జ్ఞాపకాల పందిరి-114

29
4

అది ఆయన సృష్టే..!!

[dropcap]అ[/dropcap]ప్పుడప్పుడు కొన్ని అనుకోనివి జరిగిపోతుంటాయి. కొన్ని మంచివి మరికొన్ని జరగకూడనివీను. జరిగిన పని ఎలాంటిదైనా జీవితంలో అవి నాటుకుపోతాయి. కొన్ని విషయాల్లో అది చరిత్ర అవుతుంది. కొన్ని సంఘటనలు మరిచిపోవాలనుకున్నవి కూడా మరచిపోలేక, జీవితాంతమూ మన వెంట నడుస్తూ, మన మనస్సును గుచ్చుతుంటాయి. అవి ఆనంద పడవలసిన విషయం కావచ్చు, బాధపడవలసిన అంశమూ కావచ్చు. మన ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు లేదా పనులు మన చేతుల మీదుగా జరిగిపోతుంటాయి. ఎక్కువశాతం అవి మంచి పనులు అయి ఉంటాయి. ఆ పనులు యాదృచ్ఛికంగా మనకు మనమే చేయవచ్చు లేదా మనల్ని బాగా నమ్మినవారు మనకు ఆ పని అప్పగించి ఉండవచ్చు. ఏది ఏమైనా అవి మనం ఎప్పుడూ ఊహించని పనులు. అవి మన చేతుల మీదుగా జరుగుతాయని ఎన్నడూ అనుకోని పనులు.

కొందరు చిన్నతనంలో చదువులో చాలా వెనుకబడి వుంటారు, కానీ ఎదిగిన కొద్దీ వారిలో మార్పు వచ్చి ఊహించని ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అలాగే ఒక పేద కుటుంబం నేపథ్యంగా గల పిల్లలు ఉన్నతస్థాయి ఉద్యోగులు కావచ్చు. ఒక వికలాంగుడైన సాధారణ పౌరుడు ఎవరూ చేయలేని పరిశోధనలు చేసి పేరు తెచ్చుకోవచ్చు.

తమ విద్యాభ్యాసంలో అంతగా ప్రాధాన్యం లేని తెలుగును ఒక పాఠ్యాంశంగా మాత్రమే చదువుకున్నవాళ్ళు తెలుగు సాహిత్యంలో ఉద్దండులైన సాహిత్యకారులు కావచ్చు, అవధానులు కావచ్చు. ఇలాఎన్నో ఎన్నెన్నో మనం ఊహించని కొన్ని పనులు మనం చేసే పరిస్థితి ఏర్పడి మనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆంగ్ల భాషలో ఉద్దండులైన వారు తెలుగులో మంచి కవిత్వం రాయవచ్చు. గణిత శాస్త్రంలో ప్రవీణులైనవారు, తెలుగులో మంచి కవిత్వం చెప్పవచ్చు, లేదా అవధానాలు చేయవచ్చు, మంచి సాహిత్య విమర్శకులు కావచ్చు. ఇవన్నీ ముందుగా ఎవరూ వూహించనివే మరి! ఈ ఉపోద్ఘాతమంతా నా జీవితంలో నేను ఊహించని విధంగా నేను చేసిన కొన్ని పనుల గురించే, వాటిని ఒకమారు సింహావలోకనం చేసుకోవడమే!

1975లో, ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా వున్న ‘డెంటల్ వింగ్’లో దంతవైద్య విద్యార్థిగా అడ్మిషన్ పొందాను. ఉస్మానియా వైద్య కళాశాల కోఠీలో వుంటే, డెంటల్ వింగ్, అఫ్జల్‌గంజ్‌లో ఉండేది. అప్పటికి అది దంతవైద్య కళాశాల కాలేదు. ప్రొఫెసర్ తజమ్మల్ హుస్సేన్ గారు (ఓరల్ సర్జరీ) విభాగ అధిపతిగా ఉండేవారు. ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత, దంతవైద్య విభాగ అధిపతిగా ప్రొఫెసర్ శేషాద్రి గారు (ఆర్థోడాన్షియా) నియమితులైనారు. వీరి హయాములో ప్రత్యేక దంతవైద్య కళాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం అయినాయి. వైద్యరంగం లోనూ, రాజకీయ రంగంలోనూ డా. శేషాద్రి గారికి పలుకుబడి ఉండడం చేత ఆయన ప్రయత్నాలు త్వరితగతిన ఫలితాలు సాధించాయి. తద్వారా ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా వున్న డెంటల్ వింగ్ కాస్తా ప్రభుత్వ దంతవైద్య కళాశాల (1978-79)గా రూపు దిద్దుకుంది.

