చిరుజల్లు-24

0
3

ఫేస్‌బుక్

[dropcap]అ[/dropcap]లా అని ధర్మారావు చిన్నా, చితకా వయసు వాడేం కాదు బాధపడిపోవడానికి. రిటైరైనాడు. సొంత ఇల్లుంది. షష్టిపూర్తి అయింది. రిటైర్‌మెంటు డబ్బూ వచ్చింది. పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు. భార్యా ఎన్నడూ చీదేసి ఎరుగడు. ఇంటెడు చాకిరీ చేస్తోంది.

అన్ని విధాలా హాయిగా చీకూ చింతా లేకుండా ఉండవల్సిన వాడు బాధ పడటం ఏమిటీ అంటే –  ఏమీలేదు. వడ్లగింజలో బియ్యపు గింజ.

ఆఫీసరుగా ఉద్యోగం వెలగబెట్టినంత కాలం, ఏ పనీ చేయకపోయినా, తన కింద పని చేసిన వాళ్లు, రోజూ ఒకరి తరువాత మరొకరు వచ్చి, ఎదురుగా కూర్చుని “ఏయ్ వినరా భారత వీర కుమారా, మన ధర్మారావు చరితంబు” అని కీర్తిస్తూ ఉంటే, ఆయన అలా అలా మేఘాల మీద తేలిపోతుండేవాడు. గ్రీన్ టీ తెప్పించి ఇచ్చేవాడు, “మీ కేంటి సార్ ఎవర్‌గ్రీన్ హీరో” అని పొగిడినప్పుడల్లా.  ఆ విధంగా  ఆయన్ని వాళ్లంతా కల్సి ఏకగ్రీవంగా ఒక గొప్పవాఢ్ని చేసేశారు.

రిటైరైనాక, ఆయనకు అసలు తాను ఎవరో ఏంటో తెల్సి వచ్చింది. ఆ పొగడ్తలు లేవు. స్తోత్రాలు లేవు. స్తుతిమాలలు లేవు. ఆయనను పట్టించుకునేవాడు లేడు. పలకరించే దిక్కు లేదు. తెల్సిన వాళ్లు కనిపించినప్పుడు “ఏమోయ్, సుబ్బారావు…” అని అన్నా, “వస్తా, పనుంది” అంటూ ఆమడదూరం పారిపోతున్నారు. ఇదే ఇప్పుడు ధర్మారావును చితిలా దహించి వేస్తున్న చింత. సడెన్‌గా ఎందుకూ పనికిరాని వాడిని అయిపోయానన్న దిగులును దిగమింగుకోలేకపోతున్నాడు. తనని ఒక డెడ్ వుడ్ క్రింద తీసేస్తుంటే, తెగ బాధ పడిపోతున్నాడు.

మనిషికి అన్నపానీయాల కన్నా అహం గొప్పది. అహం దెబ్బతిని చింతాక్రాంతుడై, మనో వ్యథతో మూగబాధ అనుభవిస్తున్న తరుణంలో ఎవరో ఒక పుణ్యాత్ముడు ఆయనకు ఫేస్‌బుక్ పరిచయం చేశాడు.

ఫేస్‌బుక్ ఒక పిచ్చివాళ్ల స్వర్గం.

ఇక్కడ యోగులూ, భోగులూ, త్యాగులూ, మానసిక రోగులూ, భక్తులూ, భోక్తలూ, నాయకులూ, వినాయకులూ, జోతిష్కులూ, మస్తిష్క వికాసకులూ, – సమస్త మానవాళీ, అలుపెరుగక, అహర్నిశమూ, ఈ రణభూమిలో విహరిస్తూ ఉంటారు, రథాలెక్కి పడుచువారికి వేడుక మీరగానూ.

ముద్దరాండ్రకు అల్లారు ముద్దుగానూ, ఆత్మజ్ఞానం కోసం తపించే వారికి జ్ఞానులుగానూ – అనేక మందికి అనేక మంది వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు తగులుతుంటారు. ఆకాశానికి ఎత్తుతుంటారు. పాతాళానికి తొక్కుతుంటారు.

