అన్నింట అంతరాత్మ-30: తరతరాలుగా మీ సేవలో.. తెరను నేను!

8
4

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం తెర అంతరంగం తెలుసుకుందాం.

***

తెర తీయరా, తిరుపతి దేవరా తెర తీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి.. మాలోని తిమిరాలు హరియించి మము బ్రోవరా, మా భూవరా’.. పెద్ద హాల్లో పూలతల డిజై‌న్‌తో అందాలొలుకుతున్న తెర ఆ పాట విని ఒక్కసారి ఉలిక్కిపడింది. ‘పాటలో తన ప్రసక్తా.. ఎంత విచిత్రం’ అనుకుని చూపు సారించింది. సుదర్శనంగారు కళ్లు మూసుకుని తన్మయత్వంగా పాట వింటున్నారు. ‘తిరుపతి దేవుడి వద్ద కూడా తమ వాళ్లు ఉన్నారన్నమాట’ అనుకుంది హాల్లోని తెర. గాలికి అల్లరిగా ఊగుతున్న కిటికీ తెర, హాల్లో తెరను ‘హాయ్!’ అంటూ పలకరించి ‘ఏంటీ పాట విని ఆలోచనలో పడ్డావా. నేను ఆ మధ్య మరో తెర పాట విన్నా.. ఆఁ గుర్తొచ్చింది..

విన్నపాలు వినవలె వింతవింతలు

పన్నగపు దోమతెర పైకెత్తవేమయ్యా అని.

అన్నమాచార్య కీర్తనట. ఎంత బాగుందో’ పరవశంగా కదిలింది.

‘అవునా. మన పేరు నిత్యం వినిపించేదే. అదిగో ఆ టీవీని కూడా బుల్లితెర అంటారు. అందులోనే మొన్ననే చూశాను వెండితెర ప్రముఖులు అనే కార్యక్రమాన్ని. సినిమాకు పర్యాయపదంగా వెండితెర అని వాడతారని అలా తెలుసుకున్నాను’ అంది. ‘భలే భలే.. అదిగో ఆ ముందు గది తెరకయితే ఎంత గర్వమో, నా వైపు తలతిప్పి కూడా చూడదు. తనే అందరికీ స్వాగతం పలుకుతానని తెగ విర్రవీగుతూ కులుకుతుంది’ కిటికీ తెర కోపం వెళ్లగక్కింది. వెంటనే ముందుగది తెర సర్రున దూసుకొచ్చి ‘నేను గర్విష్టినా? ఎప్పుడూ ఎవరో ఒకళ్లు వస్తుంటారు కాబట్టి నా దృష్టి అటువైపే ఉంటుంది. మీకేం తీరిగ్గా ఊసులాడుకుంటారు’ అంటూ వేగంగా కదిలింది.

అంతలో ‘తాతయ్యా!’ అంటూ వచ్చాడు పవన్. ‘ఏంటిరా ఏదైనా సందేహమా?’ అడిగాడు సుదర్శనం. ‘అవును. తెర అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి?’ అడిగాడు. ‘ఓస్! అంతేనా, చాలా ఉన్నాయి. కానీ పరదా, యవనిక ఎక్కువగా వ్యవహారంలో వాడుతుంటారు’ చెప్పాడు సుదర్శనం.

