కన్నడంలో బి.ఆర్.నాగరత్న రచించిన ‘ప్రశ్నె’ అనే అనువదించి తెలుగులో అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.
~
[dropcap]ని[/dropcap]ద్రమత్తు వదలినా పైకి లేవడానికి బద్ధకించి పడకపైనే పారాడుతున్న శారద చెవులకి సుశ్రావ్య గానం సోకింది. తనకు తెలిసీ, ఈ అపార్టమెంట్‌లో ఇంత చక్కగా పాడేవారెవరబ్బా అని విస్తుపోయింది. ఆమె అనుమానాన్ని పోగొడ్తూ, తన ప్రక్కనే పడుకుని ఉన్న భర్త శ్రీధర్ “శారదా, నీకు తెలియదు కదూ. ఎదురింటికి కొత్తగా వచ్చార్లే దంపతులు. వాళ్లెలా వుంటారో తెల్సా, భలే జోడీ. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగ. భలే వున్నారనుకో. ఆయన పేరు జనార్ధనరావ్, ఆమె పేరు జానకమ్మ. చాలా చక్కగా పాడుతుంది తెల్సా. బెంగుళూర్లో ఏ.జి.ఆఫీస్‌లో పన్చేసి రిటైర్ ఆయ్యారట ఆమె. కొద్దికాలం పాటు బెంగుళూరులో వుంటూ, ఇప్పుడు ఈ ఇంటిని కొని ఇక్కడికే వచ్చేశారు.
మనలాగే ఇక్కడే ఖాయంగా ఉంటారట. ఉన్నది ఇద్దరే. పిల్లలు లేరట. వాళ్లిద్దర్లో ఆమె… కొంచం రిజర్వ్‌డ్… కొంచమేమిటి పూర్తిగా… ఆ ముసలాయన మాత్రం పూర్తిగా కలుపుగోలు మనిషి. ఆయనే వచ్చి పరిచయం చేసుకున్నాడు. నీవపుడు ఊళ్లో లేవు కదా ఓ నెల పాటు… అప్పుడు వచ్చార్లే. మన వీధిలో వున్న వాళ్లని, చుట్టూముట్టు వున్న వాళ్లనీ… అందర్నీ పరిచయం చేసుకున్నాడనుకో” అని పూస గుచ్చినట్లు అన్ని విషయాలనీ ఏకరవు పెట్టాడు.
“పోనీలేండి. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా వుంటున్న ఇంటికి ఓ కళ వచ్చినట్టయింది. ఎంత మధురమైన కంఠం! వయస్సయినా ఆ కంఠంలో కాసింత కూడా అపస్వరం లేదు” అంది.
రోజులు గడిచిన కొద్దీ, తన భర్త చెప్పినట్టుగా, ఆ ముసలావిడ విడదీయరాని పొడుపు కథలాగే వుండిపోయింది. ఆ తాతగారేమో, చిన్నా పెద్దా అనే తేడా లేక అందరితోనూ కలివిడిగా వుండేవారు. అందర్నీ నవ్విస్తూ చిలిపిగా ఉండేవారు. ఎవరికి ఎల్లాంటి సహాయం అవసరమయినా నేనున్నానని ముందుకొచ్చేవారు. మా బృందావనం కాలనీలో పండుగులొచ్చినా, పూజా పునస్కారాలు చేయాల్సి వచ్చినా దేనికై సరే, అన్నింటికీ తాను ప్రథమంగా ఉండేవారు. అయితే ఆ ముసలావిడ మాత్రం మేం ఎంత ప్రయత్నించినా మాతో కలిసేది కాదు. ఈ విషయం గుఱించి, ఆ తాతగారితో ప్రస్తావిస్తే, “అయ్యో! ఏం చెప్పమంటారమ్మా. ఎన్నో సార్లు చెబుతూనే వుంటాను, అలా చిప్పలో దూరిన తాబేలులా వుండొద్దు. నల్గురితో కల్సిమెల్సి సంతోషంగా