[dropcap]ఈ[/dropcap] వాన కెందుకీ హంగామా
మబ్బు కరిగి కురిసేదేదో కురియక
కురిసి మురిసేదేదో మురియక
వాన కెందుకీ గడబిడ
దడ దడమని రాలి
గుండెనో గుడిసెనో తడిపి ముంచేయక
మబ్బుల తీరాల్లోంచి
జారుడు బండ మీంచి జారినట్టు జారి
చినుకులు నేలను చేరొచ్చు కదా
మరెందుకు
చీకట్లో మెరుపులు
గుబులు పుట్టించే ఉరుములు
ఊపిరి బద్దలయ్యే పిడుగులు
ఎంత హంగామా ఎంత షోర్
చినుకులు కురవడానికి
నేల తడవడానికే ఇంత పెనుగులాటయితే
మరి
కన్నీళ్లు కురవడానికి
గుండెలు తడవడానికి
మరెంత ఘర్షణ…