బ్రహ్మజ్ఞానసంపన్నులు, తపోనిధి శ్రీ నారాయణతీర్థ స్వామివరేణ్యులు కోరాడ రామచంద్రశాస్త్రి గారు

4
3

[dropcap]పు[/dropcap]ణ్యశ్రవణకీర్తనులని లోకంలో కొందరుంటారు. వారు వంశపావనులు. వంశమంటే కేవలం లోకయాత్రాచణమైన వారి జన్మవంశమూ, అవిచ్ఛిన్న పరంపరాప్రాప్తమైన విద్యావంశమూ మాత్రమే కాదు. వారు వసుధైకసంసరణులూ, సాక్షాద్భగవత్స్వరూపులున్నూ అయినందువల్ల విశ్వపావను లన్నమాట. వారి దివ్యచరిత్రను ఆలకించటమే ఒక పుణ్యం. నోరారా, మనసారా వారిని కీర్తింపగలగటమే ఆ పుణ్యఫలం. అగ్నిహోత్రుడు తన స్పర్శ మూలాన సర్వధాతువుల సర్వమాలిన్యాలనూ సమయింపజేసినట్లు వారు తమ ఉనికి మూలాన తమ చుట్టూ ఉన్నవారిని సైతం పవిత్రీకరింపగలరు. మృగరాజుకు భయపడి ఇతర మృగాలన్నీ పారిపోయినట్లు వారి సన్నిధి రూపమైన పెన్నిధి వల్ల పాపములే గాక పాపసంకల్పాలు కూడా దూరదవీయస్తటాలకు పటాపంచలవుతాయి.

అటువంటి పుణ్యధనులలో బ్రహ్మజ్ఞానసంపన్నులు, తపోనిధి శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారు. నా వంటి వేలమంది విద్యార్థులకు బాల్యగురువులు, చైత్యచోదకులు, మార్గదీపనులు కావటం మా జన్మజన్మల సుకృతవిశేషఫలం. వారు నిర్విరామ విద్యాదానవ్రతమహోదధి. వారు నేర్పినది ఎంతో అని, నేను నేర్చినది కొంతే అని నాకు తెలుసు. సముద్రాన్ని దర్శించినప్పుడు ఒడ్డున నిలబడి ఇసుకలో కెరటాలతో ఆడుకొంటూ, చిల్లిగవ్వలను ఏరుకొంటూ కాలక్షేపం చేశానని – రత్నాకరంలోని రత్నాలెన్నో, దాని లోతుపరపుల పరిమాణమెంతో ఏ మాత్రం గుర్తింపలేకపోయానని దిగులొక్కటే ఇప్పుడు మిగిలింది. ఆకాశమండలాన మధ్యందిన మార్తాండమండలం మయూఖరేఖాశిఖలను విరజిమ్ముతున్నప్పుడు నిద్రపోయి, సాయంసంధ్యలో మేలుకొన్నవాడి కథ ఉన్నదే, అది నా కథే.

మా గురుదేవులు జగన్నుత వైదికవిప్రకోటిలోని కోరాడ వంశసంజాతులు. యజుశ్శాఖాధ్యాయులు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయ్యార్షేయ కౌండిన్య సగోత్రులు. అమలాపురం చెంతనున్న కేశనకుర్రు వీరి ఆవాసభూమి. అక్కడి నుంచి కోనసీమ మీదుగా విశ్వమంతటా ఉపద్రష్ట, కోరాడ, ఖండవిల్లి, శొంఠి, సుసర్ల కాపురాలతో మల్లెతీగెల లాగా వ్యాపించిన కుటుంబాలవి.

తెలుగులో ‘మంజరీమధుకరీయము’ అన్న పేరిట 1860లో ప్రథమాంధ్రనాటకాన్ని సంతరించిన జగదేకవిద్వాంసులు, మహాకవి, అనేక సంస్కృతాంధ్ర గ్రంథకర్త, అకించనులు అయిన శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారు వీరి ప్రపితామహులు. 1816లో జన్మించి 1900లో పరమపదించారు. వీరి రచనలలో ముప్ఫైకి పైచిలుకు గ్రంథాల వరకు ఉపలభ్యములై ఉన్నాయి. మహామహులైన ఇంగువ రామస్వామిశాస్త్రి గారు, శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి గారల అంతేవాసిగా ఉంటూ అంతే వాసిగా కవిత్వం చెప్పినవారు. వారి సాహిత్యవిజయగాథలు జగద్విదితాలే.

