సర్వ మత సమానత్వాన్ని ఆచరించిన శ్రీ శిరిడీ సాయిబాబా

0
3

[dropcap]మ[/dropcap]న దేశంలో 19వ శతాబ్దంలో మత మౌడ్యం తీవ్రతరం అయ్యింది. హిందు, ముస్లింల మధ్య కలహాలు ఎక్కువై, ప్రాణ నష్టం జరిగి, రక్తం ఏరులై పారేది. రెండు మతాల వారు ఒకరంటే మరొకరికి ఏ మాత్రం పొడ గిట్టని దుర్భర పరిస్థితి. అటువంటి తరుణంలో రెండు మతాల మధ్య సద్భావం నెలకొల్పడానికి, సోదర భావం పెంపొందించడానికి స్వయాన ఆ పరబ్రహ్మమే ఒక ఫకీరు రూపంలో ఈ భువిపై అవతరించారు. ఆ అవతారాన్ని లక్షలాది భక్తులు ‘సాయి’ అని ఎంతో ప్రేమతో పిలుచుకునేవారు. “ఇహపర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం! అన్ని మతాలు ఒక్కటే! అందరి మహనీయుల ప్రవచన సారాంశం ఒక్కటే! అందరు మతస్థులు ఆ పరమాత్మ బిడ్డలమే! అందరిలో ప్రవహించేది ఒకే రక్తం. అందరిలో సజీవమై ప్రకాశించే ఆత్మ తత్వం ఒక్కటే. హిందువుల దైవమైన రాముడు, ముస్లిం  దైవమైన అల్లా ఒక్కరే. ఆ పరమాత్ముడిని చేరేందుకు వివిధ మార్గాలే మతాలు. దారులు వేరైనా, చేరబోయే గమ్యం ఒక్కటే. ఆందుకని మీలో మీరు కలహించుకోవడం మానండి” అని శ్రీ సాయినాథులు తన భక్తులకు ప్రభోదించేవారు. మానవులలో దట్టంగా పేరుకొని పోయి వున్న మత మౌఢ్యాన్ని తొలగించి, వారికి నిజమైన ఆధ్యాత్మిక ధర్మం తెలిపి, వారిని జ్ఞానవంతులను చేయడానికే శ్రీ సాయినాథులు అవతరించారు.

ఒకసారి శిరిడీలో ఒక ముస్లిం భక్తుడు తనకు సంతానం కలిగితే శిరిడీకి వచ్చి మిఠాయిని పంచుతానని మొక్కుకున్నాడు. బాబా అనుగ్రహం వలన అతని కోరిక ఫలించింది. పండంటి మగ సంతానం కలిగింది. కోరిక నెరవేరిన నేపథ్యంలో శిరిడీ వచ్చి మిఠాయి పంచడానికి శ్రీ సాయినాథుల అనుమతి కోరాడు ఆ ముస్లిం. బాబా చిరునవ్వు నవ్వి “వెళ్ళి మారుతీ ఆలయంలో మిఠాయిని పంచు” అని అన్నారు. ఆ ముస్లిం బాబా మాటలకు ఆశ్చర్య పడి “నేను ముస్లింను కదా! హిందువుల ఆలయంలో మిఠాయిని ఎలా పంచగలను?” అని అడిగాడు. అందుకు బాబా నవ్వి “ఇటీవల జరిగిన యుద్ధంలో ఆంజనేయుడు అల్లాను ఓడించాడు” అని మరింత కోపంతో “ఏమి ముస్లింవి రా నువ్వు? ఇదేనా ఖురానును చదివి నువ్వు అర్థం చేసుకున్నది? వెళ్ళి మారుతీ ఆలయంలో మిఠాయిని పంచు” అని అజ్ఞాపించారు. ఇక చేసేది లేక ఆ ముస్లిం భక్తుడు మారుతి ఆలయంలో మిఠాయిని పంచి తన మొక్కును తీర్చుకున్నాడు. నామ, రూప, గుణ రహితుడు, సర్వ గతుడు, విశ్వ వ్యాప్తుడైన భగవంతునిపై భక్తికి మత భేదం అడ్డు కారాదని ఈ లీల ద్వారా శ్రీ సాయి మనకు కళ్ళకు కట్టినట్లుగా తెలియజేసారు.

