[dropcap]అ[/dropcap]నాదిగా భారతదేశంలో చిన్న, పెద్దా అనేక రాజ్యాలు విలసిల్లాయి. ఆయా రాజ్యాలను వివిధ అంశాలలో సుసంపన్నం చేసి, అభివృద్ధి చేసి, ప్రజలను కన్నబిడ్డలలా పరిపాలించిన రాజులు, రాణులు, చాలా మంది కనిపిస్తారు. కొంతమంది ప్రజలను హింసించి కడగండ్ల పాల్జేశారు. మరి కొంత మంది ప్రజలు సుఖంగా గడపడానికి అవసరమైన సంస్కరణలు చేశారు. ఇటువంటి రాణులు, రాజుల చరిత్రలో నిలిచిపోతారు. వారిని గుర్తుంచుకుని తర్వాత తరాల వారికి అందించవలసిన అవసరం ఉంది.
దేవుని రాజ్యమని పేరు పొందిన ఈనాటి కేరళ రాష్ట్రంలో మలబారు తీర రాజ్యాలు చాలా ఉండేవి. వాటిలో తిరువాన్కూరు సంస్థానం కళాకారులైన రాజులకు, దేవాలయ నిర్మాతలకు, సంస్కరణలు ప్రవేశపెట్టి ఆచరింప చేసిన రాజులకు, రాణులకు నెలవయింది.
తొలి సంవత్సరాలలో రాణిగా పరిపాలన చేసి, మలి సంవత్సరాలలో తూర్పు ఇండియా కంపెనీ నిర్వహణలోకి వెళ్ళి రాజప్రతినిధిగా పరిపాలించినా/ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డారామె. ప్రజలందరి సుఖసంతోషాల కోసం కృషి చేసిన గొప్ప సంస్కరణాభిలాషి ఆమె. స్వతంత్ర ప్రతిపత్తితోనే పరిపాలించిన గొప్ప స్త్రీమూర్తి.
ఈమె ఈనాటి కేరళరాష్ట్రం ఆనాటి తిరువాన్కూరు (ఈస్టిండియా కంపెనీ అధికార ప్రతినిధి పరిపాలించిన ప్రాంతం) లో 1791లో జన్మించారు. ఈమె పూర్తి పేరు అయిలియోం తిరునాళ్ గౌరీలక్ష్మీబాయి. కులశేఖర వంశానికి చెందిన భరణి తిరునాళ్ పార్వతిబాయి, కిలిమనూర్ కోయి తంపురాన్ ఈమె తల్లిదండ్రులు. మాతృస్వామ్య వ్యవస్థ కేరళ రాష్ట్రంలో తొలిరోజుల నుండి అమలులో ఉన్నవిషయం మనకు తెలుసు. ఈమె తల్లి తిరువాన్కూరు రాజకుటుంబపు రాణి. తిరువాన్కూరు రాణులను ‘అట్టింగళ్ రాణి’ అంటారు.
తిరువాన్కూరు మహారాజు బలరామవర్మ పరిపాలన సక్రమంగా లేదు. అంతర్గత తిరుగుబాట్లు చెలరేగాయి. ఇతర రాజ్యాలతో కొనసాగించిన యుద్ధాలు రాజ్యాన్ని ఆర్థికంగా, రాజకీయంగా క్రుంగదీశాయి. ప్రజలు అధిక పన్నులు చెల్లించలేక ఎదురు తిరిగారు. సైనికులు యుద్ధాలు, అంతఃకలహాలలో పాల్గొని పాల్గొని విసిగిపోయి ఉన్నారు. ఈ సమయంలో వేలు తంపి చేసిన తిరుగుబాటులో రాజు మరణించారు. రాజుకు కుమారులు లేరు.
గౌరీలక్ష్మీబాయి సింహాసనాన్ని అధిష్టించి వారసుడు పుట్టేవరకు పరిపాలించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో బలరామవర్మ బంధువు కేరళవర్మ తనే వారసుడనని కోర్టుకెక్కాడు. పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
తూర్పు ఇండియా కంపెనీ రెసిడెంట్ కల్నన్ జాన్ మన్రో నేతృత్వంలో ఈమెను తిరువాన్కూరు రాణిగా 1811లో నియమించారు. అంతకు ముందు బలరామవర్మ పరిపాలనా కాలంలో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కాజేసిన దివాన్ ఉమ్మిని తంపి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మహారాణి కేసులను విచారించి ఇతనికి జైలుశిక్ష విధించారు. ఆస్తులను ప్రభుత్వానికి జమచేశారు.
అతని స్థానంలో దివాన్‌గా జేమ్స్ మన్రోని నియమించారు. ఇతను మూడు సంవత్సరాల తరువాత ఈ పదవికి రాజీనామా చేశాడు. పదవులు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిర్వహించకూడదని, కొత్త సమస్యలకు అవకాశమివ్వకూడదని ఆయన ఆలోచన. ఈ నాటి రాజకీయ నాయకులు, అధికార అనధికారులకు ఇటువంటి ఆలోచన ఇసుమంత కూడా లేకపోవడం విచారకరం.
రాణి గౌరీలక్ష్మీబాయి 1810 నుండి 1813 వరకు మహారాణిగా పరిపాలించారు. ఆ తరువాత 1813 నుండి 1815లో మరణించే వరకు కంపెనీ రీజెంట్ రాణి (అధికార ప్రతినిధి) గా పరిపాలన చేశారు. కంపెనీ నిర్వహణలో ఉండడం వల్ల యుద్దాలు చేసే అవసరం కలగలేదు. ఈమె వారికి లోబడి కాకుండా తన స్వీయ రాజకీయ చతురత, మంచితనాలతో ప్రజలకు మెరుగైన పరిపాలనను అందించడం గొప్ప చారిత్రక విశేషం.
