సీతమ్మ తల్లి చెట్టు

0
5

[dropcap]ఎం[/dropcap]డ వేడికి తట్టుకోలేక చేస్తున్న పనిని ఆపి అప్పారావు.. చెట్టు నీడకి చేరాడు. రెండు కొండల మధ్య ఉన్న సన్నని దారిని వెడల్పు చేస్తూ రోడ్డు వేస్తున్నారు.

ఎండాకాలం కావడంతో భానుడు నిప్పులు చెరుగుతుంటే.. నుదుటున పట్టిన చెమట తుడుచుకుంటూ అప్పారావు నీరసంగా చెట్టు నీడకు చేరుకున్నాడు.

అప్పటికే అక్కడికి చేరుకున్న అప్పారావు భార్య సావిత్రి భర్త రాక కోసం నిరీక్షిస్తున్నదల్లా.. అతను రాగానే చల్లని మంచినీళ్ళు అందించింది.

ఆ చల్లని నీళ్ళు అతనికి అమృతంలా అనిపించింది. తలకు కట్టుకున్న తువ్వాలును నేలపై పరుచుకుని చేతినే దిండుగా మార్చుకుని పడుకున్నాడు. క్షణాల్లో నిద్ర పట్టేసింది అతనికి.

అతడి దగ్గర కూర్చున్న సావిత్రమ్మ భర్తను గమనిస్తూ.. వచ్చేపోయే వాహనాలను గమనిస్తుంది.

రోడ్డుకి.. అటుగాని.. ఇటుగాని.. ఒక కిలోమీటరు దూరంలో ఒక్క చెట్టైనా కానరావడం లేదు. సావిత్రికి రోడ్డు అలా బోసిగా కనిపిస్తుంటే.. దిగాలుగా అనిపించిది.

చెట్టు ఇచ్చే నీడ ఒక అద్భుతం. అలసిన మనస్సులని సేదతీర్చే చెట్టు.. సాక్షాత్తు నేలపై దిగిన భగవత్ స్వరూపం.

మనిషిలా తను చేస్తున్న సహాయానికి ఏమీ ఆశించకుండా.. తన ఒడిలో సేద తీర్చే.. చెట్టు నిజంగా అమ్మలాంటిదే!

విస్తారంగా పరుచుకుని వున్న ఆ వేప చెట్టు నుండి చల్లని గాలి రివ్వున వీస్తుంది. నుదుటిన పట్టిన చెమటని మటుమాయం చేస్తూ.. అంత ఎండలో సైతం ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆ వేప చెట్టు.

రోడ్లు వేయడానికి ఒకప్పటిలా పదుల సంఖ్యలో కార్మికులు కాకుండా.. నేడు వచ్చిన ఆధునిక యంత్రాలు కేవలం.. నలుగురైదుగురైతే సరిపోతుంది.. ఆగకుండా వేగంగా రోడ్ వేయడం సాధ్యమవుతుంది.

అప్పుడు సమయం నాలుగవుతుంది.

సాయంత్రం అవుతున్న సమయం.. దగ్గరలో పక్షుల జాడ కానరావడం లేదు. అసంఖ్యాక వాహనాలు ఆ రోడ్‌పై వెళుతున్నాయి. అది ఒక హైవే.

వచ్చేపోయే వాహనాల రోద సావిత్రికి ఇబ్బందిని కలిగిస్తున్నా.. అప్పారావుకి మాత్రం నిద్రాభంగం కలిగించలేదు.

రోడ్ పైన వున్న రోడ్ రోలర్ పైనే నిద్రిస్తున్నాడు డ్రైవర్. కాస్త దూరంలో వున్న తారును పోసే ఆధునిక వాహనంపై ఆదమరిచి నిద్రపోతున్నాడు ఆ వాహన డ్రైవర్, అతని సహాయకుడు.

కాంట్రాక్టర్ రావడం.. ఇంకా పనులవ్వలేదంటూ కోపం చేస్తూ పెద్దగా అరవడం విన్న వాళ్ళందరూ.. ఉలిక్కి పడి లేచారు.

అప్పారావు, సావిత్రితో పాటు విశ్రాంతి తీసుకుంటున్న మరో రెండు జంటలు కూడా హడావుడిగా లేచారు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు.

రెండు రోజుల్లో పని పూర్తయింది. ఆధునిక యంత్రాలు అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయాయి.

అది ఒక పల్లెటూరి శివారు ప్రాంతం.

సిటీ దాటగానే ప్రత్యక్షమయ్యే ఆ వూరిని దాటగానే వున్న ఓ పెద్ద కొండ.. ఆ కొండని వెడల్పు చేస్తూ.. రోడ్డు వేస్తున్నారు.

***

మరుసటి రోజు..

“అప్పారావు! మరో పని మిగిలి ఉందయ్య!” అన్నాడు కాంట్రాక్టర్.

“ఏంటో సార్! ఆ పని” అడిగాడు అప్పారావు వినయంగా.

తన తోటి పనివాళ్ళకి, తనకి కలిసి చేసిన పని తాలూకు డబ్బులు అందుకుంటూ..!

