[dropcap]డి[/dropcap]యర్ శశి!
మన పాతికేళ్ళ మైత్రిలో ఇలాంటిరోజు వస్తుందని నీవు కానీ, నేను కానీ ఊహించి ఉండము. రోజు పక్కపక్కనే ఆఫీసులో గడిపి మనం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన మనం, అపూర్వమైన స్నేహితులని పిలిపించుకునే మనం ఇలాంటి విపత్కర పరిస్థితిలో పడడం విధి కాకుంటే మరేమిటి?
బహుశా మన స్నేహానికి ఇది అగ్ని పరీక్ష కాబోలు.
అవునూ… సెల్ ఫోన్లు, ఈ-మెయిలు ఉండగా ఉత్తరమేమిటి.. అనుకుంటున్నావా?
కొన్ని కొన్ని భావాలు పంచుకోవడానికి ఉత్తరమే సబబేమో! అసలు విషయానికి వస్తాను.
హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ ఎమోషన్స్ చాలా చిత్రమైనవి. కొన్ని వందల, వేల మెదళ్ళను చదవగలిగే శక్తి ఉన్నా, ఎక్కడో ఒక మెదడును చదవలేకపోతాం అన్నది నిజం. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మనతో సన్నిహితంగా ఉండి, మనతో మమేకమై ఉండే వారిలో కూడా ఒక అపరిచిత వ్యక్తి, ఒక అనూహ్యమైన వ్యక్తిత్వం ఉంటుందని నాకు ఇప్పుడి అనుభవంలోకి వచ్చింది. నేను కలలో కూడా ఊహించని సంఘటన ఒకటి నాకు ఎదురైంది.
వారం రోజుల కిందట నాకు ఒక కొరియర్‌లో ప్రేమలేఖ వచ్చింది.
షాక్ అయ్యావా? అపుడే షాక్ అవ్వకు! ఇంకా చాలా ఉంది. ముందుగా ఆ ప్రేమలేఖ మా అమ్మాయికి వచ్చిందమో అనుకున్నాను. కానీ నా పేరుతో వచ్చింది. యాభై సంవత్సరాల వయసులో, తల నెరిసి, కీళ్ళూ, గూళ్ళూ అరిగిన ఈ వయసులో నాకు ప్రేమలేఖ ఏమిటి? ఇదెవరో నన్ను ఆట పట్టించడానికో, చల్లగా సాగుతున్న మా సంసారాన్ని అస్తవ్యస్తం చేయడానికే అనుకున్నాను. లేదా నాకు ఎవరైతే రాసారో, వారిని ఎవరైనా ఇచ్చిందిపెట్టాలని, వారి పేరుతో రాసి ఉండవచ్చని అనుకున్నాను. చికాకు వేసింది. భయం వేసింది. ఆసక్తి కూడా వేసింది.
నా పేరుతో వచ్చిన కొరియర్‌లో మొత్తము రెండు ఉత్తరాలు ఉన్నాయి. ఒక దాని పై అందమైన దస్తూరితో ‘ప్రేమలేఖ’ అని రాయబడి దానికింద ‘లేఖ నంబర్ 1’ అని రాయబడి ఉంది. మరొక దానిపై ‘లేఖ నంబర్ 2’ అని రాయబడి ఉంది.
ఆ రోజు మావారు కానీ, మా అమ్మాయి కానీ ఇంటిలో లేరు. లెటర్ నంబర్ 1 చించాను. చదవడం ప్రారంభించాను. అంతే నా కాళ్ళ కింద నేల బద్దలయినట్లు. నన్ను ఎవరో సమ్మెటలతో బాదుతున్నట్లు అనిపించింది. నేను సరిగ్గా చదవడం లేదేమో, నా కళ్ళు మసకలు కమ్మాయేమో అనుకొని, నన్ను నేను కుదుట పరుచుకొని మళ్ళీ మళ్ళీ చదివాను. నిజమే. నిజంగా అది ప్రేమ లేఖయే.
అదీ…….. నేను పాతిక సంవత్సరాలుగా ‘అన్నయ్యా!’ అని ప్రేమగా పిలుచుకుంటున్న, నా కష్ట సుఖాలకు దేవుడు పంపిన ఆసరాగా భావిస్తున్న శ్రీ రామచంద్ర మూర్తి గారు రాసినది.
అది ఇంకా పెద్ద షాక్!
అవును నీవు చదువుతున్నది నిజమే! అది నీ భర్త శ్రీ రామచంద్ర మూర్తిగారు రాసినదే!
