కొరియానం – A Journey Through Korean Cinema-16

0
5

మీడియమ్ F3యుమ్

Chapter 15

[dropcap]న[/dropcap]మ్మకానికీ, మూఢనమ్మకానికీ ఉన్న తేడా ఏమిటి?

వేశాడయ్యా ప్రశ్న అనుకోవద్దు. అది కూడా వడివేలు వాయిస్‌లో.

సాంటి తన స్నేహితురాలు నిమ్ కోసం ఎదురుచూస్తున్నారు. చెవులలో సముద్రపు హోరు లాంటి శబ్దం. వందల ఏళ్ళ చరిత్రని అతనితో పంచుకోవాలనే ఆత్రాన్ని చూపిస్తున్నట్లు. కానీ అది సముద్రపు హోరు కాదు. కొన్ని వందల ఆత్మల ఘోష అని అతనికి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకలా అవన్నీ తన చుట్టూ తిరిగుతున్నై? నిమ్ కోసమా? ఇంతలో నిమ్ వచ్చింది. విషయం చెప్పింది. సహాయం కోరింది.

చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు కొంత మేరకైనా సహాయం చేయటం బాధ్యత. పైగా నమ్మి వచ్చిన వారికి ఆ మాత్రమైనా సాయం చేయలేకపోవటం మానవత్వానికి విరుద్ధం. సాంటిలో సందిగ్ధత ఏ మాత్రం లేదు. ఇంతకీ నిమ్ సమస్య ఏమిటి?

నిమ్ ఒక మీడియమ్. కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని పదుల తరాల పాటూ వారి కుల దేవత బాయన్‌కు ఆవాహన కొరకు ఉపయోగ పడుతుంటుంది. వారి కుటుంబంలో ఒకరు తప్పకుండా ఇలా మీడియమ్‌గా ఉండి తీరాలి. నిమ్ తరం వచ్చే సరికి నిమ్ అక్కను ఆశిస్తుంది బాయన్ దేవతా శక్తి.  ఆమె పేరు నోయ్.

ఈ ఆవహించటాలు, ఆత్మలను దుష్ట శక్తులను నియంత్రిస్తూ వాటితో నిరంతరం పోరాటం జరుపుతూ తన చుట్టూ ఉన్న వారి జీవితాలను బాగు చేస్తూ తానో సమిధలా మారిపోవటం ఇష్టం లేక నోయ్ ఊరికి దూరంగా ఉన్న ఒక ఫాదర్ సాయంతో క్రిస్టియానిటీ లోకి మారుతుంది. పెళ్ళి చేసుకుని మామూలు జీవితం గడుపుతున్నానని భ్రమలో ఉంటుంది. ఇక వేరే మార్గం లేక నిమ్ బాయన్‌కు మీడియమ్‌గా మారుతుంది. దేవతాశక్తిని ఆవాహన చేసుకుంటం, ఆ శక్తి సహాయంతో దయ్యాలు, భూతాలు, ఇతర దుష్ట శక్తులు ఆవహించిన వారిని బాగు చేస్తుంటుంది.

సంవత్సరాలు గడుస్తాయి. వీరి తరువాతి తరంలో మీడియమ్‌గా మారేందుకు ఎవరూ మిగలరు. నిమ్‌కు సంతానం లేదు. నోయ్‌కు ఒక్కతే కూతురు మింక్. లెక్క ప్రకారం మింక్ షమన్‌గా మారాలి. కానీ వారిదిప్పుడు క్రిస్టియన్ కుటుంబం. కానీ నిమ్ శక్తి హరించుకు పోతోంది. ఎక్కువ కాలం మీడియమ్‌గా బాధ్యతలు నిర్వర్తించ లేదు. అలా అని బాయన్‌ను ఎవరు పడితే వారు ఆవాహన చేసుకుని భరాయించ లేరు.

ఇదంతా ఒకవైపు.

అటు నోయ్ కూడా మీడియమ్ కాకుండా తప్పించుకుని బావుకున్నదేమీ లేదు. తను పెళ్ళి చేసుకుని వెళ్ళిన విరోజ్ కుటుంబానికి తన వల్ల బాయన్ శాపం తగిలింది. ఆమె మామగారి ఫాక్టరీ దివాళా తీస్తుంది. దానికి నిప్పు పెట్టి బీమా పొందాలని చూస్తే ఆ ప్లాన్ బైటపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మ్యాక్ బైక్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు కానీ, దాని వెనకాల ఇంకా ఏదో మిస్టరీ ఉందని నోయ్‌ను మనసు హెచ్చరిస్తుంది. ఇంట్లో మగ పురుగంటూ మిగలదు. జంతువులతో సహా.