కాంట్రాక్టర్ ఇల్లు రాజభవంతిని తలపిస్తుంది. సిటీ సెంటర్లో ఉన్న అతను ఎంఎల్‌ఏకి స్వయానా బావమరిది.

రోడ్ కాంట్రాక్ట్స్ అలాంటివి ఎన్నో అందుకున్న అతడు ఖర్చుచేసే దానికంటే.. అందుకునే లాభం ఎక్కువ! అని ఎంతో మంది అనుకోగా విన్నాడు.

మొదటిసారి అతడి ఇంటికి వచ్చి.. అతడి ఇంటిని చూసి నివ్వెర పోయాడు.

 “ఆ సీతమ్మ తల్లి చెట్టు కొట్టేయాలోయ్”

వింటూనే అప్పారావుకి కాలికింద భూమి కదిలి పోయినట్టు అనిపించింది.

“ఆ చెట్టు కొన్ని తరాలుగా అక్కడ ఉంటుంది. దారిన పోయే ఎందరికో ఆశ్రయం ఇస్తూ.. తల్లిలా నీడనిస్తుంది. నా వల్ల కాదు ఆ చెట్టు కొట్టడం. నన్ను ఒగ్గేయండి బాబు..” ప్రాధేయ పూర్వకంగా అన్నాడు అప్పారావు.

“నీకెంత డబ్బులు కావాలంటే.. అంత ఇస్తాను. ఆ చెట్టు కొట్టేస్తే మన పని పూర్తయినట్లే..” అంటున్న కాంట్రాక్టర్ సదానందం మాటలు విన బుద్ధి కాలేదు అతనికి.

“ఆ చెట్టు మా గ్రామానికి దైవంతో సమానం. సీతమ్మ తల్లి చెట్టును కొట్టవద్దు అది మహాపాపం.” అన్నాడు గద్గద స్వరంతో.. ఆపై మాట్లాడలేక.

“సర్లేరా! నువ్విక వెళ్ళొచ్చు..” అన్నాడు సదానందం ఆ పనికి మరెవరినైనా పురమాయించాలనుకుంటూ..

***

ఆ రాత్రి అప్పారావుకి నిద్రరాలేదు.

సీతమ్మ చెట్టుని ఎలాగైనా కాపాడాలనుకున్న తరువాత అతడికి నిద్రపట్టింది. నిద్రలో కలవరిస్తున్న భర్తను లేపింది సావిత్రి.

“ఏంటి అయ్యా! ‘రామా రామా’ అని కలవరిస్తున్నావు!?” భర్తను అడిగింది సావిత్రి.

తనకు వచ్చిన కలను చెప్పాడు. సీతమ్మ తల్లి చెట్టును సదానందం కాంట్రాక్టర్ కొట్టేయాలని అడగడం.. తరువాత తను ఒప్పుకోకపోవడం.. తన కల టూకీగా చెప్పాడు అప్పారావు.

***

తెల్లవారగానే.. హడావుడిగా తయారయి.. గ్రామ రచ్చబండపై కూర్చున్న పెద్దలకు తనకొచ్చిన కలని చెప్పాడు. ఊరికి కాస్త దూరంగా వున్నా.. ప్రస్తుతం ఆ కొండ దగ్గర ఊరు విస్తరిస్తుంది. గ్రామ సర్పంచ్ నాయకత్వంలో ఒక పథక రచన చేశారు.

ఎందరికో నీడనిచ్చి.. ప్రాణాధారమైన ఆక్సిజన్‌ని ఇచ్చి.. ప్రాణాలు నిలిపే సీతమ్మ చెట్టుని ప్రభుత్వం వాళ్ళు కొట్టకుండా ఆపాలని ప్రణాళిక రచన చేశారు.

***

రెండు రోజుల తర్వాత.. శ్రీరామనవమి.. ఊరి జనమంతా ఒక్కటై.. సీతమ్మ తల్లి చెట్టు చెంతకు చేరారు. తాటాకు పందిళ్లు వేశారు.

సీతారాముల పటాలు అక్కడ చేర్చి.. శ్రీ సీతారాముల కళ్యాణం చేశారు. అదే సమయంలో ఊళ్ళోని పెద్దలు ఆ పరిసర ప్రాంతాల్లో గుడి కట్టడానికి అవసరమైన డబ్బులు చందాల రూపంలో ఇచ్చారు.

అక్కడ జరుగుతున్న తతంగాన్ని అంతా గమనిస్తున్న సీతమ్మ తల్లి చెట్టు.. సంతోషించింది. నిజంగా సీతారాములు అక్కడ చేరినట్లుగా ఉత్సవాలు జరిగాయి.

***

రెండు సంవత్సరాల కాలంలో అక్కడ అందమైన రామాలయం వెలసింది.

అప్పారావు, సావిత్రి రామాలయానికి వచ్చారు. సీతమ్మ తల్లి చెట్టుకి ప్రదక్షిణలు చేశారు.

అప్పారావు, సావిత్రి… తమకు పుట్టిన కొడుకుకి ‘శ్రీరామ్’ అంటూ సంబరంగా నామకరణం చేస్తుంటే.. రామాలయంలో గంటలు మ్రోగుతున్నాయి శుభసూచకంగా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here