రంగు రంగుల వింతలోకి ధర్మారావు రంగప్రవేశం చేశాడు. రక్తితో, భక్తితో, విరక్తితో, అనురక్తితో, పూలూ, పండ్లూ, చెట్లూ, చేమలూ, పలహారాలు, దొడ్లో పూసిన ఫలహారాలు, అగ్రహారాలు – ఎన్నెన్ని ఫోటోలు? ఒక్క పక్క వేదాంతం, పక్కనే దంత వేదాంతం, ఒక పరి ఆరోగ్యం, మరొక తరి వైరాగ్యం.

పెట్టి పుట్టిన వారి పుట్టిన రోజులూ, గిట్టని వారి అప్పుడెప్పుడో గిట్టిన రోజులూ, గేయాలైన ఒక నాటి గాయాలు, మెచ్చుకోలుగా కప్పుతున్న శాలువాలు, ఎవ్వెరిథింగ్ ఎబౌట్ ‘హెర్ సన్’, ఎవ్వెరిథింగ్ అండర్ ది సన్…

తోచీతోచనమ్మ ఫేస్‌బుక్ తెరిచినట్లు, పనీ పాటా లేని వారందరికీ ఊపిరి సలపనంత పని…

అలాంటి రంగుల వలలో చిక్కుకుపోయాడు ధర్మారావు. ఆయన విజృంభించి, తన గతానుభవాల విశ్వరూప సందర్శనం చేస్తుంటే, ఆయనొక నడిచే విజ్ఞాన సర్వస్వమనీ, పండిత శ్రేణులలో మేరు శిఖరమనీ, అందరూ పొగుడుతుంటే, లోలోన పాలపొంగులా ఉప్పొంగిపోతున్నాడు.

ఇప్పుడాయనకు క్షణం తీరిక లేదు. తెల్లారి లేస్తూనే నిద్ర కళ్లతో ఫోన్ పట్టుకుంటే, మళ్లీ నడిరేయి నిదుర బరువుగా కనులెప్పల మీద వచ్చి వాలేదాకా, పానీయంబులు ద్రావుచున్న, కుడుచుచున్, నడుచుచున్, సంభావించుచున్ ఫోన్ చూస్తూనే ఉన్నాడు. ఆయన అభిమానులంతా కంటిమా, వింటిమా ఇటు వంటి నెమలిపింఛము వాని, కాంచనాంబరము వాని అని ఆకాశ మార్గాన పయనింప చేస్తున్నారు.

అతి సర్వత్ర వర్జయేత్.

ధర్మారావు భార్య సతాయించటం మొదలెట్టింది. “ఆ దరిద్రపు ఫోన్ తగల బెట్టేస్తాను. ప్రపంచంలోని అంక దరిద్రం అంతా ఆ ఫోన్ లోనే ఉంది. మొన్న ఎవడో అమీర్‌పేటలో కొబ్బరి బోండాల కత్తితో ఎవడి తలో నరికాడు, ఈ ఫేస్‌బుక్కు వల్లనే. ఆ మధ్య మంగళగిరిలో ఎవడో ఎవత్తెనో పొదల్లోకి తీసుకెళ్లి కత్తి పెట్టి కసాకసా పొడిచాడు, ఈ పాడు ఫేస్‍బుక్ వల్లనే… ” అని స్తోత్రపారాయణం చేస్తూనే ఉంది.

పొగడ్తలు ధర్మారావుని అమితమైన ప్రలోభానికి లోను చేస్తున్నయి. దండకాలకు లొంగి, ఆది దేవుడే ఆత్మలింగాన్ని అడిగినదే తడవుగా ఇచ్చేసినప్పుడు, ధర్మారావు లాంటి మానవమాత్రుడి గురించి చెప్పేదేముంది?

ఇదిలా ఉండగా అయాచితంగా ఒక అద్భుతం జరిగిపోయింది.

ఫేస్‌బుక్‌లో శాంతి అనే ఆమె ధర్మారావుకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఆమె ఆయన ఫ్రెండ్స్ జాబితాలో చేరిన మర్నాడే ఇన్‌బాక్స్‌లో సంభాషణ మొదలెట్టింది. “మీతో ఒక సీక్రెట్ షేర్ చేసుకోవచ్చా?” అని అడిగింది. “చేసుకోవచ్చు” అని జవాబు ఇచ్చాడు.

ఈ శాంతి అనే ఆమె అమెరికాలో ఉంటుందన్న విషయం తప్ప, ఆమె వివరాలేమీ తెలియదు.