ఉండటం నేర్చుకోమని. ఊహు! అది అన్నేళ్లు ఊళ్లూళ్లు తిరిగి ఎలా పని చేసుకుంటూ వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి” అని చెబుతూ ఉండేవారు ఆయన. మాతో కలసి వుండటం అటు వుండనీ గాక, ఇంటి నుండి బయటకి వెళ్లటమే చాలా అరుదు. ఎప్పుడైనా ఓసారి దగ్గరే వున్న గణపతి దేవస్థానానికి మాత్రం పోయి వస్తుండేది. అదీ తాతగారితోనే. కొందరి స్వభావాలే అంత అని మేము సరిపెట్టుకొని ఊరుకుండిపోయాం. మా ఇంట్లో పని చేసే పనిమనిషి వాళ్లింట్లోనూ పని చేస్తూ వుండేది. “అమ్మగారూ! ఆ ఎదురింట్లో వున్నారు కదా అవ్వా తాత… అబ్బా అదేం పోట్లాటుకుంటూ వుంటారోనమ్మా. ఒక్కోసారి తిండి కూడా తినటం మానేస్తారు. అదేదో వాళ్ల భాషలో ఒకరికొకరు కోప్పడుతూ గట్టిగా కేకలేసుకుంటూ వుంటారు” అంది. అందుకు నేను, “పోవే! వాళ్లెందుకు పోట్లాడుకుంటారు. వాళ్ల భాష నీకు తెలీక, వాళ్లు పోట్లాడుకుంటూ వుంటారని నీకన్పిస్తుంది… అంతే” అని దాన్ని సముదాయించి నేనూ ఊరకుండి పోయేదాన్ని. అయితే నా అభిప్రాయాన్ని వమ్ము చేస్తూ, రాత్రి ఓ పొద్దులో అప్పుడప్పుడు వాళ్ల ఇంటి నుండి వాద ప్రతివాదాలు వినిపిస్తుండేవి. ఒక్కోసారి అవి తారాస్థాయికి చేరేవి. ఈ విషయాన్నే మా ఆయన్తో అంటే “ఆయిన, మొగుడు పెళ్లాలన్నాక ఇవి మామూలే. వాళ్ల విషయాల్లో మనమెందుకు తలదూర్చటం” అంటూ నా నోరు నొక్కేశారు.
మూడ్రోజుల తర్వాత… ఏదో పని మీద మా ఇంటికొచ్చిన తాతగారితో, కుతూహలం అణుచుకోలేక అడిగేశాను, వారిద్దరి మధ్య వస్తున్న తగవులాట గురించి. “ఊ… ఏం చెప్పమంటావమ్మా! నీకు తెల్సుగా, నాకేమో అందరూ కావాలి. దానికి అక్కరలేదు. ఎవరైనా కష్టాల్లో వుంటే నా ప్రేవులు తెంచుకు వస్తాయనుకో. వాళ్ల సాయానికి నే ముందుకు వెళ్తాను. అది పడదు దానికి. వున్నదంతా ఇతరులకి దానం చేయటం కాదు నా అభిప్రాయం. కొంచమైనా ఇతరులకి సహాయం చేయటం మంచిది కదా. మొన్న గాక మొన్న నా చెల్లెలి కూతురు కొడుక్కి ఇండనీరింగ్‌లో సీటు చిక్కింది. పాపం ఆర్థికంగా చిక్కిపోయిన వాళ్లు. అందుకని కొంచంగా ధనసహాయం చేశా. దాని కారణంగా, మన్ను – మిన్ను ఒకటే అయినట్లు నానా హంగామా చేసింది. మనకున్నదంతా మన వెనకాల తీసుకెళ్తామా చెప్పమ్మా… ఇల్లాంటి విషయాలకే మా ఇద్దరి మధ్యా అప్పుడప్పుడు చిన్న సైజు వాగ్యుద్ధాలు. నా తలరాత.” అంటూ తన గోడును వెళ్లబోసుకున్నరాయన. ఇంత చిన్న విషయాలకే ఇంతటి రాద్ధాంతమా అనుకుంటూ నేనూరకుండిపోయాను.
