కైంకర్యము-41

0
4

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[మొదటి నెల జీతం అందుకున్నాకా, కుటుంబ సభ్యులందరిని సినిమాకి తీసుకువెడతాడు రాఘవ. మధ్యమధ్యలో పాత విషయాలు గుర్తొచ్చి, ఆ చిరాకంతా ప్రసన్నలక్ష్మిపై చూపించడం ఆపడు. శ్రావణమాసం పూజలకి ప్రసన్నలక్ష్మిని పుట్టింటిలో దింపి వస్తానంటుంది ఆండాళ్ళు సుదర్శనాచారితో. పట్టుచీరలు, నగలు కొని తీసుకువెళ్ళమంటాడాయన. బంగారం దుకాణానికి ఆయన్ని కూడా రమ్మంటుంది ఆండాళ్ళు. రాఘవని ఊరికి రమ్మంటే, ముందు మీరెళ్ళండి, తీసుకురావడానికి వస్తాను అంటాడు. ఊరు వెళతారు ప్రసన్నలక్ష్మి, ఆండాళ్ళు. పూజ దిగ్విజయంగా పూర్తి అవుతుంది. కానీ ఒకనాడు డ్రైవరు వచ్చి, ఉన్న పళాన బయల్దేరమంటాడు. ఎంత అడిగినా కారణం చెప్పడు. వాళ్ళని నేరుగా గాంధీ ఆసుపత్రికి తీసుకొస్తాడు. సుదర్శనాచారి జూనియర్ రామచంద్ర వచ్చి, రాఘవకు ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్తాడు. – ఇక చదవండి.]

[dropcap]“ఆ[/dropcap]పరేషన్ ఏంటి?” కంగారుగా అడిగింది ఆండాళ్లు.

ప్రసన్నలక్ష్మి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆమెకు కంగారు, హడావిడితో పాటు, మనిషి వణుకుతూ, కళ్ళలో నీరు ఉబుకుతూ, పెదవులు వణుకుతూ చూస్తోంది.

రామచంద్ర వారిద్దరిని చూసి వాళ్ళకేమి తెలియదని గ్రహించాడు.

“పెద్దగా కంగారు పడవలసిన పనిలేదు. నిన్న సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుంటే లారీ గుద్దేసింది. నిన్న రాత్రికే ఆసుపత్రిలో చేర్చారు. నిన్న సార్ చెప్పగానే వచ్చేశా. ఈ ఉదయం కాలికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు…” అని వివరంగా చెపుతూ లోనికి దారితీసాడు.

ఆండాళ్లు, ఆమె చేయి గట్టిగా పట్టుకొని ప్రసన్నలక్ష్మి అతని వెంట నడిచారు.

లోపల గదిలో సుదర్శనాచారి ఉన్నాడు. తెల్లటి దుప్పటి వేసిన మంచం మీద స్పృహ లేకుండా రాఘవ. అతని చేతికి, కాలికి పెద్ద కట్టు. తలకు బ్యాండేజ్ ఉన్నాయి. ఆండాళ్లు కళ్ళనీరు పెట్టేసుకుంది కొడుకుని చూసి. ప్రసన్నలక్ష్మి పరిస్థితి కంగారైయింది. ఆమెకు దాదాపు స్పృహ తప్పే స్థితిలోకి వెళ్ళిపోయింది.

ఆమెను కుర్చీలో కూర్చోపెట్టి సేదతీర్చారు. ఆండాళ్లును సముదాయించాడు చారి.

“హుష్! ఇది ఆసుపత్రి. అలా కన్నీరు పెట్టకు. వాడికి ఏమయ్యిందని ఇప్పుడు? గండం తప్పింది. ఆ పిల్ల తాళి గట్టిది!!” అన్నాడాయన.

ప్రసన్నలక్ష్మికి తల తిరుగుతోంది. దుఃఖం ఆగటం లేదు. ఎంత ఆపినా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.

వాళ్ళు తేరుకొని మాములు స్థితిలోకి రావటానికి సమయం పట్టింది.

“అందరు ఇక్కడ ఉండనక్కల్లేదు. నేను ఉంటాను. మీరు వెళ్ళండి. రామచంద్రా…. వీరిని ఇంటి దగ్గర దింపి రావయ్యా!” అన్నాడు సుదర్శనాచారి.

“మీరు వెళ్ళండి వాళ్ళతో. నేను చూసుకుంటాను రాఘవను. మీరు రాత్రి కూడ ఇక్కడే ఉన్నారుగా…” అన్నాడతను.

“సరే నేను సాయంత్రం వస్తాను… మనం ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు ఇక్కడ ఉండేలా వద్దాం…” అని బయలుదేరాడు సుదర్శనాచారి వారితో కలిసి.

ముగ్గురు ఇంటికి వచ్చారు.

ఆ రాత్రి నుంచి తను అక్కడే ఉంటానని చెప్పింది ప్రసన్నలక్ష్మి. ఎవ్వరు కాదనలేదు. ఆమె ఆ రాత్రికి రెండు జతల బట్టలతో ఆసుపత్రికి వచ్చేసింది.

ఆ రాత్రి రాఘవకు స్పృహ వచ్చింది.

అతను కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా తండ్రి, ప్రసన్నలక్ష్మి కనపడ్డారు.

అతను కళ్ళు తెరవటం చూసి దగ్గరకు వచ్చారు.

“కొద్దిగా దెబ్బలు తగిలాయిరా. కాలు ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని సెట్…” అన్నాడాయన తేలికగా కనపడటానికి ప్రయత్నిస్తూ.

రాఘవ కళ్ళు అటు ఇటు చూశాయి.

