సాఫల్యం-29

5
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[తన ర్యాంకు గురించి తన గురువులకి తెలియజేసి వారి అభినందనలు కానుకలు స్వీకరిస్తాడు పతంజలి. రాధా సారు మూడు వందల రూపాయలు ఇచ్చి మంచి చెప్పులు, ఒక వాచీ, కొత్త దుస్తులు కొనుక్కుంటాడు. విశ్వేశ్వరశాస్త్రిగారి ఇంటికి వెళ్ళి ఆయనకి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ఆయన అందమైన ఎగ్జిక్యూటివ్‌ డైరీ, ఖరీదైన ‘మర్చెంట్‌’ కంపెనీ పెన్ను బహుకరిస్తారు. ఇంగ్లీష్‌లో ఎం.ఎ. చేయమని సూచిస్తారు. తాండ్రపాడు వెళ్తున్నానని పతంజలి చెపితే, తనతో వస్తే దారిలో దిగచ్చునని చెప్పి కోర్టు దాకా తీసుకువస్తారాయన. కోర్టులో ఇదురూస్‌భాషా కనబడితే, ఆయనకి విషయం తెలియజేస్తాడు పతంజలి. ఆయన పతంజలిని అభినందించి, గతంలో పోటీ పరీక్షలకి ప్రిపేరవుతానన్న పతంజలి మాటలు గుర్తుచేసి, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ పి.ఓ. పోస్టులకు నోటిఫికేషన్ పడిందని, అప్లయి చేయమని చెబుతారు. తాండ్రపాడు వెళ్ళి బాజిరెడ్డిని పరామర్శించి వారింట భోజనం చేస్తాడు. తన ర్యాంకు గురించి చెబితే, బాజిరెడ్డి ముచ్చట పడతాడు. అక్కడ్నించి కర్నూలు వచ్చి చెప్పులు, బట్టలు, వాచీ కొనుక్కుంటాడు. ఇంటికి వచ్చాకా, వాటిని అందరికీ చూపిస్తాడు. బావ రాసిన ఉత్తరం ద్వారా మరో నాలుగైదు రోజుల్లో వాగ్దేవికి పురుడు రావచ్చని తెలుస్తుంది.. – ఇక చదవండి.]

[dropcap]మా[/dropcap]ర్కండేయ శర్మ అన్నాడు “నేనూ అమ్మా రేపు ఉదయం బస్సుకు వెళ్లిపోతాము. డెలివరీ అయింతర్వాత వాగ్దేవి నవజాత శిశువుతో ఇంటికి వచ్చిన తర్వాత నాలుగు రోజులుండి, నేను మహిత వచ్చేస్తాము. అమ్మ మూడో నెలలో వాగ్దేవినీ పిల్లలనూ తీసుకుని వస్తుంది. ఐదోనెలలో దిగబెట్టి వద్దాము”

పాణిని సంతోషంగా ఎగురుతూ అన్నాడు. “అయితే పతంజలన్న వంట చేస్తాడు. సాయంత్రం పకోడీలు బజ్జీలు చేస్తాడు. బలే బలే”

మునుపొకసారి తల్లిదండ్రులిరువురూ ఏదో పెళ్లికని వెళ్లినపుడు పతంజలి అలా చేశాడు. అందుకే చిన్నోడికి అంత సంబరం.

వర్ధనమ్మ అన్నీ సర్దుకుంది. పుట్టే పిల్ల కోసం పాత గుడ్డలు, వంటాముదం, బాలింత పథ్యానికి మూడు కిలోల పాత బియ్యం, ఉసిరికపొట్టు, లాంటివన్నీ పెట్టుకుంది. అల్లుని కిష్టమని అత్రసాలు, చక్కిలాలు చేసింది. మార్కండేయశర్మ ఎందుకయినా మంచిదని ఐదు వందల రూపాయలు జాగ్రత్త చేసుకున్నాడు. ఇద్దర్నీ ‘దస్తుమియ కట్ట’ దగ్గరే బస్సెక్కించి వచ్చాడు.

ట్యూషను పిల్లలను పంపించి, స్నానం, దేవతార్చన ముగించి, బియ్యం నూకతో ఉప్మా చేశాడు. అమ్మ పిల్లలు చేసుకోలేరని పుట్నాల పొడి, నువ్వుల పొడి కొట్టి డబ్బాల్లో పోసింది. నిమ్మకాయ, మామిడికాయ ఊరగాయలు పెద్ద జాడీల్లోంచి తీసి చిన్న గిన్నెల్లో వేసింది. చారుపొడి, సాంబారు పొడి నెలరోజులకు సరిపడా తయారు చేసింది. బస్సు బయలుదేరేంత వరకు పతంజలికి జాగ్రత్తలు చెబుతూనే ఉంది.

తమ్ముల్లిద్దరూ ఉప్మా తిని స్కూలుకు వెళ్లిపోయారు. మల్లినాధ ఈసారి టెంత్‌కు వచ్చాడు. చిన్నోడు ఎయిత్‌లో ఉన్నాడు. మల్లిగాడు చదువులో అంత శ్రద్ధ చూపించడు. బొటాబొటీ మార్కులు తెచ్చుకుంటాడు. వాడికి పోయిన సంవత్సరం వడుగు చేశారు. ఆర్భాటాలకు పోకుండా ఇంటివద్దనే క్లుప్తంగా చేశారు. పతంజలి పట్టుదల వల్లే అది జరిగింది. తద్దినాలకు కూడ బంధువులను ఊర్లో బ్రాహ్మణ కుటుంబాలను భోజనాలకు పిలవడం మానిపించాడు. పతంజలి మాట తండ్రి వింటున్నాడు. పెద్ద కొడుకు, ఇంటి బాధ్యత మోస్తున్నాడు. సంప్రదాయం కాదంటున్నా పతంజలి వాదనలో నిజమున్నదనిపిస్తూన్నది. ఆయనకు. కానీ ఒప్పుకోడు. మౌనంగా ఉన్నాడంటే పూర్ణాంగీకారమని అర్థం.