ఆ రామచంద్రశాస్త్రి గారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. పెద్దకొడుకు లక్ష్మీమనోహరం గారు విద్యానిధులై తండ్రిగారి సేవకోసం ఉద్యోగంలో తబాదలాలను కాదనుకొని ఉన్నతపదవీ దవీయసులుగా ఉన్నచోటనే ఉంటూ జీవితాన్ని చరితార్థం చేసికొన్న ధన్యచరిత్రులు. చిన్నకొడుకు దుర్గా నాగేశ్వరశాస్త్రి గారు మంత్రశాస్త్రనిష్ణాత. సమయాచారవిధులలో ప్రయోగోపసంహారవిదులు. గొప్ప అనుష్ఠానవేదాంతి. తండ్రిగారంతటి మహిమాన్వితులు. తండ్రిగారు పనిచేసినచోటే బందరులోని నోబెల్ కళాశాలలోనే ఆంధ్రోపాధ్యాయులుగా కుదురుకొని తండ్రి అంతటివారై, వారి పేరు నిలిపారన్న పెంపు గడించారు. అధ్యాత్మవిద్యాసంపన్నులై ఆంధ్రదేశంలో అభినవ విద్యారణ్య మాధవాచార్యులని వన్నెమీరి వాసికెక్కిన శ్రీ అమృతానందస్వామి గారు వీరి వద్ద నిత్యానుష్ఠాన మంత్రోపదేశం పొందిన ధన్యజీవులు. విజయవాడలో ఆ అమృతానందస్వామివరేణ్యులు నెలకొల్పిన త్రిలింగ విద్యాపీఠాన్ని ‘కవయిత్రీతిలక’ కాంచనపల్లి కనకాంబ గారు వృద్ధిపొందించారు. వదాన్యశిరోమణి శ్రీ చుండూరి వేంకటరెడ్డి గారు కూడా వారి శిష్యులే. విజయవాడలో వేంకటరెడ్డి గారు స్థాపించిన ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాలలో బి.ఎ విద్యార్థిగా చేరినప్పుడు 1971 లో నేను శిథిలావస్థలో ఉండిన ఆ పీఠాన్ని సందర్శింపగలిగాను. అక్కడే కుడ్యఘట్టితమైన శ్రీ కోరాడ వారి ఛాయాచిత్రపటాన్ని తొలిసారి చూశాను. దాని ముందరే క్షీరసాగరంలో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు బసచేసేవారట. ‘ఆంధ్రా బెర్నార్డ్ షా’ శ్రీ వేదాంతం వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు “భారతము గుఱించి గీరతము రచించి క్షీరసాగరము నూఁగించినారు” అని చెప్పిన చాటువు అక్కడ వెలసిందే.

లక్ష్మీమనోహరం గారి కుమారులు సుగృహీత నామధేయులైన మహావిద్వాంసులు శ్రీ కోరాడ రామకృష్ణయ్య గారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో అప్పటి వైస్ ఛాన్సిలర్ రఘుపతి వెంకటరత్నం గారి ఆహ్వానాన్ని పురస్కరించికొని తెలుగుశాఖలో పరిశోధకాచార్యులుగా ప్రవేశించినవారు. బహుగ్రంథకర్త. ‘భాషోత్పత్తిక్రమము–భాషాచరితము’, ‘భాషా చారిత్రక వ్యాసములు’, ‘సంధి’ మొదలైన కృతులతో ఆంధ్రదేశంలో భాషాశాస్త్రానికి పాదులుతీసిన “క్ష్మాఖననక్రియాకర ఖనిత్రగ్రాహితోద్యత్కిణస్తోమాస్నిగ్ధకరులు” వారు. కావ్యపరిష్కరణలో, సాధుపాఠనిర్ణయంలో, ప్రాక్పశ్చిమ సాహిత్యవిమర్శలో సాటిలేని మేటి. తమ తాతగారి గ్రంథాలను ముద్రించి మళ్ళీ మరొక్క తరానికి అందుబాటులోకి తెచ్చిన సుకృతాత్ములు. 1891 లో ప్రభవించి 1962 లో తనువుచాలించారు.

