కశ్మీర రాజతరంగిణి-87

1
3

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

పార్థివాః స్పార్మ సంసిద్ధత్వరా విరత సత్త్వయా।
థియో విశుద్ధం యక్కింజత్ కుప్వం తీతి న నూతనమ్॥
(కల్హణ రాజతరంగిణి 8, 2975)

[dropcap]తా[/dropcap]ము అనుకున్నది సాధించే తొందరలో రాజులు సత్ప్రవర్తనా పథం నుంచి తొలగటం సాధారణం.

కల్హణ కశ్మీర రాజతరంగిణి చివరి తరంగం అంతా యుద్ధాలు, ఎత్తుకు పై ఎత్తులుగా సాగుతుంది. ఒక ప్రమాదం తొలగిందనగానే మరిన్ని ప్రమాదాలు నలువైపుల నుండి చుట్టుముడతాయి. జయసింహుడి సింహాసనం ఆక్రమించాలని ఎందరో ఇంకెందరినో కూడగట్టుకుని నిరంతరం కశ్మీరుపై దాడులు చేస్తూనే వున్నారు. జయసింహుడు శత్రువుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, వీలు చిక్కినప్పుడు ముందుకు దూసుకుపోతూ, అవసరమైనప్పుడు వెనుకడుగులు వేస్తూ సింహాసనం కాపాడుకుంటూనే ఉన్నాడు. డామరులు, దరదలు, మ్లేచ్ఛులు, రాజకుటుంబీకులు అందరూ ఏకమై యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. ఒకరితో ఒకరు స్నేహం నటిస్తూనే ఒకరికి వ్యతిరేకంగా మరొకరు కుట్రలు పన్నుతూనే ఉన్నారు.

షష్ట చంద్రుడు, ద్విబాహు, బాహరీ, లోధనుడు, డామరులు, లావణ్యులు, ధన్యుడు, భోజుడు అందరూ ఒకటిగా పోరాడినా జయసింహుడి సేనలోని వీరులు అడుగడుగునా వారికి ప్రతిబంధకాలు కల్పించారు. వీరోచితమైన పోరాటాలు సల్పుతూ ఒక అడుగు ముందుకు వేసిన శత్రువులను పది అడుగులు వెనక్కి తరిమేవారు. ఓ వైపు ఎడతెగని యుద్ధం జరుగుతుండగా, ప్రజలు తమ తమ వృత్తులను మానేసి ఆయుధాలు చేపట్టి యుద్ధంలో పాల్గొన్నారు. సామాజిక జీవితం సర్వం అల్లకల్లోలం అయింది.

పరాజయం సంభవించినప్పుడల్లా తిరుగుబాటు సేనలు కశ్మీరం వదిలి పారిపోవాలని నిర్ణయించుకునేవారు. ఇతరులు వారిని వారించేవారు. ఈలోగా ఒక చిన్న విజయం ప్రాప్తించేది. దాంతో శ్రీనగరం చేయి చాస్తే తమదవుతుందన్న ఆశాభావంతో రెట్టించి కదనరంగంలో దూకేవారు. వెంటనే ఘోరమైన పరాజయం సంభవించేది. దాంతో ‘ఎందుకీ పోరాటాలు?’ అనుకుని అన్నీ వదిలేందుకు సిద్ధమయ్యేవారు. రాజ్యం మీద ఆశతో, తాము హస్తగతం చేసుకోవాలని తహతహలాడుతున్న అధికారం దక్కితే, ఎంతటి అస్తవ్యస్త రాజ్యాన్ని పాలించాల్సి వస్తుందోనన్న కనీసపు గ్రహింపు లేకుండా నిరంతరం పోరాటాలతో కశ్మీరాన్ని అల్లకల్లోలం చేశారు స్వార్థపరులు.

ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎన్ని పరాజయాలు అనుభవించాల్సి వచ్చినా జయసింహుడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. తన సేనా నాయకులను ప్రోత్సహిస్తూ, దైర్యం చెప్తూ ఎదురు పోరాటాలు కొనసాగించాడు. అయితే తనకు బందీలుగా చిక్కిన శత్రు నాయకులను జయసింహుడు, హింసించకుండా, అవమానించకుండా, గౌరవంగా, ప్రేమగా వ్యవహరించటంతో జయసింహుడికి వ్యతిరేకంగా విప్లవాన్ని లేవదీసినవారు తమ తప్పును గ్రహించి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవారు. జయసింహుడి ముందు తమ అల్పత్వం గ్రహించి సిగ్గు పడేవారు.

