అందమైన మనసు-14

0
12

[తనని చైత్రన్ ఎలా ఉపయోగించుకున్నాడో, తనకీ సహస్ర మధ్య ఎలాంటి అపోహలు సృష్టించాడో సూర్యదేవ్ చెబుతుంటే విని విస్తుపోతాడు వినీల్. డా. సహస్రని కలిసేందుకు అరుణాచల్ వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రికి నివేదకి తమ ఇంట్లోనే బస ఏర్పాటు చేస్తాడు సూర్యదేవ్. ఫ్లయిట్‌లో అరుణాచల్ వెళ్ళి అక్కడ డా. సహస్ర అన్నయ్య మోహన్‌ని కలుస్తారు. సహస్రని, సూర్యదేవ్‌ని, డా. వినీల్‌ని చూసిన సహస్ర మొదట్లో కొంచెం కటువుగా మాట్లాడుతుంది. సూర్యదేవ్ జరిగినదేంటో ఆమెకి వివరించి, వీడియో కాల్‌లో చైత్రన్‌తో మాట్లాడిపిస్తాడు. వినీల్ తన బాధని వ్యక్తం చేస్తాడు. – ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]హస్ర ఇంకా షాక్ లోనే వుంది.

“వాడు చేసిన పని వల్ల నువ్వు ఫోన్ చెయ్యటం మానేసావు. నువ్వేమయ్యావో అర్థం కాక మన వాళ్ళందరికి ఫోన్ చేశాను. ఎవరు కూడా నీ గురించి చెప్పలేదు. నిన్ను చాలా మిస్సయ్యాను సహస్రా! నా కెరీర్ కూడా పాడయింది. ప్రతి క్షణం గుర్తొచ్చేదానివి. నువ్వు లేని జీవితం నాకొద్దనిపించేది. ఏం చేస్తున్నా నీ ఆలోచనలే. ఏ పనీ చెయ్యాలనిపించేది కాదు. కారణం లేకుండానే మూడవుట్ అయ్యేవాడిని. అలాంటప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలిసేది కాదు. నేను చేస్తున్న ఆపరేషన్ ఫెయిల్ అయింది. జైలుకి కూడా వెళ్ళాను” అన్నాడు వినీల్. అతను అంటున్న ప్రతి మాట హృదయం లోంచి వస్తోంది.

సహస్ర మనసు కదిలిపోయింది.

సూర్యదేవ్, నివేద వచ్చారు. సహస్రకు ఎదురుగా కూర్చున్నారు.

నివేదను చూడగానే “సారీ వేదగారు! నా మాటలు నిన్ను బాగా బాధ పెట్టాయి. కానీ మీ అన్నయ్య అలా చెయ్యాల్సింది కాదు. బాధ అనేది వాళ్ళ దాకా వస్తేనే తెలుస్తుంది. ఏ బాధ ఎప్పుడు తెలియాలో అలాంటి వాళ్లకు తప్పకుండా తెలుస్తుంది. సో.. నీకు అలాంటి అన్నయ్య వున్నాడంటే నమ్మలేం. నువ్వెక్కడ. అతనెక్కడ!” అంది సహస్ర. అంత బాధలో కూడా అంతకన్నా ఇంకేం అనలేకపోయింది.

“నాకు మీ చేత సారీ చెప్పించుకోవాలని లేదు డాక్టర్! చెప్పారు. అది మీ సంస్కారం” అంది నివేద.

“వాడు వినీల్ పంపే డబ్బుకి బాగా అలవాటు పడ్డాడు డాక్టర్! ఏ పనీ చెయ్యకుండా బ్రతకాలన్న ఆలోచనతో ఇలా చేసాడు. ఇప్పుడు తెలిసిందిగా డాక్టర్ వినీల్ తప్పేమీ లేదని. ఇక మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ ఇద్దరు ఒకటి కావటమే ముఖ్యం” అన్నాడు సూర్యదేవ్.

“అదంత సులభం కాదు ఏ.ఎస్.పి. గారు!” అంది సహస్ర.

ఆ ముగ్గురికి అర్థం కాలేదు ఆమె అలా ఎందుకంటుందో..!!

“మీరింకా వినీల్‌ని అనుమానిస్తున్నారా?” అన్నాడు సూర్యదేవ్.

“లేదు ఏ.ఎస్.పి. గారు! డాక్టర్ వినీల్ మంచివాడే. కానీ నేను అతన్ని పెళ్లి చేసుకోలేను” అంది.

“ఎందుకు? వినీల్ చేసిన తప్పేంటి డాక్టర్?” అన్నాడు.

