ప్రయాణం

0
3

[dropcap]‘దే[/dropcap]వాలయాల కంటే, హాస్పిటల్ గోడలు ఎక్కువ ప్రార్థనలని విని వుంటాయి.’ (రూమీ)

~

ఆయన తన తండ్రి. ప్రశాంతంగా తెల్లటి దుప్పట్ల మధ్య, చిక్కిపోయిన ఆయన శరీరం, కదలకుండా ఇమిడి విశ్రాంతిగా నిద్రపోతోంది.

ప్రశాంతంగా అంటే ఇప్పుడు ఇంత వరకు బాధగా మూలిగిన ఆయనకి ట్రామడాల్ హెలోపెరిడాల్ లాంటి శక్తివంతమైన నొప్పిని తగ్గించే మందులు ఇంజెక్షన్ ద్వారా ఇస్తేగాని ఈ మాత్రం నిద్ర రాలేదు.

ఇప్పుడు భరత్‌కి కూడా కొంచెం విశ్రాంతి దొరికింది. గదిలోని తెల్లని హాస్పిటల్ బల్ల మీద వుంచిన స్టీల్ ఫ్లాస్కు లోంచి కప్పులోకి వంచుకుని కొంచెం సిప్ చేశాడు.

వేడి కాఫీ! ఇది లేకపోతే ఉదయం తోచదు.

ఇప్పుడు మరీ అవసరం.

రాత్రంతా ఆయన అరుపులతో కేకలతో తనకి నిద్ర లేదు.

బాధ ఒక వైపు, నిద్రలేమితో అసలట మరో వైపు.

కానీ ఆయన తన తండ్రి.

ఎలా వచ్చిందో నోటి కేన్సర్! కీమో థెరపీ! రేడియేషన్! జరిగిపోతోంది.

దానితో నోరంతా పుండ్లు ఏర్పడి నొప్పి, రేడియేషన్ తర్వాత ఇంక ఎక్కువయింది.

ఎలా ఆయనకి రిలీఫ్ ఇచ్చేది? ఆయన బాధ చూడలేకపోతున్నాడు.

గుట్కా తినేవారు. సిగరెట్ తాగేవారు.

ఆయితే మాత్రం ఇంత బాధ పడాలని, కేన్సర్ రావాలని వుందా? కొందరికే ఈ శిక్ష ఎందుకు?

భరత్ కాఫీ… ముగించి లేచి నిలబడ్డాడు. కాసేపు నిద్రపోతే బావుండుననిపించింది. మళ్ళీ నిద్ర రాదు. ఒకటే ఆందోళన.

డాక్టర్‌తో చాలా చర్చలు జరిగాయి. కీమో థెరపీ నాలగు సైకిల్స్ అయ్యాయి.

తాను స్వయంగా డాక్టరు. కానీ చికిత్స అంతా కేన్సర్ నిపుణుడి పర్యవేక్షణలోనే వుంచాడు.

“డాక్టర్! ఇంకో చికిత్స లేదా? ఇక ఏం ఆశ లేదా?”

చాలా సేపు కేన్సర్ స్పెషలిస్ట్ చెప్పేవాడు “కేన్సర్ చికిత్సలో అద్భుతమైన మార్పులు, కొత్త కొత్త ఔషధాలు వస్తున్నాయి. కాన్సర్ చికిత్సలో రేడియేషన్ అంటే ‘ఎక్స్‌రే’ల ద్వారా ఆ కణితిని నిర్మూలించడం. శస్త్ర చికిత్స కాక, కేవలం కేన్సర్ కణాలనే నిర్మూలించి, మిగిలిన చుట్టుపక్కవి కణాలని, అవయవాలని, సురక్షితంగా వుంచే ఔషధాలు – వీటిని మోనో క్లోనల్ ఏంటీబాడీస్ అంటారు. వీటి పేర్ల చివర mab అనే పదంతో వీటిని గుర్తు పట్టవచ్చు. ఇవి ఎన్నో రకాలవి వున్నాయి. కొత్తవి త్వర త్వరగా ప్రతి నెలా కనిపెడుతూ వివిధ రకాల కేన్సర్‌లకి చికిత్సకి ఉపయోగిస్తున్నారు. ఇవి బాగా పని చేస్తున్నాయి. మీ నాన్నగారికి ఇవే ఇచ్చాం. కానీ అంత బాగా పని చేయడం లేదు.”

“ఇంకేలా మరి డాక్టర్?”

“నాకు తెలిసి మెడికల్ జర్నల్స్‌లో చదివిన ప్రకారం మరొక ఆరు నెలలలో ORAL VICTORYMAB అనే కొత్త మోనో క్లోనల్ ఏంటీ బాడీ వస్తోంది. దీనికి స్టేజ్ 4 నోటి కేన్సర్‌లో కూడా అద్భుతమైన అంటే 90 శాతం పూర్తిగా నయం అయ్యే ఛాన్స్ వుంది అని ఖచ్చితంగా చెబుతున్నారు.”