అంతలో మనవరాలు పద్మిని ‘తాతయ్యా తాతయ్యా!’ అంటూ పరుగెత్తుకొచ్చింది. ‘ఏంటమ్మా’ అన్నాడు సుదర్శనం. ‘ఆమధ్య మమ్మల్ని సురభి వాళ్ల నాటకం ‘మాయాబజార్’కు తీసుకువెళ్లావు కదా. అప్పుడు ఆ స్టేజీకి పెద్ద తెర ఉంది కదా’ అంది. ‘అవునమ్మా. ఆ నాటకమనే కాదు, ఏ నాటక ప్రదర్శనకైనా, మరే నాట్య ప్రదర్శనకైనా తెర ఉండాల్సిందే. ఈ తెరలలో మూడు రకాలు ఉంటాయి. పైకి, కిందికి కదిలే తెర, పక్కకు తప్పుకునే తెర, అప్పటికప్పుడు కప్పేది. ఇక కార్యక్రమానికి ముందు వేదికకు తెర వేసి ఉంచుతారు. కార్యక్రమం ప్రారంభం అయ్యే ముందు తెర తీస్తారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఒక సన్నివేశం అయిపోగానే తర్వాతి సన్నివేశానికి తగిన ఏర్పాట్ల కోసం తెర వేయడం జరుగుతుంది. అలాగే నాట్య ప్రదర్శనలో కూడా ఒక అంశం అయిపోగానే, మరో అంశం ప్రారంభం కావడానికి మధ్యలో తెరవేయడం జరుగుతుంది. ఒక్కోసారి అనుకోకుండా పాత్రల వేషానికి సంబంధించి అంటే విగ్గు ఊడిపోవడం, తోక ఊడిపోవడం వంటివి జరిగినా, ఒక పాత్రకు బదులు మరో పాత్ర ప్రవేశించినా నవ్వులపాలు కాకుండా ఉండేందుకు హఠాత్తుగా తెరదించేస్తారు. అప్పుడు ప్రేక్షకుల నవ్వులు, ఈలలకు అంతే ఉండదు’ నవ్వుతూ చెప్పాడు సుదర్శనం. ‘ఓ.. మా జాతి కార్యక్రమ నిర్వాహకులను ఆ విధంగా ఆదుకుంటోందన్నమాట’ అనుకుని, ఆనందపడ్డాం.

‘మరి నాటకరంగంలో తెరలను ఎవరు ప్రవేశ పెట్టారు?’ అడిగాడు పవన్.

‘మొదట్లో నాటకరంగంలో తెర అనేది ఉండేది కాదట. క్రీస్తు పూర్వం.. పాంపే అనే ఆయన నాటకశాలను కట్టించి దానికి తెర ఏర్పాటు చేశాడు. దానిని చట్రంలో బిగించి, నాటక ప్రారంభంలో ఆ చట్రం భూమిలోకి పోయి, నాటకం పూర్తయ్యాక పైకి వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఇంగ్లాండులో పదహారు వందల అరవైలో తొలిసారిగా వాడుకలోకి వచ్చిన తెర క్రమంగా ఇతర దేశాల్లో కూడా అవతరించింది’. ‘మన పుట్టుక గురించి ఇప్పటికైనా తెలుసుకోగలిగాం’ అనుకున్నాం మేం.

‘మరి సినిమా తెరను వెండితెర అని ఎందుకంటారు?’ అడిగింది పద్మిని. ‘అవును.. ఈ మాట చాలాసార్లు విన్నాం. దాని సంగతేమిటో విందాం’ ఆసక్తిగా ఊగాం మేం.

‘మంచి ప్రశ్న అడిగావమ్మా. అసలు ఈ సినిమా ప్రదర్శన అనేది పంథొమ్మిది వందల పదిలో మొదలైంది. ఆ కాలంలో బొమ్మను సిల్కు వస్త్రంపై ప్రదర్శించేవారు. అయితే అప్పుడు ప్రొజెక్టర్ కాంతి తక్కువ కావడం, దానికి తోడు అవి నలుపు తెలుపు సినిమాలు కావడంతో సినిమా అస్పష్టంగా కనపడేది. బొమ్మ స్పష్టంగా కనపడడానికి కొత్త మార్గాలు ఆలోచించారు. ఫలితగా తెరపై సిల్వర్ మెటాలిక్ పెయింట్ వేస్తే బొమ్మ ప్రేక్షకులందరికీ బాగా కనిపిస్తుందని గ్రహించారు. అలా తెరకు సిల్వర్ మెటాలిక్ పెయింట్ వాడకం మొదలైంది. సిల్వర్ అంటే తెలుగులో వెండి కాబట్టి దాన్ని వెండితెర అని పిలవసాగారు. మరో దశాబ్దానికి సాంకేతికతలో మార్పు వచ్చినా వెండితెర (సిల్వర్ స్క్రీన్) పద ప్రయోగం మాత్రం అలాగే స్థిరపడిపోయింది’ వివరించాడు సుదర్శనం.

