అలనాటి అపురూపాలు-120

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

హాస్యాన్ని పండించి విశిష్ట నటుడు – నిర్మాత – దర్శకుడు దేవేన్ వర్మ:

అలనాటి హిందీ సినిమాలలో ఎన్నో చక్కని పాత్రలు పోషించిన దేవేన్ వర్మ పేరు గుర్తుకు రాగానే ముఖ్యంగా ఆయన పండించిన హాస్య పాత్రలే స్ఫురిస్తాయి. నటించడమే కాకుండా కొన్ని సినిమాలు నిర్మించి దర్శకత్వం కూడా వహించారు.

ఆయన తన గురించి తాను ఇలా చెప్పుకున్నారు:

***

మా నాన్నగారు బల్దేవ్ సింగ్ వర్మ వెండి వ్యాపారం చేసేవారు. ఆ తరువాత ఓ మిత్రుడితో కలిసి సినిమాల డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారు. అమ్మ గృహిణి. నాకు నలుగురు సోదరీమణులు. మా పెద్దక్క కారణంగా మేము బొంబాయి వదిలి పూనేకి మారాల్సి వచ్చింది. తను మాతుంగ లోని జిఎన్ ఖల్సా కాలేజీలో చదువుతూండేది. ఆ రోజుల్లో బొంబాయిలో మత కల్లోలాలు బాగా జరిగేవి. అక్క డాక్టర్ అవ్వాలనుకుంది, అందుకని పూనేకి మారాం. అక్కడ నౌరోస్‌జీ వాడియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చేరింది. నేను పంచ్‌గని లో ఓ స్కూల్లో చదివాను. తరువాత నేను అదే కాలేజీలో చేరాను. నా కాలేజీ రోజుల్లో నేను నాటకాలు వేసేవాడిని, యువ ఉత్సవాలలో పాల్గొనేవాడిని.

గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నేను బొంబాయిలో లా కాలేజీలో చేరాను, కానీ విసుగెత్తి, ఆరు నెలల తర్వాత మానేసాను.

మా పెద్దక్క పూనేలో ఓ ప్రభుత్వ పాఠశాలకి ప్రిన్సిపాల్ అయింది, రెండో అక్క డాక్టరై బొంబాయిలో ప్రాక్టీస్ చేసింది, మూడో అక్క కూడా స్కూలు ప్రిన్సిపాలే. చెల్లెలు హ్యూస్టన్‌లో స్థిరపడింది. తను టెక్సాస్ యూనివర్సిటీలో ‘ఫారిన్ స్టడీస్’కి ఇన్‍ఛార్జ్‌గా ఉందేది.

నేను ఓ నాటక బృందంలో బాగాంగా స్టేజి షోలు చేస్తున్నాను. నటుడు జానీ విస్కీ, నేను – అందరిలానే సినిమా తారలను అనుకరిస్తూ, మిమిక్రీ చేశాము. నార్త్ ఇండియా పంజాబీ అసోసియేషన్ వారి కార్యక్రమంలో నేను ఒక షో చేశాను. దానికి బి.ఆర్. చోప్రా హాజరయ్యారు. నా ప్రదర్శన ఆయనకి నచ్చి ‘ధరమ్‍పుత్ర’ (1961) సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పుడు నాకు నెలకి 600 రూపాయల జీతం.

‘ధరమ్‍పుత్ర’ షూటింగ్ అయిపోయాకా, నేను విదేశాలలో స్టేజి షోలు చేయటానికి వెళ్ళాను. ‘ధరమ్‍పుత్ర’ ఫ్లాప్ అయింది. అప్పుడు నేను మారిషస్‍లో ఉన్నాను. శశి (కపూర్) – ‘సినిమా ఫ్లాప్ అయిది, కారణం ఎవరికీ తెలియదు’ అని ఉత్తరం రాశాడు. బొంబాయికి తిరిగొచ్చాక, ఎవిఎం స్టూడియోస్ వారి ఎ.వి.మెయ్యప్పన్ నాతో నెలకి 1500 రూపాయల జీతంలో మూడేళ్ళ కాంట్రాక్టు చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం మద్రాసులో ఉండి, నటనలో శిక్షణ తీసుకోవాలి.