శ్రీ రామకృష్ణయ్య గారి కుటుంబిని అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణకు నుద్దియౌ అతివ యామె. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిలో అన్నివిధాల జ్యేష్ఠులైన మా గురువు గారికి రామచంద్రశాస్త్రి గారని తమ తాతగారి పేరే పెట్టుకొన్నారు. ఆ తర్వాతి వారు భాషాశాస్త్రవేత్తలలో కనిష్ఠికాధిష్ఠితులై, మహావిద్వాంసులైన విద్వచ్ఛిరోమణి ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి గారు. 1921లో జన్మించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో సునీతికుమార ఛటర్జీ, సుకుమార్ సేన్, క్షితీశచంద్ర ఛటర్జీల సన్నిధిని; ఇంకా మీనాక్షిసుందరం పిళ్ళై, నీలకంఠశాస్త్రి వంటి మహాత్ముల వద్ద విద్యాభ్యాసం చేసి సుశిక్షితులైనారు. దేశవిదేశాలలో ఆచార్యునిగా ఉద్యోగించి, తెలుగువారికి విశ్వవిఖ్యాతిని ఆర్జించిపెట్టారు. క్రీస్తుశకం 6-వ శతాబ్ది నాటినుంచి వెలువడిన వందలాది శాసనాలను పరిశోధించి వెలువరించిన వీరి Historical Grammar of Telugu (1969) ఐరావతం మహాదేవన్ గారి వంటి విద్వత్పరిశోధకులను ప్రభావితం చేసింది. వీరి రచనలు అనేకం. వీరి దృష్టి విశ్వజనీనం. పాండిత్యం నిరవధికం. సహృదయత సాటిలేనిది. వీరిని పలుమార్లు దర్శించికొనే మహాభాగ్యం పొందినవారిలో నేనూ ఉన్నాను. ఇటీవలే 2014లో వీరి ‘భాష-సంస్కృతి’ గ్రంథం రూపకల్పనలో ఉడుతభక్తిగా నాకు కూడా సేవచేసే సదవకాశాన్ని ప్రసాదించారు. ఆంగ్లాంధ్రాలలో అనేకంగా గ్రంథాలను, వ్యాసాలను ప్రకటించారు. అశేష శిష్యసంపదతో విశేష కీర్తినార్జించినా యశోనిర్మములై జీవించినవారు. 2016 లో పరమపదించారు.

శ్రీ మహాదేవశాస్త్రి గారి సంతతిలో ప్రముఖ రసాయనశాస్త్రజ్ఞులు, నా ప్రియమిత్రులు ఆచార్య కోరాడ వెంకటరమణ గారు, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విశ్వవిఖ్యాతులైన ఆచార్య సూర్యనారాయణ గారు సుప్రసిద్ధులు. వీరు ఇటీవలే తమ ముత్తాత గారి ‘ఘనవృత్తము’ను ఆంగ్లవ్యాఖ్యాసమేతంగా ప్రకటించారు.

మహాదేవశాస్త్రి గారి తర్వాత జన్మించిన సీతాదేవి గారు సివిల్ ఇంజనీరింగులో భీష్మాచార్యులుగా వన్నెకెక్కిన శ్రీ సుసర్ల గోపాలశాస్త్రి గారి ధర్మపత్ని. సుప్రసిద్ధ కవయిత్రి, అనేకానేక గ్రంథకర్త్రి, ఉపన్యాసకురాలు, పత్రికా సంపాదకురాలు, సంగీత సాహిత్య నృత్య బహుకళా విదుషీమణి డా. శొంఠి శారదాపూర్ణ గారు ఈ దంపతుల ధన్యపుత్రిక. నాలుగు దశాబ్దాలకు పైబడి అమెరికాలో చిరంతనములైన వేదవిద్యలకు, ఆధ్యాత్మికతకు, అన్నమాచార్య సంగీత సాహిత్య విశ్వతోవ్యాప్తికి, సంస్కృతాంధ్ర సాహిత్యవిశ్వకళాదీప్తికి కరావలంబనపూర్వకంగా కృషిచేస్తున్న భారతీయ విజ్ఞానసర్వస్వం ఆమె.

సీతాదేవి గారి తర్వాత శ్రీ నాగేశ్వరరావు గారు కలిగారు. ఆ తర్వాత జన్మించిన శ్రీమతి భమిడి కమలాదేవి గారు ‘పాలంగి కథలు’ రచయిత్రిగా పేరెన్నిక గన్నారు. శ్రీ కులశేఖరాళ్వారుల ‘ముకుందమాల’ను రాగతాళమాధురితో గానంచేస్తూ భాష్యతుల్యమైన స్వీయవ్యాఖ్యానంతో వెలువరించిన వారి పుణ్యమే పుణ్యం. తణుకులో సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా ఉంటూ సంగీత సాహిత్య నిత్యోపాసనను కొనసాగిస్తున్నారు.