కంగారు పడకు, సిగ్గుతో కుంచించుకుపోకు. వేదనతో, క్రోధంతో నీ మనసును బాధ పెట్టుకోకు. జరిగినది నిజం. ఇక ఆ లేఖలో మా అన్నయ్య గారు అద్భుతమైన భావుకత కనబరిచారు. నాపై సుందరమైన కవిత్వాన్ని చెప్పారు. నా అంగాంగాలను వైవిధ్య భరితంగా వర్ణించారు. ఒక వేళ నిజంగా ఈ లేఖ యే పాతిక సంవత్సరాల క్రితమో నాకు చేరి ఉంటే అప్పటికి మన పరిచయాలు కాకుంటే బహుశా నాలోని వయసు పొంగు ఆ భావాలకు ఎలా ప్రతిస్పందించేదో?.
ఆహా! ఎంత గొప్పగా ప్రేమను ఆవిష్కరణ చేసాడు. ఎంత అందంగా తన హృదయాన్ని నా ముందు పరిచాడు. మా అన్నయ్య ఒక వేళ ఈ మూడ్‌లో యే కావ్యమో రాసి ఉంటే, సాహిత్యానికి చెందిన అవార్డులు అన్నీ ఆయనకి దక్కేవి.
నేను గుండెను దిటవు చేసుకొని ఆ లేఖ ఆసాంతం చదివాను.
ఇక లేఖ నంబర్ 2 లో యేముందోనన్న ఆసక్తితో అది విప్పి చదివాను. అది నన్ను ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించింది! ఇక్కడ నేను నీకు రాస్తున్న ఈ లేఖను ఆపుతాను. నీవు కూడా ఇక్కడ చదవడం ఆవు. కొరియర్‌లో నేను రాసిన లేఖతో పాటు మీ వారు రాసిన లేఖ నంబరు 1, లేఖ నంబర్ 2 జతపరిచాను. అందులో మీ వారు రాసిన లేఖ పంబర్ 2 అని రాసి ఉన్నది తీసి చదువు.
నీ ప్రియ వేస్తం
సుశీల
***
అంత వరకు యేమి చదువుతుందో, యేమి జరుగుతుందో అర్థం కాని శశికళ తనకు వచ్చిన కొరియర్ పాకెట్ నుండి నంబర్ 2 లేఖ తీసి, సుశీల చెప్పిన విధంగా చదవడం ప్రారంభించింది.
డియర్ సుశీల,
నేనొక ప్రేమ పిపాసిని. నాకు యుక్త వయసు వచ్చినప్పటి నుండి ఎవరినైనా గాఢంగా ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలని కోరిక. నా భావాలను, నా మనసును నేను చదివిన వేలకొలది సాహిత్య పుటల ఆధారంగా నా ప్రేయసికి పంచాలని నా తపన.
ప్రేమలేఖకు చదివిన నా ప్రేయసి తన హృదయవు ప్రేమ సింహాసనంపై నన్నదిష్టింప చేయాలని నా కోరిక. కాని నేను మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన వాడిని, బాధ్యతలు, బరువులు, కష్టాలు, కన్నీళ్ళు తప్ప సరసాలకు శృంగారాలకు, భావుకతకు తావు లేని వాడిని. మా నాన్న నాపై మోపిన ఇంటి బాధ్యతలు మోస్తూ, ఒక వైపు కష్టపడి చదువుకుంటూ, మంచి ఉద్యోగాన్ని వెతుక్కోవడంతో నాకు పాతిక సంవత్సరాలు వచ్చాయి. నా కోరిక మనసు అట్టడుగున సమాధి అయింది.
ఇంతలో నా ప్రమేయం లేకుండా నాకు వివాహమయింది.
నా భార్య దేవత, అనుకూలవతి. నిజానికి నేను నా ప్రేయసిలో చూడాలి అనుకున్న సుగుణాలు అన్ని నా భార్యలో ఉన్నాయి. ఆమె నన్ను అమితంగా విశ్వసించింది. ప్రేమించింది. నేనూ అంతగానే ప్రేమించాను. ఎక్కడా, ఎప్పుడూ ఆమెకు లోటు రానీయలేదు. కానీ నాలో అపుడపుడు తీరని కోరికగా మిగిలిన ప్రేమించడం, ప్రేమ లేఖలు రాయడం అన్న భావనలు చావలేదు.