ఇలా ఒకొక్కరుగా శత్రువులను శక్తితో, మంచితనంతో గెలుస్తూ వచ్చిన జయసింహుడు, శత్రువులను అదుపులో పెట్టేందుకు అవసరమైతే వారిని హత్య చేయించేవాడు. శత్రువులను యుద్ధంలోనే కాక, ఇలా మాయోపాయాలతో, దొంగతనంగా హత్య చేయించటం భారతీయ సమాజంలో ఆమోదం పొందే చర్య కాదు. కానీ మ్లేచ్ఛ సంపర్కంతో కలుషితమైన భారతీయ సమాజం, లక్ష్య సాధనకు ఇచ్చిన ప్రాధాన్యం, లక్ష్య సాధన మార్గానికి ఇవ్వటాన్ని వదిలివేయటంతో ప్రజలు జయసింహుడిని సాధించే బదులు, దొడ్డి దారిన శత్రువుల అడ్డు తొలగించుకుంటున్న అతడిని గొప్ప వీరుడని పొగడటం ఆరంభించారు. ఈ సందర్భంలో కల్హణుడు రాజులు లక్ష్యం సాధించే తొందరలో తప్పు దారులు పడతారని వ్యాఖ్యానించాడు.

కశ్మీరు చరిత్రలో ప్రత్యక్షంగా, భారతీయ చరిత్రలో పరోక్షంగా సమాజం ఒక సంధి దశలో ప్రయాణిస్తున్నదంటానికి ప్రతినిధి కల్హణుడు. కల్హణుడు ఆ దశకు ప్రత్యక్ష సాక్షి. సంధి దశలో సమాజంలో వస్తున్న మార్పులను సజీవంగా భావి తరాలకు అందించిన చరిత్రకారుడు కల్హణుడు. అతడు అంతటితో ఆగలేదు. ఆ మార్పులలోని మంచి చెడ్డలను వివరించి, భావి తరాల ముందు ఉత్తమ ఆలోచన, ఉన్నత ప్రవర్తన, వాంఛనీయమైన ఆదర్శాలను ఉంచిన మహానుభావుడు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే, సమాజంలో స్థిరపడే వికృతుల రూపును, రూపాంతరం చెందే సమాజం వికృత రూపును ప్రదర్శించిన ద్రష్ట కల్హణుడు.

‘యుద్ధంలో గెలవటం కోసం ఏం చేసినా ఆమోదమే’ అన్న నీతిని అనుసరించి జయసింహుడు శత్రు వీరుడు ‘నాగు’ను బంధించి, భోజుడిని తనకు అప్పచెప్పితేనే నాగుని ప్రాణాలతో అప్పగిస్తానని బేరం పెట్టాడు. కానీ జయసింహుడి మంత్రులు పొరపాటున నాగును చంపేశారు. కానీ ఆ నేరం రాజుకు ఆపాదించారు. ఎన్ని రకాలుగా ప్రజలను రాజుకు వ్యతిరేకంగా చేయాలని శత్రువులు ప్రయత్నించినా, రాజు ప్రతి పనిలో ఏదో ప్రయోజనాన్ని ప్రజలు చూశారు. జయసింహుడికి తమ  మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా కల్హణుడు రాసిన శ్లోకం చదవగానే సమకాలీన సమాజంలో పరిస్థితి మనసులో మెదులుతుంది.

అతో ధూర్తో నృపో ముగ్ధ ఇతి జ్ఞాతోరిభిర్ముధా।
మౌగ్ధ్యం రదర్శయం స్తోషాం యత తేస్మాభిసంధియో॥
(కల్హణ రాజతరంగిణి 8, 3011)

శత్రువులు రాజును మూర్ఖుడని, తెలివి లేని వాడని దూషిస్తుంటే, తెలివైన రాజు అమాయకుడిలా ప్రవర్తిస్తూనే, తన లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తూ పోయాడు.

