[dropcap]క[/dropcap]రిగిన ఆనాటి పంచరంగుల కలలే
బతుకు అసలు రంగు చూపించేది
విరిగిన మన ఆశలనిచ్చెన చెక్కలే
నిత్యజీవనానికి ఊతకర్రగా నిలిచేది
కూలిపోయిన ఊహాసౌధా శకలాలే
వాస్తవ హర్మ్యానికి పునాదిరాళ్లయ్యేది
అడుగడుగున ఎదురయ్యే నిరాశాభూతాలే
బతుకు తెరువు బాటలో భయం పోగొట్టేది
రాలిన కన్నీటి చుక్క లే చెరువులయ్యి
ఎండిన గుండెను తడిపే చెలమలయ్యేది
జీవనగతిలో తగిలిన ఎదురుదెబ్బలే
మన ఎదురీతకి గుండె ధైర్యాన్నిచ్చేది
అంతా మనోళ్లేనన్న భ్రమలు తెగిన దారాలే
మనో స్థైర్యానికి బలమైన అల్లికగా అమరేది
మనుషులు మనసుకు చేసిన గాయాలే
గుండెను గట్టి చేసి ధీరత్వాన్ని నింపేది
జీవనయానంలో అడ్డొచ్చిన ముళ్లకంచెలే
సుతిమెత్తని పాదాలను దృఢ పరిచేది
సుదీర్ఘ సంక్లిష్ట యాత్ర నేర్పిన పాఠాలే
జీవన్ముక్తి దుర్గానికి తిన్నని మెట్లయ్యేది