ఈ విధంగా తరతరాలుగా కవిపండితగాయనులతో దోసపాదులా ప్రవర్ధిల్లిన ఈ కులాన్వయ రత్నదీపం శ్రీ మా గురుదేవులు.

2

విద్వదముష్యాయణులైన శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారు 1918 (కాళయుక్తి నామ సంవత్సరం) జూన్ 15 వ తేదీని శ్రీమతి అన్నపూర్ణమ్మ, శ్రీ రామకృష్ణయ్య దంపతులకు జన్మించారు. రామకృష్ణయ్య గారు ఉద్యోగరీత్యా విశ్వవిద్యాలయానికి దగ్గరగా ఉంటుందని ట్రిప్లికేన్ లోని పార్థసారథిస్వామి కోవెల వద్ద సింగరాచారి వీథి కొసనున్న స్వగృహంలో ఉండేవారు. నా బాల్యవయోవస్థా కాలం నాడు 1966 నుంచి నేను ఆ యింటికి వెళ్ళివస్తుండటం నాకు గుర్తున్నది. రామకృష్ణయ్య గారు అప్పటికే (1960 లో) పరమపదించారు. అది కాక వివేకానంద హౌస్ బస్టాండ్ దగ్గర వారికొక ఇల్లుండేది. రామచంద్రశాస్త్రి గారు చాలా కాలం ఆ యింటిలో ఉండేవారు. ఆ యింటికి కూడా నేను అనేక పర్యాయాలు వెళ్ళాను. ఇంటి ప్రక్కనే ఒక విశాలమైన ఖాళీస్థలం ఉండేది. అది కూడా వారిదే. వారి వీథిలోనే శ్రీ నటరాజశర్మ గారని ఒక గొప్ప జ్యోతిష్కులు ఉండేవారు. వారు తమిళదేశీయులు. 1940ల లోనే న్యాయశాస్త్రంలో ఎం.ఎల్ పట్టభద్రులై హైకోర్టులో పేరుగడించారు. మోకాలొడ్డినా సిరి తనంతట తాను ముంగిట వచ్చి వాలేంత పుష్కలమైన ధనార్జన కాలం అది. వారింట పూర్వకాలం నాటి పరాశర హోరా తుల్యమైన నాడీ గ్రంథం ఒకటుండేది. దాని ప్రతులు వారి దగ్గరొకటీ, కాశ్మీర రాజకుమారులు శ్రీ కరణ్ సింగ్ గారి వద్ద ఒకటీ మొత్తం రెండే ప్రతులు లోకంలో ఉన్నాయట. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ మహాస్వాములవారు వీరిని సంసారపయోధిలో మిథ్యాసౌఖ్యాలకు అలవాటుపడి “ప్రాణప్రయాణోన్ముఖాయాసంబు”లతో కూడిన లౌకికమార్గప్రయాసను విడిచి కింకర్తవ్యతామూఢమైన లోకానికి దారిచూపమని ప్రబోధించారట. ఎవరైనా తెలుగు ప్రముఖులు వచ్చినపుడు వారు నన్ను పిలిచి, సంస్కృతంలో నాడీ జాతకం వారు చదువుతుంటే తెలుగు లిపిలో నన్ను వ్రాసిపెట్టమని ఆదేశించేవారు. అది నిమిత్తంగా మా గురుదేవుల యింటికి వెళ్ళటం జరుగుతుండేది.

శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారు మద్రాసులోనే చదువుకొన్నారు. వారి చిన్ననాటి విద్యాభ్యాస విషయాలు వారు చెప్పినవేవీ నాకిప్పుడు గుర్తులేవు. నేను టి.నగరులోని రామకృష్ణా మిషన్ హైయర్ సెకండరీ స్కూల్లో 1966 లోనో, 1967 లోనో ఎనిమిదవ తరగతికి వచ్చినప్పుడో, తొమ్మిదవ తరగతికి వచ్చినప్పుడో – వారు మాకు సైన్సు టీచరుగా పరిచయం అయ్యారు. రెండేళ్ళు క్లాసు టీచరుగానూ ఉన్నారు. మద్రాసులోనే బి.ఎస్‌సి చదివారనుకొంటాను. చేతిలో పాఠ్యపుస్తకం లేకుండా, బోర్డుమీద బొమ్మలను వేస్తూ, చర్చావిషయాన్ని దృశ్యగోచరం కావిస్తూ – చెరువులో రాయి విసిరితే చిన్న వలయం వలయాలు వలయాలుగా పెద్దదవుతూ ఒడ్డుకు చేరినట్లు – సూక్ష్మంగా మొదలుపెట్టి, దానిని విశాలంగా విస్తరింపజేస్తూ మనస్సులకు హత్తుకొనేట్లు పాఠం చెప్పేవారు. తమిళుల పద్ధతిలో అడ్డుపంచె, లేతరంగు పొడుగుచేతుల చొక్కా, భుజాన ఉత్తరీయం, నిండైన కుంకుమబొట్టు, నిత్యవికాసశీలములైన విశాలనేత్రాలు, సన్నని తీగెగొంతు – ఇవి మాత్రం గుర్తున్నాయి. అంతగా ఒడ్డూపొడుగూ కాని శరీరయష్టి, తెల్లని కాంతిమంతమైన దేహం, చక్కటి ఇంగ్లీషు ప్రసంగనైపుణి – మేము చదివినది తెలుగు మాధ్యమంలోనే అయినా, ఉభయకుశలోపరిగా పాఠం చెప్పేవారు. బల్లమీద నిప్పులు కక్కుతూ ఉండే సన్నని చింతబరికె ఒక్కటి మాత్రం ప్రసన్నమధురమైన వారి ముఖరేఖకు వ్యతిరేకాలంకారమై కానవచ్చేది. విద్యార్థులు తన మాటపై మనసుపెట్టక తమలో తాము మాట్లాడుకోవటం చూశారంటే మాత్రం ఆ బెత్తం విశృంఖలవిహారంతో వీరంగం వేయాల్సిందే.

ఉన్నత పాఠశాల విద్యార్థులకు విజ్ఞానశాస్త్రబోధమన్న పేరే గాని, వారి ప్రసంగవశాన ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సారవిచారంతోపాటు గణితశాస్త్రం, చరిత్ర, సాహిత్యవిశేషాలు కూడా అలవోకగా అనుప్రసక్తమవుతుండేవి. విద్యార్థులు ఆస్తికతను విడనాడకుండానే అంధవిశ్వాసాలకు దూరవర్తులై ఉండాలని, ప్రవర్తనలోపాలను సరిదిద్దుకొంటూ శీలౌన్నత్యాదర్శాన్ని పెంపొందించుకోవాలని, scientific temperament లేని సైన్సు అధ్యయనం నిష్ప్రయోజకమని గాఢంగా విశ్వసించిన విద్వదుపాధ్యాయుని జీవితానుభవ సారనవనీతం వారి పలుకులలో ముద్దకట్టినట్లుండేది. క్రమశిక్షణ, సమయపాలనం, యుక్తాహారవిహారనిద్రలు జీవితానికి అత్యంతావశ్యకములని చెప్పేవారు.

ఎప్పుడో మా యింటికి వచ్చిన వేళలలో మా నాన్నగారితో మాట్లాడేటప్పుడు తప్ప వారు తరగతి గదిలో తమ తాతతండ్రుల శిఖరోన్నత సాహిత్యవైభవాన్ని గురించి ప్రస్తావించినట్లుగా నాకు జ్ఞాపకం లేదు. ఆర్థికంగా ఇబ్బందులున్నాయని చెబితే, నాన్నగారు నన్ను కొన్నాళ్ళు వారింటికి ‘ట్యూషన్’కు వెళ్ళమన్నారు. కొన్ని నెలల తర్వాత వారెందుకో మొహమాటపడి, ఆ ఆవశ్యకత లేదని నన్ను ఇంటిలోనే చదువుకోమని ఆదేశించారు. ఆ రోజుల్లోనే నాకు తెలుగంటే ఉన్న ఆసక్తిని గమనించి వారి ముత్తాత గారి ‘మంజరీమధుకరీయ నాటకము’, ‘ఘనవృత్తము’, ‘నయప్రదీపము’, ‘పరశురామ విజయము’ మొదలైన గ్రంథాలను, వారి తండ్రిగారి గ్రంథాలను బహూకరించారు. పద్యంలో ఏ పదానికి ఆ పదంగా అర్థం ఎప్పటికప్పుడే తెలుసుకొంటూ, తెలియని పదాలను నోటుబుక్కులో రాసుకొంటూ, వీలైనప్పుడు ఆ పదాలను వాడుకచేస్తూ భాషను నేర్చుకోవాలని వారు చేసిన బోధ నాకు ఆజీవితశిక్షాప్రణీతమే అయింది.