ప్రస్తుత సమాజంలో ప్రతిపక్షం,  ప్రతి అంశంలో ప్రభుత్వ పక్షాన్ని, ప్రభుత్వాధినేతను పనికిరాని వాడిగా, చేతకాని వాడిగా, సరైన నిర్ణయాలు తీసుకోవటం తెలియని వాడిలా, పాలన గురించి అవగాహన లేని వాడిలా, ప్రజల నడుమ చీలికలు తెచ్చేవాడిలా, హింస ద్వారా రాజకీయ లబ్ధి కోసం తపన పడేవాడిలా, ఇలా ఎన్ని రకాల దూషణలు చేయాలో అన్ని రకాల దూషణలు, విమర్శలు చేస్తూ, ప్రజల దృష్టిలో పాలకుడి పట్ల వ్యతిరేక భావన కలిగించాలని, అతడి ప్రతిష్ఠ దిగజార్చాలని అడుగడుగునా ప్రవర్తించటం గమనిస్తూనే ఉన్నాం. ప్రతి చర్యనూ విమర్శించటం, ఓ పెద్ద సమస్యలా ఎదిగేట్టు చేయటం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ప్రజల మద్దతు పాలకుడి వైపే ఉండటం గమనిస్తున్నాం. చివరికి పాలకుడి పట్ల ప్రత్యర్థుల వ్యతిరేకత ఏ స్థాయికి చేరుకుందంటే తానున్న కొమ్మనే సర్వనాశనం చేసుకుంటూ, ఏ ప్రజల ఉద్ధరణ కోసం ఇన్ని రాజకీయాలు చేస్తున్నారో, ఆ ప్రజల అభిప్రాయాన్ని త్రోసి రాజని, ప్రజలకు కష్టనష్టాలు కలిగించే స్థాయికి చేరుకుంటోంది. అయినా ఎవరికీ ఆ గ్రహింపు ఉన్నట్టు లేదు. ఆనాడు కశ్మీరంలో కూడా ఇలాగే జరిగింది.

కశ్మీరీ ప్రజలు జయసింహుడి ప్రతి చర్యను సరైన చర్యగా భావిస్తూ అతడి పట్ల విశ్వాసాన్ని, విధేయతను ప్రదర్శిస్తున్నారు. కానీ జయసింహుడిని దెబ్బతీయాలని ప్రయత్నించేవారు, జయసింహుడి ప్రతి చర్యలోనూ చెడును చూసి, జయసింహుడి పట్ల ప్రజలలో వ్యతిరేకత కల్పించాలని అతడిని దూషిస్తూ నేరాలను ప్రకటిస్తూ పోయారు. ఈ సంఘర్షణ ఓ వైపు కొనసాగుతూండగా, జయసింహుడు మరో వైపు తన ప్రధాన శత్రువైన భోజుడి చుట్టూ ఉచ్చులు పన్నుతూ పోయాడు. పైకి అమాయకంగా కనిపిస్తూనే భోజుడు ఎటూ పారిపోయే వీలు లేకుండా చేశాడు. భోజుడి సమర్థకులందరికీ ఏది కావాలంటే అది ఇచ్చాడు. ఏదీ కోరని వారిని మోసంతో చంపించాడు. దాంతో భోజుడికి ఎటూ పోలేని పరిస్థితి, ఎవరినీ నమ్మని పరిస్థితి వచ్చింది. భోజుడు ఎవరి ఆశ్రయం పొందలేక పోయాడు. ఎవరినీ నమ్మలేడు. ఇల్లు దాటి బయట అడుగుపెట్టలేడు. బయట అతడిని బంధించేందుకు ఎవరెవరు ఎదురు చూస్తున్నారో తెలియదు. ఈ సమయంలో ఓ బ్రాహ్మణుడు భోజుడికి బుద్ధి చెప్పాడు.

“ఎందుకోసం ఈ యుద్ధాలు? జయసింహుడి శక్తి నిరూపితమయింది. భిక్షుచారుడితో సహా ఎందరెందరో వీరులు నిరంతరం జయసింహుడి సింహాసనాన్ని ఆక్రమించాలని ప్రయత్నించారు. వారి గతి ఏమైందో తెలుసు కదా? దేశంలో అంతర్యుద్ధం జరపటం వల్ల ఏం సాధిస్తావు? ఇంత కాలం జరుగుతున్నది తెలుసు కదా? జన జీవనం అల్లకల్లోలమవటం, కశ్మీరు బలహీనమవటం తప్ప సాధించింది ఏముంది? నీ చుట్టూ ఉన్నవారి మాటల ప్రలోభంలో పడకు. నీ తెలివిని ఉపయోగించు” అంటూ హితోపదేశం చేశాడు.