మధ్యలో సూట్లో వున్నది అప్పటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శేషాద్రి గారు

ఆ విధంగా అఫ్జల్‌గంజ్‌లోని మొదటి ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు (అప్పటికి, విజయవాడలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలగానీ, ప్రైవేట్ రంగంలో దంతవైద్య కళాశాలలు గానీ లేవు) మొదటి ప్రిన్సిపాల్‌గా నియమింపబడి, రికార్డులకెక్కారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దంతవైద్య కళాశాలకు ‘లోగో’ కావలసి వచ్చింది. ఆఫీసువాళ్ళు ఆ పని చేయగలరు. కానీ ప్రిన్సిపాల్ గారి ప్రత్యేక పర్యవేక్షణ లో ‘లోగో’ తయారు అయింది.

అది ఎలా జరిగిందంటే – నేను మా బి.డి.ఎస్. క్లాసులో పెద్ద తెలివైన వాడిని ఏమీ కాదు. ఏవరేజ్ స్థాయిలో ఉండేవాడిని. లీడర్‌షిప్ లక్షణాలు కూడా ఉండేవి కాదు. స్నేహానికి ఆడ – మగ అన్న తేడా లేకుండా ముందుండేవాడిని. అప్పటికే పత్రికల్లో చిన్న చిన్న వ్యాసాలు రాస్తూండేవాడిని. గురువులపట్ల వినయ విధేయతలతో మెలిగే వాడిని. గురువులు చాలా మట్టుకు నన్ను ఇష్టపడేవారు. అందులో ప్రొఫెసర్ శేషాద్రిగారు కూడా ఒకరు. ఒక రోజున ఆశ్చర్యకరంగా శేషాద్రిగారు నన్ను ఆయన ఆఫీసుకు రమ్మని కబురు పెట్టారు. నిజానికి ఆయనంటే అందరికి హడల్! ఆయన దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారు. అందులో నేనూ ఒకడిని. ఇలాంటి పరిస్థితిలో భయపడుతూనే ఆయన ఛాంబర్‌లో ప్రవేశించాను. అదేమిటోగానీ వింతగా, ఎప్పుడూ సీరియస్‍గా వుండే ప్రిన్సిపాల్ గారు, నన్ను చూసి నవుతూ “రావయ్యా.. రా.. రా.. నీకోసమే ఎదురు చూస్తున్నా” అన్నారు. నాకు మాటలు రాక ఆయన ఎదురుగుండా అలానే నిశ్శబ్దం పాటిస్తూ నిలబడిపోయాను. అప్పుడు ఆయన, నాలుగైదు ఇతర రాష్ట్రాల దంతవైద్య కళాశాలల సావెనీర్లు నా ముందుంచి, “వీటిని ఆధారం చేసుకుని మన దంతవైద్య కళాశాల కోసం ఒక ‘లోగో’ చేయించాలి నువ్వు” అన్నారు. ఆయన మాటలు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి, నా మీద ఏమిటి ఈయనకు ఇంత నమ్మకం.. అనుకున్నాను. కొద్ది క్షణాలలోనే నా మదిలో ఒక అద్భుతమైన చిత్రకారుడు మెదిలి, ఆ దైర్యం తోనే ఆయన ముఖంలోకి చూసి “అలాగే.. సార్” అని, ఆయన ఇచ్చిన సావెనీర్‍లు తీసుకుని బయట పడ్డాను.

లోగో విషయం చెప్పగానే నా మదిలో మెదిలిన ప్రసిద్ధ చిత్రకారులు.. కీ.శే. శీలా వీర్రాజు గారు (వీర్రాజు గారు జూన్ 1, 2022న హైదరాబాదులో స్వర్గస్తులైనారు). శీలా వీర్రాజు గారు, మా కుటుంబ స్నేహితులు. పెద్దన్నయ్య కె.కె. మీనన్‌కు అత్యంత ఆప్తులు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. వీరు కేవలం చిత్రకళ లోనే కాక, నవల, కథ, కవిత్వంలో దిట్ట. అనేకమంది వర్ధమాన రచయితలు, సీనియర్ రచయితల పుస్తకాలకు ముఖ చిత్రాలు వేసిపెట్టిన మహానుభావుడు, శ్రీ వీర్రాజు గారు. ఆయన రాసిన ‘మైనా’ నవల నాటి ఉమ్మడి రాష్ట్ర (ఆం.ప్ర. సాహిత్య అకాడమి) అవార్డు పొందింది. ఆయన ఎందరో కవులను రచయితలనూ ప్రోత్సహించారు. ఇలాంటి నేపథ్యంగల వీర్రాజు గారి దగ్గరకు (అప్పట్లో మలకపేటలో వుండేవారు) వెళ్లి నా సమస్య వివరించాను. ఆయన సంతోషంగా నా మాటలు విని తప్పక ఆ పని చేసి పెడతానని నాకు దైర్యం చెప్పి నా దగ్గర వున్న సావెనీర్‍లు తీసుకున్నారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనివల్ల నాకు మంచి పేరు రావడమే కాదు, వీర్రాజుగారి పేరు అక్కడ చిరస్థాయిగా నిలిచిపోతుందని భావించి నాకు ఎక్కడలేని ఉత్సాహం ఒళ్లంతా అల్లుకుంది.