ఇంతలో లోపల్నుంచి బామ్మ సుమిత్ర వచ్చి, ‘నేనంతా వింటూనే ఉన్నాను’ అంటూ వచ్చి బైఠాయించింది. ‘నీకు, తాతకు పోటీ.. నీకు తెరల గురించి ఏం తెలుసో చెప్పు’ అన్నాడు పవన్. ‘అబ్బో! అక్కడికి మీ తాత సర్వజ్ఞుడు, నేను అయోమయాన్ని అనుకుంటున్నారా.. నాకు తెలిసినవీ ఉన్నాయి’ అంది ఉడుక్కుంటూ. తాతయ్య పకపకా నవ్వుతుంటే ‘అవేంటో చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాం’ అంది పద్మిని.

‘పెళ్లి తంతులో కూడా తెర ఉంటుంది. మొన్న పెళ్లికి వెళ్లాం కదా మనం, పెళ్లికొడుకు, పెళ్లికూతురుకు మధ్యలో కొద్ది సేపు తెర పట్టారు. గుర్తుందా’ అడిగింది బామ్మ. ‘అవునవును’ వెంటనే అన్నారు పిల్లలిద్దరూ. మేం టీవీలో వచ్చిన సినిమాల్లో పెళ్లి సన్నివేశాలను గుర్తు చేసుకుంటుండగా, బామ్మ, ‘పెళ్లిలో పట్టుకునే తెరను ‘తెర సెల్లా’ అంటారు. తెర సెల్లా అంటే కేవలం ఓ ఉత్తరీయమో, తెల్లని వస్త్రమో కాదు. తెర సెల్లా, ఇంద్రుడి భార్య శచీదేవికి ప్రతీక. ఆమె తెర సెల్లా రూపంలో వచ్చి వధూవరులను ఆశీర్వదిస్తుందని పెద్దలు అంటారు. తెర సెల్లా పై గంధంతో అటుచివర, ఇటు చివర స్వస్తిక్ గుర్తు, మధ్యలో శ్రీకారం రాసి, కుంకుమ పెట్టడం సనాతన సంప్రదాయం. కానీ ఈ మధ్య తెర సెల్లా వీడియోలో అందంగా కనపడాలని, ఎంతో డబ్బు వెచ్చించి, దానిమీద కలశం వంటి డిజైన్లు, రకరకాల రాతలు రాయించడం చేస్తున్నారు. అలా చేయడం పద్ధతి కాదు. తెర సెల్లాతో పని అయిపోయాక దాన్ని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. భద్రపరిచి, తర్వాత అమ్మాయికి అప్పగించాలి. ఇంకోసంగతి, అన్నమయ్య కీర్తనల్లో కూడా ఈ తెర సెల్లా ప్రస్తావన ఉంది. సిగ్గరి పెండ్లి కూతుర సీతమ్మ దగ్గరి సింగార బొమ్మ తలవంచకమ్మా.. అనే కీర్తనలో రెండో చరణంలో..

అదె పెండ్లి తెర యెత్తి రండనే వశిష్ఠుడుండి

చదివీ మంత్రాలు సేస చల్లవమ్మా

మొదల రాముని కంటే ముంచి తలంబ్రాలు వోసి

సుదతి యాతని మోము చూడవమ్మా..

తెర సెల్లానే ఇక్కడ పెండ్లి తెర అన్నాడు అన్నమయ్య’ చెప్పింది. పెళ్లిళ్లలో కూడా మా పాత్ర ప్రముఖమైందని విని మేం వయ్యారంగా ఊగాం.