ఇక చిన్నోడు పాణిని చాలా చురుకైనవాడు. అందరికంటే చివరి పుట్టాడని అందరూ గారాబం చేస్తారు. తండ్రిని కూడ లెక్క చేయకుండా మాట్లాడతాడు. వాడిని కాలేజీలో చేర్చి బాగా చదివించాలని పతంజలి ఆశయం.

బుట్టలో కూరగాయలు చూశాడు. నాలుగు వంకాయలు, నాలుగు ఉర్లగడ్డలు తప్ప ఏమీ లేవు. సరే ఈ రోజు వారపు సంత పెడతారు కదా వెళ్లి తెచ్చుకోవాలి అనుకున్నాడు. బొగ్గుల పొయ్యి వెలిగించి నిప్పు రాజుకున్నాక కంచు గిన్నెలో కందిపప్పు, నీళ్లు పోసి మూతపెట్టాడు. పప్పు ఉడకడానికి అరగంటపైనే పడుతుంది. షర్టు వేసుకొని తిరి వీధోళ్ల అంగట్లో కేజీ ఉల్లిపాయలు తెచ్చాడు. కర్రల పొయ్యి వెలిగించి నాలుగు కర్రలు వెలిగించి, ఇత్తడి గిన్నెలో ఎసరుకు పెట్టి ఎసరు మరిగింతర్వాత బియ్యం కడిగి పోశాడు. వంకాయలు, ఉర్లగడ్డలు, ఉల్లిగడ్డలు పెద్ద ముక్కలుగా తరిగి ఒక సిల్వరు గిన్నెలో నీళ్లలో వేశాడు. వంకాయలు కనరెక్కకుండా అర చెంచా ఉప్పు, చిన్న చింతపండు ముక్కవేశాడు.

పుట్నాల పొడి వేసుకొని బియ్యం నూక ఉప్పా తిన్నాడు. అమ్మ చేసినట్లు పొడిపొడిగా రాలేదుగాని రుచి బాగుంది. బుట్టలో కూరకు ఎక్కువని మిగిలించిన క్యాబేజీ కొద్దిగా ఉంది. సాయంత్రం దాంతో పకోడీలు చేద్దామనుకున్నాడు.

పప్పు ఉడికింది. గిన్నె దించి కూరగాయలు ముక్కలు ఎక్కించి మూత పెట్టాడు. కట్టు నీళ్లు వేరే గిన్నెలో వంపి, పప్పు మెత్తగా నేమి (మెదిపి) పక్కన పెట్టుకున్నాడు. అన్నం ఉడుకుతూంది. ఒకసారి కలియబెట్టి మూత బెట్టి మంట తగ్గించడానికి రెండు కర్రలు తీసేశాడు. కాసేపటికి అన్నం చక్కగా పొడిపొడిగా అయింది. దించి మూతపెట్టి దానిమీద రెండు నిప్పులు వేశాడు. అన్నంలో ఏమయినా తడి ఉంటే ఆ నిప్పులు లాగేస్తాయి.

ముక్కలు ఉడికిపోయినాయి. ఉర్లగడ్డ ముక్క ఒకటి బయటికి తీసి, నొక్కి చూశాడు. పప్పు గిన్నెలో ముక్కలన్నీ వేసి, గిన్నె నిండా నీళ్లు పోసి, దాంట్లో నానిన చింతపండు పిసికిన రసం, ఉప్పు, సాంబారు పొడి రేగుపండంత బెల్లం, కరివేపాకు అన్నీ వేసి, కలిపి, బొగ్గుల పొయ్యి మీదకెక్కించి మూత పెట్టాడు. వేడి పెరగడానికి బొగ్గుల పొయ్యి క్రింద గాలి తగిలేలా విసన కర్రతో విసిరాడు కాసేపు.

పదినిమిషాలలో పులుసు మరగసాగింది. కమ్మని వాసన ఇల్లంతా వ్యాపించింది. దింపేసి ఒక వెడల్పు ఇనుప గరిటిలో మూడు చెంచాల నెయ్యి వేసి పొయ్యిమీద పెట్టాడు. నెయ్యి మరిగిన తర్వాత తిరగమోత గింజలు డబ్బా తీసి నెయ్యిలో గింజలన్నీ వేశాడు. ఇంగువ కూడ వేసి, బాగా చిటపటలాడింతర్వాత పులుసులో గరిట మొత్తం ముంచాడు. అప్పుడు వచ్చే సుయ్‌ సుయ్‌ శబ్దాలు పతంజలి కిష్టం.

‘అమ్మయ్య! వంటయిపోయింది. పిల్లలు వచ్చే ముందు వడియాలు వేయించుకుంటే సరి. పులుసులోకి వడియాలు లేకపోతే చిన్నోడు ఒప్పుకోడు’ అనుకుని, అప్పుడు మళ్లీ పొయ్యి రాజేయాల్సి వస్తుంది కదా అని, బొగ్గుల పొయ్యి మీద సిల్వరు బాణలి పెట్టి నూనెపోశాడు. నూనె కాగిన తర్వాత కొన్ని పేలాల వడియాలు అలసంద వడియాలు వేయించి, అవి మెత్తబడకుండా ఒక ప్లేటులో వేసి సాంబారు గిన్నె మీద పెట్టాడు.

కాసేపు విశ్వనాధవారి ‘చెలియలికట్ట’ చదువుకున్నాడు. బయటికి వెళ్లి బోయ మద్దమ్మను సాయంత్రం వచ్చి అంట్లు తోమి యిమ్మని చెప్పాడు.

“ఈయాల నుంచి పతంజలిసామి వంట కదా! పెద్దమ్మయ్య సామి ఊరికి పోయినారు. సామీ! రేత్తిరి నాకు కొంచెం చారు బొయ్యాల మీ సింజయులుకు (చిన్న జయరాముడు) జరంగా ఉండాది. నోరు సప్పగుండాదని అంటున్నాడు” అన్నదామె.

