గురుదక్షిణ ఇవ్వటంలో విఫలమైన ‘గాలవ్యుడు’

0
3

[dropcap]గా[/dropcap]లవ్యుని వృత్తాంతాన్ని నారదుడు దుర్యోధనునితో కౌరవ సభలో చెపుతాడు. పాండవులతో యుద్ధము తగదని చెపుతుంటే దుర్యోధనునికి, అతని సోదరులకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కొంతమంది సభాసదులు దుర్యోధనుడు కర్ణుడి అండతో అతని శక్తి మీద నమ్మకంతో పాండవులపై విజయం సాధించవచ్చు అని భావిస్తున్న సందర్భంలో దుర్యోధనునికి నారదుడు ఈ వృత్తాంతాన్ని వివరిస్తాడు.

దుర్యోధనుని అనుమతితో నారదుడు, “ఓ గాంధారి పుత్రా, అవతలివారు బలవంతులు, సర్వ స్వతంత్రులు, సమర్థులు. తంత్రాలు, పన్నాగాలు నీవైతే ధర్మము వారి వైపు ఉంది. నిన్ను భయపెట్టటానికో, నిరుత్సాహ పరచటానికో నేను చెప్పటం లేదు. యథార్థాలను చెపుతాను. ఇందులో నీ ఇష్టాఇష్టాలకన్నా లోక హితము, విశ్వ కళ్యాణము ఉన్నందువల్ల నేను స్వతంత్రించి ధర్మ హాని జరగకుండా నాశనానికి దారి తీయకూడదని చెపుతున్నాను. అన్ని సందర్భాలలో మొండి పట్టుదల, దురహంకారం పనికిరాదు. అధర్మము పెరిగి ధర్మ నాశనానికి దారితీస్తే చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ సందర్భంగా నీకు గాలవ్యుడనే ముని కుమారుని చరిత్ర చెపుతాను. విని దానిలోని మంచిని గ్రహించి మాన్యుడివై వెలుగొందుము” అని నారదుడు గాలవ్యుని వృత్తాంతాన్ని మొదలు పెడతాడు.

గాలవ్యుడనే ముని కుమారుడు చాలా కాలం విశ్వామిత్రుని దగ్గర శుశ్రూష చేసి వేదవేదాంగాలను అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న పిమ్మట గురువుగారికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటూ, “మీకు గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారు?” అని అడుగుతాడు. ఆ మాటకు విశ్వామిత్రుడు తనకు గురుదక్షిణ ఏమి వద్దు అని గాలవ్యుడిని ఇంటికి వెళ్లి గృహస్థాశ్రమము స్వీకరించి ధర్మబద్ధంగా జీవించమని హితవు పలికాడు. కానీ గాలవ్యుడు గురువు గారిని గురుదక్షిణ అడగవలసినదిగా మొండి పట్టు పట్టాడు. దాంతో సహజముగానే కోపిష్టి అయినా విశ్వామిత్రుడు ఒక వైపు నల్లగా ఉండి మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉండే ఎనిమిది వందల అశ్వాలను తెచ్చి ఇమ్మని గురుదక్షిణగా కోరాడు.

గాలవ్యుడు గురువు గారు చెప్పిన అశ్వాల అన్వేషణకు బయలుదేరాడు. ఎంత తిరిగినప్పటికీ అటువంటి అశ్వాల జాడ కనిపించలేదు. గురుదక్షిణ చెల్లించాలి అన్న దీక్షతో నిద్రహారాలు మాని అన్వేషణ కొనసాగించాడు కానీ ఫలితం లేకపోయింది. ఈ అన్వేషణలో గాలవ్యునికి బాల్య మిత్రుడైన గరుత్మంతుడు తారసపడగా మిత్రునికి తన అన్వేషణ గురించి చెపుతాడు. మిత్రునికి ధైర్యము చెప్పి గరుత్మంతుడు గాలవ్యుని తన వీపు మీద కూర్చోబెట్టుకొని దివిజులకు ఆవాసమైన ప్రాగ్దిశకు (తూర్పు దిశగా) బయలుదేరుతాడు. గాలవ్యునికి తన స్నేహితుడైన గరుత్మంతుడి అండ ఉన్నది కాబట్టి తానూ సులభముగా విజయము సాధించగలననే నమ్మకం ఏర్పడుతుంది. గరుత్మంతుడి అపరిమితమైన వేగం యొక్క శక్తికి గాలవ్యుడు తట్టుకోలేకపోతాడు. అందుచేత గరుత్మంతుడు గాలవ్యుడిని అక్కడి గిరి శిఖరంపై ఉంచి అక్కడే ఉండమని దగ్గరలో ఉన్న శాండిలి అనే ముని ఆశ్రమాన్ని చేరి తపస్సు చేసుకుంటున్న ఆ ముని తపస్సు భంగము చేయటము వల్ల అయన ఆగ్రహానికి గురై రెక్కలు ఊడిపోయి అచేతనుడై కూలబడిపోతాడు.