‘బాగా చెప్పావు సుమీ!’ అన్నాడు సుదర్శనం. పిల్లలు ‘ఇంకా ఏమన్నా తెలిస్తే చెప్పు బామ్మా’ అన్నారు. ‘అలాగే. మేం చిన్నప్పుడు తోలుబొమ్మలాటలు ఎక్కువగా చూసే వాళ్లం. ఇప్పుడు మీరు టీవీలో పప్పెట్ షో చూస్తుంటారు కదా, అదన్నమాట. మా కాలంలో తోలు బొమ్మలను ఆడించేవారు. వాటిని తెల్లని పారదర్శకమైన అంటే సన్నని తెర వెనుక ఉంచి సూత్రాలతో అంటే సన్నని దారాలతో వాటిని పట్టుకుని, సన్నివేశాలకు అనుగుణంగా వాటిని ఆడించేవారు. అలా తోలు బొమ్మలను ఆడించేవారిని సూత్రధారులు అనేవారు. అదీ తోలుబొమ్మలాటలో తెర సంగతి. ఇంకో విషయం కూడా చెపుతాను.. కొన్ని ఓడలకు కూడా తెరలాగా ఓ వస్త్రం ఉంటుది. దాన్ని ‘తెరచాప’ అంటారు. చిన్న పడవలకు ఒక తెరచాప మాత్రమే ఉంటుంది. పెద్ద పడవలకు అనేక తెరచాపలను ఉపయోగిస్తారు. వీటిని పడవకు బాగా ఎత్తయిన భాగంలో కడతారు. తెరచాప పడవలను ఇంగ్లీషులో సెయిలింగ్ బోట్స్ అంటారు. గాలి వాలుకి తెరచాప కదులుతుంటే, పడవ అందుకనుగుణంగా కదులుతుంది. ప్రాచీనకాలంలో సముద్ర ప్రయాణానికి ఈ తెరచాప పడవలే ముఖ్యమైన ఆధారంగా ఉండేవి. ప్రస్తుతం రవాణాకు తెరచాప పడవల వాడకం తగ్గిపోయినా, వినోదం, పడవల పోటీలకు తెరచాప పడవలను ఇప్పటికీ వాడుతున్నారు’ చెప్పింది సుమిత్ర.

‘నీకు చాలా సంగతులు తెలుసు బామ్మా’ సంతోషంగా అన్నారు పిల్లలు.

‘ఏమనుకున్నారు బామ్మంటే’ నవ్వుతూ అన్నాడు సుదర్శనం. ‘అబ్బో! మనం ఎన్ని రకాలుగా మనిషికి ఉపయోగపడుతున్నామో’ అనుకున్నాం మేం.

ఇంతలో ‘ఏంటీ సభ చేస్తున్నారు’ అంటూ గుమ్మానికి ఉన్న తెరను పక్కకు తోస్తూ ప్రవేశించిన వ్యక్తిని చూడగానే ‘సాకేత్ మామయ్యా’ అన్నారు పిల్లలు ఆనందంగా.

‘రారా సాకేత్! పిల్లలు తెరల గురించి చెప్పమంటే చెపుతున్నాం’ అన్నాడు హాల్లో తెరవైపు చూపుతూ. ‘మంచినీళ్లు ఇవ్వనా’ సుమిత్ర లేవబోతుంటే నవ్వుతూ తన చేతిలోని మంచినీళ్ల సీసా చూపించి ‘లేవకు, కూర్చో’ అన్నాడు సాకేత్.

‘సాకేత్ మామయ్యా! తెరల గురించి నీకేం తెలుసో చెప్పు’ అన్నాడు పవన్.

‘ఓఁ అలాగే. నేను చెప్పేది ఇంతవరకు వీళ్లు చెప్పి ఉండరని నాకు గట్టి నమ్మకం’ అన్నాడు సుదర్శనం దంపతుల వైపు చూస్తూ.

‘ఓయబ్బో! అంత కొత్త సంగతి ఏమిటో ‘అంది సుమిత్ర.