“చైత్రన్‌కి బంధువు కావటమే ఏ.ఎస్.పి గారు! అలాంటి ఫ్యామిలీ లోకి కోడలిగా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పెళ్ళికి ముందే ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అయ్యాక ఇంకా ఏ ధైర్యంతో పెళ్లి చేసుకుంటాను. ఇదంతా తెలిస్తే అన్నయ్య వూరుకోరు. ఆయనకు ఇలాంటివి నచ్చవు” అంది స్థిరంగా.

“నువ్వలా అనకు సహస్రా! దుర్మార్గులు, దగాకోరులు బంధువులుగా లేని ఫ్యామిలీలు వుంటాయా? అయినా చైత్రన్ ఇక మన దరిదాపుల్లోకి రాడు. అతనితో ఎలాంటి సంబంధాలు వుండవు. అతని వల్ల మనకి ఏ హాని జరగదు” అన్నాడు వినీల్.

అయినా ఆమె అతనితో పెళ్ళికి అంగీకరించలేదు.

“సరే డాక్టర్! మీకు మనస్ఫూర్తిగా వినీల్ కావాలా వద్దా అన్నది ఆలోచించుకోటానికి ఇంకొంత టైం తీసుకోండి. మేము వెళ్ళిపోతాం. వినీల్ వెళదామా?” అడిగాడు సూర్యదేవ్.

“నేను రాను సూర్యదేవ్! ఇక్కడే వుంటాను. ఏ విషయం నీకు ఫోన్ చేసి చెబుతాను. మీరు వెళ్ళండి” అన్నాడు వినీల్. అతన్ని చూస్తుంటే సహస్రను వదిలి వచ్చేలా లేడు.

“ఓకే డాక్టర్. బై..” అంటూ సహస్రకి వినీల్‌కి చెప్పి ఊరెళ్లాలని బయటకి వచ్చారు సూర్యదేవ్, నివేద. క్యాబ్ మాట్లాడుకున్నారు.

ఇద్దరు క్యాబ్‌లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

కొద్దిదూరం వెళ్ళాక…

“ఆ డాక్టర్ నాకు సారీ చెప్పారు. నిజానికి నేను చెప్పాలి అన్నయ్య అలా చేసినందుకు”

“ఫీలవుతున్నావా? మీ అన్నయ్య ఆల్రెడీ ఆమెకు సారీ చెప్పే వుంటాడు వేదా! ఇలాంటి విషయాలకు ఊరికూరికే ఫీలవ్వటం కూడా అంతమంచిది కాదు” అన్నాడు సూర్యదేవ్.

“ఆ డాక్టర్ చాలా సాఫ్ట్‌గా వున్నారు కదా! ఆమె ముఖం చూస్తేనే సగం జబ్బు తగ్గిపోయేలా వుంది. మా బావ సెలక్షన్ బాగుంది. కానీ బావను ఆమె యాక్సెప్ట్ చేస్తారా?”

“నీకా డౌవుట్ ఎందుకు వచ్చింది? మీ బావ ఒక సర్జన్ మాత్రమే కాదు. మంచి ప్రేమికుడు. అతని ప్రేమలో నిజాయితీ వుంది. అందుకే వాళ్ళు కలుసుకున్నారు. అలాంటి ప్రేమికులు ఆ మాత్రం కలుసుకుంటే చాలు. ఎన్ని త్యాగాలు చేసైనా అల్లుకుపోతారు. ఇదంతా నేను ఎలా చెబుతున్నానా అని ఆశ్చర్యపోకు వేదా! ప్రేమంటే తెలిసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇలాగే వుంటుంది. ప్రేమది కనిపించని శక్తి. కనిపించని మాయ. రెండూ బలమైనవే. ఎలాంటివాళ్ళకైనా ప్రేమ కావాలి. కానీ ఆ ప్రేమ ఎలా వస్తుంది? ఎందులో దొరుకుతుంది అన్నది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అసలు నేనైతే ప్రేమ లేకుండా ఒక్క క్షణం కూడా వుండలేను. ఉదయం లేవగానే అమ్మను చూడాలి. అమ్మతో మాట్లాడాలి. అలా వుంటేనే ఆ రోజంతా బాగుంటుంది నాకు. అమ్మ పక్కన నాన్న నవ్వుతూ నా వైపు చూస్తుంటే ఇంకా బాగుంటుంది. అలా లేకుండా ఒక్క రోజు కూడా వుండలేను” అన్నాడు సూర్యదేవ్.

