[dropcap]గం[/dropcap]ధర్వుడెవ్వరో భువి అవతరించినట్లు
సుందర విగ్రహము,సుశ్రావ్య శారీరమును
అద్భుతమౌ నవ రస నటనా వైదుష్యము
నందమూరి వంశ తిలక,మదియె NTR!
N. అనగ నటనా కళా శిఖరాయమానము
T. అనగ తెలుగుతనపు జయకేతనము
R. అనగ రాజకీయపు సునామీ,రాచఠీవి!!
నందమూరి వంశ తిలక,మదియె శ్రీ NTR!
నేపాళ మాంత్రికుని ఆంఫట్ చేసిన బల్ సాహసి
ఆ తోటరాముని దెంత లేత వలపొ,ఘాటు ప్రేమయో!!
(పాతాళభైరవి)
చీకాకు లెరుగని ప్రేమైక జీవి, శిల్పి మల్లీప్రియ
నాగరాజు దెంత మృదు చిత్తమొ,తీరెంత పేశలమొ!
(మల్లీశ్వరి.)
ఉరకలు వేసే వయసు సొగసుల ఆ చిరంజీవి
ఎన్ని చెలి వన్నెల,గువ్వకన్ను చుక్కల నెన్నినాడో!
(చిరంజీవులు.)
పైలా పచ్చీసుగ తిరిగి అసలు నిజము నెరిగి
పుండరీకు డెంతగ వేడి,పితరుల సేవించినాడో!!
(పాండురంగ.మాహాత్మ్యం)
దుష్ట రావణ పాత్రకు వన్నెలు దిద్ది రాక్షస భక్తి,
విష్ణు ద్వేషము చూపిన అభినవ రావణుడెవ్వడో!
(సీతారామకళ్యాణం)
శివతాండవ ప్రళయార్భటి ,దక్షాధ్వర విధ్వంసియు
కవచాదుల దానాదుల, శాపానల తప్తు డెవ్వడో!!
(దక్షయజ్ఞం,దానవీరశూరకర్ణ)
ఒరుల కసాధ్యమౌ నటనతో పితామహ భీష్ముని
మురియ తెన్గు,లాపహింప చేసికొన్న ఆ జోదెవ్వరో?!
(భీష్మ)
కుపిత సింగమెటుల గజ తండము పై కురుకునో
ఆపలేని ఏకవీరుడై రెచ్చిన కిరీటి ఎవ్వరో!
(నర్తనశాల)
ధర్మావతారమై,జన వాక్యమ్మని సతినె వీడిన
రాజారాముని మనోవ్యథ కెవ్వడు ప్రాణము పోసెనో!
(లవకుశ)
దుర్యోధన మత్త గజము పాలి ఆలానమెవడో ఆ
భీమసేను భీషణ ప్రతినల నెవడు ప్రకటించెనో!
(పాండవ వనవాసం)
మాయల మాయలతోనె చిత్తు జేయు లీలా కృష్ణుడన్న
ఏ యాంధ్రము చేతులెత్తి మొక్కు,ఆ నటవిరాట్టెవ్వరో!!√√
(మాయాబజార్)
***
రాకుమారుని శౌర్యము,మర్యాదల నిలువు టద్దము,
ఆక్రృతి దాల్చె నే తెలుగు నాట,ఆ మారావతారము!
అదియె జయసింహము,కోటల గెల్చిన మత్తేభము
అదియె విక్రమార్కము, అదియె జగదేక వీరము!!
(జయసింహ మొదలైనవి)
***
పెళ్ళి చేసికొని జంట కవుల వలె ఇంటా బయటా
కళగ యువహృదు ల్పొంగ, భేషను సరసు డెవ్వడో!!
(పెళ్ళి చేసి చూడు)
బండ వానిగ,మొండి రాముడై,ఘంటన్నకు గుండక్కకు
గుండెల నదరించిన చతురుడైన అంజి ఎవ్వడో?
(గుండమ్మ కథ)
టక్కుల, టక్కరి పల్కుల, నోటి గొప్పల దిట్టరి, ఆ
నిక్కపు ఆషాఢభూతి,వెండితెర గిరీశ మెవ్వడో!
(కన్యాశుల్కం)
ఆదర్శ బడిపంతులై బతుకు సంద్రము తా నీదిన
సాధుమూర్తికి బింబమైన నటకావతంసుడెవ్వరో?
(బడిపంతులు)
***
అతడె తారక రామారావను తెన్గు సిత కౌముది
ఆతత కీర్తి,ఆతారార్కముండెడి నట చక్రవర్తి!!
మోసము చేసి పదవి దించిన యే వేషము మార్చక
అశేష జన సమ్మతమున యెన్నికైన ప్రియనేత!
గుడులె కట్టుదు రాంధ్ర హృదుల, పూజలనె చేతురు
ముత్తెపు దస్తూరి,కస్తురి తావుల రత్నమీ రామము!
***
** కృష్ణ రాయని ఠీవి, బ్రహ్మనాయని ఈవి, రంగరాయని ఠేవ!
క్లిష్ట పాత్రాభినయ, సకల సుజనాభిరాము డీత డొక్కడే!!
స్వస్తి జగదభినేతకు,సినీ జగతీ ప్రచండ భానునకు
స్వస్తి,శతజయంతీ బాలునకు,అభినయపూర్ణ చంద్రునకు!!
***
నందమూరి తారక రామునకు,పౌరాణిక లోక విరాణ్మూర్తి
కాంధ్రగౌరవము నిల్పిచూపిన ఘనుకు,నటసార్వభౌముకు!
** (కృష్ణరాయలు:వీరత్వం,సాహిత్య కళా ప్రీతి,సౌజన్యం బ్రహ్మనాయుడు: సమత్వం,ధర్మం బుధ్ధి రంగారాయడు: ఆత్మ గౌరవం,పౌరుషం,దేశభక్తి ఆ ముమ్మూర్తుల కలయికగా కనబడతారు NTR కాబట్టి ఆ మాట!!)