[box type=’note’ fontsize=’16’] ‘ఈ జీవిత గమనంలో ప్రతిరోజూ కాకపోయినా తరచుగా అయినా ఎవరో ఒకరు ఒక పాఠం చెబుతూనే ఉంటారు. వారంతా గురువులే’ అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి ‘రంగుల హేల’ కాలమ్‌లో. [/box]
[dropcap]మొ[/dropcap]త్తం విద్యనంతా, గురుకులాల్లో ఒకే గురువుగారి దగ్గర నేర్చుకునే రోజులు ఏనాడో పోయాయి. ప్రీ కేజీ నుంచి పీజీ వరకూ ప్రతి విద్యార్థి జీవితంలో ఎందరెందరో గురువులుంటారు. వారిలో కేవలం పాఠాలు మాత్రమే చెప్పేవారి సంఖ్యే అధికం. స్టూడెంట్స్‌కి జీవితంలోని మంచి చెడ్డలూ, ప్రవర్తనా విధానం ఎలా ఉండాలో చెప్పేవారు బహు తక్కువ. మనం చదువుకునేటప్పుడు ఉన్నారు కానీ ప్రస్తుతపు ఈ బిజీ కాలంలో లేనే లేరనుకోవచ్చు దాదాపుగా.
ఈ జీవిత గమనంలో ప్రతిరోజూ కాకపోయినా తరచుగా అయినా ఎవరో ఒకరు ఒక పాఠం చెబుతూనే ఉంటారు. వారంతా గురువులే. వారు చదువుకున్నవారా, ప్రాజ్ఞులా, విజ్ఞులా అన్న మీమాంస అక్కర్లేదు. ఏ హోదా లేనివారయినా కావచ్చు. గురువవడానికి అంతా అర్హులే. ఆ నాటి స్థలకాలాదులు కూడా లెక్కలోకి రావు. తమ సత్ప్రవర్తనతో పాఠం చెప్పేవారు పాజిటివ్ గురువులైతే తమ దుష్ప్రవర్తనతో పాఠం చెప్పేవారు నెగటివ్ గురువులు. ఇద్దరూ జీవితంలో ఎలా ఉండాలో, ఉండకూడదో ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచి చెబుతారన్నమాట.
గురువులు మనకంటే పెద్దవాళ్లవాలని లేదండోయ్. ఈ రోజుల్లో పదేళ్ల పిల్లలు కూడా, ‘లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అబ్బా.. ఆల్వేజ్ బీ హ్యాపీ! వద్దోయ్ టెన్షన్! ప్రాబ్లెమ్స్ వస్తూ పోతుంటాయి బ్రో. కొంచెం చిల్ మరో బాపీ’ అని పాడుకుంటున్నారు విన్నారా? ఆ సారం నిరంతరం గుర్తుపెట్టుకుంటూ వాళ్ళకి పెడదాం దణ్ణం. బాలగురువులు కదా వాళ్ళు.
మనింట్లోని నాలుగేళ్ల బుజ్జాయికున్న స్థితప్రజ్ఞత ఒకోసారి మనకుండదు. ఆ బేబీని బొమ్మల షాపుకి తీసుకెళ్లి “ఒక్కటే ఏరుకోవాలి. రెండు, మూడు అనకూడదు” అనగానే బుద్దిగా తలూపుతుంది. బొమ్మలన్నీ పరిశీలించి ఒక్కటే ఏరుకుంటుంది. అది కొనిచ్చేసి “ఎంత మంచి పిల్లో!” అని ఇంటికొచ్చి ఇంట్లో ఉన్నవారందరికీ చెప్పి మురిసిపోతాం. నేను తెగ ఆశ్చర్యపోతాను. ఎందుకంటే నేనైతే చీరల షాప్‌కి ఒక్క చీర చాలు అంటూ వెళ్లి అక్కడ ఒళ్ళు మరిచిపోయి ఓ అయిదారు ఏరుకుని తర్వాత షార్ట్ లిస్ట్ చేసి నాలుగు చేసి కౌంటర్ దగ్గర నిలబడి ఆలోచించి చివరికి ఓ మూడు తెస్తా. అనగా నాకు కోరికల మీద నియంత్రణ లేదన్నమాటేగా! అందుకే ఆ చిన్నది నాకు గురువు. స్నానం చేయించేటప్పుడు కాళ్ళు తోమే నెపంతో ఆ బుజ్జాయి పాదాలు తాకుతాను ఆ సంయమనం, ఆ పిల్ల పోలిక నాకు రావాలని.