“ఇప్పుడు నేను మీకు పూర్తి వివరాలు ఇవ్వలేను. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే, కొంత డబ్బు మీ ఖాతాకు పంపిస్తాను. నేను కల్సినప్పుడు అన్ని విషయాలు తెలియ జేస్తాను. ఇది చాలా చాలా అర్జంటు” అని ఇన్‌బాక్స్‌లో మెసేజ్ పెట్టింది.

ఇంత వరకు ఈ ఫేస్‌బుక్‌లో ‘డబ్బు కావాలి పంపడి’ అని అడిగిన వాళ్లనే చూశాడుగానీ, మీ అకౌంట్‌లో డబ్బు వేస్తాను –  అని అన్నవాళ్లు లేరు.

ధర్మారావుకి ఇది నమ్మశక్యం కాకున్నా, చూద్దాం ఏమవుతుందోనని తన ఆకౌంటు వివరాలు ఇచ్చాడు – మినిమిమ్ బాలెన్స్ మాత్రమే ఉంచి.

తెల్లవారేటప్పటికి అయిదు వందల యాభై కోట్ల రూపాయాలు అతని అకౌంటులో జమ అయినయి.

ఇది కలయో, వైష్ణవ మాయయో – తెలియలేదు.

వారం రోజులు పాటు పిచ్చిపట్టిన వాడిలా, ఎక్కడెక్కడో తిరిగాడు.

ఎందుకైనా మంచిదని ఒక ఆడిటర్‌ను సంప్రదించాడు.

“ఇది ఖచ్చితంగా దొంగ సొమ్ము. అందులో అనుమానం లేదు. ఇవాళ కాకపోతే రేపయినా, కేసులు తప్పవు. నీ మెడకు ఉచ్చు బిగుసుకుంటుంది…” అని భయపెట్టాడు ఆడిటర్.

“నాకు ఏ పాపమూ తెలియదు. ఎలాగైనా మీరే నన్ను బయటపడెయ్యాలి” అని వేడుకున్నాడు ధర్మారావు.

“నాకు టెన్ పర్సెంటు ఇస్తే, నీకు ఏ కేసు రాకుండా చేస్తాను” అన్నాడు.

చివరకు పది కోట్లు ఇవ్వటానికి ధర్మారావు ఒప్పుకున్నాడు. అందులో సగానికి చెక్కు రాసిచ్చాడు.

అప్పుడు ఆడిటర్ అన్నాడు “ఒక వ్యక్తి ఆదాయంగా చూసుకుంటే ఇది పెద్ద మొత్తమే. కాని ఒక సంస్థ తరపున చూసుకంటే ఇది చాలా తక్కువ…”

“మరి నేనేం చెయ్యాలి…”

“నగర శివార్లో ఎక్కడో ఒక చోట ఒక పది, పదిహేను ఎకరాలు వెంటనే కొనెయ్యండి. అక్కడొక దేవాలయం కట్టండి. పూజలు, పునస్కారాలతో పాటు, వచ్చిన వారందరికీ ఉచితంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయండి. తరువాత ఒక ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టండి. ఇప్పుడొచ్చిన డబ్బు ఆ ట్రస్ట్‌కు ముందుగానే వచ్చిన విరాళంగా చూపెట్టండి. అవన్నీ నేను చూసుకుంటాను…” అన్నాడు ఆడిటర్.

ఆయన చెప్పినట్లే చేశాడు ధర్మారావు.

ఏడాది లోపలే ఒక దేవాలయం, దానిలో విగ్రహ ప్రతిష్ఠ అన్నీ జరిగిపోయాయి.

క్రమంగా ధర్మారావులో చెప్పలేనంత మార్పు వచ్చింది.

ఆధ్యాత్మిక ధోరణిలో పడిపోయాడు. మహానుభావులను పిలిపించి, ఉపన్యాసాలు, సత్ కాలక్షేపాలు పెద్ద ఎత్తున జరిగిపోతున్నయి.

***

పదేళ్లు గడిచాయి.

ధర్మారావు రోజంతా దైవ చింతనలో గడిపినా, ఏ అర్ధరాత్రో, అపరాత్రో నిద్ర పట్టక బయటకొచ్చి ఆలోచనలో పడగానే, అప్పుడెప్పుడో డబ్బు పంపిన శాంతి ఆయన మనసులో మెదులుతుంది.