“మరి ఆలస్యం ఎందుకు. అది తెప్పించండి. విదేశాలలో ఎక్కడ దొరుకుందో. ఎంత ఖర్చయినా సరే. నేను భరిస్తాను డాక్టర్.”

“టైం పడుతుంది ఇంకా. ఆరు నెలలకి కానీ దానికి పర్మిషన్ రాదు. ఇప్పటికే మానవ రోగులలో పరీక్షలు 100 శాతం ఫలితాలు వున్నాయి. కాని దాన్ని పూర్తిగా ఔషద రూపంలో అంటే ఇంజక్షన్, మాత్రలు రూపంలో తయారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. దాని ఖరీదే ఒక డోస్‌కే రెండు లక్షలు అవుతుంది. కాని, ఇప్పుడు ఇంకా తయారుకాలేదు!”

“మరి నాన్నకి ఎలా?”

“అదే ట్రాజెడీ! ఆయన పరిస్థితికి ఒక వారం రోజుల కంటే గ్యారంటీ ఇవ్వలేను భరత్. ఐయామ్ సారీ!”

హైదరాబాద్, భారతదేశం. సుదూర భవిష్యత్తులో 2075లో ఒక రోజు… అది.

మానవాళి సైన్స్‌లో విపరీతమైన ప్రగతి సాధించింది. గ్రహాంతరయానాలు సమాచార వ్యవస్థ చాలా అభివృద్ధి చెందాయి. ప్రపంచ దేశాలతో కూడా చాలా మార్పు వచ్చింది. దేశాల పేర్లు మారాయి. ప్రవర్తన మారింది. కానీ ద్వేషాలు, స్వార్థాలు అధికార దాహాలు పోలేదు. ఒక గొప్ప విషయం. కొత్తగా ‘కాల ప్రయాణం’లో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కాలంలో ముందుకూ వెనుకకూ కూడా ప్రయాణించవచ్చు.కాలయంత్రాన్ని కనుగొన్నారు.

అయితే కాలయంత్రంలో కాల ప్రయాణం చేయడం కొంత ఇబ్బందికరమైన పని, అందువల్ల ప్రభుత్వాలు చాలా వరకు దానిని నియంత్రించాయి. కొన్ని దేశాలు దానిని గోప్యంగా వుంచాయి. ఇప్పుడు హైద్రాబాద్‌లో కూడా అక్కడక్కడ రహస్యంగా కాలప్రయాణం చేసే, చేయించగలగే కంపెనీలు వున్నాయి అని విన్నాడు భరత్.

హాస్పిటల్ కేంటిన్‌లో కూర్చుని “స్ట్రాంగ్ కాఫీ” అని మళ్లీ ఆర్డర్ ఇచ్చాడు.

ఒకటే దారి. అద్భుతమైన దారి.

పరష్కారం లేని సమస్య వుండదు. అందులో ఈ రోజు అద్భుతమైన సాంకేతిక ప్రగతి సాధించిన 2075వ సంవత్సరంలో ఒక రోజు. తేదీ చూశాడు JUNE 17.

ఒకటే మార్గం. నాన్నకి మందు తేవడానికి. భరత్ తన కంప్యూటర్ తెరచి, కాఫీ తాగుతూ, ఇప్పటికీ వున్న గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో వెదకసాగాడు.

“దగ్గరలోని టైం ట్రావెల్ ఏజెన్సీస్” అని టైప్ చేశాడు.

***

అది సైన్స్ వర్ధిల్లుతున్న కాలం. భవిష్యత్ 2075.

అయితే సమాజంలో ధనవంతులు, మధ్యతరగతి వారు పెరిగిపోయి, ఆయుష్ ప్రమాణాలు పెరిగి ఆరోగ్యం కోసం కొత్త మందులు, ఆదాయం కోసం కొత్త ఉద్యోగాలు, వృత్తులు, వినోదం కోసం కొత్త పరికరాలు ఏర్పడిన కాలం.

అదే సమయంలో సమాజంలో అతి పేదరికం, అత్యంత దారుణమైన దోపిడీ విధానం కూడా పెరిగిన కాలం.

ధనికులు – పేదవారి మధ్య అంతరం పెరిగి, మధ్య తరగతి వారొక వారధిగా నిలిచిన కాలం.

అతి పేదవారికి, పై వారి వూడిగం చేసి, తక్కువ ఆదాయంతో దుర్భరంగా బతకడం తప్ప దారి లేని కాలం.

వీరిని ఉద్ధరించడానికి రోబోలు, యంత్రాలు, ఇంకా ఎన్నో అవకాశం వచ్చినా వారి స్థితి మెరుగుపడలేదు.