ఇక నిమ్ ఈ విషయాలను పరిశీలించి తన సోదరి కుటుంబం అనుభవిస్తున్న కష్టాలు తీరాలంటే మింక్ మీడియమ్‌గా మారాలని చెప్తుంది. మింక్ ఎదురు తిరుగుతుంది.

ఇక బాయన్ దేవతా శక్తి మింక్ మీద దృష్టి సారిస్తుంది. అంత వరకూ మామూలుగా ఉన్న మింక్ విపరీత చేష్టలు చేస్తుంటుంది. శారీరకంగా కూడా తెలియని శక్తి చేత హింసకు గురవుతున్నట్లు ఆధారాలు కనిపిస్తుంటై. ఆమెలో బహుళ వ్యక్తిత్వాలు ద్యోతకమౌతుంటాయి. వాటిలో ఒకటి వేశ్య. తను పనిచేసే చోట కనిపించిన వారితో సంబంధాలు పెట్టుకుంటోందని ఉద్యోగం లోంచీ గెంటేస్తారు. ఒక ముసలి వ్యక్తి మరొక పర్సనాలిటీ. ఒక పిల్లాడు (ఆమె అప్పటికే ఆ పిల్లాడిని చంపేసి ఉంటుంది.), ఒక తాగుబోతు కూడా ఆమెలో ఉంటారు. విపరీతంగా తాగుతుంటుంది. అప్పుడు నంజుకోవటానికి కనిపించిన జీవినల్లా వాడుతుంటుంది. ఒక మగ కుక్క పిల్లను పీక్కుతినే సీన్ చూసి మా ధైర్యవంతుడైన మిత్రుడు సినిమా వదిలేసి పారిపోయానని చెప్పాడు. ఆ విషయం గత ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం.

నిమ్‌కు ఈ విషయాలు తెలిసి చూడటానికి వచ్చి ఝడుసుకుంటుంది. కచ్చితంగా ప్రాణాలు ఒడ్డి అయినా మింక్‌ను కాపాడాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో ఒక ఘోరమైన రహస్యం బైట పడుతుంది. మింక్ అన్న మ్యాక్ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు. ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చనిపోవటానికి కొద్ది రోజుల ముందు మింక్ అతనితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుంటుంది. అది తట్టుకోలేక అతను ఆత్మహత్యకు పాల్పడతాడు.

ఇక లాభం లేదని ఎగ్జార్సిజమ్ ద్వారా మింక్‌లో ఉన్న నాలుగు ఆత్మలను వెళ్ళగొట్టాలని చూస్తుంది నిమ్. ఎగ్జార్సిజమ్ వికటించి అక్కడ ఉన్న వారిలో చాలా మందిని మింక్ చంపేస్తుంది. దీనికి కారణం మ్యాక్ ఆత్మ అని గ్రహిస్తుంది నిమ్. తన దేవత అయిన బాయన్‌ను ప్రార్థిస్తుంది. ఫలితం దొరకదు. మరో ప్రయత్నంగా మింక్‌ను మీడియమ్‌గా మారుస్తే దేవత శాంతిస్తుంది అని ఆశ పడుతుంది నిమ్.

ఆ సందర్భంలో మింక్ సృష్టించే అరాచకం చూడటానికే కాదు రాయటానికి కూడా చేతులు రావు. చెప్పటానికి నోరు రాదు.

అప్పుడు తన దేవత మీద నమ్మకం సడలుతుంది నిమ్‌కు మొదటిసారిగా. ఇక ఏమీ చేయలేక చివరి ప్రయత్నంగా తన మిత్రుడు, మరో గొప్ప షమన్ అయిన సాంటిని ఆశ్రయిస్తుంది.

అతను మింక్ గురించి ఆలోచించి తెలుసుకున్న నిజం ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయినా ఏమి చేసి అయినా మింక్‌ను కాపాడాలని సాంటి నిర్ణయించుకుంటాడు. నిమ్‌కు మాట ఇస్తాడు.

మింక్‌ను బాయన్‌కు మీడియమ్‌గా చేయబోయిన ప్రయత్నం వికటించటానికి కారణం బాయన్ ఆగ్రహం కాదని, అక్కడ బాయన్ ప్రమేయం లేదని, ఆ సందర్భంలో జరిగింది విరోజ్ కుటుంబీకులు తరతరాలుగా చేసిన అకృత్యాలకు బలి అయిన వారి ఆత్మల పని అనీ, ఈ సమయంలో ఆ వంశం మిగలకుండా చేయటానికి వాహకంగా మింక్‌ను వాడుకుంటున్నారని, అందువల్లే మింక్‌లో బహుళ వ్యక్తిత్వాలను చూస్తున్నామని వివరిస్తాడు. కొన్ని వ్యక్తిత్వాలు పైకి కనిపిస్తుండగా, కనబడని వ్యక్తిత్వాలు (వేల కొద్దీ ఆత్మలు) ఆ కనిపించేవారి ద్వారా ఆమె చేత చేయరాని పనులు చేయిస్తున్నారని తెలియజేస్తాడు.

