[dropcap]”పే[/dropcap]గు తెంచుకున్నా మేము ఒకటిగానే ఉన్నాం. ఒకటిగానే ఆలోచించాం. మా ఆకాంక్షలు, అభిప్రాయాలూ, అభిరుచులు ఒకటే. మేమెప్పుడూ విడిగాలేం. తను సగంలో నిలిపేసిన కళలూ, కాంతులూ నేను పూర్తిచేశాను. అమ్మ కొనసాగింపే నేను కదా! తను లేకుండా నేనస్సలు పూర్తేకాను. సంపూర్ణమైన జీవితాన్ని అమ్మతో కలిసి అనుభవించాను. జీవన మధురిమనీ, మమకారపు గాఢతనీ పొదువుకుని తన నుంచి నిండైన నైతికతను ఒంపుకుని మనోనిబ్బరంతో జీవిస్తున్నానంటే అమ్మ నాలో ఉండబట్టే! ఒక ఆఫ్రికన్ సామెత అన్నట్టు మన జ్ఞాపకాల్లో నిలిచి ఉన్నంత కాలం ఎవరూ పూర్తిగా మరణించినట్టు కాదు. అమ్మ నా మదిలో నెమ్మదిలో పొరపొరలో కన్నీటి తుంపరలో… పొడకట్టే కలల తెరలో తను మసలుతున్నట్టే ఉంది. నా ఊహల్లో… గుసగుసల్లో… విసవిసల్లో తను సడిచేస్తూనే ఉంది. బతుకంతా నా జీవన గమనమంతటినీ నిర్దేశించి… నిమంత్రించి, నియంత్రించిన అమ్మను నేనెక్కడికీ పంపనేలేదు. నా జ్ఞాపకాల్లోనే పొదువుకున్నాను” అంటూ… పన్నెండు లఘు ఖండికలుగా సంకలించిన ఈ చిరు పొత్తంలో రచయిత్రి రాణీ ప్రసాద్ అమ్మతో కలిసి ఎగరేసిన త్రివర్ణ పతాక గర్వ స్మృతులున్నాయి. చిట్టి చేతులతో ఒత్తిచ్చి వదిలిన చిరు దివ్వెలున్నాయి. గుమ్మడి పువ్వుతో గొబ్బెమ్మలను మురిపించిన సంకురాత్రి సందె వెలుగులున్నాయి. రాములోరి పందిళ్లలో అమ్మతో గొంతు కలిసిన స్వరమాలికలున్నాయి. అంతే కాదు… అమ్మలేకుండా.. అమ్మ సందిట లేకుండా వెలిగించిన పుట్టినరోజు పండుగ ఉంది. వినాయక చవితి ఉంది. అమ్మ అలిగిన వేళ.. అమ్మ కొనచూపుతో నవ్విన వేళ, కడచూపుతో ఆర్తిగా కదిలిన వేళ… కృత్రిమ శ్వాసనాళాల బంధనాల చిక్కి జీవికను చిటారుకొమ్మ నుంచి జారవిడుస్తున్నవేళ… ఒకానొక సందెవేళ ఆ జ్ఞాపకాల చుక్కల రేయిని మోసుకొచ్చిన వేళ… పేగు తెంచుకుపడ్డ జీవుని వేదన, ఒకానొక సహజ మానవ స్పందన ఎలా ఉంటుందీ! ఇవన్నీ అమ్మ జ్ఞాపకాలుగా ఇందులో అల్లుకుని ఉన్నాయి. అమ్మతో నడిచిన తప్పటడుగుల లేత తెమ్మరలు ఈ పుటలు తిరగేస్తున్నంత సేపూ అస్పష్టంగా వీస్తూనే ఉంటాయి.