“మీరు చెబుతున్న వాతావరణం అరుంధతీ ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా వుంది. చాలా సింపుల్‌గా వుంటారు. ప్రేమగా వుంటారు. ఆనందంగా వుంటారు. అదే మా మామయ్య వాళ్ళ ఇంట్లో అలా వుండదు. మామయ్య ఎప్పుడు చూసినా డబ్బు సంపాయించటం కోసం ముంబై వెళతారు. బావ ఎప్పుడో తప్ప అత్తయ్య దగ్గర కూర్చోరు. ముగ్గురూ ఒంటరి వాళ్లే. వాళ్ళ మాటల్లో కూడా ఏ బిజినెస్‌లో ఎంత డబ్బు వచ్చింది. ఎంత డబ్బు పోయింది. ఇంకా ఎక్కువ రావాలంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది. వినీల్ హాస్పిటల్లో ఈరోజు ఎంత సంపాయించాడు. పేషంట్లు ఇంకా ఎక్కువ రావాలంటే ఏం చెయ్యాలి? ఇదే హడావుడి వుంటుంది. వాళ్ళకు ఇందులోనే ప్రేమ, ఆనందం ఉంటుందంటారా?”

“అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం వేదా! ఎవరు కావాలనుకున్నది వాళ్లకు ఆనందంగానే ఉంటుంది. ఆమోదయోగ్యంగా కూడా ఉంటుంది. అవునూ! మీ మామయ్య నీ మీద కోపంగా ఎందుకున్నారు? గొడవేమైనా జరిగిందా?” అడిగాడు సూర్యదేవ్.

చెప్పాలా, వద్దా అన్నటుగా చూసింది.

“నీ ఇష్టం. చెప్పాలనిపిస్తేనే చెప్పు. చెప్పకపోయినా నో ప్రాబ్లం” అన్నాడు.

“చెబుతాను. నాన్న మంచివాడని అమ్మను నాన్నకి ఇచ్చి చేసారు తాతయ్య. నాన్న దగ్గర ఆస్తి లేదు. తాతయ్య చనిపోతూ మామయ్యకు ఇచ్చినట్లే అమ్మకు కూడా పొలం ఇచ్చారు. ఆ విషయం అమ్మకు చెప్పలేదు. ఆయన పొలాన్ని అమ్ముకుని బిజినెస్ చేసాడు. అమ్మ పొలాన్ని అమ్ముకుని హాస్పిటల్ కట్టించాడు. ఇదంతా నాకు అరుంధతీ ఆంటీ చెప్పారు. మాకు తాతయ్య ఇచ్చింది ఇవ్వకుండా మమ్మల్ని పేదవాళ్ళను చేసాడని నాకు అర్థమైంది. ఇదే విషయం మామయ్యను అడిగాను. ఆయన కోప్పడ్డారు. నామీదకి చెయ్యి కూడా లేపారు. అత్తయ్య ఆపింది. వెంటనే నేను మా ఊరు వెళ్ళాను. అమ్మతో చెప్పాను. అన్నయ్య విన్నాడు. ‘బావను పెళ్లి చేసుకుంటే మొత్తం ఆస్తి మనదే అవుతుంది’ అన్నాడు అన్నయ్య. నేను ‘చేసుకోను’ అన్నాను. అంతే గదిలో పెట్టి లాక్ చేసాడు. మీరొచ్చి విడిపించారు. మీరు రాకుంటే నేను ఆ గదిలోనే ఉండేదాన్ని” అంది నివేద.

“అవునా! అలా జరిగిందా?” అన్నాడు సూర్యదేవ్.

“మీరేమీ అనను అంటే మీకో విషయం చెబుతాను” అంది నివేద.

“అనను. చెప్పు “ అన్నాడు సూర్యదేవ్.

“ఇప్పుడు మా అన్నయ్య మా ఊరిలోనే ఉంటాడు. వాడికి నా మీద కోపం అప్పుడే తగ్గదు. మా మామయ్య పరిస్థితి కూడా అదే. అందుకే నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళలేను. నాకు నా జాబ్ ముఖ్యం. మధురిమా హాస్టల్లో వుంటాను” అంది.

సూర్యదేవ్‌కి అర్థమైంది. అందుకే “నా పక్కనేగా ఉంటావ్. ఏమీ అనను. రోజూ ఫోన్ చెయ్యాలి. ఎందుకంటే నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో నేను గెస్ చెయ్యలేను. ఛార్జింగ్ లేదు అనొద్దు” అన్నాడు.

“అనను” అంది.

అంతలో అలేఖ్య ఫోన్ చేసింది.

“ఎక్కడున్నావ్ వేదా?” అంది.

“అరుణాచల్ నుండి వస్తున్నాం అలేఖ్యా! ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాం. అక్కడకొచ్చాక నేను మధురిమా హాస్టల్లో ఉంటున్నాను” అంది.

