[dropcap]సి[/dropcap]ద్ధవరంలో నాగయ్యకు రెండెకరాల భూమి ఉంది. అందులో మొక్కజొన్న పంట వేశాడు. అది ఏపుగా పెరిగి బోలెడు కంకులు వచ్చాయి.
అలా వచ్చిన కంకుల మీద పిట్టలు వాలి కొన్ని గింజల్ని తినసాగాయి. ఒక రోజు పొలం దగ్గరకు వచ్చిన నాగయ్య బోలెడు పిట్టలు కంకుల మీద వాలి గింజల్ని తింటుండడం చూసి పంటంతా అవి తిని వేస్తూ తనకి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయని తలంచాడు. నిజానికి అవి గింజల్ని తింటున్నా పొలానికి హాని చేసే పురుగుల్ని తిని వాటి విసర్జకాలను ఎరువుగా వేస్తున్నాయన్న సంగతి నాగయ్య అర్థం చేసుకోలేకపోయాడు. వాటి మీద కోపం పెంచుకున్నాడు.
ఇలా ఉండగా నాగయ్య ఇంటి పక్కనే నందయ్య అనే బీదవాడు ఉంటున్నాడు. నందయ్యకు భూతదయ ఎక్కువ అతనికి జంతువులన్నా, పక్షులన్నా చాలా ప్రేమ. పక్షులకి నీరు, గింజలు పెట్టేవాడు, జంతువులకి తన చేతనైనంతలో తన ఇంట్లో మిగిలిన ఆహారం పెట్టేవాడు. అందుకే పక్షులకి, జంతువులకి నందయ్య అంటే ఎంతో ఇష్టం.
నాగయ్య తన పొలంలో గింజలు తింటున్న పిట్టల పని పట్టాలని వాటిమీద ప్రయోగించడానికి కాట్ బాల్ తీసుకువచ్చాడు. అంటే దానిలో రాయి పెట్టి కొడితే పక్షికి తగిలితే అది చనిపోతుంది!
అలా ఆ కాట్ బాల్‌తో రెండు పక్షులకు గాయాలు చేశాడు. అతడి దుశ్చర్యకు పిట్టలు చాలా బాధపడ్డాయి. అతనికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని తమ గుంపులోని పిట్టలకు చెయ్యాల్సిన పని చెప్పాయి. అంతే ఆ పిట్టలు మరికొన్ని పిట్టల గుంపుకి నాగయ్య చేసిన పని గురించి చెప్పి తీసుకు వచ్చాయి. నాగయ్య పొలానికి రానప్పుడు అన్నీ ఒక్కసారిగా వాలి సాధ్యమైనన్ని గింజల్ని నోట కరుచుకుని సర్రున ఎగిరి వెళ్ళి నందయ్య నట్టింట కుప్ప పోశాయి! వాటి చర్యకు నందయ్య ఆశ్చర్య పోయాడు. వాటికి కాస్త గింజలు, నీళ్ళు పెడితే అవి అన్ని గింజలు తనకిచ్చి ఋణం తీర్చుకున్నట్లు తెలిసి మరింత ఆశ్చర్య పోయాడు.
అయినా తన అలవాటు ప్రకారం వాటికి నీళ్ళు, గింజలు ఇంటి గోడ మీద పెట్టసాగాడు. నందయ్య ప్రేమను అర్థం చేసుకున్న ఆ పిట్టలు అప్పుడప్పుడూ చిన్న పండ్లు, కాయలు కూడా తెచ్చి ఇచ్చేవి! కాలక్రమేణా నాగయ్య పిట్టలను హింసిస్తున్నట్టు తెలుసుకున్న నందయ్య అతనికి వాటి వలన జరిగే మేలును గురించి వివరించి అతనిలో మంచి మార్పు తెచ్చి వాటిని అతను కూడా ప్రేమించేటట్టు చేశాడు. చూశారా ప్రకృతిని, పశు పక్ష్యాదులను మనం ప్రేమించి వాటికి మేలు చేస్తే అవే మనల్ని కాపాడుతాయి, తెలియకుండా మేలు చేస్తాయి.