చిత్రకారులు,సాహిత్యకారులు శ్రీ శీలా వీర్రాజు గారు (హైదరాబాద్)

సరిగ్గా వారం రోజులకనుకుంటాను నలుపు – తెలుపు రంగుల్లో, మా దంతవైద్య కళాశాల లోగో వీర్రాజు గారి చేతిలో రూపు దిద్దుకుంది. తక్షణం అది నా చేతికందింది. అప్పట్లో శ్రీ వీరాజీ గారి సంపాదకత్వంలో వెలువడుతున్న ఆంధ్ర పత్రిక వారపత్రికలో మా దంత వైద్య కళాశాలను గురించి రాస్తూ ఈ ‘లోగో’ విషయం కూడా ప్రస్తావించాను. దురదృష్టవశాత్తు ఆ వ్యాసం సమయానికి ఇప్పుడు అందుబాటులో లేదు.

వీర్రాజు గారు గీసిన ఒరిజినల్ లోగో

కష్టపడి లోగో తయారు చేసిన వీర్రాజు గారు దానికి వెల కట్టలేదు. యెంత బ్రతిమాలినా ఆయన నా దగ్గర డబ్బులు తీసుకోలేదు. అది ప్రభుత్వపరమైన అధికారిక పని అని, దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ ఉందన్న మా ప్రిన్సిపాల్ గారి మాట చెప్పినా ఆయన డబ్బు తీసుకోవడానికి అంగీకరించలేదు. ఆయన సహృదయతకు కొన్ని వేల వందనాలు. ఈ రోజున ఆయన లేకపోయినా ఆయన తయారుచేసి ఇచ్చిన అందమైన లోగో కాలేజీ వున్నంతకాలం వీర్రాజుగారిని గుర్తు చేస్తూనే ఉంటుంది. ఆ రకంగా ఆయన చిరంజీవి.

ఊహించని రీతిలో కొద్ది రోజుల క్రితం (01-06-2022) శీలా వీర్రాజు గారు స్వర్గస్తులైనారు. ఆయన ఋణం తీర్చుకోవడానికి కనీసం ఈ వ్యాసంలో ఆయనకు చోటు కల్పించాలని నాకు అనిపించింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో, 1979లో ఆయన గీసిన లోగో ఇప్పుడు సంపాదించడం ఎలా?

Prof.N S Yadav. MDS (Madhya Pradesh)

కాలేజీ బోర్డుమీదనో లెటర్‌హెడ్ మీదనో వున్న లోగో సేకరించాలని అనుకున్నాను. అదృష్టవశాత్తు, ప్రస్తుతం ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్, మా గురువు డా.ఎన్.ఎస్. యాదవ్ గారి అన్న కుమారుడు, ప్రొఫెసర్ సర్జీవ్ సింగ్ యాదవ్ ఎంతగానో సహకరించి ఒరిజినల్ లోగో చిత్రం పంపించారు. వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

Prof. Sarjeev Singh Yadav, Prof.&HOD,Department of Operative Dentistry & Endodontics

దంతవైద్య కళాశాల ప్రారంభం గురించి మా గురువులు ప్రొఫెసర్ ఎన్. ఎస్. యాదవ్ గారు(మధ్య ప్రదేశ్) నా సహాధ్యాయి ప్రొఫెసర్ హరనాథ్ బాబు (హైదరాబాద్) రూఢిగా నిర్ధారించి సహకరించారు. వారిద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రొఫెసర్ హరనాథ్ తో రచయిత
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రూపు దాల్చిన లోగో….

ప్రేమమూర్తి,శీలా వీర్రాజు గారికి పాదాభివందనం.

అవును ‘ఆ.. లోగో.. ఆయన సృష్టే!!’

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here