రోబోలు ఇళ్లల్లో, కార్యాలయాల్లో పని చేయడం, ప్రమాదకరమైన, లేక అసహ్యకరమైన పారిశుద్ధ్య కార్మికుల్లా పని చేయడంతో, వారికి విముక్తి కలిగినా, ఉద్యోగాలు తగ్గిపోయాయి. అవకాశాలు తగ్గి యంత్రాలకి డిమాండ్ పెరగడంతో వారు మళ్ళీ దారిద్ర్య విషవలయంలోకి నెట్టబడుతున్నారు.

అదే సమయంలో, అద్భుతమైన సమాచార వ్యవస్థ, ప్రయాణ సాధనాలు, వినోదాలు, సేవలు లభ్యం అవుతున్నాయి.

పని చేసే రోబోలు, డ్రైవర్ లేని కార్లు, నిజంగా ఆ కథలో వున్నామా అనిపించే వర్చువల్ సినిమా థియేటర్లు, నానో పరికరాలు, నానో బాట్ల మందులతో చికిత్సలు, జీన్స్ పరీక్ష చేసి ఎంత కాలం ఎలా బతకగలమో చెప్పే టెక్నాలజీ ఇలా ఎన్నో…. వీటి మధ్య…

కొన్ని కాల ప్రయాణపు కంపెనీలు వెలిశాయి. ఇవి అన్నీ గవర్నమెంటు లైసెన్సు పొందినవే.

అలాంటి ఒక కాలప్రయాణపు ఏజన్సీ ముందు నిల్చున్నాడు భరత్.

‘టైం థ్రిల్స్’. భవిష్యత్తు, భూతకాలంలోకి ప్రయాణం అన్న షాపు. ప్రయాణం పర్యటన కోసమే! షరతులు వర్తిస్తాయి. డాక్టర్ సర్టిఫికెట్ అవసరం! ఆ బోర్డు కేసి చూసి లోపలికి ప్రవేశించాడు.

ఆఫీసు అంతా చిందర వందరగా, కంప్యూటర్లతో వైర్లతో తెరలతో నిండివుంది. వాటి మధ్యన ఒక శతాధిక వృద్ధుడిలా కనిపించే వ్యక్తి తెల్లటి మీసం గడ్డం, కొన్ని వేల ముడతలుగల ముఖంతో, పొడుగ్గా తెల్లని పైజామా లాల్చీ ధరించి కూర్చుని ఒక తెర కేసి చూస్తూన్నాడు.

“ఎక్స్యూజ్ మీ సార్! “

భరత్, ఎంత సేపు తన కేసి చూడని ఆయనని పలకరించాడు.

ఆయన గొంతు బొంగురుగా వణుకుతోంది.

“ఏం కావాలి?”

“నాకు భవిష్యత్ కాలంలో ఆరు నెలల తర్వాత ఈ రోజుకి ప్రయణించాలి. అది కూడా సరిగ్గా ‘బయోరిసెర్చి’ లాబ్స్ ఆఫీస్ గచ్చిబౌలీ దగ్గర దిగాలి!”

ఆయన ఆలోచించి అన్నాడు.

“నా పేరు డాక్టర్ యోగి. సుమారు రెండు సంవత్సరాల క్రితం నుంచి ఈ కాలప్రయాణం ఆఫీస్ నడుపుతున్నాను. భవిష్యత్ ప్రయాణం ఆరు నెలల వ్యవధి పెద్ద కష్టం కాదు. కాని చాలా రూల్స్ వున్నాయి. తెలుసు కదా!”

“చూశాను. మీ వెబ్ సైట్‌లో. మెడికల్ సర్టిఫికెట్ తెచ్చాను. నాకు వర్టిగో, రక్తపోటు లేవు. తిరిగి ఖచ్చితంగా వస్తానని పది లక్షల రూపాయలు, బాండ్ పేపర్ మీద బ్యాంక్ గ్యారంటీ తెచ్చాను. కేవలం టూరిజం కొరకే – అక్కడ ఏ సంఘటనలో పాల్గొనను, కలుగజేసుకోను అనే ఎఫిడవిట్ కూడా రాశాను నోటరీ దగ్గర.”

“అందరూ భూతకాలంలోకి ప్రయాణం అడుగుతారు. నువ్వు భవిష్యత్ కాలంలోకి ఎందుకు అడుగుతున్నావు? భవిష్యత్ భయంకరమైనది లేక సంతోషకరమైనది కూడా కావచ్చు. అది చూసి తట్టుకోవాలి, ఆ శక్తి వుండాలి. జరగబోయే సంఘటనలలో తలదూర్చకూడదు.”

“భూతకాలపు ప్రయాణం కూడా అంతే కదా?”

“అవును కానీ, భవిష్యత్తుకి నేనే ఎప్పుడూ వెళ్ళను. అది ఎక్కువ ప్రమాదకరం. కానీ టెక్నికల్‌గా, వెళ్ళచ్చు. ఒక రోజులో తిరిగి రావచ్చు. ఖరీదు, మాత్రం రెట్టింపు అవుతుంది. రిస్క్ నీదే. సరేనా” వృద్ధుడు యోగి కొంచెం ఆగి మళ్ళా అన్నాడు “నా సలహా వెళ్ళద్దనే! కలుగజేసుకోవద్దనే! బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే సీతాకోకచిలుక రెక్కల టపటప తుఫానులు తెస్తుంది… తెలుసు కదా.”