సుమారు రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో ఆ తాతగారు మా అందరికీ చాలా ఆత్మీయుడైపోయారు. ఆయన లేకుండా మేమిన్నేళ్లు ఈ కాలనీలో ఎలా గడిపామా అనే ఆలోచన మాకొచ్చేది. అంతగా కలసిపోయారాయన మా అందరితోటి. ఈ రెండేళ్ల వ్యవధిలో ఆ ముసలావిడగారిలోనూ కొద్దికొద్దిగా మార్పు రావటం జరిగింది. ఆమెను కల్సినప్పుడల్లా కాస్త చిరునవ్వు నవ్వేది. మే మందరం కల్సి ఆమెను పాట పాడమని పట్టు పట్టినప్పుడు మా అభ్యర్ధన త్రోసి పుచ్చేది కాదు. కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అందరితోనూ కల్సిపోయేది. కొంచానికి కొంచమైనా ఆమెలో వచ్చిన మార్పుకి మేం సంతోషించాం. అయితే ఒక్కతే మాత్రం బయటికెక్కడా వెళ్లేదే కాదు. ఇతరుల స్వంత విషయాల్లో తలదూర్చేది కాదు.
ఓ సారి ఇలాగే ఆ తాతగారితో సరదాగా మాట్లాడుతూ మధ్యగా టూర్ విషయమై ప్రస్తావన వచ్చింది. టూర్లు వెళ్లడమంటే తన కెంతో ఇష్టమైన విషయమని చెప్పారాయన. “అల్లా అయితే తాతగారూ ఇంత వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా వున్నారు, అంతే ఆరోగ్యంగా అవ్వగారూ వున్నారు. ఇద్దరూ కల్సి ఎక్కడికైనా టూర్ వెళ్లిరావచ్చుగా సరదాగా” అని అన్నాం. “మీరు చెప్పేది బాగానే వుందమ్మా. అయితే మఖ్యంగా మీ అవ్వగారిదే ప్రోబ్లం. ఆవిడకి టూర్ పట్ల ఆసక్తి శూన్యం. ఆవిడ్ని ఒక్కదాన్నే వదిలి పెట్టి నేనొక్కణ్ణే వెళ్లటం నాకు మనసొప్పదు. ఏం చేయమంటారు.” అన్నారు కాస్త మనసు చిన్నబుచ్చుకుంటూ.
“కొందరికి యాత్రలంటే ఇష్టముండదు తాతగారూ. ఆమెనెందుకు బలవంతం పెట్టటం. మీ కిష్టమైతే మీరొక్కరే వెళ్లండి. అవ్వగారు ఒంటరిగా వుంటారనే బెంగ మీకొద్దు. మేమందరం మీరొచ్చేదాగా ఆవిడ యోగక్షేమాలు చూచుకుంటాం” అంటూ ఆయనకి భరోసా ఇచ్చాం.
కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు ఆయన మా అందరి తోటి “చూడండమ్మా మీరందరూ భరోసా ఇచ్చారు గనుక నేను ఉత్తర భారత దేశయాత్రకి, ఇదిగో టికెట్ బుక్ చేసుకువచ్చా” అన్నారు.
“భేషుగ్గా వెళ్ళండి తాతగారు. అవ్వగారి దిగులు మీకొద్దు” అన్నాం మేము ముక్త కంఠంతో.
“చూడండమ్మా మా వూరి నుంచి కుర్రాణొకణ్ణి ఇక్కడికి రమ్మని కబురు పంపాను. రెండ్రోజుల్లో వాడొచ్చేస్తాడు. ఆమెకి కావాల్సిన సదుపాయాలన్నీ వాడు చూస్తాడు. యాత్రకి వెళ్లే ముందు వాడికన్ని విషయాలు తెలియజేస్తాను.” అని చెప్పి ఇంటికెళ్లిపోయారు.
టూర్ వెళ్లేరోజు దగ్గర పడగానే ఆయన ప్రతి వారి ఇంటి కెళ్లి ఎవరెవరికి ఏమేమి కొని తీసుకురావాలో వాటిని ఓ లిస్ట్ తయారు చేసుకున్నారు. ఆ కుర్రాడు వచ్చేశాడు. టూర్ వెళ్లే రోజున మా కాలనీ వాళ్లందరం, చిన్నా పెద్దా ‘విష్ యు ఏ హాపీ జర్నీ’ అని చెప్పి సాగనంపాం.