ఇదిలా ఉంటే నా మరో సినిమా ‘గుమ్రాహ్’ (1963) విడుదలయింది. దానిలో నేను అశోక్ కుమార్ పనివాడుగా చేశాను. అది హాస్య పాత్ర. అందరూ మెచ్చుకున్నారు. మద్రాసా బొంబాయా తేల్చుకోమన్నారు మెయ్యప్పన్. నేను ఒక ఏడాది పూర్తయ్యాకా బొంబాయి తిరిగి వచ్చేయడానికి నిశ్చయించుకున్నాను. ‘గుమ్రాహ్’ తరువాత నేను ‘ఖవ్వాలీ కీ రాత్’ (1964)లో ముంతాజ్ సరసన నటించాను, అది ఆమె తొలి చిత్రం.

ఆ తరువాత ‘దేవర్’ (1966), ‘అనుపమ’ (1966) చిత్రాలతో పాటు, కుమ్‍కుమ్ సరసన ‘నహిహర్ చుతల్ జాయె’ అనే భోజ్‍పురి సినిమా చేశాను. ఏడాదికి రెండు సినిమాలు చేసేవాడిని. నాకేమీ తొందర లేదు.

మేము ఎన్నడూ లొకేషన్‍లో షూటింగ్ చేసేవాళ్ళం కాదు. స్టూడియోలో వేసిన సెట్లలోనే చిత్రీకరణ జరిపేవాళ్లం. ఒక సెట్‍లో ఏకధాటిగా 15 రోజుల పాటు షూటింగ్ జరిపేవాళ్ళం. తర్వాత కొన్ని రోజుల విరామం తర్వాత మళ్ళీ అందరం కలిసేవాళ్ళం.

అప్పట్లో స్నేహపూరిత వాతావరణం ఉండేది, అందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు అటువంటి స్నేహాలు లేవు. జనాలు వేర్వేరు రోజుల్లో షూటింగ్ చేస్తున్నారు.

అప్పట్లోనూ ఎఫైర్స్ ఉండేవి, కానీ ఇప్పట్లా వాటిని ఎవరూ డముకు కొట్టి చాటేవారు కాదు. ఇప్పట్లో ఏ నటుడు ఎవరితో డేటింగ్ చేస్తున్నాడనవే వార్తలు. మేం సినిమాలు చూసినప్పుడు రాజ్ కపూర్‌దో లేక దిలీప్ కుమార్‌దో అద్భుతమైన నటన గురించి చర్చించుకునేవాళ్ళం. మేం నటన గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పటి తరం వాళ్ళు డాన్సులు, ఫైట్ల గురించి మాట్లాడుకుంటారు. ఏం చేస్తాం పరిస్థితి అలా మారింది!

‘చోరీ మేరా కామ్’ హిట్ అవడంతో 1975లో నా కెరీర్ మలుపు తిరిగింది. ఆ సినిమాకి నాకు మొదటిసారిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. ఒకసారి వరుసగా 16 సినిమాలు చేశాను. ఒక సందర్భంలో రాత్రంతా – ఇస్మాయిల్ ష్రాఫ్ గారి ‘ఆహిస్తా ఆహిస్తా’ షూటింగ్ చేసి తెల్లవారు జామున హైదారాబాద్ వెళ్ళి అక్కడ జితేంద్ర గారి ‘ప్యాసా సావన్’లో నటించి – సాయంత్రం నాలుగు గంటలకి బయల్దేరి ఢిల్లీ వచ్చి యష్ చోప్రా గారి ‘సిల్‌సిలా’ షూటింగ్‍లో పాల్గొని మళ్ళీ తెల్లవారు జామున బొంబాయికి చేరి ఇస్మాయిల్ ష్రాఫ్ గారి సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను.

ఎందుకు ఇన్ని సినిమాలు చేశానంటే, ఎవరికీ కాదని చెప్పలేక. పరిశ్రమలో చాలా కాలంగా ఉన్నాను, ఎందరో స్నేహితులు, అందుకే కాదని చెప్పి ఎవరినీ నిరాశపరచలేను.