భార్యను ప్రేమించవచ్చుగా! భార్యకు ప్రేమలేఖలు రాయ వచ్చుగా!
ఎందుకో నా స్వప్న ప్రపంచంలో నా ఊహల్లో ఉన్న ఆలోచనకు, దానికి పొంతన కుదరలేదు. ఇంకోకరిని ప్రేమించడం అనే భావనను దేవతలాంటి నా ఇల్లాలి వల్ల దూరం చేయగలిగాను. కానీ ప్రేమలేఖ రాయాలి అన్న లేకి తపన నుండి బయట పడలేక పోయాను.
అంటే నా దృష్టిలో ఈ పాటికి ప్రేమించడం, ప్రేమలేఖ రాయడం రెండు ప్రత్యేక అంశాలుగా మారిపోయాయి. ఎన్నో సార్లు అద్భుతమైన ప్రేమలేఖలు రాసాను. బహుశా అవన్నీ పోగు చేస్తే తెలుగు సాహిత్యంలో అవి ఒక ప్రత్యేక ప్రక్రియగా మారి దానికి నేను ఆద్యుడిగా ఉండే వాడివేమో.
నేను రాసిన ప్రేమలేఖలో నేను అమితంగా ప్రేమించే భార్యకు కూడా చూపలేదు. చించేసే వాడిని. అయితే ఎప్పుడు నా మనసులో ఒక పురుగు తొలిచేది. రాసిన ప్రేమలేఖను ఎవరికైనా పోస్ట్ చేయాలని అనిపించేది.
అమ్మో! ఇంకా ఏమయినా ఉందా? నా పరువు ప్రతిష్ఠలు ఏమయిపోతాయి. నా కుటుంబం, మరొక కుటుంబం నవ్వుల పాలుపవుతుంది. నా యీ దుశ్చర్య, మతిమాలిన లేకి చేష్ట వలన కావురాలు ముక్కలై పోతాయి.
కాని నా హృదయ బలహీనత, నా క్యాన్సరస్ క్రిజ్ నా మెదడును గెలిచింది. ఎవరికైనా పోస్ట్ చేయాలని నిశ్చయించుకున్నాను. అందుకే నిన్ను ఎంచుకున్నాను. అంత మాత్రాన విన్ను గాఢంగా ప్రేమించానని గాఢంగా ప్రేమిస్తానని కాదు. నీవు కూడా నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. నీవు ప్రేమించ వద్దు కూడా.
అంతే రాయాలనిపించింది. రాసాను. వేనొక పిచ్చి వాడిని నా చేతిలో రాయి ఉంది. విసిరాను.
నీవైతే మళ్ళీ విసరవు, నన్ను అర్థం చేసుకుంటావు, రభస చేయవు.
వావీ వరుసలు, సభ్యత, సంస్కారం విడిచి నేను చేసిన ఈ పనిని బహుశా క్షమిస్తావు.
నా మనసు మెదడును గెలిచింది.
నా బలహీనత ప్రేమలేఖ రూపములో ‘ఎజాక్యులేట్’ అయింది. నా మనసు విప్పి చెప్పాను. వీలైతే క్షమించు.
ఇంత తప్పు చేసిన తరువాత క్షమించకపోయినా పరవాలేదు. విషపు విత్తనం నాటిన తరువాత వాటికి తీయని పండ్ల చెట్టు పెరగదని నాకు తెలుసు, పచ్చి మిరప కొరికితే తీయదనం రాదని కూడా తెలుసు. పరిణామాలకు సిద్ధంగా ఉన్నాను.
నీ విజ్ఞత నిన్ను ఎలా నడిపిస్తే అలా నడుపు. నా మనసు మెదడును గెలిచిన ఆనందంతో సేద తీరుతుంది. ఇంక చాలు అని సంతోషపడుతుంది.
ఈ లేకితనం ఇదే మొదటి సారి మరియు చివరిసారి. కాబట్టి నా వల్ల భవిష్యత్తులో ఎవరికీ బాధ లేదు. ఒక వేళ నా యీ చేష్ట వల్ల మీకు ఇబ్బందులు ఎదురైతే నా తల నరుక్కొని అయినా నీ కష్టము తీరుస్తాను
నీ????
శ్రీ రామచంద్రమూర్తి
………………………………………….