ఇప్పటికీ అదొక అంతుచిక్కని భేతాళ ప్రశ్నగానే మిగిలిపోయింది. అంత డబ్బు ఎందుకు పంపింది? అసలు ఎవరీమే? ఆ గాయత్రీ మాతే ఈ డబ్బు పంపి, తనను  ఈ మార్గానికి మళ్లించిదా? ఏమో?

ఒక రోజు ఆయనకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది.

“నేను శాంతిని మాట్లాడుతున్నాను. గుర్తున్నానా?”

“అమ్మా, నేను నిన్ను తల్చుకోని రోజు లేదు.”

“వచ్చే శుక్రవారం వస్తున్నాను…”

“మహదానందం…”

ఆమె చెప్పిన విమానం వచ్చే సమయానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ‘శాంతి’ అని రాసిన ప్లకార్ట్ పట్టుకొని నిలబడ్డాడు.

ఒక నడివయసులో నున్న స్త్రీ చక్రాల కుర్చీలో వచ్చి “నేనే శాంతిని” అన్నది.

మళ్లీ నివ్వెర పోవటం ధర్మారావు వంతు అయింది.

తేరుకుని, కారులో ఆమెను తమ ఆశ్రమానికి తీసుకెళ్లాడు.

మర్నాడు అక్కడ కట్టించిన గుడి గురించి, కార్యకలాపాల గురించి, ఉచిత భోజన సదుపాయాల గురించి అంతా వివరించాడు.

రెండురోజులపాటు అక్కడ జరుగుతున్నవన్నీ కళ్లారా చూసి సంతోషించింది.

ఉద్వేగాలు తగ్గాక ఒక రోజు రాత్రి ధర్మారావు, శాంతిని అడిగాడు.

“జరిగినవన్నీ తల్చుకుంటుంటే, ఇప్పటికీ ఇది నిజమని నమ్మలేకపోతున్నాను. అంతా అర్థమయ్యేలా చెప్పు తల్లీ” అన్నాడు ధర్మారావు.

“అది చాలా పెద్ద కథ. వినే ఓపిక ఉందా?”

“ఆ కథ వినేందుకు పదేళ్ల నుంచీ ఎదురు చూస్తున్నాను, తల్లీ, ఓపికతో…”

శాంతి చెప్పటం మొదలెట్టింది. నగరమంతా నిద్రా ముద్రితమైన సమయంలో, అష్టదిక్పాలకులూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో…

ఆమె చెబుతున్నది నమ్మశక్యం కాని విషయాన్ని…

“మాది గుంటూరు. మా నాన్న కాలేజిలో తెలుగు పండిట్. అందు చేత నాకు చదువు మీద, మనుష్యుల మీద, మానవ సంబంధాల మీద అమితమైన మమకారం ఏర్పడింది. భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని మానవ సేవకు వినియోగించాలని డాక్టరు అయ్యాను.”

“అమెరికా వెళ్లాను. అక్కడొక హాస్పిటల్‌లో పని చేస్తూనే, రెడ్‌క్రాస్ వాళ్లతో కల్సి క్యాంపులు నిర్వహించేదాన్ని. క్రమంగా దానిలో ఒక భాగం అయ్యాను…”

“సిరియాలో యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఐరాస తరుపున నాలుగు వందల మందితో ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ సిరియా చేరింది… అందులో ఒక డాక్టర్‌గా నేనూ ఉన్నాను…”

“ఇక్కడ అప్పటి సిరియా గురించి చెప్పాలి. 2000లో బషర్-అల్-అసద్ సిరియా అధ్యక్షుడు అయినాక, అవినీతి, లంచగొండితనం విపరీతంగా పెరిగింది. ప్రజలు తిరుగుబాటు చేశారు. కొంత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి బాసటగా రష్యా, తిరుగుబాటుదారులకు అండగా అమెరికా రంగంలోకి దిగాయి. ఇరుగు పొరుగు దేశాలు, గల్ఫ్ దేశాలూ కూడా జోక్యం చేసుకున్నాయి. దేశం కుక్కలు చించిన విస్తరిలా తయారైంది. అనేక దేశాలు ఆ పోరాటంలో జోక్యం చేసుకోవటంతో, ఎవరినీ ఎవరూ నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది. అరబ్ దేశాల సైన్యమూ దిగింది. వారి నుంచి ఆర్థిక సహాయమూ అందుతోంది…”

“భూమి మీద భీకరంగా వివిధ దేశాల సైన్యాల తుపాకుల, ఫిరంగుల మోతలు, పై నుంచి బాంబులు వర్షం… దేశం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయిదు లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. అనేక నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి.”