“చారు చెయ్యలేదుగాని, పులుసుంది ఇస్తాలేమ్మా” అన్నాడు పతంజలి. మద్దమ్మ భర్త చిన్న జయరాముడు. మామ పెద్ద జయరాముడు. ఆయనను పెజ్జయిలు అంటారు.

పన్నెండున్నరకు తమ్ముళ్లు వచ్చేశారు. “కాళ్లు చేతులు కడుక్కొని రాపోండి. అన్నం పెడతాను” అన్నాడు. మల్లినాధ అన్నం గిన్నె, పులుసుగిన్నె తెచ్చి పడసాలలో గవాక్షి కింద పెట్టాడు. చిన్నోడు ప్లేట్లు, రెండు చెంబులతో నీళ్లు. మూడు స్టీలు గ్లాసులు తెచ్చి పెట్టాడు. నెయ్యిపావు (నేతిగిన్నె) ముందే బొగ్గుల పొయ్యి క్రింద తొర్రలో పెట్టి ఉన్నందువల్ల చక్కగా కరిగింది.

పతంజలి అదేపనిగా చిన్నోడిని కాసేపు ఏడిపిద్దామని వడియాలు ప్లేటు కనబడకుండా దాచిపెట్టాడు. నిమ్మకాయ పచ్చడి గిన్నె దగ్గర పెట్టుకున్నాడు.

“ఏం పప్పు, అన్నయ్యా” అనడిగాడు చిన్నోడు.

“పప్పుకాదు పులుసు చేసినా”

“ఏం పులుసు?”

“వంకాయలు, ఉర్లగడ్డలు, ఉల్లిపాయలు వేసి”

“ఉల్లిపాయలు వేస్తే నాకెంతిష్టమో! అమ్మ అసలు వేయదు. మరి వడియాలు?”

“అయ్యో! మరిచిపోయినానే. పరవాలేదు తిను ఈ ఒక్క రోజుకు”

“నాకేం వద్దు. అమ్మ అయితే వేయించేది. నేను తినను” అని బుంగమూతి పెట్టి అన్నయ్య మీద అలిగాడు చిన్నోడు.

పతంజలి లేచి వెళ్లి వడియాల ప్లేటు తెచ్చాడు. దాన్ని చూసి తమ్ముడి మొహం చేటంతయింది.

“మా అన్నయ్య మం…చోడు” అని పతంజలి మెడచుట్టూ చేతులు వేసి అన్నయ్య బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు.

“చాలు చాలు. ఇంక తిందాం కూర్చోండి. వడియాలు లేకపోతే పాణిని మహాశయులు అన్నం తినరని తెలిసి కూడ. చెయ్యకూడనంత సాహసం చేయగలమా?” అన్నాడన్నయ్య.

ముందు నిమ్మకాయ పచ్చడి అన్నంలో కలిపి నెయ్యి వేసి పెట్టాడిద్దరికీ. అలా కలిపిస్తే యిష్టం. తర్వాత పులుసన్నం కలిపిచ్చాడిద్దరికీ పులుసులో ఉల్లిపాయల కోసం తగాదా పడ్డారిద్దరూ.

“పులుసు అద్భుతంగా ఉందన్నయ్యా” అన్నాడు మల్లినాధ. సాంబారును ఎక్కువగా పులుసనే వ్యవహరిస్తారు. రెండుసార్లు పులుసన్నమే తిని కడుపు నిండిపోయిందని మజ్జిగన్నం తినకుండా లేచిపోయినారు.

వాళ్లిద్దరూ వెళ్లిపోయింతర్వాత, పతంజలి కూడ భోజనం చేసి, ప్లేట్లు తీసేసి, ఎంగిళ్లు శుభ్రపరచి, చిటికెడు పసుపు వేసి శుద్ధిచేసి అలుకు బట్ట పెట్టి తుడిచాడు. పులుసు రాత్రికి కూడ సరిపోతుంది. వేడిగా అన్నం ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది.

చాప పరచుకొని రెండున్నర వరకు పడుకుని నిద్రపోబోయాడు పతంజలి. మూడు గంటలకు లేచి ముఖం కడుక్కొని సంచీ తీసుకొని సంతకెళ్లాడు. నాలుగయిద రకాల కూరలు, రెండు ఆకుకూరలు, కరివేపాకు, కొత్తిమీర, టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్ని కొనుక్కుని నాలుగుకల్లా ఇంటికి వచ్చి, కూరలన్నీ బుట్టలో సర్దుకున్నాడు.

బొగ్గులపొయ్యి వెలిగించి, టీ పెట్టుకుని తాగాడు. క్యాబేజీ ముక్క మిగిలిందానిని సన్నగా తరుక్కొని, ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిరపకాలు చిన్న అల్లంముక్క కూడ తరిగి క్యాబేజీలో కలిపాడు రెండు గరిటలు శనగపిండి, అరగరిటె బియ్యంపిండి, చిటికెడు వంటసోడా పొడి కలిపి, నూనె కాగిం తర్వాత పకోడీలు వేశాడు.

ఐదు గంటలలోపే తమ్ముళ్లు వచ్చేశారు. చిన్నోడు వస్తూనే, “సుంకిరెడ్డిగారింటి వరకు వస్తూంది పకోడీల వాసన. తొందరగా పెట్టు” అంటూ కాళ్లూ చేతులు కడుక్కోవడానికి వెళ్లాడు. అన్నదమ్ములు ముగ్గురూ కలిసి పకోడీల గిన్నె ఖాళీ చేశారు.

