సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…4

0
3

[box type=’note’ fontsize=’16’] సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా విశ్వవీధుల్లో తమ ప్రయాణపు అనుభవాలను వివరిస్తున్నారు శ్రీమతి వి. శాంతి ప్రబోధ. శీర్షిక నిర్వహణ శ్రీ సారధి మోటమఱ్ఱి. [/box]

గ్యాంబెల్ రెస్ట్ క్యాంపింగ్

[dropcap]కాం[/dropcap]పింగ్‌‌కి వెళ్లాలని సాధన ఉబలాటం. రాజేష్ ఇయర్ ఎండ్ ఆఫ్ ఒక వారం తీసుకున్నాడు. మూడు రోజులు క్యాంపింగ్‌కి మిగతా టైంలో పెండింగులో ఉన్న ఇంటిపనులు పూర్తి చేసుకోవాలని నిర్ణయం అయింది.

అనుకున్నట్టుగానే క్యాంపింగ్‌కు అవసరమైన టెంట్, ఎయిర్ బెడ్స్, ఫుడ్ ఇంకా అవసరమైనవన్నీ కొనుక్కొచ్చారు.

క్యాంపింగ్ ఎక్కడికి వెళ్లాలి అని చాలా రిసెర్చి చేసి చివరికి సదరన్ హై ల్యాండ్స్ లోని మోర్టాన్ నేషనల్ పార్క్‌లో ఉన్న గ్యాంబెల్స్ రెస్ట్ క్యాంపింగ్ ఏరియా ఎంపిక అయింది.

టాయ్లెట్, స్నానపు గదులు, వేడి నీళ్లు, బార్బీక్యూ, మంచి నీళ్ల వసతి ఉందో లేదో చూసి ఈ సైట్ ఎంపిక చేసారు.

న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని ఏ నేషనల్ పార్క్‌లో క్యాంపింగ్ చేయాలన్నా ముందే బుక్ చేసుకోవాలి. రిజర్వ్ చేసుకోకపోతే ఆ ప్రాంతానికి వెళ్లలేం. అక్కడ ఉండలేం కాబట్టి ముందుగానే రిజర్వ్ చేయించారు. వారాంతంలో అసలు ఖాళీలు లేవు. అన్నీ బుక్ అయిపోయాయి. అందుకే వారం మధ్యలో బుధవారం రోజు ప్రయాణం పెట్టుకున్నాం.

మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎప్పుడైనా క్యాంపింగ్ సైట్‌కి చేరుకోవచ్చు. ఉదయం పదిగంటలకు ఖాళీ చేయాలి మన బుకింగ్‌ని బట్టి.

సిడ్నీకి దక్షిణాన ఉన్న గ్యాంబెల్ రెస్ట్‌కి మా ప్రయాణం అక్టోబర్ 31, 2018 న ప్రారంభమైంది.

ఇంటి నుంచి బయలుదేరి వెళ్తూ దారిలో ఉన్న మించిన్బరి క్యాంపింగ్ స్టోర్‌లో ఇంకా కావలసినవి కొనుక్కొచ్చారు సాధన, రాజేష్.

మార్గ మధ్యంలో ఆస్ట్రేలియన్ బొటనికల్ గార్డెన్స్‌లో ఆగి కొంత సమయం గడిపాం.

కారు దిగి నడిచాం. పచ్చని తివాచీ పరిచినట్లున్న పచ్చని లాన్స్ కళ్ళకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ.. మనస్సుకి ఉత్సాహపు ఇంధనం నింపుతూ ఉన్నాయి..

కొద్దిసేపటి క్రితమే ట్రిమ్ అయిన ఆ లాన్స్ నుండి వచ్చే కమ్మటి వాసనలు గుండె నిండుగా పీల్చుకుంటూ, వాటిని ఆస్వాదిస్తూ దగ్గరలో ఉన్న చిన్న లేక్ దగ్గరకు చేరాం.

మాకు కొంత ఆవలగా ఓ కుటుంబం. ఆవిడ పిల్లలతో ఉంటే అతను హాయిగా గురక పెడుతూ.. అచ్చం టిపికల్ ఇండియన్ కుటుంబంలా.. కానీ వాళ్ళది ఇండియన్ కుటుంబం కాదని వారి రూపురేఖలు చెప్తున్నాయి

ఆ సరస్సు పక్కన ఉన్న బెంచెస్ పైకి చేరామో లేదో మా చిట్టి తల్లి సౌరవి లేక్ లోని నీళ్ళని, ఆ నీళ్లలో ఈదుతున్న బాతులను చూసి చాలా ఎక్సయిట్ అయింది. గబగబా అటుకేసి క్వాక్ క్వాక్ అంటూ పరుగులు..