తాతగారు లేకుండా ఆవిడ ఒంటరితనాన్ని పోగొట్టటానికి మేము ఒకరొకరుగా అవ్వగారి దగ్గర కెళ్లి ఆమెను పరామర్శించి వచ్చేవాళ్లం. ఆ కుర్రాడు కూడా చాలా చలాకీగా ఉండేవాడు. ఆవిడని విడిచి వాడు ఓ క్షణం కూడా వుండేవాడు కాదు. ఇలా ఓ వారం రోజులు గడిచిపోయాయి.
ఓ రోజు వూరి నుంచి వచ్చిన ఆ కుర్రాడు “అక్కా మా అమ్మగారికి ఆరోగ్యం బాగా లేదట. ఊరు నుండి ఫోను వచ్చింది. నే వెంటనే వెళ్లి తిరిగి వచ్చేస్తాను. నేను లేని సమయంలో అవ్వగారిని కాస్త కనిపెట్టకుని ఉండడక్కా” అంటూ ఆ విషయాన్ని నాకు చెప్పి వెళ్లిపోయాడు.
వాడు వెళ్లిపోగానే, నేను అవ్వగారింటికెళ్లి “అవ్వగారు రాత్రిపూట మీ రొక్కరే పడుకోకండి. మాలో ఎవరయినా ఒకరం మీతోపాటు వుంటాం. లేకుంటే ఆ కుర్రాడొచ్చే వరకూ ఎవరైనా ఒకరింట్లో పడుకుందురుగాని” అని చెబుదామని ఆవిడ ఇంటికెళితే, అక్కడ మా కాలనీ లోని చాలా మంది వయసు మీరిన వారు కన్పించారు. వాళ్లు కూడా నాలాగే ఆమెకు భరోసా నివ్వటానికే వచ్చి వుంటారు. నన్ను చూడగానే “శారదా రామ్మా. నీకు కూడా కబురు పంపాలనే అనుకుంటూండగానే నీవే వచ్చేశావు. మంచిది రా” అని లోనికాహ్వానించింది.
ఇదివరకెన్నడూ ఇంత సంతోషాన్ని ఆమె ముఖంలో చూచి ఎరగం. చిరునవ్వుతో అందరితోటి మాట్లడడం చూచి మేమెంతో ఆశ్చర్యపోయాం. మమ్మలందర్నీ కూర్చోమని చెప్పి లోనికెళ్లి ప్లేట్లల్లో ఫలహారాలని తెచ్చియిచ్చింది. ఆ తర్వాత కాఫీ కూడా సరఫరా చేసింది. ఈ అతిథి సత్కారానికి మేమందరం విస్తుపోయాం. కుతూహలం అణుచుకోలేక అడిగాం “అవ్వగారూ! ఏంటిది చెప్పపెట్టకుండా… ఉన్నదున్నట్టుగా… ఆ కుర్రాడూ లేడు… మీరొక్కరే… శ్రమ తీసుకుని మాకు ఇలా ఆతిథ్యమివ్వటం…?”
“ఔను ముందస్తుగా చెప్పి వుంటే మేమందరం వచ్చి సాయం చేసేవాళ్లం. పెద్ద పార్టీనే ఏర్పాటు చేసేవాళ్లం కదా పిల్లలతో వచ్చి… ” అన్నారు మిగతా వాళ్ళందరూ.