“మధురిమలో వుంటావా? ఆ అడ్రెస్ మీవాళ్ళకి తెలుసుకదే! ఒకసారి ఏ.ఎస్.పి. గారికి ఫోనివ్వు” అంది అలేఖ్య.

“ఎందుకే?”

“ఇవ్వు చెబుతా”

“అలేఖ్య మీతో మాట్లాడుతుందట”

ఫోన్ తీసుకుని “చెప్పు అలేఖ్యా!” అన్నాడు సూర్యదేవ్.

“వేద మధురిమలో వుంటుందట సర్! వద్దని చెప్పండి. మీరు చెబితే వింటుంది. ఇంకేదైనా హాస్టల్లో వుండమనండి. లేకుంటే వాళ్ళ అన్నయ్య వచ్చి తీసికెళతాడు. వేదను వినీల్‌కి ఇచ్చి పెళ్లి చేయాలన్నదే వాళ్ళ ప్లాన్..” అంది భయపడుతూ అలేఖ్య.

“ఆ భయమేం వద్దు అలేఖ్యా! వినీల్ డాక్టర్ సహస్ర దగ్గర వున్నాడు. మేం మాత్రమే వస్తున్నాం. వేద మధురిమలో ఉంటే ప్రాబ్లం ఏమీ రాదు. ఉండనివ్వు. నేనున్నాను కదా “ అన్నాడు.

“హమ్మయ్యా! ఓకే సర్! థాంక్యూ” అంది. ఫోన్ నివేదకు ఇచ్చాడు.

అలేఖ్యతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుంది నివేద.

“ప్లైట్ వచ్చే టైం అయింది” అంది నివేద.

“సరే! రేపు నిన్ను హాస్టల్లో కలుస్తాను” అంటూ ఫోన్ పెట్టేసింది అలేఖ్య.

***

వారం రోజుల తరువాత…

చైత్రన్‌కి ఫోన్ చేసింది ప్రియాంక.

“చైతూ నువ్వు మీ ఊరు వెళ్లి ఒన్ వీక్ అయింది. ఎప్పుడొస్తావ్? ఫోన్ చేస్తే ఏదో రెండు మాటలు మాట్లాడి కట్ చేస్తున్నావ్! ఏం జరిగింది?” అడిగింది ప్రియాంక.

“ఏంలేదు ప్రియా! మా బంధువుల్లో ఒకరు పోయారు. అందుకే నీతో సరిగా మాట్లాడటం లేదు” అంటూ అబద్ధం చెప్పాడు.

“అవునా! అయ్యో! మరి ఎప్పుడొస్తున్నావ్?” అంది.

“వస్తాను. నాన్న డబ్బుల్లేవంటున్నాడు. అక్కడ నేను కట్టిన హాస్టల్ ఫీజ్ అయిపోవచ్చింది. ఇప్పుడు వచ్చినా వెకేట్ చేసి ఇంటికి రావలసిందే. అందుకే ఆలోచిస్తున్నా. ఒక నెల హాస్టల్ ఫీజ్ నువ్వు కడతానంటే వస్తాను” అన్నాడు.

ప్రియాంకకు వినీల్ గురించి ఎప్పుడూ చెప్పలేదు చైత్రన్. హాస్పిటల్లో సహస్ర దగ్గర అతను ఆడిన డ్రామా కూడా ప్రియాంకకు తెలియదు. ఆమె లేనప్పుడే సహస్రతో మాట్లాడాడు.

“నేను కట్టలేను చైతూ! నాక్కూడా జాబ్ దొరకట్లేదు. ఇప్పుడు కూడా ఒక ఆఫీస్ కెళ్ళి ఖాళీగా వస్తున్నా. హాఫ్ మంత్ కట్టమంటే వదిన దగ్గర తీసుకుని కడతాను. ఈలోపల నీకు కానీ, నాకు కానీ ఏదో ఒక జాబ్ రాకపోతుందా? ట్రై చేద్దాం. వస్తావా?” అంది.

“సరే వస్తాను” అంటూ లేచి తండ్రి దగ్గరకు వెళ్ళాడు.

“సిటీకి వెళుతున్నా నాన్నా!” అన్నాడు.

“అక్కడకు వెళ్లి ఏం చేస్తావురా? వినీల్ కూడా డబ్బు పంపడు. తిండికి చస్తావు. మాతోనే వుండు. కావాలంటే మాతోపాటు పొలం రా. నీక్కూడా పొలం పనులు వస్తాయి” అన్నాడు బ్రహ్మయ్య.