“బాగా తెలుసు. ‘Butterfly Effect’ అంటే చిన్న మార్పు జరిగినా నా టైం లైన్ మారిపోతుంది. అలా చేయను!”

“సరే. ఇప్పుడు రెడీనా?”

“రెడీ. ఇప్పుడే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసిన సందేశం షేర్ చేస్తున్నాను మీకు!”

“ఓ.కె. ఆ దూరంగా వున్న గాజు అద్దాల బాక్స్ లోని కుర్చీలో కూర్చో. బాన్ వాయేజ్! నీ టైం ఇప్పుడే మొదలవుతోంది. నీ లక్ష్యం December 17, 2075.

సమయం సాయంత్రం ఏడు గంటలు JUNE 17 2075.”

***

కాలయంత్రం నిజానికి ఒక చిన్న ఏ.టి.ఎం. బూత్ లేక పాతకాలపు పబ్లిక్ టెలిఫోన్ బూత్ లాగా వుంది.

దాంట్లో ఒక మెత్తటి కుర్చీలో అతన్ని కూర్చో బెట్టి తలకు వైర్లున్న ఎలక్ట్రోడ్స్, కళ్ళకు వర్చువల్ గ్లాస్‌లు, చెవులకు అధునాతమైన హెడ్ ఫోన్స్ అమర్చాడు.

“ఒక్క నిముషం” డాక్టర్ యోగి గొంతు భరత్ హెడ్ ఫోన్‍లో వినిపించింది. ఇది ‘వర్చువల్’ ప్రయాణం కాదు. నువ్వు కాలంలో నువ్వు కోరుకున్న కాలానికి స్థలానికి వెళతావు. క్వాంటమ్ మెకానిక్స్‌తో కాలంలో ముందుకి జంప్ చేస్తావు. అయితే ఆయా దృశ్యాలు శబ్దాలు కనిపించడానికే ఈ ఏర్పాటు. నువ్వు అక్కడ నడవగలవు. చూడగలవు.

నిన్ను వాళ్ళు చూస్తారని అనుకుంటావు కాని వాళ్ళు చూడలేరు. అయితే అక్కడి సంఘటనలలో ఏమీ జోక్యం చేసుకోకూడదు. ‘చూసి’ రావాలి. నీ టైం అయిపోగానే తిరిగి తీసుకు వస్తాం. లేకపోతే ప్రమాదం నీకే!”

“అర్థం అయిందా? నిన్ను మళ్ళీ 8.30కి తీసుకువస్తాను. నీ ఫోన్‌కి కోఆర్డినేట్లు పంపుతాం”

“అయింది!” అన్నాడు భరత్.

ఎక్కడో ఏదో తేడా వుంది. పది లక్షలు బాండు, తిరిగి వస్తానని ఎఫిడవిట్, అన్నీ ఇచ్చి ఆ పైన అంతా తన కంట్రోల్‌లో వుంటుంది అని చెప్పినప్పుడు ఆయనకి ఇంత భయం ఎందుకు? అంటే…

అంటే తను అనుకునట్లు కొన్ని పనులు చేయగలడు! అవి ఆయన చెప్పిన లిస్ట్‌లో లేవు మరి.

“నీ టైం మొదలయింది! 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 టేక్ ఆఫ్‌కి.”

యోగి గొంతు ప్రకంపనలు వినిపించి అవి బలహీనమైన మరుక్షణమే…

చెవులో పెద్ద పెద్ద చప్పుళ్ళు… ఎం.ఆర్.ఐ. మెషిన్‌లో తల పెట్టి పడుకున్నప్పుడు వచ్చిన వింత వింత ధ్వనులలాగా,

వర్టిగో. తిరిగి తిరిగి పోతున్న శరీరం. కళ్ళజోడులో అద్దాల ముందు వలయాలు. అని కొన్ని వేల రంగులలో తిరిగి తిరిగి తిరిగి…

చివరికి శబ్దాలు తగ్గి, రంగులు దృశ్యాలుగా మారి, తాను దిగి నడుస్తున్నాడు.

గచ్చిబౌలీలో బహుళ అంతస్తుల భవనాలు అటూ ఇటూ వున్న రోడ్డు మీద పెద్ద కాంపౌండ్ వాల్‌లో వున్న గేటు ముందు నిలబడివున్నాడు తను.

పెద్ద గేటులో చిన్న గేటు. ఆ పక్కన సెక్యూరిటీ గార్డ్.

‘బయోరిసెర్చ్ లాబొరేటరీస్ లిమిటెడ్.’ అని రాసి వున్న పెద్ద బోర్డు.