బాతులు నీళ్లలో ఈదుతుంటే దానికెంతో ఆనందం. తాను ఆ నీళ్లలోకి వెళ్లి అట్లా ఈదాలన్న ఉబలాటం రెండేళ్ల సౌరవికి. వాటిని వన్ టు త్రీ అని పది వరకూ లెక్క పెడుతూ, వాటికి రైమ్స్ చెబుతూ కొద్దిగా పులిహోర, పెరుగన్నం తింది. ఎంత సేపూ తన తిండి కంటే ఆ బాతుల తిండి పైనే ధ్యాస.. అవి నీళ్లలోకి ముక్కు తల పెట్టి లేపినప్పుడల్లా వాటిని అబ్బురంగా చూసేది. ఒక్కో సారి యాక్కి యాక్కి.. అనేది. కారణం తాను నీళ్ళలోకి వెళ్తామంటే మేం ఆ నీళ్లు యాక్కి బాగోలేదు అని చెప్పాం కదా.. అందుకని.

అంతలో ఎనిమిదేళ్ల లోపు ఆడపిల్లలిద్దరూ తలకు హెల్మెట్‌తో చిన్న సైకిల్ తొక్కుతూ మా వెనక వైపు నుండి సాగిపోతుంటే కళ్లప్పగించి చూస్తూ సౌరవి.

నీడ పడుతున్న చోట రెండు చెక్కల్ని బెంచి లాగా దిగేసిన బల్లపై 70 పై బడిన ఆవిడ వచ్చి కూర్చుంది. బ్యాగ్ లోంచి, నోట్ బుక్ కలర్స్ తీసి టేబుల్‌లా ఉన్న చెక్కలపై పెట్టింది. ఆవిడ లోకంలో ఆవిడ ఏదో గీసుకుంటూ.. లీనమై పోయింది.

ఇద్దరు మహిళలు ప్రాంలో చంటి పిల్లలతో వచ్చి వాళ్లకు పాలు పట్టి కాసేపు అటూ ఇటూ తిప్పి వెళ్ళిపోయారు.

అలా కాసేపు అక్కడ ఆ నీటి కుంట దగ్గర గడిపాము. చుట్టూ ఉన్న పచ్చిక దిబ్బలమీద నుండి కొండలమీద నుండి జారే ప్రతి నీటి బొట్టూ ఆ చిన్న చెరువు లేదా కుంటలో చేరిపోతాయి.

ఎటు చూసినా పచ్చని తివాచీ పరచినట్లుగా.. 416 హెక్టార్లలో.. సౌత్ వెస్టర్న్ సబర్బ్ మౌంట్ అన్నన్‌లో ఉంది ఆ పార్క్.

ఆ ఎత్తుపల్లాల పచ్చదనంతో రకరకాల షేడ్స్.. మంచి పిక్నిక్ స్పాట్. బైక్, సైకిల్, నడచి ఎలాగైనా పార్క్ అంతా కలియ తిరగొచ్చు.

bbq చేసుకోవాలనుకునే వాళ్లకు ఆ సదుపాయాలు, కిచెన్అక్కడ ఉన్న షెడ్స్ అంతా ఉచితమే. చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. చిల్డ్రన్ ప్లే ఏరియా, కేఫ్, చిన్న చిన్న జలపాతాలు, కళ్ళను కదల్చ నీయకుండా..

కొంతమంది టీనేజ్ పిల్లలు ఫోటోలు తీసుకుంటూ.. సెల్ఫీల బిజీలో..

మామ్మలు.. బామ్మలూ.. తాతలు.. ఎక్కువగా ప్రశాంతమైన వాతావరణంలో సేద తిడుతూ.. ఉల్లాసంగా కబుర్లాడుతూ..

పచ్చని తివాచీ పై పడుకుని.. నీలా కాశాన్ని, కనిపించే కొండల్ని, ఎగిరే పక్షుల్ని చూస్తూ.. ధ్యానంలోకి వెళ్లిపోయిన యువకుడూ..

ఎంతమంది ఉన్నా ప్రశాంతంగా.. సేదతీరే పెద్దలు..

బల్లపై కూర్చొని చదవడంలో నిమగ్నమైన మరో యువకుడు..

ఆటలు ఆడుకుంటున్న టీనేజ్ పిల్లలూ.. ఎవరి లోకంలో వాళ్ళు.

అక్కడే, ఇంటి నుండి తెచ్చుకున్న పులిహోర, దద్దోజనం భోజనం కానిచ్చుకున్నాం.