ఈ పరిశ్రమలో మీరు మీ ప్రతిభతో పదేళ్ళు కొనసాగవచ్చు… అదే సత్ప్రవర్తన కలిగిఉంటే కలకాలం నిలుస్తారు. నేను సినీ పరిశ్రమలో 47 ఏళ్ళు ఉన్నాను. మా మావగారు (అశోక్ కుమార్) చనిపోయిన తర్వాత రిటైరయ్యాను.

నేను నటించిన చివరి చిత్రం ‘మేరే యార్ కీ షాదీ’, కానీ ‘కలకత్తా మెయిల్’ చివర విడుదల అయింది. అప్పటి వరకూ నాకు చేతినిండా సినిమాలు. నేనెప్పుడు పని లేకుండా ఖాళీగా లేను.

చోరీ మేరా కామ్, చోర్ కే ఘర్ చోర్, అంగూర్ సినిమాలకు నాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులొచ్చాయి. ఇల్లు మారినప్పుడు ఆ ట్రోఫీలు ఎక్కడో పోయాయి. నా భార్యకి ఊపిరితిత్తుల సమస్యకి శస్త్ర చికిత్స చేశారు. వాతావారణం మార్పు కావాలంటే మద్రాస్‍కి మారాను. రెండేళ్ళ తరువాత మళ్ళీ బొంబాయికి తిరిగి వచ్చేశాం. అలా వస్తున్నప్పుడు నావి రెండు సామాన్లుల బ్యాగులు పోయాయి.

నిర్మాతగా నా మొదటి సినిమా ‘యకీన్’ (1969). నేను ఎనిమిది సినిమాలు నిర్మించాను. 1971లో ‘నాదాన్’ సినిమాని నిర్మించి దర్శకత్వం వహించాను. అందులో ఆశా పరేఖ్, నవీన్ నిశ్చల్ నటించారు. తరువాత అశోక్ కుమార్ గారితో బడా కబూతర్ (1973), అమితాబ్ బచ్చన్‌తో బేషరమ్ (1978), మిథున్ చక్రవర్తితో దానా పానీ (1989) తీశాను.

డిసెంబరు 2012లో ప్రీతీ గంగూలీ (మా వదినగారు) చనిపోయినప్పుడు నాకెన్నో సంతాప సందేశాలొచ్చాయి, ఎందుకంటే చనిపోయినది నా భార్య అని పత్రికలు తప్పుగా ప్రచురించాయి. నేను పెళ్ళి చేసుకున్నది అశోక్ కుమార్ గారి మరో కూతురు – రూపా గంగూలీని. తను అసలు సినిమాలలో నటించలేదు.

అశోక్ కుమార్ గారితో కలిసి నేను ధరమ్‌పుత్ర, గుమ్రాహ్, ఆజ్ ఔర్ కల్, వంటి చాలా సినిమాల్లో నటించాను. దాదాపుగా ప్రతీ రోజూ ఒకరినొకరం కలిసేవారం. రాత్రి భోజనానికి ఆయన్ నన్ను వాళ్ళింటికి పిలిచేవారు. ఆ విధంగా వారి కుటుంబం పరిచయమైంది. రూపా, నేను ఒకరినొకరు ఇష్టపడ్డాం. పెళ్ళి చేసుకోవాలనుకున్నాం. అశోక్ కుమార్ గారిని అడిగితే, “ఆలోచిద్దాం” అన్నారు.

ఎట్టకేలకు రెండేళ్ళ తరువాత మా పెళ్ళి జరిగింది. పిల్ల ఇంకా చిన్నది, కొన్ని రోజులు ఆగి నిర్ణయిద్దాం అనేవారు. బాగా ఆలస్యం చేశారు. ఎందుకంటే అశోక్ కుమార్ గారి పెద్దమ్మాయి భారతి కూడా ఓ గుజరాతీని డా. పటేల్‌ని పెళ్ళి చేసుకున్నారు. కిశోర్ కుమార్ గారు మా నిశ్చితార్థం జరిపించారు. బొంబాయి లోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మా వివాహం జరిగింది.