పరిష్కారం లేదా అని నిమ్ విస్తుపోతూ భయవిహ్వల అయి అడుగుతుంది.

మిగిలిన మార్గం ఎగ్జార్సిజమ్ అని, తను, తన శిష్యులు, వారి శిష్యులు వస్తామని, వారికి బాయన్‌ను ప్రసన్న చేసుకున్న నిమ్ అత్యంత ముఖ్యమని చెప్పాడు.

ఎగ్జార్సిజమ్‌కు ఏర్పాట్లు మొదలౌతాయి.

తర్వాత?

మీడియమ్ లేదా రాంగ్జాంగ్ సినిమా చూడాలి.

ఇదీ స్థూలంగా మీడియమ్ లేదా రాంగ్జాంగ్ సినిమా కథ.

కానీ దీన్ని ఇలా చులాగ్గా తీయలేదు. కథను రాసిన కొరియన్ దర్శకుడు-నిర్మాత న హాంగ్-జిన్ దీన్ని ఒక మాక్యుమెంటరీ రూపంలో ఊహించాడు. సినిమా అంతా మనకు ఒక డాక్యుమెంటరీ రూపంలో చూస్తాం. సరిగ్గా చెప్పాలంటే ఫౌండ్ ఫుటేజ్ రూపంలో కనిపిస్తుంది. చెప్పుకున్నది, చెప్పుకోనిది చాలా వైలెన్స్ చూడాల్సి వస్తుంది.

ఇందులో నటించిన వారు సినీ ఆర్టిస్టులు కాదు. చాలా వరకు సామాన్య జనం. ఉత్తర థాయిలాండ్ అంతర్భాగాలలో ఉన్న సంస్కృతి బాగా తెలిసిన వారు లేదా అందులో భాగమైన వారు.

ఈ సినిమా దర్శకుడు బిఫున్ పిశాంతనకున్, న హాంగ్-జిన్ ఇచ్చిన స్క్రిప్టును ఆధారం చేసుకుని దాన్ని ఫౌండ్ ఫుటేజ్ కింద మార్చి చాలా గొప్ప పని చేశాడు. దానికి కారణం త్వరలోనే చెప్తాను. మనం ఇప్పటి వరకు బ్లేర్ విచ్ ప్రాజక్ట్ లాంటి సినిమాలు చూసి లేదా వాటి గురించి విని ఉన్నాము. ఈ సినిమా వాటికి అమ్మ బాబు లాంటిది. అసలు ఈ సినిమా ఇమేజరీ, విజువల్ లాంగ్వేజ్ మామూలుగా ఉండవు. థాయిలాండ్ నేటివ్ కథన టెక్నిక్ లకు, కొరియన్ సినిమా విజువల్ లాంగ్వేజ్‌ను జోడించి ఇంత వరకూ చూడని అద్భుతాన్ని సృష్టించారు అని విమర్శకులు కొనియాడారు.

ఈ సినిమా కేవలం జనాన్ని భయపెట్టటానికే కాదు, హారర్ సినిమా కూడా సోషల్ కామెంటరీ చేయగలదనీ, నిజానికి హారర్ జాన్రానే అత్యంత ప్రభావశీలంగా సామాజిక సమస్యలను ఎత్తి చూపగలదని, సృజనాత్మక శక్తి ఉన్న కళాకారులు, సామాజిక సమస్యలను ఎత్తి చూపటమే కాదు, వాటికి పరిష్కారాలను మనకు చెప్పకుండానే వారి కళ ద్వారా మనకు స్ఫురింపజేస్తారని తెలియజేస్తుందీ సినిమా.

అందుకే క్లాసిక్‌గా నిలవటమే కాదు. ఒక దేశపు సినీ పరిశ్రమకే కొత్త ఊపిరిలూదింది.

వారంలో కలుద్దాం! తెలుగుతో పాటూ ఇంగ్లీషు కూడా కలిపి రాస్తుందాం 😉 ఏది రాసినా తప్పులు లేకుండా!

నోట్: తెలుగులో ఫౌండ్ ఫుటేజ్ సినిమా వెంకట్ శిద్దారెడ్డి దర్శకత్వంలో కేస్ నం. 666/2013 అనే పేరుతో వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here