“అలాంటి దుర్భరమైన పరిస్థితిలో, పీస్ కీపింగ్ ఫోర్స్ కింద వెళ్లిన మాకే రక్షణ లేదు. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి కాల్పులు జరుపుతారో తెలియదు. మా ప్రాణాలు ఎప్పుడు గాలిలో కల్సిపోతాయో కూడా చెప్పలేం. కూలిన భవనాల మధ్య, శవాల గుట్టల మధ్య ఇద్దరు ముగ్గురు ఒక జట్టుగా విడిపోయి తిరుగుతున్నామే తప్ప, పరిస్థితిని అదుపులోకి తెచ్చే అవకాశం లేదు.”

“అలా మేము ముగ్గురం ఒక జీపులో వెళ్తున్నప్పుడు ఒక చోట ధ్వంసం అయిన వాహనం, ఇద్దరి శవాలూ కనిపించాయి. దిగి పరిశీలించి చూశాము. ట్రంకు పెట్టెలూ, వాటి నిండా కరెన్సీ కట్టలూ కనిపించాయి. తిరుగుబాటుదారులకు ఏ దేశం నుంచో పంపిన డబ్బు అది. మరి కొద్ది సేపట్లో వాళ్ల వాళ్లు వచ్చి దాన్ని తీసుకుపోవచ్చు. లేదా మరెవరైనా చేజిక్కించుకోవచ్చు.”

“ఆ ట్రంకు పెట్టెలోని డబ్బు మా వాహనంలోకి తరలించాం. మా క్యాంపుకు చేరుకున్నాం. ఆ క్యాంపులో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఆహారం కోసం దగ్గరలో నున్న పట్టణాలలోకి వెళ్లి, దొరకినంత ఆహారం కొని తెచ్చుకుంటుంటాం.”

“ఆ డబ్బు ఏం చేయాలన్న సమస్య ఎదురైంది. అది ఎవరి చేతిలో పడినా, ఆయుధాల కొనుగోలుకు, మరింత విధ్వంసానికే దారి తీస్తుంది. మా దగ్గర డబ్బు ఉందని ఎవరికి తెల్సినా, మమ్మల్ని చంపి, ఆ డబ్బు ఎత్తుకుపోతారు. అందుచేత వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవాలి. ఎలా?”

“దగ్గర్లోని నగరంలోని బ్యాంకుకు వెళ్లి మా ఖాతాలో జమ చేయవచ్చు. కాని మా మీద నిఘా ఉంటుంది. నిజం చెప్పినా ఎంత వరకు నమ్ముతారో తెలియదు. అలాంటి సమయంలో మీ బ్యాంకు వివరాలు దొరికాయి. దొరికిన డబ్బులో కొంత వరకే మీ ఖాతాలో జమ చేశాం – పరిమితికి లోబడి.”

“ఇది జరిగిన మర్నాడే మా వాహనాల మీద ఫైరింగ్ జరిగింది. నేను గాయపడ్డాను. నన్ను అమెరికా పంపించారు. సగం కాలు తీసేశారు.”

“ఎంతో మందికి నేను సేవ చేశాను. ఇవాళ నాకు ఇంకొకరు ఎవరైనా సేవ చేయవల్సిన స్థితిలో ఉన్నాను…” అన్నది శాంతి.

“ఇప్పుడిక్కడ పది కుటుంబాల వారం ఉన్నాం. మేమంతా మీ సేవకులమే” అన్నాడు ధర్మారావు.

మర్నాడు మధ్యాహ్నం అన్నదానం జరుగుతున్నప్పుడు శాంతి ధర్మారావుతో –

“ఎందరి ప్రాణాలో తీయటానికి పంపిన డబ్బు, చేతులు మారి ఇవాళ ఇక్కడ ఇంత మందికి కడుపు నింపటానికి ఉపయోగపడుతోంది…” అన్నది రెండు కన్నీటి బొట్లు రాలుస్తూ. అవి అశ్రువులో, ఆనందబాష్పాలో ఆమెకే తెలియదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here