‘అంగూర్’ – రెండు పగళ్ళు, ఒక రాత్రి కథ. కానీ దానికి రిపీట్ వాల్యూ ఉంది. కొన్ని అతి పెద్ద బ్లాక్ బస్టర్లను అధిగమించింది. చక్కని హాస్యం వల్ల వీడియోలు బాగా అమ్ముడయ్యాయి. నా రెండు పాత్రలు (దేవేన్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు) ఒకేలాంటి దుస్తులు వేస్కుంటారు. డ్రెస్సులలో మార్పు లేరు. వారి పేర్లు కూడా ఒకటే. డబ్బింగ్ చెప్తున్నప్పుడు – పొరపాటున ‘స’ అనే అక్షరాన్ని రెండు పాత్రలకీ వేర్వేరుగా చెప్పాను. డబ్బింగ్ అయిపోయాక, నేను అమెరికా వెళ్ళిపోయాను. సినిమా సిద్ధం అయింది, ఆ పొరపాటును ఎవరూ గమనించలేదు. రిలీజ్‌కి సిద్ధం అనుకునే సమయానికి (దర్శకులు) గుల్జార్ దాన్ని గమనించారు. రెండు పాత్రల మధ్య అస్సలు తేడా ఉండకూడదని గుర్తు చేశారు. న్యూయార్క్‌లో ఉన్న నాకు ఫోన్ చేసి మళ్ళీ డబ్బింగ్ చెప్పడానికి వెంటనే రమ్మన్నారు. నేను వచ్చాను. మేమిద్దరం ఓ రాత్రంతా కూర్చున్నాం, డైలాగ్‌లన్నీ మళ్ళీ డబ్బింగ్ చెప్పాను. చిన్న తేడా కోసం నన్ను పిలిపించారు గుల్జార్ గారు. ఆయన ఎంతో ఖచ్చితంగా ఉండేవారు. అయినా ఆ ఇద్దరు బహాదూర్‌లలో చిన్న చిన్న తేడాలుంటాయి. ఒకరు చొక్కా చేతులు మడుస్తారు, ఒకరు మడవరు. కొన్ని సీన్లలో ఇద్దరు పొడుగు చేతులు చొక్కాలు ధరించి కనబడతారు. సినిమా విడుదలయ్యాకా, మేము ఈ పొరపాటుని గమనించాం, నిశ్శబ్దంగా ఉండిపోయాం… ఎవరు దాన్ని పట్టుకోలేదు కూడా.

‘దీదార్-ఏ-యార్’ (1982) సినిమా బాగా ఇష్టంగా చేసాను, కానీ ఫ్లాప్ అయింది. జితేంద్ర దానిని నిర్మించారు. నేనా పాత్రని ఎంతో ప్రేమించాను. విమర్శకులు కూడా మెచ్చుకున్నారు.

ఆ సినిమా అంతా నేను మాడిపోయిన ముఖంతో కనిపిస్తాను. సినిమా మొత్తంలో ఏ భావమూ వ్యక్తపరచను. అది చాలా కష్టమయింది, నాకు డైలాగులున్నాయి, కానీ మొహంలో ఏ భావమూ లేకుండా చెప్పాల్సి వచ్చింది.

ఈ పరిశ్రమలో మీరిచ్చిన హిట్లని బట్టే మీకు సినిమాలొస్తాయి. హిట్ పడితే ఎంతో మంది మిమ్మల్ని చూస్తారు. కాకుండా, వారం రోజులు మాత్రమే ఆడిన సినిమాలో మీరెంత ఉత్తమ ప్రదర్శన కనబరిచినా, జనాలు మిమ్మల్ని చూడలేదనే అర్థం (ఆ రోజుల్లో సినిమాలు అర్ధ శతదినోత్సవాలు, శతదినోత్సవాలు జరుపుకునేవి).