పురాణేతిహాసాలు మొదలుకొని వేమన వంటి వారి వరకూ చెప్పినవన్నీ పాఠాలే! సుమతీ శతక పద్యాలన్నీ అమృతగుళికలే. వాళ్లంతా గురువులేగా! నిజానికి మన జీవితానుభవాలను మించిన పాఠాలున్నాయి. అవి ఎంతవరకూ మనకి ఉపయోగపడ్డాయో? అని ఆలోచిస్తే చాలా వరకూ అని చెప్పాల్సిందే. రాముళ్లు కనబడకపోయినా రావణులు కనబడ్డారు. అహంకారంతో విర్రవీగే దుర్యోధనుడి వారసులనేకం మనకి నిత్యం కనబడతారు. కీచకులు రోజూ వార్తలలో దర్శనమిస్తున్నారు. నీతిని సామాన్యులు గ్రహిస్తున్నారు కానీ వాళ్ళు పెరిగిపోతున్నారు. అదీ కలికాలపు మాయ. నేర్చుకోవలసిన వాళ్ళు నేర్చుకోరు. సత్ప్రవర్తన గలవారు నిత్యం సుభాషితాలు వల్లె వేస్తుంటారు.
చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు (లేము) అన్న అమూల్యమైన వాక్యం రాసిన భర్తృహరి గారు బతికుంటే ఆయన పాదాలు పాలతో అభిషేకించేవాళ్ళం కదా (అలాంటి ప్రయత్నం చేసి విఫలురమై సొమ్మసిల్లి పడ్డాక) అననుకుంటాం. ఎప్పుడైనా పుణ్య పురుషులు తారసిల్లినప్పుడు ఉప్పు కప్పురంబు పద్యం గుర్తుచేసుకుని వేమన గారికి ప్రణమిల్లుతాం. స్కూల్‌లో మాష్టార్లు అంతలా తాదాత్మ్యం చెంది ఆ పద్యాలు మళ్ళీ మళ్ళీ చెబుతుంటే చాదస్తం అనుకునేవాళ్లం. వయసు పెరిగే కొద్దీ ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ లాంటి పెద్దల మాటకి విలువ అనుభవంలో కొచ్చిన తర్వాత ఆనాడు అనుభవజ్ఞులు/గురుసమానులు అనుభవంతో చెప్పినమాట కదా అని తలచుకుని తలూపుతాం.
ఉద్యోగ సర్వీస్‌లో చేరిన కొత్తలో “ఫైల్ రాసేటప్పుడు పూర్తివివరాలతో, పూర్వాపరాలు చెబుతూ రాయాలి. భవిష్యత్తులో మీరు రాసిన ఫైల్‌ని ఆడిట్ వాళ్లొచ్చి పరిశీలించినా చిక్కుల్లో పడకుండా ఉండేట్టు మీ వరకూ మీరు బాధ్యతాయుతంగా రాశారనుకోవాలి” అని ఓ సీనియర్ గారు చెప్పేవారు. మరొకాయన “ఒకో సందర్భంలో ఒకోలా బహుళ అర్థాలనిచ్చే ఇంగ్లీష్ పదాల మాటున మీరు వివరాలు చెప్పీ చెప్పనట్టు రాయాలి” అనేవారు. ఇద్దరూ కరెక్టే. ఇలా పలు సందర్భాల్లో పలురకాల గురువులని గుర్తు చేసుకుని ముందుకు సాగాలి. అన్నేసి మంది గురువులు అవసరమా? అంటే ఒకోసారి ఒకో గురువు టెక్నిక్ ఉపయోగపడుతుంది. నిదానమే ప్రదానం, ఆలస్యం అమృతం విషం లాగన్నమాట.