‘వినండి మరి. దేవాలయాల్లో దేవుడికి కూడా నైవేద్యాలు వగైరా సమయాల్లో తెర వేస్తారు’ అనగానే ‘ఈ సంగతి మాకూ తెలుసు’ అంది సుమిత్ర.

అందుకు సాకేత్ నవ్వుతూ ‘అప్పుడే అయిపోలేదు, తిరుమలలో కూడా ఏడుకొండల వాడికి ఆయా సమయాల్లో తెరచాటు చేస్తుంటారు. ఈ తెరలతో కూడా దేవుడికి సేవలు అందించవచ్చని తిరుపతికి చెందిన మణి అనే ఆయన మూలంగా తెలుసుకోవచ్చు. ఆయన ఎన్నో ఏళ్లుగా స్వామివారికి ఎంచక్కని పరదాలను కానుకగా సమర్పించి తరిస్తున్నాడు. యేడాదికి నాలుగుసార్లు పరదాలను ఉచితంగా అందిస్తాడు. దాంతో ఆయన పేరే ‘పరదాల మణి’ అయిపోయింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివారం ఆస్థానం, ఉగాది ఆస్థానం, బ్రహ్మోత్సవం సందర్భాల్లో మణి అందించే రమణీయమైన పరదాలను గర్భగుడిలో స్వామి వారి ముందు ఏర్పాటు చేస్తారు. అవి ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. పరదా మొత్తం స్వామి వారి ఆభరణాలు, శంఖు చక్రాలు, తిరునామాలతో తయారై ఉంటుంది. అలాగే మరో పరదా పద్మావతి దేవి, పచ్చలు, మామిడితోరణాలు… ఇలా ఆ పరదాలన్నీ ఎంతో వైవిధ్యంగా, చూడముచ్చటగా ఉంటాయి’ వర్ణిస్తూ చెప్పాడు. మేం ఆశ్చర్యానందాలతో సయ్యాటలాడాం.

పిల్లలు ‘భలే భలే’ అంటుంటే, ‘చాలా బాగుంది.. ఇది నాకు కొత్త సంగతే’ ఒప్పేసుకుంది సుమిత్ర.

అంతలో బిస్కెట్లు, కాఫీ ట్రేతో ప్రవేశించింది ప్రజ్ఞ. అందరికీ వాటిని అందిస్తూ ‘అన్నీ వింటూనే ఉన్నా. అయితే నేనూ తెరల గురించి ఓ విశేషం చెపుతాను’ అంది. ‘ముందుగానే విశేషం అంటున్నావంటే అది నిజంగా విశేషమే అయ్యుండాలి’ కాఫీ అందుకుంటూ అన్నాడు సాకేత్.

ప్రజ్ఞ నవ్వుతూ ‘ఆంధ్ర దేశంలో తెరచీరల వారు అని ఒక జాతి ఉంది. వారు పూర్వ గాథలను, సుద్దులను చెపుతారు. తెర బొమ్మల గురించి, శ్రీనాథుడు రాసిన క్రీడాభిరామంలో కూడా ఉంది. ఒక పడతి పల్నాటి వీరచరిత్రను పాడిందని, వారి చరిత్ర ఒక చిత్రఫలకంపై రాసి ఉండేదని శ్రీనాథుడు వర్ణించాడు. క్రీడాభిరామంలోని ఓ పద్యాన్ని బట్టి పల్నాటి వీరచరిత్రను కాశీ కావడి ద్వారా, చీరల మీద చిత్రించిన బొమ్మల ద్వారా వీరు కథను చెప్పినట్లు తెలుస్తుంది’ చెప్పింది. అది విని మేం మరోసారి గర్వపడ్డాం.

