నమామి దేవి నర్మదే!!-9

0
4

[box type=’note’ fontsize=’16’] భక్తి పర్యటనలో భాగంగా తమ నర్మదా పరిక్రమణ యాత్రానుభవ కదంబాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ. [/box]

నర్మదా పరిక్రమ యాత్రానుభవ కదంబం

ఏడవరోజు

[dropcap]మా[/dropcap] యాత్ర మొదలయి వారం రోజులు అయింది. మేము రోజులు లెక్కపెట్టుకోవటం నిజంగానే మర్చిపోయాం. వారాలు తెలియటం లేదు. తిథులు గుర్తులేవు. సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నామో కూడా గుర్తులేదు. రోజూ నర్మదామాయిని పూజించటం, వెళ్ళిన చోట దేవాలయాలను చూడటం, నర్మద నదిలో కొంతసేపు, తీరం వెంట కొంత సేపు కూర్చుని జపం చేసుకోవటం. జపం ఎంత పెరిగిందో కూడా ధ్యాస లేకుండా ఉన్నాము. పూర్తిగా జగదంబ మీద భారం వేసి నడుస్తున్నాం.

ఆ రోజు మేము ఉదయమే ఆరు గంటలకు బయలుదేరాం. మా కారు పొలాల వెంట పోతోంది. కంకులు వచ్చిన జొన్న చేలు, పండిన గెడలతో చెరుకు పంటలు. సస్యశ్యామల నా దేశం హరితంలో కనపడుతుంటే కన్నుల పంటగా ఉంది. సూర్యోదయం కాలేదు. అద్భుతమైన ఆదిత్యుడు నెమ్మదిగా వస్తున్నాడేమో, ఆకాశంలో ప్రాగ్దిశన లేత అరుణిమ కనపడుతోంది. జగదంబను ఆ అరుణిమలో తలుచుకుంటు ధ్యానంలో నేను సాగుతున్నా. మేము నదీతీరానికి వెళ్ళేదూరం దాదాపు 25 కిలోమీటర్లు.

ఆ ఉదయం దారి పొడుగునా ప్రజలు తండోపతండాలుగా మేము వెళ్లే వైపే వెళుతున్నారు. డ్రైవర్ అనిల్ ఒకచోట ఆపి నడుస్తున్న ఒక ఆసామిని ఆపి “ఎక్కడికన్నా జనాలు ఇలా నడిచిపోతున్నారు?” అని అడిగాడు.

“ఈ రోజు అమావాస్య. నదీ స్నానానికి వెడుతున్నాము…” అన్నాడతను.

“అమావాస్య అయితే నదీ స్నానం చేస్తారా?” అడిగాను నేను.

“అవును దీదీ! అమావాస్య ముఖ్యమైన తిథి…” చెప్పారా భక్తులు.

ఎందరో పల్లె ప్రజలు ఎలాంటి ఆడంబరం లేక సాధారణ జీవితం గడపటం, హైందవమన్నా, సనాతన ధర్మమన్నా వారికి గల ఆపేక్షకు నా హృదయం పొంగింది.

‘ఇది కదా నా భారతదేశం…’ అనుకున్నా హృదయం నిండుగా.

ఆ యాత్ర చేస్తున్నంత కాలమూ, మాకు దారిలో ఎన్నో దేవాలయాలు చిన్నవి, పెద్దవి కనపడ్డాయి. అన్ని చాలా శుభ్రంగా ఉన్నాయి. చాలా పల్లెలు. పల్లెలలో ప్రజలు స్నేహపూర్వకంగా ఉన్నారు. పరిక్రమవాసులమని మాతో గౌరవంగా, నర్మదామాయి అంటే భక్తిగా ఉన్నారు.

అణువణువునా ఓంకారం ఉన్నా జెండా లతో ఎంతో హాయినిచ్చిందీ యాత్ర.

ముఖ్యంగా హైద్రాబాద్‌లో చాలా మిక్స్‌డ్ కల్చర్ కావటం వలన నాకు అవి చూసి చెప్పలేనంతగా ఆనందం కలిగింది.

ఇప్పుడు ఇంత దూరభారాలైనా ఉదయమే చేతి సంచి(బట్టది)లో బట్టలు పెట్టుకొని చిన్నా, పెద్దా అందరూ కాలి నడకన నడవటం చూస్తుంటే ఎంత భక్తి కలిగిందో.

మనం ఇంటి ప్రక్కన ఉన్న కొట్టుకెళ్ళాలంటేనే బండి లేదా ఆటో కావాలి. నడవటానికి పరమ బద్ధకం నగరవాసులకు.

మన తిథులు తెలియవు. పండుగలు జరుపుకోవాలంటే పరమ బేషజం. హిందూ పండుగలొస్తే చాలు వాతావరణం.. నా శ్రాద్ధం.. అంటూ వంకలతో చంపుతారు.

కాని గ్రామ సీమలలో నా ధర్మం బ్రతికే ఉంది. వారందరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చెయ్యాలన్న భక్తి కలిగింది. మీరే కదా నా హైందవాన్ని బ్రతికిస్తున్నవారు.

“అయ్యా! అమ్మా! మీరు కదా భారతదేశపు అసలైన రూపాలు! మీరు కదా సనాతన ధర్మపు ఆత్మ…” అని వెలుగెత్తి చాటాలి.

మా అమ్మ జీవించి ఉన్నప్పుడు ఆమె చాలా శ్రద్ధగా అన్ని తిథి సంబంధిత వ్రతాలు పాటించేది.

వారు(అమ్మా, నాన్న) సముద్ర స్నానానికి, నదీ స్నానానికి వెళ్ళేవారు. ఏకాదశి వత్రం చేసేవారు.

మాసశివరాత్రి నాడు ఇంట్లో రుద్రాభిషేకముండేది. ప్రతిరోజు పరమాత్మకు అన్నం నివేదించినాకే మాకు భోజనం ఉండేది. ఉదయమే అమ్మ మడికట్టుకొని వంట చేసి కాని వంటగది నుంచి బయటకు వచ్చేది కాదు.

వారు నెలకు రెండు పండుగలలో, విశేషరోజులలో పాటించేవారు. వారిదో క్రమశిక్షణ కలిగిన జీవితవిధానం.

నే అన్ని పాటించలేను. అందుకే ఇప్పుడన్నీ మాయమయ్యాయి అని దిగులు మనసులో ఉంది. కాని, ఆ పల్లె ప్రజలను చూసాక ఆ దిగులు మరుగయింది. వారి భక్తి అసలైన భక్తి. హైందవ జీవనవిధానమది.

మేము నర్మదామాయి దగ్గరకు చేరాము. ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మేము చేరే సరికే ఉదయం ఏడు అవుతున్నదేమో? అప్పటికే కుటుంబాలు కుటుంబాలు పెద్ద సంఖ్యలో నదిలో స్నానం చేస్తున్నారు. వారంతా స్నానం అయ్యాక అక్కడే నది ఒడ్డున ఉన్న బ్రాహ్మణులకు వడ్లు దానం చేస్తు నర్మదామాయికి హారతి ఇచ్చి వెళుతున్నారు. బిక్షగాళ్ళు రెండు బారులుగా కూర్చొని ఉన్నారు. వారికి అందరు బియ్యం పిండి దానం ఇస్తున్నారు.

ఎన్నో కొట్లు ఉన్నాయి. వాటిలో ఎన్నో రకరకాల వస్తువులు అమ్ముతున్నారు.

మైకులో పెద్దగా నర్మదామాయి హారతి, ఘాటును శుభ్రంగా ఉంచమన్న హెచ్చరికలు వినపడుతున్నాయి.

గొప్ప పండుగ వాతావరణంతో ఉంది ఆ ప్రదేశమంతా.

మేము ఇద్దరం మా మామూలు విధి విధానంగా నదికి నమస్కరించి, పూజించి, సంకల్పంతో నదిలోకి వెళ్ళి మునిగి వచ్చాం. అది అంతా మెట్లతో ఉంది. ఆ మెట్లు కాకుండా క్రిందకు వెళ్ళవద్దని హెచ్చరికలు చేస్తున్నారు.

మేము గట్టుకు వచ్చాం.

గట్టు మీద రేకులతో చిన్న కంపార్టుమెంటు అమర్చారు స్త్రీలు దుస్తులు మార్చుకోవటానికి.

నేను అందులో మార్చుకొని వచ్చాను. అక్కడ ఒక్క చోటే ఆ ఏర్పాటు ఉంది.

మేము పూజా సామాగ్రితో నర్మద ముందు కూర్చోడానికి సిద్ధం అవుతుండగా ఒక బ్రాహ్మణుడు పలకరించాడు మీరు “పరిక్రమవాసులా?” అంటూ,

శ్రీవారు “అవును సామీ…” అని చెప్పారు.