బ్రాహ్మణుడి మాటలతో భోజుడి కళ్ళు తెరుచుకున్నాయి. పాములు చుట్టుకున్నా, చుట్టూ మంటలు చెలరేగుతున్నా గంధం చెట్టు చల్లగానే ఉంటుంది. జయసింహుడు అలాంటి వాడు. ‘తన మీద తనకు నియంత్రణ కలవాడు జయసింహుడు. అతడితో సంధి చేసుకోవటంలో అవమానం ఏమీ లేదు’ అనుకున్నాడు భోజుడు. ‘జయసింహుడితో సంధికి సిద్ధం’ అన్న కబురు జయసింహుడికి చేరేట్టు చేశాడు. ఈ రకంగా అతడు జయసింహుడిని చేరాడు. భోజుడితో సంధి చేసుకునేందుకు రాణి కల్హణిని భోజుడున్న తారామూలకు పంపేడు జయసింహుడు.

జయసింహుడితో సంధి చేసుకోవద్దని, విజయం చేరువలో ఉందని బలహరుడు, తదితరులు భోజుడిని వారించాలని చూశారు. కానీ జయసింహుడి శక్తిని అంచనా వేసిన భోజుడికి యుద్ధం నిష్ఫలం అన్నది అర్థమయింది. అందుకని అతడు జయసింహుడిని చేరాడు.

జయసింహుడితో భోజుడు చేతులు కలిపినా, జయసింహుడి శత్రు సంఖ్యలో మార్పు రాలేదు. డామరులు, విల్లకాడు, నీలేశ్వరుడు, రాజవదనుడు వంటి వారు జయసింహుడితో యుద్ధం కొనసాగించాలనే నిశ్చయించారు.

తనని అడ్డుకున్నవారిని జయించి మరీ తనను వచ్చి చేరిన భోజుడిని రాజు, రాణి స్వీయపుత్రుడిలా స్వీకరించారు. భోజుడు, జయసింహుడి నడుమ సంధి జరగటాన్ని కల్హణుడు భూమ్యాకాశాలు సంధి చేసుకున్నాయని వర్ణిస్తాడు. భోజుడు తన దగ్గరకు వచ్చిన తరువాత, అతనిపై పుత్ర వాత్సల్యంతో జయసింహుడు శత్రువులను పట్టించుకోవటం మానేశాడు. భోజుడి పట్ల అతనికి గాఢమైన విశ్వాసం కలిగింది.

అయితే సజ్జపాలుడు డామరులతో కలిసి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. కానీ జయసింహుడి సైన్యం శత్రువులను మట్టుపెట్టింది. ఇంతలో రాజవదనుడు రాజు సేనలపై దాడి చేసి, జయసింహుడి సేనలను ఓడించాడు. జయసింహుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజవదనుడు సంధికి సిద్ధం కాలేదు. దాంతో జయసింహుడు, మాయోపాయంతో రాజవదనుడిని చంపించాడు. ఈ రకంగా జయసింహుడు శత్రువులందరినీ ఒకరొకరిగా మట్టు పెట్టాడు. మాట విని సంధి చేసుకున్న వారిని చేరదీసి గౌరవించాడు.

ఇంతవరకూ రాజతరంగిణి కథను చెప్తాడు కల్హణుడు. జయసింహుడు శక్తిమంతుడై కశ్మీరానికి శాంతినివ్వటం వరకూ చెప్పిన కల్హణుడు, కశ్మీరానికి దుర్దినాలు వచ్చిన వైనాన్ని వివరిస్తాడు. జయసింహుడు, అతడి రాణులు, మంత్రులు కట్టించిన పవిత్ర మందిరాలు, మఠాలు, విహారాల గురించి వర్ణిస్తాడు కల్హణుడు. జయసింహుడి మంత్రులలో రిల్లణుడు అనేక పవిత్ర కట్టడాలను కట్టించాడు. రాజు, రాణి కలిసి తీర్థయాత్రలు చేశారు. పవిత్ర నదులలో స్నానాలు చేసారు.