రకరకాల మొక్కలు, పూలు రారమ్మని పిలుస్తుంటే ఆ అందాల విందు ఆరగించడానికి నెమ్మదిగా అటువైపు కదిలాం.

ఆ పార్క్ లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్ని రకాల మొక్కలకి వాటి స్థానిక పేర్లు, శాస్త్రీయ నామం చెబుతూ టాగ్స్ వేలాడుతున్నాయి. బోటనీ విద్యార్థులకు, బోటనీ పరిశోధక విద్యార్థులకు ఎంతో విలువైన అరుదైన మొక్కలు లభిస్తాయి.

ఆ ఆవరణలోనే ఉన్న ఆడిటోరియం హాల్‌లో ఒక రీసెర్చ్ మీట్ జరుగుతున్నది. ఆడిటోరియం హాల్ బయటకు ఉన్న వరండాలో రకరకాల పోస్టర్స్, పాంప్లెట్స్, బుక్స్ మొక్కలకు సంబంధించిన విషయాలతో..

పార్కులో రోడ్లన్నీ వీల్ చైర్, స్ట్రోలర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఎవరైనా హాయిగా అంతా తిరిగి రావచ్చు. అవి నాకెంతో నచ్చాయి. మన దగ్గర కూడా ఇలాంటి సౌకర్యవంతమైన దారులు ఉంటే బాగుంటుంది కదా.. వివిధ కారణాల వల్ల నడవలేని శరీరాన్ని ముందుకు కదల్చలేక కొందరు చాలా కోల్పోతున్నారని బాధ కలిగింది. మనసుకు ఆస్వాదించే గుణం ఉంటుంది కదా.. దాన్ని వాళ్ళు ఎందుకు కోల్పోవాలి? ఇటువంటి పాత్ లలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా మూడు చక్రాల కుర్చీలతో తిరగొచ్చు. ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

స్టోలెన్ జెనెరేషన్స్ వాక్ చుమ్బర్లాండ్ అడవిలోని నిలువెత్తు చెట్ల మధ్యనుంచి అడవిలోకి ఉందట. స్టోలెన్ జనరేషన్స్ వాక్ బోర్డు చూడగానే స్థానిక గిరిజన తెగలు వాళ్ళ పిల్లలకు దూరమైన విషాదం గుర్తొచ్చి చివుక్కుమంది.

అక్కడి నుండి బుందనూన్ అనే చిన్న పట్టణ సమీపంలోని గ్యాంబెల్ రెస్ట్ క్యాంపింగ్ ఏరియాకి మా ప్రయాణం మొదలయింది.

సిడ్నీ నగరం దాటి హైవే ఎక్కాం.

దారి పొడవునా పరుచుకున్న పచ్చదనం. కొన్ని చోట్ల కుప్పలు పోసినట్లుగా.. మరికొన్ని చోట్ల చికికనైపోతూ.. కొన్ని చోట్ల చితికిపోతూ

నింగికేసి ఎదిగిన చెట్ల మధ్య నుంచి పైన నీలాకాశం కింద నల్లగా నిగనిగలాడే నునుపైన విశాలమైన రోడ్డు పై సాగిపోతూ.. అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాల్ని దాటిపోతూ…

పిల్లలిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. రాజేష్ కబుర్లు. సాధన డ్రైవింగ్.

మధ్యలో టీ బ్రేక్. బుందనూన్ చేరేసరికి 5,30 దాటిపొయింది.

చాలా చిన్న గ్రామం, బుందనూన్ అంటే అబోరిజినల్ భాషలో “ప్లేస్ ఆఫ్ డీప్ గుల్లీస్ Place of deep gullies” అట. అంతకుముందు జోర్డాన్ క్రాసింగ్ అనేవారట. మొత్తం జనాభా 2500 వరకూ ఉంటుందట. అవడానికి చిన్న గ్రామమే కానీ సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నట్లు తెలుస్తున్నాయి. పోస్టాఫీసు, బ్యాంకు, పబ్, హోటల్స్.. స్కూల్స్, మెడికల్ సెంటర్..

రోడ్లు బాగున్నాయి. ఇళ్లు సిడ్నీలో ఉన్నట్లుగానే పెద్ద పెద్ద కాంపౌండ్‌లో పెంకుటిళ్లు.. ఇంటి ముందు లాన్ మూవర్‌తో గడ్డి కత్తిరిస్తూనో, మొక్కలు ట్రిమ్ చేస్తూనో, వాటికి నీళ్లు పడుతూనో, పెంపుడు కుక్కలను వ్యాహ్యాళికి తీసుకుపోతూనో పెద్దలు ఎక్కువగా స్త్రీలు కనిపించారు.