బాగా శ్రమించిన తర్వాత, ఆ కష్టాన్ని ఆస్వాదించడానికి తగిన సమయం ఉండాలనేది నా నమ్మకం. ఈ పరిశ్రమలో నేను బాగా కష్టపడ్డాను, ఇక విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను, అందుకే రిటైరయ్యాను. నా రిటైర్మెంట్‌కి మరొక కారణం కూడా ఉంది. నా చివరి సినిమా చేస్తున్నప్పుడు – యువతరం వాళ్ళు సినీరంగంలో కొత్త ఉరవడిని, పాప్ కల్చర్‌ని తెచ్చేసారని గ్రహించాను, మేమేమో వాటిలో భాగం కాదు మరి. చేతి వేళ్ళ మధ్య సిగరెట్‌తో ఓ మహిళా అసిస్టెంట్ వచ్చి “రండి సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు” అని చెప్పడం నాకు కొంచెం కష్టమనిపించింది. మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు, ఎంతో మర్యాద ఇచ్చేవారు. ఇప్పుడు అవి తగ్గాయి. ఈనాటి యువతకి ఆటిట్యూడ్ ఎక్కువ. వాళ్ళని నిందించలేం – ఈ కొత్త తరం అలాగే ఉంటున్నారు, వాళ్ళ ధోరణి విభిన్నంగా ఉంటోంది. అది మీకు సంతోషం కలిగించకపోతే, మీరు పని చేయకూడదు. ఇతరులని మారమని నేను అడగలేను. రిటైరయ్యే ముందు పూనేలో ఒక భవంతి కొనుక్కున్నాను, 1993లో దాంట్లోకి మారిపోయాను.

టెలివిజన్ కూడా బాగా ప్రభావం చూపుతుంటే – సరిగా నటన రానివాళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టం. నటన రాకపోతే ‘స్టార్ కిడ్స్’ అయినా వెండితెరపై రాణించడం కష్టం. మంచి నటుడు మాత్రమే రాణించగలడు, నిలదొక్కుకోగలడు గోవిందాలా – అతను ‘స్టార్ కిడ్’ కాదు. కానీ రణ్‌ధీర్ కపూర్ నిలదొక్కుకోలేకపోయాదు. అతను రాజ్ కపూర్ కొడుకయి ఉండచ్చు, గోవిందా పేద నేపథ్యం నుంచి వచ్చి ఉండచ్చు, కానీ ప్రజలు మరింత విచక్షణతో వ్యవహరిస్తున్నారు. సినిమా వ్యవస్థకిది మేలు చేసింది. బాగా చేసే నవాజుద్దీన్ సిద్ధికీ వంటి నటులను ప్రజలు మెచ్చుకుంటున్నారు.

వికీ డోనర్ సినిమాని ఆస్వాదించినట్లుగా నేను ఏ సినిమాని ఆస్వాదించలేదు. అది నా జానర్. అందులో నమ్మశక్యమైన హాస్యం ఉంది. గాల్లో జీపులు ఎగిరే, హీరో ఒక్క తన్ను తంతే విలన్ 15 అడుగుల దూరంలో పడే రౌడీ రాథోడ్ వంటి సినిమాలూ ఆడతాయి. ప్రేక్షకులే బాసులు.

నాకు పూనేలో చిన్న థియేటర్లు ఉన్న మిత్రులు ఉన్నారు. ఏదైనా సినిమా గురించి నేను విని, అది చూడాలనుకుంటే వాళ్ళతో చెప్తాను. వాళ్ళు 10-15 మంది కోసం ఆ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.

థియేటర్‌లో నేను చూసిన ఆఖరి చిత్రం వికీ డోనార్. అయితే నేను టీవీలో సినిమాలు చూస్తుంటాను.

సినీ పరిశ్రమలో అన్ని విభాగాలలోనూ అద్భుతమైన ప్రతిభ ఉంది.

నేడు రణ్‌బీర్ కపూర్ ఉత్తమ నటుడు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఎటువంటి పాత్రలోనైనా రాణిస్తున్నాడు.

పరిశ్రమలో బాగా రాణిస్తున్న సమయంలో, ఓ మూగ చెవిటి అబ్బాయి పాత్ర (బర్ఫీ సినిమా) ఆఫర్ వస్తే, ఒక్క డైలాగ్ కూడా లేని ఆ పాత్రని మీరు ఒప్పుకుంటే. మీలో ఆత్మవిశ్వాసం అమితంగా ఉన్నట్టు, దాన్ని విజయవంతం చేస్తారు.