ఆయన మమ్మల్ని తన వద్ద పూజ చేయించుకోమని సలహా ఇచ్చాడు. మేము “సరే” అని (ఆ రకంగా నర్మద ఒడ్డున ఒక బ్రాహ్మణునికి దానం చెయ్యవచ్చని అనుకొని) వారి సాయంతో పూజ, హారతి చేసాము.

తదనంతరం ఆయనకు దక్షిణ ఇచ్చి, అక్కడ ఉన్న వారికి మా వద్ద ఉన్న చిల్లర పది రూపాయలు అన్ని దానం చేసి గట్టు నుంచి కారు వైపుకు వచ్చాము.

మా డ్రైవర్ అక్కడ ఉన్న గుడి చూపించి “ఇది తప్పక దర్శించుకోవాల్సిన దేవాలయం” అన్నాడు.

ఆ దేవాలయం బయటకు కనపడటం లేదు.

బయటకు కేవలం పాడు బడిన గోడలతో మధ్య పాతబడిన ద్వారబంధం ఉంది.

ఆ దేవాలయం పేరు సిద్ధేశ్వరాలయం. ఆ స్థలం నెమావర్.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

నెమావర్

నెమావర్ పట్టణం వింధ్యా పర్వతాలలో, నర్మదాతీరంలో ముఖ్యమైన పట్టణం. దీనికి ‘నర్మద నడి బొడ్డు’ అని పేరు. నర్మదను ఇక్కడ ప్రార్థిస్తే సర్వ కష్టాలు తొలగుతాయని, తల్లికి పిల్లలకు ఉన్న సంబంధం నెమావర్ వద్ద లభిస్తుందని, నర్మదమాయి ఇక్కడ తల్లిలా భక్తులను ఆదరిస్తుందని చెబుతారు.

నెమావర్ నర్మదా తీరంలో వెల్లివిరిసిన సంస్కృతికి, నాగరికతకు, పాండిత్యానికి, వారసత్వ సంపదకు, ఆధ్యాత్మికతకు మూల స్తంభంగా చెబుతారు. నెమావరునే ‘నాభిపురం’ అన్న మరో పేరుతో కూడా పిలిచేవారు.

పురాతన కాలం నుంచి ఈ పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహాభారతం కాలం నుంచి కూడా ఈ పట్టణం ప్రముఖమైనదిగా పేరు పొందింది. పురాణాల బట్టి బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతలు ఈ సిద్ధేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. ఇది సత్యయుగం నుంచి ఉన్న శివాలయమని చెబుతారు. ఈ లింగం యొక్క శిఖరాన్ని పరీక్ష చేసిన అర్కియాలజి డిపార్ట్‌మెంటు వారు ఈ శివలింగం 3094 సంవత్సరాలకు పూర్వందని చెబుతారు. ఈ లింగం రెండు జ్యోతిర్లింగాల మధ్యగా ప్రతిష్ఠించబడింది. (ఓంకారేశ్వరుడు, మహాకాలేశ్వరుడు)

సర్వపాపాలను కడిగి పుణ్యఫలాన్నిచ్చే మహాదేవునిగా ఈ సిద్ధేశ్వరుని గురించి చెబుతారు. అసలు ఈ లింగం ప్రణవం నుంచి ఉద్భవించిందని చెబుతారు. ఇక్కడికి ప్రజలే కాక, యోగులు సిద్ధులు, తమ యోగశరీరముతో ఈ స్వామి దర్శనానికి వస్తారని చెబుతారు.

కొందరు సిద్ధయోగులు ప్రతిదినం నర్మదలో స్నానం చేసి ఈ స్వామిని దర్శించుకుని వెళతారట.

ఈ దేవాలయాన్ని కౌరవులు తూర్పు ముఖంగా నిర్మించి, పాండవులను గేలి చేశారట. భీముడు కోపంలో రాత్రికి రాత్రి ఈ దేవాలయాన్ని పశ్చిమం వైపుకు త్రిప్పాడని కథనం. ఈ దేవాలయం పశ్చిమంగా ముఖముతో ఉంటుంది. ఈ దేవాలయం మీద ఉన్న శిల్పసౌందర్యాన్ని వర్ణించటం సాధ్యం కాదు. ఈ దేవాలయ నిర్మాణాన్ని ‘భూమిజ’ పద్ధతి అంటారు. భూమి నుంచి వచ్చినదని అర్థం. భూమి నుంచి నిట్టనిలువుగా పాకి సాగుతాయి ఈ దేవాలయం పద్దతిలో గోడలు. వృత్తం మీద ఎనిమిది చతురస్రాలను ఉంచితే కలిగే పదహారు కోణాలను పైకి నిలువుగా శిఖరం వరకు తీసుకుపోతారు. ప్రతి కోణం మీద శిల్పాలను చెక్కి ఉంచుతారు. ఇది భూమిజ పద్ధతిలో దేవాలయ నిర్మాణం. ఈ శిల్పాలన్నీ జీవంతో తొణికిసలాడుతుంటాయి.

ఇవి రుద్రగణాలు, వీరభద్రుడు, యముడు, భైరవుడు, వినాయకుడు, ఇంద్రాణి, చండీ మొదలైనవి. అణువణువులో అందమైన విగ్రహాలతో నిలువెత్తుగా లేచిన కోణాలతో దేవాలయం కన్నులకు విందు చేస్తుందనటం అతిశయోక్తి కాదు. గర్భగుడి ముందర ఉన్న మండపం నల్లరాయి మండపం. వెనకకు ఉన్న గర్భగుడి గులాబీ రంగు ఇసుకరాయిది. అందమైన ఆ దేవాలయం ‘భూమిజ’ నిర్మాణ పద్ధతికి తార్కాణం. ఇటువంటి ఈ పద్ధతి మనం మాళ్వాలో కాకుండా మధ్యభారతంలో, మరి కొన్ని దేవాలయాలలో చూడవచ్చు. పదకొండవ శతాబ్ధంలో ఈ దేవాలయాన్ని పరమరా వంశ రాజులు బాగు చేశారట. ఈ దేవాలయం గురించి హిందూ పురాణాలలో, జైన సాహిత్యంలో కూడా చెప్పబడింది. ఈ దేవాలయం వద్ద నర్మదలో స్నానం చేసి సిద్ధేశ్వరుడిని దర్శనం చేసుకుంటే సర్వపాపాలు తొలుగుతాయని నమ్మకం.

ఈ దేవాలయాన్ని ముఖ్యమైన పండుగ రోజులలో అనగా మకరసంక్రాంతి, శివరాత్రి, గ్రహణ సమయాలలో, అమవాస్యకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి సందర్శిస్తారు. నెమావర్ వద్ద బాణలింగాలు దొరుకుతాయని పేరుంది. మేము సిద్ధేశ్వర ఆలయానికి వచ్చి ఆ సౌందర్యానికి మాటలు రాక ఉండిపోయాము. ఆ దేవాలయం సౌందర్యం అలా మనలను కట్టిపడేస్తుంది. భక్తులు ఎంతో మంది ఉన్నారు దర్శనానికి లైనులో. మేము వెళ్ళి లైన్లో నిలబడి లోపలికి వెళ్ళాము. నా ప్రక్కనున్న భక్తున్ని “ఈ దేవాలయం ఎవరు కట్టారు?” అని అడిగితే అతను “పాండవులు” అన్నాడు.

దేవాలయంలో శివుని వద్ద సంకల్పం చెప్పుకొని, నమస్కారం చేసుకొని బయటకు వచ్చాము.

ప్రక్కనే ఉన్న హనుమంతుని దర్శించి, ఆ దేవాలయ సౌందర్యం, అంత ఎత్తు నుంచి నర్మదామాయి దివ్య నడకను చూస్తూ చాలా సేపు మైమరచిపోయాము. తరువాత అక్కడ కూర్చుని నేను కొంత జపం చేసుకున్నాను.

జనం బాగా పెరుగుతుండటంతో మేము వచ్చి మా కారు ఎక్కాము. మేము వచ్చినప్పటికన్నా జనాలు బాగా పెరిగిపోయారు. నది ఒడ్డున ఇసుక వేస్తే రాలదు. కారు పార్కింగ్ లాట్లో ఇరుక్కుపొయింది. దానిని బయటకు తెచ్చుకోవటానికి దాదాపు అరగంట పైన పట్టింది. అరగంట తరువాత మేము రోడ్డు మీదకు చేరుకున్నాము.