మా అందరి మాటల్నీ విని ఆమె “చూడండర్రా ఇందులో నా స్వార్థం వుంది. ఇప్పుడు నే చెప్పబోయేది పిల్లల ముందు చెప్పే విషయం కాదు. నా బాడీ గార్డ్‌గా ఉన్న కుర్రాణ్ణి నేనే ఓ ఉపాయంతో వాణ్ని వాళ్ల ఊరికి పంపించేశాను. అక్కడ వాళ్లమ్మకి ఏ అనారోగ్యము లేదు. అది తెల్సి వాడు తిరిగి వచ్చేలోగా, మీ అందరికీ నేను కొన్ని విషయాలని విడమర్చి చెప్పాల్సి వుంది. ఇక ముందు ఇల్లాంటి సందర్భం దొరకదు. అందుకే ఈ ఏర్పాటంతా” అంటూ “మేం ఇక్కడికొచ్చి రెండేళ్లకి పైగా అయ్యిందని మీ అందరికీ తెల్సిన విషయమే. అయితే మీకు తెలియని, తెలియాల్సిన ఓ పచ్చి నిజాన్ని చెబుతున్నాను వినండి. మీరు భావిస్తున్నట్టు మేమిద్దరం దంపతులం కాము.” అంది. ఒకరి ముఖాలని ఒకరం చూసుకున్నాం.
“ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కాని ఇది పచ్చి నిజం. ఇప్పుడు నా వయస్సు దగ్గర దగ్గర డెబ్భై ఏళ్లు. ఆయన వయస్సూ కొంచం అటూ ఇటుగా నా వయస్సే, లేదా ఓ ఏడాది తక్కువై వుండొచ్చు. ఆ కాలంలోనే పెళ్లి చేసుకోకుండా ఎలా వుండగలగామా అని అనుకుంటున్నారు కదూ. దాని ఫ్లాష్‌బ్యాక్ వినిపిస్తాను. వినండి.”
ఓ క్షణం మా అందరి మధ్యా మౌనం ఆవరించింది. ఒకళ్ల ముఖం ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. ఎవ్వరం ఏమీ మాట్లాడే స్థితిలో లేము. మా మౌనాన్ని భంగపరుస్తూ ఆమె “బెంగుళూరు సమీపంలో ఓ చిన్న పల్లెటూర్లో, అతి సాంప్రదాయపు బ్రాహ్మణ పురోహిత కుటుంబంలో, ఎంతో మందికి జన్మనిచ్చి, అందరినీ పోగొట్టుకున్నాక ఆ తల్లికి చివరిగా మిగిలిపోయిన ఒక్కగానొక్క కుమార్తెను నేను. ఆ కాలంలో పురోహితుల కొచ్చే ఆదాయం ఎంతో మీకు తెలియంది కాదు. విశేష పూజలని, పురస్కారాలని వెళ్లినప్పుడు మాత్రమే కావాల్సినంత దక్షిణ, అదీ ఇచ్చే ఉదారులున్నప్పుడు, లేకుంటే అదీ లేదు. ఉండటానికని చిన్న ఇల్లు, దానంగా వచ్చిన రెండు ఆవులు, వాటి నుండి వచ్చే పాడి కొంత దేవునికి, మిగిలింది మాకు. అలాగే ఇంట్లో పెరట్లో పెంచుకున్న ఆకుకూరలు, కూరగాయలు. దేవాలయంలో అర్చన కార్యక్రమాలు చేస్తునందుకు వచ్చే జీతం, వీటితో మా ముగ్గురికి సరిపోతూ వుండేది.
పుట్టిన బిడ్డలందరూ పోగా నేనొక్కదాన్నే మిగలటం చేత, అమ్మానాన్నలకి నేను గారాల కూతురుగా పెరిగాను. పల్లెటూరు చదువైనాక, బెంగుళూరులో చదువు ముగించి, కన్నడ, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ పరీక్ష పాసయ్యాను. కాలేజీ చదువులు చదవాలని వున్నా, అది సాధ్యం కాదని తెల్సి, నాన్నగార్ని ఒప్పించి ఉద్యోగానికి ఓ అర్జీ వేశాను. దీంతోపాటు వరాన్వేషణలో పడ్డారు అమ్మానాన్న. ఇంట్లో పేదరికం వున్నా నా రూపానికి పేదరికమనేది లేకుండేది. నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే, నాన్నగారి పౌరోహిత్యపు ఆదాయంతో జీవనాన్ని గడపటం వాళ్లకి కష్టమని భావించి, నాతో పాటు నా తల్లిదండ్రులని కూడా పోషించే భారాన్ని వహించవలసి వుంటుందనే షరతుని నేను విధించటం వల్ల నన్ను చేసుకోవటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెల్సి మా అమ్మానాన్నా అక్షేపించారు నన్ను తీవ్రంగా. అయితే నేను దేనికీ తల ఒగ్గలేదు. అదృష్టవశాత్తు బెంగుళూరు, ఏ.జి ఆఫీస్‌లో జాబ్ దొరికింది.