నటీమణులు కూడా విశేషంగా రాణిస్తున్నారు. దీపికా పడుకోనేది నేను చూసిన మొదటి సినిమాలో ఆమె నాకు నచ్చలేదు. కానీ నటిగా చాలా మెరుగైంది.

భేజా ఫ్రై ఫేమ్ వినయ్ పాఠక్ ఇటీవలి కాలంలో నన్ను ఆకట్టుకున్న కమేడియన్. నేడు చాలామంది సినిమాలు చేయాలనుకోవడం – సినిమా హిట్ అయితే – వ్యాపార ప్రకటనలలో అవకాశాలు వస్తాయనే!

విపరీతమైన పోటీ ఉన్నది నేపథ్య గానం రంగంలో. ఒక గాయకుడికి మంచి హిట్ పాట పడితే, అతనికి ఎన్నో షోలలో అవకాశాలు వస్తాయి.

***

దేవేన్ వర్మ 2 డిసెంబర్ 2014 నాడు మృతి చెందారు. అప్పటికి ఆయన వయసు 77 ఏళ్ళు. గుండెపోతు, మూత్రపిండాలు పనిచేయకపోవడం ఆయన మరణానికి కారణాలు. నగరంలోని యరవాడ క్రెమేటోరియంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

~

దేవేన్ వర్మ గురించి మరికొన్ని వివరాలు:

వర్మ నౌరోస్‌జీ వాడియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుండి 1957లో పాలిటిక్స్, సోషియాలజీ లతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలలో నటించేవారు. హృశీకేశ్ ముఖర్జీ, గుల్జార్, బాసు చటర్జీ వంటి దర్శకుల చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు.

ఒక స్టేజి షోలో నిర్మాత బి.ఆర్. చోప్రాకి వర్మ ప్రదర్శన నచ్చి 1961లో తాను తీసిన ‘ధరమ్‌పుత్ర’ సినిమాలో అవకాశం ఇచ్చారు. దేశ విభజన గాయాలు, మత విద్వేషాల మీద తీసిన సినిమా అది.

ఈ సినిమాతోనే శశి కపూర్ కెరీర్ కూడా మొదలయింది. తర్వాతి కాలంలో – ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో ఎవరికీ అర్థం కాలేదని శశి ఉత్తరం రాశారని – వర్మ చెప్పారు.

వర్మకి తొలి హస్య పాత్ర 1963 నాటి ‘గుమ్రాహ్’ చిత్రం ద్వారా లభించింది. అందులో అశోక్ కుమార్‌ పనివాడుగా నటించారు. తరువాతి కాలంలో దేశపు గొప్ప దర్శకులయిన హృశీకేశ్ ముఖర్జీ (అనుపమ 1966), గుల్జార్ (ఖామోషీ 1970) నటించారు, గుల్జార్ సినిమాలో పేషంట్ నెంబర్ 22 గా వర్మ నటన అలరిస్తుంది.

అలాగే గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ‘మేరే అప్నే’ (1971)లో మీనా కుమారి భర్తగా విశేష నటన కనబరిచారు. కలకత్తా నేపథ్యంగా సమాజంలో క్షీణిస్తున్న విలువలు, సాంఘిక నిరాశలకు అద్దం పడుతుందీ సినిమా.

అయితే దేవేన్ వర్మలోని హాస్య నటుడు బయటపడడానికి కొంత కాలం పట్టింది. 1975 నాటి ‘చోరీ మేరా కామ్’తో ఈ పరిణామం సంభవించింది. తోటి నటులు శశికపూర్, అశోక్ కుమార్‌తో సమంగా రాణిస్తూ ఓ సాధారణ కథని చక్కని సినిమాగా మార్చటమే కాకుండా, ఉత్తమ హాస్యనటుడిగా తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెల్చుకున్నారు.

అర్జున్ పండిట్ (1976), చోర్ కే ఘర్ చోర్ (1978) ఇంకా అమోల్ పాలేకర్ హృశీకేశ్ ముఖర్జీల మధ్య తరగతి కథాంశంతో వచ్చి సూపర్ హిట్ అయిన, గోల్‌మాల్ (1979) వర్మకి పేరు తెచ్చిన సినిమాలలో కొన్ని.