నెమావర్ నుంచి మా తదుపరి మజిలీ వైపు సాగిపోయాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

అవధూత దర్శనం:

నెమావర్ నుంచి మా తరువాతి గమ్యం అయిన బరేలీకి వెళుతు దారిలో ఆగాము. ఆ చిన్న పల్లెలో పరుపుల షాపు వద్ద, కారణం నేను మా ప్రయాణంలో కొన్ని దుప్పట్లు పంచాలనుకున్నాను కాబట్టి. అక్కడ పెద్దసంఖ్యలో దుప్పట్లు కొన్నాము. మేము ఉంటున్న హోటళ్ళలో దుప్పట్లు బాగోలేవని రెండు రగ్గులు కూడా కొన్నాము. మళ్ళీ ప్రయాణం. అంతా వింధ్య పర్వతాల మీదుగా కాబట్టి చుట్టూ అడవి, ఘాటు రోడ్డు మీదుగా వెళుతున్నాము.

మా ప్రయాణం మొదట్లో నేను అనీల్‌ను (మా డ్రైవర్‌ను) అడిగాను “మధ్యప్రదేశ్ స్వీట్స్‌కు ప్రఖ్యాతని విన్నాను, నిజమేనా?” అని

అతను “అవును” అన్నాడు. కాని ఎక్కడ మంచి స్వీట్స్ మేం తిన్నదే లేదు. సగం ఆరోగ్యం బాగోలేక, సగము మాకు తెలియక, స్వీట్స్ అంటే విముఖత వలన. కాని అనిల్‌కు గుర్తుంది నేను అడిగిన విషయం. అతను నెమావర్ నుంచి బరేలీ వెళుతుండగా ఒక చోట ఆపాడు. ఆ పట్టణం పేరు అబ్దుల్లాగంజ్. రోడ్డు ప్రక్కగా ఆపి, రోడ్డుకు మరో వైపు ఉన్న దుకాణం చూపించి “దీదీ! అక్కడ ఉత్తమమైన మిఠాయి దొరుకుతుంది. మీరు రుచి చూడాలి…” అన్నాడు.

నేను నవ్వాను. ఇతనికి గుర్తు ఉన్నదే!! అన్న భావనతో.

శ్రీవారు కూడా అతనితో కలిసి రోడ్డు దాటి ఆ మిఠాయి దుకాణంలోకి వెళ్ళారు.

నేను తల ఎత్తి బయటకు చూస్తుంటే ముగ్గురు చిన్న పిల్లలు కారు దగ్గరకు తడుముతు వచ్చారు. వారు అంధులులా ఉన్నారు. పాపం అడుక్కుంటున్నారు. వారికి చేతులలో బిస్కెట్లు పెట్టాను. వారు కారు దగ్గర్నుంచి రోడ్డు దిగి ప్రక్కన ఉన్న గట్టు దగ్గర కూర్చున్నారు. వారి ప్రక్కన ఒక పిచ్చివాడులా ఉన్న మనిషిని గమనించాను. అతను మట్టితో నల్లబడిన పీలికలు లాంటి చొక్కా ప్యాంట్ ధరించాడు. జుట్టు అట్టలు కట్టి వేలాడుతోంది. అది కాదు నన్ను ఆకర్షించింది. ఆయన ముఖము, ముఖ్యంగా ఆ కళ్ళు. ఆ ముఖం కాంతివంతంగా ఉంది. ఆ కళ్ళలో వెన్నెల లాంటి కాంతితో ఉంది. గడ్డం మీసం మట్టిగా లేవు చాలా శుభ్రంగా ఉంది. పెదవుల మీద చిరునవ్వు.

ఆశ్చర్యంతో నాకు నోట మాట రాలేదు. ‘వీరు అవధూత’ అని లోలోపల ఏదో కంఠం పలికింది. కళ్ళు ఒక్కసారి ఆర్పి మళ్ళీ కళ్ళతో నవ్వారు వారు. నా వల్ల కాలేదు. వెంటనే ప్రక్కన ఉన్న ఆపిల్ పండును, బిస్కెట్ ప్యాకెట్ తీసుకు కారు దిగాను.

ఆయన వద్దకు వెళ్ళి ఇవి ఆ స్వామి చేతులలో పెట్టి “నర్మదే హరే!” అని నమస్కారం చేశాను.

చప్పున తీసుకొని చొక్కా లోపల దాచేసుకున్నారాయన. చేతులలో ఒక కొత్త గోనపట్టా చుట్టతో ఉన్నారు. మళ్ళీ కళ్ళతో నవ్వారు ఆయన. నేను కళ్ళు తిప్పుకోలేక పోతున్నా. ఆ ముఖంలో ఉన్న ఆకర్షణకు.

ఇంతలో అనిల్ వచ్చాడు. చేతిలో గులాబ్‌జాముతో.

“తీసుకో దీదీ!” అన్నాడు.

వేడి వేడి గులాబ్‌జాము.

శ్రీవారు వెనకే వస్తూ “తిను” అన్నారు.

నేను కొద్దిగా ముక్క తీసుకొని తిని “చాలు…” అన్నాను.

శ్రీవారు “నేనే తింటాను…” అని తీసుకు తిన్నారు.

నేను శ్రీవారుతో “ఆ దుప్పటి ఆయనకివ్వు…” అని చెప్పాను.

శ్రీవారు కారు వెనక నుంచి కొత్తగా కొన్న దుప్పట్లు నుంచి ఒకటి తీసి ఆయన వద్దకు వెళ్ళారు.

ఆ స్వామి చేతులు అడ్డంగా ఊపారు, కాని దుప్పటి తీసుకోలేదు.

“ఆ పిల్లలకు ఇవ్వు. దానం చేద్దామనుకున్నది వెనకకు తీసుకురాకు…” చెప్పాను.

ఆ పిల్లలు ఆ దుప్పటి తీసుకున్నారు.

శ్రీవారు కారు ఎక్కుతుండగా నేను శ్రీవారుతో “చూడు ఆయనను. ఎంత బావున్నారో…” అన్నాను నమస్కరిస్తూ. తను కూడా చూసి ఆశ్చర్యంతో “అవును భలే ఉన్నాడు గదా!!” అన్నారు. నేను భక్తితో నమస్కరించాను.

ఆ చిరునవ్వు, కళ్ళతో నవ్వుతున్న ముఖము చాలా సేపు నా వెంట వచ్చింది.

తరువాత నేను ఈ విషయం మర్చిపోయాను. మా పూజ్యగురువులను కలిసినప్పుడు వారు మమ్ములను అడిగారు “నర్మదా పరిక్రమలో యోగులు కనపడుతారు. మీ కెవరైనా కనపడ్డారా?” అని.

యోగులంటే కాషాయంబరధారులన్న ఆలోచనలో తల అడ్డంగా ఊపాం. తరువాత ఆలోచిస్తే ఈ స్వామి ముఖం గుర్తుకు వచ్చింది. వారికి ఈ విషయం చెప్పాను.

అటు పై మేము బర్నానది ప్రక్కగా ప్రయాణం చేశాము. ఈ నది ఒక పెద్ద సరస్సు నుంచి ప్రవహిస్తుంది. దారిలో అద్భుతమైన కొండలు, కోనల మీదుగా సముద్రమంతటి ఈ బర్నా సరస్సు. బర్నా సరస్సు అతి పెద్ద సరస్సు వింధ్య పర్వతాలలో. ఒక వైపు లోపలికి వెళితే మనకు ఒక జలపాతం కూడా ఉందిట. ఈ నది రోడ్డు మీదుగా చూస్తుంటే సముద్రంలా అంతు లేకుండా ఉంది. దిగంతాలకు వ్యాపించిన క్షితిజరేఖను గుర్తు పట్టలేకపోయాము. దానిని చూస్తూ కొంతసేపు మైమరిచాము. ప్రకృతిని, సృష్టించిన పరమాత్మను తలచుకొని నమస్కరించుకున్నాం. మధ్యప్రదేశ్, వింధ్య పర్వతాల సౌందర్యం తప్పక చూడాలి జీవితంలో ఒక్కసారైనా. ఈ సరస్సు బరేలీ చేరే ముందు వస్తుంది. బరేలికి మేము మధ్యాహ్నం రెండు కల్లా చేరిపోయాము.

మా హోటలుకు చేరి మా బట్టలను ఉతుకున్నాను. నా పారాయణం పూర్తి చేసి సాయంత్రం నర్మదా అర్చనం చేసి హారతి ఇచ్చాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

ఎనిమిదవ రోజు

మరుసటి రోజు ఉదయమే తిరిగి నర్మదామాయి సేవ కోసం ‘ఉదిపురా’ వైపు సాగాము. ‘ఉదిపురా’ బరేలీకి పాతిక కిలోమీటర్లు. ఉదిపురా దగ్గరగా ఉన్న నర్మదా తీరం ‘రెసన్’ అన్న చిన్న గ్రామం. అక్కడ మేము నర్మదను సేవించుకోవాలి ఆ రోజు.