తమ్ముళ్లను చదువుకోమని చెప్పి పాంటు షర్టు వేసుకుని కొత్తబాటా చెప్పులు వేసుకుని, కొత్త వాచీ పెట్టుకుని లైబ్రరీకి వెళ్లాడు పతంజలి. లైబ్రేరియన్‌ను విష్‌ చేసి వారం రోజుల నుండీ వచ్చిన ‘హిందూ’లన్నీ వెతికితే ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా’ వారి ప్రకటన కనబడింది. ఒక కాగితంలో వివరాలు నోట్‌ చేసుకొని వస్తూంటే గోడమీద కాంతారావు సినిమా వాల్‌ పోస్టరు కనపడింది. ‘సప్తస్వరాలు’. వెంటనే యింటికి వెళ్లి సినిమాకు వెళదామని తమ్ముళ్లకు చెప్పి, బొగ్గుల పొయ్యిమీద అన్నానికి పెట్టి. సంధ్యవార్చి, దేవునికి ప్రదోష పూజ చేశాడు.

ఏడున్నర కల్లా భోజనం చేసి, ఎనిమిదికి టూరింగ్‌ టాకీసు చేరుకున్నారు. సింగిల్‌ ప్రొజెక్టరు విధానం పోయి డబుల్‌ ప్రొజెక్టరు పెట్టారు. సినిమా చాలా బాగుంది. పదకొండు కల్లా ఇంటికి వచ్చి పడుకున్నారు.

మరుసటి రోజు వంట చేసి, భోజనం చేసి తోటకు వెళ్లాడు. మినుము, పెసర పంట చేనంతా పరుచుకుని పచ్చగా కళకళలాడుతూంది. నిమ్మచెట్లలోకి వెళ్లాడు. పదిమంది కూలీలు సలికెలతో కాండం చుట్టూ ఉన్న బోదెను బైటికి లాగి పాదంతా చదును చేస్తున్నారు. చెట్ల వెంట అక్కడక్కడ ఆముదపు చెక్క బస్తాలు పడేసి ఉన్నాయి. ఆడవాళ్లు వాటి మూతులు విప్పి, ఇనుప తట్టల్లోకి తీసుకొని, పాదుల్లో చల్లుతున్నారు. ఒక్కో చెట్టుకు మూడు తట్టలు పడుతున్నాయి. మళ్లీ సలికెలతో మట్టి కప్పుతున్నారు. పాదు చూట్టు ఉన్న ‘గెనం’ (గట్టు) ఎత్తుగా చేస్తున్నారు. ‘పని ప్రారంభించారన్నమాట’ అనుకున్నాడు. ‘దీని ప్రభావం ఎలావుంటుందో?’ అని భయమేసింది.

ఓబులప్ప స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. పతంజలిని చూసి “సామీ సూడు నీ చెట్లు ఎలా తిరుక్కుంటాయో” అన్నాడు.

“చూద్దాం. ఏమాత్రం తేడా వచ్చినా, మళ్లీ మునుపటిలా చేయించాలి” అన్నాడు హెచ్చరికగా, సుంకన్న గూడ ఎందుకో ముభావంగా ఉన్నాడు. తమ్ముళ్లు బడినుండి వచ్చేసరికి యిల్లు చేరుకొని వాళ్లకు అన్నం పెట్టి పంపిచాడు.

పోస్ట్ మ్యాన్‌ ఒక కార్డు ఇచ్చి వెళ్లాడు. తండ్రి నంద్యాల నుండి వ్రాశాడు. “అక్కయ్య ఈ రోజు రాత్రి పదిగంటల మూడు నిమిషాలకు మగశిశువును ప్రసవించినది. తల్లీ పిల్లవాడు క్షేమంగా ఉన్నారు. ఎల్లుండి ఇంటికి పంపిచెదరు. నేను మహిత వారం రోజుల తర్వాత బయలుదేరి వచ్చెదము. ఆశీః ఇట్లు మా॥ శ॥”

తాజాకలము: ఇరవై ఒకటోరోజున నామకరణం జరుపుటకు నిశ్చయించినాము. నంద్యాలలోనే.

‘ఇంకో మేనల్లుడు వచ్చాడన్నమాట’ అనుకున్నాడు. బ్యాంకుకు వెళ్లి ఇరవై రూపాయలకు డి.డి. తీశాడు. ఈమధ్యే చిన్న టైపు ఇన్‌స్టిట్యూట్‌ పెట్టారు. అందులో అప్లికేషన్‌ ఫారం హిందూలో ఇచ్చిన ఫార్మాట్‌ ప్రకారం టైపు చేయించాడు. ఫోటోలున్నాయి. అన్నీ జాగ్రత్తగా ట్యాగ్‌ చేసి రిజిస్టరు పోస్టులో పంపాడు. సెంటరు కర్నూలే ఎంచుకున్నాడు.

ఫిబ్రవరి మొదటి వారంలో ట్యూషను ఫీజులన్నీ వసూలయ్యాయి. కర్నూలుకు వెళ్లి టైలర్‌ వద్ద బట్టలు తీసుకొని ‘లక్ష్మీనారాయణ బుక్‌ డిపో’కు వెళ్లి ‘కాంపటీషన్‌ సక్సెస్‌’ లేటెస్ట్‌ది తీసుకున్నాడు. ‘బ్యాంకు పి.వోస్‌ ఎక్జామినేషన్‌’ అన్న పుస్తకం కొన్నాడు ‘సుల్తాన్‌ అండ్‌ చాంద్‌’ వాళ్ల ప్రచురణ.

కాలం గడిచిపోతూ ఉంది. బ్యాంకు పరీక్షకు కష్టపడి ప్రిపేరవుతున్నాడు. వాగ్దేవక్క రెండో కొడుక్కు ‘నాగేశ్వర్‌’ అని పేరు పెట్టారు. మార్కండేయశర్మ వెళ్లి బారసాల జరిపించి వచ్చారు. నెల దాటకుండా అక్కను పిల్లలను తీసుకొని వెల్దుర్తికి వచ్చింది వర్ధనమ్మ. ఒక వీకెండ్‌ రామ్మూర్తి బావ వచ్చి వెళ్లాడు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌ చేయించుకున్నాడు. ఆ కాలంలో ఇద్దరితో ఆపేయడం ఒక వింత. శశికి మాటలన్నీ వచ్చాయి. తమ్ముడ్ని ఒకసారి పొట్టకు కరిపించుకొని “తమ్ముడేడుస్తుంటే ఎత్తుకున్నా” అని చెప్పాడు. కిందపడేస్తాడేమోనని అంతా భయపడ్డారు.