అవి చూస్తుంటే ఒకప్పుడు మన గ్రామాల్లో ఉండే ఇళ్లు, ఇంటి ముందు పనిచేసుకునే మనవాళ్ళు కళ్ళ ముందుకు వచ్చాయి.

టూరిస్ట్‌ల కోసం వే టు యూత్ హాస్టల్స్, కాటేజ్‌లు, గెస్ట్ హౌస్ అంటూ బోర్డులు కూడా దారిలో కనిపించాయి.

మేం ముందుగా నిర్ణయించుకున్నట్లుగా క్యాంపింగ్ గ్రౌండ్‌కి వెళ్లిపోయాం. గ్రామానికి క్యాంపింగ్ సైట్ మధ్య 20 నిముషాల నడక లేదా నాలుగైదు నిమిషాల కార్ డ్రైవ్.

అడ్వాన్స్‌గా క్యాంపింగ్ సైట్ బుక్ చేసుకోవడం వల్ల ఏ ఇబ్బందీ లేకుండా సైట్ కి వెళ్లిపోయాం. లేదంటే ఊళ్ళో ఉన్న పోస్ట్ ఆఫీసు దగ్గర క్యాంపింగ్ సైట్ కి డబ్బులు చెల్లించాలి. వెహికల్ పార్కింగ్ కి వేరుగా రోజుకి $8 చెల్లించాలని ముందే తెలిసి ఉండడంతో డబ్బులు చెల్లించడం కోసం చూస్తే అక్కడ ఎవరూ లేరు. మెషిన్ ఉంది. కార్డు స్వాప్ చేసి డబ్బులు చెల్లించడానికి ప్రయత్నిస్తే అది పని చేయలేదు. ఆ అడవిలో కొద్దిగా ముందుకెళ్లామో లేదో కంగారూల గుంపు స్వాగతం పలుకుతూ మా వాహనం ముందు నుండీ దాటుకుంటూ మరో వైపుకి పరుగులు తీశాయి. వాటినలా చూస్తుంటే ఎక్కడలేని ఉత్సాహం నాలో. కారు దిగి వాటి ఫోటోలు తీసుకోవాలనిపించింది. దిగేసరికి అవి బెదురుతూ దూరంగా వెళ్లిపోయాయి.

ఆగి ఉన్న కార్వాన్ దగ్గర చెట్టు నీడకు కుర్చీ వేసుకుని పుస్తకం చదువుకుంటున్న వృద్ధ మహిళ కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి క్యాంపింగ్ సైట్ ఆఫీస్ గురించి ఆరా తీసాం. తానూ విజిటర్ నేనని, తనకు తెలియదని చెప్పింది.

మేం వెళ్లేసరికి పార్కింగ్ ఏరియాలో మూడు వెహికల్స్ ఉన్నాయి. పక్కనే పిక్నిక్‌కి వచ్చే వారి కోసం పార్క్. అక్కడ నుండి అడవిని చీల్చుకుంటూ రెండు మూడు దారులు కనిపించాయి. బహుశా అవి చుట్టుపక్కల ఉన్న ఫెయిరీ బోవర్ వాటర్ ఫాల్స్, వాకింగ్ ట్రైల్స్, ట్రెక్కింగ్, సన్ రైజ్ పాయింట్ లకు వెళ్లే దారులు కావచ్చు.. వాటి సంగతి రేపు చూద్దాం అనుకున్నాం.

వాహనంకి పార్కింగ్ డబ్బులు చెల్లించకుండానే క్యాంపింగ్ సైట్‌లో మా వాహనం పార్క్ చేసుకున్నాం. ఉన్న 10 క్యాంపింగ్ సైట్స్‌లో అన్నీ ఖాళీగా కనిపించాయి.

కాస్త ఎక్కువ చదునుగా, రాళ్ళూ రప్పలూ తక్కువగా ఉన్న ప్లేస్ ఎంపిక చేసుకున్నాం.

రెండు మీటర్లు వెనక్కి వెళితే దట్టమైన అడవితో కూడిన లోయ.

ఎర్రని రామ చిలక మేం కారు ఆపుకున్న ప్రదేశానికి 20 అడుగుల దూరంలో పచ్చని గడ్డి పైన తినడానికి ఏదో వెతుకుకుంటూ.. దాన్ని ఫోటో తీస్తుంటే..

“అమ్మా.. ఈ రెండు రోజులూ మనం వాటితోనే ఉండేది. ముందు టెంట్ వేసుకుందాం. చీకటి పడితే కష్టం కదా” అని నా బిడ్డ అనడంతో ఆ పనిలో పడ్డాం.