నిత్యం నా సహాయకులు మనకు తెలియని ప్రపంచం నుంచి వారు నేర్చుకున్న జీవిత సత్యాలు నాకు చెప్పి నన్ను ఎడ్యుకేట్ చేస్తుంటారు. ఒక రోజు ఊర్నుంచి వస్తూ ట్రైన్ ఎక్కగానే ఇల్లు శుభ్రం చేసే అమ్మాయికి ఫోన్ చేసి “నేను రేపుదయమే వచ్చేసరికి రావాలి. ఇల్లంతా నెల రోజుల దుమ్ము ఉంటుంది” అన్నాను. “సరే అమ్మా!” అంది రాలేదు. సాయంత్రం వచ్చింది. “చూడు, ఉదయం వచ్చిన దగ్గర్నుంచీ ఆ దుమ్మంతా నేను అంటించుకున్నాను. నీకు ఫోన్ చేసి చెప్పాను కదా” అంటూ నేను బీ.పీ. తెచ్చుకుని కోప్పడ్డాను. మౌనం దాల్చింది. “ఏం మాట్లాడవు?” అని మళ్ళీ అరిచాను. “నువ్వు చెప్పలేదన్నానా! చెప్పావు. నాకు రానీకి కాలేదమ్మా!” అంది నింపాదిగా. అలాంటి పరిస్థితుల్ని అంత నిదానంగా ఎదుర్కొనే ధైర్యం మనకి ఉండకపోయేది. ఎం.డీ. ఏమన్నా అంటే మనకి జవాబు చెప్పుకునే అవకాశమే ఉండేది కాదు, మౌనం వహించడం తప్ప. అలా కంగారు లేని స్తిమితమైన సమాధానమిచ్చిన ఆ అమ్మాయి గురువులా తోస్తుంది.
ఆటో అబ్బాయి మనం బేరం అడగ్గానే బుద్ధిమంతుడిలా, త్యాగశీలిలా చటుక్కున ఒప్పేసుకుని ఎక్కించుకుని దిగాక, చిల్లర లేదు అనేసి ఆటో దిగకుండా నిమ్మళంగా కూర్చుంటాడు. మనల్ని పర్సు అంతా వెతికించి, ఆఖరికి చిల్లర లేదు గనక ఓ ఇరవై ఎక్కువ తీసుకుని తలైనా తిప్పకుండా వెళ్ళిపోతాడు. అప్పుడాయన ఎప్పుడూ సరిపడా చిల్లర తెచ్చుకుని ఆటో ఎక్కాలని నేర్పే గురువే కదా! ప్రాక్టికల్ పాఠం కదా ఇది! దీన్ని బాగా గుర్తుపెట్టుకుంటాం మనం.
కొంతమంది మొహమాటం, బిడియం లేకుండా ఇతరులని తమ పని కోసం సాయం అడిగి అడిగి ప్రాణం తీసయినా పూర్తి చేసుకుంటారు. అంతవరకూ క్షమించొచ్చు. ఎవరైనా తిరిగి సాయం చెయ్యమంటే చుట్టుపక్కల లేకుండా పారిపోతారు. అటువంటి వారిని వెనక ఎంత నీచంగా అనుకుంటారో విన్నవారెవరూ అలా ప్రవర్తించలేరు. ఆ విధంగా అలా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించేవాళ్ళు మనకి గురువులేగా! నెగటివ్ గురువులన్నమాట. మరికొందరు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ మంచితనం, మర్యాద వదలకుండా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళను చూస్తే మనకీ అలాగే ఉండాలనిపిస్తుంది. అంటే వీళ్ళు పాజిటివ్ గురువులన్నమాట.
జీవితంలో కొన్ని సంఘటనలు మనకి గురువులు. అనూహ్యంగా మనం మోసపోయి డబ్బుపోగొట్టుకుని చిక్కుల్లో పడినపుడు మన అనుకున్న వాళ్ళ ప్రవర్తనలు మనకి అరుదైన పాఠాలు. అప్పటి వాళ్ళ మొహాలు ఒరిజినల్ నమూనాలన్న మాట. సమస్య తీరిపోయి మనం ఒడ్డున పడ్డాక అంతా తమ పూర్వపు మర్యాద ముఖాలు పెట్టేసుకున్నా ఆనాడు వాళ్ళు చూపించిన రఫ్ ముఖాలు మనల్ని నిరంతరం జాగరూకతతో ఉండమని చెబుతాయి. అటువంటివాళ్లను దూరంగా పెట్టమని చెబుతాయి. అటువంటి పాఠం నేర్పిన వాళ్ళను కూడా మనం గురువులుగా పరిగణించక తప్పదు.