మూడేళ్ళ తరువాత – గుల్జార్ తీసిన – అంగూర్ సినిమాలో వర్మ తన కెరీర్ లోనే ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ సినిమాలో వర్మా, సహనటులు సంజీవ్ కుమార్ ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. ఇది 1963 నాటి బెంగాలీ సినిమా ‘భరింతిబిలాస్’‌కి రీమేక్, (ఆ సినిమాకి షేక్‍స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారం) దీనిలోని అద్భుత నటనకి వర్మకి మూడోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కింది.

ధర్మేంద్రతో ‘దేవర్’ సినిమాలో ఈ పాట చూడండి:

https://www.youtube.com/watch?v=gLpPBcWIUIk


విస్మృతికి గురైన అందాల తార కల్పన:

షమ్మీ కపూర్ పరిచయం చేసిన ముగ్గురు కథానాయికలలో నటి కల్పన ఒకరు. షర్మిలా టాగోర్, ఆశా పరేఖ్ మిగతా ఇద్దరు. ఈ ఇద్దరు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నా – కల్పన మాత్రం ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు (ఈమె దేవ్ ఆనంద్ భార్య కల్పనా కార్తీక్ కాదు).

కల్పన మోహన్ శ్రీనగర్‌లో 18 జూలై 1946 నాడు జన్మించారు. ఆమె తండ్రి అవని మోహన్, స్వాతంత్ర్య సమరయోధులు, పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి సన్నిహితులు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో క్రియాశీలక సభ్యులు. కథక్ నాట్యంలో శిక్షణ పొందిన కల్పనని – విశేష అతిథులు వచ్చినప్పుడల్లా రాష్ట్రపతి భవన్‍లో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా నెహ్రూ కోరేవారు.

కల్పనని తొలుత గుర్తించింది బాల్‌రాజ్ సహానీ, రచయిత్రి ఇస్మత్ చుగ్తాయ్. బొంబాయికి రావల్సిందిగా వారు ఆమెను ప్రోత్సహించారు. 1962లో ‘ప్రొఫెసర్’ చిత్రం ద్వారా కల్పనకి తొలి అవకాశం లభించింది.

లేఖ్ టాండన్ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రొఫెసర్’ చిత్రం ద్వారా కల్పనకి మొదటి గొప్ప హిట్ లభించింది. షమ్మీ కపూర్‌తో కలిసి ఆమె బాక్సాఫీసుని ఊపేశారంటారు. ‘ఆవాజ్ దేకర్ హమే తుమ్ బులా లో’, ‘మై చలీ మై చలీ’, ‘హో కోయి ఆయేగా’ వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. షర్మిలా టాగోర్ తర్వాత కల్పన అంతటి పెద్ద హీరోయిన్ అవుతారని బాక్సాఫీసు పండితులు ఊహించారు.

కానీ విధి మరోలా తలచింది. తొలి సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా మరిన్ని అవకాశాలు రాలేదు. నిర్మాతలు ముందుకు రాలేదు. కొద్ది రోజులకే కల్పన మనుగడ కోసం పోరాటం సాగించవలసి వచ్చింది.

వినోద పరిశ్రమలో డబ్బు సంపాదించేందుకు కల్పన షార్ట్‌కట్స్ ఎంచుకున్నారని పుకార్లు ఉన్నాయి. ప్రసిద్ధ స్క్రీన్‌ప్లే రచయిత సచిన్ భౌమిక్‌ను వివాహం చేసుకోవడం వల్ల ఆమెకేమీ అదనపు కీర్తి రాలేదని అంటారు. బదులుగా, అంతలా గౌరవనీయులైన భౌమిక్ ఆవిడని ఎలా పెళ్ళి చేసుకున్నారా అని అనుకునేవారట జనాలు.