అప్పటికే రాజేష్ కారులోంచి టెంటు వేయడానికి కావాల్సిన సామాగ్రి తీస్తూ.. తెచ్చుకున్న టెంట్ ఎలా వేయాలో చూసుకుంటూ..

రాజేష్ వేస్తుంటే నేనూ సాధన సహాయం చేసాం.

సౌరవికి అంతా వింతగా.. పెద్దల పనికి అడ్డు తగులుతూ టెంటు లోపలికి బయటికి తిరుగుతూ.. సుచిర్ కారులోనే తన సీటులో..

100 అడుగుల దూరం లోపే ఎలక్ట్రిక్ bbq కోసం షెడ్. కరెంట్, మంచి నీటి సదుపాయంతో. డైనింగ్ టేబుల్స్

మరో వైపు టాయిలెట్ సౌకర్యం. వేడి నీటితో స్నానపు గదులు. క్యాంపుకు వచ్చిన వాళ్ళు తప్ప మరొకళ్ళు వాడి పాడు చెయ్యకుండా వాటికి డిజిటల్ లాకింగ్ సిస్టం. క్యాంపింగ్ కోసం మనం డబ్బులు కట్టి రిజర్వ్ చేసుకుంటే మన మొబైల్ కి ఒక డిజిటల్ అన్‌లాకింగ్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ తెలియకపోతే మనం టాయిలెట్స్ ఉపయోగించలేం. లోపలికి వెళ్ళగానే లాక్ అయిపోతుంది.

ఆడవాళ్ళకి మగవాళ్ళకి ప్రత్యేకంగా మూడు మూడు టాయిలెట్స్, వేడి నీటి వసతితో స్నానపు గదులు ఉన్నాయి.

పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి మాకు కావలసిన వసతులు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నాం. లేదంటే ఒక్క పైసా కట్టకుండా ఫ్రీ క్యాంపింగ్ సైట్స్‌లో ఉండొచ్చు. అక్కడ టాయిలెట్‌కి వెళ్లాలంటే అడవి లోపల కొంత దూరం పోయాక 15 ఇంచుల గుంత తవ్వి మన పని అయిపోయిన తర్వాత ఆ గుంత పూడ్చి రావాలంట. మనకి అవసరమైన నీళ్లు మనం మోసుకెళ్ళాలి. అట్లాగే bbq కి అవసరమైన గ్యాస్, లేదా ఎలక్ట్రిక్ కుంపట్లు మనమే తెచ్చుకోవాలి.

బొగ్గు కట్టెలు కాల్చ కూడదు. వారి అడవిని ప్రకృతిని కాపాడుకోవడంలో భాగంగా వాటిని అనుమతించడం లేదట. మన పని అయిపోయిన తర్వాత పొరపాటున చిన్న నిప్పురవ్వ వదిలినా ఆ ప్రకృతి అందాలను దావానలంలా చుట్టు ముట్టి మట్టు పెడుతుందని.. అందుకే క్యాంప్ ఫైర్ కూడా అనుమతించరు చాలా చోట్ల. మనం వాడి పడేసే చెత్తా చెదారం మూటగట్టి తెచ్చి డస్ట్ బిన్స్ ఉన్న దగ్గర పడెయ్యాలి కానీ ఆ చుట్టు పట్ల ఎక్కడా ఒక్క డస్ట్ బిన్ కూడా కనిపించలేదు.

క్యాంపింగ్ కోసం వసతి ఏర్పాట్లు పూర్తి అయ్యేసరికి 7 దాటిపోయింది. మసక చీకట్లు పరుచుకుంటున్నాయి. మా ఏర్పాట్లలో మేం ఉండగా మా గుడారం ముందు నుండి ఒక వెహికల్ వెళ్లి 8 నంబర్ క్యాంపు సైట్‌లో ఆగింది. కానీ, వాహనంలో నుండి ఎవరు దిగలేదు. అక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లు ఏమీ జరగలేదు. బహుశా ఇంకా ఎవరికోసమైనా ఎదురు చేస్తున్నారేమో..

మేం ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర, పెరుగన్నం ఉన్నాయి. మ్యారినేట్ చేసి తెచ్చుకున్న చికెన్, పళ్ళు ఉన్నాయి. పులిహోర పెరుగన్నానికి తోడుగా వేడివేడి bbq చికెన్… అడవిలో.. ఆ చల్లటి చలిలో.. ఓహ్.. ఆ టేస్ట్ వేరయా..

రాత్రిపూట గ్లో వార్మ్ గ్లెన్ కి వెళ్తే వాటి మెరుపులు చూడ్డానికి చాలా మంది వస్తారట. డిసెంబర్ నుండి కటిక చీకటిలో గుంపులు గుంపులుగా కనబడే మిణుగురులు చూడ్డం ఓ అద్భుతమైన దృశ్యమట. అక్కడ గోడ మీద రాసి ఉంది.