సాధారణంగా మన ఇళ్లలోని మగవాళ్ళు కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు యమా సీరియస్‌గా ఉంటారు. రోడ్ మీద పోతున్న వాహనదారులందరూ, లక్షలు పెట్టి కొన్న తమ కారుపై గీతలు పెట్టెయ్యడానికి కంకణం కట్టుకున్నారన్నట్టు గుర్రుమంటూ చూస్తూ ఉంటారు. ఎవరైనా కాస్త దగ్గరగా రాగానే తమకొచ్చిన భాషలో అరుస్తూ బీ.పీ. పెంచుకుంటూ వీలయితే పక్క వాహనదారులతో కొట్లాటకు సిద్ధంగా ఉంటారు. నా ఆఫీస్ కార్ కొక ‘ప్రేమ్’ అనే ఇరవై రెండేళ్ల కుర్రాడు డ్రైవర్‌గా ఉండేవాడు. నవ్వుతూ, ప్రశాంతంగా అతి జాగ్రత్తగా కార్ నడిపేవాడు. ఎవరైనా పోట్లాటకు వస్తే తల తిప్పి వాళ్ళ వంక చూసేవాడే కాదు. నిదానంగా చిరునవ్వుతో వెళుతూ ఉండేవాడు. “నువ్వెందుకు ఆ పోట్లాడేవాళ్ళకు తప్పు నాది కాదు అని సమాధానం చెప్పవు?” అనేదాన్ని. “టైం వేస్ట్ మేడం. అందరికీ డ్రైవింగ్ వచ్చు. అందరివీ కార్లే. ఊరికే అరుచుకుంటే ఏమొస్తుంది?” అనేవాడు. నేను ఎప్పుడూ ఆ కుర్రాడిని ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళందరికీ చూపించాలి అనుకుంటాను.
ఏదైనా అనుకోవడంలో ఉంటుంది. రామాయణంలో ఎంతో నీతి ఉందనీ అది నేర్చుకోవాలనీ మనం అనుకుంటాం. మంధరలూ, రావణాసురులూ అనుకోరు. అలాగే భారతం చదువుతూ అనేక రకాల పాత్రలని తల్సుకుని మురిసిపోతాం. శకునులూ, కీచకులూ, దుర్యోధన, దృతరాష్ట్రులూ మాత్రం తమ దారిన తాము పోతూ ఉంటారు. వీలయినంతవరకూ వారి బారిన మనం పడకుండా తప్పుకోవడానికి మనకి అలాంటి ఇతిహాసాలు ఉపయోగపడతాయి.
మా గురువుగారు ‘నేర్చుకోవడం నుండీ, నేర్పటం నుండీ ఎన్నడూ వైదొలగకండి’ అనేవారు. మనం నేర్పితే నేర్చుకునే వాళ్ళెవరూ లేరు. మూడేళ్ళ పిల్ల కూడా “నాకలాగ ఇష్టం ఉండదు.ఇలాగే కావాలి” అంటోంది. గనుక మనమే ఎప్పటికప్పుడు ఎదురయ్యే గురువుల నుండి నేర్చుకుంటూ పోవడం మంచిది కదా!
కొన్ని అనుభవాలు మనల్ని మర్చిపోనీయవు. వేడి పాయసం తిని నోరు కాల్చుకున్న కుర్రవాడు పెరుగును కూడా ఊదుకుంటూ తాగుతాడట. అలా మనం ఎప్పటికీ మర్చిపోలేని సంఘటనల్లో ఉండే మనుషులే మరి గురువులక్కడ.
సాహిత్యకారులంతా గురువులే. వారు రాసే నాటకాల్లో, నవలల్లో, కథల్లో, కవితల్లో, పాటల్లో ఏదో ఒక పాఠం ఉంటూనే ఉంటుంది. వాటిల్లో నీతులూ, మంచి మాటలూ, సందేశాలూ, ఉపదేశాలూ, గుణపాఠాలూ, జీవిత సత్యాలూ ఉంటాయి. ప్రకృతి ప్రేమికులైన కవులు తమ కవిత్వం ద్వారా ప్రకృతిని ఎలా ప్రేమిస్తూ ఆనందించాలో మనకి నేర్పించే గురువులు. వారికి నమోవాకాలు చెప్పాల్సిందే. వారే లేకపోతే ఈ జగత్తు ఇంత అందమైనది అని మనకి తెలిసేది కాదు.
జీవితంతో ఎలా మెలగాలో మనుష్య సంతతికి చెప్పిన గీత సర్వోత్తమ జీవితపాఠాల సమాహారమే. అది మొత్తం మానవాళికే అద్భుతమైన కానుక కనుకే ఆ గీతాచార్యునికి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ అని మనుష్య జాతి నమస్కరించింది.