శాండిలి మునిని ప్రార్థించగా అయన శాంతించి తిరిగి గరుత్మంతుని రెక్కలు వచ్చేటట్లు దీవిస్తాడు. అప్పుడు గరుత్మంతుడు మునికి నమస్కరించి తూర్పు దిక్కు ప్రయాణము విరమించుకొని గాలవ్యునితో కలిసి తన మిత్రుడైన ప్రతిష్టాన నగరాధిపతి యయాతి వద్దకు బయలుదేరుతాడు. గరుత్మంతుడు యయాతికి గాలవ్యుని పరిస్థితి వివరించగా యయాతి తన అసమర్థతను చెప్పాడు. కాకపోతే తన కుమార్తె మాధవిని గాలవ్యునికి అర్పిస్తానని చెప్పాడు. ఆమె వల్ల అశ్వ సంపద గల ఏ ప్రభువులైన మీకు సహాయము చేయగలరని సలహా ఇస్తాడు. మాధవిని స్వీకరించిన గాలవ్యుడు గరుత్మంతుడు ముగ్గురు కలిసి అయోధ్యాపతిని చేరి తమ కోరికను చెప్పగా అయోధ్యాపతి అటువంటి గుర్రాలు రెండు వందల గుర్రాలు మాత్రమే తన వద్ద ఉన్నాయని చెపుతాడు. అప్పుడు మాధవి గాలవ్యునితో, “ఋషి కుమారా, సంతానము కలిగినా నా కన్యత్వానికి భంగము రాదనీ నాకు వరము ఉంది, కాబట్టి నన్ను ఈ మహీపతికి అర్పించి పుత్రుడు పుట్టేవరకు నన్ను ఆయన వద్ద ఉంచి గుర్రాలను స్వీకరించు” అని చెప్తుంది. అప్పుడు గాలవ్యుడు అలాగే చేసి మాధవిని మహీపతి దగ్గర పుత్రోదయము అయ్యేంతవరకు గృహిణిగా ఉంచి తదుపరి మాధవిని స్వీకరిస్తాడు.

అదే విధముగా గాలవ్యుడు మాధవిని భోజపుర నాథునికి, కాశీ పురాధీశునికి ఇచ్చి రెండేసి వందల గుర్రాలను సంపాదించాడు. ఇక మిగిలిన రెండు వందల గుర్రాల కోసము ప్రయత్నిస్తుంటే గరుత్మంతుడు ఈ భూలోకములో అటువంటి అపురూప అశ్వాలు లేవు కాబట్టి సంపాదించిన ఆరు వందల అశ్వాలను మాధవిని విశ్వామిత్రుల వారికి అర్పించి ఋణ విముక్తుడివి కమ్మని చెపుతాడు. గాలవ్యునికి తోడుగా గరుత్మంతుడు కూడా వచ్చి ,”ఓ మహర్షీ, గాలవ్యుడు తన మూర్ఖత్వంతో మీరు వద్దన్నా గురుదక్షిణ చెల్లిస్తానని చెప్పి తన మాటను సాధించుకోలేకపోయాడు. కాబట్టి ఈ ఆరు వందల అశ్వాలను, మాధవిని స్వీకరించండి” అని ప్రార్థించగా గాలవ్యుడు గురువుగారి చరణాలను పట్టుకున్నాడు.

విశ్వామిత్రుడు మాధవిని అష్టకుడు అనే కుమారుడు పుట్టేవరకు తన వద్ద గురుదక్షిణగా ఉంచుకొని తిరిగి మాధవిని గాలవ్యునికి తిరిగి ఇచ్చాడు. మాధవి అంతటితో గుర్రాల కథకు స్వస్తి చెప్పి తపస్సు సంకల్పించి ఘోరారణ్యం లోకి ప్రవేశించింది. ఆ విధముగా గాలవ్యుని కధ ముగించిన నారదుడు దుర్యోధనునితో, “దుర్యోధనా, కర్ణుని నమ్ముకొని లోకబంధవుడైన శ్రీకృష్ణుని అండ ఉన్న పాండవులతో వైరం తెచ్చుకొని నాశనాన్ని కొని తెచ్చుకోకు”, అని సూటిగా తెలియజేశాడు. కానీ దుర్యోధనుడు రాధేయుని చెయ్యి పట్టుకొని నడవటం వలన జరగవలసింది జరిగి తీరుతుంది. విధివ్రాతను ఎవరు తప్పించలేరు అన్న సత్యాన్ని లోకానికి తెలియజేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here