[dropcap]నా [/dropcap]కలల దారాలు చాలా పొడవైనవి.
ప్రతిరాత్రీ గతంలోకి జారిపోయి
జ్ఞాపకాల చీరల మడతల మధ్యలో దూరిపోయి
మెత్తని, చక్కని బొంతను కుట్టేస్తాయి.
కుట్టేటప్పుడు దానిలోనే పెట్టి మరచిపోయిన సూది
అప్పుడప్పుడూ గుచ్చుకుంటున్నా
ఈ బొంతను కప్పుకొని పడుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది.
వెచ్చగా, చల్లగా, ఆప్యాయంగా
నా మనశ్శరీరాలను కప్పుతున్న ఈ బొంత నాకెంతో భరోసా.
దానిని తొలగించి బయటకు రావాలంటే భయం.
బయటకొస్తే అసలే నిద్రమత్తు.
ఆపైన అయోమయం. లోకమంతా గందరగోళం.
ఎంతో వెలుగున్నా
అంతా చీకటిగా అనిపిస్తుంది.
చీకట్లో పడుకున్నా
నా బొంత నాకిచ్చే నమ్మకం
దానిని తొలగించి బయటకు వస్తే కనుపించదు.
అన్నీ తెలియని దారులు
ఏ దారి ఎటు తీసుకుపోతుందో?
ఏ తీరానికి చేరుస్తుందో?
ఏ ఉదయమూ కొత్త ఆశలకు ఊపిరి పోయదు.
శకుంతాల కూజితాలలో శాంతి గీతం వినిపించదు.
అందుకే నా కలల దారాలతో కుట్టిన బొంతలోనే
ముడుచుకొని పడుకుంటున్నా.