వినోద పరిశ్రమలో త్వరగా డబ్బు సంపాదించేందుకు కల్పన ఎంచుకున్న మార్గాలు ఓ చేదు నిజాన్ని వెల్లడిస్తాయి. విజయం అనేది క్రూరమైన యజమాని అనీ; దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటూ – అతి త్వరగా విజయం సాధించాలనుకునేవాళ్ళ పట్ల అదీ మరీ క్రూరంగా ఉంటుంది. నటనకి తప్ప ఇతర అవకాశాలన్నింటికీ కల్పన అందుబాటులో ఉండడం వల్ల, సినిమాల్లో నాయికగా అవకాశాలు క్షీణించాయని అంటారు.

సూపర్ హిట్ ‘ప్రొఫెసర్’ తర్వాత ఆమె మరో రెండు సినిమాలు చేశారు. కానీ వాటి గురించి పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. ఈనాడు కల్పనని గుర్తుంచుకునేది కేవలం ‘ప్రొఫెసర్’ కథానాయికగానూ, సచిన్ భౌమిక్ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిన మహిళగాను మాత్రమే గుర్తుంచుకుంటారు. తన జీవన శైలిని మెరుగుపరుచుకునేందుకు ఆయనను పెళ్ళి చేసుకున్న కల్పన – ఈజీ మనీకి అలవాటు పడి – గౌరవంగా బ్రతికేందుకు ఆయన చూపించిన మార్గాలనూ కాదనుకున్నారట.

1967లో ఓ నౌకాధికారిని వివాహం చేసుకున్నా, 1972లో ఆయనకి విడాకులిచ్చారు.

నటన మానుకున్నా, బొంబాయిలో జీవించసాగారు. కానీ కొన్ని రోజులకి క్రుంగుబాటుకి లోనయ్యారు. విడాకులే దానికి కారణమని చెప్పుకుంటారు.

ఆరోగ్యం పాడవడంతో, వాతావరణం మారాలని వైద్యులు సూచించటంతో, కల్పన బొంబాయి విడిచి పూనే వచ్చేసారు.

4 జనవరి 2012 నాడు పూనా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో కల్పన కన్నుమూశారు. యవ్వనంలో అందగత్తెగా ఉన్నప్పుడు, తన సోగ కళ్ళతో, ప్రొఫెసర్, తీన్ దేవియాఁ వంటి సినిమాలలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఏళ్ళ 65 కల్పన, అంతకు ముందు అయిదేళ్ళ నుండి కేన్సర్‍తో పోరాడుతూ ఉన్నారు. రూబీ హాల్ క్లినిక్‍లో చికిత్స పొందారు.

న్యూమోనియా రావడంతో ఆమెను 3 డిసెంబరున హాస్పిటల్‌లో చేర్చారు. డిసెంబరు 13న డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. కానీ మళ్ళీ రెండు గంటల తర్వాత ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. శరీరంలో ఎడమ భాగమంతా వంకరలు పోయింది.

ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి, ఐసియులో 15 రోజుల పాటు ఉంచారు. కల్పన కూతురు ప్రీతి మన్‍సుఖానీ, అల్లుడు హరీష్ ఆమెని దగ్గరుండి చూసుకున్నారు. ఆమె అంత్యక్రియలు వైకుంఠ్ క్రెమెటోరియంలో, కుటుంబ సభ్యులు, ఆప్త మిత్రుల మధ్య జరిగాయి.

కల్పన మరణవార్తని ఎక్కువగా ప్రచారం చేయక గుప్తంగానే ఉంచామని అన్నారు హరీష్. “చాలామంది ఆవిడ ఆస్తి మీద కన్నేసినందున, ఆమె మృతి గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు” అన్నారాయన.

2007లో కల్పన ఒకసారి వార్తలలో నిలిచారు. మౌజే విసాగర్ గ్రామంలో తనకున్న 56.18 హెక్టార్ల స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి – నకిలీ మెమొరాండమ్ ఆఫ్ అండర్‍స్టాండింగ్‌ (ఎం.ఓ.యు) చేసి – సహరా సిటీ బిల్డర్స్‌కి అమ్మేసారని ఆరోపిస్తూ పూనే లోని ఖడక్ పోలీస్ స్టేషన్‍లో ఆమె ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆమె ఒత్తిడికి లోనయి, బలహీనమైపోయారని హరీష్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here