‘తెరచీరల వారి గురించి ఇప్పుడే తెలుసుకున్నా’ అన్నాడు సాకేత్. మిగిలిన అందరూ అవునన్నట్లుగా తలలూపారు. ‘పూర్వం పల్లకీలకు కూడా తెరలుండేవి. అంతెందుకు గతంలో రిక్షాలకు కూడా ఘోషా ఉన్న మహిళలు ప్రయాణిస్తుంటే తెర కట్టేవారు. వాన వచ్చే సందర్భాల్లో ఆటోలకు కూడా తెరలు కట్టడం మామూలే. ఇంకా చెప్పాలంటే రైళ్లలో స్లీపర్ కోచ్‌లకు, స్లీపర్ బస్సుల్లోనూ తెరలను అమర్చడం తెలిసిందే. రకరకాల సందర్భాల్లో మాటల్లో కూడా తెర పదాన్ని ఉపయోగిస్తుంటాం. నిరీక్షణకు తెర పడింది, ఉత్కంఠకు తెరపడింది, వివాదానికి తెరతీశారు, తెర వెనుక కథ, తెర వెనుక వ్యక్తులు, తెరచాటు బాగోతం ఇలా ఎన్నో. రచనల్లో కూడా తెర చోటు చేసుకుంది. కొర్రపాటి గంగాధర రావు గారు ‘తెరలో తెర’ పేరుతో ఓ సాంఘిక నాటకం రాశారు. అంతేకాదు.. ‘తెర’ పేరుతో ఓ సినిమా రాబోతోందని, అది పూర్తిగా రంగస్థల నటులతో రూపొందుతోందని కూడా పత్రికల్లో చదివాను’ అంది ప్రజ్ఞ. మన గురించి ఎన్ని విశేషాలో అని మేం అనుకుంటుంటే ‘చాలా విషయాలు చెప్పావమ్మా’ అన్నాడు సుదర్శనం.

ఇంతలో పక్కింటి శ్వేత వచ్చింది ‘అత్తా! ఏం చేస్తున్నారు’ అంటూ. ‘రా, రా. తెరలు అదే కర్టెన్ల గురించి మాట్లాడుకుంటున్నాం’ అంది సుమిత్ర.

‘అవునా. అయితే సరైన సమయానికే వచ్చాను. నేను నిన్ననే షాపింగ్ చేసి నేను కర్టెన్లు కొనుక్కొచ్చాను. నేను కర్టెన్లు అనే అంటున్నా, అలవాటయింది, ఏమనుకోకండి.. డ్రాయింగ్ రూమ్‌కు బాగుంటుందని షీర్ కర్టెన్లు కొన్నాను. కావలసినంత వెరైటీ చూపించారు. అవి పలచగా ఉంటాయి కాబట్టి లోపల కూర్చునే బయటి ఆహ్లాదకర ప్రకృతిని వీక్షించవచ్చు. రాడ్ ప్యానెల్ కర్టెన్లు కూడా కొన్నాను. వీటిలో కర్టెన్ డిజైన్ పూర్తిగా కనిపిస్తుంది. వీటికి వాడే ఫ్యాబ్రిక్ కూడా తేలిగ్గా ఉంటుంది. వేర్వేరు గదులకు వేర్వేరు రంగులు, డిజైన్లను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. వెదురు బ్లెండ్స్, పూసల తెరలు వంటివి కూడా కొందరు వాడుతున్నారు. ఎవరి అభిరుచి వారిది’ చెప్పింది శ్వేత.

మా జాతిలో ఎంత వైవిధ్యం ఉందో అనుకుంటూ ఉండగానే నరేంద్ర ప్రవేశించాడు. ‘నాన్నా!’ పిల్లలు ఆనందంగా అరిచారు. తన బ్యాక్‌ప్యాక్‍ను టేబుల్‍పై పెట్టి కుర్చీలో కూర్చుంటూ.. ‘ఏంటీ సంగతి.. పెద్ద చర్చే నడుస్తున్నట్లుంది’ అన్నాడు. ‘తెరల గురించి’ అన్నాడు సుదర్శనం. ‘తెరలా!’ అయోమయంగా అన్నాడు నరేంద్ర. ‘అదేరా! ఇంట్లో వాడే తెరలు, వెండి తెర, బుల్లితెర.. ఇలా ఎన్నో ఉన్నాయి కదా, అన్నిటి గురించి మాట్లాడుకున్నాం’ అంది సుమిత్ర. మంచినీళ్లు, కాఫీ అందించింది ప్రజ్ఞ.