భవిష్యత్‌లో ఆరు నెలలేగా, ఏమీ మారలేదు. ఆ ప్రాంతం. రోడ్డు మీద కార్లు, మనుషులు అక్కడక్కడా తిరుగుతున్నారు.

“నా పేరు భరత్. నేను కంపెనీలోకి వెళ్ళాలి” అన్నాడు.

“ఎం.డి గారితో పని” అన్నాడు.

పెద్ద నిబంధనలు ఏమీ వున్నట్లు లేవు.

నిజంగానే సెక్యూరిటీ గార్డుకి అతను కనబడలేదు.

“అక్కడ రిజిస్టర్‌లో మీ పేరు, సెల్ నెంబరు రిజిస్టర్ లో రాయండి. వచ్చిన టైం, డేట్ వేసి సంతకం పెట్టండి. లోపలికి వెళ్ళి రిసెప్షన్లో మీకు కావలిసినది అడగండి.” అన్న బోర్డు వుంది.

చిన్న గేటులోంచి లోపలికి వెళ్ళాడు. పొడుగాటి దారి. అటూ ఇటూ ఆకుపచ్చటి లాన్స్, లోపల కొబ్బరి చెట్లు. ఒక టెన్నిస్ కోర్టు దూరంగా.

లోపలికి నడిచాడు. తన వంక తాను చూసుకున్నాడు. తన ప్యాంట్, షర్ట్, భుజాన వేళ్ళాడే బ్యాగ్ యథావిధిగా వున్నాయి.

బయోరిసెర్చ్ ల్యాబ్ చాలా పెద్ద మందుల కంపెనీ. ముందు భవనం, ఆ వెనకాల మందుల తయారీ చేసే ప్రాసెసింగ్ యూనిట్లు వున్నట్లు అనిపించింది. తనకి కావల్సింది మేనేజింగ్ డైరెక్టర్‌ని కలవడం కాదు.

నడుస్తున్నాడు. కారిడార్‌లో ఆ కంపెనీలో పని చేసే డైరెక్టర్ కాక మిగిలిన వాళ్ల గదులు… వరసగా వున్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో వుంది డైరెక్టర్ గది. ఒక సెమినార్ హాలు. ఆ ప్రక్కనుంచి వెనకకు దిగితే విడిగా మరొక భవనం.

ఇది మందులు తయారు చేసి స్టోరు చేసే భవనం, గదులు. లోపలికి వెళ్ళాడు. కొంత మంది తెల్లటి కోట్లు మాస్క్‌లు ధరించి అటూ ఇటూ తిరుగుతున్నారు. లోపల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో యంత్రాలు, కెమికల్స్ టాంకులు, ఏవేవో వున్నాయి.

తనకి కావల్సింది స్టోరేజీ రూం. ఇంకా లోపలికి వెళ్ళాడు. నిజమే తను ఎవరికీ కనబడటం లేదేమో.

ఒక ఎనిమిది యూనిట్లు ORALVICTORY MAB వయిల్స్ చాలు. నాన్నకి తీసుకెళ్ళి ఇప్పించవచ్చు. భుజంలో బ్యాగ్‌లో వేసుకుంటాడు. మరో గంట. ఈ కాలం నుంచి ఆరు నెలల వెనక్కి వెళ్ళిపోతాను.

అతను అనుకున్న కొద్ది సేపటికే కనిపించింది.

ఒక పెద్ద స్టోర్ రూంలో వరసగా రిఫ్రిజిరేటర్లున్నాయి. దానికి కాపలాగా ఒక సెక్యూరిటీ గార్డు నిలబడి వున్నాడు. గోడకి తగలించిన బోర్డు మీద STORAGE ROOM FOR NEWLY APPROVED DRUGS అని రాసి వుంది.

సెక్యూరిటీ గార్డుకి తాను కనబడడు. డాక్టర్ యోగి చెప్పింది నిజం. అతను తాను లోపలికి వెళ్తుంటే కూడా ఏమీ పట్టించుకోలేదు.

తను ఒక క్వాంటమ్ అణువుల ముద్ద. పారదర్శకంగా వున్నాడేమో. కాంతి పుంజంలా వున్నాడేమో.

వరసగా రిఫ్రిజిరేటర్లు. నోరు తిరగని మందుల పేర్లు. ‘MAB’ అని ముగింపుతో వున్నాయి వరసగా.

అప్పుడు దొరికింది.

‘ORALVICTORYMABDRUGS Batch Number 2075 December Approved’ అని రాసిన రిఫ్రిజిరేటర్.

ఆహా, రిఫ్రిజరేటర్ తీసి పొగలు కక్కతున్న అంతర్భాగంలో వున్న పెద్ద వయిల్స్, ముందే నింపబడి వున్న సిరంజిలో వున్న మందులు తీసుకున్నాడు.

ఎనిమిది. “బహుశా ఒక సైకిల్ మందుల చికిత్స (కీమోథెరపీ)కి పనికి వస్తాయి. తీసుకెళ్ళిపోతాను”. బ్యాగ్‌లో వేసుకున్నాడు.