ఈమె పరిపాలనలో అంతకు ముందు మహారాజు చేసిన పొరపాట్లను సరిదిద్దారు. ప్రజలు ప్రశాంతంగా, శాంతియుతంగా బ్రతికే అవకాశాలను కల్పించారు. దివాన్ మన్రో రాజ్యంలో జరిగిన అరాచకాలు, అవినీతి వ్యవహారాలను గురించి మహారాణికి తెలియపర్చడం విశేషం. ఇదే ఆమె పరిపాలనలోని లోటుపాట్లని సరిదిద్దుకోగలిగే అవకాశాన్ని ఇచ్చింది. నూతన పరిపాలనా సంస్కరణలను ఆవిష్కరించి సత్ఫలితాలను పొందారామె.
అంతకు ముందు అధికారమంతా ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకరించి ఉండేది. అధికార వికేంద్రీకరణ చేసి గ్రామం, తాలూకా, జిల్లా, రాజ్యస్థాయి అధికారులను నియమించారు. వీరిని పన్నుల సేకరణకు మాత్రమే నిర్దేశించారు.
న్యాయవ్యవస్థని పునర్వ్యవస్థీకరించారు. 5 జిల్లా స్థాయి కోర్టులను ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయాన్ని సత్వరం కల్పించే ఏర్పాట్లు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగులను విచారించడానికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.
న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ కలిసి సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని రెండు శతాబ్దాల క్రితమే అవగాహన చేసుకున్న తెలివయిన, సమర్ధులయిన రాణి ఆమె. అందుచేతనే న్యాయవ్యవస్థతో సమాంతరంగా పోలీసు వ్యవస్థనీ పునర్వ్యవస్థీకరించారు. దేవాలయ కార్పొరేషన్లు ఆ రోజుల్లోనే తిరువాన్కూరులో ఉండేవి. వీటి అవినీతిని నిరోధించే ప్రయత్నాలు చేశారు.
సమాజంలోని సామాజిక అసమానతలు ఈమెకి మనోవేదనని కలిగించాయి. వాటి నివారించే ఆలోచనతో కొన్ని సంస్కరణలను చేపట్టారు.
బానిసల కొనుగోలు, అమ్మకాలను నిషేధించారు. రైతుల కోసం వ్యవసాయ చట్టాలు చేశారు. వ్యవసాయానికి కావలసిన సౌకర్యాలను సమకూర్చారు. తక్కువ సామాజిక వర్గాల వారు వెండి, బంగారు నగలను ధరించడం పై ఉన్న నిషేదాన్ని తొలగించారు.
1813 నాటికి వైద్య, ఆరోగ్య సౌకర్యాలు అంతగా ప్రాచుర్యం లోనికి రాలేదు. వివిధ వ్యాధుల నివారణకు టీకాలు వేయడం మొదలు పెట్టిన రోజులవి. తిరువాన్కూరు రాజ్యం తరపున టీకా విభాగాన్ని ఏర్పాటు చేశారంటే ఆమె ముందుచూపుని అర్థం చేసుకోవచ్చు. ముందుగా రాజకుటుంబీకులకు టీకాలు వేయించి ప్రజలకు ఆదర్శంగా నిలిచిన ఆచరణశీలి ఆమె.
ఈమె కుటుంబం గురించి చెప్తే – కోయిల్ తంపురాన్ యువరాజు రాజరాజవర్మ అవర్గల్‌తో వివాహం జరిగింది. ఆయన చంగనస్సేరి రాజవంశస్థులు. ఈ దంపతులకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మహారాణి గౌరీరుక్మిణీబాయి వీరి కుమార్తె. ప్రముఖ సంగీత విద్వాంసుడు స్వాతి తిరునాళ్ వర్మ పెద్ద కుమారుడు. 1814లో రెండవ కుమారుడు ఉత్తం తిరునాళ్ వర్మ పుట్టిన కొద్ది కాలంలోనే ఈమె అనారోగ్యం పాలయ్యారు. 1815లో 24 ఏళ్ళ చిన్నవయస్సులోనే ఈమె మరణించడం బాధాకరం.
తిరువాన్కూరు శ్రీ పద్మనాభస్వామి ఈ సంస్థానాధీశుల కుటుంబదైవం. ఈ రాజ్యంలో సుమారు 300 దేవాలయాలు, వాటికి ఇనాం భూములు ఉండేవి. అనంత పద్మనాభ స్వామి దేవాలయ నేలమాళిగలలోని ‘అనంత సంపద’ ఈ రాజులు దేవుని సొమ్ముని స్వాహా చేయలేదనడానికి గొప్ప నిదర్శనం.
మహారాణి గౌరీలక్ష్మీబాయి జీవితాన్ని మనం ఎందుకు స్మరించుకోవాలంటే ‘తను తూర్పు ఇండియా కంపెనీ అధికారి ప్రతినిధిగా – వారి ఆధిపత్యాన్ని అంగీకరించినప్పటికీ స్వయంగా ప్రజల సంక్షేమాన్ని ఆశించి సంస్కరణలను చేపట్టి అమలు పరచినందుకు!’. వారికి హృదయపూర్వక నివాళి.
***
Image Courtesy: Internet