కాఫీ మెల్లిగా తాగుతూ.. ‘అయితే నేను వేరే తెర గురించి చెపుతాను’ అన్నాడు. అంతా ఆసక్తిగా చూస్తుండగా, కాఫీ తాగటం ముగించి మొదలు పెట్టాడు. ‘నేను సాఫ్ట్‌వేర్ కదా. అందుకని డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ సాధనాల తెరల గురించి చెప్పగలను. ఈ తెరలు కళ్లనుంచి ఇరవై అయిదు అంగుళాల దూరంలో ఉంటే మంచిది. తెర పై భాగం పనిచేసే వారి కళ్లకు కాస్త కిందుగా ఉండాలి. అప్పుడే కళ్లమీద పడే ఒత్తిడిని, కాంతి తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. తదేకంగా డిజిటల్ తెరలు చూడకూడదు. గంటకు కనీసం ఐదు నిముషాల విరామం ఉండాలి. మొబైల్‌ను కూడా అదే పనిగా చూడకూడదు’ చెప్పాడు.

‘అవును. ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించాల్సిందే. ఇక ఆధ్యాత్మిక పథంలో కూడా తెరలున్నాయి. అవే మాయతెరలు. రమణ మహర్షులవారు ఏమన్నారంటే, నేను అనే మాట మీద దృష్టి పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయి అని. ఇక త్యాగరాజుగారయితే మత్సరం అంటే అసూయ తెర గురించి కూడా చెపుతూ..

‘తెరతీయగరాదా లోని..

తిరుపతి వేంకటరమణ మత్సరమను

అంటూ ఏడుకొండలవాడిని వేడుకున్నారు.’

‘సాయంత్రమైపోయింది. పైగా ఆకాశంలో మబ్బుతెరలు కమ్ముకుంటున్నాయి. మనం ఇంక ఈ తెర సంభాషణకు తెర దించుదాం’ అంది సుమిత్ర. అందరూ అవునవునంటూ అక్కడినుంచి కదిలారు. నేనింక వస్తానంటూ శ్వేత వెళ్లిపోయింది. ఆధ్యాత్మికపథంలో కూడా మన పాత్ర ఉంది అనుకుని మేం మురిపెంగా అటు ఇటు కదిలాం. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం.

కిటికీ తెర, గుమ్మం తెర బయటకు చూస్తున్నాయి. కానీ నాలో తెరలు తెరలుగా కొత్త ఆలోచనలు. టీవీలో ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటా. మొన్న అదేదో కొత్త సినిమా విడుదలయిన రోజు ఓ సినిమా హాల్లో తెరనే చింపివేశారట అభిమాన ప్రేక్షకులు. ఎంత దారుణం! సినిమా చూపించే తెరనే చింపివేయడం ఏం న్యాయం? ఈ మనుషులకు తామేం చేసినా చెల్లిపోతుందని అహం. ఈ అహంభావపు తెరలను ఎప్పుడు తొలగించుకుంటారో. మనసుల్లో తెరలు మంచివి కావని, అసూయ తెరలు, అనుమానపు తెరలు, కపటపు తెరలు తొలగించుకోమని మనుషులకు చెప్పాలని ఉంది. చెవులకూ వారు తెరలు వేసుకుంటే చేసేదేంలేదు అనుకుంటుంటే నా ఆలోచనను ఆటంకపరుస్తూ టీవీలో పాట నన్ను తాకింది…

‘నన్ను వదలి నీవు పోలేవులే.. అదీ నిజములే..

సిగ్గుతెరలలో కనులు దించుకుని, తలను వంచుకుని..

బుగ్గమీద పెళ్లిబొట్టు ముద్దులాడ.. పాట నన్ను కట్టిపడేసింది.

ఎంత మధురంగా ఉంది! ‘సిగ్గుతెరలు’ అన్నమాట వినగానే నేను మొదలు పెట్టా ఆనందనాట్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here