[dropcap]వ[/dropcap]నాలన్ని వసంతాన్ని ఆహ్వానిస్తాయి
మరి అక్కడి చెట్లన్ని ఆ తల్లి కోసం పరితపిస్తాయి
ఆ చేయి తగలగానే మోడులైనా చిగుళ్ళుపోసి
చిరునవ్వులు చిందిస్తాయి
పచ్చని ప్రకృతి తివాచి మీద ఆ పాదముద్రలు
మట్టికి పరిమళాన్ని అద్దుతాయి
ఏం? మాయరో!
‘వంగారి మతాయి’ని చూడగానే
అక్కడి మానులన్నీ వంగి ఆమె పాదాలని ముద్దాడతాయి
అవార్డులు, రివార్డులు ఆమె కోసం వెతుక్కుంటూ వస్తాయి
ఆనందంగా ఆమె చెట్టు ప్రక్కన చెట్టంత తల్లై కనిపిస్తుంది
వనాలకి వసంతాన్నిచ్చి ఆమె అడవికి తల్లవుతుంది
కోటానుకోట్ల మొక్కలు నాటి
వాటి ఎదుగుదల చూసి
గంపెడు పిల్లల తల్లిగా నిండుగా
నవ్వుతుంది
అందలమెక్కాలని ఆశించి చేసే కృషి కాదు
ఒక జీవితం సృష్టించిన అద్భుతం అది
సజీవంగా నడిచే చెట్టు హృదయమది
ప్రకృతిని ప్రేమించే తత్వమది
మొక్కల్ని పిల్లల్లా పెంచిన
మాతృత్వమది
కెన్యాకో ఆఫ్రికాకో కాదు
ఆమె భూగోళపు చెట్టు తల్లి
పదండి సిగ్గు తెచ్చుకొని
ఒక మొక్క నాటి
పత్రహరితంలో ఆమె పాదాలు కడుగుదాం!
(కెన్యా దేశపు పర్యావరణవేత్త ‘వంగారి మతాయి’కి నోబెల్ శాంతి బహుమతి వచ్చిన సందర్భంగా ఈ కవిత ఆమెకి అంకితం)