మా మిత్రురాలొకామె నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే ఒకసారి ఎత్తుతుంది. తానెప్పుడైనా ఫోన్ చేసిన వెంటనే నేనెత్తకపోతే “ఎక్కడ నిద్రపోతున్నావ్?” అని కోప్పడుతుంది. “నువ్వైతే ఎప్పుడూ నా కాల్ మిస్ చేస్తావు కదే!” అంటే “నేనైతే అంతే అనుకో. కానీ నువ్వు పర్ఫెక్ట్ కదా అని కోప్పడ్డా” అంటుంది. అలా గడుసుతనం చూపెట్టడంలో ఆవిడని మనం గురువుగా పెట్టుకోవచ్చు కదా! (ఎందుకంటే ఎదుటివాళ్ళ పొరపాట్లని కూడా మన నెత్తినేసుకునే బకరాలం మనం).
కొందరు మన సహాయం దర్జాగా అందుకుని, మనకి అవసరం పడ్డప్పుడు ‘సారీ’ అనేసి ఊరుకుంటారు. కొన్నాళ్ళయ్యాకా మనం కూడా ఇంగ్లీష్‌లో చెప్పినట్టు ‘ఫీడింగ్ విత్ ది సేమ్ స్పూన్’ పద్ధతిలో అటువంటివాళ్ళకి అలా ‘సారీ’ చెప్పడం నేర్చుకుంటాం, మంచి వాళ్ళకి మాత్రమే మంచివాళ్ళం అన్న తరహాలో. అలా మనం కొంచెం తెలివి మీరి, జనాల దృష్టిలో తెలివితక్కువ వాళ్ళలా ఉండకూడదన్న పాఠం నేర్పిన గురువులు వాళ్ళు. వాళ్ళకి వందనం చెప్పాలిగా!
మనం చూసిన సినిమాలు, నవలలు మనకెన్ని జీవిత పాఠాలు చెప్పాయో! ఐతే మరీ దాసరి నారాయణ రావుగారిలా సినిమా అయిపోయి చెప్పులేసుకుని లేస్తుంటే ‘భార్యాభర్తలు పాలూ నీళ్లలాంటి వాళ్ళు’ అంటూ నీతి పాఠాలు చెబితే విసుగేసేది. ఏమీ చెప్పకుండా జీవితం ఇంతే అన్నట్టు కథలు ముగించే బాలచందర్ గారంటే ఎక్కువ అభిమానం ఉండేది.
మనసుకు బాధ కలిగిన రాత్రి, ఆత్రేయ గారి ‘పాడుతా తీయగా’ పాట ఎంత చక్కని ఓదార్పు లేపనం! అటువంటి గొప్ప గొప్ప గీతాలు రాసిన వారు శాశ్వత గురువులు కాదా? మన వ్యక్తిత్వాన్ని వికసింపచేసిన పాటలెన్నో! జీవితంలో ఓడిపోయి ఇక ఆశ లేదు అన్నంత నిరాశ కలిగినప్పుడు శ్రీశ్రీ గారి ‘కల కానిది, విలువైనది బ్రతుకు’ పాట అక్షరలక్షలివ్వాల్సిన పాఠం కాదూ. ఆ పాట రాసినవారు గొప్పగురువు కాక ఇంకెవ్వరు? అలాగే సాహిర్ గారి ‘మై జిందగీ కా సాథ్ నిభాతా చాలా గయా’ పాట జీవితాన్ని తేలిక చేసే సులువు సూత్రం.
దిన పత్రికల్లో, టీవీలో రోజూ జరిగే రసవత్తర రాజకీయాలు గమనిస్తుంటే అవి పొలిటీషియన్స్‌కీ మనకీ బోలెడు పాఠాలు బోధిస్తాయి. చిత్రం ఏమిటంటే వాళ్ళకీ మనకీ కూడా జ్ఞానోదయం అవ్వదు. ఏమీ నేర్చుకోము. చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాం. అలాగే ఆక్సిడెంట్ వార్తలన్నీ మితి మీరిన వేగంతో నడిపే వాహనదారులకు జాగ్రత్త పాఠాలు.