ఆ గట్టు మీద ఉన్న చిన్న చెక్క బల్ల పైన కూర్చొని మా మామూలు విధివిధానంలో నర్మదామాయిని సేవించాము మూడు మునకల తరువాత. మా పూజాంతరం ప్రతి రోజు లాగా కొంత ధనం మాయికి సమర్పించి అవి పంచటము మొదలుపెట్టాము.

మా దగ్గరగా ఆ తీరాన్ని ఒక వృద్ధుడు శుభ్రం చేస్తున్నాడు. ఆయన కర్రకు చీపురు కట్టి చిమ్ముతున్నాడు.

నేను ఆయన దగ్గరకు వెళ్ళి, “బాబా! తీసుకో” అన్నా పది రూపాయల నోటు ఇస్తూ….

ఆయన నా వైపు చూసి నవ్వి “వద్దు…” అన్నాడు.

నేను ఆశ్చర్యంగా చూస్తు ఉంటే ఇలా అన్నాడు, “నర్మదామాయి మన మాయి. నిన్నటి అమావాస్య స్నానాలకు వచ్చి ఇక్కడ చెత్త చేసి పోయారు. మాయిని శుభ్రం చెయ్యటం మన అందరి పని. నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. నాకెందుకు డబ్బు?” అన్నాడు నా ముఖంలో ముఖం పెట్టి.

వృద్ధుడాయన. కాని ఆ ముఖంలో వెలుగు. కళ్ళలో తృప్తి కనపడుతున్నాయి.

నాతో దూరంగా శుభ్రం చేస్తున్న కుర్రాళ్ళని చూపెడుతూ, “వాళ్ళని నేనే పనికి పెట్టి శుభ్రం చెయ్యమన్నాను. ఈ ఘాట్ శుభ్రం చేసేస్తాము ఈ రోజు…” అన్నాడు.

నర్మదామాయి మీద ఉన్న భక్తికి, ప్రకృతి మీద ఉన్న బాధ్యతకు ఆయన మీద భక్తి కలిగింది. ఎంత మంది నేటి యువతరం ఇంత బాధ్యతగా ఉంటారు తన చుట్టూ ఉన్న ప్రకృతిపై.

నేను ఆయనకు నమస్కారం చేసి “బాబా! నీవు నర్మదామాయివి. దయతో ఈ పది రూపాయిలు తీసుకొని నన్ను అనుగ్రహించు…” అన్నాను వేడుకోలుగా.

ఆయన నవ్వి తీసుకున్నాడు. మరోవైపు దానం చేస్తున్న శ్రీవారు నేను మాట్లాడటం చూసి దగ్గరకు వచ్చారు. ఆయనకు చెబితే, ఆ తాత మీద శ్రీవారికి భక్తి కలిగింది. ఆయనకు నమస్కరించి ఆయన అనుమతితో ఆయన ఫోటో తీసుకున్నాము.

ఈయన అమ్మవారి రూపం అనుకొని, నర్మదామాయి లీలను గ్రహించి ఆశ్చర్యపోయాను.

జపం తరువాత ఆ ఘాట్‌లో పార్కింగు వైపు వెళుతు చాలా మంది కుర్రకారు ఘాటును శుభ్రం చేస్తూంటే చూసి ఆయన చేయిస్తున్న విషయం మళ్ళీ తలుచుకున్నాను. ఆ ఘాట్ చాలా పెద్దది. మరో వైపు మరో వింత వ్యక్తిని చూశాను.

ఆయన వేగంగా వెళ్ళిపోయాడు. చేతులో కర్ర, తలకు కాషాయ వస్త్రం కట్టుకున్నాడు. నడుముకు పాత దుప్పటి. తెల్లని జుట్టు. జంధ్యం. మెడలో రుద్రాక్షలు. వెలుగుతున్న ముఖంతో ఉన్నాడు. అందే దూరంలో లేడు. నేను చూసి దూరం నుంచే నమస్కరించా. ఫోటో తీసుకున్నా. ఇంతలో ఎటు వెళ్ళాడో కనపడలేదు.

నర్మద మాయి ఏ రూపంలో నైనా వస్తుందంటారు. ఇలా సాధువుల రూపం కూడానా? తెలియదు.

నర్మద ఒడ్డుకు ఋషులు జపం చేసుకుంటారని కూడా అంటారు. ఎవరు ఏ రూపంలో వచ్చి ఉన్నారో తెలియటమే లేదు కదా. నర్మదామాయి నమ్మినవారి కొంగు బంగారం. ఆధ్యాత్మికతను పెంచే, పంచే తల్లి. ఆమె ఒడిలో ఉన్నప్పుడు ప్రతి రోజూ విచిత్రమే! ప్రతిరోజు ఒక అద్భుతమే!!

మేము అక్కడినుంచి బర్మన్ ఘాటుకు వచ్చాము. ఈ ఘాటు నర్మద తీరంలో ఉన్న ముఖ్యమైన ఘాట్లలో ఒకటి. నర్మదా దేవాలయంతో పాటు ఆ ఘాట్ నుంచి నర్మదలో ఒక నాలుగు పర్లాంగుల దూరంలో దీవి మీద పెద్ద శివుని విగ్రహం, పురాతన శివాలయం ఉన్నాయి. మేము ఈ ఒడ్డు నుంచే నమస్కరించుకోవాల్సి వచ్చింది. నర్మదామాతకు నమస్కరించుకున్నాం. మెట్లు దిగి ఘాట్ వద్దకు వెళ్ళి నర్మద జలం మార్చుకున్నాం.

నేను నర్మదా నదిలో నిలబడి కొంత జపం చేసుకున్నాను.

తీరం వెంట ఎన్నో చిన్న దేవాలయాలతో పాటు రకరకాల షాపులు, హడావుడిగా ఉంది ఆ ఘాట్. మేము మా జపం కానిచ్చి ఒడ్డు పైకి వచ్చాం. మా కారు ఎక్కి తరువాతి గమ్యస్థానమైన బేడాఘాటుకు వెళ్ళాం.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

బేడాఘాట్

మా బస చెయ్యాల్సిన హోటల్ టూరిజం వారిది జబల్‌పూర్‌లో ఉంది. మా మధ్యాహ్న భోజనం కోసం మేము బేడాఘాట్ వద్ద ఆగాము. బేడాఘాట్ జబల్‌పూర్‌కు 20 కిలోమీటర్లు దూరం. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత పాలరాయి కొండల మధ్య నుంచి నర్మదామాయి ప్రవహిస్తుంది. ఈ కొండ మధ్యగా ప్రవహిస్తూ ఒక చోట దాదాపు 96 అడుగుల ఎత్తున క్రిందికి దుముకుతుంది. ఆ జలపాతాన్ని ‘డౌన్దర్’ జలపాతమంటారు.

జబల్‌పూర్‌ మధ్యప్రదేశ్‌లో ముఖ్యమైన నగరం. ఘనమైన చరిత్ర గల ఈ నగరం నర్మద ప్రక్కనే ఉండటం, ప్రపంచ ప్రఖ్యాత పాలరాయి కొండల మధ్యగా ప్రవహించటం వలన ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోంది. చక్కటి ఆధునిక రవాణా సౌకర్యాలు, మంచి వసతి, ఎయిర్పోర్ట్ వలన కూడా ఈ నగరం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఈ నగరంలో చూడవలసిన ప్రదేశాలు కోకొల్లలు. చారిత్రాత్మక, ఆధ్యాత్మిక కట్టడాలతో ఉన్న ఈ నగరంలో మేము మా పరిక్రమ మూలంగా ఒక్క రోజు ఆగగలిగాము.

మాకు ముందు బస బేడాఘాట్‌లో ఏర్పాటుచేశారు. కాని మా డ్రైవర్ అటు వెళ్ళకూడదని జబల్‌పూర్‌ లోకి మార్చాడు. అతని వాదన బేడాఘాటు ప్రక్కన పారుతున్న చిన్న పాయ నర్మదానది యని. మేము ముందుగా గ్రహించిన సమాచారం బట్టి అది నర్మద కాదు. చిన్న ఉపనది పాయ. పైగా అది ఎండిపోయి ఉంది. కాబట్టి వెళ్ళవచ్చని మేము అనిల్‌ను బలవంతపెట్టాల్సి వచ్చింది.

మమ్మల్ని బేడాఘాటు టూరిజం వారి హోటల్‌కు మధ్యాహ్నం భోజనానికి తీసుకుపోయాడతను.

ఆ హోటల్ పాలరాయి కొండలను చూస్తూ ఉండే విధంగా కట్టబడి ఉంది. మేము కూర్చొని భోజనం ఆర్డర్ చేసి బయటకు చూస్తే అద్భుతమైన ఆ పాలరాయి సొగసుల మధ్య నర్మద సుందరంగా కనిపించింది. ఇది టూరిజం వారిదేగా? ఎందుకు మనకు ఇక్కడ బస ఏర్పాటు చెయ్యలేదు వీరు? అని మేము కొంత ఆశ్చర్యపోయాము.