ఇది ఇలా వుండగా, జరగరాని సంఘటన ఒకటి జరిగిపోయింది నా జీవితంలో. మేముంటున్న ఆ గ్రామ పెద్ద కుమారుడు వారి స్నేహితులు దేవస్థానపు హండీని బ్రద్దలు కొట్టి డబ్బుదోచుకునే యత్నంలో వాళ్ళు మా నాన్నకి దొరికిపోయారు. మా నాన్నకి వాళ్లకి జరిగిన పెనుగులాటలో, ఆ గ్రామ పెద్ద కుమారుని స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు. వాడి మరణాన్ని మా నాన్నగారి తలకు చుట్టబెట్టారు. ఇది తెలిసి మా అమ్మ గుండె ఆగి మరణించింది. ఆ తర్వాత ఏం జరిగి ఉండగలదో మీరు ఊహించగలరు. అంతే, ఆ ఘటనా నంతరం గ్రామం వదలి బెంగుళూరు చేరుకున్నా. విషయాన్ని తెల్సుకున్న మా కోలీగ్స్ కేసు వేయమని నన్ను ప్రోత్సహించారు. దాని విషయమై జైల్లో వున్నమా నాన్నగారిని కలవాలని అక్కిడికి వెళితే అక్కడ కూడా నా దురదృష్టమే నన్ను వెక్కిరించింది. ఆ ముందు రోజే రాత్రి నాన్నగారు తన నిదురలోనే భగవంతుని సన్నిధికి చేరిపోయారని తెల్సింది. నన్ను చూసిన జైలర్, ‘అరే కబురు పంపినట్టుగానే వచ్చేశావు కదమ్మా’ అంటూ నా చేతనే శ్రాద్ధ కర్మలని జరిపించి వేశారు. అంతటితో నా కన్నీటి కథ ముగిసిపోయింది.
నిరాశతో వచ్చిన నన్ను నా సహద్యోగులందరూ ఊరడించారు. అదిగో ఆ సమయంలో పరిచయమయ్యాడు ఈ మీ తాతగారు. ఆ రోజునుంచే నాకు చేరువయ్యాడు. ఆత్మీయత పెంచుకున్నాడు. దిక్కు మొక్కూ లేక ఒంటరిగా వున్న నేను ఆయన మాటలకి లోబడిపోయాను. అప్పుడు నాకది అనివార్యం; అగత్యం; అవశ్యకం అనిపించింది. ప్రవాహంలో కొట్టుకుపోయే వాడికి గట్టు చేరుకోడానికి ఏదో ఒక ఆలంబన కావాలిగా. ఆ సమయంలో నాకూ ఆయన ఆసరా కావాల్సివచ్చింది. ఆయన్ని పూర్తిగా నమ్మేశాను, పెళ్లీ పెటాకులనే సంకెళ్లకు లోనుకావడానికి ఇష్టం లేక మొత్తానికి మొగుడు పెళ్లాంలాగా జీవనం కొనసాగించాం. నా సర్వస్వాన్నీ ఆయనికి అప్పగించేశా అతన్ని పూర్తిగా నమ్మేసి. అతని అసలు రంగు బయటపడింది అటు తర్వాత. ఆయనో సోమరి. సరైన పనంటూ ఏదీ చేసేవాడు కాదు. ఎవరెవరి కోసమో వాళ్ల పన్లు చేసి పెట్టటానికి ఏ.జి. ఆఫీసుకి వచ్చేవాడు. అప్పటికప్పుడే ఆయనకో పెళ్లాం, ఇద్దరు బిడ్డలున్నారని తెల్సింది. ఆ పెళ్లాం పని చేస్తేనే గాని ఇల్లు గడవని స్థితి. స్వార్థపరుడు. బోగలాలసుడు. వగైరా…వగైరా… అయితే ఇవన్నీ తెలిసే సమయానికే నాపై, నే విడిపించుకోలేనంత పట్టు సాధించాడు. ప్రతిఘటించటం సాధ్యం కాకపోయింది. అలాగే ఆయన్ని వదలి ఒంటరి జీవనాన్ని నడిపే, నడుపగలననే నమ్మకం నాకు పోయింది.
