నావ్ ఏమో!

ఒక్క విషయం గుర్తు పెట్టుకో. అప్పుడు నేను చిన్నవాడిని, నాకు ఆవేశం ఉండేది కానీ ఇప్పుడు వేరు.

నాకు ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఉంది అర్థమైందా?” ప్రశాంతంగా చెప్పినా రవీందర్ బెదిరిస్తున్న సంగతి అక్కడ అందరికీ అర్థమైంది.

“మరి మా కుటుంబం విషయం తెలిసి కూడా నాకెందుకు నందిని నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు?

విడిపోయిన బంధాలు కలపడానికి అని మాత్రం అనకండి.

బంధాలు కలవాలంటే చిన్న చిరునవ్వు సరిపోతుంది. పెళ్లి చేయాల్సిన అవసరం లేదు.” అన్నాను

రవీంద్ర పళ్ళు కొరుకుతూ కోపంగా తలదించుకున్నాడు.

“ఎందుకంటే మీరు ఈ పెళ్లి పరువు కోసం చేస్తున్నారు. మీ చెల్లెలు ఆత్మహత్యతో పోయినా మీ పరువు దీనితో సంపాదించుకోవాలి అనుకుంటున్నారు అవునా?” అడిగాను.

“నేను అస్సలు ఒప్పుకోను. విషయం పరువుది కానే కాదు.” రవీందర్ గట్టిగా అరిచాడు.

“చూడు..! నా కూతురు నా ఇష్టం. దాని ఎవరికిచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయం నాది.

నువ్వు ఈ రోజు వచ్చి నాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు.” అన్నాడు.

“సరే! నందిని మీ కూతురు, మీకు హక్కు ఉంది. బామ్మ ఏం చేసింది? ఆమెను ఎందుకు వృద్దాశ్రమం వెళ్లనీయటం లేదు?” అడిగాను.

“నీకేమైనా పిచ్చి పట్టిందా?” రవీందర్ కోపానికి ఇక అంతు లేకుండా అయిపోయింది.

“కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నాను కదా అనుకుని నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నాను.

ఇది వేరే వాడు అయి ఉంటే ఈపాటికి పళ్ళు రాలగొట్టి ఉండేవాడిని.” అన్నాడు.

ఈ విషయం వింటూ బామ్మ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చింది,

“ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ?” అంది.

ఆమె చేతులు చల్లబడిపోయినాయి.

ఒంట్లో సన్నని వణుకు ఆమె స్పర్శలో తెలుస్తోంది.

రవీందర్ తల్లి వైపు కోపంగా చూశాడు.

“ఇది కూడా పరువుకు సంబంధించిందా?”

“వయసు పైపడిన తల్లి తండ్రిని వృద్ధాశ్రమంలో ఉంచడం ఎంత అగౌరవo తెలుసా?

మా అమ్మని నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నాను?”

“అంకుల్ నేను మాట్లాడేది వయసు పై పడ్డ వారిని బాధ్యత లేకుండా వృద్ధాశ్రమంలో వదిలేయడం కాదు.

నేను మాట్లాడేది బామ్మ స్వేచ్ఛ గురించి. ప్రతి ప్రాణి కోరుకునే స్వేచ్ఛ.

ఏంటా స్వేచ్ఛ అని అడుగుతారా.

స్వేచ్ఛ అంటే జీవితానికి గమ్యం ఎంచుకోవడం.

ఆ గమ్యం సాధించడం కోసం సిద్ధాంతాన్ని ఏర్పరుచుకోవడం.

ఆ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేయడం.

అవసరమైతే త్యాగం చేయడం. అది స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే.

ఆలోచించే అవకాశం ఇక్కడ అమ్మాయిలకు ఎక్కడైనా ఇచ్చారా?”

రవీందర్ మారు మాట మాట్లాడలేదు.

కాసేపటి మౌనం తర్వాత మెల్లగా అన్నాడు.

“రాజీవ్! ఇది మా ఇంటి విషయం. ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా రెండు రోజుల పెళ్లి. దీని గురించి తర్వాత మాట్లాడదాం.” అంటూ రవీందర్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

***

ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకున్నాక మనసంతా తేలిగ్గా ఉంది. పెళ్ళికి నందిని ఊరు చేరుకున్నాం. ఈ రోజు రాత్రికి అక్కడే ఉంటున్నాం.

రవీందర్ గారు అన్నీ ఏర్పాట్లు చేసారంట…

ఈ సారి మాకు ఉండటానికి ఏదో హోటల్లో ఏర్పాటు చేసారు.

ఒకే ఇంటినుంచి ఇద్దరూ పెళ్ళివారు బయలుదేరగూడదని అలా చేసారట.

పెళ్ళి మాత్రం ఏదో హాల్లో చేస్తున్నారు.

మేముంది హోటల్లో…. కాబట్టి నందిని రోజంతా కలవడానికి కుదరలేదు.

సాయంత్రం రిసెప్షన్ మొదలవుతుంది. రాత్రికి పెళ్ళి. సమయం చేదాటిపోతుంది.

నేను బయటకి వెళతాను అంటే నన్ను ఎవ్వరు అడుగు కదపనివ్వటం లేదు.

ఎలా కలవాలి?

నందినికి ఈ పెళ్ళి ఇష్టం లేదు. అది తను ఒప్పుకోదు. ఎంత చెప్పినా ఒప్పుకోదు.

అంత తప్పు జరుగుతుంది అని తెలిసినా నేను ఏమి చెయ్యలేను. అనుకోకుండా గుర్తుకు వచ్చింది. సతీష్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది.

ఏది ఏమైనా సరే, సతీష్ తోటి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నా.

వెంటనే ఫోన్ కలిపా….!

పెళ్ళి జరిగే కళ్యాణ మండపానికి వచ్చేసాం. పెళ్ళికూతురు తరఫువాళ్ళకి రెండు గదులు, దాని పక్కనే పెళ్ళికొడుకు వాళ్ళకి రెండు గదులు ఇచ్చారు.

నందినిని ఎలాగైన కలవాలి…. ఎలా….ఎలా…?

బుర్ర వేడెక్కి పోతుంది… తయారవ్వాలని చెప్పి… అందరిని రూమ్నుంచి పంపించేసాను.

ఎంత ఆలోచించినా… ఏం చేయాలో తోచడం లేదు.

నా పక్కన పెళ్ళి కూతురు గది అనుకుంటా… అమ్మాయి ఇకఇకలు…. పకపకలు తెగ వినిపిస్తున్నాయి. వెంటనే నా చెవిని గోడకి ఆనించి విన్నాను.

‘‘ఏమే! ఎన్.ఆర్.ఐ. పెళ్ళికొడుకు ముద్దపప్పులా ఉన్నాడే!’’ ఒక అమ్మాయి అంది…. అందరూ హిహిహిహి….హహహహ అని నవ్వారు.

వీళ్ల బొంద, ఇందులో నవ్వడానికేముందో…

కాసేపటికి గదంతా నిశబ్దంగా మారింది. వెళ్ళిపోయారనుకుంటా….

రూమ్‌లో ఉన్న టేబులు, కుర్చీలను అన్నీ ఒకదానిపైన ఒకటి పేర్చి… కష్టపడి… వెంటిలేటర్ వరకు చేరాను.

అబ్బా మీరు నమ్మరు… ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం వేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here