బావకు ఆఫీసరుగా ప్రమోషనిచ్చి హైదరాబాదుకు వేశారు. సికింద్రాబాద్‌లోని జేమ్స్‌ స్ట్రీట్‌ బ్రాంచికి. అక్కనూ పిల్లలను వెల్దుర్తిలోనే ఉంచి, బావ వెళ్లి జాయినై వచ్చాడు. ఆఫీసుకు దగ్గరలో ‘ఉజ్జయిని మహంకాళి’ దేవస్థానం ఎదురుగా ఉన్న సందులో ఇల్లు దొరికింది. పై అంతస్తులో మార్వాడీ ఓనరు కుటుంబం ఉందట. క్రింది పోర్షను వీళ్లకిచ్చారు. బాడుగ రెండు వందలట. సిటీలో అద్దెలు ఎక్కువే ఉంటాయట. నంద్యాల నుండి హైదరాబాదుకు సామానంతా ప్యాక్‌ చేసి యస్‌.ఆర్‌.ఎం.టి.లో బుక్‌ చేశాడు బావ. సికింద్రాబాద్‌లో డెలివరీ అయిం తర్వాత సామానంతా తానే సర్దుకున్నాడు.

మూడో నెలలో మంచి రోజు చూసి కుటుంబాన్నిఆయనే వచ్చి తీసుకుని వెళ్లాడు. వర్ధనమ్మ కూడ వెళ్లి పది రోజులుండి అన్నీ అమర్చి వచ్చింది. అద్దె ఎక్కువైనా యిల్లు చాలా బాగుందట. బెడ్‌ రూం ప్రత్యేకంగా ఉంది. హాలు పెద్దగా ఉందట. వంటిల్లు కూడ విశాలంగా ఉందట. ఇల్లంతా షెల్ఫ్‌లు, తలుపులతో ఉన్నాయట.

కానీ పెరడేమీ లేదట. ఇంటిముందు కూడ కొంచెమైన స్థలం లేదట. ముందు చిన్న వరండా. దానికి కటాంజనం (గ్రిల్స్‌) ఉన్నాయి. వరండా దాటితే వీధిలోకే.

మహంకాళి అమ్మవారి దేవాలయం ఎంత దగ్గరంటే, రెండు నిమిషాల నడక అని చెప్పింది వర్ధనమ్మ. పనిమనిషి కూడ కుదిరిందనీ, గిన్నెలు తోమి, ఇల్లు తుడిచి, బట్టలు ఉతకుతుందని. నెలకు పాతిక రూపాయలనీ చెప్పింది. బట్టలు ఆరేసుకోవడానికి  చోటే లేదట. ముందు వరండాలో తీగెలు కట్టుకున్నారట. వాటిమీద ఆరేసుకుని ఫ్యాన్‌ వేసుకుంటారట. ఇంటివాళ్లే బెడ్‌ రూంలో, హాల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు బిగించారట. ఫ్లోరింగ్‌, హాల్లో బెడ్‌రూంలో, మొజాయిక్‌తో చేశారట.

వర్ధనమ్మ ఇమ్లీబన్‌లో అనంతపురం బస్సెకించాడు బావ. భోజనం చేసి పదకొండు గంటలకెక్కి సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తిలో దిగింది. పతంజలి బస్టాండుకు వెళ్లి దింపుకున్నాడు.

ఉగాది పండుగ వచ్చింది. పోయింది. వేరుశనగ రేటు వంద దాటుతుందనుకుంటే డెభైకి పడిపోయింది. దాదాపు నాలుగు వేలు నష్టం. ఇంకా తగ్గొచ్చని శెట్టి తొందరపెడితే డెభై రెండుకు ధర తెంపారు. తొమ్మిది వేల చిల్లర వచ్చింది. మూడు వేలు శెట్టికి జమ చేశారు. మూడు వేలు బ్యాంకు లోన్‌ కట్టారు.

బ్యాంకు పరీక్ష వ్రాసి వచ్చాడు. డిగ్రీ పరీక్షల లాగా సులభంగా లేదది. న్యూమరికల్‌ ఎబిలిటీలో చాలా ప్రశ్నలు చేయలేకపోయాడు. టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌ సులభంగానే ఉంది కాని, టైం చాలలేదు. ఇంగ్లీషు కూడ అంత తేలికగా కనిపించలేదు. కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌ చదవడానికే చాలా టైం పట్టింది. మొత్తానికి ఏమాత్రం సంతృప్తిగా రాయలేకపోయాడు.

ఎండాకాలంలో ట్యూషన్‌ పిల్లలకు ఇంగ్లీషులో స్పెషల్‌ క్లాసులు స్టార్ట్‌ చేశాడు. చాలామంది చేరారు. ఫీజు నెలకు పది రూపాయలు పెంచినా తగ్గలేదు స్ట్రెంగ్త్. పతంజలికి క్రమక్రమంగా ఒక విషయం అర్థమవుతూంది. దినదిన గండం లాంటి వ్యవసాయం కన్న, కేవలం తన తెలివితేటలు మాత్రం పెట్టుబడిగా ఉన్న ట్యూషన్లే రాను రాను కుటుంబానికి ఆధారమవుతున్నాయని.

ఒకరోజు తండ్రీకొడుకులిద్దరూ తోటకు బయలుదేరారు. ఈమధ్య పదిహేను ఇరవై రోజులుగా చెట్లను గమనించలేదు. పాదులు మార్చి ఆముదపు చెక్క వేసి మూడు నెలలు దాటింది. చెట్లలో తిరుగుతూంటే అర్థమయింది. అనుకున్నంతా అయిందని. చెట్లు కళ తప్పాయి. కొమ్మలు తెల్లబడుతున్నాయి. పూత తగ్గింది. పిందెలు గిడసబారినట్లు స్పష్టంగా తెలుస్తూంది.