ఈ అంగలకుదుటి గోవిందమ్మ పాటల పేటి. కథల ప్రోవు కూడా. వొస్తూ వొస్తూ పుట్టింట నుంచి తెచ్చుకున్న ఆస్తి పాటల భాండాగారం. తన గొంతులో ఏ మాధుర్యముందో ఏమో లాలనుచు పాడరమ్మా అంటూ పేరంటాల మధ్య నిండు ముత్తైదువలా పాడుతూ ఉంటే అది కోనేటి రాయుడి పాటల కొమ్మ కదిలినట్టే ఉంటుందట. అంతేనా! తనో విజ్ఞాన సర్వస్వం కూడా. ఎనిమిదో తరగతితోనే చదువు అటకెక్కించినా మెట్టినింట సంస్కృతం, హిందీ నేర్చుకుంది. కుట్లు, అల్లికల్లో సాధికారత సాధించింది. పెళ్లైన ఇరవై ఏళ్లకి పుట్టిన పసికందుపై తను పెంచుకున్న అమిదానందాన్ని కడదాకా నిలుపుకోవడంలో ఎంత మాతృత్వాన్ని పంచిందో అంతే భగవశ్శక్తిని పదిలపరచుకుంది. సృజన శక్తి, కళారాధన పట్ల తనకున్న మక్కువనే పిల్లలకీ కలిగించింది. తనలోని కళావనిని పిల్లల్లో చూసుకుని మురిసిపోయింది. అసలే సరస్వతీ చావిడి. చదువుల చప్పుళ్లు లోగిలంతానూ. భర్త సలిపే సాహితీ సమారాధనలు, సత్సంగత్యాలే తనలో సృజనకు రెక్కలు తొడిగాయి. గొంతులో దాగే పాటలన్నీంటినీ పుష్పాంజలి పేరిట గుదిగుచ్చింది. కథల గమకాలన్నింటినీ టిక్ టాం బుర్రగా భద్రపరిచింది. మరి ఇవన్నీ సందె వాటారే వయసులో చెయ్యగలిగిందంటే గొప్ప సాహసమే కదా! ఒక అవిశ్రాంత శ్రమజీవి ఎంతటి దూరం ప్రయాణించిందో.. ఎలాంటి వెలుగులకి ప్రస్థానమైందో ఎన్నెన్ని మధురాంబువులను చవి చూసిందో ఈ పొత్తం నివేదిస్తుంది. తల్లి విషయంలో మనల్ని మనం క్షమించుకోలేని సంఘటనలు ఎవరికైనా కొన్ని తారసపడతాయి. మాతృత్వంలో పరిపూర్ణతను సాధించగలిగే క్రమంలో కొన్ని అవగతమవుతాయి. మనకేమిష్టమో.. మనకేమి కావాలో.. మన అవసరాలేంటో అనే తాపత్రయాలే తప్ప తన గురించి యోచించిందా తల్లి ఏనాడైనా! అమ్మకి పొట్టకాయ పెరుగు పచ్చడి అంటే ప్రాణం. నిండైన గింజలుండే చిక్కుడుకాయలతో కూర చేస్తే పరమాద్భుతం. మరీ ఈ ఆశలన్నీ లోలోన సమాధి చేసుకున్న అల్పసంతోషాలన్నింటినీ ఎక్కడ దాచుకుంది! అవన్నీ నేను చాలా ఆలస్యంగానైనా గ్రహించగలిగాను. అమ్మ ఆకాంక్షలను అందుకునేందుకు ప్రయత్నించాను.. అంటూ తన తల్లి గురించి రాణీ ప్రసాద్ చెప్పిన మాటలు ఆలోచింపచేస్తాయి.
నిజానికీ ఈ రచన ఒక స్మృతి కావ్యం. తెలుగులో విశ్వనాథ, నాయని స్మృతి కావ్యాలు రాశారు. ఐతే ఇవన్నీ పద్య కావ్యాలు. తల్లి పై వచ్చిన వచన స్మృతి కావ్యాల్లో మొదటి శ్రేణికి చెందుతుందిది. తల్లి నుంచి ఎన్నో నేర్చుకుంటాం. ఎంతో జ్ఞానం గడిస్తాం. చేసే పనులు, ఆలోచనలనుంచి స్ఫూర్తి పొందుతాం. బతికున్నంత కాలం ఆ తల్లి సమాగమాల కోసం ఆరాటపడతాం. తీరా మనల్ని వదలివెళ్లిపోయాక ఒక స్మృతి చిహ్నంలా నిలుపుకుంటాం. అలా నిలుపుకోవడంలో కూడా ఒక విలక్షణత, వైవిథ్యం ఉండాలి. అది కాలదోషం పట్టని మాతృత్వానికి ఆలంబనవ్వాలి. రాణీ ప్రసాద్ ఈ పొత్తం ద్వారా సాధించిందదే. అమ్మ జ్ఞాపకాలే ఒక సౌందర్యలహరిలా నిత్య పఠనీయమవ్వాలి. లలితా సహస్ర నామంలా స్మరణీయమవ్వాలి. ఒకానొక గాథాసప్తశతిలా తరాలు దాటి ప్రయాణించాలి. మరి అంతటి గాఢత, సాంధ్రత, సాఫల్యత ఆ జ్ఞాపకాలకు ఉంది కనుకనే ఈ రచయిత్రి తన తల్లి స్మృతులకు ప్రాణప్రతిష్ఠ చెయ్యగలిగింది. ప్రతి తనయా తన తల్లికి ఇలాంటి నివాళి అందించగలిగితే ఎంత ధన్యత!
***
నా జ్ఞాపకాల్లో అమ్మ
రచన: డా. కందేపి రాణీ ప్రసాద్
ప్రచురణ: స్వాప్నిక్ పబ్లికేషన్స్
పుటలు: 73
వెల: ₹ 100
ప్రతులకు:
సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్,
సిరిసిల్ల, 505301
ఫోన్: 08723-233514