“నేను పొలం రావటం ఏమిటి నాన్నా? ఎంబీఏ చేశాను. చూసేవాళ్ళు నవ్వుతారు”

“పని విలువ తెలిసిన వాళ్ళెవరూ నవ్వరు చైత్రా! నువ్వు అనవసరంగా అపోహ పడుతున్నావు”

“లేదులే నాన్నా నేను సిటీకి వెళతాను”

“ఏమోరా నువ్వు ఇప్పుడు సిటీకి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఇక నీ ఇష్టం” అంటూ లేచి పొలం వెళ్ళాడు బ్రహ్మయ్య.

వంట చేస్తున్న అమ్మ దగ్గరకు వెళ్ళాడు “అమ్మా! నాన్న మాటలు విన్నావుగా. నాకు ఇక్కడ ఉంటే మనసు బాగా లేదు. వెళతాను” అన్నాడు చైత్రన్.

“నాన్న అన్న మాటల్లో తప్పు లేదు చైత్రన్! మరి నీ మనసు బాగా లేదన్నావుగా. వెళ్ళు. కానీ జాగ్రత్త” అంది నాగేశ్వరి.

“అలాగే” అంటూ చైత్రన్ సిటీకి వెళ్ళాడు.

***

అరుణాచల్ నుండి వినీల్ ఫోన్ చేసి మాట్లాడినప్పటి నుండి హరనాధరావు మనసు మనసులో లేదు. విపరీతంగా బాధ పడుతున్నాడు.

“ఇప్పుడేం చెయ్యాలి సత్యా? వినీల్ మాటలు వింటుంటే నాకు నిజంగానే గుండె ఆగిపోయేలా వుంది” అన్నాడు. కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

“మీరు చెప్పేది వింటుంటే నాక్కూడా మాటలు రావటం లేదండీ! వినీల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి? అసలా సహస్ర ఎవరు? దీనికి మీరెలా ఒప్పుకున్నారు?” అంది సత్యవతి.

“నేనెలా ఒప్పుకుంటాను సత్యా! వాడికోసమే కదా హాస్పిటల్ కట్టించాను. వాడే లేకుంటే ఇప్పుడా హాస్పిటల్ ఎందుకు? వాడిక ఇక్కడకి రాడట. ఆ హాస్పిటల్ వాడికి వద్దట. జైలుకి వెళ్ళినప్పుడే ఆ హాస్పిటల్‌ని తన మనసులోంచి తీసేశాడట. సహస్రను పెళ్లి చేసుకుని అరుణాచల్ లోనే ప్రాక్టీస్ పెడతాడట. అక్కడ వాడి అవసరం చాలా వుందట. ఇక్కడ లేదట. ఇప్పుడేం చేద్దాం సత్యా? కొడుకు వుండి కూడా ఒంటరివాళ్ళం అయిపోయాం కదా!” అంటూ ఆమెను పట్టుకుని కుమిలిపోయాడు.

“ముందు మీరు దైర్యంగా వుండండి. ఏదో ఒకటి ఆలోచిద్దాం” అంది సత్యవతి

“ఏముంది సత్యా ఆలోచించటానికి. ‘నేనక్కడకు వస్తే నన్ను సైకియాట్రిస్ట్‌లకు, భూతవైద్యులకు చూపించటానికి మాత్రమే పనికొస్తాను నాన్నా! రమ్మంటారా?’ అంటున్నాడు. ఈ భూతవైద్యులేమిటో, సైకియాట్రిస్ట్‌లు ఏమిటో నాకేం అర్థం కావటం లేదు సత్యా!” అన్నాడు హరనాధరావు.

సత్యవతికి అర్థమైంది. తలకొట్టుకుంది.

“ఇదేదో శాపంలా వుంది సత్యా! లేకుంటే వాడు మనల్ని వదిలిపోవటం ఏంటి? అంత మంచి హాస్పిటల్‌ని వద్దనుకోవటం ఏమిటి?” అన్నాడు.

“నాక్కూడా అలాగే అనిపిస్తుందండి! ఈ వయసులో ఈ బాధేంటి మనకు? వాడు మనల్ని ఇలా ఏడిపించటానికే పుట్టాడా? నా కొడుకు డాక్టరైయ్యాడని ఎంత మురిసిపోయేదాన్ని. ఎంత గర్వపడేదాన్ని. ఇప్పుడదంతా ఏది?” అంటూ బెడ్ మీద పడిపోయింది బాధగా. ఆమెను ఓదార్చే ఓపిక లేనట్లు అలాగే శూన్యం లోకి చూస్తూ కూర్చున్నాడు హరనాధరావు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here