నెత్తిన చేతులు పెట్టుకొని కింద గొంతుకూర్చుండిపోయాడు మార్కండేయ శర్మ. “సర్వనాశనమైపోయామురా పతంజలీ” అని ఆక్రోశించాడు. ఓబులప్పగాని సంజీవరాయుడుగాని లేరు. వారం రోజులకు గానీ రారట.. చెట్లు దెబ్బతింటున్నాయని ఒక్కమాటన్నా చెప్పలేదేమని సుంకన్నను తిట్టారు. తన కొడుక్కు పసిరికలయినాయనీ, పుట్లూరులో పసరు ముందు ఇప్పిస్తున్నామనీ, తానూ వారం రోజులుగా పనికి రావడం లేదనీ చెప్పాడు వాడు. తోకోడు కూడ ఈ మధ్య పనిలేక, వేరే పనులకు వెళ్లుతున్నాడు. వెంటనే పాదులు మార్పిద్దామంటే రెండ్రోజుల కిందే నీళ్లు పారించినట్లున్నారు తడి ఆరలేదు. పూర్తిగా ఆరితేగాని మట్టిని మళ్లీ కాండం చుట్టూ బోదె కట్టడానికి వీలవదు.

“నేల ఆరింతర్వాత చేయిద్దాములే నాన్నా. దిగులు పడకండి. మళ్లీ తిరుక్కుంటాయి. అంతగా అయితే మళ్లీ చేపల ఎరువు తెచ్చివేద్దాము” అని తండ్రికి ధైర్యం చెప్పాడు పతంజలి. వాళ్ల గుత్తపరిమితి ఇంకా ఆరు నెలలుంది. ఈ పెట్టుబడంతా వాళ్లతోనే పెట్టించాలి అనుకున్నారు. వాళ్లల్లో ఎవరు వచ్చినా వచ్చి చెప్పమని సుంకన్నకు చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కుటుంబానికి ఆదరువుగా ఉన్న నిమ్మ చెట్లు మళ్లీ యథాస్థితికి వస్తాయా లేదా అనేది పెనుభూతంలా మారి వాళ్లను కలవరపెట్టసాగింది.

వారం రోజుల్లో ఓబులప్ప వచ్చాడు. అతని ధోరణి యింతకుముందులాగా వినయంగా లేదు. అతనితో పెద్ద వాగ్యుద్ధమే జరిగింది. మంచి జరుగుందనే చేశాము. చెట్లు దెబ్బతింటే మాకూ నష్టమే కదా అంటాడతను. నీ నష్టం తాత్కాలికమే మాకు అసలుకే నష్టం వచ్చి, మా కుటుంబానికే కోలుకోలేని దెబ్బ తగిలేలా ఉంది. దానికేం చెబుతావని వీళ్లు.

పతంజలి గమనించాడు. వాళ్ల డబ్బు వాళ్ల కొచ్చేసింది. ఇంకా లాభమే వచ్చింది. వెంటనే పాదులు మార్పించి, ఎండు చేపల ఎరువు వేయాలని చెప్పారు. దానికి ఓబుళప్ప ఏం మాట్లాడలేదు. వేపపిండి, మైలుతుత్తం (కాల్షియం నైట్రేడ్‌). గోమూత్రం కలిపి పిచికారి చేస్తే సరిపోతుందన్నట్లుగా చెప్పాడు సమస్య తేలలేదు.

మరుసటి రోజు రాధాసారు దగ్గరికిపోయి విషయమంతా వివరించాడు పతంజలి. తాను వచ్చి స్వయంగా పరిశీలిస్తే గాని చెప్పలేనన్నాడు ఆయన. సాయంత్రం నాలుగ్గంటలకు వెళదామన్నాడు.

ఆయనను తీసుకొని తోటకు వెళ్లాడు. సుంకన్నతో ఆక్కడక్కడ తవ్వించి, చెట్ల వేర్లు పరిశీలించాడు రాధాసారు. కొమ్మలను ఆకులను పరీక్షించాడు. దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు.

“సామీ! శానా దురదుష్టం. వేర్లు ఇంకో నెల రోజులుంటే కుళ్లిపోయేటట్లుండాయి. రేగట్లో సవుడు గలిసిన భూమిగాబట్టి నీళ్లు పీలుస్తాది. తొందరగా ఆరదు. ముందు మీరు చేసిన పని చానా మంచిది. కాండం చుట్టూ మూడడుగుల బోదె చేసి నీళ్లు పాదు బయటే పారిస్తుంటిరి. ఎండు శేపల ఎరువు వేడి జేస్తాది. ఈ పొలానికి కరెక్ట్‌గా సూటయినాది. అందుకే దిగుబడి బ్రమ్మాండంగా వచ్చినాది. ఆ నాయాండ్లు ఆముదంసెక్క తోలిరి. బోదెమన్నంతా దిగలాగిరి. సెట్లకు నీళ్లెక్కువై, భూమి ఆరక, ఏర్లు కుల్లడానికి తయారయినాయి.”

“వెంటనే పాదులు మార్పించి, మళ్లీ చేపల ఎరువు వేస్తే”

“పలితముంటాదని గ్యారంటీ యాడుంది. అట్లని సూసి సూసి ఇడిసి పెట్టలేంగద. ఈ పెట్టుబడంతా శాగలమర్రి నాకొడుకులే బెట్టుకోవాల మరి. వాండ్లకు ఈపాటికే గుత్త దుడ్లు గిట్టుబాటయి లాభం కూడ వచ్చింటాదంటుండావు. పెద్ద రెడ్డి కాడ పంచాయితీ పెట్టించండి”

మార్కండేయశర్మ రామకృష్ణారెడ్డి (దశరధవాళ్ల నాన్న) దగ్గరకు పోయి అంతా చెప్పాడు. ఆయన జిల్లా పరిషత్‌ వైస్‌ ఛైర్మన్‌. తలారిని పంపి ఓబులప్పను పిలిపించాడు. శర్మ, పతంజలి, రామలింగయ్యశెట్టి, మరికొంతమంది పెద్దలు కూర్చున్నారు. ఓబుళప్ప లొంగి రాలేదు. పిచికారీ చేయిస్తాను అంటాడు. అగ్రికల్చరల్‌ డిమాన్‌స్ట్రేటర్‌ కూడ చూశాడని వేర్లు కుళ్లిపోతున్నాయని చెప్పాడని పతంజలి వాదించాడు.

