[dropcap]అ[/dropcap]డవిలో తిరిగే వన్య మృగాలు
ఊళ్లలోకి వలస వచ్చేస్తున్నాయెందుకో?
అంటార్కిటికాలు కరిగి మంచు తుఫానులు
అల్లకల్లోలం సృష్టిస్తున్నాయెందుకో?
సునామీలు బ్రతుకులను
సుడిగుండాలలో పడేస్తున్నాయెందుకో?
కార్చిచ్చులు పెళపెళారావాలతో
కలవర పరుస్తున్నాయెందుకో?
సూర్యుడు ఏటికేడాదీ చండ నిప్పులు
చెరిగేస్తున్నాడెందుకో?
ఉండుండి భూమాత గుండెలు బాదుకుని
బ్రద్దలై పోతోందెందుకో ?
కొత్తగా పుట్టిన కరోనా ఊసరవెల్లిగా మారి
ఉసురులు తీస్తోందెందుకో ?
నిజంగానే కారణాలు తెలియని
అమాయకులమా మనం???
కలుషితం చెయ్యకుండా ఏదీ వదల్లేదని
పంచభూతాలు రగిలిపోతున్నాయేమో మరి!
ప్లాస్టిక్ భూతం ఎంతకీ కడుపులో జీర్ణంకాక
భూమాత అల్లాడి పోతోందేమో మరి !
అన్న వస్త్రాలతో బాటు ఆశ్రయమిచ్చే
చెట్టు మీద గొడ్డలి చెయ్యి వేసామనేమో మరి!
సెల్ ఫోన్ బ్రహ్మాస్త్రంతో పిచ్చుకలకు
పిండాలు పెట్టేసామనేమో మరి!
అమ్మబిడ్డల ఉసురు తీసేస్తుంటే
అండపిండ బ్రహ్మాండం మిగులుతుందా?
దూది పర్వతాన్ని దగ్థం చేసేందుకు
ఒక నిప్పు రవ్వచాలదా!
ఇకనైనా మన వ్రేలితో మన కన్నే
పొడుచు కోవడం ఆపేద్దాం
ప్రతిపర్వదినాన కొంగ్రొత్త మొక్కలతో
ప్రకృతి మాతను శాంతింప చేద్దాం కలసి రండి!