మత మార్పిడిని శ్రీ సాయి తీవ్రంగా నిరసించేవారు. విశ్వానికి సృష్టి, స్థితి, లయ కారకుడైన భగవంతుడు ఒక్కడే! సందర్భానుసారంగా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతార కార్యం గావించేవాడు. అన్ని మతాలు ఆ భగవంతుడిని చేరడానికే పుట్టాయి. సర్వ మానవ సమానత్వాన్ని ఉద్భోదించే శ్రీ సాయి భక్తులకు మతం మార్చుకోవడం అనవసరం అని చేప్పేవారు. శ్రీ సాయికి కూర్మి భక్తుడైన బడే బాబా ఒక హిందువును ముస్లింగా మార్చి శ్రీ సాయి దర్శనానికి తీసుకు వచ్చి తాను చేసిన ఘనకార్యాన్ని వివరించాడు. అప్పుడు శ్రీ సాయి ఉగ్రులై ఆ యువకుని చెంప పగిలేలా కొట్టి “నీ తండ్రిని మార్చుకున్నావట్రా!” అని అరిచారు. తన మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాపమని బాబా వారి అభిప్రాయం.

ఈ చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త ఆ భగవంతుడే. ఆయన యొక్క తర్వం చైతన్యం రూపంలో ఈ సృష్టి అంతటా ఆవరించి వుంది. పిపీలికం నుండి సృష్టి నడవడికను శాసించే ఆ గ్రహ గోళాదుల వరకు అందరిలో, అన్నింటా నిండి వున్నది ఆ పరమాత్మ చైతన్యమే. సులభంగా అర్ధమయ్యేందుకు ఆ చైతన్యానికే ఆత్మ అనే పేరు పెట్టారు. అందరిలో, అన్నింటా నిండి వున్నది ఒక్కటే చైతన్యం అయిన్నపుడు మానవులు కులం, మతం పేరిట మానవులు తమను విభజించుకొని తమలో తాము కలహించుకోవడం ఎంతవరకు సమంజసం?

మరొక సందర్భంలో సాయి భక్తాగ్రేసరుడైన దాదా కేల్కర్‌ను సాయి పిలిచి కొంత డబ్బిచ్చి మాంసం కొని తీసుకు రమ్మన్నారు. దాదా కేల్కర్ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. సదాచార సంపన్నుడు. రక్తం చూస్తే చాలు కళ్ళు తిరిగి క్రింద పడిపోతాడు. అటువంటి వ్యక్తి తన సమర్థ సద్గురువైన సాయి చెప్పిన వెంటనే నిస్సంకోచంగా బయలుదేరాడు. మధ్య మార్గంలో అతనిని వెనక్కు పిలిచి ఇంకెవరినైనా పంపించమని చెప్పారు శ్రీ సాయి. ఇంకొక సారి మశీదులో మాంసం పలావు వండుతున్న శ్రీ సాయి, దాదా కేల్కర్‌ను పిలిచి “పలావు ఎలా వుందో రుచి చూడు” అని అడిగారు. కేల్కర్ చూడకుండానే “చాలా బావుంది” అని అన్నాడు. సాయి నవ్వుతూ “రుచి చూడకుండానే బాగుందంటావేం?” అంటూ కేల్కర్ చేతిని బాండీ లోనికి తోసి “సరిగ్గా వుడికిందో లేదో చూడు, ఆచారం గురించి భయపడకు” అని ప్రేమగా అతనిని గిల్లారు.

ఆచార వ్యవహారాలు శరీరానికే గాని ఆత్మకు లేవు. పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సాయి తన ఆజ్ఞలను శిష్యులు ఏ మేరకు పాటిస్తున్నారో పరీక్ష చేసేందుకే నిషిద్ధమైన పనులను పురమాయించేవారు. గురువు పాదాలకు సర్వశ్య శరణాగతి చేసే గురువు ఆజ్ఞను తు.చ. తప్పక పాటించే భక్తులకే గురువు యొక్క అనుగ్రహ ఫలం శ్రీఘ్రంగా లభిస్తుంది. గురువు ఆజ్ఞలను తన స్వంత బుద్ధితో ఆలోచించి తర్క, వితర్కాలను చేసే వారికి ఎన్ని జన్మలకైనా అనుగ్రహం లభించదు.

సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణ మస్తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here