తామూ నష్టపోయామని ఇప్పుడు పాదులన్నీ మార్పించి, చేపల ఎరువు పెట్టుబడి పెట్టడం తన వల్ల గాదని తేల్చి చెప్పాడు ఓబుళప్ప. తనకూ ఆళ్లగడ్డలో పలుకుబడి ఉన్నట్లు ఒక ఫాక్షనిస్టు పేరు చెప్పాడు.

రామకృష్ణారెడ్డికి కోపం వచ్చింది. సామోల్లు అన్యాయమై పోతున్నారు కాబట్టి మీ గుత్త రద్దు చేస్తున్నట్లు, మీకు మిగతా ఆరు నెలలు తోటమీద ఏ అధికారం లేనట్లు తీర్పు చెప్పాడు. కాదూ కూడదంటే వెల్దుర్తి దాటి వెళ్లలేవని బెదిరించాడు.

ఓబులప్ప ముఖంలో రిలీఫ్ కనిపించింది పతంజలికి. అవును మరి వాడికి నష్టమేముంది. కొనసాగితేనే ఇంకా నష్టం రావచ్చు.

“సరే నాయనా (రెడ్డిగారిని నాయనా అని సంబోధిస్తారు) నీవు తీర్పు సెప్పినంక నీ మాట మీరేదేముంది” అని చెప్పి, మార్కండేయశర్మ పాదాలకు నమస్కరించాడు.

“సామీ! సెమించాల నీవు. పున్నానికి బోతే పాపం ఎదురైనట్లు నేను ఒకటనుకుంటే మరొకటయినాది. నా మనసులో సెడు లేదు. ఈ ఆరునెల్లు పంట, సుమారు నాల్గు దిగుబడులు నష్టపోతిమి, మీ ముందు ఎంతటోల్లం” అని చెప్పి వెళ్లిపోయాడు.

రెడ్డి అన్నాడు. “సామీ! ఇంతకంటే ఏం చేయాలో నాకు తోచలేదు. వాని పీడ విడిపిస్తే, కనీసం మనమన్నా జరిగిన తప్పును సరిదిద్దుకుంటామేమో! అందుకనే అట్లా చెప్పినాను”

వెళ్లొస్తామని చెప్పి తండ్రీ కొడుకులు ఇల్లు చేరినారు. రాత్రి అభోజనం పడుకున్నారంతా. తమ్ముళ్లు మాత్రం కొంచెం తిన్నారు. పతంజలి ధైర్యంగా ఉన్నాడుగాని, నాన్న పూర్తిగా కుదేలయ్యాడని గ్రహించాడు.

మర్నాటినుండే రంగంలో దిగాడు పతంజలి. భూమి ఆరింది. ఇరవైమంది కూలీలను పెట్టి రెండు రోజుల్లో పాదులు మార్పించాడు. బోదెలు తయారయ్యాయి. బాజిరెడ్డిని మండీ దగ్గర కలిసి విషయం చెప్పాడు.

“నేననుకుంటూనే ఉండా ఇట్టా జరుగుతాదని” అంటూ గుత్తదారులను బూతులు తిట్టాడు.

“మల్లా అంత దూరం పోయి ఎండుశేపల ఎరువు తేలేము. ఒక పని జేద్దాము” అని చేపల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ విచారిస్తే వన్‌టౌన్‌లో ఎండు చేపల హోల్‌సేల్‌ అంగళ్లున్నాయని వాళ్లకు తెలుస్తుందనీ చెప్పారు.

వన్‌టౌన్‌లో చిత్తారిగేరిలో ఒకే చోట ఐదారు అంగళ్లున్నాయి.

బస్తాలలో ఎండు చేపలు, రకరకాల సైజుల్లో ఉన్నాయి.

కొంచెం పెద్దాయన దగ్గరికి పోయి ఎండు చేపలు కాకుండా, ఫిష్‌ వేస్ట్‌ తోటకు ఎరువుగా కావాలి ఎక్కడ దొరుకుతుందని అడిగారు.

“ఎంత అవసరమౌతుంది?”

“దాదాపు ఒక లారీ లోడ్‌ కవాలి”

“కర్నూల్లో అంత దొరకదు. మేమంతా హైద్రాబాద్‌ నుండి సరుకు తెచ్చుకుంటాము. బేగంబజారు దాటి అవతల ‘మిర్యాలమండి’  అని ఉంటాది, పెద్ద పెద్ద హోల్‌సేల్‌ అంగళ్లున్నాయి. వాళ్ల దగ్గర గ్రేడింగ్‌ చేయగా మిగిలింది ఉంటుంది. ధర తక్కువేగాని లారీ బాడుగ ఎక్కువయితుంది” అన్నాడాయన.

అక్కడినుంచి వచ్చేశారు. ఆ రోజు రాత్రే బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి హైదరాబాద్‌ చేరుకున్నాడు. మహంకాళి గుడి ఎదురుగా సందులో అక్కయ్యవాళ్లిల్లు సులభంగానే కనుక్కున్నాడు. వేరుశనగ కాయలమ్మిన డబ్బులోంచి మూడువేలు తీసుకొని భద్రపరచుకున్నాడు బయలుదేరే ముందే.