ఎక్కడో మస్తిష్కంలో యోగి చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. “భవిష్యత్తు చూడు గాని, అక్కడ ఏమీ మార్పు చేయడానికి ప్రయత్నించకు. కాలంతో ఆడుకుంటే టైం లైన్ మారిపోతుంది. ప్రమాదం నీకే…”

ఇంత చిన్న విషయానికి ఏమవుతుంది. నాన్న బతకుతారు. ఆరు నెలల ముందే ఈ మందు దొరుకుతుంది. ఆయనకి ప్రయత్నిస్తే తప్పేమిటి?

జేబులో మందుల వయిల్స్ వేసుకున్నాడు. మళ్ళీ టైం మెషీన్‌లో ఆరు నెలల వెనక్కి వెళ్ళిపోతాడు. దీని వల్ల ప్రపంచ చరిత్ర గతి ఎలా మారుతుంది? తన పనికి చరిత్రకి సంబంధం ఏమిటి. నాన్న బతుకుతారు గదా. ఒక చిన్న మార్పు. అంతే.

అతను జేబులో వేసుకున్న మందులని మరొకసారి చెక్ చేసుకుని బయటకు నడిచాడు. చేతి గడియారంలో టైం చూసుకున్నాడు. 7-30 PM. ముప్ఫై నిముషాల్లో తన పని అయిపోయింది.

తనకిచ్చిన కో-ఆర్డినేట్స్ దగ్గరికి మరొక గంట అంటే ఎనిమిది ముప్ఫై నిముషాలకు చేరుకుంటే ఆ టైంకు తిరిగి భూతకాలం ఆరు నెలల వెనక్కి వెళ్ళే సమయం వస్తుంది. అక్కడి నుంచి తనకి తిరిగి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. బహుశా ఆ కంపెనీ వారి మనిషి కాని యంత్రం కాని అక్కడ వుంటారు.

అంటే ఇంకా గంట టైం వుంది. భరత్‌కు ఒక్కసారిగా ఏదో థ్రిల్లింగ్ అనిపించింది.

తాను భవిష్యత్తులో వున్నాడు. గచ్చిబౌలీలో తన ఇల్లు ఇక్కడికి దగ్గరే, కూకట్‌పల్లిలో వుంది. ఒక్కసారి భవిష్యత్తులో ఇల్లు ఎలా వుందో చూస్తే…

భవిష్యత్ చూడాలని కోరిక ఒక వైపు, డాక్టర్ యోగి, టైం మెషిన్ నడిపే పెద్ద మనిషి చెప్పిన వార్నింగ్‌లు ఒక వైపు. అంతరాత్మలో ఒక రెండు నిముషాలు అతను సందిగ్ధంలో పడ్డాడు.

ఏముంది, వెళ్ళి చూస్తాను అంతే కదా. ఈ మందుతో నాన్న బతికే వుంటారు. ఇల్లు, భార్యా పిల్లలు, తండ్రి ఎలా వుండబోతారో జస్ట్ ఫైవ్ మినిట్స్ చూస్తాడు అంతే గదా.

దారిలో ఒక ఆటో పోతోంది. అది ఎక్కితే…. కాని తాను అతనికి కనబడడు. ఎలా ప్రయాణించాలి?

“ఆటో!” ఎవరో పిలుస్తున్నారు. ఒక స్త్రీ. ఆటో ఆగింది. “కూకట్‌పల్లి వస్తావా?”

బేరం కుదిరింది. ఆమె ఎక్కికూర్చుంది.

భరత్ కూడా ఆటోలో ఎక్కాడు.

ఇది ఏదో చాలా అదృష్టం. కాకతాళీయంగా వుంది. కుకట్‌పల్లిలో తన ఎడ్రస్ తనకి తెలుసు. వెళ్ళి చూడచ్చు.

***

ఆటో కుకట్‌పల్లీలో ఒక మాల్ ముందు ఆగింది.

ఆ స్త్రీ దిగగానే భరత్ దిగి వేగంగా సైడ్ రోడ్లలోకి వచ్చి నడవసాగాడు.

ఫ్లాట్ నెంబర్ 104. మెజెస్టిక్ హైట్స్ ఎపార్ట్‌మెంట్స్. శివానీ జనరల్ స్టోర్ పక్కన.

అతనికి పరిచయమైన దారే. గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. మెట్లు తండ్రి ఎక్కలేడని ఫస్ట్ ఫ్లోర్ లోనే 104 ఎపార్ట్‌మెంట్ కొనుక్కుని ఉంటున్నాడు.

మెల్లగా కాలింగ్ బెల్ నొక్కాడు.

“ఎవరు…” తన భార్య గొంతులా వినిపించింది.

చిన్నగా నవ్వుకున్నాడు. ఆమెకి తను కనబడడు. భవిష్యత్ ఇది.