లేఖను ఆసాంతం ఒకటికి రెండు సార్లు చదివిన శశికళ హిప్నటైజ్‌కు గురైన వ్యక్తిలా మళ్ళీ తన ఫ్రెండ్ సుశీల రాసిన లేఖ తీసింది. ఎక్కడైతే ఆపిందో అక్కడి నుండి చదవడం ప్రారంభించింది.
“డియర్ శశి!
ఈ పాటికి నేను చెప్పిన విధంగా లేఖ చదివి ఉంటావు.
ఇపుడు నీవు ఎంతో క్షోభకు గురి అవుతున్నావని, నీ మనసు కల్లోలంగా ఉందని నేను ఊహించగలను.
బీ కూల్ మై డియర్! ఒక వేళ నేను కూడా ఆందోళన పడి ఉంటే ఈ లేఖ రాసేదానిని కాదు. ఇపుడు మనం ప్రశాంతంగా ఉండాలి. విచక్షణతో ఆలోచించాలి. మీ శ్రీవారు మా అన్నయ్య గారు చెడ్డవారు కాదు. ఈ ప్రేమ లేఖ రాయాలి అన్న అంశం తప్ప, మరే ఇతర బలహీనతలు అతనిలో లేవు.
దశాబ్దాలుగా మనసులో గూడుకట్టుకు పోయిన ఒక పిచ్చి కోరిక అన్నయ్యను బలహీనుడిని చేసి, అన్నయ్యను ఇలా బయటపడిసింది. సమాజంలో ఇలాంటి వారు చాలామంది ఉంటారు.
సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, బాధ్యతలు అనేవి లేకుంటే ప్రతి వ్యక్తిలో ఎక్కడో ఒక చోట పొంచి ఉన్న రాక్షసుడు, సమయం చూసుకొని బయటపడుతుంటాడు.
మనలో చాలా మంది తమకు లభించని, మానసిక అనుభూతులకై భౌతిక సంపదలకై శారీరక సుఖాలకై వెంపర్లాడుతుంటారు. అయితే విచక్షణ వారిని అదుపు చేసినంత కాలం ఉత్తములుగానే ఉంటారు. జీవిత కాలంలో యే ఒక్క సారి ఆ విజ్ఞత, విచక్షణ లోపించినా, ఇదిగో మా అన్నయ్యలా దేవురిస్తారు.
మరొక విషయము ఆయనకు ప్రేమను ప్రేమించాలని, ప్రేమలోకంలో విహరించాలని, ప్రేమలేఖలను రాయాలని తప్ప, ప్రస్తుతం నన్ను కానీ మరొకరిని కానీ ప్రేమించాలని లేదు. కాబట్టి మనం సేఫ్. ఈ విషయాన్నంత నీకు చెప్పక దాచిపెట్టవచ్చు. కాని ఈ విషయము మరొకరి ద్వారా తెలిసివా, మరొక రూపంలో తెలిసినా మన బంధం తెగిపోవచ్చునని, అన్నయ్యలో ఉన్న ఈ జాడ్యం నీకూ తెలియాలని ఈ ఉత్తరం రాసాను.
అదృష్టవశాత్తు నన్ను ఎంచుకోవడం, సమయానికి ఇంటిలో ఎవరూ లేకపోవడం మనం చేసుకున్న అదృష్టం. నేను కూడా యీ విషయం మరిచిపోయాను. ఈ సంఘటన మన స్నేహానికి విఘాతం కారాదు. ఇక ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. రేపటి ఆదివారం నేనూ, మావారు, మా అమ్మాయి మీ ఇంటికి వస్తాము. నీవు యేమీ యెరగనట్టే ఉండు. బహుశా అన్నయ్య కూడా అలాగే ఉంటాడు.
మరొక మాట పసి పిల్లవాడు తప్పు చేస్తే, తల్లి ఎలా సవరిస్తుందో నీవు అలాగే ప్రవర్తించు. లేనిపోని ఆరాటాలతో, ఆర్భాటాలతో కలతలు సృష్టించుకోకు. నీవు నా కన్నా ఉన్నతంగా ఆలోచించగలవు. అసలు నాలో యీ ఆలోచనా జ్ఞానం అంత నీ వల్లనే కదా..
ప్రేమతో
నీ సుశీల
***
చదివిన ఉత్తరాలను పక్కన పెట్టింది శశి. ఒక్కసారిగా ఆమె మనసూ, మెదడు నిస్తేజమయ్యాయి. భూగృహంలో పాతి బాదుతున్నట్లుగా తోచింది. వందలాది సమ్మెటలతో ఎవరో కొడుతున్నట్లుగా ఫీల్ అయింది.