ఆయన అసలు రంగు నాకు పూర్తిగా తెల్సిపోయిందని తెల్సిన నాటి నుండి, లేని పోని కారణాలు సృష్టించి నా దగ్గరర్నుంచి డబ్బు గుంజటం ప్రారంభించాడు. పిల్లలు విద్యాభ్యాసానికని వాటిలో ఓ నెపం. పోనీలే, పాపం ఆ పిల్లలు విద్యాభ్యాసానికైనా ఉపయోగపడుతుంది కదా అని, ఆయన అడిగినప్పుడల్లా డబ్బు సమకూర్చేదాన్ని. అయితే నేనిచ్చిన పైకంలో ఓ పైసా కూడా సద్వినియోగం కావటంలేదని తెలియడానికి నాకెంతో కాలం పట్టలేదు. ఇల్లాంటివాణ్ణి కట్టుకుని ఆ ఇద్దరు పిల్లల తల్లి, అటు ఉద్యోగం చేస్తూ, ఇటు పిల్లల చదువు కోసం కష్టపడుతూ, పైగా ఈయన్ని ఎల్లా భరిస్తూ వుందోనని తలంపుకు వచ్చినప్పుడల్లా, ఈ మనిషి పైన ఎనలేని అసహ్యం పుట్టుకొస్తుంది. ఈ విషయం తెలిసి నేనెక్కడ ఈయన్ని విడిచి పెట్టి వెళ్లిపోతాననే భయంతో, దయ్యంలా ఎప్పుడూ వెన్నంటే వుండేవాడు. బెంగుళూరు నుంచి ఇక్కడికి నన్ను పిల్చుకు రావటంలో ఇదే ఆయన స్వార్థం. ఇక్కడ మీ అందరి ముందు ఎలా నాటకమాడుతున్నది తెరచి వుంచిన పుస్తకంలా మీ అందరికీ తెల్సిందే. ఈ మహానుభావుడి నుంచి బయటపడాలనే కోరిక రోజురోజుకీ ఎక్కువవుతుంది నాకు. దాన్ని కార్యరూపంలో ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు చిక్కిన ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవటానికని మీ సహాయం కోసం ఈ రోజు మిమ్మల్ని ఇలా పిలిపించుకోవటం జరిగింది” అని అంది.
“ఇప్పుడు మమ్మల్నేమి చేయమంటారు?” అన్నాం అందరం ముక్తకంఠంతో. “ఊ చెబుతాను వినండి. ఇవి ఈ ఇంటికి సంబంధించిన పత్రాలు. దీన్ని అమ్మి వేయాలని నిశ్చయించుకున్నా. దీనికి మీ అందరూ నాతో సహకరించాలి. ఆ తర్వాత నన్ను ఓ వృద్ధాశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండి. నే పూర్తి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలున్నాయి. వాట్ని ముగించి, ఆ తర్వాత మిగిలినదంతా వృద్ధాశ్రమానికి చెందేటట్టు వీలునామా వ్రాసేస్తాను. నాలాంటి కొంత మందికైనా ఉపయోగపడని. పైగా పెన్షన్ వస్తుంది. ఊపిరి బిగబట్టుకుని బ్రతకాల్సిన వాతావరణం నాకు చాలనిపించింది. అందరూ శ్రద్ధగా వినండి. నాకు పెళ్లి కాలేకపోవచ్చు. కానీ నేను వేశ్యను కాను. ఇన్నేళ్లూ ఈయనతో మాత్రమే ఉన్నానే తప్ప ఇక ఏ మగాడి సాంగత్యమూ నాకు లేదు. పెళ్లి చేసి కాకపోయినా తాళిగట్టించుకున్న పెళ్లాం లాగానే ఈయనతో నీతిగా బ్రతుకు గడిపాను. చూడండి, ఈ పని చాలా జాగరూకతతో చేయాల్సి వుంటుంది. ఆ మనిషికి ఏ కొంచం క్లూ దొరికినా, నన్ను హతమార్చడానికీ వెనుకాడడు. దయచేసి నాకు సహకరించండి. ఇది నా స్వార్జితం. ఇదైనా సదుపయోగం కానివ్వండి” అంటూ అందర్నీ పరిపరి విధాల ప్రాధేయపడింది.