శ్రీవారు జబల్‌పూర్‌లో వద్దని ఇక్కడే ఉండాలని నిశ్చయించారు. ఆయన వెంటనే వెళ్ళి గదులు దొరుకుతున్నాయో చూసి ఉందని చెప్పగానే బుక్ చేసేశారు. నాతో “ఇలాంటి చోట నర్మద ప్రక్కన ఉండాలి ఊళ్ళో కాదు…” అన్నారు.

నాకు అలాగే అనిపించింది. మాకు ఈ హోటల్ చార్జ్ అదనంగా మేము కట్టి అక్కడ ఉండాల్సి వచ్చింది. మేమే తీసుకున్నాము కాబట్టి.

మేము అక్కడ హోటల్‌లో సెటిల్ అయి, మధ్యాహ్నం నర్మదా తీరంకు వెళ్ళాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

పాలరాతి కొండలు

పాలరాయి కొండల మధ్య పడవ ప్రయాణం అక్కడి ఆకర్షణలలో ఒకటి. ఇద్దరికే అంటే మళ్ళీ ఎక్కవే ధర. పైగా వాళ్ళ ఆ కొండలలో లోపలి వరకు వెడితే ఒక ధర, బయట చూసి వస్తే మరో ధర. అంత వరకు వెళ్ళి మనం చూడకుండా రాము కదా!!!

ఆ బోట్ వారు ఈ పాలరాయి గురించి వివరించే పద్ధతి ప్రాసతో కూడిన పాటలా ఉంది. ఇక్కడ అదో ముఖ్య ఆకర్షణ అట. వాళ్ళ పాటలు, మాటల మధ్య నర్మద మీద ఆ బోట్ ప్రయాణం అద్భుతం.

అక్కడ వెన్నెల రాత్రులు, వెన్నెల పాలరాయి మీద ప్రతిబింబించి నర్మదలో ప్రతిబింబం పడుతుందట. నర్మద వెండి జలతారులా, పాదరసంలా ప్రపహిస్తుందట. ఆ రాత్రి బోట్‌లో ప్రయాణానికి ఎక్కడెక్కడివారో వస్తారట. అది ప్రతి ఒక్కరికి జీవితకాలపు మధురమైన జ్ఞాపకం మిగులుతుందని చెప్పారు. అక్కడ నర్మద ప్రవహించటంలేదు. నిశ్చలంగా తటాకంలా ఉంది. కారణం అక్కడ నది మూడు వందల అడుగుల లోతుగా ఉందని చెప్పారు.

ఎత్తైన ఆ కొండల మీద కొందరు కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళు నీళ్ళలోకి దూకి బోట్ ఎక్కతారట. అలా చేసినందుకు వాళ్ళకు యాభై రూపాయలని చెప్పారు. అలాంటి ఫీట్స్ వద్దని చెప్పి మేము పడవ విహారం అయ్యాక తీరానికి వచ్చాం. శ్రీవారు వారికి అడిగిన దాని కన్నా ఎక్కువ ఇచ్చి, తన సంతృప్తిని చూపెట్టారు.

బేడాఘాట్‌లో మెట్లు అన్ని ఎక్కి మళ్ళీ పైన గట్టు మీదకు వచ్చాము. ఎక్కడ చూసిన పాలరాయి బొమ్మల దుకాణాలు. ఈ కొండలు ముట్టుకోకూడదట. ఇక్కడికి రాజస్తాన్ నుంచి పాలరాయి దిగుమతి చేసుకొని ఇక్కడ రకరకాల బొమ్మలు, శివలింగాలు, జైన గురువుల రూపులు, దేవుని మండపాలు చెక్కుతున్నారు.

మేము అటు నుంచి డెరారమ్ జలపాతం చూడటానికి వెళ్ళాము. అక్కడ జలపాతం మీద కేబుల్ కారు ఉంది. ఎంతో మంది పర్యాటకులతో కిటకిటలాడుతోంది ఆ ప్రదేశం. మేము దూరం నుంచి చూసి వచ్చేశాం.

మేము బస చేసిన వసతి ప్రక్కనే బేడాఘాట్ ప్రఖ్యాత చౌసాత్ యోగిని దేవాలయం ఉంది.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

చౌసాత్ యోగినీ దేవాలయం

చౌసాత్ అంటే అరవైనాలుగు అని అర్థం. అరవై నాలుగు యోగినుల దేవాలయం అని పేరు. ఈ అరవై నాలుగు యోగినుల పూజ వారణాసిలో చూశాను. ఒక ఘాట్కి చౌసాత్ యోగినీ ఘాట్ అని పేరు. అక్కడ విగ్రహాలు కూడా ఏమి అనేని ఉండవు.

ఇక్కడ ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. యోగినీ పూజలకు, స్త్రీ దేవతల పూజలకు ప్రఖ్యాతమైన పద్ధతులలో ఈ చౌసాత్ ముఖ్యమైనది. ఈ దేవాలయం గుట్ట మీద ఉంది. గుట్ట ఎక్కటానికి మెట్లు దాదాపు 300 ఉన్నాయి. నా పట్టేసిన కాలును ఈడుస్తూ నేను నెమ్మదిగా ఆ కొండ ఎక్కాను. ఆ ఎక్కడం పరమ ఉత్తమమైన పని. లేకపోతే అద్భుతమైన ఆ దేవాలయాన్ని దర్శించలేకపోయేదానిని.

ఎన్నో ప్రముఖమైనవి ఈ దేవాలయంతో ముడి పడి ఉన్నాయి.

ఈ దేవాలయాన్ని “గోలకీ మట్” అని కూడా అంటారు. కారణం ఈ దేవాలయం కట్టడం వృత్తాకారంలో నిర్మించారు. మధ్యలో గర్భగుడి, ముందర మండపం, చుట్టూరా వృత్తాకారంలో వరండాలు. వాటిలో యోగినులు. యోగినుల నిలువెత్తు విగ్రహాలు, అవి మొత్తం దాదాపు తొంభై వరకు ఉన్నాయి. అందమైన విగ్రహాలు అయినా అన్నింటిని ముస్లిం దండయాత్రలో విరగ్గొట్టారు. కేవలం రెండు మాత్రం సరిగ్గా పూర్తిగా ఉన్నాయి.

అమ్మవారి పరివార దేవతలైన వీరిని మనం ఖడ్గమాలలో సేవించుకుంటాము. మధ్యలో ఉన్న గుడిలో శివపార్వతులు నంది మీద కూర్చొని ఉన్నారు. ఈ దేవాలయం 11వ శతాబ్దానికి చెందినది. దీనిలో ఉన్న శివపార్వతులు పురాతనమైనవారు. శివపార్వతుల మీద ఒక కథ వ్యాప్తిలో ఉంది.

ఇక్కడ దగ్గరలో ఉన్న పల్లెలో ఉన్న ఒక శివ భక్తుడు శివునికై తపస్సు చేశాడట. శివుడు సంతోషపడి ప్రత్యక్షమయ్యాడు. శివున్ని చూసిన ఆ భక్తుడు సంతోషపడ్డాడు. “దేని కోసము నీ తపస్సు? ఏం కావాలి నీకు?” అని శివుడు అడిగితే, “నా కోరిక తరువాత, నిన్ను మా ఊరి ప్రజలు అందరూ చూడాలి. కాబట్టి ఇక్కడే ఉండు. అందర్ని పిలుచుకు వస్తాను” అని ఆ పల్లెవాడు కొండ దిగి ఊరులోకి వెళ్ళాడు.

శివుడు కదలక అక్కడే నిలబడిపోయాడు.

ఎంత సేపటికి ఈ పల్లెవాడు రాడు. శివుడి కోసం పార్వతీదేవి కైలాసం నుంచి వస్తుంది. శివుడు జరిగింది చెప్పి, “అతను వచ్చాక ఇద్దరం కలిసి వెళదాం” అంటాడు.

ఇక శివ పార్వతులు ఎదురు చూస్తూ ఒక రాత్రి గడుపుతారు. ఉదయం అయినా పల్లెవాడు రాడు. శివుడు పార్వతితో “నీవు నా శిల్పం చెక్కు, నేను నీ శిల్పం చెక్కతాను. దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మనం పోదాం!” అంటాడు.

సరే అనుకొని ఇద్దరూ కలిసి ఒకరి శిల్పం ఒకరు చెక్కి, నంది శిల్పం మీద ప్రతిష్ఠింపచేసి, నంది వాహనమెక్కి కైలాసం వెళ్ళిపోతారు. కొద్ది కాలం తరువాత వచ్చిన పల్లెప్రజలు అక్కడ జీవం ఉట్టి పడుతున్న శివపార్వతులను చూసి సంతోషపడుతారు. వారు అక్కడ దేవాలయం నిర్మించారని కథనం.