తలుపు తెరుచుకుంది. డ్రాయింగ్ రూం, ఒక పక్క సోఫాలో తండ్రి, కూర్చుని టి.వి చూస్తున్నాడు. మరొక పక్క కార్పెట్ మీద బొమ్మలు పెట్టుకొని తన కొడుకు ఆడుకుంటున్నాడు!

అంతా నిశ్శబ్దంగా వుంది. టి.వి. చప్పుడు తప్ప.

భార్య ‘ఎవరూ లేరు మరి. ఏమిటో ఎవరు నొక్కారో బెల్’ అనుకుంటూ తలుపు మళ్ళీ వేసేసే లోపల అతను లోపలకి ప్రవేశించాడు.

భవష్యత్‌లో కూడా అతనికి ఒక్కసారి ఒళ్ళంతా ముందు సంతోషం, నిండిపోయింది. నాన్న బతికే వున్నాడు! పైగా ఆరోగ్యంగా వున్నాడు!

ఆ తర్వాత మళ్ళీ అతనికి చల్లని చెమటలు పోసినట్లయింది.

భార్య తెల్లటి చీరలో వుంది. కళ్లకింద చారలు. నుదుటన బొట్టు లేదు!

ఏమయింది!

అప్పుడు కనిపించిది.

హాల్లో ఒక మూల టేబిల్ మద, పెద్ద కలర్ ఫోటో.

తనదే.

తన కిష్టమైన గులాబీపూల దండ కొంచెం వాడిపోయి తగిలించివుంది. సగం తరిగిపోయిన అగరొత్తుల లోంచి పొగ వలయాలుగా కొశ్చన్ మార్క్ లాగా, సువాసన గదంతా వ్యాపిస్తోంది.

అదేమిటి? తనకేమయింది? తనెలా…

అతనికి దిమ్మ తిరిగినట్లు, భూమి కంపిస్తున్నట్లు, ఆకాశం నేల మీద పడ్డట్లు అనిపించింది.

ఆరు నెలల తర్వాత తను లేడా? తనకేమయింది?

ఇంకేం, ఏమయింది. చనిపోయాడు. భయంతో అతను వెనక్కి పరుగెత్తి తలుపు తీసి రోడ్డు మీదకి వచ్చాడు.

ఇది నిజం కాదు.

భ్రమ.

ఎక్కడో ఏదో పొరపాటు. ఆ యోగి ఏదో వర్చువల్ మ్యాజిక్ చేస్తున్నాడేమో?

వెళ్ళిపోవాలి. భూతకాలంలోకి.

తన కాలంలోకి.

సెల్ ఫోన్‌లో టైం, గూగుల్ మ్యాప్స్‌లో యోగి ఇచ్చిన కోఆర్డినేట్స్ డిగ్రీలలో టైప్ కొట్టి పట్టుకున్నాడు.

మ్యాప్ ప్రత్యక్షం అయింది.

గచ్చిబౌలీ దగ్గర ఒక హోటల్ గెలాక్సీ అనే ప్రాంతంలో ఎర్రటి చుక్క వెలుగుతోంది. అది ఇందాక తను వెళ్ళిన బయో రిసెర్చ్ ల్యాబ్ దగ్గరే వుంది.

ఎలా వెళ్ళాలి?

టైం చూసుకున్నాడు.

ఇక్కడికి రాకుండా వుండాల్సింది. క్యాబ్, యుబర్, ఆటో?

ఎలా పిలవాలి. తను ఎవరికీ కనబడడు. మెట్రో….? స్టేషన్ వైపు పరుగెత్తసాగాడు. ఇక్కడి నుంచి గచ్చిబౌలీకి ఎలా వెళ్ళాలి మెట్రోలో చూడాలి.

ఆటో… ఆటో… అని పిలిచాడు. ఖాళీగా వెళ్ళే ఆటో కూడా ఆగలేదు. అతను తనని చూడలేడు.

మెయిన్ రోడ్ మీద పరుగెత్తసాగాడు.

***

ముందు మెట్రో.

ఆ తర్వాత MMTS లో గచ్చిబౌలీ స్టేషన్.

గుండె వేగంగా కొట్టుకొంటోంది.

వాళ్ళు చెప్పిన టైంకి చేరుకోకపోతే తాను ఏమయిపోతాడు. క్వాంటం అణువులుగా మిగిలిపోతాడా!

అసలు భవిష్యత్తులో తను బతికి వున్నాడా? లేక ఇది భ్రమా.

కానీ క్షణాలు గడిచిపోయాయి. ఎలాగైతేనేం బయోరిసెర్చి ల్యాబ్ దగ్గర మెయిన్ గేటు దగ్గరికి చేరుకోగలిగాడు. తనకి ఆ ప్రాంతం తెలిసివుండటం వల్లనే ఇది సాధ్యం అయింది.

దూరన ఒక కాంతిపుంజం మెరిసి చిన్న ఎటిఎమ్ బాక్స్ లాంటి ఆకారం వెలిగింది.