మా కాలనీలో గౌస్ అనే ముస్లిం టైలర్ ఉంటాడు. బహు శాంతంగా ఉంటాడు. ఒకరోజు నేను వెళ్లగానే ఒక పెద్దావిడ కార్లోంచి దిగి వచ్చి అతని మీద కోపంగా అంతెత్తున ఎగిరింది. “నేను పెళ్లికని యాభై వేల రూపాయల చీరలు కొని నీకిస్తే నాలుగు రోజులు నీ షాప్ బంద్ పెట్టావు. పెళ్లి అయిపోయింది” అంటూ. పిడుగులు పడ్డట్టుగా ఉన్న ఆవిడ అరుపులకి నేను అదిరిపోయాను. ఆవిడ సమస్య కూడా నిజమే కదా. ఏమి జవాబు చెబుతాడో సాహెబ్ గారు అని ఆసక్తిగా చూస్తున్నా. “పనిబడి మూసినా షాప్” అన్నాడతను మామూలుగా. ఆవిడ ఆవేశాన్ని ఆపుకోలేక వెళ్ళిపోయింది కారెక్కి. “నాకట్లా గట్టిగట్టిగా అరిచేదిష్టముండదు మేడం” అన్నాడతను తాపీగా,నా వైపు స్నేహంగా చూస్తూ. అతని నిబ్బరానికి నేను తెల్లబోయాను. అలాంటి సమయాల్లో మనమైతే ఉక్కిరిబిక్కిరి అయిపోయి పానిక్ అయిపోతాము. అతన్ని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. క్లిష్ట సమయాల్లో తొట్రు పడకుండా అలా ఉండగలగడం ఒక క్రైసిస్ మానేజ్‌మెంట్ పాఠం అనిపించింది.
ఒకోసారి మనం సమస్యల్లో పడి జుట్టు పీక్కుని చచ్చిపోతుంటే, మన బామ్మలు ముసి ముసి నవ్వులు నవ్వుతూ “ఎందుకంత హైరానా? అంతా బాగా అవుతుందర్రా! దేవుడు నాయందున్నాడు” అంటూ ఉంటారు. అక్కడికి దేవుడేదో వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అయినంత ధీమాగా. మనకి ఒళ్ళు మండి పోతుంటుంది వాళ్ళ మాటలకి. అలా పాజిటివ్ దృక్పథంలో ఉండేవారికి పరిస్థితులు చక్కబడే దారులు నిజంగానే ఉంటాయి. ఆలోచన ఆగిపోయి బుర్ర బ్లాంక్ అయినప్పుడు కూడా స్తిమితంగా బామ్మలు చెప్పినట్టు టెన్షన్ పడకుండా ఆలోచిస్తే మంచి ఐడియా వస్తుందనేది నిజం.
‘చాలా విన్నాను. ఇక చాలు. నేను వినను బాబోయ్!’ అన్నా జీవితం ఎవరినీ సులువుగా వదిలి పెట్టదు. మనల్ని బండకేసి బాది, చావగొట్టి చెవులు మెలేసి కూర్చోబెట్టి, చుక్కలు కూడా చూపిస్తూ పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. కొన్ని పాఠాలు గుర్తుంటాయి. బుద్ధిగా నడుచుకుంటాం. కొన్ని మర్చిపోయి ముందుకు తూలి పడుతూ లేస్తూ ఉంటాం. మరంచేత పాఠాలు వినక తప్పదు. అవి నేర్పిన గురువులకు నిత్యవిద్యార్థిలా నమస్కరించకా తప్పదు. ఏమంటారు?
ఇక టీవీల్లో రేడియోల్లో స్వామీజీల/సద్గురువుల బోధలన్నీ మానవ జీవితాలను ఉద్ధరించే పాఠాలే. చిన్నప్పుడు అ, ఆ లు చెప్పిన మాస్టారు మొదలుకుని ఈ నాటి మన ఫ్లాట్స్ వాచ్‌మాన్ వరకూ మనకి ఏదో ఒకటి నిరంతరం నేర్పిస్తూనే ఉంటారు. అందరికీ వందనాలు చెప్పవలసిందే! పేరు పేరునా నోట్ చేసుకోవాలంటే అయ్యే పని కాదు కాబట్టి, ఇప్పటి వరకూ ఎదురైన గురువులకీ, భవిష్యత్తులో రాబోయే గురువులకీ అందరికీ కలిపి ఒకటే పేద్ద వందనం చెప్పేద్దాం. సరేనా!