కాంపింగ్ సైట్ నుండి ఎక్కడెక్కడికి వెళ్ళవచ్చు, ఎలా వెళ్ళవచ్చు, ఎంత దూరంలో ఉన్నాయో తెలుపుతూ రూట్ మ్యాప్ పెయింట్ చేసి ఉంది. అదే విధంగా ఆ అడవి జంతువులతో ఎటువంటి భయం ఉండదని తెలిపే బోర్డులు అక్కడక్కడా ఉన్నాయి. చీకటిలో టార్చ్ లైట్ దగ్గర ఉంచుకోమని సలహాలు, సూచనల బోర్డులు కనిపించాయి మాకు. మా దగ్గరున్న టార్చ్ వెలుతురులో, 9.30 లోపే అందరం టెంట్‌లో చేరాం.

దూరంగా వెలుగుతున్న ఫ్లడ్ లైట్ వెలుతురు, గాలి కోసం తీసి ఉంచిన టెంట్ మెష్ కంతల్లోంచి లోపలి పడుతోంది. తెచ్చుకున్న సోలార్ లాంప్ వెలుతురులో పరుచుకున్న ఎయిర్ బెడ్స్ పై నడుం వాల్చాము. స్లీపింగ్ బాగ్స్‌లో దూరి పోయాం. ఆ టెంట్ లోంచి చిక్కని ఆకాశంలో మిల మిల మెరిసే తారకలతో ముచ్చటలాడాలన్న కోరికని మేఘం చుట్టేసింది.

కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టడం లేదు. దూరంగా అంటే ఒకటిన్నర కిమీ దూరంలో ఉన్న బుందానూన్ రైల్వే స్టేషన్‌లో రైలు కేక. చప్పుళ్ళు..,

మధ్య మధ్యలో లోయ నించో.. మా చుట్టూ దట్టంగా అల్లుకు పోయిన అడవి లోంచో అప్పుడప్పుడూ విన వచ్చే పక్షుల వింత ముచ్చట్లు.. లేకపోతే చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం.

ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ అప్పుడప్పుడూ గాలిపాడుతున్న ఈల పాటలూ.. ఎండుటాకుల సవ్వడులూ.. వింటూ కదులుతున్న నన్ను సాధన చూసింది.

“అమ్మా.. నిద్ర పట్టడం లేదా.. భయం ఏమీ ఉండదు.” అంటూ ధైర్య వచనాలు మొదలు పెట్టింది.

ఎనిమిదో సైట్‌లో అబ్బాయి ఒక్కడే ఉన్నట్లున్నాడు. bbq దగ్గరకు కూడా రాలేదు. వియర్డ్‌గా లేదూ.. అని bbq షెడ్లోంచి వస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయేమో.. బహుశా అందుకే అడిగి ఉంటుంది.

“ఆ.. నాకెందుకు భయం.. కొత్త చోటు కదా.. అంతే.. నువ్వు పడుకో” అన్నాను. కానీ నిద్ర పట్టదే.. ఏవేవో ఆలోచనలు..

ఎప్పటికో గానీ నిద్రపట్టలేదు. మంచి నిద్రలో ఉండగా మా టెంటును ఏదో తాకిన శబ్దం. కొన్ని సెకన్లలోనే మళ్ళీ అదే శబ్దం..

ఒక్క సారిగా అరిచేశా.. ‘ఎవరూ.. ఎవరూ..’ అని.

రాజేష్ సాధన ఇద్దరూ లేచేశారు. వాళ్ళకీ ఆ శబ్దం వినపడింది.

“ఏం లేదులే.. అడవి జంతువులేవో మన టెంటును తాకుతూ వెళ్లినట్లున్నాయి” అన్నాను. కంగారూలు పరుగులు పెట్టడం చూసి ఉండటంతో. అంతలో టార్చి వెలుతురులా అగుపిస్తూ..

“ఎవరో.. మనుషులే.. టార్చ్ వెలుతురు చూడండి” అనడంతో రాజేష్ లేచి బయటకు నడవబోయాడు. ఎవరో ఏమిటో తెలియదు ఆగమనడంతో ఆగి టెంట్ కంత లోంచి చూశాడు.

“కుడి పక్క సైట్లో వాహనం ఆగి ఉంది. ఎవరో వచ్చినట్లున్నారు. పడుకోండి” అన్నాడు.

పడుకున్నా.. అంతలో “అమ్మా.. నువ్వెక్కడ ఉన్నావో మర్చిపోయావా.. ఎవరు అంటే ఎవరు పలుకుతారమ్మా..” నవ్వేసింది సాధన. రాజేష్ ఆ నవ్వుకు జత కలిశాడు.