మాకు పూజారిగారు ఆ దేవాలయం శాతవాహన రాజు కట్టించాడని చెప్పాడు. కాని మనకు ఈ దేవాలయం గురించి చరిత్ర పుస్తకాలలో శోధిస్తే ఈ దేవాలయం కాలచూరి వంశానికి చెందిన రెండవ యువరాజు కట్టించాడని ఉంది.

ఈ దేవాలయం ‘భూమిజ’ పద్ధతిలో నిర్మించారు. దేవాలయం పైన శిల్పాలు లేవు. వృత్తాకార వరండా, మధ్యలో గర్భగుడితో కూడిన మండపం, ధ్వజస్తంభము, దాని వద్ద శివలింగాలు, నంది, నాగులు.

గుడి బయట ఒక భూగర్భ మందిరం ఉంది. అందులో ఎవరో నివసిస్తున్న ఛాయలు కనిపించాయి. ఆ భూగర్భ మందిరానికి పైన మెట్లు. ఈ మెట్లు దేవాలయం లోపలికి మనలను తీసుకుపోతాయి.

ఆ దేవాలయంలోని యోగినీ మాతల సౌందర్యం మనలను మరో లోకానికి తీసుకుపోతాయి. ఎంత పగలకొట్టినను, ఆ అద్భుతమైన శిల్ప సౌందర్యం తెలుస్తూనే ఉంది. యోగినుల పైభాగము నగ్నంగా ఉండి, క్రిందన ఒక వస్త్రంతో ఉన్నాయి. వాటికి నగలు చక్కటి తీరుగా, వివరంగా ఉన్నాయి. కిరీటాలు, చెవులకు కుండలాలు, చేతుల దండకడియాలు, మెడలో నగలు, నడుముకు వడ్డాణం,కాళ్ళకు ఆభరణాలు చాలా సవివరంగా చెక్కి ఉన్నాయి. ఎత్తైన గుండెలతో సన్నని నడుముతో విగ్రహాలు చూడముచ్చటగా కనిపిస్తాయి. వీటి వివరణ చూస్తుంటే మనకు ఆనాటి శిల్పుల మీద గౌరవం తప్పక కలుగుతుంది. ప్రతి యోగినికి సేవలు చేస్తున్న చిన్న దేవతలను కూడా మనం వారితో పాటు చూడవచ్చు. వారి వాహనమైన వారిని మనం చూడవచ్చు. ఏ ఒక్క యోగిని చేతులలో ఏముందో తెలియదు. చేతులన్నింటిని ఖండిచబడ్డాయి. యోగినులను పరిశీలిస్తే వాటి డిటైలింగు ఆశ్చర్యం కలిగిస్తుంది.

మాతృకా పూజలు ఆ కాలంలో హెచ్చుగా ఉండేవి. దక్షిణ భారతదేశం లోని సప్తమాతృకా పూజలు కూడా ఈ కోవకు చెందినవే. చూపరులను కట్టిపడేసే ఆ దేవాలయం పరమ శాంతంగా ఉంది. శుభ్రంగా కూడా ఉంది.

మేము చుట్టూ తిరిగి చూసి, లోపల పూజ చేసుకొని వచ్చాము. కొందరు భక్తులు వచ్చి బయట శివ లింగం వద్ద భజన మొదలెట్టారు. మేము కూడా వారితో కూర్చుని భజన చేశాము. పశ్చిమాన కెంజాయి రంగులో ఆకాశం మారింది. ఆ లేత కాషాయ రంగు, కోవెల మీది మకరతోరణం, మరకతంలా మెరుస్తున్నాయి.

అత్యంత ప్రశాంతమైన సమయం మాకు అనుభవంలోకి వచ్చింది. కొంత సేపటికి భక్తులు భజన ఆపి వెళ్ళిపోయారు.

మేమిద్దరము ఒక ప్రక్కన ఆ ధ్వజస్తంభం దగ్గర ప్రశాంతంగా ధ్యానంలో నిమగ్నులమయ్యాము. ఎంత సమయం గడిచిందో తెలియదు. పూజారిగారు వచ్చి ఇక వెళ్ళిపొమ్మని దేవాలయం మూస్తున్నారని చెప్పాడు. ఇద్దరం లేచి మా సామాను పట్టుకుని క్రిందికి వచ్చేశాము. మా బస ప్రక్కనే ఉంది. నడిచి బసకు వచ్చాము.

ఆ సుందరమైన భావన, యోగినీ మాతల అనుగ్రహం హృదయం నిండుగా ప్రవహించి ఆనాటి సాయంత్రం ప్రకాశింపచేసింది.

రాత్రి తొలిపొద్దు అంటే ఏడు ఎనిమిది మధ్య, హోటలు బసలో బాల్కనీ నర్మదానది మీదుగా ఉంది… అక్కడ నర్మదను పూజించి హారతి ఇచ్చాము.

అమ్మను సేవించి, కొంత సుందరకాండ చదువుకొని రోజు ముగించాము.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

తొమ్మిదవ రోజు

“త్వదమ్బులీనదీనమీనదివ్యసమ్ప్రదాయకం

కలౌ మలౌఘభారహారిసర్వతీర్థనాయకమ్।

సుమచ్ఛకచ్ఛనక్రచక్రవాకచక్రశర్మదే

త్వదీయపాదపఙ్కజం నమామి దేవి నర్మదే॥”

నీ యందు నివశించు మొసళ్లకు, చక్రవాకపక్షులకు సుఖమునిచ్చు ఓ దేవీ! నర్మదాదేవీ! నీలో ఉన్న చేపలుకు కూడా దివ్యత్వమును కలుగచేయునది, కలికాలదోషాలను హరించు పుణ్యతీర్థములకు ప్రభువైనది అగు నీ పాదపద్మమును నమస్కరించుచున్నాను.

బేడాఘాట్‌లో మా ఉదయం కార్యక్రమం పూర్తి చేసుకొని సరస్వతి ఘాట్‌కు స్నానానికి, నర్మదామాయి పూజకు వచ్చాం. అది చాలా ఉదయం. బహుశా ఆరు అయి ఉంటుంది. నది వద్ద పెద్ద శుభ్రంగా ఏమిలేదు. కాని మెట్లతో ఉన్న ఘాట్. దిగి వెళ్ళి నర్మదామాయికి నమస్కరించాం. నర్మదామాయి చాలా చల్లగా ఉంది. బహుశా ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు మించి ఉండదని ఫోనులో చూపెడుతోంది. మేము సంకల్పం చెప్పి నదిలో మునిగాం. నేను చాలా సేపు జపం చేస్తూ ఉండిపోయాను. అటు పై గట్టుకు వచ్చి నర్మదామాయికి పూజ, హారతి చేసుకున్నాం.

నా మజిల్ క్రేమ్ప్‌లు తగ్గటం లేదు. పైపెచ్చు అదనం ఈ కాలుతో నడక, కార్‌లో కూర్చోవటం రెండు కష్టంగా ఉన్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నాయి కూడా చల్లటి నీళ్ళకు పెరుగుతోంది కూడా. ఒడ్డున ఉన్న ఆవులకు ఆహారం వేసి ఆ సూర్యోదయాన బేడాఘాట్ నుంచి బయలుదేరాం.

జబల్‌పూర్‌

జబల్‌పూర్‌కు ఆ పేరు ‘జామాలి మహర్షి’ ద్వారా వచ్చిందని పురాణ కథనం. ఈ నగరం పురాతనమైనది. దీనిలో ఉన్న దేవాలయాలు రామాయణ కాలం నాటివి. అందున ముఖ్యంగా గుప్తేశ్వర మహాదేవుని ఆలయం రామునిచే ప్రతిష్ఠించబడినదట. రామాయణంలో ఉన్న కథనం ప్రకారం, శ్రీ రాముడు లక్ష్మణునితో కలిసి సీతాదేవిని వెతుక్కుంటు నర్మదా తీరానికి వచ్చారు. అక్కడ జామాలి ఋషిని దర్శించుకోవటానికి వెతుక్కుంటారు.

నర్మదకి ఉత్తర తీరాన ఉన్న ఋషిని దర్శిస్తారు. రాముడు ఇసుకతో లింగం చేసి నర్మదా జలంతో అభిషేకం చేస్తు కొంత కాలం గుప్తంగా తపస్సు చేస్తాడు. మహాదేవుడు సంతోషించి ప్రత్యక్ష్యమవుతాడు. ఇక్కడే ఆదిశక్తి శ్రీరామునికి వరానిచ్చింది. అప్పటి నుంచి ఈ శివలింగానికి గుప్తేశ్వర లింగమని పేరు. అమ్మవారు ఈ లింగంలోనే జ్యోతి రూపంలో ఉంటుంది. ఇది జబల్‌పూర్‌లో చూడవలసిన దేవాలయం.