మా గురుదేవుల జీవితవిశేషాలు నాకంతగా తెలియవు. 1942 మే నెలలో కాబోలును, వారికి భమిడి అనసూయమ్మ గారితో వివాహం జరిగింది. ఆమె నిప్పులు కడిగే ఆచార సంప్రదాయాలున్న కుటుంబంలో పుట్టిపెరిగిన పడతి. భర్త జీవితంలోని ఒడిదుడుకులన్నింటినీ ఓర్పుతో, నేర్పుతో పరిష్కరింపగలిగిన విజ్ఞానవతి ఆమె. ఆ దంపతులకు అయిదుగురు సంతానం. ఒక కుమార్తె, నలుగురు కుమారులు. కుమార్తె వాణి గారిని నేను చూసిన గుర్తున్నది. ఆ తర్వాత మనోహర్ గారిని, సూర్యనారాయణ గారిని, విశ్వనాథశర్మ గారిని చూసిన జ్ఞాపకం లేదు. విశ్వనాథశర్మ గారు మాత్రం మెకానికల్ ఇంజనీరింగ్ చదివి జె.ఎన్.టి.యు లో ఉద్యోగించారు. కుటుంబ సంస్కారఫలంగానూ, తండ్రిగారి శిక్షణఫలితం గానూ, ఔరసత్వ సంపద మూలాన తమ పట్టభద్రతా శాస్త్రవైషయికమైన గ్రంథరచన కావించారు.

మా గురువుగారి మూడవ సంతానం కోరాడ రామకృష్ణ. పాఠశాలలో మొదట మాకు సీనియర్ గా ఉండి, సహాధ్యాయిగా తోడయి, ఆ తర్వాత ఆరోగ్యం బాగులేనందువల్ల కాబోలును, ఒక సంవత్సరం చదువు మానివేసి, మళ్ళీ చేరాడు. నేను మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఎం.ఫిల్ చేస్తున్నప్పుడు ఎం.ఎ తరగతిలో వచ్చి చేరాడు. వాసిలి వసంతకుమార్, కె. సర్వమంగళ గౌరి మొదలైనవారు అతనికి అప్పటి సహాధ్యాయులు. ‘మద్రాసు తెలుగు నామస్వరూపం’ గురించి అక్కడే ఆచార్య సానికొమ్ము అక్కిరెడ్డి గారి వద్ద ఎం.ఫిల్ పరిశోధన చేశాడు. “సదసి వాక్పటుతా” – “భూపసభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము” ఉన్నవాడు. తిరుపతి నుంచి వెలువడే ‘సప్తగిరి’ మాసపత్రిక సంపాదక వర్గంలో చేరి, అనేక కావ్యపురాణ వచనానుసృతులను ప్రకటించాడు. అన్నమాచార్య ప్రాజెక్టులో అధికారిగానూ పనిచేసి, అనారోగ్యం మూలాన చిన్నవయసులోనే అకాలమరణం పాలయ్యాడు. మహామహులు శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ఆంగ్లరచనను తెనిగించి, ‘తిరుమల తిరుపతి దేవస్థాన శాసనాలు – ఒక నివేదిక’ పేరుతో బృహద్గ్రంథాన్ని ప్రకటించాడు. అతనివి అప్రకాశితరచనలు ఇంకా అనేకం ఉన్నాయి.

మా గురుదేవుల యింట సాహితీవరివస్య నిరంతరాయితంగా కొనసాగుతూ వచ్చినదని చెప్పటానికి ఇంత వివరంగా వ్రాశాను.

గురుదేవులు రామకృష్ణా మిషన్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఎప్పుడు ప్రవేశించినదీ నాకు తెలియదు. అంతకు మునుపు కొంతకాలం ఢిల్లీలో ఉన్నారట. మేము చదివిన ఏడేళ్ళ తర్వాత 1977 జులై 31 ని పదవీ విరమణ చేశారు. పది పన్నెండేళ్ళు మద్రాసులోనే ఉండి, ఆ తర్వాత 1989లో హైదరాబాదుకు తరలివెళ్ళారు. అయిదేళ్ళ క్రితం వారి విద్యార్థులందరూ హైదరాబాదులో వారి శతజయంతి మహాసభను వైభవోపేతంగా నిర్వహించారు. ఎటువంటి తోడ్పాటు సాధనాలూ లేక నిబ్బరంగా మెట్లెక్కుతూ వారు వేదిక నధిరోహించి సుఖాసీనులైన దృశ్యం, మా చిన్ననాడు తిలకించిన అదే ఆనందోత్సాహంతో అందరినీ ఆశీర్వదిస్తున్న సన్నివేశం వీడియోను నా సహాధ్యాయి రమేష్ పంపించినప్పుడు ఎన్నెన్నో స్మృతులతో కన్నులు చెమ్మగిల్లక తప్పలేదు.