“మీ అమ్మనా?” అడిగాడు సుదర్శనాచారి. కళ్ళు ఆర్పి తెరిచాడు రాఘవ.

“ఇప్పటి వరకు ఇక్కడే ఉందిరా. మేము పంపించాము. రాత్రికి నేను ఉంటాను అంటే ప్రసన్నలక్ష్మి ఒప్పుకోవటం లేదు. ఆడపిల్లను ఒక్కదానినే ఉంచి వెళ్ళాల్సి వస్తోంది. అయినను బయట బండి, రాములు ఉంటారులే” అని చెప్పాడాయన.

రాఘవ విని ఊరుకునేవాడు.

అతనికి లీలగా గుర్తు కొచ్చింది. సడన్‌గా పాత లారీ ఎదురుగా వచ్చి కొట్టెయ్యటం. తను ఎగిరి ప్రక్కనే ఉన్న బండ మీద పడటం. తరువాత గుర్తు లేదు. ఎవరు ఆసుపత్రిలో చేర్చారో కూడా.

మరునాడు ఆండాళ్లు వచ్చింది. రాఘవకు యాక్సిడెంటని రంగరాజన్ వాళ్ళకు తెలిసి వాళ్ళంతా పరుగు పరుగున వచ్చారు.

రాఘవను అలా చూసి విలవిలలాడారు. ప్రసన్నలక్ష్మి అన్న, రాజన్న రాలేదు. ఆయన దీక్షలో ఉన్నాడని చెప్పింది సీత.

అన్న, వదిన తోడు ఉంటారు. ఏమి కాదు అని ధైర్యం చెప్పింది సీత తన కూతురుకు. కాని ప్రసన్నలక్ష్మికి ప్రాణాలన్ని కుదేలుమన్నాయి. ఆమె రాఘవను అలా చూడలేకపోయింది. ఎందరు తోడుగా ఉన్నా చాలా దిగులు, దుఃఖం కలిగాయి. శ్రీరంగనాథునికి ప్రత్యేక పూజ మొదలుపెట్టిందామె.

ప్రసన్నలక్ష్మి అన్న, వదిన ఆమెకు తోడుగా ఉండిపోయారు.

రాఘవ అక్కలు, అన్నలు ఒకరి తరువాత ఒకరుగా రాఘవ ఆసుపత్రిలో ఉన్న పదిహేను రోజులు వచ్చిపోతూనే ఉన్నారు.

ఆఫీస్ నుంచి కంపెనీ వీపి కూడ వచ్చాడు.

“ఇది ఆఫీస్ క్రిందకు రాదు కాబట్టి కాంపన్సేషన్ ఇవ్వటం కుదరదు, కాని అతని జాబ్ అతనికే ఉంటుందిలెండి…” అని చెప్పాడు సుదర్శనాచారితో.

నవ్వాడాయన. ఆయనను చూసి, “మీ వంటి పేరు పొందిన లాయరు కొడుకు మా ఫ్యాక్టరీలో పని చెయ్యటమంటే మాటలు కాదు. రాఘవను కంపెనీ లా చదవమని చెప్పాలి. అతనికి మాకు కూడా బెనిఫిట్” అన్నాడాయన.

సుదర్శనాచారి తల ఊపాడు అవునని.

ఆయన వెళ్ళిపోయాక రాఘవతో చెప్పాడు ఆ విషయం.

***

రౌండ్సుకు వచ్చిన డాక్టర్ పలకరించాడు రాఘవను “ఎలా ఉంది?”

“బయటకు పోవాలని ఉంది. ఇక్కడే ఉంటే విసుగే కదా?…”

“వెళ్ళొచ్చు. మీ కన్నుకు గాయం కాలేదు లక్కీగా. మీ చెయ్యి, కాలు ఇంకా సిక్స్ వీక్స్ తరువాత ఈ బ్యాండేజ్ తీస్తాము. తరువాత మీకు ఫిజియో ఉంటుంది. మీ ప్రోగ్రెస్ బావుంది. మీ శ్రీమతి చేతి చలువ. ఆమె సేవ చేస్తుంటే మీరిట్లే తిరిగేస్తారుగా…” అన్నాడు నవ్వుతూ.

రాఘవ ఏం మాట్లాడలేదు. ప్రసన్నలక్ష్మి వంక చూశాడు.

తల వంచుకు ఉన్నదామె.

నూలు చీరలో వదులుగా వేసిన జడ, తన మీద తను శ్రద్ధ చూపక అశోకవనంలో సీతలా అనిపించింది.

ఒక్క క్షణం జాలిగా అనిపించింది. ప్రేమగా పిలిచి కూడా ఎరగడు. అయినా ఎంత సేవ చేస్తుందో. తినటానికి కూడా ఇంటికి వెళ్ళదు. అసలే సన్నం. మరీ పుల్లలా అయింది. అయినా ఆ ముఖంలో కాంతి మారలేదు. ఆ మెరుపు, తళుకు అలాగే ఉంది.

తల త్రిప్పుకున్నాడు.

“మీ మామయ్యను కలవమని చెప్పమ్మా!” ఆమెతో చెప్పి వెళ్ళిపోయాడాయన.

ఆరోజు సుదర్శనాచారికి చెప్పిందామె.

రాఘవను డిశ్చార్జ్ చెయ్యటం గురించి, తరువాత విజిట్స్ గురించి వివరించాడు డాక్టర్.

మళ్ళీ మధ్యలో వచ్చి కట్టు మార్పించాలని, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండమని, అంతా సక్రమంగా అవుతుందని ధైర్యం చెప్పాడు డాక్టర్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here