జబల్‌పూర్‌ చాలా ముఖ్యమైన నగరంగా చరిత్రలో పేరుంది. ఈ నగరాన్ని మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు పరిపాలించారు.

గోండుల పరిపాలన ఈ నగరాన్ని సువర్ణక్షరాలతో లిఖించబడేలా చేసింది. గోండులు ఆదివాసులు. వారి ఎదుగుదల, రాజ్యం, చరిత్రలో వారికి శాశ్వత స్థానాన్ని ఇచ్చింది. గోండులు మొదట అడవులలో ఉండేవారు. వారిలో ‘మదన్ షా’ బలమైన గోండు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. జబల్‌పూర్ లోని ఒక గుట్ట మీద ఉన్న రాయి మీద చిన్న కోట నిర్మించి పాలించేవాడు. అది మనము నేటికి జబల్‌పూర్‌లో చూడవచ్చు.

వారిలో ‘దలపత్ షా’ అనే గోండురాజు రాజపుత్రులైన ‘చెండెల’ రాజుల పుత్రిక దుర్గావతిని వివాహం చేసుకున్నాడు. ఆమె తన వివాహ అనంతరం గోండు రాజ్యానికి తరలి వచ్చింది. గోండు రాజు ‘దలపత్ షా’ కొంతకాలం పరిపాలించిన తరువాత మరణిస్తాడు. రాణి ‘దుర్గావతి’ కుమారుడు ‘నారాయణ’ అప్పటికి చిన్నవాడు. కొడుకును సింహాసనం పై కూర్చోబెట్టి రాణి దుర్గావతి రాజ్యాన్ని పాలించింది.

ఆమె పరిపాలన దక్షత వలన గోండు రాజ్యం సుసంపన్నమైంది. తన రాజ్య కాలంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజా క్షేమమే ధ్యేయంగా పరిపాలన చేసింది రాణి. ఆమె సమయంలో గోండుల కాలం స్వర్ణయుగం.

ఆనాడు ఢిల్లీని మొఘల్స్ పరిపాలించేవారు. అక్బర్ ఆనాటి రాజు. అక్బరుకు ఉన్న రాజ్య కాంక్షతో రాజ్యాన్ని విస్తరించే పనిలో ఉండేవాడు. సంపన్నమైన గోండుల రాజ్యం పైకి తన సైన్యాన్ని పంపాడు అక్బరు. రాణి తన రాజధానిని కొండలపైన చిన్న గ్రామానికి మార్చింది. ‘కటంగా’ అన్న రహదారి గుండా ఆ గ్రామం చేరాలి కాబట్టి ఆ రాజధానిని ‘కటాంగా’ అని పిలిచేవారు. ఈ రాజధాని సాత్పురా పర్వతాలలో చాలా విశేషమైన ప్రదేశంలో ఉంది. దానిని చేరటం సులభం కాదు. సన్నని దారి, ఎతైన పర్వతాలు, మరో వైపు నర్మదా నది వల్ల ఆ రాజధానికి చాలా రక్షణ ఉంది.

అక్బర్ సేనాని అఫ్సర్ ఖాన్ మాళ్వా పైకి దండెత్తి వచ్చి, ముందు బజ్ బహదూర్‌ను చంపి మాళ్వాను హస్తగతం చేసుకున్నాడు. రాజ్యకాంక్ష తీరని అక్బర్ గోండు రాజ్యంను జయించమని కబురు పంపుతాడు. అక్బర్ సేనాని గోండు రాజ్యం పైకి దండెత్తి వస్తాడు. రాణీదుర్గావతి కొండ పైన నిలిచి, తక్కువ సైన్యంతోనైనా యుద్ధం చేస్తుంది. రాణి దుర్గావతి ఆ యుద్ధంలో మొఘల్ సైన్యాన్ని తిప్పికొడుతుంది.

ఒక సారి ఓడిపోయిన మొగలుల సైన్యం తరువాత మరింత మంది సైన్యంతో రెండవ సారి వచ్చి మళ్లీ ఓడి వెనకకు మరలుతుంది. ఈ అవమానం భరించలేక అక్బర్ ఫిరంగులను పంపుతాడు.

మూడవ సారి యుద్ధంలో రాణి తన సైన్యాధ్యక్షుడిని కోల్పోతుంది. ఇక తానే ముందు నిలిచి సైన్యాన్ని నడుపుతు యుద్ధం చేస్తుంది. కొడుకు నారాయణ యుద్ధం చేస్తూ గాయపడతాడు.

యుద్ధం ఆపక రాత్రి కూడా చేద్దామంటే, ఆమె మంత్రులు అది ధర్మం కాదని వారిస్తారు.

మరునాటి యుద్ధంలో రాణి తీవ్రంగా గాయపడుతుంది.

ఆమెను యుద్ధరంగం నుంచి వైదొలగమంటే ఒప్పుకోక యుద్ధంలోనే వీరమరణం పొందుతుంది.

ఆమె అక్బరును ఓడించిన రాణిగా చరిత్రలో నిలబడిపోయింది.

భారతదేశ చరిత్రలో పేర్కొన్న ‘వీర స్త్రీ మూర్తులలో రాణీ దుర్గావతి’ ఒకరు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమె పేరు మీద పోస్టల్ స్టాంపు విడుదల చేసింది.

ఆమె పేరు మీద జబల్‌పూర్‌లో విశ్వవిద్యాలయం ఉంది.

రాణి దుర్గావతి మరణించినది జబల్‌పూర్‌లోనే. ఆమెను వారు నేటికి తలుచుకొని ఆమెకు నీరాజనాలు సమర్పిస్తారు. బేడాఘాట్లో గోండుల చరిత్ర తెలుపుతు కొన్ని ఫలకాలను ప్రదర్శనకు పెట్టారు.

గోండుల ఉన్నతి, దుర్గావతి తరువాత వారి ప్రాబల్యం తగ్గిపోయినను, వారు మధ్య భారతమంతా వ్యాపించి ఉన్నారు.

ఆదివాసులుగా వారికి నేటి ప్రభుత్వం రిజర్వేషన్ ఇచ్చి వారి ఉన్నతికి పాటుపడుతోంది.

మాకు జబల్‌పూర్‌ వెళ్ళాక గోండుల చరిత్ర తెలుసుకున్న తరువాత మన దేశంలో ఎందరు స్త్రీమూర్తులు రాణులుగా, పాలకులుగా ఉన్నారు కదా!!! అని సంతోషం కలిగింది.

నర్మదా పరిక్రమ నా ఆధ్యాత్మిక వృద్ధితో పాటు, నా చరిత్ర జ్ఞానాన్ని కూడా పెంచుతోందని సంతోషం కలిగింది.

మేము జబల్‌పూర్ చూసుకొని మరింత ఉత్తరం వైపుకు వెళ్ళాము. మనం తూర్పుకు కదా వెళ్ళాలంటే, నర్మద కాలువలుగా ఉంటుంది. అది దాటక రావాలంటే ఇలాగే రావాలి అన్నాడు డ్రైవర్. ఆ రోజు నాకు ఒంట్లో అసలు బాగోలేదు. ఉదయం నుంచి నేను చాలా వణుకుతున్నాను. పొగమంచులో నదీ స్నానం వల్లనేమో మరి. మేము కొండలు గుట్టలు ఎక్కి దిగి ఆ రోజంతా ప్రయాణం చేశాము.

మధ్యలో భోజనానికి ఆగినా, నేను తినలేకపోయాను. ఎండిన నదులలో ప్రైవేటు రోడ్లలో కూడా ఆ రోజు ప్రయాణం చేశాము. రోడ్డు ట్యాక్స్ కూడా మేము పరిక్రమవాసులమని కట్టించుకోలేదు చాలా చోట్ల. అసలు మా వాహనం పై ‘పరిక్రమ’ అన్న బ్యానర్ చూసి, చాలా చోట్ల హోటళ్ళలో శుచిగా అప్పటికప్పుడు వండి పెట్టారు. వ్యాపారులు మాతో వ్యాపారం చెయ్యకుండా న్యాయంగా ఉండటం దారి లోని చాలా గ్రామాలలో నేను గమనించాను.

త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే!!

***

అమర్‌కంటక్

ఆ రోజంతా ప్రయాణమే సరిపోయింది. అనుపూర్ మీదుగా, చక్కటి టేకుచెట్ల ఘాట్ రోడ్డు మీద ప్రయాణం. ఆ దారి అంతా హరితమే. చక్కటి ఆకుపచ్చటి అడవి. రోడ్డుకు ఇరు ప్రక్కలా పెరిగి కళ్ళకి ఇంపుగా ఉంది. దాదాపు సాయంత్రం అవుతుండగా అమర్‌కంటక్ చేరుకున్నాము.