మేము చదివే రోజులలో సొంతయింటిలో గాక పాఠశాలకు సమీపవర్తిగా ఉంటుందని మాంబళంలో రంగనాథన్ వీథికి దగ్గరని గుర్తు – ఎలక్ట్రిక్ ట్రెయిన్ పట్టాలకు దగ్గరగా ఉండే అద్దెయింటికి మారారు. చాలా సార్లు వెళ్ళాను కాని, నాకిప్పుడు ఆనాటి చిరునామా వివరాలు గుర్తులేవు. కొన్నాళ్ళు సాయంవేళలలో రామకృష్ణా మిషన్ హాస్టలులో విద్యార్థులకు ‘ట్యూషన్’ చెప్పి, చీకటి పడ్డాక ఇల్లు చేరేవారని జ్ఞాపకం. అల్పాహారం, అల్పనిద్ర మహాపురుషలక్షణమని పెద్దలంటారు కదా. స్టాఫ్ రూములో కూర్చొని మధ్యాహ్నభోజన సమయాన చిన్ని టిఫిన్ బాక్సులో లంచ్ చేయటం కనుపిస్తుండేది. చాప చిరిగి చదరయినా ఉన్నంతలో సర్దుకొని సంతృప్తిగా జీవించాలనే తత్త్వం వారిది. అట్లా ఎంతమంది ఉండగలరు?

3

మద్రాసు ఒక విధంగా తెలుగు భాషాసాహిత్యాలకు కాణాచికాపుగా ఉన్న బంగారురోజులలో మా గురువుగారున్నారు. విశ్వవిద్యాలయం, కళాశాలలు, రేడియో స్టేషన్, గ్రంథాలయాలు, సినీ స్టూడియోలు, వాటి అనుబంధ సంస్థలు, నటీనటులు, దర్శకులు, సంగీత నృత్య కళాకారులు, దేశవిదేశపత్రికలు, పాత్రికేయులు, ప్రింటింగ్ ప్రెస్సులు, కవులు, పండితులు, గాయనీగాయనులు, పాఠశాలలు, వాణిజ్యవేత్తలు, వాణీమహల్ – ఎటుచూసినా తెలుగు వాతావరణం నిండి నిబిరీసమైన రోజులలో వారి జీవితం అక్కడ విలసిల్లింది. తమ కాలం నాటి పెద్దలందరినీ దర్శించారు. వారి అనుభవాలను ఆకళింపు చేసికొన్నారు. చిన్ననాడే వారికి ఆస్తికతతోపాటు అద్వైతశాస్త్రపరిచయం, అందులో గాఢమైన విశ్వాసం ఏర్పడ్డాయి. నిత్యానిత్యవస్తువివేకం కలిగింది. ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా’ అని నమ్మకం కుదిరింది. అళీకపదార్థాల యెడ వైముఖ్యం ఉదయించింది. సంసార బాధ్యతలన్నింటినీ నిరాక్షేపణీయంగా నెరవేర్చారు. ఎవ్వరికీ తలవంచక, ఎన్నడూ తలవంపులు లేక ఉద్యోగాన్ని నిర్వహించారు. రామకృష్ణా మిషన్ పాఠశాలలో వారికి ఎనలేని గౌరవాదరణలు సిద్ధించాయి. ఆ గౌరవానికి స్పందనగా ట్రిప్లికేన్‌లో తమ యింటిని ఆనుకొని ఉన్న ఎంతో విలువైన స్థలాన్ని రామకృష్ణమఠానికే ఇచ్చివేశారు. ఒక సామాన్య ఉపాధ్యాయుని పరిధిలో ఉన్న సాధనసంపత్తితో పోల్చిచూస్తే ఆ స్థలం విలువ మరెన్నో రెట్లకు మించినదిగా ఉంటుంది. అది వారి ఉన్నతమైన సంస్కారమూ, ఆ కుటుంబ సభ్యుల స్వచ్ఛందమైన సహకారమూ అని మెచ్చుకొనక తప్పడు. ఆ చోట ఇప్పుడు వివేకానంద బుక్ స్టాల్ ఒకటి ఉన్నదనుకొంటాను. ఎంతమంది జిజ్ఞాసువుల విజ్ఞానదాహార్తిని తీర్చి ఎంతగా సుజ్ఞానవివేకాన్ని ప్రసాదిస్తున్నదో!