తాను ఎంతగా భర్తను ప్రేమించింది. పిచ్చిగా ఆరాధించింది. ఇంతకాలము అర్ధనారీశ్వరులుగా బతుకుతున్నామనుకున్నది. కానీ తన అర్ధ భాగమొక అర్థం కాని ప్రహేళిక అని యిపుడే అర్థమయింది.
ఈ బాధను ఎలా దిగమింగాలి. శతృత్వాన్ని, దౌర్భాగ్యాన్ని ఎదుర్కోవచ్చు. కాని ఇది వెన్నుపోటు. దీనిని ఎలా భరించేది. ఇంకా అతడితో కాపురం ఎట్లా చేసేది. సుశీలకు తమ ముఖం ఎట్లా చూపిది.
ఇంకా అతడిలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో?…………………నో!…..తట్టుకోలేను!
క్షమించడం, సహించడం సుశీల చెప్పినంత తేలిక కాదు. అది బలహీనత కావచ్చు. తాత్కాలికం కావచ్చు. భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఉండకపోవచ్చు. కానీ… కానీ… భరించలేదు… క్షమించలేను…………. క్షమించలేను…………….
అనుకుంటూ చేతిలో ఉన్నా కాగితాలను ముక్కలుగా చించి వేసి, కమోడ్‌లో వేసి ఫ్లష్ అవుట్ చేసింది.
కాగితాలను నీటీలో వేసింది. కాని మనసులో చెలరేగుతున్న భావాలను ‘ఫ్లష్ అవుట్’ చేయలేక పోయింది.
ఇంతలో యేదో అలికిడి కావడంతో బాల్కనీలోకి వచ్చింది. మాటలు వినపడుతున్నాయి.
తమ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహాలక్ష్మి, పనిపిల్ల మధ్య సంభాషణ సాగుతుంది.
“నిజం చెప్పు, నీవు ఉండగా ఆ బొమ్మలన్ని ఎక్కడికి పోతాయి. రెండేళ్ళ మా బంటి ఇంటి నుండి కదలడు. వేలకు వేలు పోసి కొన్నాము. హెలీకాప్టర్లు, ట్రైయిన్లు కారు జంతువుల బొమ్మలు, ఒక్కటి కనబడడం లేదు. మేము లేనప్పుడు నీవే కదా ఉండేది? దొంగ ఎవరైనా దూరితే ఖరీదైన సామానులని పట్టుకు పోకుండా బొమ్మలు పట్టుకు పోతాడా?”
“సత్యం అమ్మా! నాకేమీ తెలియదు. బాబు ముందు బొమ్మలు వేసి నేను ఇంటి పనులు చేసుకుంటున్నపుడు ఎవరైనా తీసుకుపోయారేమో? అయినా నాకు ఆ బొమ్మలు ఎందుకమ్మా? నాకు పిల్లలా? జెల్లలా? ఇట్లా అయితే నేను పని వదులుకుంటాను”
అసలే బుర్ర హీటెక్కి ఉండడంతో, ‘ఈ గొడవతో నాకిమిటీ’ అనుకొని బెడ్ రూమ్ వైపుకు నడిచింది. మరొక బెడ్ రూమ్‌లో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న కొడుకు ఉన్నాడు. తలుపు వారగా వేసింది. యేదో చప్పుడు వస్తుంది.
అసంకల్పితంగా తలుపు తీసి లోపలికి చూసింది. ఒక్క సారిగా షాక్ అయింది.
ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న ఇరవై సంవత్సరాల కొడుకు హెలీకాప్టర్, ట్రైయిన్, జంతువుల బొమ్మలతో చప్పట్లు చరుస్తూ, గెంతుతూ పసిపిల్ల వాడిలా ఆనందంగా ఆడుకుంటున్నాడు.
“రాహుల్! ఏమిట్రా నీవు చేస్తున్నది? ఈ బొమ్మలు ఎక్కడివి? అయినా ఈ వయసులో ఈ ఆటలేమిటిరా?” అని కోపంగా ప్రశ్నించింది. రాహుల్ బిక్కముఖమువేసి నిలబడ్డాడు. అతడు ఈ కాలం వాటి కుర్రవాడు కాదు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెరిగినవాడు.