అదే తనని తిరిగి వర్తమానంలోకి తీసుకు వెళ్ళే కాలయంత్రం.

పరుగెత్తాడు.

***

మళ్ళీ వర్టిగో. కళ్ళ ముందు కాంతి వలయాలు. ఐదు నిముషాలు ఎగిరి పోతున్న భావన.

ధడ్ మన్న చప్పుడుతో మెషిన్ ఆగింది.

“కొంచెం సేపు ఆగండి. కాల ప్రయాణపు బడలికతో మీకు తల తిరగడం తగ్గడానికి పది నిముషాలు పడుతుంది.” అని యంత్రంలోని కంఠస్వరం హెచ్చరించింది.

కొద్ది సేపటికి నీరసంగా బయటికి వచ్చాడు.

డాక్టర్ యోగి ఆ వైర్లు లైట్లు కంప్యూటరు తెరల మధ్య కూర్చుని వున్నవాడు కోపంగా లేచి నిలబడ్డాడు. ఆయన చెయ్యి వణుకుతోంది.

“నేను చెప్పిన మాట వినలేదు మిష్టర్ భరత్. ఏదో పొరపాటు జరిగింది. కాసేపు ఎక్కడో తిరిగావు. దారి తప్పావు.”

ఒక కాగితం తీసి ఇచ్చాడు.

“ఇక్కడ సంతకం పెట్టు! బటర్‌ఫ్లై ఎఫెక్ట్. షరతులు తప్పి వ్యవహరించినందు వల్ల వచ్చే పరిణామాలకి మా బాధ్యత లేదని, నీ తప్పేనని సంతకం పెట్టు. లేకపోతే వెళ్ళడానికి వీల్లేదు.

“కానీ, కానీ, డాక్టర్ యోగీ గారు! నేను చనిపోయాను భవిష్యత్తులో? ఎలా? ఎలా? నేను చూశాను. నాకు చాలా భయంగా వుంది.”

“నేనేమీ చేయలేను మిష్టర్. సంతకం చేయి.”

వణుకుతున్న చేతులతో సంతకం చేశాడు.

“నేను ఎప్పుడు చనిపోతానో నాకే తెలియదు. కాని ఆరు నెలలకి వుండను.

నేను మందు ఇచ్చినా ఇవ్వకపోయినా మా నాన్న మాత్రం బతికే వుంటాడు. ఆరు నెలల తర్వాత కూడా. అంతా చూసాను! నేనిప్పుడేం చేయను!”

జేబులోంచి మందులు తీసి బయట బల్ల మీద పెట్టాడు.

“యోగీ గారు ఈ మందులు మా నాన్నకోసం తెచ్చాను. భవిష్యత్తులోంచి. తర్వాత ఇంటికి వెళ్ళి చూశాను. ఒక్క అరగంట అంతే! దీని వల్ల ఏమవుతుంది అనుకున్నాను!”

డాక్టర్ యోగి ఇప్పుడు కొంచెం తేలిక పడ్డాడు.

“డోంట్ వర్రీ భరత్, ఇవన్నీ సిద్ధాంతాలు. ఏమీ జరగదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. నువ్వు చూసినది భ్రమ కావచ్చు. నిజం కావచ్చు. లేదా నీ ఇచ్ఛాశక్తితో నిన్ను నువ్వు బాగు చేసుకోవచ్చు, రక్షించుకోవచ్చు. జబ్బులు, ప్రమాదాలు జరగకుండా రక్షించుకో. ఆ మందులు నీ తండ్రికివ్వు. జాగ్రత్తగా ఇంటికి పో.”

భరత్ బయటకి అడుగులు వేశాడు.

రాత్రి ట్రాఫిక్ పల్చబడి దీపాలు వెలుగుతున్నాయి.

ఎప్పుడో ఏదో జరగవచ్చు. జరగకపోవచ్చు. ముందు తండ్రికి మందులు ఇవ్వవచ్చు.

అక్కడ పార్క్ చేసిన తన కారు తలుపు తీసి డ్రైవింగ్ సీట్‌లో కూలబడ్డాడు.

‘మరో ఆరు నెలలు! అంతే! వున్నంత వరకు సంతోషంగా గడుపుతాను.’

కారు కదిలింది.

ఎవరి భయాలు బాధలు పట్టించుకోని కాలచక్రం కదిలిపోతూనే వుంది.

***

‘భవిష్యత్తుని ఎవరూ చూడలేరు, మార్చలేరు. లేక మార్చగలరు, అన్నీ సిద్ధాంతాలే’ అనుకుంటూ ఒక సీతాకోకచిలుక, పక్కనున్న పొద మీద తన రెక్కలు టపటపా విదిల్చింది.

~

‘నీకు ఇవ్వబడిన దానిని మృత్యువు తీసుకుపోయేలోపు, నీవు ఇవ్వగలిగింది ఏదైనా వుంటే ఇచ్చేయి.’ (రూమీ).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here