స్థల కాలాలు మరచి మనకు తెలియకుండానే మనం మన మాతృభాషలోనే వ్యక్తం చేస్తామేమో.. మనిషి ఎక్కడున్నా ఇంతేనా.. ? ఏమో. అని నేనూ నవ్వుకున్నాను.

కానీ నిద్ర పడితేనా..

వచ్చిన వాళ్ళు టెంట్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు చప్పుళ్ళు.. ఆ తర్వాత మరో వాహనం వచ్చి ఆగింది అక్కడే.. అంతా కలసి వండుకుని తింటున్నట్లు అప్పుడప్పుడూ వచ్చే వాసనలు చెప్పాయి.. సమయం దాదాపు రెండు గంటలు.. ఈ సమయంలో తిండి.. అని నవ్వుకుని మళ్ళీ నిద్ర కోసం ప్రయత్నిస్తూ.. ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను.

4.30 అయేసరికి వేకువ రాగం ఆలాపనలు.. మసక వీడుతున్న చారికలు చెట్ల సందుల్లోంచి.. మా వాళ్లంతా మంచి నిద్రలో.

నెమ్మదిగా లేచి టెంట్ బయటకు వచ్చాను.

మాకు కుడి వైపున ఉన్న సైట్‌లో దిగిన వాళ్ళు క్యాంపింగ్ చైర్స్.. కొంత సామాను కారుల్లోంచి దించి కింద పెట్టి.. చాప పరిచి కనిపించాయి. బహుశా ఆ చాప మీద పడుకుందామనుకుని చీమలు, దోమలకు భయపడి వెహికల్ లోనే పడుకున్నారేమో అనుకుంటూ ముందుకు నాలుగడుగులు వేశా..

అడవి మల్లెల పరిమళం..

మా టెంటుకు కొద్దిగా ముందుకు వేసిన దుంగలపై కూర్చొని కొంచెం సేపు ప్రాణాయామం చేసుకున్నా.. చుట్టూ చెట్లపై నుండి సందడి చేస్తున్న పక్షులు నన్ను డిస్ట్రబ్ చేస్తూనే ఉన్నాయి. అంతలో కార్ ఒకటి అడవిలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత మరో రెండు. బహుశా సన్ రైజింగ్ పాయింట్‌కు పోతున్నారేమో..

మబ్బులు అల్లుకుపోయి ఉండడం వల్ల అంత దూరం వెళ్లడంలో అర్థం లేదనిపించింది. ఊరి దిశగా వాకింగ్ మొదలు పెట్టా..

ఎడమవైపు అంతా దట్టమైన అడవి. కుడివైపు పొలాలు. పొలాలు అంటే పంటలేమీ లేవు కానీ ప్రవేటు భూములన్నమాట. చుట్టూ ఇనుప కంచెతో.. వాటి మధ్యలో గుర్రాలు, కుందేళ్లు, కంగారూలు.. ఇంకా ఏవో దూరంగా కనిపిస్తూ..

వాటిని కాసేపు ఎంజాయ్ చేసి వచ్చేసరికి 7 అయింది. రాజేష్, సౌరవి లేచారు ముగ్గురం మళ్లీ వాకింగ్ మరో దారిలో అడవిలోకి.. అప్పటికి కొందరు వాకింగ్ ముగించుకుని వెనుదిరుగుతున్నారు..

అలా అలా దాదాపు రెండు కిలోమీటర్లు లోయకేసి సాగుతూ నడిచాం. మార్గ మధ్యలో ఎరిత్ బొగ్గు గనికి దారి కనిపించింది. గని ఎప్పుడో మూతబడింది. ఏటవాలుగా లోయ వైపుగా దిగాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు విజిటర్స్‌ని అనుమతించడం లేదని బోర్డు చెప్పింది. దాని దగ్గరలోనే ఉన్న ఫెయిరీ బోవర్ వాటర్ ఫాల్స్‌కి వెళ్లే దారి కొండవాలున ఏటవాలుగా నాచుపట్టి ఉండడం వల్ల దారి మూసేసారట. బహుశా డిసెంబర్ నుండి వేసవి మొదలవుతుంది కాబట్టి అప్పుడు తెరుస్తారేమో..?!

మోర్టాన్ నేషనల్ పార్క్ లోని గ్యాంబెల్స్ రెస్ట్ క్యాంపింగ్ ఏరియా నుంచి ఎగుడు దిగుడుల ఆ దారిలో మా నడక.