అదో ఉద్రేకపూర్వకమైన ప్రవేశం అమర్‌కంటక్‌లో.

నర్మద జన్మస్థానం అమర్‌కంటక్. వింధ్యాచల పర్వతాలు, సాత్పురా పర్వతాల నడుమ మైకల్ గుట్టలమీద 3438 అడుగుల ఎత్తున ఉన్న అమర్‌కంటక్‌లో రేవాకుండ్‌లో నర్మదా నది జన్మస్థానం.

అమర్‌కంటక్ లోకి అడుగు పెట్టగానే చాలా భావోద్రేకం కలిగింది.

మధ్యప్రదేశ్ టూరిజం వారి హోటల్ కు వెళ్ళి చెకిన్ అయ్యాము. నాకు అప్పటికే పూర్తిగా జ్వరం వచ్చేసింది. పైగా చిన్నగా తలనొప్పి. రెండేసి జతల బట్టలు వేసుకొని, సాక్సులు ధరించి నర్మదా మందిరానికి బయలుదేరాము.

అమర్‌కంటక్ అంటే అమృతము, కంటకం అంటే ముల్లు. అమర్‌కంటక్‌లో దేవతలు, రుద్రగణాలు కూడా ఉన్నందున ఆ పేరు వచ్చిందని అంటారు. అమర్‌కంటక్‌ను తీర్థయాత్రలకు రారాజని పేరు. ఇక్కడ ఆరుకోట్ల తీర్థాలున్నాయట. అందుకే ఇది తీర్థరాజ్యం అయింది. అమర్‌కంటక్ గురించిన ప్రసక్తి పురాణాలలో ఉంది. కాళిదాసు మేఘదూతం మొదలంతా అమరకంటక్ గురించే. అమర్‌కంటక్‌లో నర్మద నదే కాక మరో రెండు నదుల జన్మస్థానం కూడా. సోన్ నది మరియు జోహిలా నది.

ఈ నదుల గురించి మాకో మంచి కథ చెప్పాడు మా గైడ్.

“జోహిలా నది నర్మదకు చెల్లెలట. ఆమెకు అక్క అంటే ఇష్టమే. సోన్ నది పురుషనది. ఈ నది నర్మదను ఇష్టపడింది. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు సోన్ నది.

కాని నర్మద వివాహం దేవతలకు ఇష్టం లేదు. అందుకని వారో ఉపాయం ఆలోచించారు. పెళ్ళివారు ఎంతకూ రావటం లేదని, చూసి రమ్మనమని చెబుతుంది నర్మద. అక్క వేసుకోవాల్సిన ఎర్ర వస్త్రం కప్పుకొని జోహిలా బారాత్ అంటే ఊరేగింపు ఎంత వరకు వచ్చిందో చూద్దామని వెళుతుంది. ఆ ఊరు సందు దగ్గర ఎర్రని వస్త్రం కప్పుకున్న జోహిలాను పెళ్ళికూతురనుకొని, సోన్ నది ఆమె మెడలో దండ వేస్తాడు.

అయ్యో!!!! ఎంత పని జరిగిందని” నర్మద చెల్లెలు బాధపడుతుంది.

నర్మద ఈ విషయం తెలిసి దుఃఖంతో నదిలా ప్రవహిస్తుందట.

“మరి ఇది మోసం కదా..” అడిగాను మా గైడ్‌ను.

“కాదు. కాదు. నర్మద మన పాపాలు కడగాలంటే నదిగా ప్రవహించాలి. మన కోసం దేవతలు ఇలా చేశారు..” చెప్పాడతను.

సోన్ నది తూర్పు వైపుకు ప్రవహించి పాట్నా దగ్గర గంగానదిలోకి ప్రవహిస్తుంది. నర్మద పశ్చిమానికి ప్రవహిస్తుంది.

భార్యాభర్తలుగా ఉండాలంటే ఒక వైపు చూడాలి. ఒక వైపు ప్రవహించాలి. చెరో దిక్కుగా వెడితే అక్కడ స్నేహం లేదు, కలిసి గమనం లేదని సోన్, నర్మదా మనకు చూపెడుతున్నాయన్నమాట.

అక్కడ మరో కథ కూడా చెబుతారు నర్మద జననం గురించి. శివుడు ఆ పర్వతాల సౌందర్యం మెచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన స్వేదం వల్ల ఒక అందమైన ఆడపిల్ల జన్మిస్తుంది. ఆమె సౌందర్యం ముందు ప్రతీదీ చిన్నబోవటమే. ఆ వనంలో ఆమె నవ్వితే పువ్వులు వికసిస్తాయి. ఆటపాటల మధ్య ఉన్న ఆమెను శివుడు సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు.

ఆమె అందం తెలిసిన దేవతలు ఆమెను వెంబడిస్తారు. నర్మద ఆ దేవతలను దూరంగా ఉంచుతుంది. వాళ్ళు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటారు కానీ నర్మదకు ఎవ్వరు ఇష్టం ఉండరు. ఒక రోజు దేవతలు ఆమెను వెంబడిస్తే ఆమె పర్వతాగ్రానికి వెళ్ళి అక్కడ్నుంచి దూకి నదిగా ప్రవహిస్తుంది.

శివుడు సర్వులకు పాపహారిణిగా ఉండమని ఆమెను దీవిస్తాడు. దేవగంగ కూడా నర్మద వద్దకొచ్చి మునిగి తన మురికిని కడుక్కుంటుంది.

నర్మదా నది గురించి పురాణనామ చంద్రికలో పురుకుత్సుడి భార్య అని చెబుతుంది. నాగులకు సోదరి నర్మద అని కూడా చెబుతుంది ఈ పుస్తకం. పురుకుత్సుడి మాంధాత జ్యేష్ఠ పుత్రుడు. ఇతని భార్య నాగుల సహోదరి అయిన నర్మద. ఇతడు కశ్యపపుత్రులు అయిన మౌనేయుల వలన భయం లేకుండా నాగులకు చేసినందుకు, వారు తమ సహోదరి అయిన నర్మదను ఇతనికి ఇచ్చి వివాహం చేయించారు. మిగిలిన వివరాలు తెలియవు. ఇలాంటి కథలు ఆ పర్వతాలలో ఎన్నో వినిపిస్తాయి.

నర్మద సాధకులకు జీవిత ఫలదాయని. కోరిన కోరికలు తీరుస్తు, చివరకు మోక్షం కూడా ఇవ్వగలదామె. నర్మద తీరంలో జపం వెయ్యి రెట్లు ఫలితమిస్తుందని శివుని వరము కూడా ఇచ్చాడు.

అమర్‌కంటక్  లోని రేవాకుండ్ నర్మద జన్మస్థానం. ఆ కుండం చుట్టూరా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కుండంలోని మండపంలో నర్మదామాయి విగ్రహం ఉంది. ఆ మండప సముదాయాన్ని ‘నర్మదా ఉద్గమ దేవాలయ సముదాయం’ అంటారు. ఇవి కొత్తగా నిర్మించినవి. తెల్లని రంగు వేసిన ఈ దేవాలయ సముదాయం నర్మదా కుండం చుట్టూరా ఉంటాయి. దీపాలతో ఆ చిన్న చిన్న దేవాలయాల సముదాయాల పైన కాషాయ ధ్వజంతో సుందరంగా ఉంటాయి. ఆ కుండంలో మునుపు మునిగేవారట యాత్రికులు. కాని ఇప్పుడు కోవిడ్ వల్ల అటు వంటిది చెయ్యవద్దని చెప్పారు. వెళ్ళిన రోజు ఆ కుండం దేవాలయాల ప్రాంగణం దీపాల మధ్య వెలుగుతోంది. గుడిలో నర్మదకు హారతి జరిగింది. తదనంతరం భజన చేశారు. ఆ ప్రాంగణంలో ఉన్న భక్తి భావానికి మనం ఏమైనా చెయ్యవచ్చని అనిపిస్తుంది. అక్కడికి రావటమే పరమ పుణ్య ఫలం అన్న భావన కలిగింది మనస్సు లోలోపల.

జ్వరంగా, చలిగా ఉండటంతో నేను గదికి వచ్చేశా. మరునాడు ఆరోగ్యం మరింతగా కుంటుబడింది. ఆ ఉదయం జ్వరం ఎక్కువై, మైగ్రేయిన్‌గా మారింది. ఆ నొప్పికి విరుగుడుగా మందు వేసుకున్నా, తిరిగే ఓపిక ఉన్నదా అంటే సందేహమే. ఏమి తినకుండా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నందుకు కడుపులో తిప్పటం మొదలైంది.

నర్మదామాయిని మనస్సులో నమస్కరించుకున్నా. అదొక్కటేగా మనం చెయ్యగలిగింది.…

త్వదీయ పాద పంకజం నామాని దేవి నర్మదే!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here