అక్కయ్యే తలుపు తీసి ఆశ్చర్యపోయింది. “అదేమిట్రా పతంజలీ! జాబైనా వ్రాయకుండా వచ్చేశావు” అంటూ చేతిలోని బ్యాగు అందుకుంది. ఇంకా బావ, శశిగాడు లేవలేదు. చిన్నోడు గుడ్డ ఉయ్యాలలో పడుకొని కళ్లు తెరిచి చూస్తున్నాడు. పతంజలి ఉయ్యాలలోకి తొంగి చూస్తే, పలకరింపుగా నవ్వాడు.

ముఖం కడుక్కుని, అక్కయ్య యిచ్చిన కాఫీ తాగాడు. ఈ లోపు బావ, బావ వెంట శశి లేచివచ్చారు. పతంజలిని చూసి ఆశ్చర్యపోయారు.

“మామా! నా కారు చూడు” అంటూ తన కారు బొమ్మను చూపించాడు శశి.

రామ్మూర్తి పతంజలి వాలకం గమనించి అన్నాడు.

“ఏమిరా! అలా వున్నావు? ఏం జరిగింది?” అని అడిగాడు.

జరిగిందంతా చెప్పాడు “సరే భోజనం చేసి రెస్టు తీసుకో ఈ రోజు శనివారం. నేను రెండు కల్లా వస్తాను. ఇద్దరం వెళదాం. ఆ ఏరియా పేరేందన్నావు?”

“మిర్యాలమండి బేగంబజారు అవతల”

బావ నవ్వి అన్నాడు. “దాని అసలు పేరు మీర్‌ అలంమండి ఐవుంటుంది. అదంతా ముస్లిం ఏరియా. దాన్ని కాస్తా మిరియాలమండిగా మార్చారు. మనిద్దరం స్కూటరు మీద పోదాములే”.

పతంజలి అడిగాడు ‘స్కూటరెప్పుడు కొన్నావు బావా? ఏ కంపెనీది?”

“కొని వారం రోజులు కూడ కాలేదురా! బజాజ్‌ చేతక్‌. బ్యాంకువాళ్లే లోనిచ్చారు. మన యింట్లోగాని, ఇంటిముందుగాని పెట్టుకోవడానికి అవకాశం లేదు. మన యింటికి నాలుగు ఇళ్లవతల మా కొలీగ్‌ ఉంటున్నాడు. అతని ఇంటిముందు చిన్న కాంపౌండ్‌ గేటు ఉంటాయి. అక్కడ పెట్టుకుంటున్నా స్కూటరు.”

“మరి సైకిలు?”

“అది మా అటెండరుకు అమ్మేశాను”

“మామా! నేను, అమ్మ, నాన్నా డుర్‌ డుర్‌ పోతాము కూతరు మీద” అని చెప్పాడు శశి.

బావ తొమ్మిదిన్నరకు భోజనం చేసి బ్యాంకుకు వెళ్లిపోయాడు. పతంజలి, వాగ్దేవి కూడ భోజనం చేశారు. కాసేపు చిన్నల్లుడిని ఆడిరచాడు. కబుర్లు చెప్పుకున్నారు.

రెండుంబావుకు బావ వచ్చేసరికి పతంజలి సిద్ధంగా ఉన్నాడు. అక్క యిచ్చిన కాఫీ తాగి ఇద్దరూ బయలుదేరారు. లేత నీలంరంగులో స్కూటరు మెరిసిపోతూంది. వెనక నంబరు ప్లేటుమీద శశి, నాగ అని రాయించాడు బావ.

తాను మునుపు నిమ్మకాయలు తీసుకొచ్చిన షరీఫ్‌మండీ మీదుగానే బండి వెళుతున్నట్లు గమనించాడు. రాజధాని హోటల్‌, ఉస్మానియా మెడికల్‌ కాలేజి దాటి మీర్‌ ఆలం మండీకి చేరుకునేసరికి నాలుగు కావస్తుంది.

ఆ ప్రాంతం అంతా ఎండు చేపల వ్యాపారమే. ప్రతి అంగడిలో రకరకాల ఎండు చేపలు రాసులు పోసి అమ్ముతున్నారు. ఒక షాపు వద్ద విచారిస్తే అతను కూర్చోండి అని చెప్పి ఎవరికో ఫోన్‌ చేశాడు. పది నిముషాల్లో ఒకతను వచ్చాడు. తన పేరు ‘ఫజలుద్దీన్‌’ అని పరిచయం చేసుకున్నాడు.

సరుకు గ్రేడింగ్‌ చేసిన తర్వాత మిగిలిన చెత్త కుళ్లిపోయిన చేప భాగాలు, ఎముకల ముక్కలు అన్నీ ఒక యార్డులో డంప్‌ చేసి ఉన్నారట. తీసుకెళ్లి చూపించాడు. గోకర్ణంలో దొరికినంత బాగాలేదు కాని ఎరువుగా పనికొస్తుంది.

జరిగిన నష్టం పెద్దదే కాబట్టి, చెట్లకు ఎక్కువేయడం మంచిదనుకున్నాడు పతంజలి. పెద్ద బండే కావాలి. “పదమూడు టన్నులది” అని చెప్పాడు. కర్నూలు దాటి ముఫై కిలోమీటర్లు వెళ్లాలని తెలిసి ఫజలుద్దీన్‌ చెప్పాడు.

“లారీ బాడుగ లోడింగ్‌ దాదాపు వెయ్యిరూపాయలవుతుంది సార్‌. సరుకు మొత్తం బాడీలో వేసేయడమే. బస్తాలో నింపాలంటే చాలా కష్టం. బాడీ చుట్టూ వెదురు తకడలు పైవరకు కట్టించి, సరుకు బాడీమీద నాలుగయిదుడుగుల ఎత్తు వచ్చేలా వేయిస్తాను. డ్రైవర్‌ బత్తా వంద యివ్వండి. లారీ బ్రోకరేజ్‌ ఐదు పర్సెంట్‌ ఉంటుంది. వెదురు తడకలు మళ్లీ వెనక్కు పంపండి.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here