మేఘం నెమ్మ నెమ్మదిగా పక్కకు తొలుగుతూ సూర్య కిరణాలకి దారి ఇస్తూ.. బంగారువన్నె కిరణాలు చెట్ల ఆకుల సందుల్లోంచి తొంగి చూస్తూ.. 10 డిగ్రీల చలి నుంచి కాచుకొమ్మంటూ.. మమ్మల్ని వెచ్చగా చేసే ప్రయత్నం చేస్తూ..

దారిలో వాకింగ్ చేసి వస్తూ మాతో పాటే ఉన్న సౌరవిని పలకరిస్తూ.. మాకు విష్ చేసి పలకరించి సాగిపోయే స్థానికుల స్నేహ పూర్వక పలకరింపులు..

వాతావరణం మబ్బు పట్టిలేకపోతే చలి మరింత ఎక్కువగా ఉండేదట.

మేం వెళ్లేసరికి సాధన సుచిర్ లేచేశారు.

త్వర త్వరగా పనులు ముగించుకుని తదుపరి ప్రయాణానికి సిద్ధమయ్యాం. నిజానికి ఆ ఉదయం బందనూన్ గ్రామంలోకి వెళ్లి ఫ్రెష్ బ్రెడ్ తెచ్చుకోవాలన్న ఆలోచన మానుకున్నాం. రాత్రి మిగిలిన చికెన్ bbq చేసుకుని పెరుగన్నంతో తినేశాం. లేకపోతే అవి పాడయిపోతాయి కదా.

ఇక మా దగ్గర పండ్లు, బిస్కెట్లు లాంటివి ఎలాగూ ఉన్నాయి.

సాయంకాలం వచ్చేటప్పుడు రాత్రి భోజనానికి కావాల్సినవి తెచ్చుకోవచ్చని అనుకున్నాం. టెంట్ అలా ఉంచి వెళ్లడం క్షేమం కాదేమోనని ఎయిర్ బెడ్స్ గాలి తీసేసి మడతలు పెట్టుకున్నాం. టెంట్ తీసి కారులో సర్ధేశాము.

మేమున్న ప్రదేశాన్నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా కొద్ది దూరం కారులో వెళ్లి మిగతా అంతా కనిపించే దారుల్లో నడక, ట్రెక్ చేయాల్సిందే.. పిల్లల్తో కష్టం. స్ట్రోలర్‌తో వెళ్లే అవకాశం లేదు. అందుకు ఆ ప్రయత్నం మానుకున్నాం. దాదాపు 80 కి మీ దూరంలో ఉన్న ఇల్వారా కియామా వైపు ట్రీ టాప్ వాక్ కి బయలు దేరాం.

దారిపొడవునా అద్భుతమైన సౌందర్యం. కళ్ళు మూసుకుంటే ఆ మనోహర దృశ్యాలు ఎక్కడ మాయమవుతాయోనన్న బెంగతో కళ్లప్పగించి చూస్తూ ముందుకు సాగిపోయాం. ఎన్ని కొండలు, ఎన్ని లోయలు మరెన్ని పచ్చిక బయళ్లు దాటిపోయామో..

పచ్చని పచ్చిక బయళ్లపై మేసే ఆవులు, గుర్రాలు, అక్కడక్కడ గొర్రెలు.. పొలాల సరిహద్దుల్లో ఏపుగా పెరిగిన పైన్ వృక్షాలూ..

అక్కడక్కడా యూకలిఫ్టస్ చెట్లూ..

పచ్చ గడ్డిని కత్తిరించి బేళ్ళుగా బేళ్ళుగా.. బహుశా వచ్చే వేసవిలో ఆ గడ్డి వాడుకుంటారేమో.. అంతకు మించి పంటలు కనిపించలేదు.

వెళ్ళబోతున్న ట్రీ టాప్ వాక్ గురించి ఆలోచిస్తూ, అక్కడ చూడబోయే అద్భుత ప్రకృతిని ఊహించడానికి ప్రయత్నిస్తూ ముందుకు సాగిపోయాం.

వి. శాంతి ప్రబోధ


వి. శాంతి ప్రబోధ గారు పుట్టింది పెరిగింది ఉత్తర తెలంగాణా జిల్లాల్లో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.

తరతరాల దురాచారంపై జోగిని (నవల), అమర్ సాహసయాత్ర (బాలల నవల), కాంపింగ్ (బాలల బొమ్మల కథ), గడ్డిపువ్వు గుండె సందుక, ఆలోచనలో.. ఆమె (కథా సంకలనాలు) ప్రచురణ. బతుకుసేద్యం, నిష్కల, నీలాకాశంలో నిధి(బాలల నవల), కథలు, కవితలు త్వరలో ప్రచురణకు సిద్ధమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here