[dropcap]మ[/dropcap]బ్బు చాటున చంద్రుడు
తొంగి తొంగి నీ మోము చూచి
మొగమాట పడ్డాడేమో….
మళ్ళీ మబ్బుల్లో దాక్కున్నాడు
నీవు గల గలా నవ్వితే
నీ పంటి వరుస కాంతిపుంజం
సూర్యుడు చూసి ముక్కున వేలేసుకున్నాడు
ఏడు గుర్రాలను వెనక్కి పొమ్మన్నాడు
నిశి రాతిరి నీవు నింగిలోకి
తొంగి చూస్తే పైనున్న
చుక్కలు కలత చెందాయి
మనలోని అందాల చుక్క
కిందకి దిగి పోయిందా అని
వానాకాలంలో వెలసిన
ఇంద్రధనస్సు నిన్ను చూసి
తన రంగులు సరి చేసుకుంది
పాపం హరివిల్లు రంగులు
వెల వెల పోయాయేమో
పూల తోటలో నువు నడుస్తుంటే
పూలన్నీ సిగ్గుతో మొగ్గలయ్యి
తలలు దించుకున్నాయి నీ మోము చూచి
ఎంత వర్ణన చేసినా
నీ వర్ణం ముందు సువర్ణం
కూడా దిగదుడుపే
ఇంతకీ ఎవరు నీవు….?