పూర్ణపురుషాయుష జీవితాన్ని గడిపి, సహస్రచంద్రదర్శనోత్సవాదికం చేసికొని, శతజయంత్యుత్సవాన్ని కూడా చూసిన తర్వాత వారికి తురీయాశ్రమస్వీకారశ్రద్ధ కలిగింది. భవిష్యద్దర్శనులు వారికి ఏ దైవికమైన సూచన లభించిందో. మొన్న ఏప్రిల్ 24-వ తేదీన శ్రీ నారాయణ తీర్థ స్వామివరేణ్యులుగా యోగపట్టాన్ని స్వీకరించారు. ఈ నెల 15 న వారికి 105 సంవత్సరాలు నిండాయి. పూర్ణారోగ్యవంతులై, నిర్వికారులై లోకానికి తమ అనుభవ సారోపదేశంతో మార్గదీపనం చేయాలని మా ఆకాంక్ష.

ఒకరోజు మా గురువు గారు నాకొక పద్యాన్ని వ్రాసియిచ్చారు. అది నా మనోమంజూషికలో సువర్ణముద్రికగా నిలిచిపోయింది.

ము న్నా నన్నయభట్టు మెట్టుటను బెంపుం గాంచె రాణ్మందిరం;
బెన్నం దిక్కన కల్మి సింహపురియున్ హేమించె; గుడ్లూ ర దె
ఱ్ఱన్నం గాంచుట వాసిఁగాంచె; ముగురయ్యల్ మూఁడు లింగంబులై
వన్నెం బెట్టఁ ద్రిలింగదేశ మిది భవ్యం బయ్యె దేశంబులన్.

అని. ఆంధ్రత్వం, ఆంధ్రదేశాభిమానం ముమ్మూర్తులా మూర్తిగొన్న పుణ్యక్షేత్రవర్ణనం అది. చాలా కాలం తర్వాత గాని నాకు అందులోని రహస్యం బోధపడలేదు.

ఆ పద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థానకవి, అభినవశ్రీనాథులు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారు రచించిన ‘అమృతానందము’ కావ్యంలోనిది. అందులోనే పెక్కుమంది గుర్తింపని శ్రీ కోరాడ వంశవైభవం, శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారు శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి గారి వద్ద విద్యనేర్చిన వైనం మొదలైనవన్నీ వర్ణనీయంగా వర్ణింపబడి ఉన్నాయి. అది చిరకాల పుణ్యలభ్యమైన పుణ్యశ్రవణకీర్తనకు తొలిమెట్టు.

మానవుని స్థూలశరీరం పృథివ్యప్తేజోవాయ్వాకాశములనే పంచభూతములతో నిర్మితమైనది. మనోబుద్ధ్యహంకారాదులతో కూడినది సూక్ష్మశరీరం. మనస్సు సంకల్పవికల్పాత్మకం. బుద్ధి నిశ్చయించే స్వభావం కలిగినది. చిత్తము అనుసంధాన రూపమైనది. అహంకారం అభిమానాత్మకమైనది.

ఆ తర్వాతిది కారణశరీరం. జీవాత్మకు నివేశం ఈ కారణశరీరమే. మనము చేసిన సుకృతదుష్కృతాలన్నీ సూక్ష్మశరీరంలో ఒక సంస్కారాన్ని ముద్రిస్తాయట. ఆ సంస్కారాల సందోహాన్ని అదృష్టము అంటారు. అదృష్టవశాననే జీవికి ఉత్కృష్ట నికృష్ట జన్మపరంపర కలుగుతున్నది.

చరాచర జీవజాలమంతటికీ సూక్ష్మశరీర కారణశరీరాలుంటాయి. వాటికి వ్యక్తరూపం ఉండదు. అనభివ్యక్తములైనప్పటికీ వాటికి కూడా అంతఃసంజ్ఞలు, సుఖదుఃఖాలు ఉంటాయి. పాపపుణ్యఫలానుభవం మిగిలి ఉన్నన్నాళ్ళూ చావుపుట్టుకలు తప్పవు. సగుణబ్రహ్మోపాసన వల్ల సత్య జన తపో మహర్లోకాదులకు చేరుకోగలిగితే జన్మమరణచక్రంలో పునరావృత్తి ఉండదు. నిర్గుణ బ్రహ్మజ్ఞానం కలిగినవారికి శ్రీకైవల్యపదం సిద్ధిస్తుంది. అదే జీవికి చరమగమ్యం.

బ్రహ్మజ్ఞానసంపన్నులైన తపోనిధి శ్రీ మా గురుదేవులకిదే సభక్తిక పాదాభివందనం.

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here