విద్యావంతురాలైనా, నలుగురితో కలసి ఉద్యోగం చేస్తూ కూడా ముందూ వెనకా చూడకుండా, ఓ ఆడది తప్పటడుగు వేయగలదనే అభిప్రాయం కలిగింది మాకు. అయిందేదో అయిపోయింది. ఇక ముందేమి చేయాలనే విషయాన్ని చర్చించాం అందరం.
“ప్రస్తుతానికి మీ ఇంటిని అద్దెకిచ్చి మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్పిస్తే… ఎలా వుంటుంది?” అని అడిగాం.
“వద్దు వద్దు, ఇంటిని అమ్మేయాలి” అని పట్టుపట్టింది ఆవిడ. అవ్వగారి అదృష్టమో, మా ప్రయత్న ఫలితమో, ఇంటికి ఓ మంచి బేరమే వచ్చింది. అమ్మకం కూడా జరిగిపోయింది.
బ్రతుకంతా కష్టాల ఊబిలోనే చిక్కుకుపోయి అల్లాడుతున్న ఆ తాతగారి కొడుకును, కుమార్తెను అవ్వగారు పిలిపించి తన వద్ద నున్న సొమ్ములు, చీరలు, ఇంటి సామాన్లు, కొద్దిపాటి పైకాన్ని వాళ్లకిచ్చారు. వాటిని తీసుకోవటానికి వారు వెనుకాడుతుంటే “పిల్లలూ ఇది నేను కష్టపడి సంపాదించిన సొమ్ము. మీ నాన్నగారి డేగ కళ్ల నుంచి రక్షించుకుంటూ వస్తున్నాను. ఇవి ఆయన చేతుల్ని చేరి పాడైపోవటం నాకిష్టం లేదు. నే చూడలేను. మీ అమ్మగారి లాగానే నేనూ ఓ అమ్మను. పరాన్నజీవి మీ నాన్న వచ్చేలోపే, నేను తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి వీటిని స్వీకరించండి. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన సొమ్ముకాదిది” అని ఒప్పించి సాగనంపింది వాళ్లని.
వద్దని ఎంత వారించినా, మా కందరికీ పసుపు కుంకాలతో పాటు కొంత సొమ్మను మాకు ముట్టజెప్పింది.
ఏర్పాట్లన్నీ ముగించి, ఆవిడని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించి వచ్చేశాం. అల్లాగే ఆమెను గుఱించిన అన్ని వివరాలని వారికి వివరించి, ఆ తాతగారి ఫోటో ఒకటి వాళ్లకిచ్చి వచ్చేశాము. ఏదో మహత్కార్యాన్ని సాధించిన తృప్తి కలిగింది మాకు.
ఒకే ఒక ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే ఓ సంవత్సరమైనా తిరిగి వస్తానన్న కుర్రాడు రాకపోవటం, యాత్రకు వెళ్లిన ఆ మహానుభావుడూ తిరిగిరాకపోవటం. ఏమైనాడో? గతించాడో? లేదా అవ్వగారి అనుమానం నిజమైనట్లు, ఆమె గారి క్లూ ఏదైనా అతగాడికి తెల్సిందా! ఈనాటికీ వేధిస్తున్న ప్రశ్న మమ్మల్ని.
కన్నడ మూలం: బి.ఆర్.నాగరత్న
అనువాదం: కల్లూరు జానకిరామరావు