“మాట్లాడవేమిటిరా?” మళ్ళీ తల్లి గద్దించింది. “అమ్మా! ఇవి బంటి బొమ్మలు. నాకు చిన్నప్పటి నుండి ఇలాంటి బొమ్మలతో ఆడుకోవాలని ఉండేది. కానీ నాకు ఎప్పుడూ స్కూల్, హోం వర్క్, ట్యూషను, మార్కులు, కార్పొరేట్ కాలేజీ చదువు. ఎంసెట్ కోచింగ్, ఆపై ఇంజనీరింగ్ వీటితోనే గడిచిపోయింది. నేను చిన్నప్పుడు బొమ్మలని అడిగినప్పుడల్లా నన్ను కొప్పడేవారు. నాకు బొమ్మలంటే భలే సరదా. నా మనసులో ఎప్పుడూ ఇలా ఆడుకోవాలని ఉండేది. నన్ను మీరు ఎప్పుడూ ఆడుకోనిచ్చేవారు కాదు. చిన్నప్పుడు నా తోటి వారంతా రకరకాల బొమ్మలతో ఆడుతుంటే వాటిని ముట్టుకోవాలని వాటితో ఆడుకోవాలని వాటి వింతలు అనుభవించాలని నా మనసు తపనపడేది.
ఎప్పుడు ఆడుకుందామని అనుకున్నా- “లక్ష్యం పెట్టుకో! దాని కోసం కృషి చేయి. దానికై మేము రెక్కలు ముక్కలు చేసుకుంటాము. లక్షలు ఖర్చు పెడతాము” అనేవారు. అలాగే చేసేవారు. నాకు మీరు ఖరీదైన బట్టలు కొనిచ్చారు. వేలు, లక్షలు పోసి మంచి స్కూల్స్‌లో చదివించారు. కాని చిన్న చిన్న సరదాలను నా నుండి దూరం చేసారు. అరె! పదో, పరకకో వచ్చే బొమ్మలు కూడా కొనిచ్చేవారు కాదు. దానితో ఆ కోరిక లాగే ఉండి పోయింది. బంటీ బొమ్మలతో ఆడుతుంటే ఒక్కసారిగా నాకూ ఆడుకోవాలి అనిపించింది. అందుకే వాడిని ఏమార్చి బొమ్మలు తెచ్చుకున్నాను. ఆడుకుంటున్నాను……………………….
అమ్మా! తప్పు చేసాను కదూ. అవును తప్పే. కానీ చిన్ననాటి నుంచి తీరని కోరికగా మిగిలిపోయిన ఈ కోరిక, ఒక్కసారిగా అన్ని వింత వింత బొమ్మలను చూడగానే, నా మనసు తప్పుచేసేలా పురికొలిపింది. నా మనసు మెదడును గెలిచింది.
ఈ తప్పు నాది కాదు. ఎంత అణచి పెట్టుకున్నా, అణిగి ఉండలేని బలహీనతది. అమ్మా! క్షమిస్తావు కదూ” అంటూ కళ్ళలో నీళ్ళతో అన్నాడు. చెలియలికట్టలు దాటేలా ఎగిసిన కెరటాలు వెనక్కి వెళ్ళి కడలి గర్భంలో శాంతించినట్లుగా శశి మెదడులో ఉప్పొంగిన ఆలోచనా కెరటాలు ఎగిసి, ఎగిసి తీవ్ర నిర్ణయాలు అనే చెలియలి కట్టలు దాటాలని ప్రయత్నించి, చివరికి యేదో శక్తి వెనక్కి లాగినట్లుగా మనోసాగరంలో శాంతించాయి.
కెరటాలు ఎంత ఉప్పొంగినా వరద రూపంలో కడలి తీరం దాటకుంటేనే క్షేమం. ఆలోచనల తీవ్రత కూడా ఆచరణల రూపంలో మనసు దాటకుంటేనే క్షేమం అని యెరిగినది కావున శాంత గోదావరి అయినది శశి.
ఆమె ముఖంపై చిరునవ్వు వెలిసినది ‘క్షమిస్తాను నాన్నా! నిన్నే కాదు. నీ లాంటి వాళ్ళలో అదును చూసుకొని అంతరంగాన్ని దాటి బయటవడే బలహీనతను క్షమిస్తాను. అంతే కాదు ఓపికగా మీ లాంటి వాళ్ళను సవరిస్తాను. అయినా ప్రేమించడమంటే ప్రేమించిన వ్యక్తులలోని బలహీనతలను, అసహ్యాలను క్షమిస్తూ ముందుకు పోవడమే కదా’ అనుకుంటూ అక్కడి నుండి కదిలింది.