సతీ దేశే తీర్థసార్థాస్త్య జన్త్యస్యా నిమజ్జనే।
స్నానాసక్తి సతీమూర్తి స్పర్శనౌత్యుక్య మంజసా॥
(కల్హణ రాజతరంగిణి 8, 3384)

పార్వతి క్షేత్రమయిన కశ్మీరంలో ప్రతి తీర్థం అత్యంత పవిత్రమైనది. ఈ క్షేత్రాలలో రాణి స్నానం చేసిన తరువాత, ఆ నీరు పవిత్రమవుతుంది. రాణి భూమి పైన తీర్థాలను దర్శించటం చూసి ఆకాశంలోని తీర్థాలు అసూయతో వర్షం రూపంలో భూమికి వస్తున్నాయంటాడు కల్హణుడు. అందుకే రాణి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆమె వెంట వర్షపు మేఘాలు వెళ్లేవట. రాణి అడుగు పెట్టిన చోటల్లా అందమైన మందిరాలు నిర్మించింది. ఆమె నిర్మించిన రుద్రేశ్వర మందిరం కశ్మీరంలోనే అత్యంత సుందరమైనది అంటాడు కల్హణుడు. ఇప్పుడీ మందిరం ఆనవాళ్ళు కూడా లేవు.

జగత్సౌందర్య సారం ప్రస్వర్ణమల సోకః।
శాన్తావసాద ప్రాసాదోద్ధారశ్చ విహితస్యయా॥
(కల్హణ రాజతరంగిణి 8, 3391)

రుద్రేశ్వర మందిరం తెల్లటి రాయితో నిర్మించినది. అది వెన్నెల వెలుగులు విరజిమ్ముతోంది. అశోకుడు నిర్మించి శిధిలమైన ఈ మందిరాన్ని ఆమె పునరుద్ధరించింది. ఈనాటికీ కశ్మీరానికి చెందిన ఈ మందిరం జగత్ సౌందర్య సారం వంటిదంటాడు కల్హణుడు. బహుశా పాలరాతితో నిర్మించిన మందిరం అయి ఉంటుంది. ‘జగత్ సౌందర్య సారం’ అని కల్హణుడు అభిప్రాయపడేంత  అద్భుతమైన మందిరం అది. ఇప్పుడు దాని ఆనవాళ్ళు కూడా లేవు. బహుశా, ఇప్పటికీ అది నిలిచి ఉంటే, ‘తాజ్ మహల్’ని తలదన్నే సౌందర్యంతో ఉండేదేమో! కల్హణుడి కాలానికి అంటే 12వ శతాబ్దంలో ఉంది ఆ మందిరం. తరువాత కాలగర్భంలో కలిసిపోయింది. 22 ఏళ్ళు పట్టింది జయసింహుడికి కశ్మీరులో శాంతి సాధించేందుకు. కశ్మీరుకు పూర్వ వైభవాన్ని తిరిగి రప్పించేందుకు.

ఈ ప్రపంచంలో ద్రవం కాలక్రమేణా గట్టిపడి రాయిగా మారుతుంది. అదే రాయి కాలక్రమేణ ద్రవీభవిస్తుంది. విశ్వమంతా కాలం ప్రభావంతో నడుస్తుంది. విధి చూపిన బాటలో మనుషులంతా ప్రయాణిస్తారు.

ఇయదృష్ట మనస్యత్ర ప్రజాపుణ్యైర్మహీభుజః।
పరిపాక మనోజ్ఞత్వం స్థేయాః కల్పాలిగాః సమాః॥
(కల్హణ రాజతరంగిణి 8, 3405)

ప్రజల పుణ్యాన్ని అనుసరించి వారికి రాజులు వస్తారు. ఇటీవలి కాలంలో కశ్మీరు అనుభవించనంత ఉత్తమమైన పాలనను అందిస్తున్న జయసింహుడి పాలన కల్పాల వరకూ కొనసాగాలి అంటాడు కల్హణుడు.

(వచ్చే వారం కల్హణ రాజతరంగిణి ముగింపు. ఆ పై వారం నుంచి జోనరాజ రాజతరంగిణి ఆరంభం).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here